top of page
Writer's pictureYasoda Pulugurtha

గుప్పెడంత మనసు

#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #GuppedanthaManasu

, #గుప్పెడంతమనసు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


'Guppedantha Manasu' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 24/10/2024

'గుప్పెడంత మనసు' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



"అదేమిటి దివా, మీ నాన్నగారు పోయారని ఫోన్ వచ్చినా అలా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయావేమిటీ, మీ అమ్మగారిని ఓదార్చడానికైనా మనం వెళ్లి రావాలి" అంటున్న రేవతి మాటలకు వాస్తవానికి వచ్చాడు దివాకర్. 


నాన్న పోయినందుకు ఎందుకో తనకు దుఖం కలగడం లేదు. తనకు జన్మనిచ్చిన తండ్రే. కానీ ఏ నాడైనా తనను ప్రేమగా చూసాడా? ఎంత గుర్తు చేసుకున్నా ఒక్క సంఘటన కూడా తనకు గుర్తుకు రావడం లేదు. తల్లిదండ్రులతో గడిపిన మధురమైన జ్నాపకాలు ఎంత వయస్సు వచ్చినా మనసులోనుండి దూరం కావు. కానీ తను ఈ విషయంలో చాలా దురదృష్టవంతుడు. 


అమ్మ అంటే తనకి చాలా ఇష్టం. నాన్న అమ్మను ఏనాడూ ఒక మనిషిగా చూడలేదు. తనకు బాగా ఊహ వచ్చాక అమ్మను నాన్న ఎంత హింస పెడుతున్నాడో తెలిసి వచ్చింది. బామ్మ అమ్మను ఎన్ని కష్టాలు పెట్టిందో తనకు తెలియదా? నాన్న ఎదుట అమ్మ నవ్వకూడదు. ఆకలేస్తే తినడానికి కూడా నాన్న అనుమతి కావాలి. ఒక రోజు ఆకలేస్తోందని అమ్మ కంచంలో అన్నం పెట్టుకుని తినబోతుంటే "నీ మొగుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడు పోయాకా హాయిగా మెక్కుదువుగానిలే" అంటూ కంచాన్ని విసిరికొట్టాడు. పోనీ బామ్మ అయినా అమ్మను వెనకేసుకు వచ్చిందా అంటే అదీ లేదు. 


"బుధ్దుందటే కమలా, మొగుడికి పెట్టకుండా నీవు తినడమేమిటి, నీవే ఈ ఇంటికి దరిద్రంలా వచ్చావనుకుంటే అది చాలదన్నట్లు మరొక దరిద్రమా" అంటూ ఒకటే చివాట్లు. 

 

పొద్దుటి నుంచీ నానా హైరానా పడి నుడుము విరిగేలా వంటా ఇతర చాకిరీ చేసేది ఇంటి ఆడవాళ్లే అయినా, భోజనాలు మాత్రం “ముందు మగవాళ్ళకి”. తను ఇవన్నీ చూస్తూ పెరిగాడు. తను పెద్దయి, ఉద్యోగం వచ్చి బాగా స్తిరపడిన వెంటనే ఎలాగైనా అమ్మను ఆ నరక కూపం నుండి బయటకు తెచ్చి తన దగ్గరే పెట్టుకుని అమ్మను బాగా చూసుకోవాలని మనసులో దృఢంగా సంకల్పించుకున్నాడు. 


తను చదువు పూర్తిచేసుకుని మంచి ఉద్యోగం రాగానే అమ్మను తనతో వచ్చేయమన్నాడు. నాన్నను విడిచి పెట్టి రాలేనంది. నాన్న అమ్మను మానసికంగా ఎంత హింసిస్తున్నా నాన్న పట్ల అమ్మ చూపించే ఆరాటం తనకు చాలా చిరాగ్గా అసహనంగా ఉండేది. నాన్న ఒక్క పని సొంతంగా చేసుకోలేడు. స్నానానికి తువ్వాలు అమ్మే అందివ్వాలి, మంచినీళ్లు కావాలన్నా లేచి తాగడు. అమ్మ ఎంత పనిలో ఉన్నా తెచ్చీ ఇవ్వాలసిందే. 


ఎక్కడికైనా బంధువుల ఇళ్లకు వెళ్ళినా ఆవిడ ఆయన్ని కనిపెట్టుకునే ఉండాలి. ఎప్పుడైనా పొరపాటున ఆయన్ని పట్టించుకోపోతే ఉన్న ఫళాన ఎంత రాత్రైనా సరే అమ్మను లేవదీసుకుని వచ్చేసేవాడు. 

 

తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని ఒకసారి వచ్చి చూసుకుని వెళ్లమని తన తండ్రి కబురు పెట్టినపుడు తను వెళ్లలేదు. 


తన కొలిగ్ అయిన రేవతి ని ప్రేమించానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పినపుడు నాన్న తన మీదవిరుచుకు పడ్డాడు. తండ్రిగా తన మాటకు విలువనివ్వడంలేదంటూ నీవు నా కొడుకువే కాదు, నీవు నా దృష్టిలో చచ్చినట్లు లెక్క అంటూ శాపనార్ధాలు పెట్టాడు. అయినా తను రేవతిని పెళ్లి చేసుకుని కన్నవారికి దూరమయ్యాడు. బామ్మ పోయిందన్న సంగతి తనకు ఎప్పుడో తెలిసింది. అప్పట్లో నాన్న, బామ్మ తనని తిట్టిన తిట్లు, శాపనార్థాలు తను ఇంకా మరచిపోలేదు. 


అమ్మ కోసం ఊరు వెళ్లి అమ్మను శాశ్వతంగా తనింటికి తెచ్చేసుకున్నాడు. 


అమ్మ కళ్లల్లో ఆనందం. రేవతీ, తనూ అమ్మను ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టారు. 


రేవతి అత్తగారిని అగ్గగ్గలాడుతూ చూసుకోవడం మొదలుపెట్టింది. పొద్దుటే లేచి ఇంటిపని, వంటపని అంతా పూర్తి చేసుకుని అయిదేళ్ల కూతురిని తయారు చేసి స్కూల్ కి పంపాకా తనూ, దివాకర్ కలసి స్కూటర్ మీద ఆఫీస్ కు వెళ్లిపోతారు. 


కమలమ్మకి కొడుకు ఇంటికి వచ్చినప్పటినుండి ఎంతో హాయిగా ఉంది. కొడుకూ, కోడలూ చూపించే ఆదరణలో తనేదో అందలం ఎక్కినట్లు, మహారాణిలా అనుభూతి చెందింది. ఆమె ప్రవర్తనలో క్రమేపీ ఏదో మార్పు కనబడుతోంది. వీరింటికి వచ్చిన మొదటి రోజున ఎంతో ప్రేమగా రేవతిని దగ్గరకు తీసుకున్న ఆవిడకు ఇప్పుడు కోడలిని చూస్తుంటే ఏదో ఒకలాంటి అసూయ ఆమె మనసులో చోటుచేసుకోవడం ప్రారంభించసాగింది. దివాకర్ రేవతిని అపురూపంగా చూడడం అదీ గమనించిన ఆవిడకు మనస్సులో అగ్ని రగలసాగింది. 


కొడుకు రోజూ పొద్దుటే లేచి వంటింట్లో రేవతి కి వంటలో సహాయం చేయడం, కూతురికి స్నానం చేయించి స్కూల్ డ్రస్ వేయడం, టిఫిన్ బాక్స్ లు సర్దడం లాంటి పనులను చేయడం గమనించింది. ఒక్కోసారి భార్యకు అలసటగా ఉందంటే తనే వంట చేసి కంచంలో అన్నం పెట్టి కోడలికి తినిపించడం అదీ గమనించిందు కమలమ్మ. 


ఒకరోజు అనేసింది "ఒరే దివా ఆడంగిలా అన్ని పనులూ నీవే చేయడమేమిటిరా, రేవతి చేసుకోలేదా” అంటూ!


"అమ్మా, నీ కోడలు కూడా నాతో సమానంగా కష్టపడుతోంది. పైగా మా అమ్మాయి పుట్టిన సంవత్సరానికి తనకి గర్భసంచీలో ఏదో సమస్య వచ్చి గర్భసంచీ తీసేసారు. అప్పటినుండీ చాలా నీరసించిపోయింది. బరువు పనులూ అవీ చేయకూడదన్నారు. నేను సహాయం చేయకపోతే ఎవరు చేస్తారమ్మా"?


"అంతగా ఆరోగ్యం బాగోపోతే ఉద్యోగం మానేయమనరా. అంతేగానీ నీవు ఆడంగిలా అంట్లు తోముతూ, వంటచేస్తూ నీ భార్యకు మురిపంగా తినిపించడం ఏమిటిరా? పెళ్లాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆరోజే మేము చూపించిన అమ్మాయిని చేసుకుని ఉంటే నీకిన్ని తిప్పలుండేవి కావు. ఇలా రోగిస్టిదానితో సంసారం చేసే బాధా ఉండేది కాదు". 


తల్లి మాటలకు విస్తుపోయాడు దివాకర్. "అమ్మేనా ఈ మాటలంటోంది"! అష్టకష్టాలు అనుభవించిన అమ్మను తను సుఖపెట్టాలనుకున్నాడు. అమ్మ మనస్సు లో ఇన్ని వికృతమైన ఆలోచనలా! 


రాయిలా నిలబడిపోయిన దివాకర్ భుజాన్ని రేవతి ఆప్యాయంగా స్పృశిస్తూ "దివా, బాధ పడకు. ఇన్నాళ్లూ ఆవిడ గడిపిన జీవితం వేరు. అదే జీవతమనే భ్రమలో ఉన్నారు. ప్రేమ, ఆదరణ అనేవి ఇచ్చిపుచ్చుకునేవి. ఆవిడ స్వభావం స్వతహాగా మంచిదే కదా. ఆవిడలో మార్పు తప్పకుండా వస్తుంది. నా మీద భరోసా ఉం”చంటూ భర్త కళ్లల్లోకి అనురాగంగా చూస్తూ చెప్పింది. 


ఆ రోజు ఆదివారం. దివాకర్ ఇంకా లేవలేదు. వంటింట్లో నుండి రేవతి "అత్తయ్యా ఒకసారి ఇలా వస్తారూ" అంటూ పిలిచింది. 


ఎందుకోననుకుంటూ కమలమ్మ లోపలకు వెళ్లింది. తోటకూర తరుగుతోంది రేవతి. "అత్తయ్యా మీరు తోటకూర పులుసు బ్రహ్మాండంగా చేస్తారని మీ అబ్బాయి చెపుతూ ఉంటారు. నిన్న ఆఫీస్ నుండి వస్తూ మార్కెట్ లో ఫ్రెష్ గా తోటకూర కనిపిస్తే రేపు పులుసు చేసుకుందాం అంటూ కొన్నారు మీ అబ్బాయి. నేను చేసినా ఎన్నోసార్లు మా అమ్మ చేసినట్లుగా లేదంటారు". 


రేవతి మాట్లాడిన చివరి మాటలు కమలమ్మ హృదయం మీద పన్నీటి జల్లులు కురిపించాయి. భర్త బ్రతికుండగా ఏనాడూ తన వంటలను మెచ్చుకోలేదు. పైగా ఏదోరకంగా తనను చిన్నబుచ్చాలని ఏమిటీకూర ఇలా తగలబడింది, నీ ముఖంలాగే ఏడిసిందంటూ తన అత్తగారి ఎదురుగానే తనను దెప్పేవాడు. 


"ఈరోజు పులుసు మీరు చేస్తారా అత్తయ్యా" అన్న ప్రశ్నకు ఉలిక్కిపడుతూ వాస్తవంలోకి వచ్చింది. 


"చేస్తాను రేవతీ, ఇంకా కూర ఏమి చేయమంటావ్, దివా కి దొండకూయ వేపుడంటే ప్రాణం అనుకో". 


"అలాగే చేయండి అత్తయ్యా, దొండకాయలు కూడా కొన్నాం నిన్న. తరిగి ఇస్తాను. పాపాయి నవీన కు కూడా దొండకాయ వేపుడు ఇష్టమే. దానికన్నీ వాళ్ల నాన్న పోలికలే” అంటూ నవ్వింది. 


ఆవిడ వంట చేస్తుంటే పక్కనే నిలబడి ఎన్నో కబుర్లు చెప్పింది. నిన్న లంచ్ లో తన ఫ్రెండ్ సుజాత టమేటో ఊరగాయ తెచ్చి తనకు రుచి చూడమని వేసిందని, వాళ్ల అత్తగారు పచ్చళ్లు అవీ చాలా బాగా పెడతారని చెప్పింది. నేనూ చెప్పాను, మీ గురించి, మీరూ వంటలు చాలా బాగా చేస్తారని. నాకు మీరు నేర్పాలి అత్తయ్యా అంటూ గారంగా అడిగేసరికి ఆవిడ మనస్సు లో రేవతి పట్ల ఒకలాంటి ఆత్మీయతా భావం చోటుచేసుకుంది. 


ఆ రోజు మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ చుట్టూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. కమలమ్మ కూడా వారి మధ్యలో కూర్చుంది. 


"అమ్మా తోటకూర పులుసు అదిరి పోయింది". 


 "అవునత్తయ్యా ఆవ పెట్టారేమో, ఆవ ఘాటు భలే ఉంది". 


"బామ్మా దొండకాయ వేపుడు యమ్మీ, యమ్మీ అంటే తెలుసా, సూపర్ అంటా”రంటూ బొటనవేలు ఎత్తి చూపించేసరికి అక్కడంతా నవ్వులు పండాయి. 


కమలమ్మకి ఇక్కడ పరిస్తితి ఎంతో ఆశ్చర్యంగానూ వింతంగా ఉంటోంది. భర్తతో ఉన్నప్పుడు అందరూ భోజనం చేసాకనే తను ఒక్కర్తీ వంటింట్లో కింద కూర్చుని భోజనం చేసేది. తిన్నావా, లేదా అని ఎవరూ తనని అడిగేవారు కాదు. ఇక్కడ అలా కాదు. అందరూ కలసి భోజనం చేస్తారు. 


దివాకర్ ఆఫీస్ నుండి రాగానే "అమ్మా లంచ్ చేసావా, బోర్ కొట్టడం లేదు కదా" అంటూ దగ్గర కూర్చుని మరీ పరామర్శిస్తాడు. 


రేవతి అయితే "అత్తయ్యా కాఫీ తాగారా, కలిపి ఇవ్వమంటారా" అంటూ అడుగుతుంది. 


మీ చీరలన్నీ డల్ గా ఉన్నాయంటూ తనను బట్టల షాపు కి తీసుకెళ్లీ మరీ మంచి చీరలు కొంది రేవతి. భర్త బ్రతికి ఉండగా ఏనాడూ తనని సరదాగా బయటకు తీసుకెళ్లి చీరలు కొనేవాడు కాదు. ఆయనకు నచ్చినవే కొని తెచ్చేవాడు. బరువుగా, గాడీగా ఉండేవి చీరలన్నీ. 


ఒకరోజు సడన్ గా "అత్తయ్యా బయలదేరం”డంటూ తనని తొందరచేసి పక్క వీధిలోనే ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లి ఒకావిడను పరిచయం చేస్తూ “మా అత్తయ్య కమలగారు ఆంటీ. సంగీతం అంటే ప్రాణం. చిన్నతనంలో నేర్చుకుని ఆ తరువాత సాధన లేక వదిలేసారు. రేపటినుండి మీ క్లాస్ లకు వస్తా”రని చెప్పేసరికి తను తెల్లబోయింది. 


నిజానికి తనకు సంగీతం అంటే ప్రాణం. తన తల్లితండ్రులు తన చిన్నతనంలో నేర్పించారు. తన గాత్రం ఎంతో బాగుంటుందని అందరూ అంటారు. కానీ పెళ్లైనాకా తన ఇష్టాలను, అభిరుచులను తొక్కి పడేసాడు తన భర్త. 


 "ఏమిటమ్మా, ఇప్పుడు ఈ వయస్సులో నన్ను సంగీతం నేర్చుకోమనడం ఏమైనా బాగుందా రేవతీ" అంటే, "ఎందుకు బాగుండదు అత్తయ్యా, మనకు నచ్చిన విద్యను నేర్చుకోడానికి వయస్సుతో సంబంధం లే”దని కొట్టిపడేసింది. 


ఎంత మంచి పిల్ల రేవతి. మొదట్లో ఎందుకో రేవతిని చూడగానే కొడుకును తన కొంగుకి కట్టేసుకుని వాడిచేత అడ్డమైన చాకిరీ చేయిస్తోందని తప్పుగా ఊహించుకుంది. వాళ్ల అన్యోన్య దాంపత్యాన్ని చూసి అసూయపడింది. అత్తరికం చెలాయించాలని అనుకుంది. కానీ తన అంతరాత్మ ‘ఏమిటిది కమలా, నీవు కూడా నీ అత్త లాగనే నీ కోడలిని బాధపెట్టాలని అనుకుంటున్నావా? తప్పుకదూ, రేవతి లాంటి కోడలు దొరకడం నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని కాపాడుకుంటావో, కాలదన్నుకుంటావో నీ ఇష్టం’ అంటూ హెచ్చరించేసరికి పశ్చాత్తాపంతో తలొంచుకుంది. 


సంస్కారహీనుల మధ్య జీవించి తన మనసు కలుషితమై పోయింది. అందుకే అలాగ వక్రంగా ఆలోచించింది. చరిత్ర పునరావృతం కాకుండా తనను తను నిలబెట్టుకుంది. ఆమె కళ్లు తడి అయ్యాయి. స్వఛ్చనమైన మనష్యులు, వారి ప్రేమ, ఆదరణ లో తన మనసు ఇప్పుడు పునీతమైంది. ఈ శేష జీవితానికి ఈ అదృష్టం చాలనుకుంటూ ఆనందపడింది. 


కాలం ఎవరికోసం ఆగదంటూ తన పనిని తాను చేసుకుపోతోంది. ఒకరోజు సాయంత్రం రేవతీ, దివాకర్ ఆఫీస్ నుండి వచ్చేసరికి దేవుని గదిలోనుండి మంద్రమైన స్వరంతో త్యాగరాజు కీర్తన "నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి నన్ను బ్రోవగ రాద? శ్రీరఘువర” ఆలపిస్తోంది కమలమ్మ. 


ఆమె గొంతుకలో నుండి అద్భుతమైన మాధుర్యం జాలువారుతోంది. ఆ సంధ్యాసమయంలో కమలమ్మ ఆలపిస్తున్న కీర్తన ఈ సృష్టికే జీవం పోస్తున్నట్లుగా ఒక అలౌకిక అనుభూతిని కలిగిస్తోంది. 


అత్తగారు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా తమతో కలసిపోతూ ఉండడం రేవతికి అద్భుతంగా అనిపిస్తుంది తలచుకుంటుంటే. మొదట్లో ఆవిడ తనతో అంటీ అంటనట్లు ప్రవర్తించడం, దివాకర్ బాధపడడం చూసి తను ఎంతో ఆవేదన చెందింది. ఆవిడ మనస్తత్వాన్ని అర్ధం చేసుకుంటూ ఆవిడతో ఎంతో సున్నితంగా ప్రవర్తించింది. తను ఆ సమయంలో విచక్షణ కోల్పోయి సంయమనం పాటించి ఉండకపోయి ఉంటే ఇప్పుడు ఉన్న ఇంత చక్కటి వాతారణం కోల్పోయి ఉండేవారం కదా అని అనుకుంటూ ఈ గుప్పెడంత మనసులో ఎన్ని రాగద్వేషాలు చోటు చేసుకుంటాయో, వాటిని అదుపులో పెట్టుకున్నప్పుడే కదా కుటుంబ బంధాలు శాశ్వతంగా నిలుస్తాయి అని తృప్తిగా నిట్టూర్చింది. 


"ఏమిటి రేవతీ, దీర్ఘాలోచనలో ఉండిపోయావు” అన్న దివాకర్ మాటలకు ఈ లోకంలోకి వస్తూ "అత్తయ్య గారు ఎంత బాగా పాడుతున్నారో వింటున్నారా" అనేసరికి దివాకర్ రేవతి వైపు ప్రేమగా చూసాడు, ఇదంతా నీ మూలానే సుమా అన్నట్లుగా. 


***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








48 views0 comments

Comments


bottom of page