#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #ఇద్దరున్నవారింటికేవెళదాం, #IddarunnaVarintikeVeladam, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
'Iddarunna Varintike Veladam - New Telugu Story Written By Bhallamudi Nagaraju
Published In manatelugukathalu.com On 07/10/2024
'ఇద్దరున్న వారింటికే వెళదాం' తెలుగు కథ
రచన: భళ్లమూడి నాగరాజు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఏమండీ.. ఎక్కడికి వెళ్ళేరు..” అని ప్రశ్నించింది సీతమ్మ గారు, చేతిలో కూరగాయల సంచి తో ఇంట్లోకి వచ్చిన భర్తని చూసి.
“అదేమిటోయ్.. పిచ్చి ప్రశ్న.. నువ్వే చెప్పావుగా బజారుకెళ్లి కూరగాయలు తెమ్మని”.
“చెప్పింది నేనే.. , ఎన్ని గంటలకు వెళ్ళేరు.. ? ఎన్నింటికి వచ్చేరు”. అని కాస్త గట్టిగానే ప్రశ్నించింది ఆవిడ.
“ఏమిటోయ్ ఇవాళ వింతగా ప్రవర్తిస్తున్నావు”, అని..
రామయ్య గారు ఆమె ముఖం లోకి చూసేసరికి, అప్పటికే ఆమె కన్నీటి పర్యంతం అయి మాట బొంగురు పోయి, వస్తున్న ఏడుపును ఆపుకొని ‘నేనిక ఉండలేనండి’అని అంటూ.. చీరచెంగుతో కన్నీళ్లు తుడుచు కుంది.
ఆమె కన్నీళ్లు చూడగానే రామయ్య కు గుండె ఆగినంత పని అయింది. ఎప్పుడూ ఆమె ఏడవడం చూడని ఆయన, ఒక్కసారిగా ఆవిడ ఏడ్చేసరికి, ఆయనకూ ఏడుపు వచ్చేసింది.
"ఏమైంది సీతా.. నేను బజారుకు వెళ్లేముందు బాగానే ఉన్నావు గా.. ఇంతలో ఏమైంది”.
మీకేం పోయిందండి.. మీరు హాయిగా ఉన్నారు.. అన్నీ సమయానికి అందించేందుకు నేనున్నాను. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు.
ఉదయాన్నే.. కూరలు తెస్తా, అని బజారుకు వెళ్లి, దారి పొడవున స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ, సరదాగా గడిపేస్తారు. ఇంటికి వచ్చేక పేపర్ పట్టుకొని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు వార్తలన్నీ చదువుకుంటూ, మధ్యల్లో స్నేహితులు, బంధువులతో ఫోన్ లో సంభాషణలతో కాలం గడిపేస్తారు.
‘నేను ఈ ఒంటరి తనం భరించలేక పోతున్నాను. పనులు చెయ్యలేక పోతున్నా..’ అంటే.. మీరేమో ‘హోటల్ నుంచి ఉదయం, రాత్రి టిఫిన్ తెచ్చేస్తా’ అంటారు. ‘వంట మనిషి పెట్టేస్తాను’ అంటారు.
పనులు చెయ్యలేక కాదండి.. పనుల మీదకి మనస్సు పోవడం లేదు. ఏది చేద్దామన్న పిల్లలే గుర్తుకొస్తున్నారు. పోనీ ‘పిల్లలు పిలుస్తున్నారు అమెరికా వెళ్లిపోదామండీ’ అంటే ‘ఇప్పటి నుంచి వాళ్ళదగ్గరకెందుకే’ అంటారు. ఈ ఒంటరి తనం నరకంలా ఉందండి.. అమెరికా వద్దు.. ఓ పని చేద్దాం, మా అక్కా వాళ్ళ ఊరులో ఒక సీనియర్ సిటిజన్ అపార్ట్మెంట్ ఉందంట. అక్కడ కేవలం మన లాంటి వారికే ఇస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ లో టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకూ అన్నీ వాళ్ళే చూసుకుంటారుట. అందరూ కలిసి మెలిసి సరదాగా వుంటారుట. అక్కడకు వెళ్ళిపోదాం” అంటూ సుదీర్ఘగా తన మనసులోని భావాలు, ఆలోచన లు, బాధలు చెప్పుకుంటూ కళ్ళు ఒత్తుకున్నారు సీతమ్మ గారు.
అన్నీ విన్న రామయ్య గారు “సీతా! నీ బాధ నాకు అర్థం అయింది. ఇది కేవలం మన బాధే కాదు. పిల్లలు దూరంగా ఉంటూ ఇద్దరేసి ఉన్న వాళ్లందరిదీ. మనం ఎక్కడికీ పోవద్దు.. మన ఆలోచనలు, అలవాట్లు మార్చుకుందాం. ఇన్నాళ్లు నువ్వు పూజలు చేసి నీ దేవుళ్లను బాగా చూసుకున్నావు. ఇక నిన్ను నీ దేవుడు బాగా చూసుకుంటాడు. పూజలు, మడీ - తడి అంటూ ఉదయం అంతా వృధా చేయకుండా, ఇద్దరం సరదాగా బజారుకు వెళదాం. కావలసినవన్ని తెచ్చుకుందాం.
నీకూ ఊసు పోతుంది.. మనసు హాయిగా ఉంటుంది. ఇక సాయంత్రం వేళల్లో మనలాగే ఇద్దరేసి ఉంటున్న మన మిత్రుల ఇళ్లకు వెళదాం. వాళ్ళు కూడా మనలాగే ఒంటరిగా ఉండలేక బాధ పడుతూ ఉంటారు.. వాళ్ళని మనింటికి రమ్మని ఆహ్వానిద్దాం, ఇలా ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చి వెళుతుంటే మంచి స్నేహ బంధం ఏర్పడుతుంది” అని అనేసరికి, సీతమ్మ గారి ముఖం లో ఆనందం కనిపించింది.
“బాగుందండి మీ ఆలోచన, . అంతా కలసి మెలసి ఉంటే ఎలాంటి ఆలోచనలు రావండి. పదండి.. ఇద్దరే ఉన్న వారి లిస్ట్ రాద్దాం” అని అనుకుంటూ పుస్తకం పెన్ను పట్టుకొని, కేవలం ఇద్దరున్న వారి జాబితా రాస్తూ హాయిగా నవ్వుకున్నారు.
💐💐💐
భళ్లమూడి నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు భళ్లమూడి నాగరాజు, రాయగడ ,ఒడిశా లో ఉంటున్నాను. ఇప్పటి వరకు 30కథలు వివిధ వార,మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి సుమారు వంద కవితలు ప్రచురితం
Comments