#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #HomeWork, #హోమ్వర్క్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
Home Work - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 01/01/2025
హోమ్ వర్క్ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
అది హైదరాబాద్ లో పేరున్న పెద్ద ఐటీ హబ్. అక్కడ అడుగుపెడితే, అన్నీ దగదగా మెరిసిపోతున్న గాజు భవంతులే.. ! కుక్క మెడలో బిళ్ళ వేసినట్టుగా అక్కడ ఆడ, మగ అంతా మెడలో ప్లాస్టిక్ బిళ్ళలు వేసుకుని.. అటు ఇటు తిరిగేస్తున్నారు. రోడ్డు పక్క టీ కొట్టు దగ్గర కొందరు, పునుకుల బండి దగ్గర కొందరు, పిజ్జా కోసం కొందరు.. ఎక్కడ చూసినా సందడే సందడే. అలాంటి వాతావరణంలో అడుగు పెట్టాడు సుదర్శనరావు. పల్లెటూరు నుంచి వచ్చిన అతను, ఇదంతా ఒక మాయాలోకం లాగ ఫీల్ అయ్యాడు.
రంగు రంగుల వెరైటీ బనియన్లు వేసుకున్న అమ్మాయిలు.. ప్రతి అమ్మాయి పక్కన ఒక అబ్బాయి. ఇదేనేమో ఇప్పటి ట్రెండ్ అనుకున్నాడు. మొత్తానికి తనకి కావాల్సిన సాఫ్ట్వేర్ కంపెనీ అడ్రస్ కనుక్కుని, అక్కడకు చేరుకున్నాడు సుదర్శనరావు. అది ఒక బహుళ అంతస్తుల భవనం. అందులో ఎక్కడో ఒక మూల ఉంది ఆ కంపెనీ. బాగా తిరగడం చేత టాయిలెట్ వచ్చేస్తోంది ఒక పక్క.. మరో పక్క దాహం వేసేస్తోంది.. షుగర్ కదా..
పాపం టాయిలెట్ ఆపుకుని చివరికి లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాడు. అందుకో ఒక మనిషి స్టూల్ పైన కూర్చొని 'మీ నెంబర్ ఎంత.. ?' అని అడిగాడు.
"మా ఇంటికైతే స్టేషన్ నుంచి పదో నెంబర్ ఎక్కితే చాలు.. " అన్నాడు సుదర్శనరావు తడుముకోకుండా.
"బస్సు కాదయ్యా.. నువ్వు వెళ్ళాల్సిన ఫ్లోర్ ఎంత.. ?"
"అదేదో.. పేరు.. ఆ.. 'అయోమయం సాఫ్ట్వేర్.. అక్కడికి వెళ్ళాలి"
"కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ పర్సన్ వెళ్తున్నాడు" అనుకుని నవ్వుకున్నాడు లిఫ్ట్ లో మనిషి.
'మా ఇంటి గదంత ఉంది ఈ లిఫ్ట్.. చక్కగా కుర్చీ వేసుకుని పైకి కిందకి తిరుగుతూ ఆడుకుంటున్నాడు.. ఇతని పనే బాగుంది. అసలు విషయం అడగనేలేదు.. ఒకటికి ఎక్కడ వెళ్ళాలి బాబు.. ? "
"లిఫ్ట్ దిగిన తర్వాత.. కుడి పక్కకి వెళ్ళు.. "
"దిగిన వెంటనే.. కుడి పక్క రూమ్ వైపు వెళ్ళాడు సుదర్శనరావు. ఇక్కడ పెద్ద గదులే ఉన్నాయే.. ఇవి కుడా మా ఇల్లంత ఉన్నాయి.. ఉచ్చ కోసమే ఇంత గది కట్టించారా.. ?" అనుకున్నాడు సుదర్శనరావు.
"సర్.. ! మిమల్ని కలవడానికి ఎవరో సుదర్శనరావు వచ్చారు.. పంపించమంటారా.. ?" అడిగాడు ఆఫీస్ బాయ్.
"ఎవరబ్బా ఈ సుదర్శనరావు.. ? పంపించు" అన్నాడు మేనేజర్.
"లోపలికి రావొచ్చా.. ?"
"రండి.. మిమల్ని నేను ఎప్పుడు చూడలేదు.. మీరు నాకు తెలియదనుకుంటాను.. " అన్నాడు మేనేజర్.
"నిజమే.. నేను మీకు తెలియదు.. మీ గురించి తెలుసుకుని నేనే వచ్చాను.. "
"చెప్పండి.. ! నేను మీకు ఏ సహాయం చెయ్యగలను.. ? మీ అబ్బాయికి ఏమైనా జాబ్ కావాలా.. ?"
"అదేమీ లేదండి.. మీ రూల్స్ కొంచం స్ట్రిక్ట్ చెయ్యమని అడగడానికి వచ్చాను.. ఎప్పుడూ హోమ్ వర్క్ యేనా చెప్పండి.. ? "
"మీరు అన్నది నాకు అర్ధం కాలేదు.. కొంచం వివరంగా చెప్పండి.. "
చెబుతాను.. వినండి.. ! ఈ లోపు మేనేజర్ రెండు కాఫీ తెమ్మని ఫోన్ చేసాడు
"మా అమ్మాయి సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించిందని.. అతనికే ఇచ్చి గ్రాండ్ గా పెళ్లి చేసాను. అబ్బాయి మంచివాడే.. అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడు" అని చెప్పడం మొదలుపెట్టాడు సుదర్శనరావు..
"అయితే మంచిదే కదా.. " అన్నాడు మేనేజర్.
"పెళ్ళైన మొదట పండక్కి కూతురిని, అల్లుడ్ని మా ఇంటికి పిలిచాము. పిలిచిన వెంటనే, ఇంకా చెప్పాలంటే, రెండు రోజుల ముందే వచ్చాడు అల్లుడు.. అమ్మాయిని తీసుకుని. క్యాబ్ డబ్బులతో నా ఖర్చు మొదలు. కొత్త అల్లుడు కదా అని సరిపెట్టుకున్నాము. ఒక పెద్ద బ్యాగ్ చేతికి వేసుకుని వచ్చాడు. వచ్చిన మొదటి రోజే అదేదో 'సైసై' అంట, పెట్టించమని అడిగాడు. నెలకి వెయ్యి ఇచ్చి పెట్టించాను. అదీ నా అకౌంట్ లోనే..
"అది సైసై కదండీ.. వైఫై.. "
"అదే అదే.. "
ఇది ఇలా ఉంటే, పక్కింటి సుబ్బారావు ఒక రోజు కలిసాడు..
"ఏమిటి సుబ్బారావు ఎలా ఉన్నావు.. ?" అని పొరపాటున పలకరించాను.
"పండక్కి మా అల్లుడు కూతురు వచ్చారు.. మా అల్లుడి కోసం, నూట ఒక్క వెరైటీ వంటకాలు సిద్దం చేసి వడ్డించాము.. మా అల్లుడు చాలా మురుసిపోయాడు తెలుసా.. ? ఇప్పటివరకు ఈ జిల్లా మొత్తంలో ఎవరూ ఇన్ని వంటకాలతో అల్లుడుని ఆనందపరచలేదు తెలుసా.. ! మా ఫోటో పేపర్ లో కుడా వేసారు తెలుసా.. ?"
"చాల్లేవోయ్ నీ బడాయి.. "
"బడాయి ఏమిటి.. ? మాములు ఉద్యోగస్తుడైన నేనే ఇంతలాగ చేస్తే, నువ్వు కనీసం రెండువందల రకాలైనా వడ్డించాలి మీ అల్లుడికి.. "
"నాకేమి అటువంటి ఆచారాలు లేవు.. గట్టిగా ఎవరితోని అనకు.. "
పండుగ ముందురోజు మా అమ్మాయి..
"నాన్నా.. ! ఇందాకల పక్కింటి సుబ్బారావు గారి అమ్మాయి.. అదే నా ఫ్రెండ్.. "
" ఆమె బాగుందా.. ?"
"పండక్కి.. భర్త తో వచ్చిందట.. ! ఇంట్లో భలే వెరైటీ వంటలుట.. తిని బాగా ఎంజాయ్ చేసారంట. మాకూ నువ్వు అంతకన్నా బాగా వడ్డించాలి.. మీ అల్లుడు ప్రెస్టేజ్ ఇష్యూ.. నీది కుడా"
" అది కాదే బంగారు తల్లి.. నా మాట విను"
"తగ్గేదేలే నాన్నా.. ! అన్నీ పండగలకి మాకు నువ్వు ఎక్కువ ఎక్కువ వెరైటీస్ పెంచుకుంటూ పోవాలి నాన్నా.. మాకు అన్నీ బాగా చెయ్యాలి "
"తప్పక.. రెండువందల ఒక్క వెరైటీస్ తో పండగ పుట వడ్డించాము సర్.. " కంట్లో ఆనందభాష్పాలు నింపుకుంటూ.
పండుగ బాగానే జరిగింది.. కాకపోతే అల్లుడు ఎప్పుడూ ఆ నల్లటి డబ్బా ఒకటి ముందు పెట్టుకుని, టైం పాడు లేకుండా అలా టప్పు టప్పు అని కొడుతూనే ఉంటాడు. మధ్యలో ఎవరితోనో ఫోన్ లో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు.. అప్పుడప్పుడు తెల్ల దొరసానులు కూడా మాట్లాడుతుంటారు. పండగనే మాటే కానీ.. ఎప్పుడూ అదే గోల. అడిగితే అదేదో హోమ్ వర్క్ అన్నాడు.
కొన్ని రోజులే కదా.. అని సర్దుకుపోయాము.. నేను మా ఆవిడా. అసలే పల్లెటూరులో ప్రశాంతంగా ఉండడం అంటే మాకు చాలా ఇష్టం. టైం కి తినడం, పడుకోవడం అంతా పద్ధతి నాది నా భార్యది. మా అల్లుడు మాకు పూర్తి వ్యతిరేకం. ఎప్పుడు పడుకుంటాడో తెలియదు.. ఎపుడు హోమ్ వర్క్ అంటాడో తెలియదు. 'మా అమ్మాయి ఎలా భరిస్తుందో.. ' అని అనుకున్నాము.
పండగైపోయిన తర్వాత.. అల్లుడు కోసం బట్టలు పెట్టి 'బై' చెబుదామనుకుంటే..
"ఇప్పుడే ఎందుకు మావగారు.. ఇంకా చాలా టైం ఉంది కాదా" అన్నాడు అల్లుడు.
నాకు ఏమీ అర్ధం కాక.. మా అమ్మాయిని పిలిచి అడిగాను..
"మా ఆయనకి సెలవు ఇమ్మంటే వాళ్ళ బాస్ ఇవ్వలేదు.. కావాలంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే, ఎక్కడైనా ఒక్కటే కదా.. అని ఇక్కడే ప్లాన్ చేశారు మా ఆయన. మళ్ళీ ఎలాగా దీపావళికి పిలుస్తారుగా.. అందుకే ఇక్కడే ఉండిపోదామన్నారు.. "
'ఏమిటో ఆఫీస్ వాళ్ళు ఎక్కువ హోమ్ వర్క్ ఇచ్చేస్తున్నారు. నాకు ఇక్కడ బిల్ బాగా పెరిగిపోతోంది'
"ఇలా.. దసరా నుంచి.. దీపావళి దాకా.. ఇక్కడే ఉన్నారు. అల్లుడు జేబులోంచి ఒక్క పైసా తియ్యడు. అన్నీ నా అకౌంట్ లోనే.. నాకొచ్చే పెన్షన్ డబ్బులు ఏమాత్రం చెప్పండి.. ?.. అలాగని అల్లుడుని అగడలేను.. అమ్మాయికి నచ్చ చెప్పలేను"
దీపావళి తో మాకు మోక్షం వస్తుందని అనుకుంటే, దగ్గర్లో క్రిస్మస్, సంక్రాంతి ఉందిగా అని మా అల్లుడు మొదలు పెట్టాడు. ఇంకో నాలుగు రోజుల్లో సంక్రాంతి పండుగ.. అందుకే మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. మీరు దయుంచి ఈ హోమ్ వర్క్ తీసేయండి. దీనివల్ల చాలా మందిని కాపాడిన వారు అవుతారు.. లేకపోతే, సంక్రాంతి తో ఆగక.. ఉగాది అంటాడేమో మా అల్లుడు అని భయంగా ఉంది. ఇప్పటికే, రెండు ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. మీకూ ఇంత పెద్ద ఆఫీస్ వేస్ట్ అయిపోతుందిగా.. కాస్త ఆలోచించండి.. !"
"ఇంతకీ ఇదంతా నాకెందుకు చెబుతున్నారు.. ?"
"మా అల్లుడు మీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు సర్.. ఇంకా మా ఊరి నుండి పిల్లనిచ్చిన చాలా మంది మావలు ఈ హోమ్ వర్క్ విషయంలో ధర్నా చేయడానికి సిటీ కి బయల్దేరుతున్నారు "
"ఇప్పుడు అర్ధమైంది.. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి.. మేము ఇచ్చే హోమ్ వర్క్ కాదు.. "
"అదే.. అదే.. "
"కంగారు పడకండి.. మాకూ దీని మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మాకే కాదు, చాలా కంపెనీలకి ఇలానే కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నాము. ఈ సారి పండక్కి.. మీరే రావొచ్చు మీ అల్లుడు ఇంటికి.. ఎందుకంటే, అప్పటికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండకపోవచ్చు.. అదే మీ భాషలో హోమ్ వర్క్. మీరు మీ అల్లుడింట్లో దర్జాగా ఉండొచ్చు.. మా ఇంటికి కుడా తప్పకుండా రావాలి సుమండీ.. " అని నవ్వుతూ అన్నాడు మేనేజర్.
*******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
ఇది తాత మోహనకృష్ణ గారి హాస్య శైలిని ఎంతో బాగా ప్రతిబింబిస్తోంది. హోమ్ వర్క్ కథ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పని ప్రణాళికలు, ఊహించని పరిణామాలు, కుటుంబాల్లో ఉండే వినోదభరితమైన సంఘర్షణలను అందంగా హాస్యరసమయంగా ప్రతిపాదించింది.
ఈ కథలో వర్క్ ఫ్రం హోమ్, దాని ప్రభావం, పల్లెటూరి మామలు-అల్లుళ్ల మధ్య ఉండే ప్రత్యేకమైన సంబంధాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది నేటి సమాజంలోని వాస్తవికతలను హాస్యంతో మిళితంగా చూపుతుంది.