top of page

హద్దు

M K Kumar

#MKKumar, #ఎంకెకుమార్, #Haddu, #హద్దు, #TeluguStories, #TeluguCrimeStory


Haddu - New Telugu Story Written By - M K Kumar

Published In manatelugukathalu.com On 18/03/2025

హద్దు - తెలుగు కథ

రచన: ఎం. కె. కుమార్


హైదరాబాద్ నగరం రెప్పపాటు ఆగదు. 

వీధుల్లో చీకటిని చీలుస్తూ కారు హెడ్ లైట్లు, ట్రాఫిక్ హార్న్లు, నగరం శబ్దం నడుస్తూనే ఉంది. 

అయితే పోలీస్ స్టేషన్‌లో మాత్రం ఒక్కసారిగా నిశ్శబ్దం పరుచుకుంది. 


పోలీస్ స్టేషన్ ద్వారం వైపు మెల్లగా నడుస్తూ వస్తోంది నేహా. 

ఆమె రూపం, ఆమె కళ్లల్లోనూ, ఆమె ఒంటరిగా లాక్కుపోతున్న దేహంలోనూ.. ఏదో మార్పు!


తన పొడవైన జీన్స్ ప్యాంట్‌కి అక్కడక్కడ రక్తపు మరకలు. 

తెల్లటి చొక్కా, కానీ ఇప్పుడు అది పూర్తిగా ఎర్రబడింది!

చేతుల పైన మరకలు.. చెతి వేళ్లు ఓకొక్కటిగా వణికినట్లున్నా.. ఆమె కదలికలో మాత్రం ఏకాగ్రత!


స్టేషన్‌లో కూర్చున్న పోలీస్ అధికారి ఆమె వైపు చూశాడు. 

పొడవుగా ఆమెను తల నుండి అడుగువరకు స్కాన్ చేశాడు. 

ఆమె కళ్లలో ఏదో తక్కువైనట్లు అనిపించింది. 


అయితే ఆత్మన్యూనత కాదు..

దానికంటే గంభీరమైనదేదో!


నేహా ముందుకు వచ్చి, అవతల ఉన్న స్టూల్‌ను లాగి కూర్చుంది. 

చేతిని టేబుల్ మీద వేసింది. 

రక్తపు మరకలు ఉన్న చేతులు.. అద్దం పరిచిన టేబుల్ ని ఎర్రటి మరకతో నింపింది. 

 

అయితే ఆమె ముఖంలో మాత్రం ఒక చిన్న అసహనం మాత్రమే!


పోలీసు అధికారి ఆశ్చర్యంగా, దయా, కఠినత కలిసిన గొంతులో "మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు?"


నేహా చాలా నిశ్చలంగా, కానీ ఆలోచన లేకుండా

"నేను హత్య చేశాను. "


ఆఫీసర్ ఒక్క క్షణం ఆమెను గట్టిగా చూశాడు. 

ఒక అమ్మాయి.. ఇంత ప్రశాంతంగా హత్య చేసినట్లు చెబుతుందా?


పోలీసు అధికారి సీరియస్‌గా

"ఎవరిని?"


నేహా కాళ్లను క్రాస్ చేసి, కుర్చీలో కాస్త వెనక్కి వాలింది. 

తన కాలికి తానే తగిలినట్లుగా రక్తపు మరక కనిపించింది. 

అయితే దాని గురించి ఆమె క్షణం కూడా పట్టించుకోలేదు. 


నేహా చిన్న చిరునవ్వుతో, కానీ హృదయం చల్లబరిచేలా

"నా మొగుడిని. "


ఆమె మాటల తీరులో నిజాయితీ!

ఏ అప్రయత్నత లేదు..

ఏ భయం లేదు..

ఏ తప్పు చేశానన్న బాధ లేదు..


అది భయం కాదు..

అది ఉన్మాదం కాదు..


పోలీసు అధికారి ఆమె మాటలకు నిశ్శబ్దంగా ఒక్క క్షణం చూసి, తన కుర్చీ నుండి లేచాడు. 

అతను ఎదురుగా నడిచి వచ్చి, చేతులు కట్టుకుని నిలబడ్డాడు. 


పోలీసు అధికారి కోపంగా

"నీ మొగుడిని చంపావా?"


నేహా కుర్చీలో కూర్చున్న పద్ధతినే మార్చుకుంది. 

కాస్త ముందుకు వచ్చి, చేతులు టేబుల్‌పై ఉంచింది. 

తన వెనుక జీన్స్ బెల్ట్ దగ్గర తగిలిన రక్తపు మరకను చూసింది. 


కానీ ఆమె చూపులో భయం లేదు. 

కనీసం నేరం చేశానన్న ఆవేదన లేదు. 

సిగ్గుపడే అవసరం ఆమెకు అనిపించలేదు. 


నేహా:

"చంపాల్సిన వాడిని చంపాను. "


అది ఓ విముక్తి క్షణం. 


ఒక్క క్షణం.. పోలీస్ అధికారి నిశ్శబ్దంగా ఉన్నాడు. 

ఆమె ముఖాన్ని మరోసారి గమనించాడు. 


నేహా కళ్లలో తిరుగుబాటు ఉంది. 

ఏడు ఏళ్లుగా తొలిసారి ఆమెకి శాంతి దొరికింది. 


బయట రోడ్లపై వాహనాల కాంతులు మెరుస్తున్నాయి. 

హైదరాబాద్ నగరం ఏమీ పట్టనట్టు ముందుకు సాగుతూనే ఉంది. 


కానీ పోలీస్ స్టేషన్‌లో..

ఒక మహిళ తన గతాన్ని అక్కడే వదిలేసి, కొత్త జీవితాన్ని స్వాగతిస్తున్నదా?


ఆమె కళ్లలో చూసిన పోలీసులు కూడా ఒక్క క్షణం మాటల్ని కోల్పోయారు. 


అది నేహా పుట్టిన కొత్త క్షణం!


గదిలో చీకటి తాలూకు ముసురు, నేహా జీవితంలో గాలివాన తుఫాన్ తర్వాత తేలిన ప్రశాంతతలా ఉంది. 

పోలీసు స్టేషన్‌లోని పసుపు లైట్లు ఆమె ముఖంపై పడి, ఆమె కళ్లల్లో ఏదో అనిర్వచనీయమైన నిశ్చలతను ప్రతిబింబించాయి. 


 తెల్ల చొక్కా మీద రక్తపు మరకలు.. చేతులు పైకి చాచి, వేళ్లను సున్నితంగా బదులుతూ, ఒక్క క్షణం తనలో తాను ఓ తడబాటు. 

కానీ ఆమె హృదయంలో మాత్రం ఎలాంటి అప్రయత్నత లేదు. 


ముందు కూర్చున్న పోలీస్ అధికారి ఆమె వైపు చూస్తూ, కుర్చీలో కొంత ముందుకు వాలాడు. 

ఆయన కళ్లలో ప్రశ్నలు.. అనేక ప్రశ్నలు. 


పోలీసు అధికారి కఠినంగా, కానీ కుతూహలంతో

"ఇంత అమాయకంగా చంపేసి ఇక్కడికే వచ్చావా?"


నేహా కుర్చీలో తల వెనక్కి వాల్చుకుంది. ఒక్క నిశ్వాసం తీసుకుంది. 

ఆమె మనసులో ఏమీ లేదు.. భయమా? లేదు. 

అనిశ్చితేమా? లేదు. 


అతనికి ఎదురుగా చూసి, కాస్త చిరునవ్వుతో.. 


నేహా స్పష్టంగా, నిశ్చలంగా 

"అతని ఇంట్లో కన్నా నేను జైలులో బెటర్‌గా ఉంటాను. "


ఆమె మాటల్లో ఎలాంటి ఉద్వేగం లేదు. 

ఒక్క అప శృతి తాకిన పాత వాయిద్యం లాగా ఆమె జీవితాన్ని చూసిన పోలీస్ అధికారి ఒక్క క్షణం మౌనంగా కూర్చున్నాడు. 


ఆమె మాట్లాడిన తీరు అతనికి అర్థం కాలేదు.. లేదా అర్థమై హడలెత్తిపోయిందా?


రోడ్లపై ప్రజలు పరుగులు తీస్తున్నారు. 


అయితే నేహా ప్రపంచంలో మాత్రం తొలిసారి ప్రశాంతత ఉంది. 


ఈసారి ఏడు ఏళ్లుగా వెనుక పడిపోయిన ఓ నిమిషాన్ని తిరిగి ఆమె చవి చూస్తోంది. 

ఏడు ఏళ్ల పెళ్లి జీవితంలో ఒక్కసారి కూడా ఆమె నవ్వలేదనిపించింది. 

కానీ ఇప్పుడు..


ఆమె ముఖంపై ఓ చిరునవ్వు మెరిసింది. 


అది సంతోషపు నవ్వా?

కష్టాల్లోంచి బయటపడిన ఊపిరి నవ్వా?

లేదా జీవితాన్ని ఓ అర్థంలో గెలిచాననే తృప్తి నవ్వా?


ఎవ్వరికి తెలియదు..


కానీ నేహా గుండెలో మాత్రం నిజమైన విముక్తి తళతళలాడుతోంది!


పోలీసు గడియారం మోగింది. మొదటిసారు గడియారం వైపు ఆనందంగా చూసింది. 

 ఒక కొత్త జీవితం మొదలవుతుందనా


 పోలీసు ఇన్స్పెక్టర్ బిత్తర పోయి తన పై అధికారులకు ఫోన్ చేసే దానికి పోలీస్ స్టేషన్ బయటికి వెళ్ళాడు. 


ఆమె ఆలోచనలు వెనక్కి మల్లాయి. 


సాయంత్రపు ఆకాశం ముదురు నారింజ రంగులో ఒలకబోసింది. ఆ రంగుల వెనుక, నేహా మనసులో మాత్రం ఎప్పటిలాగే చీకటి పెరుగుతోంది. 


బాల్కనీ రైలింగ్‌ను గట్టిగా పట్టుకుంది. కింద హైద్రాబాద్ వీధులు హడావిడిగా ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిగ్నల్స్ వద్ద ఆగిన చప్పుడు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ ప్లేట్లు మోగుతున్న శబ్దం. 


ఇవి అన్నీ నేహాకు వినిపించేవి కానీ, తాను ఏదో వేరే లోకంలో ఉన్నట్టుగా అనిపించేది. 


కారు హారన్‌లు, రేడియోలలో సిల్లీ ప్రోమోషన్లు వినిపించినా, ఆమె మనసులో మాత్రం నిశ్శబ్దమే. 


 ఆ నిశ్శబ్దం ఆమెను లోపల నుంచి మెల్లగా గుచ్చుకతోంది. 

 

సిటీ లైఫ్‌లో ఉండే వేగం, హడావిడి, ఆకాశాన్ని తాకే భవనాలు.. ఇవన్నీ బయటకు ఒక కథ. 


కానీ తను ఇందులో భాగం కాదు. నేహా నిజంగా ఏదో ఒక జైల్లో ఉందనే ఫీలింగ్ ఆమెను వీడటం లేదు. 


"ఇంకా ఎంతకాలం ఇలా?" తనలో తాను ప్రశ్నించుకుంది. 


ఆలోచనల మధ్యలోనే వెనుకనుంచి గట్టిగా ఓ గళం ఆమెను ఉలిక్కిపడేలా చేసింది. 


"నేహా!"


ఆమె వెనక్కి తిరిగింది. విరాట్ నిలబడి ఉన్నాడు. ముఖంలో అసహనం, తన స్వరంలో ఆదేశం. 


విరాట్ సీరియస్ గా "ఇంట్లోనూ ఒంటరిగా నిలబడి ఏం ఆలోచిస్తున్నావ్?"


నేహా క్షణం కింద రోడ్డు మీద వేగంగా వెళ్లే వాహనాల వైపు చూసింది. ఓ ఆలోచన మెదిలింది, కానీ వెంటనే దాన్ని తృణీకరించింది. 


నేహా మౌనంగా "ఏమీలేదు.."


ఆమె తల తిప్పి లోపలికి వెళ్లబోయింది. కానీ విరాట్ వెంటనే అడ్డు నిలబడి, ఆవిడని నిలిపివేశాడు. 


విరాట్ కళ్ళలో అలజడి "నీ ఆలోచనలు నాకు అర్థం కావు. ఎంత లగ్జరీ లైఫ్ ఇస్తున్నానో తెలుసా? ఇంకా నీకేం కావాలి?"


ఆయన స్వరంలో ఆగ్రహం ఉన్నా, అదే సమయంలో తనను సమర్థించుకునే ప్రయత్నం కూడా కనిపించింది. విరాట్ మాటల్లో ఉన్న ‘లగ్జరీ’ నేహాకు ఓ విషం లాంటిది. 


ఊహించని నవ్వు ఆమె ముఖంపై మెరుపుగా మెరిసి వెంటనే మాయమైంది. 


నేహా తనను తాను అదుపుచేసుకుంటూ "స్వేచ్ఛ.. ప్రేమ.."


విరాట్ ఆమెను కొద్దిసేపు పరిశీలించాడు. ఆ తేలికపాటి నవ్వు అతనికి నచ్చలేదు. ఆమె మాటల వెనుక అర్థాన్ని గ్రహించగలిగినా, గ్రహించనట్టు నటించాడు. 


విరాట్ నవ్వుతూ "అవన్నీ ఫిల్మ్ డైలాగ్స్. మళ్లీ ఇలాంటివి మాట్లాడితే చూస్తూ ఉండు!"


అతని మాటల్లో ఒక హెచ్చరిక ఉంది. ఆమె గుండెలో కత్తిపోట్లు. అయినా విరాట్ తన్ను తాను సమాధానపరుచుకొని ఆమెని కౌగిలించుకున్నాడు. 


ప్రతి సారి విరాట్ తనను కౌగిలించుకున్నప్పుడల్లా, నేహా ఊపిరాడని బాధను అనుభవించేది. అది ప్రేమ కౌగిలి కాదు.. ఆప్యాయతా కాదు.. అది ఒక బంధనం. 


వేటలో చిక్కుకున్న జంతువు గుండెలో జడుసుకుని, ఊపిరి తీయలేక మౌనంగా విలవిలలాడినట్లు. 


అతని చేతులు తన నడుము చుట్టూ బిగుసుకోవడం కాదు, తనను ఉక్కిరిబిక్కిరి చేయడమే. 


అతని ఒడిలో ఉండటం అంటే, ఆ గట్టిపట్టు నుంచి తప్పించుకునేందుకు తనే తన శరీరాన్ని వెనక్కి లాగుకోవడానికి చేసిన విఫల ప్రయత్నమే. 


అలాంటి క్షణాల్లో, ఆమెకు తన చుట్టూ గదులు మూసుకుపోయినట్లు అనిపించేది. ఒక చీకటి గదిలో తలుపులు ఎప్పటికీ తెరవబోనన్న అనుభూతి. 


గదిలో ఒక్క చిన్న కిటికీ కూడా లేదు. అక్కడ గాలి ప్రవహించడం లేదు. ఊపిరి తీసుకోవడానికి చిన్న తలుపు కూడా తెరవడం లేదు. 


ఆ గదిలో ఆమె ఒంటరిగా ఉంది. అంధకారంలో తడుముకుంటూ, గోడలపై చెయ్యులు వేసి వెలుగు కోసం వెతుకుతోంది. 


కానీ చీకటి మాత్రమే ఆమెను చుట్టుముడుతోంది. 


"ఇది ప్రేమ కాదు.. ఇది బంధనం"


అతని ప్రేమ కౌగిలి కాదు, ఒక అణచివేత. ప్రతి కౌగిలిలోనూ ఆమెకు తన ప్రాణం అక్కడే ఆగిపోతున్నట్లు అనిపించేది. 


ఊపిరి ఆడదన్న భయం క్రమంగా గుండెల్లో దాచిన ఆత్మవిశ్వాసాన్ని మింగేస్తూ, తనను మరింత లోతుగా ముంచివేస్తుంది. 


కౌగిలి తీయగానే, ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునేది నేహా. అది తన శరీరానికి ప్రాణం తిరిగి వచ్చినట్టు కాదు.. బతకాల్సిన శాపం మళ్లీ మొదలైనట్టే. 


"ఈ బంధనం నుంచి నేను తప్పించుకోగలనా"


నేహా మౌనంగా లోపలకి వెళ్లిపోయింది. కిచెన్‌లోకి వెళ్లి నీళ్లు తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గర నిలబడింది. 


గాజు గ్లాస్‌లో నీళ్లు నింపుకుని తాగుతుండగా, కిచెన్ గ్లాస్ డోర్‌లో తన ప్రతిబింబం కనిపించింది. 


ఒకప్పుడు ఆమె రూపం ఉజ్వలంగా ఉండేది. ఉదయం నెమ్మదిగా ఎగసిపడే సూర్యకిరణాల్లా ఆమె ముఖం కాంతిమంతంగా ఉండేది. 


కన్నుల్లో ఆత్మవిశ్వాసం మెరిపించేది. తన నడక, తన భాష, తన ప్రవర్తన, అన్నీ ఒక ఉత్సాహాన్ని, ఒక గంభీరతను చూపించేవి. 


ఆమె నవ్వు చుట్టుపక్కల వారిని ఆకర్షించేది. జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటూ, వాటిని తనదైన శైలిలో అధిగమించేది. 


ఆమె మాటల్లో ఓ ధైర్యం, ఆమె చూపులో ఓ ఆశ, ఆమె చేతుల్లో ఓ శక్తి ఉండేది. 


ఏ విషయంలోనైనా స్పష్టత, నమ్మకం ఉండేవి. ఎవరైనా ఆమెతో మాట్లాడితే, ఆమెలోని ఆత్మస్థైర్యాన్ని, ఆమెలో ఉన్న పట్టుదలని గమనించేవారు. కానీ ఇప్పుడు.. 


ఇప్పుడు అదే ప్రతిబింబం ఆమెకు భిన్నంగా అనిపిస్తోంది. కన్నుల్లో వెలుతురు తగ్గిపోయింది. 


ఒకప్పుడు తెగువతో ఉన్న చూపు, ఇప్పుడు అలసటతో నిండిపోయింది. నవ్వు కరిగిపోయింది. ముఖం నిస్సత్తువగా మారింది. 


ఒంట్లో చలాకితనం లేకుండా, వడలిపోయిన మొక్క ఎంతలా ఒత్తిడిని చూపిస్తాయో, ఆమె రూపం కూడా అంతేలా మారిపోయింది. 


ఆమె నడక కూడా మారిపోయింది. ఒకప్పుడు లయబద్ధంగా, నడిచే ప్రతి అడుగులో నమ్మకం ఉన్నట్లుగా ఉండేది. 


కానీ ఇప్పుడు ఆమె నడక మెల్లగానే కాక, వెనక్కి తగ్గినట్లు అనిపిస్తోంది. ముక్కుసూటిగా, ధైర్యంగా మాట్లాడే ఆమె మాటలు ఇప్పుడు తడబడుతున్నాయి. 


తన గతాన్ని గుర్తు చేసుకుంటోంది. ఏదో లోపలపడి, అనుభవాల భారంతో శరీరం వడలిపోయినట్లు అనిపిస్తోంది. 


ఇప్పటి ప్రతిబింబం ఆమెకు అనుకోని భయాన్ని కలిగించింది. "ఇది నిజంగా నేనేనా?" అని తను తనను తాను ప్రశ్నించుకుంది. 


"నిజంగా ఇదేనా నా జీవితమా?"


ఆమె ప్రశ్నలకి సమాధానం దొరకలేదు. 


ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఆమె ప్రేమించిన వ్యక్తి.. ఆమెను బంధించిన వ్యక్తి అయ్యాడు. 


విరాట్ తన తన బెడ్ రూమ్ లో అడ్డంగా పడుకొని తనలో తన ఆలోచిస్తున్నాడు. 


మొదటిసారి నేహాను చూసినప్పుడు, ఆమెని ప్రేమించానని అనిపించలేదు. 

ఆమె నవ్వు అందంగా అనిపించింది. 

ఆమె మాటల్లోని అమాయకత్వం ఆకర్షించింది. 

అదే తనని నా వైపు లాగిందనుకున్నాను. 


నేహా సొగసైనది, కాని కేవలం అందమే కాదు. 

ఆమెలో ఓ తీపి హావభావం..


ఆమె చూపుల్లో ఓ విచిత్రమైన అమాయకత్వం..

ఆమె నడకలో ఓ నిర్భాగ్యత..

ఇవే నన్ను ప్రేమలో పడేశాయి. 


ఆమె మాటల్లో ఓ అమాయకత్వం ఉంది. 

ఆమె ఆలోచనల్లో ఓ స్వేచ్ఛ ఉంది. 

ఆమె కోపించినా, అవును అన్నా, కాదు అన్నా..

ప్రతి చిన్న విషయం కొత్తగా అనిపించేది. 


ఆమె నన్ను అంతగా ప్రేమించింది. 

నా కోసం తన ప్రపంచాన్ని వదిలేసింది. 


అందుకే నేను ఈ జీవితంలో ఎవరికీ దక్కని ప్రేమను ఆమెకు ఇవ్వాలి అనుకున్నాను. 


కానీ ప్రేమ అనేది స్వేచ్ఛ కాదు..

అది నియంత్రణ.. అధికారం..


పెళ్లయిన తర్వాత, ఆ ప్రేమ నన్ను క్రమంగా స్వంతానికి మార్చింది. 

ఆమె నా భార్య!

ఆమె నాకే చెందాలి!

ఆమె నా మాట వినాలి!

నా కోరికలకే తలొగ్గాలి!


నేహా మొదట్లో అంత చిలిపిగా ఉండేది. 

కానీ క్రమంగా మారిపోయింది. 


నాకు తెలియకుండా, ఆమె మనసు నా నుండి దూరమవుతున్నట్టుగా అనిపించింది. 

ఆమె నా నియంత్రణలో ఉండదనిపించింది. 


నేను ప్రేమించిన ఆమె, పెళ్లి తర్వాత నా ప్రేమను ఓ పరీక్షగా మార్చేసింది. 

ఆమె నవ్వులు తగ్గాయి. 


నా కోపానికి భయపడటం ప్రారంభించింది. 

ఆమె మాటలు ప్రశ్నలుగా మారాయి. 


నా ప్రతి నియంత్రణను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. 


ఇదేనా ప్రేమ?


ప్రేమించేవాడు తన ప్రేయసిని అర్థం చేసుకోవాలి. 

కానీ నేను అర్థం చేసుకోవడం మానేశాను. 

నాకు ఆమె ఎప్పుడు నా నియంత్రణలో ఉండాలని అనిపించింది. 

నాకు తెలిసిన ప్రేమ అదే. 

నా తండ్రి, నా తాత, మా ఇంటి మగాళ్ల ప్రేమ అంతే. 


భర్త అంటే గౌరవం. అది ఆమె చూపదు. 

ఆ మాటే నమ్మాను. 


కానీ ఆమె ప్రతి క్షణం ఎదురు తిరగటం ప్రారంభించింది. 


నా ప్రేమను అవహేళన చేయటం మొదలుపెట్టింది. 

నేను చెప్పింది వినకుండా తన దారిలో నడవాలని ప్రయత్నించింది. 


ఆమె మొహంలో కనిపించే భయం..

ఆమె ఎదురు తిరిగే ధైర్యం..

ఇవి నా గర్వాన్ని దెబ్బతీశాయి. 


నాకు తెలిసిన ప్రేమ..

నా చేతుల్లో ఆమె ఉండాలని చెప్పింది. 


కానీ ఆమె తప్పించుకోవాలని చూసింది. 

నేను గెలవాలని అనుకున్నాను. 


కానీ ప్రేమ పోటీ కాదు..

నాయకత్వం కాదు..

అధికారం కాదు..


నేహా నన్ను ప్రేమించేది. 

కానీ అదే ప్రేమ, 

ఒకరోజు నా మీద కోపంగా మారిపోయింది. 

నన్ను హింసగాంధిగా మార్చేసింది. 

నన్ను ద్వేషించేలా చేసింది. 

ఇది ఆమె తప్పే

ఆమెను మార్చుకుంటాను

తనదిగా చేసుకుంటాను. 


మరుసటి రోజు రాత్రి నగరం హడావుడిగా ఉంది. రోడ్లపైన కార్ల హారన్‌లు, దూరంగా మ్యూజిక్ క్లబ్‌ల శబ్దాలు, రోడ్డు కిరాణా దుకాణాల్లో వినిపించే కోలాహలం. 


ఇవి అన్నీ నగరం అనుభవించే రాత్రి సంబరాలకు నిదర్శనం. కానీ అదే నగరంలోని ఒక అపార్ట్మెంట్‌లో, ఓ స్త్రీ తన జీవితంలో గాఢాంధకారాన్ని ఎదుర్కొంటోంది. 


నేహా సోఫాలో కూర్చొని, చేతిలో ఓ పుస్తకం పట్టుకుని ఉన్నా, ఆమెకు దానిమీద ఏ మాత్రం శ్రద్ధ లేదు. ఆమె మనస్సు ఎక్కడో ఓటమిని ఎదుర్కొంటున్న సంచలనం మధ్య ఉండిపోయింది. 


ఘడియారం రాత్రి పది మోగించింది. ఇంట్లో ఇంకా విరాట్ రాలేదు. అతని కోసం వేచి ఉండటం ఆమెకు కొత్త కాదు. 


కానీ ఈ రోజు ఏదో తెలియని భయం ఆమెను గుచ్చుతోంది. అతడు ఎంత ఆలస్యంగా వస్తే, అంత ప్రమాదకరం అన్న అనుభవంతోనే ఆ భయం. 


తన చెవి పడేలా తలుపు తెరుచుకున్న శబ్దం. 


"నేహా!"


కేకపెట్టేలా విరాట్ గట్టిగా పిలిచాడు. అతని గొంతులో మద్యం ప్రభావం స్పష్టంగా కనిపించింది. 


మద్యం వాసన గాలి వెంట కొట్టుకొచ్చింది. నేహా నిలబడింది. అతను నిలబడిన తీరును చూసి ఆమెకు తెలియకుండానే ఒళ్లు వణికింది. 


విరాట్ చిరుకదలతో "నీకు అర్థమవుతోంది కదా, ఈ ఇంట్లో నా మాటే శాసనం!"


ఆ మాటలతో అతను తల తిప్పాడు. తన చొక్కా ను నేలకేసి విసిరాడు. అతని వదనం ఎర్రబడిపోయింది, కళ్లలో మత్తు. 


నేహా దడతో "ఇలా మాట్లాడొద్దు విరాట్, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం .. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. "


ఆమె స్వరం వణుకుతో నిండింది. ఒక్కసారిగా అతను ఆమె వైపు ముందుకు వచ్చి, భుజాలపైన గట్టిగా చేతులు వేసి బలంగా పట్టుకున్నాడు. 


విరాట్ నగ్నంగా నవ్వుతూ "అర్థం? నేను చెప్పిందే నువ్వు నన్ను ప్రేమించడం లేదు. నా ప్రతి మాటకు ఎదురు మాట్లాడుతున్నావు!"


ఆమె మౌనంగా అతన్ని చూసింది. అతని చేతిలో తన జీవితాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్న భావన.. 


ప్రతి రోజు తన స్వేచ్ఛను తుంచుతున్న వాస్తవం.. ఈ అర్థరాత్రి వేళ తనను భయపెట్టడం మించిన బాధ మరేదైనా ఉందా?


ఒక్కసారిగా అతను ఆమెను గట్టిగా లాగాడు. ఆమె భయంతో తడబడుతూ, వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించింది. 


కానీ విరాట్ తన బలంతో ఆమెను వెనక్కి నెట్టాడు. నేహా నేలకూలింది. వెనుకకు విరిగిన ముట్టె వేయినట్టు.. ఆమె దేహంలో నొప్పి వెనుక వెనుకగా పరుగు తీసింది. 


"విరాట్! దయచేసి!"


ఆమె ఏడుస్తూ అతడి నుంచి తప్పించుకునేందుకు కాళ్లు బాదుకుంది. కానీ అతను వదిలిపెట్టలేదు. అతని ముఖం హింసాత్మకమైన చిరునవ్వుతో నిండిపోయింది. 


ఆ రాత్రి, నేహా శరీరం గాయపడలేదు. కానీ ఆమె మనసులో పునరావృతమయ్యే గాయం ఏర్పడింది. ఆమె గుండెలో నెత్తుటి కన్నీళ్లు ప్రవహించాయి. 


రాత్రంతా ఆమె నిశ్శబ్దంగా పడుకుంది. తలచుకున్న ప్రతీ ఆలోచన కత్తిలా గుచ్చుకుంది. 


తన భవిష్యత్తు ఎక్కడికి దారి తీస్తుంది? ఎంత కాలం ఇలా భరించాలి? ఈ ఇంట్లో ఓ బందీగా ఉండటం తప్ప, తన జీవితంలో మరేదైనా మార్పు ఉంటుందా?


గడియారం రాత్రి 3 మోగించింది. నేహా అలా పడుకునేలా తల తిప్పింది. 


నేహా అంతర్మథనం


రాత్రి చీకటి గదిలో నేహా ఒంటరిగా, 

విరాట్ మంచంపై బలంగా నిద్రలో మునిగిపోయాడు. 

విసిగిపోయి మద్యం తాగి, మరోసారి తన ఆటను ఆడాడు. 


ఈ రోజు కూడా అదే కథ. 

కొన్ని ఏళ్లుగా అదే కథ. 


తన నిశ్చలమైన చేతుల్ని చూసింది. 

అవి వణికడం లేదు. 

కళ్లు చెమర్చలేదు. 

గుండె వేగంగా కొట్టుకోవడం లేదు. 


ఇది భయం కాదు. 

ఇది ఆలోచన కాదు. 

ఇది ఎప్పటి నుంచో నాలో పెరుగుతున్న సమాధానం. 


"నేను విఫలమయ్యానా?"


అతను ప్రేమించాడు. 

కావాలని కాదు, 

నన్ను స్వంతం చేసుకోవాలనే ఆతృతతో ప్రేమించాడు. 


పెళ్లి అయ్యాక అతని అసలు రూపం బయటపడింది. 

అతనికి నాకు మధ్య బంధం లేదు, 

ఉందనుకున్న ప్రేమ లేదు..

కేవలం హక్కు.. అధికారం.. పెత్తనం..


నాకు కావలసింది ఏమిటి?

మంచి మాట..

స్వేచ్ఛ..

ఇష్టమైన జీవితానికి నన్ను నేను తయారు చేసుకునే అవకాశం..

అయితే అతనికి అది అసహ్యంగా అనిపించింది. 


ఆత్మగౌరవాన్ని ముక్కలు చేసిన వేళ్ళు..

తన కోరిక నెరవేర్చుకోవడమే ప్రేమనుకున్న మనస్తత్వం..

నా శరీరాన్ని తనకు చెందినదిగా భావించే భ్రాంతి..

ఇదేనా కుటుంబం?


అతను నన్ను తన భార్యగా చూడలేదు. 

నా శరీరంపై గాయాలు పెట్టాడు. 

నా మనసును చీల్చాడు. 

నా జీవితం, నా అంతస్తు నా చేతుల్లో లేదని నిరూపించాలనుకున్నాడు. 


"ఎందుకు?"


అవునా?

ఈ సమాజం ఇది నేర్పించిందా?

"అడుగు పెట్టిన ఇంట్లో అడుగుపెట్టినట్లు నడుచుకోవాలి. "

"భర్త ఏం చేసినా సహించాలి. "

"పెళ్లి అనేది ఒక బంధం, దాన్ని గౌరవించాలి. "


అయితే భర్త తన భార్యను గౌరవించకపోతే?

భార్యను అణగదొక్కితే?

అప్పుడు ఆ పెళ్లి బంధమేనట. 

సహించని భార్య బరితెగించింది. 


సమాజం నన్ను ఆడదాన్నిగా చూస్తుంది. 

ముద్దుబిడ్డగా, భార్యగా, భవిష్యత్తు తల్లిగా చూస్తుంది. 

కానీ ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా చూడదు!


ఇది మామూలు గొడవ కాదు. 

ఇది దౌర్జన్యానికి, దురహంకారానికి, నా విలువను అణగదొక్కిన మనస్తత్వానికి సమాధానం. 


నేడు నేను మరోసారి అతని చెయ్యి తగలనిస్తే..

రేపు నన్ను నేనే కోల్పోతాను. 


సమాజం ఈ ఉదయం నన్ను తప్పుపడుతుంది. 

"అమ్మాయి కఠినంగా ఉండకూడదు. "

"భర్తను చంపటం కరెక్టా?"

"అయినా చట్టం ఉందిగా!"


అయితే ఏడేళ్లుగా నా జీవితాన్ని నరకం చేసిన అతన్ని ఎవరూ శిక్షించలేరు. 

చట్టం అతనికి చిన్న గమనిక ఇస్తుంది. 

ఆపై మళ్లీ అతనే గెలుస్తాడు. 


కానీ నేడు నేను గెలవాలి. 

నా మనస్తత్వం గెలవాలి. 

నా స్వేచ్ఛ గెలవాలి. 


నా జీవితాన్ని నాశనం చేసిన వాడిని నేనే శిక్షించాలి. 

ఇది ఒక మహిళ తీసుకున్న చివరి నిర్ణయం. 


నా హృదయం చెప్పినట్లు, 

నా గాయాల్ని గుర్తు చేసుకున్నట్లు..

నా ప్రాణం ఉవ్వెత్తున ఎగిసినట్లు..


నాకు ఇప్పుడు భయం లేదు. 


తలుపు పక్కన యాపిల్ కోయటం కోసం తెచ్చిన కత్తి మెరుస్తూ కనిపించింది. ఆమె దృష్టి క్షణం పాటు దానిపైన నిలిచింది. 


తన మనస్సులో ఓ తుఫాను కదులుతోంది. 


కళ్లలో మరో చుక్క కన్నీరు తడవకముందే, ఆమె తన నిర్ణయం తీసుకుంది. 


చీకటి గదిలో నిశ్శబ్దం గట్టి గోడలా వుండిపోయింది. గడియారం మెల్లిగా ఆగిపోయినట్లుగా అనిపించింది. రాత్రి ఎంతగా అంధకారంతో కప్పబడిందో, నేహా మనసు అంతకంటే అధిక చీకటిని గ్రహించుకుంది. 

 

 కానీ ఈ గదిలో మాత్రం ఒక గుండె.. ఇంకో గుండెను నిశ్శబ్దంగా చూస్తోంది. 


విరాట్ శరీరం మంచంపై విరజిమ్మ బడింది. అతడి లొంగిపోయిన రూపం చూడటానికి అమాయకంగా అనిపించినా, నిజానికి అదే రూపం ఎన్నో రాత్రులు నేహాను భయంతో వణికించింది. 


అతని వేళ్లు ఆమె మడమల్ని పట్టుకుని లాగిన రాత్రులు, అతని మాటలు శూలాల్లా గుండెల్ని పిండిన ఉదయాలు, ఆమె ప్రతి ఊపిరిలో బరువైన భారం. 


నేహా నెమ్మదిగా లేచింది. కత్తిని చేతబట్టింది. దానిపై తళతళ మెరుస్తున్న ప్రతిబింబం ఆమె కళ్లలో కనిపించింది. కానీ ఆ కళ్లలో భయం లేదు. 


"ఇదే నా తుదిశ్వాస కాదా?"


అమె మనసు నిలబడి ఊపిరి తీసుకుంది. 


ఒకపక్క వదిలేసి పారిపోవాలని చెబుతున్న చిన్న ధ్వని. 


ఇంకోపక్క ఇక తట్టుకోలేనని గట్టిగా అరిచే మరో స్వరం. 


విరాట్ పక్కన చేరింది. అతని ముఖాన్ని చూసింది. ఆ ముఖం ఒకప్పుడు తనని కిరాణాల్లా చుట్టుకున్న ప్రేమలా అనిపించింది. కానీ ఇప్పుడు?


కత్తి అతడి గుండెల్లో దిగిపోయేలోపే, నేహా మళ్లీ తన గతాన్ని తడుముకుంది. 


"నాకు పెళ్లయిన తొలి రోజుల్లో ఇదే మంచం.. కానీ నా కలలపై విరాట్ బలవంతంగా నడిచాడు. నా నవ్వును త్రొక్కాడు. నా భయాన్ని ఆస్వాదించాడు. "


ఆమె గుండె గదిలో రహస్యంగా దాగిన విస్ఫోటంలా గట్టిగా కొట్టుకుంది. 


అతడి వేషాలు, అతడి మాటలు, అతడి అహంకారం.. 

ఇప్పుడతని శరీరం అంతా నిండిపోయాయి. 


కత్తి నిశ్శబ్దంగా గాలిలోకి లేచింది. 


"ఇక నిశ్శబ్దమే నా మాట!"


ఒక్కసారి..

రక్తం తడి శబ్దం చేసింది. 


ఒక క్షణం విరాట్ కనులు తెరిచాయి. అతని భయం తొలిసారి నేహా ముందున్నది. నేహా ముందుగా భయపడ్డట్టే, ఇప్పుడు విరాట్ భయపడుతున్నాడు. 


ఆమె కళ్లలో నీటి చుక్కలు లేవు. 


ఆమె స్వరం పగిలిన పదాల్లా వినిపించింది. 


 

ఫోన్ మాట్లాడిన పోలీస్ ఇన్స్పెక్టర్ మళ్లి స్టేషన్ లోకి వచ్చాడు. నేహా ఎదురుగా నిలబడి, ఏదో మాట్లాడాలనుకున్నాడు. 


కానీ ఆ పోలీసు అధికారి ఫోన్‌ని గట్టిగా పట్టుకొని, ఒక దీర్ఘ నిట్టూర్పు వదిలి, 


"నీకు ఇది సరదా అనిపించొచ్చు. కానీ, ఒక్కసారి లోపలికెళ్లాక అర్థమవుతుంది. " అని ఘాటుగా అనబోయాడు. 


ఆమె చూపు అతని మాటలను ఆగిపోయేలా చేసింది. 


సమాప్తం


ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: ఎం. కె. కుమార్


నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.


🙏





 
 
 

Comments


bottom of page