'Gudu Gudu Guncham Gundaragam' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 30/04/2024
'గుడు గుడు గుంచం గుండారాగం' తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ పోలీస్ స్టేషన్ చాలా హడావిడిగా ఉంది.
ఎస్సై నాగేశ్వర్, ముగ్గురు కానిస్టేబుల్స్ తో ఊరి చివర డెడ్ బాడీ ఉన్న స్పాట్ కు వెళ్లాలనే ప్రయత్నంలో కంగారు గా ఉన్నాడు.
అయితే ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానిస్టేబుల్ ‘సప్త సంతోషం’ కంపల్సరిగా అటెండ్ అవ్వవలసిందే. అతను కొంత జీనియస్ అని ఎస్ఐ గారు, సిఐ గారు, మిగతా డిపార్ట్మెంట్ అంతా కూడా అనుకుంటుంటారు.
ఆ మధ్య 6 నెలల క్రితం రైలు పట్టాల మీద ఉన్న డెడ్ బాడీ హత్యో ఆత్మహత్యో ఖచ్చితంగా చెప్పేయడమే కాకుండా, తన తెలివితేటలతో అర్థగంటలో నేరస్తుడిని పట్టేసుకున్నాడు సప్త సంతోషం. ఆ తర్వాత తర్వాత కూడా అలాగే నేరస్థుడు పలానా అని 10 నిమిషాల్లో చెప్పగలిగాడు.
ఎంక్వయిరీ లేకుండా కేసులన్ని ఒక కొలిక్కి వచ్చేయడంతో డిపార్ట్మెంట్ సంతోషిస్తున్నారు. కానీ క్రెడిట్ అతను కొట్టేస్తున్న భావంతో ఎస్ఐ నాగేశ్వర్ అతని మీద కొంచెం గుర్రుగానే ఉన్నాడు.
''సప్త సంతోషం! మనం ఆ స్పాట్ కి వెళ్దామా'''' ఎస్సై నాగేశ్వర్ అడిగాడు.
''ఓకే సార్ '' సప్త సంతోషం వినయంగా చెప్పాడు.
''ఇదిగో.. కేసు పూర్వపరాలు విచారించకుండానే వాడు నేరస్థుడు అని ఇట్టే పట్టేయగల గ్రహణ శక్తి ఎలా వచ్చిం దయ్యా నీకు. లేదా ఎక్కడి నుండైనా మంత్రాలు కానీ,
చింతకాయలు కానీ, వేరు ముక్కలు కానీ సంపాదించి ఆ పట్టుతో చెప్పేస్తున్నావా.
కర్ణ పిశాచి ఉంది అంటుంటారు. ఆ కర్ణ పిశాచిని నీ అధీనంలో పెట్టుకున్నావా నీ చెవిలో ఆ పిశాచి నువ్వు ప్రశ్న అడిగిన వెంటనే నీకు భయపడి చెప్తుందా. ''
కాస్త కోపం కాస్త వెటకారం మిళితమైనట్టుగా అన్నాడు ఎస్సై నాగేశ్వర్.
వినయంగా చేతులు కట్టుకుని ''అదేం కాదు సార్! జస్ట్ కామన్ సెన్స్ అంతే. '' చెప్పాడు సప్త సంతోషం.
''అంటే మేము కామన్ సెన్స్ కానీ సెన్స్ కానీ లేనటువంటి వాళ్ళమనా నీ ఉద్దేశం''
''తర్వాత మాట్లాడుకోవచ్చు, నడండి సార్. ''
అంతే..
ఎస్ఐ నాగేశ్వర్ ముగ్గురు కానిస్టేబుల్స్ తో ఆ డెడ్ బాడీ ఉన్న స్పాట్ చేరిపోయారు.
''నేను 10 గంటలకు ఇలాగే వచ్చాను సార్, సైకిల్ తొక్కుకుంటా. అప్పుడు ఈ డెడ్ బాడీ లేదు. అంటే రెండు గంటల ముందే ఈ హత్య జరిగి ఉంటుంది సార్. ప్రదేశం పెద్ద మర్రి చెట్లతో, ఊడలతో నిర్మానుష్యంగా ఉంది కదా.. ఎవరికి తను కనపడనని ధైర్యంగా చంపి వెళ్లిపోయి ఉంటాడు. పట్టపగలు ఎంత దారుణం'' శవాన్ని చూస్తూ అన్నాడు సప్త సంతోషం.
''సరే, ఆ దూరంగా నిలబడి ఉన్న జనంలో ఒకలిద్దరిని పిలిచి ఏమైనా తెలుసేమో అడుగు. సాక్ష్యాలు కావాలి కదా. ''.. అన్నాడు ఎస్సై నాగేశ్వర్.
''సాక్ష్యాలు ఎందుకు సార్! కేసు ఐదు నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. ''
'' సస్పెన్స్ లో పెట్టక నీ ఐడియా ఏంటో చెప్పి తగలడు. ''.. కోపంగా అన్నాడు ఎస్సై నాగేశ్వర్.
''అదేంటి సార్ ప్రతిసారి క్రెడిట్ నేనే కొట్టేస్తున్నాను అంటున్నారు కదా. నేను పక్కన ఉంటాను, మీరు చూసుకోండి సార్. '' కొంచెం దూరంగా వెళ్లబోయాడు సప్త సంతోషం.
''ఆగాగు ఇలారా.. నీ పేరులోనే తిరకాసు. ‘సప్తసంతోషం’.. ఏం పేరయ్యా అది. సప్తగిరి అని అయినా పెట్టాలి సంతోషం అని అయినా పెట్టాలి. అందులో ముక్క ఇందులో ముక్క కలిపి తిరకాసు పేరు పెట్టినట్టే నీ ఆలోచన కూడా తిరకాసులో అరకాసుగా ఉన్నట్టు మాట్లాడుతున్నావ్. నువ్వు లేకపోతే కేసు నేను డీల్ చేయలేననా నీ ఉద్దేశం''
''అదేం కాదు సార్! దోషి ఎదురుగా కనపడుతుంటే వాళ్ళందర్నీ పిలిచి అడగడం ఎందుకు అని నా అభిప్రాయం. సరే మీ తృప్తి కోసం ఒకరిని పిలుస్తాను సార్'' అంటూ సప్త సంతోషం దూరంగా ఉన్నవాళ్లలో ఎర్ర చొక్క అతన్ని పిలిచాడు.
''నీ పేరేంటయ్యా''
''మా నాన్న ఎర్రోడు అని పెట్టేటండి. కానీ అందరూ ఎర్రియ్యా అని పిలుస్తారు సార్. నాకు కూడా ఎర్రియ్యా అంటేనే ఇష్టం అండి. '' వెకిలిగా నవ్వుతూ చెప్పాడు ఆ ఎర్ర చొక్కా అతను బుర్ర ఊపుకుంటూ.
''నీ ఇష్టం ఏడ్చినట్టు ఉంది కానీ ఈ హత్య ఎవరు చేశారో నువ్వు చూసావా?' అంటూ అడిగాడు.. కానిస్టేబుల్ సప్త సంతోషం.
''నేను చేయలేదు కానిస్టేబుల్ గారు, నాకేం తెలియదండి. '' భయపడుతూ అన్నాడు ఎర్రయ్య.
''ఇదిగో నువ్వు చూసావా అని అడిగాను కానీ నువ్వు చేసావా అని అడగలేదు కదా.. కంగారు పడుతున్నావంటే నువ్వే చేసావ్ ఏమో అనిపిస్తుంది నాకు. '' అన్నాడు కానిస్టేబుల్ సప్తసంతోషం..
''సరే సార్ నేనే చేశాను. బొక్కలో పడేయండి నన్ను.. అక్కడ కోడిగుడ్లు వేసి భోజనం బాగా పెడుతున్నారట కదా. ''.. ఎక్కిరిస్తూ అన్నాడు ఎర్రియ్య.
''ఓర్నీ ఇలాంటప్పుడు జోకులు ఏమిట్రా నీకు ఏమైనా తెలిస్తే చెప్పు '' అరిచాడు సప్త సంతోషం.
''లేకపోతే ఏమిటి సార్. పోలీసోళ్ళ గురించి నాకు తెలియదా. మా నాన్న.. ఒరేయ్ ఎర్ర చొక్కా ఎర్రియ్యా పోలీసులు ఏ విషయం గురించి అయినా నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా అడిగితే ఏదైనా నువ్వు చూసినప్పటికీ చూడలేదని చెప్పమన్నాడు సార్.. '' మళ్లీ ఇకిలిస్తూ చెప్పి పరుగున వెళ్ళి పోయాడు ఎర్రియ్య.
''అందరూ అంతే సార్ ఎవరు చెప్పరు.. సరే డెడ్ బాడీ చుట్టూరు ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో చూడమంటారా. '' ఎస్సైని అడిగాడు సప్తసంతోషం.
''ప్లాన్ మొదలు పెట్టావు కదా.. ఏం చేస్తాం. నువ్వు చెప్పినట్టే మేము విని తీరాలి. అలా వినకపోతే నీ మాట ఎందుకు వినలేదని సిఐ గారు మా మీద కేకలు పెడతారు. అంత రేంజ్ ఉందన్నమాట నీకు. సరే నీ ప్లాన్ స్టార్ట్ చెయ్. '' ఎస్సై నాగేశ్వర్ కానిస్టేబుల్ సప్తసంతోషాని కి అవకాశం ఇచ్చారు.
సప్త సంతోషం డెడ్ బాడీ చుట్టూరు మూడుసార్లు తిరిగి దోషి తాలుకు ఏదైనా వస్తువులు కనిపిస్తా యేమోనని చూడడం మొదలుపెట్టాడు.
జనం అప్పటికే చాలామంది మూగారు. దూరంగా ముసలి వాళ్లు ఆడవాళ్లు మగవాళ్లు సప్త సంతోషం ప్రయత్నాన్ని, ఆ డెడ్ బాడీని విచిత్రంగా తదేకంగా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు.
డెడ్ బాడీ తాలూకా ఇద్దరూ డెడ్ బాడీ దగ్గరే కూర్చుని ఏడుస్తు న్నారు. వాళ్ళిద్దరూ ఆ డెడ్ బాడీ కి దగ్గర బంధువులు.
ఆ హత్య ఎలా జరిగిందో అడిగాడు సప్త సంతోషం వాళ్ళిద్దరిని కానీ వాళ్ళ ఏడుపు, మాటలు కలిసిపోయి జవాబు దొరకలేదు.
ఈలోగా కేస్ ఫైల్ ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తున్నాడు ఎస్సై నాగేశ్వర్.
జనం హర్రర్ సినిమా చూస్తున్నట్టు పెద్ద గుడ్లతో చూస్తూ ఉండిపోయారు. అక్కడకు కూసంత దూరంలోనే బర్రియల్ గ్రౌండ్ ఉండటంతో పట్టపగలైన నక్కల ఊళలు గట్టిగా వినబడుతున్నాయి. మధ్య మధ్యలో బర్రియల్ గ్రౌండ్ నుండే మనుషుల అరుస్తున్న భయం కర అరుపులు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఆ అరుపులు మనుషులవి కావు.. బర్రియల్ గ్రౌండ్ నేలలో కనపడకుండా దాక్కుని ఉండి డెడ్ బాడీ తినే కబార్ బిజ్జు అనే జాతి జంతువులవి అని అక్కడ ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు.
సప్త సంతోషం మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఏదో ఐడియా వచ్చిన వాడిలా తనలో తాను నవ్వుకుంటు న్నాడు. వెంటనే ఎస్సై దగ్గరకు వచ్చి చెవిలో ఏదో గుసగుసగా చెప్పాడు.
ఎస్సై మాత్రం సప్తసంతోషం ముఖం వైపు పిచ్చివాడిని చూసినట్టు చూశాడు. ఎలాగోలా తగలడు ఏదో ప్రయత్నం చేయి.. అన్నట్టు.
సప్త సంతోషం అటు ఇటు తిరుగుతూ నేల అంతా బాగా పరిశీలించాడు ఆ చుట్టుపక్కల. చివరికి ఏదో అద్భుతం జరిగినట్టు కెవ్వున కేక పెట్టాడు. క్రిందకు వంగి నేల మీద నుండి చొక్కా బటన్ దొరికినట్టు పట్టు కొని పైకి లేచి గట్టిగా ఇలా అన్నాడు.. అరుస్తున్నట్టు.
''సార్ సార్ ఎస్సై గారు హంతకుడు దొరికేశాడు. '' అంటూ అరిచాడు. అలా అరుస్తూనే అతను ఎస్సై గారి వైపు చూడకుండా దూరంగా ఉన్న జనాల్ని నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు.
''సార్ సార్ హంతకుడు షర్టు బటన్ ఒకటి ఊడి ఇక్కడ పడిపోయింది సార్. దీని ఆధారంతో మనము హంతకుడిని పట్టుకోవచ్చు'' అని మళ్లీ అరిచాడు.
ఎస్సై ఏమాత్రం స్పందించలేదు ఎందుకంటే సప్త సంతోషం హంతకుడిని ఈజీగా పట్టుకునే విషయం లో.. అతను కట్టే మోలీలు, టక్కు టమారీలు, డ్రామాలు ఎస్ఐ నాగేశ్వర్ కు బాగా తెలుసు కనుక.
సప్త సంతోషం అలా అంటూనే జనాల్ని మళ్లీ నిశితంగా పరిశీలించి పరుగున వెళ్లి ఒకతన్ని పట్టుకొని గట్టిగా లాక్కొచ్చాడు ఎస్ఐ గారి దగ్గరికి.
''సార్ సార్ ఎస్సై గారు.. వీడే హంతకుడు. మీరు వీడిని స్టేషన్కు తీసుకెళ్లి నిజం తెలుసుకొండి. ఫార్మాలిటీస్ అని మేము పూర్తి చేసుకుని వస్తాం. '' అన్నాడు అతి కంగారుగా.
''ఏమిటి జనాల్లోంచి సడన్గా ఒకడిని పట్టుకొచ్చి వీడే హంతకుడు అంటున్నావు. ఎలా. '' అన్నట్టు చూశాడు ఎస్ఐ నాగేశ్వర్ కానిస్టేబుల్ సప్త సంతోషం వైపు.
''మీకెందుకు సార్ కచ్చితంగా వీడే హత్య చేశాడు. మీకే తెలుస్తుంది తీసుకెళ్లండి '' అంటూ బలవంతంగా అతడ్ని జీప్ ఎక్కించి ఎస్సై గారిని కంగారు పెట్టి ఇద్దరినీ పంపించేసాడు.
పోలీస్ స్టేషన్లో ఎస్సై అతడి నుండి నిజం వెళ్ళగక్కడం కోసం చేసిన ప్రయత్నాల్లో.. నిజం బయట పడిపో యింది.
హత్య చేసిన వ్యక్తి పేరు లక్ష్మణరావు. చుట్టుపక్కల ఫైనాన్స్ వ్యాపారి. డబ్బులు దగ్గర తేడా వచ్చి మాట మాట పెరిగి ఒకతన్ని చంపేశాడు.. అదే ఆ డెడ్ బాడీ
మొత్తానికి అహత్య చేసింది నేనే అని ఏ మాత్రం బలవంతం లేకుండా ఒప్పేసుకున్నాడు.. ఫైనాన్స్ వ్యాపారి లక్ష్మణరావు.
కేసు క్లోజ్ అయిపోయింది.. 30 నిమిషాలలో.
***
మర్నాడు ఎస్ఐ, సీఐ ఇంకా కొందరు పోలీస్ అధికా రులు కూర్చుని కానిస్టేబుల్ సప్త సంతోషాన్ని పిలిచారు.
''సప్త సంతోషం! యు ఆర్ గ్రేట్ కాదనం. కానీ నిన్నటి నుండి ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాం. అసలు వాడే హంతకుడని నీకు ఎలా తెలుసు?'' అంటూ ప్రశ్నించారు.
''చిన్న లాజిక్కు సార్. హత్య జరిగి రెండు గంటలే అయ్యింది కనుక పైగా పగలు కనుక హంతకుడు ఏం జరుగుతుందో పోలీసులు ఎవరి మీద అనుమాన పడుతున్నారో తెలుసుకుందామని అక్కడికి.. అంటే డెడ్ బాడీ ఉన్న జనం మూగి ఉన్న ప్రదేశానికి వచ్చి కొంచెం దూరంగా నిలబడి ఉండే ఉంటాడు.. సదరు నేరస్తుడు.
సరే వాడు టెన్షన్ పడాలంటే మనం ఏం చేయాలి.. నాకు ఐడియా తట్టి ఆ హత్య చేసే సమయంలో వాడి చొక్కా బటన్ ఊడి కింద పడినట్టు నాకు దొరికినట్టు చేతితో బెడ్డముక్కను పట్టుకొని నటిoచాను. దాంతో జనంలో ఎవరు కంగారుపడి తమ షర్ట్ బటన్ సదురు కుంటున్నారు అన్నది పసికట్టాను. హత్య చేసిన వ్యక్తి నిజంగా అక్కడ ఉన్నట్లయితే తన షర్ట్ బటన్ ఊడి పడిపోయిందా అన్నట్టు తన షర్ట్ బటన్స్ వైపు ఆత్రు తగా చూసుకుంటాడు కదా.. అంతే వెంటనే వాడే హంతకుడు మనకు దొరికేసినట్టే.
అలాగే చేశాడు ఆ హంతకుడు. నేను బెడ్డ ముక్కను పైకెత్తి ఇదిగో షర్టు బటన్ అంటూ అక్కడ మూగిన జనం అందరికీ చూపించగానే ఏ ఒక్కరూ తమ చొక్కాలు తడుము
కోలేదు ఒక్క దోషి తప్ప. ఆ హత్య చేసిన అతను అక్కడ ఉండబట్టి అతను కంగారుపడి తన చొక్కా బటన్ ఊడిపోయిందేమోనని తను ఆ హత్య చేస్తున్నప్పుడు నిజంగా తన షర్టు బటన్ ఊడి పోయిందేమోనని బటన్ల వైపు చూసుకుంటూ సదురుకోవడం మొదలు పెట్టాడు. , వెంటనే నాకు దొరికిపోయాడు పట్టేసుకున్నాను. ఎందుకు సార్ ఈ ఎంక్వయిరీలు. ''
అంటూ నవ్వుతూ తను చేసిన ప్రయత్నం అంతా వివరంగా చెప్పేశాడు కానిస్టేబుల్ సప్త సంతోషం.
పోలీస్ అధికారులు అందరూ ఆశ్చర్యపోయారు సప్తసంతోషం విపరీతమైన తెలివితేటలకు. అతడిని అభినందించి అందరూ వెళ్లిపోయారు ఎస్ఐ నాగేశ్వర్ తప్ప.
''సరే మాకు తట్టని ఐడియా నీకు ఎలా వచ్చింది '' అడిగాడు ఆశ్చర్యంగా ఎస్సై.
''ఎందుకు రాదు ఎస్సై గారు ఇదేమైనా గుడు గుడు
గుంచం గుండారాగమా? మహా గొప్ప బ్రహ్మవిద్య కాదు కదా ఏ రంగంలో వారికైనా ఎవరికైనా వృత్తి పట్ల నిబ ద్ధతగా ఉన్నప్పుడు ఆయా రంగాలలో వారికి సంబం ధించిన విషయాలలో తప్పకుండా ఇలాంటి ఆలోచనలు వస్తాయి సార్. '' అన్నాడు ప్రశాంతంగా.
''అదిగో మళ్ళీ ప్రతిసారి నాకే దెబ్బ కొడుతున్నావు. అంటే నాకు వృత్తిపట్ల నిబద్ధత లేదు అని నీ ఉద్దేశం కదూ అన్నాడు'' చిరుకోపంగా ఎస్సై నాగేశ్వర్.
''ఖచ్చితంగా అంతే సార్. లేకుంటే మీ కాలర్ మీద చిన్న బల్లి పిల్ల ఇందాకటనుండి అటు ఇటు తిరుగుతున్న మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మీ దృష్టి ఎక్కడో మీ ఇంటి దగ్గర ఉంది'' అన్నాడు నవ్వుతూ కానిస్టేబుల్ సప్త సంతోషం.
ఎస్సై నాగేశ్వర్ కంగారుగా పైకి లేచి చొక్కా కాలర్ విదిలించాడు. అంతే ఒక బల్లి పిల్ల దుబుక్కున కింద పడి బల్ల క్రింద నుండి పారిపోయింది.
సప్త సంతోషం పుసుక్కున నవ్వుకుంటూ గబుక్కున బయటకు వెళ్లిపోయాడు.
***
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments