వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Gurubrahma' - New Telugu Story Written By Sujatha Swarna
Published In manatelugukathalu.com On 29/01/2024
'గురుబ్రహ్మ' తెలుగు కథ
రచన: సుజాత స్వర్ణ
"రోజా! తొందరగా రావే! ఆలస్యమవుతోంది" స్కూటీని స్టార్ట్ చేస్తూ కేకేశాను నేను.
"ఇదిగో వస్తున్నా అంత తొందరైతే ఎలా?" అంటూ చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చి బండెక్కింది రోజ.
"ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. రామనాథం మాస్టారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పాను కదా! ఇప్పుడు సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాలయ్యింది. కార్యక్రమం నాలుగు గంటలకే మొదలవుతుందన్నారు. మనం అక్కడికి చేరుకునేసరికి ఎంత సమయమవుతుందో ఏమో!" కంగారుగా అన్నాను నేను.
"సరేలే సుజా! సన్మాన సమయానికి ఉంటే సరిపోతుంది కదా! మాస్టారంటే అంత అభిమానం ఉన్న దానివి ఒక్క పూట బడికి సెలవు పెట్టొచ్చు కదా! పెట్టలేదు. ఇప్పుడేమో హడావిడి చేస్తున్నావు" అంది రోజ.
"కార్యక్రమం సాయంత్రమని, బడి వదలగానే వెళ్ళొచ్చని అనుకున్నా. నువ్వు ఆలస్యం చేస్తావని నేనేమైనా కలకన్నానా?" అన్నాన్నేను కొంచెం ఉక్రోషంతో.
"అబ్బా! సరేలే! తొందరపడకోయ్ సుందరవదనా! నువ్వు కంగారుపడి నీ వాహనాన్ని ఏ భారీ వాహనానికో ముద్దు పెట్టావనుకో!.. సన్మానానికి ఏమో గానీ.. పైకి పోతాం" ఆకాశం వైపు వేలు చూపుతూ నవ్వుతూ అంది రోజా.
ఆ మాటలకు కాసేపు ఇద్దరం నవ్వుకున్నాం. ఏ కాస్త సమయం దొరికినా తన హాస్యవల్లరితో ఎదుటి వారిని రంజింపజేస్తుంది రోజ.
రోజ నా సహాధ్యాయిని. మేము సీతానగరం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాము. ఇంచుమించు ఇద్దరం ఒకే వయసు వారం కావడం వల్ల మా మధ్య స్నేహం త్వరగా చిగురించింది. మండలంలో ఏ సమావేశం జరిగినా, ఏ కార్యక్రమానికైనా ఇద్దరం కలిసే వెళ్తాం. మమ్మల్ని అందరూ 'జంట కవులు' అని సంబోధిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మాకు వీలుపడక ఒక్కరమే కనబడితే, ''ఏంటండీ ఈరోజు జంట కవులలో ఒకరు తగ్గారే?' అంటారందరూ.
రామనాథం మాస్టారు నా గురువుగారు. నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఆయన కృషి చాలా ఉంది. ఆయన మాకు గణితం బోధించే వారు. అన్ని సబ్జెక్టుల్లో ప్రథమంలో ఉండే నాకు, గణితమంటే గుండెపట్టుకునేది. ఆ విషయాన్ని గుర్తించిన మాస్టారు, మా నాన్నతో మాట్లాడి నన్ను సెలవు రోజుల్లో వారింటికి పిలిపించి, అర్థం కాని లెక్కలను అర్థమయ్యేలా చెప్పేవారు. అలా నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో నేను పదవ తరగతి గట్టెక్కగలిగాను. ఆ తర్వాత పై చదువులు చదివి నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కూడా ఆయనే సలహాలు ఇచ్చారు. అందుకే మాస్టారంటే నాకు ఎంతో గౌరవం, భక్తీనూ.
పావుగంట పైనే పట్టింది మేము అక్కడికి చేరుకోవడానికి. రామనాథం మాస్టారు మా మండల కేంద్రమైన రామాపురం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. జాతీయ రహదారి ప్రక్కనే ఉంటుందా ఊరు. సాయంత్రమైనా పెద్దగా వాహనాలేవీ అడ్డురాలేదు కానీ ఊర్లోని గేదెలను తప్పించుకుని బయటపడడం మాత్రం కష్టమైంది మాకు.
మేమెళ్ళేసరికి కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు అప్పుడే వస్తున్నారు. 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకొని స్కూటీకి స్టాండ్ వేసి పక్కన ఉంచాను. ఇద్దరు పిల్లలు ఎదురొచ్చి మాకు స్వాగతం పలికారు.
పిల్లలు, పెద్దలతో ఆవరణంతా నిండిపోయింది. వాతావరణం కోలాహలంగా ఉంది. మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో వేదికను పెళ్లి మండపంలా అలంకరించారు. నేలంతా నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టారు. మార్చి నెల కావడంతో భానుడి ప్రతాపం ఇంకా తగ్గలేదు. పచ్చని చెట్లు ఎక్కువగా ఉన్నందున ఏదో తెలియని హాయిగొలుపుతోంది అక్కడి వాతావరణం. మాస్టారు దంపతులు వేదిక ముందు కూర్చుని ఉన్నారు. మేము వారి వద్దకు వెళ్లి నమస్కరించగా, కుశల ప్రశ్నలు వేసి మమ్ము ఆశీర్వదించి కూర్చోమని చెప్పారు వారు.
కొద్దిసేపటి తర్వాత అందరికీ నమస్కారం మరికొద్ది నిమిషాలలో కార్యక్రమం ప్రారంభమవుతుందంటూ వ్యాఖ్యానం వినిపించింది. దాంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో అటువైపు నుంచి కార్ల కాన్వాయ్ వస్తుండడం చూసి అందరి దృష్టి అటు మరలింది. రోజాతో కబుర్లలోఉన్న నేను కూడా అటు చూశాను. కార్లు దిగి వస్తున్నవారికి స్వాగతం పలకడానికి కొందరు ఎదురెళ్ళారు.
కలెక్టర్ హోదాలో ఉన్న ఓ వ్యక్తి, పక్కన జవాన్ పరిగెత్తుకుని వస్తుండగా రామనాథం మాస్టారి దగ్గరికి వచ్చారు. ఎవరో అధికారి వచ్చారనుకొని లేచి నిల్చోబోయిన మాస్టారిని పొదివి పట్టుకుని కూర్చోబెట్టి పాదనమస్కారం చేశాడు వచ్చినాయన. ఆ చర్యకు మాస్టారు ఆశ్చర్య పడతుండగా"గుర్తుపట్టలేదా మాస్టారూ.. నేను భరత్ ఐఎఎస్. మీ ప్రియశిష్యుడిని" అన్నాడు. ఆనందపారవశ్యంతో మాస్టారు ఆతడిని ఆలింగనం చేసుకున్నారు. కాసేపటివరకు ఇద్దరు మాట్లాడలేక పోయారు. ఆనందభాష్పాలు కన్నుల నిండాయి. వారిద్దరి మధ్య ఏర్పడిన ఆ అవ్యాజమైన ప్రేమకి ఎంతని వెలకట్టగలం? చూపరులకు ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో!
పూర్వ విద్యార్థులెందరో ఎక్కడెక్కడో ఉద్యోగాలలో, వృత్తుల్లో స్థిరపడినవారు, మాస్టారి ఉద్యోగ విరమణ తెలుసుకొని వచ్చారు. వారిలో కొంతమంది మా మిత్రులు కూడా ఉన్నారు. మేమందరం పూలు చల్లుతూ మాస్టారుని సన్మాన వేదిక వరకు తీసుకెళ్ళి వేదిక మీద కూర్చుండబెట్టాము. ఎందరినో ఉన్నత స్థితికి చేర్చి తాను మాత్రం అలాగే ఉండి బాలల భవిష్యత్తుకు బంగారుబాటలు వేసే బాధ్యతను భుజస్కందాలపై మోసేవాడు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే. ఇది అక్షర సత్యం.
మాస్టారి పదవీ విరమణ సన్మానం కన్నుల పండువగా జరుగుతున్నది. అతిథులు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు.
ప్రియ శిష్యుడు భరత్ ఐఏఎస్ మాట్లాడుతూ "మాస్టారు లేకపోతే నేను లేను. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు, మా నాన్న చేసిన అప్పుకు బదులుగా నేను ఒక మోతుబరి వద్ద జీతం ఉంచబడ్డాను. ఒక్కరోజు కూడా బడిమానివేయని నేను రాకపోవడానికి గల కారణం తెలుసుకుందామని వచ్చిన మాస్టారు నా పరిస్థితి చూసి నొచ్చుకొని, అప్పు చెల్లించి, నన్ను ఋణవిముక్తుణ్ణి చేశారు. నాలాగే మరెందరికో విద్యాదానం చేసి ఆదుకున్నారు. నేనేమిస్తే ఆ ఋణం తీరుతుంది?! గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మైశ్రీ గురవే నమః. మా జీవితాలను తీర్చి దిద్దిన గురుబ్రహ్మలకి శతకోటి వందనాలు" అంటూ తన ప్రసంగం ముగించాడు.
ఇందరి అభిమానానికి పాత్రులైన రామనాథం మాస్టారు ధన్యులు. అలాంటి గురువుని పొందిన మాలాంటి శిష్యులు ధన్యులు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందులకు ఎంతో గర్వంగా అనిపించింది నాకు, రోజాకు.
గొప్ప వ్యక్తులుగా ఎదిగిన తన శిష్యలోకాన్ని చూసి ఆనంద భాష్పాలు జాలువారుతుండగా మురిసిపోతున్నారు మాస్టారు.
సమాప్తం.
*****
సుజాత స్వర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
*******
రచయిత్రి పరిచయం:
నా పేరు సుజాత స్వర్ణ. మాది సాహితీ గుమ్మంగా పేరొందిన ఖమ్మం. నేను ఉపాధ్యాయినిని. పుస్తక పఠనం, పాటలు వినడం, పాడడం, రచనలు చేయడం... నా వ్యాపకాలు.
Comments