top of page

గౌరమ్మ

Writer's picture: Sathyanarayana Murthy M R VSathyanarayana Murthy M R V

'Gowramma' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'గౌరమ్మ' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“వదినా, బాగున్నావా?”అంటూ లోపలకు వచ్చింది రమణమ్మ.


సావిట్లో కత్తిపీట దగ్గర బెండకాయలు తరుగున్న గౌరమ్మ, తల పైకెత్తి చూసి ‘బాగానే ఉన్నాను’ అన్నట్టు తలూపి తన పని చూసుకుంటోంది. రమణమ్మ, గౌరమ్మ కి కొంచెం దగ్గరగా కూర్చుంది.

“రోజూ నీ గురించే మా లింగాల వీధిలో అందరం అనుకుంటాము. ఇరవై ఏళ్ళ కే భర్త పోయినా, అధైర్య పడకుండా, గుండె నిబ్బరం చేసుకుని జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న నిన్ను అందరం మేచ్చుకుంటాం.


అంతే కాదు నీలోని ‘ఉపకార గుణం’ కూడా తలుచుకుంటాం. నేను బాగుంటే చాలునని, అనుకుంటున్న ఈ రోజుల్లో నీలాగా, ఇతరుల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు?” అంది రమణమ్మ. గౌరమ్మ బెండకాయలు తరగడం పూర్తి చేసి, కత్తిపీట, కూరల బుట్ట లోపల పెట్టి వచ్చింది.

“ఏదో పని మీద వచ్చినట్టున్నావు, చెప్పు రమణమ్మా”అంది గౌరమ్మ. ఆమె అలా సూటిగా అడిగేసరికి రమణమ్మ కి కొంచెం సిగ్గు, అనిపించింది. కానీ అవసరం తనది అని మనసుని సమాధాన పరచుకుంది.


“నీకు తెలియనిది ఏముంది. శ్రావణమాసం వచ్చింది కదా, అమ్మాయిని తీసుకురావాలి. చీర, సరుకులు కొనాలి. పొలం పనులు లేవు. చేతిలో డబ్బులు లేవు. నువ్వే గుర్తుకువచ్చావు. ఇప్పటికే, నీకు ఐదు వేలు వరకూ ఇవ్వాలి. అయినా నిన్నే అడుగుతున్నాను. ఒక రెండు వేలు ఇస్తే, నీ మేలు మరిచిపోను” నెమ్మదిగా అంది రమణమ్మ.


ఆమెని అలా చూసిన గౌరమ్మకి జాలి వేసింది. వెంటనే లోపలకు వెళ్లి బీరువా లోంచి రెండు వేలు పట్టుకొచ్చి రమణమ్మ కి ఇచ్చింది. టేబుల్ మీద ఉన్న నోట్ పుస్తకం లో ఆరోజు తారీఖు వేసి, రమణమ్మ చేత సంతకం చేయించింది. రమణమ్మ డబ్బు తీసుకుని ‘వెళ్లి వస్తాను వదినా, పనులు రాగానే ఈ రెండు వేలు, ముందు ఇచ్చేస్తాను నీకు’ అని ఆనందంగా వెళ్ళింది రమణమ్మ.

రమణమ్మ వెళ్ళగానే వంటపనిలో పడింది గౌరమ్మ. కూతురు లావణ్య టిఫిన్ తినేసి కాలేజీ కి వెళ్ళింది. శివపురం జూనియర్ కాలేజీ లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది లావణ్య. గౌరమ్మ కి పిల్లలు లేరు. అక్క కూతుర్ని తెచ్చుకుని పెంచుకుంటోంది. వంట పూర్తి చేసి సావిట్లోకి వచ్చి కూర్చుంది గౌరమ్మ. గతం ఒకసారి ఆమె కళ్ళముందు కదలాడింది.


***


గౌరమ్మది జగన్నాధపురం. మేనత్త కొడుకు భూషణం తో పెళ్లి కాగానే శివపురం వచ్చింది. భూషణం కి రెండు ఎకరాల పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గౌరమ్మ కూడా అతనికి వ్యవసాయం పనులలో చేదోడు వాదోడు గా ఉంటోంది. రెండేళ్ళు గడిచాయి. ఒకరోజు మార్టేరు వెళ్లి ఎరువుల బస్తా సైకిల్ కి కట్టుకుని తెస్తూండగా క్వారీ లారీ గుద్దేసి చనిపోయాడు భూషణం. అప్పటినుండీ గౌరమ్మది ఒంటరి బతుకు అయిపొయింది. కౌలు పొలం యజమానికి అప్పగించింది. తన రెండు ఎకరాల పొలం కూడా దగ్గర బంధువు విష్ణు కి కౌలుకి ఇచ్చింది. రెండేళ్ళ వయసున్న అక్క కూతురు లావణ్య ని తెచ్చుకుని పెంచుకుంటోంది.


ఒక ఏడాది గడిచాక కూలి పనికి వెళ్ళడం ప్రారంభించింది. కూలి డబ్బులు, వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తోంది గౌరమ్మ. ఒకరోజు వెంకట స్వామి గారి పొలంలో కలుపు తీతలు పనికి వెళ్ళింది. మధ్యాహ్నం చెరువు గట్టున ఉన్న చెట్ల కింద నలుగురు కూలీలు భోజనాలు చేసారు.


మామిడి చెట్టుకి ఆనుకుని కూర్చున్న గౌరమ్మ వాళ్ళతో కబుర్లు చెబుతూనే ఉంది. కాసేపటికే ఆమెకి నిద్ర వచ్చింది. అలాగే నిద్రపోయింది. కూలీలు తమతో తెచ్చుకున్న అన్నాలు తినేసి కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత మరలా పనిలో పడతారు. అది రోజూ జరిగే విషయమే. కానీ గౌరమ్మ కి నిద్రలో ఎవరో తన పక్కగా కూర్చున్న అనుభూతి కలిగింది. వెంటనే కళ్ళు తెరిచింది. ఆశ్చర్యం. వెంకట స్వామి గారు తన పక్కనే కూర్చుని ఉన్నారు. కూలీలు అప్పటికే చేలో దిగి పని చేస్తున్నారు..

“ఏంటో బాబూ, నిద్ర పట్టేసింది. పనిలో కెల్తాను” అని లేవబోయింది గౌరమ్మ.


ఆమె చేయి పట్టుకుని ఆపాడు వెంకటస్వామి. “పని ఎప్పుడూ ఉండేదే. నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను. నువ్వు మగ తోడు లేకుండా ఉంటున్నావు. నేను నీకు ఆసరాగా ఉంటాను. కాదనకు. నీ మీద నాకు చాలా కాలం నుండీ మనసుగా ఉంది. ఆ పాత పెంకుటింట్లో ఎలా ఉంటున్నావు? నీకు అక్కడ ఒక డాబా కట్టిస్తాను. ఆలోచించుకో” అన్నాడు వెంకటస్వామి.


బలమైన అతని చేతిలో నలుగుతన్న, తన చేతిని గట్టిగా లాక్కుంది గౌరమ్మ.


ఆమె గుండెలు ఆవేశంతో ఎగిసిపడుతున్నాయి. ఆమె కేసే, ఆకలిగా చూస్తున్నాడు వెంకటస్వామి.

తన కుడి పక్కనే ఉన్న కేరేజీ చేతిలోకి తీసుకుంది గౌరమ్మ. “ఈ కేరేజీ లో నేను తిన్న, ప్రతి మెతుకూ, నేను కష్టంతో సంపాదించుకున్నదే. ఒళ్ళు అమ్ముకుని సంపాదించుకున్నది కాదు. మొగుడు లేని ఆడది అని, చిన్న చూపు చూడకండి బాబుగారూ. మాకూ నీతి ఉంది. బాగా గుర్తు పెట్టుకోండి” అని విస విసా నడిచి చేలోకి వెళ్లి పనిచేయడం మొదలు పెట్టింది గౌరమ్మ.


సాయంత్రం వెంకటస్వామి ఇచ్చిన కూలి డబ్బులు లింగాల వీధిలోని రామాలయం దగ్గర ఉన్న ముష్టి వాళ్లకి ఇచ్చేసి, ఇంటికి వచ్చింది గౌరమ్మ.


ఆరోజు నుండీ తన పధ్ధతి మార్చుకుంది గౌరమ్మ. మొహం, ’గంటు పెట్టుకుని’ గంభీరంగా ఉండడం అలవాటు చేసుకుంది. వెంకటస్వామి పొలం లో, పని అంటే ‘రాను’ అని ఖచ్చితంగా చెప్పసాగింది. కూలి పనికి వెళ్ళేటప్పుడు కేవలం ‘మజ్జిగ అన్నం’ మాత్రమె పట్టుకెల్తోంది. ఆకలి అనిపించినా, తన మనసుని నిగ్రహించుకుంది. కూలీలు అందరూ భోజనాలు చేసి పడుకున్నా, తను మెలకువగా ఉండి, నెమ్మదిగా లల్లాయి పదాలు పాడుకుంటోంది.


గౌరమ్మ చాలా రోజులు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. భూముల రేట్లు, బాగా పెరిగాయి. పొలం కౌలుకి తీసుకున్న విష్ణు కే తన పొలం అమ్మేసింది గౌరమ్మ. ఆ డబ్బు బ్యాంకు లో వేసింది. ఒక రోజు విష్ణు సలహా మేరకు తనకు తెలుసున్న వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. బ్యాంకు వాళ్ళు అప్పుకి ఎ రేటు వడ్డీ తీసుకుంటారో, అంతే రేటుకి గౌరమ్మ అప్పులు ఇస్తోంది. ఎవరికీ ఇచ్చినా, ఇరవై వేలు మాత్రమె ఇస్తుంది.


జనం గౌరమ్మ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే, గౌరమ్మ ఎవరిదగ్గరా పత్రాలు పుచ్చుకోదు, ప్రామిసరీ నోటులు రాయిన్చుకోదు. తన దగ్గర ఉన్న నోట్ పుస్తకం లో, అప్పు తీసుకున్న వారిచేత, ఒక సంతకం మాత్రమే తీసుకుంటుంది. అందుకే పేదలకు, దిగువ మధ్య తరగతి వారికి ఆమె ‘కల్పతరువు’.


ఒక రోజు సాయంకాలం ‘అమ్మగారూ’ అన్న పిలుపు వినపడి బయటకు వచ్చింది గౌరమ్మ. ఎదురుగా పారిశుద్ధ కార్మికురాలు వెంకట లక్ష్మి నిలబడి ఉంది. గౌరమ్మ ని చూడగానే ‘దండాలమ్మ’ అంది వెంకటలక్ష్మి.


‘ఇలా రా’ అని పిలిచింది గౌరమ్మ. ఇద్దరూ వీధి అరుగు మీద కూర్చున్నారు.


“కొంచెం డబ్బులు అవసరం ఉండి వచ్చానమ్మ. మీరు మాలాంటి వారికి ఇస్తారా?” నెమ్మదిగా అంది వెంకటలక్ష్మి.


చిన్నగా నవ్వింది గౌరమ్మ. “ఏం, మీరూ మాలాంటి మనుషులేగా. అందరం ఒక ఊళ్లోనే ఉంటున్నాం. మీరు మా దొడ్లు శుభ్రం చేస్తున్నారు, గ్రామం లోని వీదులన్నీ శుభ్రం చేస్తున్నారు. మీరు రెండు రోజులు పనికి రాకపోతే, గ్రామం అంతా చాలా ఘోరంగా ఉంటుంది. ఎప్పుడూ మీరు ‘తక్కువ’ అని అనుకోకు.


సమాజంలో అందరూ తమకు వచ్చిన పని చేస్తున్నారు. మాస్టారు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు, కిరాణా కొట్టు షావుకారు సరుకులు అమ్ముతున్నారు. బట్టలు కొట్టు ఆయన బట్టలు అమ్ముతున్నారు. కాఫీ హోటల్ ఆయన టిఫిన్లు అమ్ముతున్నారు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. వారు అందరి కంటే మీరు గ్రామానికి ఎక్కువ ఉపకారం చేస్తున్నారు” అంది గౌరమ్మ.


ఆమె మాటలకి వెంకటలక్ష్మి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది.

“పంచాయతీలో ఆరు నెలలకు గానీ జీతాలు రావడం లేదు. మాలాంటి వారికి డబ్బులు అవసరం వస్తే మా బిల్లు కలెక్టర్ మీరయ్య గారి దగ్గరే అప్పు తీసుకుంటాం. జీతాలు రాగానే ఆయనకీ డబ్బులు ఇస్తాం. కానీ వడ్డీ నెలకి ఐదు రూపాయలు. వడ్డీ కట్టడం కష్టంగా ఉంటోంది. మీరు తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారు అని తెలిసి ఇలా మీ దగ్గరకు వచ్చాను. ఒక వెయ్యి రూపాయలు కావాలి. ఇస్తారా అమ్మా?” అడిగింది వెంకటలక్ష్మి.


గౌరమ్మ లోపలకు వెళ్లి వెయ్యి రూపాయలు తీసుకువచ్చి వెంకటలక్ష్మి కి ఇచ్చి పుస్తకం లో సంతకం తీసుకుంది. వెంకటలక్ష్మి రెండు చేతులూ జోడించి నమస్కారం చేసి ‘మీ మేలు మరిచిపోలేనమ్మా. మా ఆయనకి రెండు రోజుల నుండీ జ్వరం. ఇక్కడ మందులు వాడినా తగ్గలేదు. తణుకు తీసుకెళ్ళి పెద్ద డాక్టర్ గారికి చూపించమన్నారు. రేపే తణుకు వెల్తామమ్మా’ అంది.


“చూడు లక్ష్మి, నువ్వు నాకు వడ్డీ ఇవ్వక్కరలేదు. మీకు జీతాలు ఇచ్చినపుడే నాకు డబ్బులు ఇయ్యి. ఇంకో విషయం, మందులకి అవసరమైతే మళ్ళీ రా, డబ్బులు ఇస్తాను. పట్టుకెళ్ళు. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. భయపడకు. మీ ఆయనకీ తగ్గిపోతుంది. వెళ్లి రా” అంది గౌరమ్మ.


ఎంతో సంతోషంగా వెళ్ళింది వెంకటలక్ష్మి. ఒక వారం తర్వాత గౌరమ్మ దగ్గరకి వచ్చి, ’ తణుకు డాక్టర్ కి చూపించి మందులు వాడాక మా ఆయనకి తగ్గింది అమ్మ’ అని చెప్పింది వెంకటలక్ష్మి.


****

గౌరమ్మ కూతురు లావణ్య వచ్చి సైకిల్ బెల్లు కొట్టగానే, గతం లోంచి వాస్తవంలోకి వచ్చింది గౌరమ్మ. లావణ్య రోజూ సైకిల్ మీద కాలేజీ కి వెళ్లి వస్తుంది. లావణ్య భోజనం చేసి మరలా కాలేజీ కి వెళ్ళిపోయింది.


రెండు రోజుల నుండీ శివపురం లో వానలు గట్టిగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం వలన ఇంకో రెండు రోజులు వర్షాలు ఉంటాయని రేడియో, టి. వి. ల లో చెప్పారు. గర్ల్స్ హై స్కూల్ వీధిలోనే ఉంది గౌరమ్మ ఇల్లు. రాత్రి ఎనిమిది గంటల సమయం. గౌరమ్మ, లావణ్య భోజనాలు చేసారు. లావణ్య గదిలో కూర్చుని చదువుకుంటోంది. వీధిలో జనం గుంపుగా వెళ్ళడం చూసింది గౌరమ్మ. అరుగు మీదకి వచ్చి చూసింది. ఎదురుగుండా ఉన్న హై స్కూల్ అరుగుల మీదకి చేరారు జనం. ఎనిమిది గదులతో ఉన్న పెద్ద పెంకుటిల్లు, లోపల పెద్ద బంగాళా పెంకుల షెడ్డు తో ఉంది హై స్కూల్. చాలా మంది వర్షానికి తడిచిపోయారు.


ఎవరో గొడుగులు వేసుకుని వచ్చి అరుగుల మీద జనాలతో మాట్లాడుతున్నారు. విషయం తెలుసుకుందామని గొడుగు తీసుకుని బయటకు వెళ్ళింది గౌరమ్మ. కమ్యూనిస్ట్ నాయకుడు బెజవాడ సూర్యనారాయణ, వాళ్ళతో మాట్లాడుతున్నారు. గౌరమ్మ ని చూడగానే ఇటు వైపు తిరిగాడు.


“వీళ్ళు కాలవ అవతల, శాంతి నగర్ జనాలు. వర్షాలకి వీళ్ళ ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి. పూరి పాకలు కూలిపోతాయని భయపడుతుంటే, నేనే ఇక్కడికి తీసుకు వచ్చాను. వాచ్ మన్, డాక్టర్ గారు చెబితేనే తాళాలు తీసి లోపలకి పంపుతాను అంటున్నాడు. నేను వెళ్లి డాక్టర్ గారితో మాట్లాడి వస్తాను” అని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు సూర్యనారాయణ.


“మీరు ఏమైనా తిన్నారా?” అడిగింది గౌరమ్మ అరుగు మీద జనాల్ని.


“లేదమ్మా”అన్నారు అందరూ ఒకేసారి.


వెంటనే తన ఇంట్లోకి వెళ్ళింది గౌరమ్మ. వంటింట్లో డబ్బాలు తీసి చూసింది. హమ్మయ్యా అనుకుంది. లావణ్య ని కేకేసింది. స్టవ్ వెలిగించి ఇద్దరూ వంటపనిలో పడ్డారు.


బెజావాడ సూర్యనారాయణ డాక్టర్ రామచంద్ర రాజు గారి హాస్పిటల్ దగ్గరకు వచ్చాడు. గర్ల్స్ హై స్కూల్ కి కరెస్పాండెంట్ డాక్టర్ గారే. కాంపౌండర్ సత్యనారాయణ తో ‘డాక్టర్ గారితో అర్జెంటు గా మాట్లాడాలి, ఒకసారి పిలవండి’ అని అన్నాడు. ‘అలాగే ‘ అని చెప్పి లోపలకి వెళ్లి ‘కమ్యూనిస్ట్ సూర్యనారాయణ గారు వచ్చారు. మీతో అర్జెంటు గా మాట్లాడాలి అంటున్నారు ‘ అని చెప్పారు డాక్టర్ రాజు తో. ఆయన వెంటనే బయటకు వచ్చారు.


సూర్యనారాయణ “డాక్టర్ గారూ నమస్కారం. మన శాంతి నగర్ ప్రజల ఇళ్ళల్లోకి నీళ్ళు చేరాయి. వాళ్ళని మీ హై స్కూల్ దగ్గరకు తీసుకెళ్ళాను. మీ వాచ్ మాన్, మీరు చెబితేనే గానే తాళాలు తీయనంటున్నాడు. రెండు రోజులు మీ స్కూల్ లో ఉంటారు. వర్షాలు తగ్గగానే వెళ్లి పోతారు” అన్నాడు.


“అలాగే ఉండమనండి. మా సత్యనారాయణ ని మీకు తోడుగా పంపుతాను. అతను వాచ్ మాన్ కి చెబుతాడు” అని డాక్టర్ గారు కంపౌందర్ ని ఇచ్చి పంపించారు. కంపౌందర్ వచ్చి వాచ్ మాన్ తో ‘డాక్టర్ గారు చెప్పారు. తాళాలు తీయండి’ అని చెప్పడం వాళ్ళు అందరూ బిల బిల మంటూ లోపలకు వెళ్ళడం వేగంగా జరిగిపోయింది.


ఒక అరగంటలో స్కూల్ లో తలదాచుకున్న జనాలు అందరికీ ‘వేడి వేడి ఉప్మా ‘ పట్టుకు వచ్చింది గౌరమ్మ. వాళ్ళు అందరూ తృప్తిగా తిన్నారు. అప్పుడు చూసింది గౌరమ్మ, వాళ్ళు పూర్తిగా తడిచిపోయి వణుకు తున్నారని. ఇంట్లోకి వెళ్లి తనవి చీరలు, పాత దుప్పట్లు తీసుకుని వచ్చి వాళ్లకి ఇచ్చింది. అది చూసి సూర్యనారాయణ “గౌరమ్మ గారూ, మీరు చాలా మంచి పని చేసారు. డొక్కా సీతమ్మ గారిలా, వాళ్ళ ఆకలిని తీర్చారు. కప్పు కోవడానికి, మీ బట్టలు ఇచ్చారు. మీది చాలా దొడ్డ మనసు’ అని అభినందించాడు.


“అలా అంటారేమిటి అన్నగారు, మనం అందరం ఒక ఊరి వాళ్ళం. ఒకరికికష్టం వస్తే, ఇంకొకరు సాయం చేసుకోవాలి. అది మన శివపురం సంస్కృతి కదా” అంది వినయంగా గౌరమ్మ.


కాలం వేగంగా పరుగెడుతోంది. లావణ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ లోకి వచ్చింది. పరీక్షలు రాసాక ఒక రోజు తల్లి దగ్గరకు వచ్చి ”అమ్మా, నేనో మాట చెబుతాను వింటావా?” అంది.


‘అలాగే చెప్పమ్మా. ఈ అమ్మ దగ్గర నీకు అడ్డేముంది?’ అంది నవ్వుతూ గౌరమ్మ. తన చేతులతో పెంచిన పిల్ల, ఎంతో ఎదిగి డిగ్రీ చదువు పూర్తి చేయడం గౌరమ్మ కి చాలా సంతోషంగా ఉంది.


“నేను డిగ్రీ పరీక్షలు బాగా రాసాను. ఫస్ట్ క్లాసు తప్పకుండా వస్తుంది. బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అవుతాను. బ్యాంకు ఉద్యోగం కూడా తప్పకుండా సాధిస్తాను. నువ్వు ఈ వడ్డీ వ్యాపారం మానెయ్యి. బ్యాంకు డిపాజిట్ ల మీద వచ్చే డబ్బు మనకి సరిపోతుంది. మా కాలేజీ లో కూడా మా వాళ్ళు ‘మీ అమ్మ వడ్డీ వ్యాపారం చేస్తుందట కదా’ అని నన్ను అడిగే వాళ్ళు.


నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నువ్వు బాధపదతావని ఇన్నాళ్ళూ చెప్పలేదు. నా చదువు అయిపొయింది కనుక ఇప్పుడు చెబుతున్నాను. వడ్డీ వ్యాపారం మానెయ్యి అమ్మా “ అంటూ తల్లిని బతిమాలింది లావణ్య.


కూతుర్ని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంది గౌరమ్మ. “చూడమ్మా. ఇందులో మనకి పెద్దగా ఆదాయం కూడా రాదు. ఈ పెట్టుబడి ఇంకో వ్యాపారం లో పెడితే, చాలా రాబడి ఉంటుంది. మన శివపురం లోని పేదలకి ‘సాయం’ చేయాలనే ఈ వడ్డీ వ్యాపారం మొదలు పెట్టాను. అందరి దగ్గరా బ్యాంకు లలో డబ్బులు ఉండవు. ఎ. టి. ఎం. కార్డులు ఉండవు. చిన్న చిన్న అవసరాలకి వాళ్లకి నేను ఉపయోగపడుతున్నాను.


ఇంట్లో వారికి అకస్మాత్తుగా అనారోగ్యం చేస్తుంది, రాత్రి సమయం, డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అప్పుడే మన ఇంటి తలుపు తడతారు. బయట కూడా వారికి అప్పు దొరుకుతుంది. కానీ వడ్డీ, మూడు రూపాయలు, లేదంటే అయిదు రూపాయలు. పేదవాళ్ళు అంతంత వడ్డీ ఎక్కడ కట్టగలరు? ఇంట్లో సామాన్లు అమ్ముకుని అప్పు తీర్చిన కుటుంబాలు నాకు తెలుసు. వారికి అటువంటి కష్టం రాకూడదనే, నేను వారికి అప్పు ఇస్తున్నాను.


అదీ తక్కువ వడ్డీకి. మరీ పేదల దగ్గర, వడ్డీ పుచ్చుకోను. అసలు మాత్రమె తీసుకుంటాను. నేను వాళ్ళని ‘ఉద్దరిస్తున్నానని’ చెప్పడంలేదు. ఆపదలో వారికి ‘అండగా’ ఉంటున్నాను, అని మాత్రమె చెబుతున్నాను”. ఒక్క నిముషం చెప్పడం ఆగి, టేబుల్ మీదున్న మంచి నీళ్ళు తాగింది గౌరమ్మ.

లావణ్య తల్లి కేసి ఆరాధనగా చూస్తోంది.


“ఈ లోకం ఎక్కువగా డబ్బు మీదే ఆధారపడి నడుస్తోంది. చేతిలో తగినంత డబ్బు లేకుండా, పేదలు ఎప్పుడూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వారి అవసరాన్ని నేను కొంత వరకైనా, తీర్చగలుగుతున్నా నన్న ‘తృప్తి’ నాకు ఇందులో ఉంది తల్లీ. తప్పుగా అనుకోకు” అంది అనునయంగా కూతురి కేసి తిరిగి.


“సారీ అమ్మా, నువ్వు ఇంత వివరంగా చెప్పాకా నా అనుమానాలు తొలిగి పోయాయి. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. సరేనా?” అంది నవ్వుతూ లావణ్య. ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.


తర్వాత కొద్దికాలానికే, లావణ్య డిగ్రీ పరీక్షలు పాస్ అవడం, రాజమండ్రి లో బ్యాంకు పరీక్షలకు కోచింగ్ కి వెళ్ళడం స్పీడా గా జరిగిపోయాయి. ఏడాది గడిచేసరికి బ్యాంకు పరీక్షలు రాసిన లావణ్య, అందులో విజయం సాధించి, కాకినాడ బ్యాంకు లో ఉద్యోగం లో చేరడం జరిగింది. గౌరమ్మ కి చాలా ఆనందంగా ఉంది కూతురు ‘బ్యాంకు ఉద్యోగస్తురాలు’ అవడం. వెంటనే స్వీట్లు తెచ్చి గర్ల్స్ హై స్కూల్ లోని ఆడపిల్లలు అందరికీ ఇచ్చింది.


ఆరునెలలు గడిచాయి. లావణ్య బ్యాంకు లోనే పనిచేస్తున్న శ్రీకాంత్ ఆమెని ఇష్టపడి, తన తల్లి తండ్రుల్ని ఒప్పించి లావణ్య ని పెళ్లి చేసుకున్నాడు. కూతురికి తగిన భర్త దొరికాడని, గౌరమ్మ చాలా సంతోషించింది.


ఇందిరా కాలనీ లోని ఎలిమెంటరీ స్కూల్ రేకుల షెడ్డులో ఉంది వర్షం వస్తే, పిల్లలు మాస్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న గౌరమ్మ ఆ స్కూల్ కి తన భర్త ‘భూషణం’ పేరు మీద కొత్త బిల్డింగ్ కట్టించి ఇచ్చింది. బిల్డింగ్ ప్రారంభం రోజున సర్పంచ్, ’మీరే బిల్డింగ్ ప్రారంభించండి’ అని గౌరమ్మ ని అడిగారు.


“పిల్లలు అందరికీ చదువు చెప్పే అయ్యవారు, మన అందరి కన్నా గొప్పవారు. ఆయన్నే ప్రారంభం చేస్తే బాగుంటుంది” అని చెప్పి, స్కూల్ హెడ్ మాస్టర్ చేత, కొత్త భవనాన్ని ప్రారంభం చేయించిన, గౌరమ్మ విశాలహృదయానికి అందరూ ఆశ్చర్యపోయారు.


విశేషం ఏమిటంటే, ఇప్పటికీ గౌరమ్మ తన పాత ‘పెంకుటిల్లు’ లోనే ఉంటోంది.


*****

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





170 views0 comments

Comentários


bottom of page