top of page
Writer's pictureNeeraja Prabhala

గురుపౌర్ణమి

21/07/2024


'Gurupournami' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 20/07/2024

'గురుపౌర్ణమి' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


వ్యాస పౌర్ణమి, గురుపౌర్ణమి ( 21/07/2024) సందర్భంగా గురువులకు నా నమస్సుమాంజలులు. సాష్టాంగ ప్రణామములు. 🙏🙏

ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రుడు పౌర్ణ‌మి రోజున పూర్వాషాఢ‌, లేదా ఉత్త‌రాషాఢ న‌క్ష‌త్రాల‌కు సమీపంలో ఉండుట చేత ఆ మాసమున‌కు ఆషాఢ‌మాస‌మ‌ని, ఆ రోజు వ‌చ్చిన పౌర్ణ‌మిని “ఆషాఢ పౌర్ణ‌మి” అందురు. 


అటువంటి ఆషాఢ పౌర్ణ‌మినే “గురు పౌర్ణ‌మి” గా పిలుస్తారు. ఈ రోజు వేదవ్యాసుల వారు జ‌న్మించుట చేత ఆషాఢ పౌర్ణ‌మికి “గురుపౌర్ణమి” అనే పేరు వచ్చింది. 


భగ‌వంతుడు మానవ శ‌రీరంలో అవ‌త‌రించిన‌ప్పుడు ఆ అవ‌త‌రించిన శ‌రీరాల‌లో గురువు ప్రాధాన్య‌త చెప్ప‌డం జ‌రిగింది. 


ఉదాహ‌ర‌ణ‌కు శ్రీమ‌హావిష్ణువు శీరామ‌చంద్ర‌మూర్తిగా.. అవ‌త‌రించిన‌ప్పుడు వ‌శిష్ఠుల వారిని గురువుగా స్వీక‌రించి “యోగవాశిష్ఠ్యం” వంటివి ఈ లోకానికి తెలియ‌జేశారు. 


 శ్రీ కృష్ణుడు సాందీప మ‌హ‌ర్షిని గురువుగా స్వీక‌రించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోకానికి అంద‌జేశారు. ఇవన్నీ కూడా గురువు ప్రాధాన్య‌త‌ను తెలియ‌జేస్తాయి. 

భూలోకంలో జ‌న్మించిన మాన‌వుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ధ్యాన‌మును, ధ్యాన‌ము ద్వారా క‌ర్మ‌ఫ‌ల త్యాగ‌మును ఈ మూడింటి ద్వారా మోక్ష‌మును పొందాల‌ని మ‌న మ‌హ‌ర్షులు, ఆధ్యాత్మిక సాధ‌కులు, గురువులు తెలియ‌జేశారు. 


ఇలా క‌లియుగంలో మాన‌వాళికి ఆధ్యాత్మిక జ్ఞానం సులువుగా అర్థం కావ‌డం కోసం వేదవ్యాసుల వారు వేదాల‌ను విభ‌జించి, అష్టాద‌శ పురాణాల‌ను రచించి, మ‌హాభార‌తం, భ‌గవ‌ద్గీత వంటి విష‌యాల‌ను ఈ లోకానికి అందించ‌డం చేత ఆయ‌న జ‌న్మించిన ఆషాఢ పూర్ణిమ‌ను వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణ‌మి పిలుస్తారు. 


 ఇంత‌టి విశిష్ట‌త ఉన్న గురు పూర్ణిమ రోజు మ‌న‌కి జ్ఞానాన్ని అందించిన మ‌హ‌ర్షులు, ఋషులు, వ్యాసమహర్షి వంటి వారిని స్మ‌రించుకోవాలి. 


 సాధన‌లో ఉన్న‌టువంటి వారు వారి గురువుల‌ను, స‌న్యాసాశ్ర‌మంలో ఉన్న‌వారు వారి గురువుల‌ను ఈ రోజు వారి ప‌రంప‌ర‌కు అనుగుణంగా గురుపూజ చేయవలెను. 


 ఈర‌కంగా ఈరోజు గురుపూజ చేసి వారి పాదముల‌ను క‌డిగి, పూల‌మాల‌తో స‌త్క‌రించి, వ‌స్త్ర‌ముల‌ను, తాంబూల ఫ‌లాల‌ను అంద‌చేసి వారి ఆశీస్సులు పొంది, గురువు గారి చేత ఉప‌దేశం, గురువుగారి ఆశీర్వ‌చ‌నం పొంద‌డానికి ఈ రోజు చాలా విశేష‌మైన‌ది. 


ఇటువంటి గురువులు లేన‌ప్పుడు, వ్యాసుల వారిని స్మ‌రించుకుని ఆయ‌న అందించిన‌టువంటి అష్టాద‌శ పురాణాలు, మ‌హాభార‌తం వంటివి చ‌దువుకోవాలి. 

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః🙏🙏


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే !

నమో వైబ్రహ్మ నిధయే వాసిష్టాయ నమోనమః 


గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 

గురుః స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః


గురవే సర్వ లోకానామ్ భిషజే భవ రోగిణామ్ !

నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః 


శివుని అంశ దక్షిణామూర్తి కాగా, ఆ దక్షిణామూర్తి ప్రతిరూపమే గురువులు. 


అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించి దారి చూపే సద్గురువులు. 


జననీ జనకుల అవ్యాజప్రేమకు మరో రూపం గురువు. 


పామరులను సైతం పండితులను చేసి, నిర్మలమైన, స్వఛ్ఛమైన ప్రేమాప్యాయతలు చూపే దైవం గురువు. 


నిస్వార్థంగా విద్యాదానం చేసి కన్న వారి ప్రేమను మరిపించేది గురువే. 


ఉన్నత స్థాయిలో శిష్యులు ఉండాలని వాళ్ళ ప్రగతికి పాటుపడి దారి చూపే జ్ణానజ్యోతి గురువు. 


వట వ్రృక్షంలా ఎంత ఉన్నతికి ఎదిగినా ఆ వ్రృక్షంబు తొలి బీజం గురువే. 


వేయేల పలుకులు ? ఆ దేవుని ప్రతిరూపమే గురువు. 


పత్రం- ఫలం - తోయం ఇచ్చినా తీర్చ లేని మీ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలము? 


ఏ సేవలతో మిమ్మల్ని సంత్రృప్తి పరచగలము?


ఆమూలాగ్రము విద్యనభ్యసించి అపూర్వమైన ప్రజ్ణ చూపటం తప్ప. 


ఎన్ని సత్కార్యాలు చేసినా మీకు చేసే సన్మానము లోనే సంతృప్తి, ఆనందము కలుగును మిన్న. 



..... నీరజ హరి ప్రభల. 


28 views0 comments

Comments


bottom of page