'Helmet' New Telugu Story
Written By Maddili Kesavarao
'హెల్మెట్' తెలుగు కథ
రచన: మద్దిలి కేశవరావు
"బాబు సుమన్.. నువ్వు బైకుపై వెళ్లే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు.. అసలే రోజులు బాగోలేవు.." అంటూ తల్లి శ్యామల చెబుతున్నప్పటికీ కొడుకు సుమన్ ఆ మాటల్ని వినీ, వినిపించుకోకుండా ఇటీవల కొన్న స్పోట్స్ బైకుపై రయ్.. రయ్ మంటూ దూసుకుపోయాడు.
"ఏమిటో ఈ కాలం కుర్రోళ్ళు.. పెద్దవారు చెప్పిన మాట్లాల్ని పెడ చెవిన పెడతారు" అంటూ తల్లి శ్యామల రుసరుసలాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.
తల్లీ కొడుకుల మధ్య జరిగిన సంభాషణలను దూరం నుంచి వింటున్న పక్కింటి పార్వతి నవ్వుకుంటూ వంట గదిలో ఉన్న శ్యామల పక్కకు చేరింది.
"చూడు శ్యామలొదినా.. ఇప్పటి పిల్లలు మన మాట వినే రకం కాదు. కుర్రాడు.. ముచ్చటపడి లక్షన్నర పెట్టి కొన్న బైకుపై హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు..?!. బొత్తిగా నీకేం తెలీనట్లుంది" అంటూ సుమన్ ను సమర్ధిస్తున్నట్లు మాట్లాడేసరికి శ్యామలకు చిర్రెత్తుకొచ్చింది.
"నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి పార్వతి.. ?! ప్రతిరోజూ టీవీల్లో, న్యూస్ పేపర్లో చూడటం లేదా చెప్పు.. ?! హెల్మెట్ వాడండీ, సురక్షితంగా డ్రైవింగ్ చెయ్యండి.. అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గగ్గోలు పెడుతూ ప్రచారాలు చేస్తోంది. ఇక ప్రమాదాలు విషయానికొస్తే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహన చోదకుల్లో సగటున రోజుకు పది మంది వరకు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న విషయం నీకు తెలుసా.. ?!" అంటూ శ్యామల అడిగే సరికి పార్వతి ముఖం బిక్కచ్చిపోయింది. అయినప్పటికీ తనను తాను సమర్ధించుకుంటూ..
" వదినా నీ చాదస్తం రానురాను మరీ ఎక్కువైపోతుంది. ఎప్పుడో ఏదో జరుగుతుందని ముందే ఊహించడం సరైన పద్ధతి కాదు. మీ తమ్ముడు.. అదే.. మా ఆయన గత పదిహేనేళ్లుగా ఆ బొక్కు స్కూటర్ పైనే కదా రానుపోను పాతిక కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతవరకు ఒక్క ప్రమాదమైనా జరిగిందా చెప్పండి.. ?" అంటూ పార్వతి సుమన్ కు వత్తాసు పలకడితో శ్యామల మిన్నకుండిపోయింది.
"అంతేనంటావా వదినా.. మా తమ్ముడు మన తరం మనిషీ. డ్రైవింగ్ చేసే సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంటికి వస్తారో మనకు తెలియంది కాదు. ఈనాటి పిల్లలు మనకు పూర్తిగా వ్యతిరేకం. డ్రైవింగ్ చేస్తే నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవలన్నదే వారి ధ్యాస. పిల్లలకు ఏమైనా జరగరానిది జరిగితే మనం తట్టుకోగలమా.. చెప్పు వదినా. ఏదైనా కీడించి.. మేలించమన్నారు పెద్దలు.. "
అంటూ శ్యామల నిట్టూర్చాడం.. పార్వతి భర్త శేఖర్ బయట నుంచి కేక వేయడం ఒకేసారి కావడంతో.. పార్వతి పరుగు తీసింది.
"ఏమేవ్.. ఈరోజు మా తోటి ఉద్యోగి బదిలీపై వెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఆఫీసులో ఈరోజు రాత్రికి చిన్న పార్టీ ఇస్తున్న సందర్భంగా అందర్నీ ఆహ్వానించారు. నేను రావడం కొంచెం ఆలస్యం అవుతోంది. నువ్వు భోజనం చేసి పడుకో.. " అంటూ శేఖర్ స్కూటర్ పై వెళ్ళిపోయాడు.
భర్త వెళ్లిన వైపే చూస్తూ పార్వతి ఇంటికి వెళ్ళిపోయింది.
* * * * * * * * *
రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో హడావిడిగా సుమన్ ఇంటికి రావడంతో శ్యామల కంగారు పడింది.
"ఏంట్రా సుమన్.. ఆ చెమటలు.. ఎదో కంగారుగా ఉన్నావ్.. ఏమైందిరా నాన్న.. ?!" అంటూ శ్యామల ఆందోళన పడింది.
"అబ్బే.. ఏ.. ఎ.. ఏమీ లేదులేమ్మా.. ఏమీ జరగలేదు.. నేను, నా ఫ్రెండ్ సినిమా చూసి ఇంటికి వస్తుండగా దార్లో ఎవడో వెధవ తాగొచ్చి నా బైక్ కు డాష్ ఇచ్చాడు, అంతే.. " ముఖంపై కర్చీఫ్ తో చెమట తుడుస్తూ సమాధానమిచ్చాడు సుమన్.
"అయ్యో.. దేవుడా.. నీకేం కాలేదు కదా.. నాన్నా.. " కంగారుపడుతూ శ్యామల కొడుకు సుమన్ ఒళ్ళంతా తడిమింది.
"మమ్మీ.. నాకేం కాలేదు, నువ్వు భయపడకు.. వెళ్లి పడుకో.. "
"అదికాదు నాన్న.. నీ బైక్ ను గుద్దినవాడి పరిస్థితి.. ఆయన ఎలా ఉన్నాడు.. ?!"
"వాడికేమీ అయుండదులే మమ్మీ.. చిన్న చిన్న గాయాలు తగులుంటాయే తప్పా.. ఇంకేం కాదు. చిమ్మ చీకటి కావడంతో ఆయన పరిస్థితి గమనించలేదు. వెనుక ఉన్న నా ఫ్రెండ్ రమేష్ ఇక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోదామంటూ తొందర చేయడంతో ఇంటికి వచ్చేశాను.. "
అంటూ సుమన్ చెప్పిన మాటలకు శ్యామల తల తిరిగినట్లైంది.
"ఆంటే.. పాపం ఆ వ్యక్తి పరిస్థితి ఏంట్రా.. అయ్యో ఎంత పని చేశావురా సుమన్.. " అంటూ సోఫాలో కూలబడిపోయింది శ్యామల.
" మమ్మీ.. నువ్వెళ్ళి పడుకో.. నేను హాల్లోనే పడుకుంటాను.. " అంటూ సుమన్ హాల్లో ఉన్న సోఫాపై కూర్చున్నాడు.
కొడుకు పరిస్థితిని గమనించిన శ్యామల అక్కడ నుంచి వెళ్లేందుకు నిరాకరించింది. కొడుకు చేస్తున్న ఘన కార్యాల్ని వెంటనే ఫొన్ లో దుబాయిలో ఉన్న భర్తకు ఏడ్చుకుంటూ చెప్పింది. తన మాట వినడం లేదని, నువ్వు కొనిచ్చిన బైక్ పై వెళ్లి అర్ధరాత్రికి ఇంటికి చేరుతున్నాడంటూ ఏకరువు పెట్టింది శ్యామల.
సుమన్ కు నిద్ర రావడం లేదు. తనను బైక్ తో గుద్దిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉందన్న ఆందోళన ఎక్కువైంది. రాత్రి పన్నెండున్నర.. ఒంటి గంట సమయంలో అప్పుడే సుమన్ నిద్రలోకి జారుకుంటున్న సమయంలో ఎవరో బయట నుంచి తలుపులు దబ దబామంటూ కొడుతుండటంతో సుమన్, తల్లి శ్యామలలు ఒకేసారి నిద్ర లేచారు.
తలుపు శబ్దం అదే పనిగా వినిపిస్తున్న కొద్దీ.. సుమన్ గుండె అదే శబ్దంతో కొట్టుకోసాగింది. ముచ్చెమటలు పట్టడంతో పరుగున వెళ్లి తల్లి శ్యామలను పట్టుకున్నాడు.
"మమ్మీ తలుపు తియ్యొద్దు.. వచ్చినవారు తప్పకుండా పోలీసులే అయుండొచ్చు.. నాకు భయంగా ఉంది మమ్మీ.. ప్లీజ్.. తలుపు తీయకు మమ్మీ" అంటూ సుమన్ భయపడుతూ సోఫా వెనక్కి వెళ్లి దాక్కుపోయాడు.
"నాన్న.. సుమన్. నువ్వు భయ పడకు.. వచ్చింది ఎవరో చూద్దాం బాబూ"
"వద్దు మమ్మీ.. వచ్చింది గ్యారంటీగా పోలీసులే అయుండొచ్చు.. యాక్సిడెంట్ కావడంతో వారు వెదుక్కుంటూ మనింటికే వచ్చారు.. " అంటూ కొడుకు ఏడుపు ముఖంతో ప్రాధేయపడటంతో శ్యామలకు సైతం భయం పట్టుకుంది.
"వీడి వాలకం చూస్తుంటే.. ఎదో జరిగింది.. ఏమైనా తలుపు తియ్యల్సిందే" అనుకుంటూ.. సుమన్ ను పైకి వెళ్లిపోవలంటూ శ్యామల సైగ చేసి వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా ఆందోళనగా, ఆయాస పడుతూ పక్కింటి పార్వతి కనిపించే సరికి ఊపిరి పీల్చుకుంది.
"ఏంటి పార్వతి వదినా.. ఈ అర్ధరాత్రి వేళా.. ఏమైంది" కంగారుపడుతూ శ్యామల ఆడిగేసరికి పార్వతి ఏడ్చుకుంటూ
"వదినా.. మీ తమ్ముడు ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. ఆయన ఆఫీసులోని వ్యక్తి బదిలీపై వెళ్తుండటంతో రాత్రి పార్టీ ఇచ్చాడంట.. 10గంటలకు ఫోన్ చేసి వస్తున్నాని చెప్పిన వ్యక్తి ఇంకా ఇంటికి చేరలేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ వస్తోంది వదినా.. నాకు భయంగా ఉంది.. ఊర్లో మా అబ్బాయి లేడు. సుమన్ ను ఓసారి పిలిచి అలా వెళ్ళమనండీ వదినా.. ప్లీజ్" అంటూ పార్వతి టెన్షన్ పడుతూ బ్రతిమలాడుతోంది పార్వతి.
"అలాగే వదినా.. మీరేం కంగారు పడకండి.. రండీ వచ్చి ఇలా కూర్చోండి" అంటూ సోఫా చూపిస్తూ.. " తమ్ముడు మొబైల్ ఛార్జింగ్ ఐపోయుండొచ్చు.. ఇప్పుడే సుమన్ ను పంపిస్తాను.. " అంటూ పార్వతిని కూర్చుండబెట్టింది.
మేడపై ఉన్న కొడుక్కి జరిగిన విషయం చెప్పింది శ్యామల.
ఊపిరి పీల్చుకున్న సుమన్ వెంటనే ఆలోచించకుండా ఫ్రెండుకు ఫోన్ చేసి అర్జంటుగా ఇంటికి రమ్మని చెప్పాడు.
ఐదు నిమిషాల్లో వచ్చిన ఫ్రెండ్ తో కలసి బైక్ పై బయటకు వెళ్ళిపోయాడు సుమన్.
* * * * * * *
ఆసుపత్రిలో శేఖరం మంచంపై ఉన్నాడు. పోలీసులు ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆఫీసులో వీడ్కోలు పార్టీ అనంతరం రాత్రి ఇంటికి వస్తుండగా కుక్క తన స్కూటర్ కు ఎదురుగా రావడంతో గుద్దుకొని అక్కడే పడిపోయానని అనడంతో పోలీసులు సెల్ఫ్ ఆక్సిడెంట్ గా కేసు నమోదు చేశారు.
"చుడండి శేఖర్ గారు.. మీకు దెబ్బలు బాగా తగిలినట్లు ఉన్నాయి. ఆసుపత్రి నుంచి డిచ్చార్జీ కాగానే స్టేషన్ కు రావాలి" అని చెప్పి టౌన్ ఎస్ఐ చెప్పి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు శేఖర్ ఊపిరి పీల్చుకున్నాడు.
"నిజం చెప్పండి అంకూల్.. రాత్రి మీకు ఎలా ఆక్సిడెంట్ జరిగింది.. ?. మేము వచ్చే సమయానికి మీరు రోడ్డుపైన అచేతనంగా పడున్నారు.. " అంటూ సుమన్ అడిగినప్పటికీ శేఖర్ నిజాన్ని చెప్పేందుకు అలోచించాడు.
"చెప్పండి తమ్ముడు గారూ.. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది" అంటూ శ్యామలా.. "ఆయన ఎప్పుడు నిజం చెప్పి ఏడ్చారు కదా.. ఇప్పుడు చెబుతారు" అంటూ భార్య పార్వతి ఎత్తి పొడుపు మాటలకు శేఖర్ కు నిజం చెప్పక తప్పలేదు.
"రాత్రి పార్టీ తర్వాత కొంచెం మద్యం సేవించిన నేను జాగ్రత్తగా వస్తున్న సమయంలో ఎవరో ఇద్దరు కుర్రోళ్ళు యమా స్పీడ్ గా వస్తూ నన్ను వెనుక నుంచి బలంగా గుద్ది, ఆగకుండా వెళ్లిపోయారు. నేను అలా స్కూటర్ తో రోడ్ ప్రక్కనే తుళ్ళిపోయాను. నాపై స్కూటర్ ఉండటంతో కాపాడాలంటూ ఎంత గట్టిగా పిలిచినా వెధవలు వినిపించుకోకుండా వెళ్లిపోయారు. తర్వాత మీరు నన్ను ఆసుపత్రిలో ఎప్పుడు చేర్పించారో తెలీదు బాబు" అంటూ శేఖర్ చెప్పడంతో సుమన్ గుండె గుభేలుమంది.
"వారిని గుర్తు పట్టలేదా అంకుల్.. " కాస్తా భయంగా.. అనుమానంగా అడిగాడు సుమన్.
"లేదు సుమన్.. కాకపోతే సుమారుగా నీ అంత వయసు ఉన్న కుర్రాళ్లే. కాలం మారింది బాబూ.. ఈ తరం కుర్రాళ్ళు బైక్ ఎక్కితే కన్ను, మిన్ను కానకుండా డ్రైవింగ్ చేస్తుంటారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. వాళ్లకు ఏమైనా జరిగితే బాధ పడేది మాలాంటి తల్లిదండ్రులే. తండ్రి ఎక్కడో కూలిపని చేసుకునేందుకు వెళ్ళిపోతాడు. తల్లీ ఇంకెక్కడో పనులు చేస్తోంది. పనీ, పాట లేని కుర్రోళ్ళు వాళ్ళని పీడించి బైకులు కొని ఇలా మా ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఒక్క విషయం చెప్పనా సుమన్.. నా ప్రాణాలు కాపాడింది హెల్మెట్.. "
"హెల్మెట్టా.. అదెలా.. ? అస్సలు మీరు హెల్మెట్ వేసుకోరుగా.. ?" అంటూ భార్య పార్వతి అనుమానం వ్యక్తం చేసింది.
నిజమే పార్వతి.. కానీ రాత్రి నేను బయల్దేరినపుడు నా ఫ్రెండ్ బలవంతంగా హెల్మెట్ ఇచ్చి వేసుకొని వెళ్ళమన్నాడు. నేను వద్దని వారించినా.. పర్వాలేదు మనం కాస్తా ఆల్కహాల్ డ్రింక్ చేసి ఉన్నాము. నేను మన ఫ్రెండ్ కారులో వెళ్లిపోతాను.. నువ్వు నా హెల్మెట్ వేసుకొని వేళ్ళు.. అంటూ బలవంతం చేయడంతో నేను వేసుకున్నాను.. ఇప్పుడు అదే హెల్మెట్ నా ప్రాణాల్ని కాపాడింది.. " అంటూ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ ఆక్సిడెంట్ చేసింది తానే కావడంతోనే డౌట్ వచ్చి ఫ్రెండుతో ఆ ఘటనా స్థలంకు వెళ్ళడం మూలంగా అంకుల్ బ్రతికారన్నది తెలుసుకున్నాడు సుమన్.
"చూశావా పార్వతీ.. మీ ఆయన ఎప్పుడూ హెల్మెంట్ పెట్టడని, ఏ రోజు ప్రమాదం జరగలేదని చెప్పావు. ఇప్పుడు ఏమైంది. అదే శేఖరం తమ్ముడు హెల్మెట్ పెట్టుకొని ఉండకపోతే మనకు దక్కేవాడా.. ?!" అంటూ శ్యామల చెప్పే సరికి పార్వతితో పాటు అక్కడున్న శేఖరం, సుమన్ లకు చెంపమీద కొట్టినట్లు అయింది.
సుమన్ అక్కడ నుంచి ఇంటికి వచ్చి రాత్రి జరిగిన సంఘటన తల్లికి పూసగుచ్చినట్లు చెప్పాడు. అంతే కాదు, తల్లి తలపై ఒట్టేస్తూ.. తాను ఎప్పుడు బైక్ పై బయటకు వెల్లినా హెల్మెంట్ పెట్టుకొని వెళ్తానని ప్రామిస్ చేశాడు.
***
మద్దిలి కేశవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మద్దిలి కేశవరావు
సీనియర్ జర్నలిస్ట్,
శ్రీకాకుళం జిల్లా
댓글