గృహాగోదిక
- Pudipeddi Ugadi Vasantha
- Aug 4, 2023
- 8 min read
Updated: Oct 10, 2023

'Gruhagodika' - New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha
'గృహాగోదిక' తెలుగు కథ
రచన, కథా పఠనం: పూడిపెద్ది ఉగాది వసంత
"లిజార్డ్"- ఇది ఇంగ్లాండ్ దేశం లోని ఒక పర్వతం పేరే, కానీ నేను ఆ పర్వతం గురించి చెపుతున్నానుకోకండి. నేను చెప్పబోయే"లిజార్డ్" అంటే ఒక"గృహాగోదిక". దీన్ని"గౌళి"
అని కూడా అంటారటండోయ్!! ఈ గృహాగోదిక నా జీవితం లో ఓ నాలుగు రోజులు సృష్టించిన అగ్ని పర్వతాలు, నేను నా జన్మలో మరిచిపోలేను.
అది నా మనసున రేపిన"వ్యధ" గురించి ఎంత చెప్పినా తక్కువే సుమా ! ఇది నాలో లేపిన అలజడి, అశాంతి నన్ను ఎంత వేదనకి గురి చేసిందో మాటల్లో చెప్పడం కష్టం. నేను పడ్డ ఆందోళన నా కజిన్స్ తో పంచుకున్నాను, మా అక్కలతో ముచ్చటించాను, మరి మీకు కూడా ఓ మారు చెప్పాలనుకుంటున్నాను, లేకపోతే నేను దసరా మూడు రోజులూ పడిన ఆవేదనకు, ఓ అర్ధం, పరమార్ధం ఉండొద్దటండీ ??
ఈ గృహాగోదిక ఉరఫ్ గౌళి ఇంట్లో ఉన్న ఆ మూడురోజులూ, ఇంట్లో యముడు నడయాడుతున్నట్టే అనిపించింది నాకు. దాన్ని బయటికి నెట్టేసేవరకూనూ మనం ఎంతో
జాగరూకతతో ఉండాల్సి ఉంటుంది, , ఒప్పుకుంటారా ?? చూద్దాం !!
అయితే, దాని వెనుక వున్నా కధా కమామిషు తెలుసుకుని తీరాల్సిందే. దాని వెనక ఉన్న కధ తెలియాలంటే, ముందు, ముందుకెళ్లాలి. ఇంకెందుకాలస్యం, ఆసాంతం చదవండి ఆ
గృహాగోదిక "కధ". కాదు కాదు నా"వ్యధ" !!
****
ఓ శనివారం నాడు, ఉదయాన్నే నేను వాకింగ్ కి రెడీ అవుతూ ఉంటే, మా ఆయన వచ్చి, “నువ్వు రెడీ అవుతున్నప్పుడు, అన్ని చోట్ల లైట్స్ వేసుకో," అని హెచ్చరిక చేసేరు.
"ఎందుకంటే, నిన్న రాత్రి, నేను పడుకునే ముందు, హాల్ లో, ఓ బల్లిని చూశాను, అది ఇప్పుడు ఎక్కడ ఉందొ తెలియదు కదా" అని నిశ్శబ్దంగా బాంబు వేసేరు.
"అయ్యో! నన్ను అప్పుడే లేపి చెపితే, ఇద్దరం కలిసి దాని పని బట్టేవాళ్ళం కదా ! అది ఒక చోట అలా ఉండిపోదు కదా ! ఏ మూలాన దాక్కుందో ఏమో ? ఎక్కడని వెతకడం ? దాన్ని
బయటికి ఎలా తరమడం ?"
నాకు బల్లంటే ఉన్న భయం కారణంగా, నాలో అసహనం కట్టలు తెంచుకుంటోంది, అయినా శాంతంగా అడిగాను. ఆ దిక్కుమాలిన బల్లి గురించి ఉదయాన్నే మూడ్ పాడుచేసుకోడం ఎందుకని.
"నువ్వు మంచి నిద్రలో ఉన్నావని డిస్టర్బ్ చేయలేదు { బల్లిని కూడా డిస్టర్బ్ చేయకుండా అనుకోండి}, ఉదయం పనిమనిషి వచ్చేక, బయటికి నెట్టేయవచ్చు లే అనుకుని,
ఊరుకున్నాను"
ఆయన నాకు ఇచ్చింది సమాచారమే అయినా అది ఓ ఆటం బాంబు లా, నా మనసులో విస్ఫోటన సృష్టించింది. ఎందుకంటే, నాకు అసలే బల్లి అంటే విపరీతమైన ఎలెర్జీ. ఇంకా భయం కూడాను. చిన్నప్పటినించి, బల్లి ఇంట్లోకొచ్చిందంటే, దాన్ని తరిమే వరకు
నిద్రపోయేదాన్ని కాదు, అది విషయం.
మా పిల్లలకి కూడా ఈ "గౌళి" అంటే ఎలర్జీ అండ్ భయం కూడాను. బల్లి ఇంట్లోకొస్తే, దాన్ని బయటికి తోలేవరకు, గుమ్మంలో మెట్లమీద కూర్చుంటారు.
నా ఇంట్లో నేను, ఓ చిన్న జీవికి భయపడుతూ, రెడీ ఆయె పరిస్థితి ఎదురయింది, ఓ కప్ టీ పెట్టుకుందామని కిచెన్ లోకెళ్ళి, టీ తయారయ్యేవరకు అక్కడే నుంచున్నాను.
నాకు సడెన్ గా, ఉల్లిపాయల స్టాండ్ కి పక్కగా, గోడమీద ఓ నీడ, చిన్న కదలిక తో కనిపించింది, టీ ఆఫ్ చేసేసి, మూత పెట్టేసి, నల్ల హిట్ సీసా పట్టుకుని, చప్పుడు చేయకుండా,
ఉల్లిపాయల స్టాండ్ దగ్గరికి వెళ్లి, తల వొంచి చూద్దును కదా! అక్కడ ఓ ఉల్లిపాయ తొక్క అటు ఇటు కదులుతూ కనిపించింది, ఫ్రెష్ గాలి కోసం, కిచెన్ బాల్కనీ డోర్ తెరిచాను నేరకపోయి, బయట గాలి తగిలి అదలా ఊగుతోందన్నమాట."హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకున్నాను.
‘తాజా గాలి లేకపోతే వచ్చిన నష్టం ఏంటి నాకిప్పుడు, అనవసరంగా, కిచెన్ బాల్కనీ డోర్ తెరిచానని’ నన్ను నేనే తిట్టుకుని, డోర్ వేసేసి, లైట్ ఆఫ్ చేసి, షూస్ వేసుకోడానికి వెళ్లి, ఆ షూస్ నో తొంభై సార్లు దులిపి, సాక్స్ ని తిరగేసి, మరగేసి ఓ పది సార్లు చేసి, (ఎక్కడ బల్లి మాస్టారు దాక్కుని ఉంటారో అనే భయం మరి) షూస్ వేసుకుని, బాగ్ తీసుకుని వాకింగ్ కెళ్ళిపోయెను.
***
ఓ మూడు రౌండ్ లు వాకింగ్ అయ్యేక గుర్తొచ్చింది, నేను బల్లి ధ్యాసలో పడి, టీ తాగడం మర్చిపోయేనని. ఆ క్షణం లో దేవుడే దిగి వచ్చి ఎదురుగా నుంచున్నా కూడా, నా దృష్టి
బల్లి ధ్యాస నించి మరలదేమో? ఆ దేవుణ్ణి కూడా బల్లిని బయటకి పంపించేయమని కోరుకుంటానేమో ?
మన మనసు చేసే మాయాజాలం గమనించారా ? మనకి ఎంతో ఇష్టమైన సన్నివేశంలో, మనకి ఎంతో జుగుప్స కలిగించే ఓ దృశ్యం కంటపడి, అది మన ఇష్టాన్ని ఎలా అధిగమించేస్తోందో ?
***
వాకింగ్ కి వెళ్లి వచ్చెను, ఆరోజు పనిమనిషికోసం, ఓ ప్రియుడికోసం ఎదురుచూసే ప్రియరాలిలా ఎదురుచూశాను.
తను రాగానే, బల్లి వృత్తాన్తమంతా చెప్పి, అన్ని పనులు ఆపేసి, దాన్ని తరిమే పనిలో ఉండమని చెప్పెను. హాల్లో ఆణువణువూ జల్లెడేసి, నల్ల హిట్ సీసా ఒకటి పట్టుకుని,
ముక్కుకు గుడ్డలు కట్టుకుని, బాంబు స్క్వాడ్ లా రంగం లోకి దిగాము. ఎక్కడా కనించలేదు.
*******
"మరుపు" ఎంత మధురం కదా! అదేవిటో ఆఫీస్ కి వెళ్లొచ్చేసరికి, సాయంత్రానికల్లా, బల్లి గురించి పూర్తిగా మర్చిపోయేను సుమా నేను.
ఓ మహానుభావుడన్నట్టు, "ఎన్ని అనుభవాలైనా, ఎన్ని జ్యాపకాలైనా శలభములై కాలిపోవు చిత్రమైన మరుపులో"
ఈవెనింగ్ ఇంటికొచ్చేక, ఓ కప్ టీ పట్టుకుని, కిటికీ తెరిచి, ఫ్యాన్ వేసుకుని, మా సిట్ అవుట్ లో కూర్చున్నాను.
మనసున ఉప్పొంగుతున్న మమతలు, అనుభూతుల పరిమళాల్ని వెతుక్కుంటాయి, ఆ వెతుకులాటకి ఎల్లలుండవు. అమెరికా లో ఉదయపు తేనీరు, ఇండియాలోని సాయంత్రపు తేనీటితో చీర్స్ కొట్టి, కనులు కనులు కలుపుకుని సంభాషించుకుంటూ, అందనంత
దూరాన్ని ఒక్క వీడియో కాల్ తో కళ్లెంవేసి, ఒడిసి పట్టుకుని, కలిసి సిప్ చేస్తుంది. అమెరికా లో ఉన్న మా అమ్మాయితో కలిసి టీ తాగుతూ వీడియో కాల్ లో, మాట్లాడుతున్నాను.
ఇది నేను ఎక్కువగా ఇష్టపడే అనుభూతి. వీడియో కాల్ లో ఎంత లీనమైపోయానంటే, , మా అమ్మాయి పక్కనే ఉన్నట్టుగా అనిపించేంతగా భ్రమలోకెళ్ళిపోయాను. దాంతో మాట్లాడుతూ, హాయిగా రెండు సిప్పులు ఎంజాయ్ చేసెనో లేదో, సడెన్ గా ఎదో చప్పుడైంది.
అది ఫోన్లోనే అనుకుని, మా అమ్మాయిని అడిగాను,"ఏంటా శబ్దం? అమెరికా లో కూడా బల్లులున్నాయా?” అని.
“నో వే ! అమెరికా లో నీ రెండుకాళ్ళ "గృహాగోదిక" లుండవు, అవి ఉండేవి ఒక్క ఆస్ట్రేలియా లోనూ ఇంకా ఇండియా లోనే.
కానీ, అమెరికా లో ‘హౌస్ సెంటి పీడ్స్’ అని నూరుకాళ్ల జీవులుంటాయి.. ఈ నూరుకాళ్ల జీవిని భరించడం కన్నా రెండు కాళ్ళున్న వాటిని భరించడం సులువు," అని, దాని పుట్టు పూర్వోత్తరాలన్నింటిని, అవలీలగా చెప్పేసింది.
నిజమే నేను ఈ హౌస్ సెంటిపీడ్స్ గురించి, ఆ మధ్య, నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ లో చూసాను. వెంటనే నాకు గుర్తొచ్చింది మా ఇంట్లో ఇంకా ఆ రెండుకాళ్ళ జీవి తచ్చాడుతునే ఉంది అనే నగ్నసత్యం. వెన్నెముక ఒక్కసారిగా చల్లబడిపోయింది అది గుర్తు రాగానే.
తలుచుకునేసరి తలదగ్గరున్నట్టు, పక్కకి తిరిగి చూద్దును కదా, ఆ రెండుకాళ్ళ జీవి, నా పాలిట దెయ్యం, మళ్ళీ ప్రత్యక్షం అయింది, నేను కూర్చున్న సోఫా కిందనింది, పక్కగా ఉన్న చెప్పుల స్టాండ్ వైపు పయనమైంది, దాని బాబుగారి ఇల్లులా, ఎంత దర్జాగా తిరుగుతుందో, మా ఇంట్లో??
‘చూసేరా, మన ప్రాణానికి ప్రాణమైన పిల్లలతో ఫోన్ కూడా మాట్లాడనివ్వకుండా ఎలా మన ధ్యాసని మరల్చేసిందో ? మొత్తం ధ్యాసంతా దానివైపే మళ్లిపోయింది,
ఏమి చేయాలి, అదెటువైపు వెళ్లిందో, ఆటే చూస్తూ, దాని కదలికలపై పూర్తి శ్రద్ధ పెట్టి ఉంచి, వాచ్మాన్ కి ఫోన్ చేసి ఉన్నపళంగా మా ఫ్లాట్ కి రమ్మని హుకుం జారీ చేసెను.
మా వాచ్మాన్ వెంటనే వచ్చాడు, మళ్ళీ ఇద్దరం బాంబు స్క్వాడ్ వారిలా, ముక్కులకి గుడ్డలూ చేతిలో, చీపురూ, చేటా, నల్ల హిట్ సీసా తో రెడీ. అది ఉన్న ప్లేస్ చూపించాను వాచ్మాన్ కి, నేను సోఫా ఎక్కి, కాళ్ళు కూడా మీదే పెట్టేసుకుని కూర్చున్నాను.
అది దాక్కున్న చోటులో నల్ల హిట్ కొట్టాడు వాచ్మాన్, మన భయం మనది, దాని భయం దానిది. దానిక్కూడా బెరుకుగానే ఉంటుంది ఎక్కడ చంపేస్తామో అని, ఆ గాభరాలో, అది తుర్రుమని, మావారి లైబ్రరీ రూంలోకి పారిపోయింది, అన్నీ పుస్తకాలు, సామానులతో నిండి
ఉంటుంది ఆ గది, అక్కడ దాన్ని వెతికి పట్టుకోడం, బ్రహ్మ తరం కూడా కాదు.
“అదేంటయ్యా ఆలా చేసేవు, చీపురుతో అదిమి పెట్టాల్సింది కదా” అంటే, మా వాచ్మాన్ చాలా నిదానంగా బదులిచ్చాడు..
"భలేటోరె తమరు, అదెంతుంటుందమ్మా? మన వేలంత! అది పరిగెత్తినంత వేగంగా మనం దాని వెనకాల పరిగెత్తగలమాండీ ?" అన్నాడు ఆ మాత్రం కదలికలకే ఆయాసపడిపోతూ.
ఆ మాట నిజమే, మనం కాస్త ఫిట్ గా కండిషన్ లో ఉంటే, కొంతలో కొంత సాధ్యపడుతుంది, కానీ మా వాచ్మాన్, తన బాన పొట్టేసుకుని, నెమ్మదిగా నడిస్తేనే ఆయాస పడిపోతాడు, ఇంకా పరుగా? సవాలే లేదు.
ఆ బల్లి మా లైబ్రరీ రూమ్ లో దాక్కోగానే అంతవరకూ నాలో మినుకు మినుకు మంటున్న ఆశ, పూర్తిగా మాయమైపోయింది.
బల్లి దొరికిన మానినా, మా వాచ్మాన్ శ్రమించాడు కదా, అతనికో వంద సమర్పించి, వందన సమర్పణ కానిచ్చాను ఆ రోజుకి. ఇది శనివారం సాయంత్రం ఎపిసోడ్. బల్లి సొమ్మసిల్లిందో లేదో గానీ, నాకు మాత్రం గీరెక్కిపోయింది ఆ నల్ల హిట్ వాసనకి. తలారా స్నానం చేసి, ఆరోజుకి విశ్రమించేను.
****
బల్లి కోసం ఏవీ ఆగవుగా, , , , మహా అష్టమి, మహా నవమి పూజలు, పిండివంటలు అన్ని యధావిధిగా జరిగాయి. ప్రతి చిన్న కదలికకీ భయపడిపోతూ, అలాగే వంటా, పనీ
చేసుకున్నాను పండగ మూడు రోజులును.
దసరా రోజు ఉదయాన్నే లేచి యధా విధిగా పిండివంటలు, మహానైవేధ్యం వంటలు అన్ని పది గంటలకల్లా పూర్తి చేసేసాను.
భోయినాలకి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుదామని కిచెన్ లోకి వెళ్లేను, బల్లి, నా అలికిడికి, ఒవేన్ వెనకాలకి తుర్రుమని వెళ్లడం చూసాను,"అమ్మ దొంగా ! నీది చాల గట్టి ప్రాణమేనే” అని అనుకుని, వెంటనే వాచ్మాన్ కి ఫోన్ చేసెను..
“ఏమి బాబూ, పూజ అయిందా, మీ ఆవిడ ఏమి స్పెషల్స్ చేసింది ? భోజనం చేసేవా ?” మధ్యలో మర్యాదలోటి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నా, అసహనం, అశాంతి తన్నుకుని వచ్చేస్తున్నాయి.
అసలే ఊబకాయుడు, మామూలుగానే ఆయాసపడుతూ ఉంటాడు ఆపైన, కడుపునిండా, పండగ భోజనం చేసినట్టున్నాడు, భుక్తాయాసం అతని మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది.
“అమ్మగారు ఓ మాట సెప్తాను, కోపగించుకోకండి, ఇయాల దసరా పండగ కదటండీ, ఈరోజుకి ఆ బల్లినలా వొదిలేద్దారండి, రేప్పొద్దునే, టిఫినూ గట్రా సేసేసి, లగెత్తుకునొచ్చేతానండి, దాని పని పట్టేతానండి సత్తె ప్రామాణికంగా సెపుతున్నానండీ, రేపటిదాకా కూసింత ఓపిక
పట్టండమ్మగారు”
మా వారు కూడా,"సర్లే, ఇవాళ పండగ కదా, బల్లిని ఈ ఒక్కరోజు పండగ చేసుకోనీ” అన్నారు."రేప్పొద్దున దాన్ని బయటికి పంపేద్దాములే, రిలాక్స్" అన్నారు మావారు.
ఇంక చేసేదేముంది, నా వల్లైతే కాదు దాన్ని తరమడం అని నిట్టూర్చి ఊరుకున్నాను. కానీ నాకు పెద్ద పనే పెట్టింది ఆ బల్లి, జాగ్రత్త భయం నాస్తి అని, కిచెన్ లో ఉన్న
తినుబండారాలన్నింటినీ, హాల్ లో ఉన్న డైనింగ్ టేబుల్ మీదకి సర్దేశాను, నీళ్ల బిందె, నీళ్ల ఫిల్టర్ కేను తో సహా అన్ని తీసేసాను.
***
పండగ కదా, మా వంటామే సాయంత్రం రాకపోవచ్చు, మర్నాడు పొద్దున్నదాకా ఈ ఉత్ఖంట తప్పదు అని వంటగది తలుపు వేసేసి హాల్ లోనే ఉండిపోయా. అదే సమయం లో మా కజిన్ ఫోన్ చేసింది, దసరా శుభాకాంక్షలు చెప్పడానికి. , పిచ్చాపాటి అయ్యాక, దానికి నా బల్లి గొడవ చెప్పెను. అది విని, వాళ్ళింట్లో బల్లి భాగోతం నాకు చెప్పింది.
అది ఓ రోజు క్యారేజ్ బాగ్ దూలపకుండా, ఆ బాగ్ లో క్యారేజీ పెట్టి కొడుక్కిస్తే, అందులో ఉన్న బల్లి తన కొడుకు కార్ నడుపుతున్నప్పుడు బాగ్ లోంచి బయటికొచ్చి ఎంత నరక బాధ పెట్టిందో చెప్పింది.
నాకున్న భయాలకి తోడు ఈ థ్రిల్లర్ స్టోరీ విన్నాక, అది మరింత పెరిగి పెద్దదై వేప చెట్టంత అయి కూర్చుంది. కానీ నాకెలాంటి ఉపశమనం లభించలేదు అలోచించి అలోచించి బాగా అలిసిపోయెను, కాసేపు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుదామని ఇలా వాలాను, మళ్ళీ ఫోన్ మ్రోగింది,
మా పెద్దక్కయ్య ఫోన్ చేసింది, ఉభయకుశలోపరి అయ్యాక, దసరా శుభాకాంక్షలు ఇత్యాదులన్నీ అయేక, నా బల్లి గొడవ చెప్పాను. .
“అదెక్కడికి పోతుంది లేవే, అక్కడే ఎక్కడో నక్కి ఉండి ఉంటుంది, రేప్పొద్దున్న పనివాళ్ళొచ్చి తీసి అవతల పడేస్తారులే, నిశ్చింతగా ఉండు” అని ధైర్యం చెప్పింది నాకు.
అందరూ ఇలాగె అంటున్నారు, కానీ బల్లిని ఇంట్లోంచి బయటికి పంపడం ఎంత కష్టమైన పనో, ఆ బాధ పడ్డవారికే తెలుస్తుంది.
"అదికాదక్కా, విష ప్రాణులు ఇంట్లో ఉండడం ఎంత ప్రమాదమో నీకు తెల్సుగా!”
“పాపం నీకు చిన్నప్పటినించి బల్లంటే చాల భయం, అంత దూరంలో బల్లి కనబడితే చాలు, ఆ వైపుకి వెళ్లేదానివి కాదు నువ్వు. ఆ భయం నీకు ఎందుకంత ఎక్కువైపోయిందంటే, నీకో సంగతి చెప్తాను విను.."
పాపం పండగ పూటా చెల్లెలు డల్ గా ఉండడం చూడలేక, నాకు అవి ఇవి విషయాలు చెప్పి ఉత్సాహ పరచాలనుకున్నట్టుంది మా అక్క.
మా అక్క చెప్పసాగింది..
“నీకు ఎనిమిదేళ్ల వయసులో నీ పుట్టినరోజు నాడు, నిన్ను తీసుకుని, గుడికి వెళ్లి, అటునించి అటే బీచ్ కి వెళ్లి, వస్తూ వస్తూ దారిలో మన అమ్మమ్మగారింటికి భోయినానికి వెళ్లి, అక్కడ భోంచేసి ఇంటికొచ్చేసరికి, రాత్రి ఎనిమిదైపోయింది, నువ్వు బాగా అలిసిపోయి, కొత్త గౌను మార్చుకోకుండానే, అలాగే పడుకుండిపోయేవు.
అది వేసవి కాలం అవడం వలన, అందరమూ దాబా మీద పడుక్కునేవాళ్ళం. అందరం మంచి నిద్దట్లో ఉండగా, నువ్వు నన్ను లేపి, కొత్త గౌను మార్చేయమని, కిత కితలు పెడుతున్నట్టుంది అన్నావు.
కొత్త గౌను కదా, అందులో దారాలు వేలాడుతూ, ఆలా ఉండి ఉంటుందిలే పడుకో, ఇప్పుడు కిందకెళ్ళి మరో గౌను తెచ్చి
మార్చలేనని చెప్పాను.
“ఉదయం లేచి గౌను మారుస్తుంటే, నా వీపుమీద సొమ్మసిల్లిన ఓ చిన్న బల్లి పిల్ల కనిపించిందిట.
బల్లి భాగోతం, తదుపరి పిట్ట కధలూ నన్ను బాగా డిస్టర్బ్ చేసేయి, తల పగిలిపోయేలా తలనొప్పి, వంటామే వస్తుందో లేదో గ్యారంటీ లేదు, ధైర్యం చేసి కిచెన్ లోకేల్లెను, టీ పెట్టి
తెచ్చుకుందామని..
అప్పుడే కాలింగ్ బెల్ మోగింది, అప్పుడు టైం ఐదుంపావు అయ్యింది. ఎవరొచ్చేరబ్బా అని చుస్తే, మా వంటామే వచ్చింది. నాకు సాక్షాత్తు దుర్గాదేవి మా ఇంటి తలుపు
తట్టినంత సంతోషం కలిగింది. ఆ ఆనందంలో తనకి దసరా శుభాకాంక్షలు చెప్పి, వారింటి సభ్యుల క్షేమ సమాచారాలడిగి తెలుసుకున్నాను. తను ఉప్పొంగిపోయింది నా పలకరింపులకి.
ముందుగా ఓ కప్ టీ పెట్టి ఇమ్మని, తర్వాత ఏమేమి పనులు చేయాలి అని వివరించి, “అమ్మా! ఇక్కడ బల్లి ఉంది కనుక, జాగ్రత్తగా చూసుకుంటూ పని చేయమ్మా, ఆ బల్లి ఎందులో పడినా, ప్రమాదం కదా” అని చెప్పాను.
ఊహించని పరిణామం,
“మీరుండండి, నాకు బొద్దింకలకు కొట్టే మందు, చీపురు, చేట త్వరగా ఇవ్వండి, కిచెన్ తలుపేసేసి, మీరు హాల్ లో ఉండండి. నాల్రోజుల్నించి నించి వింటున్నాను మీ నోటి వెంట, ఈ బల్లి భాగోతం, ఇవాళ దాని పని పడతాను” అని రంగం లోకి దూకింది.
ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్య పోయాను, ఎందుకంటే అసలు ఆవిడ వంటకి సంబంధించిన పని తప్ప, ఇహ మిగతా ఏ పనీ చేయదు కాక చేయదు. ఆమె ఈ చర్య కి నేను
అవాక్కయిపోయెను. తను అడిగినవన్నీ ఇచ్చేసి హాల్లోకొచ్చేసాను.
హిట్ స్ప్రే చేసాక, నెమ్మదిగా బయటికి వచ్చింది ఆ మహాతల్లి (మహాతల్లో, మహా తండ్రో తెలీదు ), సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా, దాన్ని చీపురుతో అదిమి పట్టి, చేటలోకి ఎత్తి, బయటికి తీసికెళ్ళి పారేసి వచ్చింది..
ఆ సమయంలో నాకు మా వంటావిడ కనిపించలేదు.. మహిషాసుర మర్దనం చేసిన దుర్గామాత కనిపించింది. ఆవిడలో ఓ వీరమాత కనిపించింది. మహిషాసుర మర్దనం జరిగి, అతని వధ జరిగేక, దసరా పండగ చేసుకుంటారు అందరూను, కానీ నాకు మాత్రం, దసరా పండగ మొదలయ్యింది బల్లిని బయటికి పంపేకనే.
***
ఆ ఆనందం లో, మా వంటావిడని ఓ మంచి టీ పెట్టి ఇమ్మని, ఆ టీ కప్ పట్టుకుని, కూనిరాగం తీసుకుంటూ ఆ శుభవార్త మావారికి చెప్పాలని వెళ్లి "బల్లి బయటికి వెళ్లిపోయిన
విధంబెట్టిదనిన” అని అంతా పూసగుచ్చి, నా టీ కప్పు ఆయనకిచ్చి చీర్స్ అని నా అమితానందాన్ని అయన ముందుంచాను.
“పిచ్చి కనక మహా లక్ష్మీ.. నా లైబ్రరీ లోంచి వంటింటివరకూ ఎందుకొస్తుంది ? నువ్వు వంటింట్లో చూసిన బల్లి, వంటింటి బాల్కనీ లోంచి వచ్చి చేరి ఉంటుంది, దాన్ని వెళ్లగొట్టేవు, కానీ లైబ్రరీ లో బల్లి, పక్క బాల్కనీ లోంచి వచ్చి చేరినట్టుంది” అని చావు కబురు చల్లగా నా చెవిన వేశారు.
"అయితే ఇంట్లో ఇంకా బల్లి తిష్ట వేసుకుని ఉందన్నమాట" అసహనం ఆవహించేసింది నాకు.
"అక్కడికే వస్తున్నా, మొన్న నేను ఎదో పనిమీద లైబ్రరీ లోకెళ్ళినప్పుడు, బల్లి కనిపించింది, వెంటనే పక్కనున్న బాల్కనీ డోర్ తెరిచా, అంతే, అది అతి వేగంగా, బయటికి తుర్రుమంది. ఎంత విష ప్రాణులు అయినా, అవి మనుషుల మధ్య మనలేవోయ్", హాస్యోక్తి విసిరారు మా
శ్రీవారు.
“హమ్మయ్య!!” అని కధ సుఖాంతం అయినందుకు గట్టిగా ఊపిరి తీసుకుని, ఎంతో నిశ్చింత తో అప్పుడు, అయన గుండెలపై వాలిపోయాను.
బల్లులు బయటికి.. భార్యాభర్తలు ఇంట్లోకి..
***
పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత
నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .
నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.
కృతజ్యతలతో
ఉగాది వసంత
Comments