'Husbands - Cook Housewives - Rest' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
'హజ్బెండ్స్ కుక్ - హౌస్ వైఫ్సు రెస్ట్' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"అమ్మగారూ! రేపటి నుండి పనిలోకి రాను. అదేదో సినిమా యాటరు పేరుందే, అదేనమ్మగారూ.. జల్దీ గాపకం రావట్ట్లే. ఆ.. ఆ.. అదే 'కరీనా' ట. అదేదో ఎయిడ్స్ లాగా అంటుయాదిట. బయటకు రాకూడదుట" గిన్నెలు కడుగుతూ అంది రంగి.
"కరీనా కాదే రంగీ, కరోనా. సర్లే. అదంతా సద్దుమణిగాకే రా" అంది సరోజ.
రంగి పనిలోకి రానంటే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది సరోజకు. కోడలు వచ్చి ఇన్నేళ్ళయినాక కూడా తనకు ఇంటి పనులు - వంట పనులు తప్పట్లేదు. 'సర్లే ! ఇంక చీకటి పడుతోంది. రాత్రికి వంట ఏర్పట్లు చూడాలి' అని ఆ పనులలో నిమగ్నమైంది సరోజ.
ఆ రాత్రి అందరి భోజనాలు పూర్తయినాక అప్పుడే వంటగది సర్ది పడకగదిలోకి వచ్చింది సరోజ.
"లాక్ డౌన్ " కదా! రోజూ లాగా ఉదయం 5 గం.. కే నిద్ర లేచి హడావిడిగా ఇంటిపని, వంటపని చేసి బాక్సులు సర్ది భర్తను, కొడుకునీ - కోడలినీ, మనవడినీ బయటికి పంపక్కర్లేదు. హమ్మయ్య ! కాస్త ఆలశ్యంగా నిద్ర లేవచ్చు" అని అనుకుంటూ ప్రశాంతంగా పడుకుంది.
అలవాటుగా 5గం.. కే మెలకువ వచ్చినా "లాక్ డౌన్" అని గుర్తుకువచ్చి మళ్ళీ నిద్రకుపక్రమించింది సరోజ. "ఏయ్! సరూ! లే ! కాఫీ ఇవ్వు" అన్నాడు భర్త రమేష్.
"అబ్బ ! ఇవాళన్నా కాస్త ఎక్కువ సేపు పడుకోనివ్వండి" అన్న సరోజ మాటలకు 'లాక్ డౌన్' అన్నారు కానీ 'మౌత్ డౌన్' అనలేదు సరూ. " అన్న భర్త మాటలకు ఇహ లేవక తప్పదని లేచి కాలకృత్యాలను ముగించి వంటగదిలోకి వచ్చింది సరోజ.
భర్తకు కాఫీ ఇచ్చి తనూ త్రాగుతూ 'ఇవాళ బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలా? అనుకుని అందరికీ కలిపి ఇడ్లీ పెట్టేస్తే సరి' అనుకుంది. ఇంటి పని పూర్తి చేసి స్నానంచేసి దేవుని ముందు దీపం పెట్టి వంటగది లోకి వెళ్లి అందరికీ ఇడ్లీలు తయారుచేసి అందులోకి శెనగచట్నీ చేసింది.
"ఇవాళ 'ఉప్మా - పెసరట్టు' చేయండి అత్తయ్యా!" అని అప్పుడే నిద్రలేచిన కోడలు రమ్య ఆర్డరు జారీ. రమ్య అడిగింది చేయకపోతే ఇంక ఆరోజంతా ఏదో ఒక సణుగుడు. అందుకని ఇంక 'ఉప్మా- పెసరట్టు', దానిలోకి అల్లం చెట్నీ చేసింది.
"మామ్మా! నాకు పూరీలు కావాలి" అన్నాడు మనవడు హర్ష.
'సరే ' అని తన కొడుకు రాజుకు కూడా అవి ఇష్టమే కనుక పూరి, అందులోకి ఆలూ కూర చేసి 'హమ్మయ్య !' అనుకుంది. ఇంక అందరూ బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసి 'వర్క్ ఫ్రమ్ హోమ్' అని ఎవరి పనులలో వాళ్ళు కంప్యూటర్ ముందు లీనమై పోయారు. హర్ష కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నాడు. సరోజ అందరి బట్టలు ఉతికి దొడ్లో ఆరేసి వచ్చింది.
ఇంకా వంట చేయటానికి చాలా సమయముంది అని నిన్న వ్రాస్తూ సగం వదిలేసిన కధని పూర్తిచేద్దామని కూర్చుంది సరోజ. రోజూ ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళినాక కధలు వ్రాయటం, కుట్లు-అల్లికలు, సాయంత్రం తోట పని చేయడం ఆవిడ వ్యాపకాలు.
"ఏయ్ ! సరూ! టి. విలో నెట్ ఫ్లిక్స్ పెట్టు. అందులో 'నీకూ- నాకూ జాంతానై' సినిమా చాలా బాగుందని నా కొలీగ్ చెప్పాడు" అన్న భర్త పిలుపుకు హాలులోకి వెళ్ళి ఆపని పూర్తి చేసి, మళ్ళీ రిమోట్ కు ఇంకో సారి పిలుస్తారని అది ఆయన చేతికిచ్చేసి వచ్చి కధ వ్రాయటానికి పూనుకుంది.
"అమ్మా! హర్షకు కాసేపట్లో ఆన్ లైన్ క్లాసులున్నాయి, రెడీగా ఉండమను. వాడు ఆ గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడేమో" అన్న రాజు కేకకు లేచి 'ఆటల్లో లీనమైన వాడికి నా మాట వినపడదు' అనుకుని వాడి దగ్గరకు వెళ్ళి చెప్పి వచ్చింది.
ఇంక రెండు ముక్కలు వ్రాశాక " సరూ! 11 అయ్యింది. వంట ఏంచేస్తున్నావ్? గుత్తి వంకాయ కూర, మామిడి కాయ పప్పు, సాంబారు, నీవు బాగా చేస్తావోయ్. అవి చేయి" అన్నాడు రమేష్.
'అయ్యో! అప్పుడే 11 అయ్యిందా! ' అని వంట చేయడానికి వెళ్ళేలోగా రాజు, రమ్యలు వచ్చి వాళ్ళకు ఇష్టమైన మరో 2 రకాల కూరలు, పులిహోర, సేమ్యాపాయసం చేయమని కోరారు. అవన్నీ చేసింది. 1గం. కు. భోజనాలు చేశాక అందరూ కాసేపు నిద్రపోయారు.
ఇంక కధ వ్రాసే పనిలో పడింది సరోజ. కధ ఇంక కాస్తలో పూర్తవుతుందనగా బయట చిరుజల్లుల వాన. అయ్యో! బట్టలు తడిసిపోతాయి అని పరుగున వెళ్ళి అవన్నీ లోపలకి తెచ్చింది.
కాసేపటికి వాన పెద్దదయ్యింది. ఆ చప్పుడుకు నిద్ర లేచిన రమేష్ " చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికత్తే సరసన ఉంటే, .. చెప్పలేను ఈ హాయి- ఎంతో వెచ్చగ ఉంటుందోయీ" అని పాడుతూ వచ్చి సరోజ నడుంచుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకోబోయాడు.
"కరోనా బ్రేక్. దూరం మెయింటెయిన్ చేయాలి. ఇవాళ్టి నుండి పాపం శ్రీవారికి బ్రహ్మచర్యదీక్షతో అన్నీ పస్తులే " అని కొంటెగా నవ్వింది సరోజ. దిగాలుపడిన భర్త ముఖాన్ని చూసి " ఉండండి, టీ తెస్తాను" అంది. 'ఈ వానలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలనుందోయ్. వాటిని చెయ్యి' అన్నాడు రమేష్.
అవి చేసేటప్పుటికి రమ్య వాళ్లు నిద్ర లేచారు. వేడి వేడి బజ్జీలు అందరూ తిని, టీలు త్రాగేసి టీవీ చూస్తూ, సెల్ ఫోన్లకు పని చెప్పారు. వాళ్ళతో తను కూడా చూస్తూ కాసేపు గడిపింది. ఆఫీసు వర్క్
మీటింగ్ లు ఉన్నాయని ఎవరి పనులలో వాళ్ళు బిజీ.
రాత్రికి మళ్ళీ వాళ్ళ వాళ్ళ కోరికల మెనూ తెలుసుకుని వంట పని, భోజనాలు షరా మామూలే. వంట గదిలో పని పూర్తి చేసుకుని పడకగదిలోకి వచ్చేటప్పటికి కార్లు- బస్సులు ఢీకొని పెద్ద యాక్సిడెంట్ అయినంత శబ్దంతో భర్త గురక.
ఇహ ఎలాగూ కరోనా ఉపవాసాలే కనుక తలగడా, దుప్పటి తీసుకుని వచ్చి సోఫాలో పడుకోబోతూ
"ఉదయం నుండి ఇంత రాత్రిదాకా మెషిన్ లాగా క్షణం కూడా తీరిక లేదు.. ఒక్క రోజే ఇలా అలసిపోయాను. పోనీ కోడలి సాయమేదన్నా ఉందా అంటే, ఆ ఆశ కూడా లేదు.
పెళ్ళయి ఇంటికి వచ్చిన కొత్తల్లో వీకెండ్స్ కదా అని కోడలికి ఏదో పని అప్పచెపితే "ఆఫీసు వర్క్ తో చాలా బిజీ. మీరు హౌస్ వైఫే కదా అత్తయ్యా ! చేసుకోవచ్చుగా ఏముంది " అంది చులకనగా.
ఆ మాటకు చిన్న బుచ్చుకుని ఒకసారి మాటల్లో భర్త చెవిన వేస్తే "అందులో తప్పేముంది. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువ. నీకేం శ్రమ ఉంది, హాయిగా ఇంట్లో ఉంటావు" అని రమ్యను సమర్థించాడు రమేష్.
'హౌస్ వైఫ్సు అంటే అంత చులకనా వీళ్ళకు' అని తలచుకుని మనసులో బాథపడింది.
"దేవుడా ! ఈ కరోనా పీడ ఎప్పుడు పోతుందో ? 3 వారాలు లాక్ డౌన్ నాటికి బక్కచిక్కి పీనిగలా అవుతానేమో! ఈ 3 వారాలు ప్రభుత్వం..
'లాక్ డౌన్ - వర్క్ ఫ్రమ్ హోమ్' లాగా
"హజ్బెండ్స్ కుక్ - హౌస్ వైఫ్సు రెస్ట్" అని ఆర్డర్ జారీ చేస్తే ఎంత బాగుండునో. ఈ వంకతో అన్నా నాలాంటి హౌస్ వైఫ్సుకు కాసింత రెస్ట్ దొరుకుతుంది. తన భర్త, రమ్య లాంటి వాళ్ళకు హౌస్ వైఫ్సు కష్టము, విలువ తెలుస్తుంది కదా ! " అనుకుని నిద్రలోకి జారుకుంది సరోజ.
.. సమాప్తం.
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
@user-tq9nh9lg2w • 3 hours ago
బావుంది..