#KandarpaMurthy, #కందర్పమూర్తి, #గుండెగుబులు, #GundeGubulu, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
Gunde Gubulu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 29/11/2024
గుండె గుబులు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"బావా, ఎచ్చట నుంచి రాక ఇటకు.. . ఎల్లరున్ సుఖులే కద.. " అని గుమ్మంలో అడుగు పెడుతున్న మిత్రుడు సుబ్బారావును చూడగానే రాగం అందుకున్నాడు
సుందరం మేస్టారు.
"మెల్లిగా పాడరా, మా అక్క వింటే నాకు బడితె పూజ చేస్తుంది "అన్నాడు లోపలికి చూస్తూ సుబ్బారావు.
"ఫర్వాలేదురా, పెరట్లో తులసికోట దగ్గర పూజలో ఉంది. తొందరగా రాదులే"
భరోసా ఇచ్చారు సుందరం మేస్టారు.
అగ్రహారంలో ఉండే సుందరం గారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడం కన్న నాటకాలంటే తెగపిచ్చి. పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాలంటె చెవికోసుకుంటారు.
ఆయనకి తోడుగా సుబ్బారావు మాస్టారు కూడా కుదిరారు.
శలవుల్లో వీలుచిక్కినప్పుడల్లా సుందరం మేస్టారి ఇంటి వద్ద ఆడబోయె నాటక రిహార్సల్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు మిత్రులిద్దరూ. ఎప్పుడూ నాటక పద్యాలు, డైలాగులతో పరాచికాలాడుకుంటారు.
సుందరం మేస్టారి భార్య కామాక్షమ్మకు పూజలు దేవుడు అంటే భక్తి ఎక్కువ. ఆవిడ పూజా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు సుందరం గారు మిత్రులతో నాటక రిహార్సల్స్ చేస్తు విసుగు కలిగించి ఆవిడ నోటి తిట్లకు పాత్రులవుతుంటారు.
ఐనా సుందరం మాస్టారు తన ధోరణి తనదే. చివరికి ఆవిడే విసుగెత్తి మాస్టారి దారి కొచ్చింది.
సుందరం మేస్టారుకి విద్యార్థి దశ నుంచి పౌరాణిక, జానపద సామాజిక నాటకాలు చూడటం అలవాటైంది.
శ్రీ కృష్ణ రాయభారం, గయోపాఖ్యానం, పాండవ విజయాలు, సత్యహరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం, శ్రీ కృష్ణ తులాభారం, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం,
రక్తకన్నీరు, రంగూన్ రౌడి ఇలా అన్ని రకాల నాటకాలు చూసేవారు.
కొత్త రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, బందా కనకలింగేశ్వరరావు, పి. సూరిబాబు, షన్ముఖ ఆంజనేయరాజు, గుడిమెట్ల సుబ్బారావు, టేకు కనకం
వంటి అలనాటి స్టేజి ఆర్టిస్టుల ప్రోగ్రాములుంటె వెళ్లవల్సిందే.
అలా చదువుకునే రోజుల్నుంచి మొదలైన నాటకాల పిచ్చి ఎలిమంటరీ టీచర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఎక్కువైంది. వీలుచిక్కినప్పుడల్లా పరిషత్ నాటకాల్లో పాల్గొని తనలోని కళాతృష్ణను బహిర్గతం చేస్తుంటారు. నాటక పరిషత్తుల్లో తనకొచ్చిన బహుమతి కప్పుల్ని గర్వంగా భార్యకు చూపెడుతుంటారు ఆయన.
తండ్రి వారసత్వం నుంచి వచ్చిన పాత బాక్స్ రేడియోలో ఆదివారం ఆకాశవాణిలో వచ్చే తెలుగు నాటకాలు అందులో తన నాటకం ఉంటే ఎన్ని పనులున్నా కామాక్షమ్మను
పూర్తిగా వినేవరకూ కదలనివ్వరు.
ఇలా అప్పట్లో తెలుగు రేడియో కార్యక్రమాలు వినడం అలవాటైంది ఆవిడకు.. ప్రమోషన్ మీద సుందరం మాస్టారికి పట్నానికి ఉధ్యోగ బదిలీ జరిగింది. పెళ్లైన చాలాకాలం వరకూ వారికి పిల్లలు పుట్టలేదు. ఉన్న ఏకైక పుత్ర రత్నం కామేశాన్ని
అక్కడే చదివిస్తున్నారు.
క్రమంగా నలుపు తెలుపు టెలివిజన్లు అందుబాటులో కొచ్చి రేడియో ప్రాధాన్యత తగ్గింది. ఆదివారం సినిమా చిత్రలహరి పాటలు తెలుగు టీవీ సీరియల్స్ చూడ్డం మొదలైంది కామాక్షమ్మ గారికి.
మెల్లగా బ్లాక్ ఎండ్ వైట్ టీవీలకు బదులు కలర్ టీవీలు రావడం అనేక చానెల్సులో రకరకాల కార్యక్రమాలు మొదలయ్యాయి.. నలుపు తెలుపు టీవీలప్పుడు నల్లగా ఉండే కామాక్షమ్మ గారి జుత్తు నలుపు రంగు నుంచి కలర్ టీవీలు అందుబాటులో కొచ్చేసరికి నెరవడం మొదలైంది.
రోజూ టీవీలలో అవే పాత సినిమాలు చూసి చూసి జనానికి విసుగు పుట్టడంతో మార్పుగా కుటుంబ పౌరాణిక జానపద కథలతో తెలుగులో సీరియల్స్ మొదలయాయి.
ఉద్యోగ భాద్యతలతో సుందరం మాస్టారికి నాటకాల మీద మోజు తగ్గితే ఇప్పుడు కామాక్షమ్మకు తెలుగు టీవీ సీరియల్స్ పిచ్చి పట్టింది. కొన్ని పేరున్న తెలుగు టీవీ చానల్సులో
వచ్చే కుటుంబ కథా సీరియల్స్ చూడటం అలవాటైంది. ఆవిడ ఇష్ట పడే తెలుగు సీరియల్స్ వస్తున్నాయంటే ఆ సమయానికి ఎంత పనున్నా వెనక్కి పెట్టి మరీ టీవీ దగ్గర కొచ్చి ధ్యానంగా చూస్తుంది.
చూసే సీరియల్లో ఏడుపు సీను ఉంటే ఆవిడకు తెలియకుండానే కళ్లంట నీళ్ళు బయట పడతాయి. కొన్ని సీరియల్స్ లో తెలుగింటి సినీ ఆరళ్ల అత్త సూర్యకాంతం
వంటి అత్త పాత్ర వస్తే నోటికొచ్చిన శాపనార్థాలు మొదలెడుతుంది.
మోడరన్ కోడలు పాత్ర వస్తే "ఇదేనా నీకు మీ అమ్మ నేర్పింది" అని తిట్ల పురాణం అందుకుంటుంది. పక్కన ఎవరున్నా పట్టించుకోకుండా సీరియల్లో లీనమైపోతుంది.
సుందరం మాస్టారు కామాక్షమ్మ సీరియల్ పిచ్చికి నవ్వు కుంటూంటారు.
టీవీల్లో ఎన్నో నెలలు, కొన్ని సంవత్సరాలు నుంచి వస్తున్న తెలుగు సీరియల్స్ ఓపికగా చూస్తుంది. ఒకవేళ పవర్ లేకో మరే కారణం వల్లో సీరియల్ ఒక ఎపిసోడ్ మిస్సైతే
ఆడపడుచుకో మరెవరికైనా ఫోన్ చేసి ఏం జరిగింది తెలుసుకుంటేనే కాని ఆవిడకు నిద్ర పట్టదు.
ఇలా ఆనందంగా తెలుగు టీవీ సీరియల్స్ తో కాలక్షేపం జరుగుతుండగా అనుకోకుండా కరోనా వైరస్ దేశమంతా వ్యాపించి టీవీల్లో ధారావాహికంగా నడుస్తున్న సీరియళ్లకు బ్రేక్ పడింది. లాక్ డౌన్ కారణంగా షూటింగులు జరక్క సీరియళ్లు టీవీల్లో ప్రసారం కావడం లేదు.
రోజూ టీవీల్లో క్రమం తప్పకుండా సీరియల్స్ లో తరవాతి భాగం కోసం ఎదురు చూసే కామాక్షమ్మ లాంటి వారికి పిచ్చెక్కినట్టవుతోంది. ఇంట్లో ఏ పని మీదా ధ్యాస పెట్టలేకపోతోంది. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం సీరియల్
షూటింగులకు అనుమతి ఇవ్వడం లేదు.
టీవీ వార్తల్లో తెలుగు సీరియల్ షూటింగులకు ఎప్పుడు అనుమతి ఇస్తారా అని ఆసక్తిగా వినేది. టీవీ సీరియల్స్ షూటింగులకు అంతరాయం కల్గించిన కరోనా రోగం, దాన్ని ప్రపంచ దేశాల మీదకు వదిలిన చైనా దేశంలోని ఊహాన్
పట్టణ ప్రజల్నీ రోజూ నోటి కొచ్చిన తిట్ల దండకం మొదలెడుతుంది.
సుందరం మాస్టారు హెడ్ మాస్టర్ గా రిటైరై సాహిత్య రచనలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్నారు.
కొడుకును గ్రాడ్యుయేషన్ చేయించి బి. ఎడ్ పూర్తయిన తర్వాత కాన్వెంట్ స్కూల్లో టీచర్ గా జాబ్ లో సెటిల్ చేసారు. పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.
ఇంతలో కామాక్షమ్మకు ఆయాసం, వంట్లో నలతగా ఉందంటే జనరల్ ఫిజీషియన్ని సంప్రదిస్తే పరీక్ష చేసి కార్డియాలజిస్టుకి రిఫర్ చేసారు. కార్డియాలజిస్టు ఇసిజి ఏంజియోగ్రామ్ టెస్టుల అనంతరం గుండె కవాటంలో అడ్డంకులు ఉన్నాయని పరిస్థితులు అనుకూలించి బైపాస్ సర్జరీ చేస్తే ఆవిడ ఆరోగ్యం కుదుట పడుతుందని నమ్మకం కలిగించారు.
డాక్టరు గారి ప్రిక్రిప్సన్ ప్రకారం గుండె జబ్బుకి మందులు వాడుతున్నప్పటికీ కామాక్షమ్మ దిగులుగా ఉండటం చూసి కొడుకు కామేశం "అమ్మా! ఎందుకే దిగులు? డాక్టరు గారు
నీ గుండెకి ఆపరేషను జరిగితే ఇదివరకటిలా ఆరోగ్యంగా ఉంటావు" అని ధైర్యం చెప్పేడు.
"అందుకు కాదురా, నా బాధ. టీవీలో నీ ఉపనయనం నాడు ప్రారంభమైన తెలుగు సీరియల్ "వంశ వృక్షం" చివరి వరకూ చూస్తానో లేదోనని బెంగగా ఉంది. " అని తన మనసులోని బాధ బయట పెట్టింది కామాక్షమ్మ.
తల్లి మాటలు విన్న కొడుకు కామేశం, న్యూస్ పేపర్ చదువుతున్న సుందరం మాస్టారు ఆవిడ టీవీ సీరియల్స్ పిచ్చికి అవాక్కయారు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
మీ కథ "గుండె గుబులు" చాలా చక్కగా ఉంది. ఇది ఒక వయస్సులోని వ్యక్తుల జీవితాలను హాస్యంతో, భావోద్వేగాలతో కూడిన రీతిలో ప్రతిబింబించింది. సుందరం మేస్టారు, కామాక్షమ్మ గారుల మధ్య చిన్న సంఘటనలు మన కుటుంబంలో జరిగే విషయాలను గుర్తు చేస్తాయి.
ఈ కథలో భిన్న తరాల అభిరుచులు, టీవీ సీరియల్స్ పట్ల కామాక్షమ్మ గారి మోజు, గుండె సంబంధిత చికిత్స సమయంలో వారి భావోద్వేగాలు చాలా బాగా వ్యక్తీకరించబడ్డాయి. అలాగే, లాక్‌డౌన్ సమయంలో సీరియల్స్ రాక ప్రేక్షకులకు కలిగిన అసహనాన్ని హాస్యంతో జోడించి చూపించారు, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.
కథలోనూ వారి సరదా, హాస్యభరితమైన కథనం పాఠకులను ఆకర్షిస్తుంది. అలాగే, వారి పాత్రల అభిప్రాయాలు, ఆచారాలు ప్రస్తుతకాల జీవితాలకు అన్వయిస్తాయి.