top of page
Writer's pictureDasu Radhika

గ్రహం-- అనుగ్రహం


'Graham Anugraham' New Telugu Story


Written By Dasu Radhika


(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)





(కథా పఠనం: దాసు రాధిక)

"సంవత్సరం మీద ఏడు నెలల ఇరవై రెండు రోజులు అయింది ఇప్పటికి... నా ఫ్రెండ్ చెప్పింది గా... కనీసం మూడేళ్లు చూస్తే కాని సరైన సంబంధం కుదరదు అని... వాళ్ల అబ్బాయి న్యూజీల్యాండ్ ప్రభుత్వం లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు... హోదా, డబ్బు, అందం అన్నీ ఉన్నా నాలుగేళ్లు పట్టింది అతని పెళ్లి కి...


పెద్ద చదువు, అందం, ఆస్తి పాస్తుల తో సంబంధం లేదంటున్నారు అనుభవజ్ఞులు.... అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గానీ వాళ్ల తల్లిదండ్రులకు అసలు ఏమి కావాలో ఎవ్వరూ చెప్ప లేక పోతున్నారు..... ఒక్కో సారి ప్రేమ వివాహం చేసుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల పని హాయనిపిస్తుంది... ఇవాళ రేపు...


ఏంటో... పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దవాళ్లు అంటే ఏదో అనుకున్నాను... ఇల్లు ఇంకా తేలిక గా వస్తోంది ఈ రోజుల్లో అందరికీ... అటు పునాదులు వేస్తుండగానే ఇటు ఫ్లాట్లు బుక్ అయిపోతున్నాయి... లోన్లు నిమిషంలో ఇస్తున్నారు...

హుమ్.....

మన వాడి పెళ్లి ఎప్పటికి అవుతుందో...


ఏం చేస్తున్నారు? నా పాటికి నేను మాట్లాడుతూ ఉంటే మీరు ఉలకరూ పలకరే ???"

"వస్తున్నా జమున... ఆ పని మీదే ఉన్నాను... ఒక్క పది నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే ఈ కుజుడు సంగతి తేల్చి వస్తాను. "..


"మీరు ఇవాళ కుజుడు, రేపు చంద్రుడి సంగతి తేలుస్తూ కూర్చోన్డి... చెబితే అర్థం కాదు... వాడికి పెళ్ళి అయినట్లే...

మీ జాతకం చూసే పిచ్చి తో వాడి జీవితాన్ని నాశనం చేస్తారు....


ఆ ఢిల్లీ సంబంధం వాళ్లకి పట్టింపు లేదంటే మధ్య లో మీ చాదస్తం ఏంటి???


వీడికి పిల్ల నచ్చినంత మాత్రాన సరిపోవడం లేదే... ఆ పిల్లకి మన చంటిగాడి జీతం నచ్చాలి... ఆ పై ఈ జాతకం, నక్షత్రం పిచ్చి...


మొన్న శ్రావణ మాసానికి మన పెళ్ళి అయ్యి ముప్పైఏళ్లు అయింది... కలిసే ఉన్నాంగా... జాతకములు చూడ లేదు కదా"...


"అందుకే ఇలా బీజేపీ, కాంగ్రెస్ లాగా ఎప్పుడూ కొట్టుకు చస్తున్నాము... ఎవరైనా రెండు రోజులు మన ఇంట్లో మంచం కింద రహస్యంగా దాక్కోని చూస్తే మన జాతకం బయట పడుతుంది"... అన్నాడు పార్థసారథి మంచం మీద పరిచి పెట్టుకున్న పంచాంగం, ఇతర జాతక పుస్తకాలు, సరంజామ ని అల్మారా లో పొందు పరుస్తూ...


"పైకి మటుకు రాజకీయ నేతలు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని కలిసి ఫోటోలు దిగినట్లే ఎంతో అన్యోన్యంగా కనిపిస్తాము...

జరిగిన దాన్ని మార్చలేక జరగబోయే దాన్ని - అదే- మన చంటి గాడి పెళ్లికై నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను...

ఏదైనా తేడా వస్తే ఇంకేమైనా ఉందా?"


రేపటి నుండి బయట వరండా లో కూర్చోవాలి... తన శ్రీమతి కంచు కంఠం బారి నుండి తట్టు కోవాలంటే ఇదే మార్గము... లౌడుస్పీకరు లాగా ఇంట్లో అన్నీ దిక్కుల లో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వినిపిస్తునే ఉంటుంది... జమున ఘోష...


జాతకము చూసేటప్పుడు లెఖ్ఖలు తప్పు తున్నాయి...

మంచం మీద హాయిగా పని చేసుకునే యోగం-ముఖ్యం గా చంటిగాడికి వచ్చే సంబంధాలు తిరగేయ్యటానికి--- కూడా లేదు... అది అసలే కలిసొచ్చిన మంచం... అన్నీ రకాలుగా... తాతల నాటిది...


ఇంట్లో మిగతా వస్తువులు, మనుషులు రూపాంతరం దాల్చినా ఈ మంచం మటుకు ఇంకో ఐదేళ్లలో సెంచరీ కొడుతుంది....


"అంత ఇష్టం లేకుండానే చేసుకున్నారా నన్ను? ఎవరు బలవంత పెట్టారని???


పక్కింట్లో ఉన్న నా ఫ్రెండ్ శుభ వాళ్లను చూస్తున్నారు గా... కొన్నేళ్లుగా వాళ్లు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని అని చెప్పలేం... భలే బాగా ఇరువురి జాతకములు కలిశాయి అని శుభ ఎప్పుడూ నాతో అంటూ ఉంటుంది... చేసిందంతా చేసి నీ ఖర్మ అని ఒక మాట తో సరి పెడతారు పెద్దవాళ్లు"...


"నీ మాటలు వింటూ మర్చిపోయాను...

వెంటనే వెళ్తాను... ట్రాఫిక్ లో అర గంట లేట్ అయిందని చెబుతాను వాళ్లకు"... అంటూ హడావిడి గా బయట పడ్డాడు పార్థసారథి.... జమున తో మాట్లాడుతూ సగం గొణుగుతూ బయటకు వెళ్లిపోయాడు....


జమునకు పార్థసారథి ఎటు వెళ్లింది తెలీదు... బయలుదేరేటప్పుడు అడిగితే ఇంకేం లేదు... గోడవ అవుతుంది... అయినా పట్టించుకునే మూడు లో లేదు జమున... జమున కు ఆ ఢిల్లీ పిల్ల చాలా నచ్చింది... ఈడు జోడు బాగుంటుంది... ఈ మొండి మనిషి కి ఎవరు చెబుతారు? చంటిగాడికి నోరు లేదు పాపం... తల్లి తండ్రి తగువులు చూసి వాడు అలా అయిపోయాడు... పక్కింటి శుభ వాళ్లు కూడా అంతే... ఎప్పుడూ చికాకులలో ఉంటారు... వీడి గోడు వినే వాళ్లు గోడ అవతల కూడా... అదే... పక్కింటి లో కూడా ఎవరూ లేరు... పై పెచ్చు వాడి ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురికి పెళ్లి అయిపోయింది.. ఆ తర్వాత వాళ్లు బొత్తిగా నల్ల పూసలై పోయారు... ఎంత సేపు శ్రీమతి సేవ తప్ప వెనుకటి మాటలు, వేషాలు, ఫ్రెండ్స్ తో తిరుగుళ్లు లేవు... దాంతో చంటిగాడు మరీ వంటరి అయి పోయాడు...


మంచం మీద వాలుతూ సైడ్ టేబుల్ మీద ఉన్న తన పెళ్లి ఫోటో మీద జమున కళ్లు పడ్డాయి... ఎంత తేడా వచ్చింది ముప్పై ఏళ్ళ లో... ఎవరి నైనా ఆకట్టుకునే కళ్లు తనవి... అందమైన కురులు... మంచం ఎదురుగుండా ఉన్న గోడకి ఈ మధ్యే ఇంకో ఫోటో ఎక్కినది. అందులో తనని తానే గుర్తు పట్టలేనట్లు ఉంది... ఈ సంవత్సరం పెళ్ళి రోజు న తీసిన ఫొటో... ఏమీ తిట్టుకున్నా పెళ్లి రోజు ఆర్భాటంగా చేసుకోవాలి... పార్థసారధి కది అలవాటు...


అంటే కొత్త బట్టలు కట్టుకోని మంచి పోసు పెట్టి ఫోటో అయితే కంపల్సరీ... ఆ ఫోటో లో కోపం, బాధ, విసుకు తో నిండిన కళ్లు... అలా అని తనకి అనిపిస్తోంది... ఆ కళ్ళల్లో అందం, అమాయకత్వం ఏది? ఇతరులకు కష్టం కాని తన లో వచ్చిన మార్పు తనకు తెలియక పోతే గా... ఈయన తో వేగి వేగి ఇలా అయిపోయింది...


ఇద్దరికీ అసలు పొత్తు కుదరదు... చాలా ఆధునిక భావాలు ఉన్న వ్యక్తి తను... ఐదేళ్ల పాటు లైఫ్ ను ఎంజాయ్ చేసి పిల్లల ను కందామనుకుంది... అక్కడే మహాభారతం లో మొదటి పర్వం మొదలైంది... ఎక్కడ అమ్మా నాన్నలకు తెలుస్తుందోనని అలా అలా అల్లుకు పోయింది... అసలే అప్పుడు వాళ్ళు ఆరోగ్య సమస్యల తో బాధ పడుతున్నారు... తన పెళ్లి కి చాలా కష్ట పడ్డారు...


ఆరేళ్ల లో ముగ్గురు పిల్లలు, అత్త గారి ఇంటి సనాతన సాంప్రదాయ పద్ధతుల తో తన జీవితం గడిచి పోయింది... చంటి గాడి పైన జయ, పద్దు ఉన్నారు... జయ ప్రేమించి పెళ్లి చేసుకుందని దాన్ని మళ్లీ ఇంటి గడప తొక్కనివ్వలేదు తండ్రి... పద్దుకు మేనరికం చేశారు... వాడికి జాతక రీత్యా అలా అయితే బాగుందని...


పొరపాటున ఒక సారి ఎవరి ఇంట్లోనో కాశీ సమారాధన జరిగితే వెళ్లడం జరిగింది... అంతే అక్కడ కలిసిన ఒక స్వామీజి తన మొగుడి బుర్రను మార్చేశాడు... బుధ, గురు, కుజ, శని ఇతర గ్రహ సంచారం అప్పటి నుంచి ఇప్పటి వరకు తన జీవితంలో విజయవంతముగా సాగుతూనే ఉంది... ఆ పక్క వీధిలో నే ఒకడు రెండేళ్లు అయిందో లేదో తన ఇంటి ముందు బోర్డు పెట్టి- ఇచ్చట జాతకం చూడ బడును- అని, అప్పుడే అదే వీధిలో చివరనున్న ఖాళీ స్థలం కొనేసి అందులో ఇల్లు కూడా కడుతున్నాడు...


తన మొగుడు లాంటి వాళ్లు బోలెడు మంది ప్రతి వీధికి... నెల జీతం లో సగం తీసుకెళ్లి జాతకం పేరు తో సంతోషంగా వీళ్లకి సమర్పించే వాళ్లు... ప్రస్తుతం వాళ్ళ టైమ్ నడుస్తోంది... ఎక్కడ చూసినా వాళ్ల గోల ఎక్కువై పోయింది...

బద్ధకంగా మంచం మీద దొర్లుతోంది జమున.. చెయ్యి వెళ్లి పోరపాటున టీవీ రిమోట్ మీద పడి టీవీ ఆన్ అయిపోయింది...


భార్యాభర్తల మధ్య గొడవలా... కుటుంబ కలహాలా? ప్రేమ వ్యవహారమా ? నిరుద్యోగ సమస్యా??? పెళ్లి కుదర లేదా??? మీ అందరి సమస్యల కు ఒకే ఒక పరిష్కారం మా యోగ బ్రహ్మ జ్యోతిశ్శాస్త్రుల వారు చూపే పరిష్కారమే... తప్పక విచ్చేయండి.. మా ఫోన్ నెంబర్... టీవీ లో ఈ మధ్య బ్రేక్ వచ్చినప్పుడల్లా ఈ రకంగా హింస పెడుతున్నారు...

జమున చిరాకు గా టీవీ ని ఆపేసింది... కాసేపు కళ్లు మూసుకొని పడుకుంది... ఆలోచనలు మటుకు వెంటాడుతూనే ఉన్నాయి...


చంటి గాడి కి పాపం రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయి...

పిల్ల చదువు, ఉద్యోగం వివరాల బదులు ఒక పెద్ద మనిషి తన ఆస్తిపాస్తుల వివరాలు చెప్పి విసికించాడు... చంటి గాడి పేరు మీద ఒక్క ఇల్లు కూడా లేదని తెలిసిన మరుక్షణం ఫోను పెట్టేశాడు...


ఇంకొక సంబంధం లో అమ్మాయి కి అందరూ మగ స్నేహితులే ఉన్నారని, వాళ్ళని రోజు ఇంటికి పిలివాలని ఆ అమ్మాయి అన్నది... ఇంక పెళ్లి అయ్యాక చంటి గాడి పరిస్థితి ఏంటో అర్థం కాలేదు వాడి తో పాటు జమున, పార్థసారథి ల కు... పెళ్లి కొడుకు తో తప్ప అతని కుటుంబ సభ్యుల తో ఏ సంబంధం వద్దనే వాళ్లు ఇంకా ఎందరో...


ఆడది రోడ్డు మీద ఒంటరి గా నడిచిన రోజు మన దేశానికి నిజమైన స్వాతంత్య్రం అని ఆ మహాత్ముడు ఆనాడు అన్నాడు.... ఈనాడు స్వాతంత్ర్యం మితిమీరి పోయింది... మన ఉనికిని మనమే దెబ్బ కొడుతున్నాము...


విచ్చలవిడితనం అలవాటు గా మారి పోయింది... ఆడ, మగ అందరికీ ఒకే రకం అలవాట్లు... చెప్పాలంటే స్మోకింగ్ చేస్తున్న ఆడపిల్లలు ఎక్కువై పోయారు... అఫైర్లు, బ్రేకప్పులు ఎక్కువ అయిపోయాయి... ఎవరికి ఎన్ని ఫ్లాష్ బ్యాక్ లు ఉన్నాయో ఎవరికి తెలుసు...


అయినా ఇది ఆలోచిస్తూ ఉంటే పిల్లవాడి పెళ్లి ఎలా అవుతుంది? ఒక మంచి పిల్ల ఉంటుంది ఎక్కడో... కాకపోతే మధ్య లో కొన్ని సంబంధాలు మొగుడి చాదస్తం వల్ల పోయాయి... అదో పిచ్చి లో పడి పోయారు... ఎప్పుడైనా పొరపాటున జాతకం మనం కలిసినది అని చెప్పినా అమ్మాయి వైపు వాళ్ళ పురోహితుడు చెబితేగానీ కలిసి నట్టు లెక్క కాదు... మన మాట అవతల వాళ్లు ఒప్పుకో రే... అందరూ అదే పిచ్చి లో ఉన్నారు…

చాలా మంది ఈ రోజుల్లో కంప్యూటర్ లో హారొస్కోప్ మ్యాచింగ్ చేసి అది ఎంత నిజమో తెలుసుకో కుండా నిర్ణయం తీసుకుంటున్నారు... ప్రతీది ఆన్లైన్ ఉండే సరికి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆలోచించ కుండా గూగుల్ ఎంత చెబితే అంతే...


ఆ మాట కోస్తే ముప్పై ఏళ్ల నాడు ఏ జాతకం చూడ లేదు తన పెళ్ళికి... మూడేళ్లు టెన్షన్ పడ్డారు అమ్మా నాన్న... పది రోజుల లో ఆ టైము రాగానే పెళ్లి జరిగి పోయింది...

తన మామగారు మంచం లో ఉన్నప్పుడు పది రోజుల్లో అనుకోవడం చేసుకోవడం అంతా అయిపోయింది... ఆ వెంటనే మామగారు కాలం చేశారు... కాకపోతే మామగారి ఆప్త మిత్రుడు మహా పండితులు, జ్యోతిష్యం లో దిట్ట... ఆయన కు తన కుటుంబం కూడా తెలుసు... అందు వలన ఆయన ఆశీస్సుల తో జమున, పార్థసారథి ల పెళ్లి నిశ్చింతగా చేసేసారు మామగారు... అటువంటి దైవ సంభూతులు నూటికి కోటి కి ఒక్కరు ఉంటారు తప్ప, ఇలా వీధి వీధి కి పుట్టుకు రారు... టీవీ ల్లో అసలు రారు... ఎవరు చెప్పగలరు తన మొగుడు తో పాటు ఈ మూర్ఖపు లోకానికి...


టైమ్ తొమ్మిది అయింది...

బయటకు వెళ్లిన మనిషి రాత్రి డిన్నర్ టైమ్ కంటే గంట లేటు గా వచ్చారు... స్నానం చేసి వస్తాను అని గది లోకి వెళ్లి ఒక గంట తరువాత వచ్చారు... మౌనంగా భోజనం చేశారు... ఈ పాటికి మామూలుగా అయితే ఏదో రకంగా జయ గురించి ప్రస్తావించి నాలుగు తిట్లు తిడితే తప్ప ముద్ద దిగేది కాదు... ఎందుకులే అని జమున కూడా నోరు మూసుకుంది...


అనుకోకుండా ఒక వారం రోజులు ప్రశాంతంగా జరిగింది... వారం కాదు నెల... ఏంటిది... కట్టుకున్న మొగుడితో ఇంత హాయిగా ఎప్పుడు ఉంది జమున? చంటి గాడి పెళ్లి, ఢిల్లీ సంబంధం అన్నీ వదిలేసి భర్త తో సహజీవనం లో ఉన్న నిజమైన ఆనందాన్ని పొందింది జమున... ఆ ఒక్క నెల లో...

అరవై ఏళ్ల కు ఇంకేమీ ఉంటుంది అనుకుంటే అది పొరపాటే...


వయసు లో ఉన్నప్పుడు ఆ వేడి, ఆ కోరిక... అవన్నీ ప్రకృతి సిద్ధమైన అవసరాలు... కాపురం లో అసలు తీపి, మాధుర్యం మూడు పదుల తరువాతే...


ఆ ముప్పై రోజుల్లో పార్థసారథి ఏమీ చెప్పలేదు, జమున ఏమీ అడగ లేదు...


ఒక రోజు అకస్మాత్తుగా ఢిల్లీ నుండి రావుగారు దంపతులు కుటుంబ సమేతంగా వచ్చారు... అమ్మాయి ఫోటో లో కన్నా బయట ఇంకా బావుంది... అందరికి కాఫీ, పలహారం ఏర్పాటు చేసి చంటిగాడిని ఇంటికి రమ్మని ఫోన్ చేసింది జమున... ఇంకో అరగంట లో ఉంటానమ్మా అన్నాడు...


జమున కు అర్థం కాలేదు... ఇంత త్వరగా ఎలా వస్తున్నాడు అనుకుంది...

ఢిల్లీ గాలులు బహు జోరుగా చంటి గాడి వాట్సప్ లో వీచాయి... ఆ రోజు పొద్దున్నే అమ్మాయి మెసేజ్ పెట్టింది కొడుకు కి వాళ్లు వస్తున్నట్లు... అందుకే ఆఫీసు లో బాస్ తో ముందే చెప్పి ఉంచాడు... ఆ సంగతి జమున కు తెలీదు...


రాత్రి లాస్ట్ ఫ్లయిట కు వెళ్లి పోయారు పెళ్లి వారు... చంటి గాడి మొహం లో ఆనందం కనిపించింది... అమ్మాయి ఓకే చెప్పింది... ఇంకో రెండు నెలల తరువాత పెళ్లి పెట్టుకోవాలని నిశ్చయించు కున్నారు... జమున కు ఇది కలో నిజమో అర్థం కాలేదు...


చంటిగాడు జమున ను గట్టిగా కావలించు కొన్నాడు... "కంగ్రాట్స్ రా" అన్నది జమున... "ఇంక అబ్బాయి రేపే ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కుతాడన్నమాట"... అని కొడుకు ను ఆట పట్టించిన జమున నాలిక కర్చు కుంది... ఇదంతా పార్థసారథి కి నచ్చదు... ఆయన పాత కాలం మనిషి...

కాని ఆశ్చర్యం... ఇదివరకు అయితే గొడవ అయిపోయేది... అలాంటిది ఆ రోజు నవ్వు కుంటూ గది లోకి వెళ్లిపోయాడు పార్థసారథి...


పెళ్లి తారీఖు దగ్గర కొచ్చినది... పిలవాల్సిన వారి జాబితా లో మొదటి గా పార్థసారథి క్లోజ్ ఫ్రెండ్ సత్యమూర్తి పేరు రాసింది జమున... ఎంతో కావాల్సిన వాళ్లు... అప్పుడు పార్థసారథి "నీ దగ్గర నేను కొన్ని విషయాలు దాచి పెట్టాను జమున... మూడు నెలల క్రితమే వాడికి అర్జెంటుగా ఆపరేషన్ చేశారు... వాడి జాతకం ప్రకారం వాడి వంటి మీద అసలు కత్తి పడదని ఉంది... అలాంటిది ప్రమాదము ముంచు కొచ్చినది... ఏదో... ఇంకా... బతికి బయట పడ్డాడు...


ఎటు వంటి చెడ్డ అలవాట్లు వాడికి లేవు, నీకు తెలుసు కదా... మన జయ భర్త దినేష్ ఎంతో సహాయము చేశాడుట వాళ్ల కి ఆ టైమ్ లో... హెచ్. ఆర్. హెడ్ గా అదే హాస్పిటల్ లో పని చేస్తున్న దినేష్ సత్య మూర్తి కి ఏ విధమైన లోటు లేకుండా వైద్య సహాయం అందే విధంగా చేశాడుట... అంతే కాదు... ఆర్థిక సహాయం చేసి సత్య మూర్తి ని ఆదుకున్న గొప్ప వ్యక్తి మన అల్లుడు... ఐదేళ్లలో మొదటి సారి ఇంట్లో 'అల్లుడు' అన్న పదం వినబడింది... మనం పెళ్లి కి పిలవ వలసిన మొట్ట మొదటి వ్యక్తి జయ భర్త దినేష్ ను... కూతురు, అల్లుడు వాళ్ల కుటుంబ సభ్యులందరినీ పిలిచి సన్మాన సత్కారములు చేసి మన తప్పులను దిద్దు కోవాలి జమున... మన చంటిగాడి పెళ్లి లో..


ఆ రోజు నేను లేటు గా ఇంటికి వచ్చిన కారణం అదే... జయ పక్కింటి సుబ్బారావు ఆ రోజు నేను వెళ్లిన మ్యారేజ్ బ్యూరో వాళ్లు ఏర్పాటు చేసిన మీటింగ్ కు వచ్చాడు... అన్ని సంగతులు చెప్పాడు... సరాసరి సత్యమూర్తి ని చూసి ఇంటికి వచ్చాను...


ఎంత మంది జాతకం పేరు తో వ్యాపారం చేస్తున్నారో అర్థం కావడం లేదు... చాలా కొద్ది మందికే సంపూర్ణంగా ఈ సబ్జెక్టు పై అవగాహన ఉంటుంది.... మీడి మీడి జ్ఞానం తో ఎక్కువ మంది మన సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు... నేను కూడా అందులో ఒకణ్ని... ఆ జాతక రత్న జానకి రామయ్య మాయ లో పడి చాలా మూర్ఖముగా ప్రవర్తించాను...


చంటి కి వచ్చిన ఒకటి రెండు మంచి సంబంధాలు నా వల్ల చెడి పోయాయి కదా... జీవితం లో చాలా తప్పులు జరిగాయి నా వల్ల... అవన్నీ సరిదిద్దు కోలేను కాని ఎంతో కొంత మార్పు అనేది నాలో వస్తే నీతో కలిసి మన శేష జీవితం కొంచెం ప్రశాంతంగా గడపచ్చు జమున... రెండు నెలల నుంచి ఆ ప్రయత్నం లోనే ఉన్నాను...


అందుకే ఆ ఢిల్లీ సంబంధం వాళ్ళను రమ్మని నీకు తెలియ కుండా ఫోన్ చేశాను... వాళ్ల కు అర్థం అయ్యేలా అన్నీ వివరించాను...


ఈ సంతోష ఘడియల లో నీకు చెప్పాల్సిన ఇంకో విషయం కూడా ఉంది... నీ ఆడపడుచు, మా అక్క అయిన మాలతి ఫోన్ చేసింది కిందట నెల... మన కోడలు ఇందు కు రెండు నెలలు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పిందిట... మళ్లీ ఎబార్షన్ అయిందిట... నీతో చెప్పలేక నాతో చెప్పింది..

ఏంటో జమున... పద్దు విషయం లో అసలు నాకు ఏ మాత్రం డౌట్ లేదు... వాడిది చక్కటి జాతకం…” అని మళ్ళీ పాత పాట పాడాడు పార్థసారథి...


"ఇందు చాలా దుడుకు పిల్ల... ఎవరి మాట వినదు... అతి గారాబం చేశారు మీ వాళ్లు... కిందటి సారే డాక్టర్ గట్టిగా హెచ్చరించింది... ఇంకో సారి జాగ్రత్త గా ఉండాలి లేదా ఇందుకు కష్టమని... దూకుడు గా తిరిగితే కొంత మంది కి కడుపు నిలవదు... అందులోనూ మేనరికం... వద్దని చెబితే విన్నారు కాదు... కోడలు ఇందు బుద్ధి మారాలని డబ్బు ఖర్చు పెట్టి అర్థం లేని జపాలు చేయించారు... ఆ టీవీ లో జ్యోతిష చింతామణి చెప్పడని... నెత్తి నోరు కొట్టుకోని మీకు ఎంత చెప్పినా నా మాట లెక్క పెట్టలేదు...


జాతకం అనేది ఎవరు పడితే వారు చెప్పలేరు... అందులోనూ మీ లాగా ఎంతో మంది పెళ్ళి కి పిల్లల జాతకం ముగ్గురు లేక నలుగురికి చూపిస్తారు... ఎవరో ఒకరిని నమ్ముకొని ముందుకు వెళ్లాలి కాని పది మంది దగ్గరకు వెళ్తే పది రకాల గా చెబుతారు... ఆ పై మీకు మీరే ఇంట్లో వాటిని అభ్యసించి ఏమీ సాధించారు???


ఇప్పటికైనా తెలుసుకున్నారు... చాలా సంతోషం...

పద్దు పెళ్లికి వచ్చినప్పుడు ఇందు సంగతి వాడి తో మాట్లాడుదాము"...


మాటల్లో పడి ఇద్దరూ టైము చూసుకోలేదు... ఇంత లో చంటి గాడు తన గదిలో నుండి బయటకు వచ్చి-

"ఈ రోజు డిన్నర్ హోటల్ లో... సరదాగా... అని వెనక నుంచి నసి గాడు... అలా వాడు అడగటం అదే మొదటిసారి...


జమున గత పదేళ్లుగా ఎప్పుడూ అడగ లేదు భర్తను... బయటికి సరదాగా తీసుకెళ్లమని...

ఇల్లు కదిలే ముందు గురు హోర, శుక్ర హోర అని లెక్కలు వేసి ఏదో కుదర లేదని చెప్పి ప్రతీ సారి వాయిదా వేస్తూ ఉండే వాడు... దాంతో జమున అడగటం మానేసింది....


చంటికి చాలా కొత్తగా ఉంది అమ్మా నాన్న తో ఇలా స్టార్ హోటల్ లో డిన్నర్... తన కాబోయే శ్రీమతి విభ తో ఫోను లో చాట్ చేస్తూ ఆలూ చాట్ లాగించాడు... సంతోషం తో ఉక్కిరిబిక్కిరి గా ఉంది అతని పరిస్థితి...


లైవ్ దోశ కౌంటర్ ముందు వేడి గా కాలుతున్న దోశ కోసం వెయిట్ చేస్తూ తన భర్త తో జమున ఇలా అన్నది...

“సో మై డియర్ భర్త గారు, పెళ్లి పనులు మనమే చేసుకోవాలి... జయ, పద్దు వాళ్లు పెళ్లి టైమ్ కి వస్తే ఎక్కువ... కిందటి నెల మనం ఎంత సఖ్యంగా ఉన్నామో, అలాగే ఉంటే హాయిగా పనులు అన్నీ చేసుకుని చంటి గాడి పెళ్లి ఘనంగా చేశామని నలుగురి చేత అనిపించు కొందాము...

కాబోయే కోడలు అసలే ఢిల్లీ పిల్ల... విభ అని మంచి స్టైల్ గా ఉంది పేరు... మన వాడిని మనం యోగేష్ అని పిలవడం అలవాటు చేసుకోవాలి... ఇంకా చంటి అంటే ఏమీ బాగుంటుంది??”


తన ప్లేటులో దోశ ను సగం చేసి పార్థసారథి ప్లేటు లో వేస్తూ జమున తన మనసు లో మెదులుతున్న ప్రతీ ఆలోచన పైకి నిర్భయంగా ఆనందం గా భర్త తో చెబుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తోంది...

అప్పుడే పార్థసారథి ఫోను మోగింది...


అవతలి నుండి శేషయ్య గారు... “వచ్చే నెల అబ్బాయి నక్షత్రానికి శాంతి చేద్దాం... కాలం అంత అనుకూలంగా లేదు... ఆ తర్వాత రెండు నెలల కు ఖచ్చితంగా పెళ్లి కుదురుతుం’దని చెప్పాడు...


పార్థసారథి తన భార్య వంక చూసి నవ్వుతూ " మా అబ్బాయి పెళ్లి మాఘమాసం శుద్ధ పంచమి నాడు రాత్రి ముహూర్తం ఖరారు అయింది. మీరు కూడా వచ్చి వాడిని ఆశీర్వదించ వలసినది గా కోరుతున్నాము "... అవతల నుంచి ఫోను కట్ చేసిన శబ్దం వినపడింది... ఇంకా అటు స్వీట్స్, ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంది... చాలా రష్ గా ఉంది అక్కడ... జమున, పార్థసారథి అటు గా నడిచారు... ఈ లెక్కన మీరు ఊళ్లో ఉన్న జ్యోతిష్యులందరికీ ఎంతో కావాల్సిన వాళ్లు అన్న మాట.... ఎవరినీ వదల లేదు... బాగా డబ్బు చేసుకుంటున్నారు మీ పుణ్యమా అని... వాళ్లందరు...


"ఆ దశ అయిపోయిందిలే జమున"... అని జమున నోట్లో బాదం హల్వా పెట్టాడు పార్థసారథి...

చంటి గాడి ఆకలి పూర్తిగా ఎగిరి పోయింది... విభ ఫోన్ లో చంటి గాడి తో మాట్లాడుతూనే ఉంది... చంటి కి విభ గొంతు, ఆమె మాటలే గులాబ్ జామున్, ఆమె తలపే ఐస్ క్రీమ్...

ప్రతి మనిషి జీవితంలో అది ఒక మధుర మైన దశ... ఆ టైము లో చెప్పుకునే ఊసులకు అంతు ఉండదు...


కొడుకు సంతోషాన్ని చూసి ఆనందం తో నిండిన జమున పార్థసారథి రెండు మూడు ఐస్ క్రీమ్ లు తినేశారు... అపరిమితమైన బఫె లో ఆ మాత్రం తినక పోతే మరి బాగుంటుందా???

*********************************

దాసు రాధిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.

ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.











225 views0 comments

Comments


bottom of page