top of page

ఇదీ పండుగ అంటే..

Writer's picture: BVD Prasada RaoBVD Prasada Rao

#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #IdiPandugaAnte, #ఇదీపండుగఅంటే, #అల్లుడుఅత్తామామకథ

'Idi Panduga Ante' - New Telugu Story Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 31/10/2024

'ఇదీ పండుగ అంటే' తెలుగు కథ

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



దీపావళి రోజున ఆ గ్రామంలో పండుగ సందడి నెలకొంది. 

ప్రతి ఇంటి ముందు రంగరించుకున్న రంగు రంగుల రంగోలిలు ముచ్చట పరుస్తున్నాయి.


ఇళ్లల్లో వివిధ పిండి వంటల ఘుమఘుమలు గుబాళిస్తున్నాయి.


వీధుల్లో పిల్లల కేరింతలు కేకెక్కిస్తున్నాయి. 


వీటన్నింటి నడమ.. గ్రామం నడిమిన ఉన్న నిరాడంబరమైన ఓ ఇంటిలో.. ఒక కుటుంబం.. కొత్త అల్లుడు రాక కోసం ఎదురు చూస్తోంది. 


"రేవతీ ఇలా రావే." వంట వసారా నుండి అన్నపూర్ణ పిలుస్తోంది. ఆవిడ పులిహోర కలుపుతోంది.


రేవతి తల్లి దగ్గరుకు వెళ్లింది వీథి వైపు ఇంటి గడప నుండి.


"బాగా కుదిరిందా లేదో రుచి చూసి చెప్పవే." రేవతి కుడి అర చేతిలో ఇంత పులిహోర పెట్టి అడిగింది అన్నపూర్ణ.


రుచి చూసిన రేవతి.. "సూపర్" అంది. లొట్టలేస్తూ మరింత అడిగి తింది. 


అన్నపూర్ణ సంతోషపడుతోంది.

"నా వంటలు ఐపోయాయి. ఇక అల్లుడుగారు రావడమే తరువాయి." అంది.


రేవతి మనసు తన భర్త సోమసుందరం రాకకై పొంచుంది. భర్త తలంపుతో ఆమె హృదయం ఆనందంతోనూ, ఆత్రంతోనూ పేట్రేగిపోయింది. వివాహిత జంటగా ఇది వారి మొదటి దీపావళి. 


కూతురు ఆలోచనలను చదువుతున్నట్లుగా అన్నపూర్ణ.. "మెలికలు ఆపు. కొత్త అల్లుడు. దగ్గరుండి నువ్వే అన్నీ చూసుకో. మాట రానీకు." చెప్పింది నవ్వుతూనే.


"నాకు తెలుసు. నేను బాగా చూసుకుంటానులే." తల్లి చీర కొంగుతో తన కుడి అర చేతిని తుడుచుకుంటూ గొణుగుతోంది రేవతి. 


కూతురు భరోసాకు ఆనందించింది అన్నపూర్ణ. 

ఆ తర్వాత.. కొత్త అల్లుడు సోమసుందరం ఆ ఇంటికి వచ్చాడు. రేవతి గుండె లయ తప్పుతోంది.


భార్య తడబాటును గమనించిన సోమసుందరం.. "కూల్ రేవతి." చిత్రంగా అంటాడు.


అన్నపూర్ణ కూతురు భుజంపై చేయి వేసి.. "దారి తప్పుకోవే." అంది మెల్లిగా. 


రేవతి తెములుకుంటూ.. "స్వాగతం.. వెల్కం." అంటోంది దారిస్తూ. 


లోనికి వచ్చేక.. చేతులు జోడించి.. "నమస్తే అత్తగారూ" అన్నపూర్ణని చూస్తూ చిన్నగా నవ్వుతూ అంటాడు సోమసుందరం.


"మామయ్యగారు ఏరీ." అడుగుతాడు.


"పొలాల వైపు వెళ్లారు. వచ్చేసే వేళే." చెప్పుతోంది అన్నపూర్ణ.


రేవతి చూపగా.. నట్టిల్లున కుర్చీలో కూర్చున్నాడు సోమసుందరం.


అన్నపూర్ణ వెళ్లి.. నీళ్ల గ్లాసుతో వచ్చింది. అల్లుడుకు ఆ గ్లాసును అందించింది.


కొద్దిగా నీళ్లు తాగి.. ఆ గ్లాసును కింద పెట్టబోతుండగా.. రేవతి ఆ గ్లాసును తీసుకుంటుంది.. తల్లి చెప్పగా.


అంతలోనే అక్కడికి రేవతి తండ్రి భీమేశ్వరరావు వస్తాడు.

అల్లుడును పలకరిస్తాడు.


"పెందిలినే వస్తారనుకున్నాం. మీరు రావడం ఆలస్యమవుతోందని అమ్మాయి చెప్పితేనే నేను పొలాల వైపు వెళ్లాను." మంచం అంచున కూర్చుంటూ చెప్పాడు భీమేశ్వరరావు.


చిన్నగా నవ్వేసాడు సోమసుందరం.


మామా అల్లుళ్లు మాట్లాడుకుంటుండగా.. కూతురును పిలుచుకొని అక్కడి నుండి కదిలింది అన్నపూర్ణ.

కూతురుకు రెండు ప్లేట్లలో అరిసెలు, జంతికలు రెండేసి చొప్పున సర్ది ఇచ్చింది. 

వాటిని తెచ్చి చెరో ప్లేటుగా భర్తకి, తండ్రికి అందించింది రేవతి.

"నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందులో ఇలాంటి వంటకాలంటే మరీ ప్రీతి." చెప్పాడు సోమసుందరం అరిసెను కొరుకుతూ.


"మీ అత్త ఇవి బాగా చేస్తోంది." చెప్పాడు భీమేశ్వరరావు.


అప్పుడే మంచి నీళ్ల గ్లాసులతో అన్నపూర్ణ వచ్చింది. 

తర్వాత వాళ్లు మాటమంతిలో పడ్డారు.


ఆ తర్వాత.. 

కొసరి కొసరి మధ్యాహ్నం భోజనం సోమసుందరంచే తినిపించారు రేవతి తల్లిదండ్రులు.


కిళ్లీ తినిపించేక.. పడుకోమని పడక చూపారు వాళ్లు. 

సాయంత్రం అవుతుండగా నిద్ర లేచాడు సోమసుందరం. రేవతి తొందర చేయగా గబగబా తయారయ్యాడు. 

అన్నపూర్ణ దీపపు ప్రమదెలు వీథి గుమ్మంన సర్దుతుంటే.. భీమేశ్వరరావు సహాయపడుతున్నాడు.


"మీ కోసం బోల్డు టపాసులు నాన్న కొన్నారు. వాటిని కాల్చేటప్పడు జరా జాగ్రత్త. నాకు భయమబ్బా." అంటోంది రేవతి.


చిన్నగా నవ్వేస్తాడు సోమసుందరం.

ఇంట్లో పిల్లల తచ్చాటలను గమనించిన అన్నపూర్ణ ఇంట్లోకి వస్తోంది.


"బాబుకు టీ కలపనా." అంటోంది కూతురుతో.


"ఆఁ. కలిపి ఇవ్వు." చెప్పుతోంది రేవతి. 


ఆ వెంబడే..

"నాక్కూడా." అంటోంది.


అన్నపూర్ణ నవ్వుకుంటూ అటు వెళ్లిపోతోంది.

"పాపం.. చూస్తున్నాగా. ఉదయం నుండి అత్తమ్మగారే పనులు చేస్తున్నారు. నువ్వు కాస్తా సాయ పడవచ్చుగా." నవ్వుతూనే చెప్పాడు సోమసుందరం.


"ఏం పర్లే. అమ్మ చేస్తోంది." తేలిగ్గా అనేస్తోంది రేవతి.


అన్నపూర్ణ.. కూతురుకు, అల్లుడుకు చెరో టీ గ్లాస్ ఇచ్చి.. మరో గ్లాస్ ను పట్టుకొని బయట ఉన్న భర్త వద్దకు వెళ్తోంది.

ఐదు నిముషాల లోపునే.. అన్నపూర్ణ భర్తతో కలిసి అక్కడి వస్తోంది.


భీమేశ్వరరావు జేబులోంచి పది ఐదు వందలు నోట్లు తీసి.. సోమసుందరంతో..

"బాబూ.. ఇవి ఉంచు. మా సరదా. పండుగ కానుక." చెప్పుతాడు.


వాటిని అందుకున్నాడు సోమసుందరం సరదాగానే. 

ఆ వెంబడే.. తన పాంట్ జేబులోంచి పర్సు తీస్తాడు. ఆ నోట్లను పర్స్ లో పెట్టేసి.. పర్స్ పక్క అరలోంచి రెండు నోట్ల కట్టలను తీస్తాడు.


"మీరు ఇలా పక్క పక్కన నిల్చోండి." చెప్పుతాడు అత్తమామలకు.


వాళ్లు అయోమయం పడుతూనే అలా నిల్చుంటారు. 

వాళ్లకు చెరొక నోట్ల కట్టను సోమసుందరం అందిస్తుండగా..

"మాకా.. మాకు ఎందుకు బాబూ.." ఆ ఇద్దరూ ఒకే మారు అంటారు ఆశ్యర్యంగా.


"ఇది నా పండుగ నాటి సరదా.. కాదు.. బాధ్యత..  అక్కడ అమ్మా నాన్నలకు పెట్టాను. ఇక్కడ అత్త మామలకి పెడుతున్నాను." చెప్పాడు నిండుగా సోమసుందరం.


అన్నపూర్ణ.. భీమేశ్వరరావులతో పాటుగా రేవతి కూడా విస్మయమవుతోంది.. సోమసుందరం చొరవకు.. చర్యకు.

ఆ తోవనే.. అత్త మామల చేతుల్లో ఆ నోట్ల కట్లను పెట్టి.. వాళ్ల కాళ్లకు నమస్కరించడానికి ఒంగుతున్నాడు సోమసుందరం..


***

 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










156 views0 comments

Comentários


bottom of page