top of page
Writer's picturePitta Govinda Rao

ఐ (నేను)



 'I(Nenu)' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 29/08/2024

'ఐ (నేను)' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


మంచి మనసు ఉన్నోళ్ళకి డబ్బు ఉండదు. డబ్బు ఉన్నోళ్ళకి మంచి మనసు ఉండదు. చాలామంది మంచి వ్యక్తిత్వం గలవారు కూడా డబ్బులు సంపాదించక ముందు ఒకలా డబ్బు వచ్చాక మరోలా మారిపోతుంటారు. 

ఎక్కడో కోటికొక్కడు అన్నట్లు డబ్బు, మంచి వ్యక్తిత్వం గలవాడు ఉంటాడు 


ఆ కోటికొక్కడే అభిరామ్. రామ్ కి ఇంకా పెళ్ళి కాలేదు. అతడు ఒక కంపెనీ సి. ఈ. వో. ఆఫీసులో సెక్యరీటి నుండి మేనేజర్ వరకు అందరి మనసులు గెలుచుకున్న ఏకైక వ్యక్తి కూడా రామే. 


ఈరోజు రామ్ పుట్టినరోజు. ఆఫీసులో అతడి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం అతడు తన బాబాయ్ లు పిన్నమ్మలు మరియు వారి పిల్లలు వారి స్థోమతే అంతంతమాత్రం అయినా..  వారి ఇంటి దగ్గర ఎన్నడూ లేనివిధంగా తన పుట్టినరోజు వేడుకలు భారీ ఖర్చుతో ఏర్పాట్లు చేశారటా. అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. కారు దిగగానే తివాచీలు, విద్యుత్ కాంతులు, లైటింగ్స్ అబ్బూరపరిచే ధ్వనులు స్వాగతం పలికాయి. 


తన పుట్టినరోజు వేడుకలకు వచ్చిన చాలామంది అతిధులు వచ్చారు. వారిలో రామ్ కి తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. అందరూ విద్యావంతులు, వ్యాపారవేత్తలు గొప్పగొప్ప వాళ్ళే ఆఫీసులో పాల్గొన్న వారు మరలా ఇక్కడ కూడా ఉన్నారు. రామ్ లోపలికి వెళ్ళాడో లేదో.. దాదాపు ఎనిమిది మంది వెయిటర్స్ కలిసి పట్టుకుని వచ్చేంత కేకు అది. అది చూసి ఇంత ఆడంబరంగా చేస్తుండటం బహుశా రామ్ కే ఆశ్చర్యం వేసింది మనసులో.


ఆ ఎనిమిది మంది పట్టుకుని వస్తున్న భారీ కేకుని చూసి అతిధులందరూ happy birthday to u అంటూ హర్షద్వానాల మధ్య శుభాకాంక్షలు తెలపటం మొదలెట్టారు. ఈ క్రమంలో తత్తరపాటుకు లోనై ఒక వెయిటర్ అనుకోకుండా తన కాలిని తానే తన్నుకుని పడిపోగా మిగతా వెయిటర్స్ పై ప్రభావం పడి ఆ కేకు నేలపాలైంది. అంతే.. !


అప్పటివరకు చప్పట్లు, అరుపులతో శుభాకాంక్షలు పలుకుతున్న వారంతా సైలెంట్ అయిపోయారు. కోపంతో పళ్ళు పరపర కొరుకుతు కనిపించారు వాళ్ళంత. రామ్ కి కూడా కోపం వచ్చినా.. అతడు విజ్ఞత గల మనిషి కదా.. మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉండలేడు. ఇంత పెద్ద వేడుకలో భారీ కేకు నేలమట్టం అవ్వటం ఊహించని పరిణామం. అందుకు ఆ వెయిటర్స్ భయపడిపోతున్నారు. అందరి కంటే ముందు రామ్ వారిని ఆడిపోసుకుంటాడని ఊహించారు. 


కానీ.. ఆ నేలమట్టం అయిన కేకుముక్కని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా తన నోటిలో వేసుకుని పర్వాలేదులే ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని.. ?అనే సంకేతాలు ఇచ్చి మీరు కూడా నాలాగే తీసుకుని తినండి అంటు చేతితో సైగా చేశాడు. ఆ నేలమట్టం అయిన కేకు బాబాయ్ కుటుంబంతో సహా ఒక్కరు కూడా ముట్టుకోలేదు. అందరూ విందు భోజనాలకు సిద్దం అయిపోయారు. కానీ.. తాను మాత్రం వెయిటర్స్ దగ్గరకు వెళ్ళి వారి భుజం తట్టి వారితో డ్రింక్స్ తాగాడు. 


అది చూసిన బాబాయ్ 

"రేయ్ అభిరామ్ నీకేమైనా మతిపోయిందా.. ? నీకోసం ఇంత ఖర్చు పెట్టి వేడుకలు ఏర్పాటు చేస్తే అదంతా పాడుచేసిన వారితో డ్రింక్స్ చేస్తావా.. అక్కడ రకరకాల వంటకాల భోజనాలు ఉన్నాయి పదరా"


"డబ్బు ఉన్నవారికి నువ్వు పెట్టే ఈ వంటకాలు ఎందుకు బాబాయ్".. 


రామ్ మనసులో ఎవరో ఉన్నారు. వాళ్ళు కళ్ళముందు కదలాడుతున్నారు. 


"అన్నీ ఉన్నవాడికి అన్నం పెట్టడం కాదు.. ఏమీ లేనోడికి, ఆకలితో ఉన్నోడికి ఒక పూట అన్నం పెట్టి చూడు, వాళ్ళ కళ్ళలో సంతోషం, వారి ముఖంలో చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు వాళ్ళకి వడ్డించండి. నేను అవతల ఆకలితో పస్తులున్న ఎందరో పేదల ముఖం పై చిరునవ్వు చూడ్డానికి వెళ్తాను" 


బాబాయ్ ఏదో చెప్పబోతున్నా.. వినకుండా కారులో వెళ్ళిపోయాడు. 


తన నరకయూతమైన బాల్యాన్ని నెమరువేసుకున్నాడు అభిరామ్. 


ఊహ తెలిసిన తర్వాత దాదాపు ఏడేళ్ళపాటు ముద్దుల చెల్లితో కలిసి అమ్మనాన్నలతో ఎంతో ఆనందంగా గడిపాడు రామ్. మధ్యతరగతి కుటుంబమే అయినా ఎక్కువ ఆస్తులు కూడా లేవు. బాబాయ్ కి రామ్ తండ్రికి ఎప్పుడు ఆస్తుల గొడవలే. 


ఒకరోజు తెల్లవారి నిద్ర లేచిన రామ్ కి అమ్మనాన్నలు చలనం లేకుండా పడి ఉండటంతో బాబాయ్ ని తీసుకువచ్చాడు. చనిపోయారని అంత్యక్రియలు కూడా జరిపించాడు బాబాయ్. తర్వాత కనీసం పిల్లల భవిష్యత్ గూర్చి కూడా ఏమీ పట్టించుకోకపోవటంతో అప్పటికే చనిపోయినప్పుడు తన తండ్రి బొటన వేలికి సిర ఉండటం చూసి ఏదో అనుమానంతో ఉన్నా..  చిన్నవాడు అంతగా ఏమీ ఆలోచించలేకపోయాడు. 


దీంతో చెల్లిని తీసుకుని రోడ్డున పడ్డాడు. ఆకలితో ఎన్నో రాత్రులు పస్తులున్నాడు. చెల్లి కడుపునింపటమే అతడికి కడుపు నిండినంత పని. కానీ.. చివరకు చెల్లి ఆకలితోనే కన్నుమూసింది. రామ్ కి ఇది ఏమాత్రం సహించలేదు. అడుక్కుని మరీ.. తన చెల్లి ఆకలి తీర్చటానికి ప్రయత్నించాడు అయినా విధి మరోలా తలిచింది. 


తర్వాత విధి తనవైపు తిరిగింది. రామ్ ఆకలి బాధలతో అలమటించిపోయేవాడు. చివరకు ఓ గుడిలో ప్రసాదం తిని అక్కడే ఉంటూ బిచ్చగాడిగా మారాడు. అప్పటి నుండి ఆ గుడే అతడికి ఆవాసం అయింది. అయితే అక్కడ చాలామంది బిచ్చగాళ్లు రోజురోజుకు పెరిగిపోయేవాళ్ళు. 


ఒకరోజు ఒక వ్యాపారవేత్త, కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఆ గుడికి తీసుకువచ్చాడు. కొడుకు చేతుల మీదగా అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించాడు. 


"సార్, ఆకలి అవ్వకుండా ఏదైనా మందు ఉంటే ఇవ్వండి సార్. ఇప్పుడు తిన్నాక మరలా ఆకలి వేస్తుంది కొద్దిసేపటికే " అన్నాడు. 


ఆ మాటలకు చలించిపోయిన వ్యాపారవేత్త రామ్ కి కొంత డబ్బు కూడా ఇచ్చి, "నువ్వు బాగా చదువుకుని ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎందుకు మార్చలేవు ఆలోచించు" అన్నాడు.


 అప్పుడు రామ్ కి తన తల్లిదండ్రులు ఉన్నప్పుడు తాను కూడా స్కూలుకు వెళ్ళేవాడినని గుర్తుకు వచ్చి చిరిగిన దుస్తులతోనే మరలా స్కూలుకు వెళ్ళటం ప్రారంభించాడు. ఏ ఆసరా లేనోళ్ళకి కష్టాలే ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి కదా. ఈ విషయం రామ్ కి అర్థం అయ్యేసరికి చాలా ఏళ్ళు పట్టింది. ఈ గ్యాప్ లో అతడు ఓ కంపెనీకి బెస్ట్ ఎంప్లాయ్ గా మారాడు. రామ్ కంపెనీలో చేరి అర్ద సంవత్సరం అయ్యేసరికే బెస్ట్ ఎంప్లాయ్ అవటం వెనుక అతడిలో ఉన్న నైపుణ్యం, స్కిల్స్, అనుభవం, మనిషిని చదివే గుణం, మంచితనం ఇలా అన్ని ఉండటమే. 


అనతికాలం లోనే అదే కంపెనీకి సిఈవో అయ్యాడు. రామ్ అంచలంచలుగా ఎదిగిన తీరు బాబాయ్ కి తెలిసింది. అప్పటినుంచి రామ్ కి కనెక్ట్ అవ్వటానికి ప్రయత్నించేవాడు. బాబాయ్ గుర్తుకు వచ్చాక తల్లిదండ్రుల మరణ విషయం బుర్రలో మొదిలింది రామ్ కి. 


తన తండ్రితో ఎప్పుడు ఆస్తుల కోసం గొడవపడే బాబాయ్ వాళ్ళు చనిపోయిక ఎంతో బాధతో ఆగమేఘాల మధ్య అంత్యక్రియలు జరిపించాడు. , తర్వాత కనీసం తనను, తన చెల్లిని కూడా పట్టించుకోలేదు. చెల్లి ఆకలితో చనిపోయినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల మరణం పై రామ్ కి బాబాయ్ పై అనుమానం ఉన్నా.. నిర్ధారించ లేకపోయాడు కాబట్టి ఊరుకున్నాడు. 


కారు సడన్ గా ఆగటంతో రామ్ తెలివి తెచ్చుకున్నాడు. కేటరింగ్ లోపలికి డ్రైవర్ కి పంపాడు. క్షణాల్లో రామ్ అనుకున్న చోటకు భోజనాలు సిద్దమయ్యాయి. తన పుట్టినరోజు నాడు కొన్ని వందలమంది పేదల నడుమ కేకు కట్ చేసి వారితో కలిసి బోజనం చేశాడు. 


తర్వాత కూడా పేదల బతకు మార్చటానికి, కేవలం పేదల పిల్లల కోసం ఒక పెద్ద పాఠశాల, కళాశాలను కట్టించాడు. రామ్ మంచివాడు మరియు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు. చిన్నప్పుడు ఆకలితో చెల్లిని కోల్పోయాడు కానీ ఏనాడూ దొంగతనం ఆలోచన కూడా దరి చేరనివ్వని గొప్ప వ్యక్తిత్వం రామ్ ది.


 అయితే పెద్దయ్యాక ఎంత గొప్పవాడు అయినప్పటికి ఇంత సాదాసీదాగా ఉండటం కూడా గొప్పే. అప్పటికి ఇప్పటికీ అతడి పరిస్థితి మారింది కానీ.. !అతడి వ్యక్తిత్వం మారలేదు. అది రామ్ కే చెల్లింది. రామ్ బతుకుతెరువు కోసం అడుక్కుని బతికాడు. బిచ్చగాళ్లతో కూడా కలిసి బతికాడు. రూపాయి కోసం ఏడ్చిన రోజులు చూశాడు, కోట్ల రూపాయలు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాడు.


తాను ఒంటరిగా బతికే రోజులు చూశాడు, అందరూ తనతో కలిసి ఉంటున్న రోజులను చూశాడు, మనిషిలో మోసాలను చూశాడు. అదే మనిషిలో మానవత్వాన్ని చూశాడు. 


డబ్బు శాశ్వతం కాదని, మనిషి తనకు ఉన్నంతలో పరుల కోసం పెట్టినప్పుడు లేనివాడే ఉండడని రామ్ ఆ రోజు వ్యాపారవేత్త కొడుకు పుట్టినరోజు సందర్భంగా తమందరికి అన్నం పెట్టిన సందర్భాన్ని అప్పుడప్పుడు నెమరువేసుకుంటాడు. 


మనిషిని మనిషిలా చూసి నేను అనే అహాన్ని తన దరికి చేరనివ్వకుండా చూసుకుంటున్నాడు రామ్. డబ్బు ఉందని బాబాయ్ రామ్ దరి చేరాలనుకున్నా.. బాబాయ్ చేసిన పాపానికి శిక్ష వేయకపోయినా.. బాబాయ్ కి దూరంగానే ఉన్నాడు రామ్. ఈ విషయాన్ని బాబాయ్ కి కూడా చెప్పాడు. 

నేను మనిషినని డబ్బు ఉన్నోళ్ళకోసం బతకలేనని లేనోళ్ళ కోసమే బతుకుతానని తన సంపాదనలో సగం కంటే ఎక్కువ పేదలు పిల్లలు గొప్పవాళ్ళు అవ్వటం కోసమే ఖర్చు చేస్తానని, ఒక గుడి కడితే దేవుడు కరుణిస్తాడో లేదో కానీ వెయ్యి మంది బిచ్చగాళ్లు తయారవుతారు. అదే ఒక పాఠశాల కడితే వందలమంది గొప్పవాళ్ళు తయారవుతారని ఆలోచించి ఆచరణలో పెడుతున్నాడు రామ్.

*** *** *** *** *** *** ***


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం




47 views0 comments

Comments


bottom of page