#లక్ష్మీనాగేశ్వర రావువేల్పూరి, #LakshminageswaraRaoVelpuri, #గుప్తదానం, #GupthaDanam
'Guptha Danam' - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri
Published In manatelugukathalu.com On 20/10/2024
'గుప్త దానం' తెలుగు కథ
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
“ఏవండీ శ్రీవారు! మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి, మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరు పలకరించడానికి వచ్చి, తమ బాధలు చెప్పుకుంటూ మిమ్మల్ని సహాయం పేరుతో, అప్పులు అడుగుతున్నారు. మీకు మంచి వ్యాపారం, ఆస్తి ఉన్నదన్న ధైర్యం తో మీది మరీ జాలి గుండె, అడిగినదే తడువుగా, చేతికి ఎముక లేనట్లు సాయంచేస్తారు. సహాయం పొంది, మిమ్మల్ని అపర దానకర్ణుడిలా పొగిడి చక్కగా జారుకుంటారు. ఇచ్చిన డబ్బులు వచ్చేనా, చచ్చేనా ? మీకు ఒక కొడుకు కూతురు ఉన్నారని మర్చిపోకండి. మీ దానాల వల్ల నేను నా పిల్లలు అనాధలమై, ఆస్తి అంతా పోయి రోడ్డున పడతాము. అప్పుడు గాని మీకు తెలిసి రాదు. ఇది ఇంకా ఇలా కొనసాగితే, మీకు విడాకులు ఇచ్చి భరణం కింద మొత్తం ఆస్తి రాయించుకుంటాను! ఆ తర్వాత మీరు రోడ్డు మీద పడితే సాయం చేసిన ఏ ఒక్కరు పైసా కూడా మీకు ఇవ్వరు గుర్తుంచుకోండి!” అంటూ కసిగా, కోపంగా భర్త శ్రీనివాసరావు గారి మీద అరిచింది భార్య శ్రీదేవి.
ఈ తిట్లు, శాపనార్థాలు రోజు అలవాటైపోయినా శ్రీనివాసరావు గారు నవ్వుతూ, “పోనీలేవే! మనకున్న దాంట్లో సాయం చేస్తున్నాను. ఒకవేళ నువ్వు అన్నట్టు ఆ పరిస్థితి వస్తే మీకు ముందుగానే నీకు నీ పిల్లలకు అన్యాయం చేయకుండా, నా ఆస్తి రాసిస్తాను కంగారు పడకు!” అంటూ భార్య శ్రీదేవిని సముదాయించారు శ్రీనివాసరావు గారు.
శ్రీనివాస రావు గారు అత్యంత పేరుమోసిన వ్యాపారి. ఎన్నో ఆస్తులు కూడబెట్టి న్యాయబద్ధంగా నడుచుకుంటూ, ఎవరికీ తెలియకుండా 'గుప్త దానాలు' చేస్తూ అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, వికలాంగుల సహాయనిధికి, తరచూ డొనేషన్స్ తన పేరు చెప్పకుండా ఇచ్చేవారు.
భార్య శ్రీదేవి కూడా ఎంతో శ్రద్ధతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ, దానకర్ణుడైన తన భర్త తనను పిల్లలను, ఎక్కడ నిర్లక్ష్యం చేసి, ఆస్తి అంతా పోగొడతాడు అన్న బెంగతో, అతని మీద ఒక కన్ను వేసి ఉంచుతుంది. ‘పనికిరాని దానధర్మాలు చేయొద్దు!’ అంటూ వీలైనంతగా భర్తను కంట్రోల్ చేస్తూ, మొరటుగా కనిపించిన భార్య శ్రీదేవి కూడా అందరి స్త్రీల లాగే తన కుటుంబం మీద స్వార్థ ప్రేమతో, అలా అంటుందే కానీ మంచి గుణవంతురాలు శ్రీదేవి గారు.
ఆ రోజు శనివారం 'ముక్కోటి ఏకాదశి 'ఎంతో పవిత్రమైన రోజు. కనుక కొంచెం దూరంలో 'వెంకటేశ్వర స్వామి 'వారి కోవెలకు తన కారులో బయలుదేరారు శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు. అక్కడ పూజలు చేస్తూ, “స్వామి! నాకు ఎంతో ఐశ్వర్యం ఇచ్చావు, కానీ నేను అందరికి సాయపడలేక పోతున్నాను, కుటుంబ పరిస్థితుల వల్ల. కానీ నువ్వు ఎంతో దయతో నా వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ కావలసినంత ధనాన్ని ఇస్తున్నావు. నేనెలాగైన పోయే లోపల, కనీసం కొన్ని లక్షల మందికి సాయపడాలి. అదే నా కోరిక. అది ఫలించేలా చేయి తండ్రి!!” అంటూ ఎంతో సున్నిత మనస్కుడైన శ్రీనివాస రావు గారు వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకున్నారు.
ఆరోజు దైవ దర్శనం అయిపోయాక, హుండీలో డబ్బులు వేస్తూ, భార్య గుడి ప్రదక్షిణాలు చేస్తూ ఉండడంతో, అక్కడున్న పూజారులను పిలిచి 'నిత్య అన్నదానం పథకం' కింద 10, 000/- రూపాయలు, అక్కడున్న పూజారులందరికీ కొంత ధన సహాయం చేసి, “చూడండి !నాకు ఎటువంటి రసీదులు వద్దు, నా పేరు చెప్పవద్దు, మీరు కూడా నిత్య పూజలు చేస్తూ దక్షిణల మీద ఆధారపడటం, అది సరిపోక, పిల్లల చదువుల కోసం, ఎదిగిన ఆడపిల్లల పెళ్ళి కోసం ఎక్కడ అప్పులు చేయవద్దు, నన్ను నా ఆఫీసులో కలవండి, నా వంతు సహాయం నేను చేస్తాను! అది కూడా రహస్యంగా” అంటూ వారికి నమస్కారం చేసి వెళ్ళిపోతున్న శ్రీనివాస రావు గారిని చూస్తూ, “ఆహా !ఆ కలియుగ వెంకటేశ్వరుడు, ఈయన రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటున్నాడు, ఇతనికి సర్వ విధాల సౌభాగ్యాలు కలగాలని ఆ దేవున్ని మనం ప్రార్థిద్దాం!” అంటూ ఆశీర్వదిస్తూ, ప్రతి నమస్కారాలు చేసారు పూజారులు.
అలాగే భార్య దేవి వచ్చిన తర్వాత గుడి ఆవరణలో, ఉన్న బిచ్చగాళ్లకు, మెట్ల మీద కూర్చున్న ముష్టి వాళ్లకు, ప్రతి ఒక్కరికి పది రూపాయలు చొప్పున నోట్లు ఇవ్వడం చూసిన భార్య శ్రీదేవి, “మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అంత దానం చేస్తున్నారు, అందుకే నేను రూపాయి బిళ్ళలు, రెండు రూపాయల బిళ్ళలు తెచ్చాను, మీరు ఇవ్వకండి. నేను ఇస్తాను, మీరు ఆపండి!” అంటూ కసురుకుంటూ ఉన్న భార్యని, “అలాగే నీ ఇష్టం!” అంటూ మెల్లిగా కారు దగ్గరికి వెళ్ళిపోయారు శ్రీనివాసరావు గారు.
అలాగే ఇంకొక ఉదాహరణ.. శ్రీనివాస్ రావు గారి దాతృత్వానికి నిదర్శనం! అదేమిటంటే 'సంక్రాంతి పండుగ ' రోజు కుటుంబ సభ్యులందరికీ బట్టలు, నగలు కొని, ఇంటికి వెళుతుండగా దారి మధ్యలో ఒక రహదారి పక్కన, ఒక '85 ఏళ్ల వృద్దురాలు' చలికి జ్వరంతో వణుకుతూ, ‘అమ్మా ! అయ్యా’ అంటూ అడుక్కోవడం చూసిన, శ్రీనివాసరావు గారు తన కారుని రోడ్డుసైడికి ఆపి, ఆమెను తదేకంగా చూస్తూ, కళ్ళ నీళ్లు తిరుగుతుండగా “ఉండు, ఇప్పుడే వస్తాను !” అంటూ భార్యకి చెప్పి ఆ వృద్ధ ముదసలి దగ్గరకు వచ్చి, “ఏమ్మా బాగున్నావా!” అంటూ అడిగి చలికి వణుకుతున్న ఆమెను దగ్గరకు తీసుకుని, తను వేసుకున్న కోటు తీసి, ఆమెకు తొడిగి, “బాధపడకు అమ్మ, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు!” అంటూ కొంత డబ్బు కూడా ఇచ్చి, “ఏదైనా హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకో!” అంటూ తన కళ్ళు తుడుచుకుంటూ ఆమె తల మీద రాస్తూ ఉండగా ఆ ఆప్యాయతకి ఆ వృద్ధ మహిళ కూడా ఏడుస్తూ, “బాబు, నువ్వు వెంకన్న బాబు లాగా కనిపిస్తున్నావు!, నువ్వు దేవుడవయ్యా !” అంటూ అతని తల మీద రాసి, 'సుఖ సంతోషాలతో, భార్యా పిల్లలతో కలకాలం సుఖంగా ఉండు బాబు!” అంటూ మనసారా దీవించింది, ఆ బిచ్చగత్తె.
ఇదంతా గమనిస్తున్న భార్య శ్రీదేవి, భర్త ఆ ముష్టి దానికి తన కోటు, డబ్బు ఇచ్చి, ఆమెతో మాట్లాడుతూ ఉండడంతో, విపరీతమైన కోపంతో పరుగు పరుగున వచ్చి, ఆ ముష్టిదాని ఒంటి మీద ఉన్న భర్త కోటును, ఆమె చేతిలో ఉన్న డబ్బును లాక్కొని, “ఏమే ?ఇవాళ రేపు పోయేలా ఉన్నావ్, ఇంకా ఏందుకు నీకు ఈ డబ్బు మీద ఆశ, నా భర్త లాంటి అమాయకుడు కోసమా! చ్చి, మీలాంటి వాళ్ల వల్ల, ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి” అంటూ ఆమె మీద ఒక పది రూపాయల నోటు విసిరి, భర్త చేయి పట్టుకుని కారులోకి తీసుకెళ్లి పోయింది ఆగ్రహంగా.
“అదేమిటే, పాపం! ఆ ముసలి ఆవిడని పిల్లలు వదిలి, అనాధగా రోడ్లమీద అడుక్కునేటట్టు చేశారు, మన వంతు కొంచమైనా జాలితో ఆదుకోవాలి! ఈ మాత్రం సాయం చేయడం తప్పా” అంటూ అంటున్న భర్తను “చాల్లెండి! ఊరుకోండి, ఇక మీ ప్రవర్తనను పిల్లలకు చెప్పి నేనేంటో చూపిస్తాను. అడ్డమైన వాళ్లకి ధన సహాయం చేస్తూ, అపర దానకర్ణుడులా ప్రవర్తించకండి. మీరు సంపాదించిన ఆస్తి, నాది నా పిల్లలది. అంతే.. నేను స్వార్ధపరురాలినే అనుకోండి, పర్వాలేదు! నా కుటుంబం కోసం నేను ఆశిస్తున్నాను, అంతే” అంటూ కోపంగా అరుస్తున్న భార్యను సముదాయిస్తూ,
“పోనీలేవే! డిక్కీలో ఒక పాత చొక్కా చంకల కింద చిరిగిపోయి ఉంది. అదేనా ఇచ్చి వస్తాను కాదనకు, నాకు మనశ్శాంతి ఉండదు, ఆ తర్వాత నీ ఇష్టం!” అంటూ ఆమె వంక చూడకుండానే డిక్కీ తలుపు తెరిచి, ఆ పాతబడిన షర్టును ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి వస్తున్న భర్తను “ఒకసారి ఇలా ఇవ్వండి అది, దానిలో ఏమైనా పెట్టారేమో, చూస్తాను! అంటూ సంచి లాక్కుని ఒకసారి షర్ట్ పైనుంచి చూసి సరే మీ ఇష్టం ఇచ్చి రండి !!” అంటూ సంచిని భర్త మీదకు విసిరేసింది కోపంగా.
శ్రీనివాస రావు గారు ఒక్క నిమిషంలో వస్తాను, అంటూ మళ్ళీ కారు దిగి ఆ బిచ్చగత్తే దగ్గరకు వెళ్లి “క్షమించు అమ్మ!, ఏమీ అనుకోకు, నా భార్య మంచిదే కానీ అపాత్ర దానాలు చేస్తున్నానని తిడుతుంది, అంతే అంతే.. ఇదిగో ఈ చొక్కా వేసుకో!” అంటూ ఆమెకు ఇచ్చి కళ్ళు తుడుచుకుంటూ, తన కారు దగ్గరకు వెళ్లిపోయాడు శ్రీనివాసరావు గారు.
వెళ్ళిపోతున్న శ్రీనివాసరావు గారిని మనసారా ఆశీర్వదిస్తూ, ఆ షర్టు విప్పి చూసిన ఆ ముసలి బిచ్చగత్తె ఆ చొక్కాని వేసుకోబోయి, ఒక్కసారి చేతి మడత విప్పగానే, అందులో నుంచి వచ్చిన ఒక నోట్ల కట్ట చూసి ఆశ్చర్యపోతూ, “ఆహా! పండుగ రోజున మహాప్రభువులు ఆ వెంకటేశ్వర స్వామి నీ రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడయ్య !! ఓ శ్రీనివాస.. నీకు సర్వసుఖములు కలుగుగాక!!” అంటూ మనసారా ఆశీర్వదిస్తూ, ఆనందంతో ఊగిపోయింది ఆ వృద్ధ బిచ్చగత్తె.
అలా శ్రీదేవి నిత్యం దానాల విషయంలో గొడవలు పడుతున్నా, శ్రీనివాస రావు గారు “పోనీలే నా భార్యది ఏమి తప్పు కాదు! తన పిల్లల కోసం కుటుంబం కోసం, ఎన్నో త్యాగాలు చేస్తూ స్త్రీ సహజమైన కుటుంబ స్వార్థం తప్ప మరి ఏమీ కాదు !” అనుకుంటూ భార్యను నొప్పించక, వారికి అన్ని విధాల న్యాయం చేస్తూ కొనసాగారు.
శ్రీనివాస రావు గారు క్రమం తప్పకుండా ఆపదలో ఉన్న వారికి "గుప్త దానాలు" చేస్తూ ఎన్నోవేల కుటుంబాలను ఆదుకున్నారు.
ఎంత ఐశ్వర్యమున్న అహం వీడి, తన పేరు తెలియకుండానే ఎంతోమందికి సహాయపడుతూ ఉన్న శ్రీనివాసరావు గారు ఎంతోమందికి మార్గదర్శకులు.
🙏🙏🙏.
**********************
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Comments