top of page
Writer's picturePandranki Subramani

ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 1


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 1' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 1' తెలుగు ధారావాహిక మొదటి భాగం

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



భద్రం ఇప్పుడు మాడవీధి చివరన, జీవన ప్రస్థానపు మలుపున వెనక్కి తిరిగి చూడలేని తావున నిల్చున్నాడు. ఆకాశం లోకి తేరి చూస్తూ, నిట్టూర్పుల నడుమ దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా నిల్చున్నాడు. బ్రతుకు బాటలోని తటపటలు అతణ్ణి కుదురుగా ఆలోచించనివ్వడం లేదు. అవలోకనంలో పడి మరింత ఆలస్యమైతే ఇంటి వాకిట వరకూ వచ్చిన అవకాశం విహంగం లా యెగిరిపోవచ్చు, చేజారి పోవచ్చు.


మరైతే-- కడుపులోని చల్ల కదలనీయకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు కాలమంతా గడిపేయాలనుకుంటే, జీవితానికి నిలకడ యెప్పుడు వస్తుందని? బ్రతుకు రథ చక్రం ఎప్పుడు కుదుటపడుతుంది. గనుక-- అప్పుడతని కళ్ల ముందు మొన్న జరిగిన దృశ్యం పొడుచుకు వచ్చిన పొద్దులా మెదిలింది. టీ. వీ. సీరియల్స్- లైవ్ కార్యక్రమాలు మిక్కిలి ఇష్టంగా చూసే భార్యను అటు వెళ్తూ అడిగాడు- “అదేంవిటి? జంతువుల ప్రోగ్రాము కూడా చూస్తావేమిటి అంత ఆసక్తిగా! ”


కాంతం తలూ పుతూ బదులిచ్చింది- “ఔనండీ! నాకన్నీ ఇష్టమే—ప్రోగ్రాముల టైమింగ్సు కూడా నాకు బాగా తెలుసు, మరైతే టీ వీ సెట్ మాత్రం మరీ చిన్న సైజు”


అతడు నవ్వి అడిగాడు- “అది సరేగాని- దాని గురించి తరవాత ఆలోచిద్దాం గాని- అదేమిటి- చిన్న పాటి ఎలుగు లా ఉంది. దానిని చూసి తోడేళ్ళు- దుప్పిలు- అడవి గేదెలు- పందులు తప్పుకు తిరుగుతున్నాయి. అది మాత్రం అదురూ బెదురు లేకుండా చేతులూపుతూ రికారిగా తోకాడిస్తూ తిరుగుతూంది. అంతటి చిన్నరూపానికి అంతటి గుండె నిబ్బరమా! అదెలా?"


అది విని నవ్వింది. పుంజుకున్న ఉత్సాహంతో చెప్పింది. “ఔనండీ! చూపుకి చిన్నదయినా దానికి తెగువెక్కువ. రౌడీ షీటర్ లా మొండి గా అడివంతా తిరుగుతుంటుంది- ఎంతటి మొండిదంటే- అన్నిటి తోనూ సైఁ అంటూ కలబడుతుంది. చీటాలు ఎలుగులు సహితం దానిని చూసి దూరంగా తొలగిపోతుంటాయి. బొందిలో ప్రాణం ఉండగా ఏవీ సాహసించి తేనెపుట్టవద్దకు వెళ్ళవు కదా! ఇది మాత్రం అదేమీ లక్ష్యపెట్టకుండా వెళ్లి తేనేటీగల్ని చెల్లా చెదురు చేసి పుట్టతేనెను బాగా తాగి తనకు అడ్డు వచ్చిన తేనెటీగల్ని సహితం నమిలి మ్రింగేస్తుంది. దానిని హనీ బడ్జర్ అంటారు”.

అతడు నమ్మలేనట్టు గుడ్లప్పగించి చూస్తుండగా తన జీవన సహచరి అన్న మరొక మాట అతడి గుండె కవాటాలను తాకింది. “అడవిలో బ్రతకాలంటే అంతటి తెగువ ఉండేతీరాలి కదండీ! ”


నిజమే కదూ! అడవిలోనే కాదు- అడవి వంటి ప్రపంచంలో కూడా మనుగడ చేయాలంటే కడగండ్లకు బెదరకుండా తెగువ చూపించే తీరాలి కదూ ఆ హనీబడ్జర్ లా!


ఎదురవబోయేది కడగండ్ల వర్షం కదానని తను పట్టుతప్పి కొట్టుకుపోకుండా ఉండాలి కదానని జాగ్రత్త చూపిస్తే మరి తన కుటుంబం సహితం కొట్టుకుపోతే-- అప్పుడు తను మాత్రం మిగిలిపోయి ఏమి చేస్తాడు? దేని కోసం మనుగడ సాగిస్తాడు?


ఏది ఏమైనా సరే- నయానో భయానో వృధ్ధ తల్లిదండ్రులకి, లోక జ్ఞానం అంతంత మాత్రమే కలిగున్న సతీమణికి నచ్చచెప్పి ముందున్న నేల, జారుడుగా కనిపిస్తున్నా పట్టు తప్పిపోకుండా వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోవాలి.


ఇంతకూ తను యెదుర్కోవలసిందేమిటి? జీవితం- అంతా తన కనుకూలంగా జరగదు. ఆ మాటకు వస్తే యెప్పుడు మాత్రం యెవరికి మాత్రం జీవితం ఆటుపోట్లకు అతీతంగా సాగింది గనుక-- ఇక పైన జాప్యానికి తావివ్వకూడదు.


అప్పుడతనికి ఉన్నపళంగా బడిపాఠాలు చెప్పే సింహాద్రిగారు గుర్తుకు వచ్చారు. ఆయన నేర్పించిన సంస్కృత శ్లోక తాత్పర్యం గుర్తుకి వచ్చింది.


’మరునాడు చేయాల్సిన పనిని నేడే చేయాలి. మధ్యాహ్నానికి పూర్తి చేయాల్సిన కార్యాన్ని ఇప్పటికిప్పుడే పూర్తి చేయాలి. చేయాల్సిన పనుల్ని మనం పూర్తి చేసామా లేదానని మృత్యువు వేచి ఉండదు’


ఇది వ్యాసులవారు శాంతి పర్వంలో నుడివిన అమృతవాక్కు. నిజమే మరి- తనకు అవకాశాలన్నీ అనుకూలంగా ఇష్టపూర్వకంగా మారేంత వరకూ కాలం కాచి ఉండదు కదా!


”కర్మణ:గహనో గతి:” కర్మను అర్ధం చేసుకోవాలంటాడు గీతాచార్యుడు. అంత లోతుగా అర్థం చేసుకోగల శక్తి తనకెక్కడిది? తను పూర్తి చేసింది కటాబొటి చదువేగా!


ఇంతకూ భద్రం వెళ్లేది, అదేదో బదలీపై సాగి రిపోర్టు చేయబోయే పెద్ద ఉద్యోగమేదీ కాదు. సర్కారు కొలువు అసలే కాదు. కొత్త ఢిల్లీ నగరంలో, కరోళ్ బాగ్ టౌన్ షిప్పులో తెలుగువాళ్ళు నడిపే ఒక దక్షిణాది మెస్సులో వంటవాడుగా- మెస్ చీఫ్ కుక్ కి సహాయకుడిగా వెళ్లబోతున్నాడు. అక్కడేదో బిర్యాణీ హోటెల్ లో అసిస్టెంట్ సూపర్ వైజర్ గా ఉంటూన్న తన చిన్ననాటి నేస్తం గంగా ధరం నుంచి ఉత్తరం వచ్చినప్పుడు, మొదటతడు వెళ్ళకూడదనే అనుకున్నాడు.


భాష తెలియని ఊరు- అక్కడి వాళ్ల అలవాట్లతో ఆచార వ్యవహారాలతో యే మాత్రమూ పరిచయం లేని ప్రాంతం; ఎందుకు వచ్చిన రొద అనుకుంటూ వెనక్కి తగ్గాడు. ఔనూ కాదూ అనకుండా నాన్చాడు. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిల్చుని నీళ్లు తాగడం మిన్నకదా! పుట్టినూరు కన్నతల్లి వంటి దని, దాహం తీర్చే జీవనది వంటిదని-- దానికి ఈడు మరేదీ ఉండదని చెప్పలేదూ పెద్దలు!


కాని సజావైన అతడి ఆలోచనల్ని పరిస్థితులు పైనుండి పడే పొత్తరాళ్ళలా కుదురుగా సాగనివ్వలేదు. ఎడారిలో గోల్కొండ దెబ్బ అన్నట్టు— తను చాలా రోజులుగా పనిచేస్తూన్న బాంగారు బాతు వంటి హోటల్ మూసేసి బాస్ ఏకంగా దుబాయ్ చెక్కేసాడు. ఇకపోతే- దెయ్యం వెనుక భూతం కూడా తోడైనట్టు- ఆర్థిక మాంద్యమొకటి దేశమంతటా తగలబడి ఎంత తల క్రిందులుగా ప్రయత్నించినా మరొక మంచి హోటెల్ లో కుదరలేక పోయాడు. తనకు మాత్రమేనా ఆ పరిస్థితి- తన వంటి వంటగాళ్లు చాలా మంది, ఈశాన్య ప్రాంతం నుండి- నేపాళ్ ప్రాంతం నుండి వచ్చిన వాళ్లతో సహా చాలా మంది ఇంటి ముఖం పట్టారు.


కర్రీ పాయింట్ లో చిన్నపాటి ఉద్యోగం దొరికినా జీతభత్యం కటాబొటి- పుడిసిడంత లేదు. ఇక పోతే- గంగాధరం అన్నట్టు కుటుంబస్థుడిగా ఇప్పటి మాట కాదు. రేపటి సంగతి గురించి కదా తను ముఖ్యంగా ఆలోచించాలి- కనీసం తనను నమ్ముకున్న ఐదుగురు ప్రాణాల కోసమైనా ముందుకు సాగాలి కదా! పనిలో పనిగా గంగాధరం తనకు కాదని తప్పుకోలేని పరిస్థితి కల్పిస్తూ మరొక ఎర వేసాడు. ఇక్కడి హోటెల్స్ లా కాకుండా అక్క డ మెస్సులలో ప్రాథమిక కార్మిక సంక్షేమ పథకాలైన పి. ఎఫ్- మినిమమ్ వేజస్ యాక్ట్ వంటి వాటిని పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత అమలు చేస్తారట.


ఇకపైన తనకూ తన వృధ్ద తల్లిదండ్రులకూ. భార్యా బిడ్డలకూ ఇంకేమి కావాలి? భవిష్యత్తుకు అదొక విధమైన ఇనుప కవచమే కదూ! అలా పరిపరివిధలా ఆలోచిస్తూ ఎట్టకేలకు అతడొక తీర్మానానికి వచ్చాడు. తనిక కలుగలు వెతుక్కోకుండా తెగువ చూపించే తీరాలి. ఆ హనీ బడ్జర్ లా మొండి ధైర్యంతో తోసుకుంటూ నెట్టుకుంటూ ముందుకు సాగే తీరాలి. దేశ రాజధాని మరీ దూరం అనుకుంటూ ఏదేదో ఊహించుకుంటూ జంకుతున్నాడే గాని- ఢిల్లీ మాత్రం తమది కాదా- భారత దేశంలోని అంతర్భాగం కాదా! భాషలు యాసలు వేరైనా వాళ్ళు మాత్రం తమ వాళ్లు కారా!


మరొకమారు భద్రం అసంకల్పితంగా వెనక్కి చూసుకున్నాడు. జ్ఞాపకాల్ని తడిమి చూసుకున్నాడు. తన గతంలో ఏముందని గర్వంగా చెప్పుకోవడానికి? ఎనిమిదవ తరగతి ప్యాసయిన వెంటనే తండ్రి చేసిన మొదటి పని- తనను ప్రముఖ పాకశాస్త్ర ప్రవీణుడు అభినవ నలభీముడు కామయ్య వద్ద వంటవృత్తిలో సహాయకుడిగా చేర్పించడం. అటుపిమ్మట తన యవ్వన జీవిత మంతా తండ్రి అడుగుజాడల్లో- కామయ్యగారి అదుపాజ్ఞల్లోనే సాగింది.


మంచీ చెడూ వాళ్ళు నేర్పిందే-- ఇంతకీ తన సతీమణి ఎవరని- తన పాకశాస్త్ర గురుదేవుడు కామయ్యగారి పెద్దకూతురే! ఇద్దరి పెళ్ళీ ఎలా కుదిరిందని- చూపులూ చూపులూ కలసి- మనసులు మనసులూ విరిసి- అలా అలా అన్నమాట-- అదంతా ప్రక్కన పెడితే ఇప్పడతడి ముందున్న లక్ష్యం ఒక్కటే- ఎట్టి పరిస్థితిలోనూ తన కొడుకులిద్దరూ తనలాగ వంటగదుల్లో బంధించబడకూడదు. పొగచూరిన కుంపట్ల వద్ద మాగకూడదు.


వాళ్లు వంటగదుల గడపలు దాటి, గరిటెల బాణాలు ప్రక్కన పెట్టి బైటి ప్రపంచంలోకి అడుగులు వేయాలి. వాళ్ళు బైటి ప్రపంచంలోకి వెలుగు వెల్లువలోకి అడుగులు వేయాలంటే తను కష్టాల కొలిమికి సిధ్ధం కావాలి. సుఖాలకు సౌకర్యాలకు దూరం కావాలి. అంతే కాదు. తన వృధ్ధ అమ్మానాన్నలకు కాస్తంత తెరపినివ్వాలంటే అంతకంటే ముఖ్యంగా అతణ్ణి తనలాగే వృత్తి వ్యాపకపు వంట వాడిగా మార్చిన వృధ్ధ తండ్రిపైన ఎప్పుడు కూడా అలుక వహించకూడదు.


తాతయ్య ఆయనకు నేర్పింది, కాల క్రమాన తనకు తెలిసిందే కదా తనకొడుక్కి నేర్పాడు- ‘యథా పితా తథా పుత్ర:! ’అన్న రీతిన-- ఏది ఏమైతేనేం గనుక, తన కొడుకులిద్దర్నీ కనీసం స్కూల్ పైనల్ పూర్తి చేయగలిగేలా చూడాలి. దీనికోసం తను దేనికైనా సిధ్ధమే! ఆ తరవాత వాళ్ల శ్రమ- వాళ్ళ ప్రాప్తం.


ఎట్టకేలకు లక్ష్యసిధ్ధుడై పుట్టినూరు కంచెరపాలెం విడిచి దేశరాజధాని ఢిల్లీ నగరం చేరుకున్నాడు భద్రం;సెలవు రోజుల్లో తప్ప కుండా చూసి పోతుంటానని, నెలకొకసారైనా ఉత్తరం వ్రాస్తుంటానని ఇంటిల్లపాదికీ భరోసా ఇచ్చి-- అతడి మాట నీటిమీద గీతేనని- అంతదూరం నుంచి అనుకున్నప్పుడల్లా రావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదని వాళ్ళకు మాత్రం తెలియదా- పైకి చెప్పలేరు గాని-- ఇదంతా జీవనప్రయాణంలో ఒక అంతర్భాగమే! ఆరాటంతో కూడుకున్న అంతులేని ఫోరాటమే!

---------------------------------------------------------------

కరోళ్ బాగ్ ఢిల్లీలో ప్రసిధ్ది గాంచిన దక్షిణాద్యుల ప్రాంతమన్న మాటే గాని, అక్కడ ఎక్కువగా నివసించేది తమిళ కుటుంబాలు, పిదప పంజాబీలు, అటు పిమ్మట తెలుగులు కన్నడిగులూను-- ఆ తరవాతి వరసన మలయాళీలూను.


అక్కడి వాతావరణంలో అతడికి గాని చీర కట్టుకున్న స్త్రీలు- గుళ్ళకు వెళ్లే పంచెలు కట్టుకున్న ఆసామీలు గాని కనిపించపోతే అతడు కచ్చితంగా ఉక్కిరి బిక్కిరయేవాడే! అంటే ఒక ధృవం నుండి మరొక ధృవానికి వచ్చినట్లన్న మాట-- గాగ్రాలూ సుడిదార్లు వేసుకుంటే సరే- మరి ఎక్కువ మంది పంజాబీలు- యు. పీ వాళ్లూ టైట్ అండ్ ఫిట్ ప్యాంట్స్ వేసుకునే కనిపించేవారు వివాహ స్త్రీలతో సహా.


అన్ని టికన్నా ముఖ్యంగా ఆ ప్రాంతంతో మమేకం కావడానికి దోహదం చేస్తూన్న సకారాత్మక అంశం- గుడిగంటలతో మారు మ్రోగే అమ్మవారి ఆలయం. మరొకటేమో, ఆంజనేయస్వామి ఆలయమూను-- ఆ రెండుగుళ్ళూ లేకపోతే, అక్కడి సంస్కృత మంత్రో ఛ్ఛరణలు నిరంతర అర్చనలు వినకపోతే తన వంటి కంచెరపాలెపు పదహరాణాల తెలుగోడి గతేమికానో! తనలో తను ఏదేదో అనుకుని కంగారు పడటం గాని—ఎడారిలో సహితం చెలమ కనిపించడం లేదూ! సేది తీర్చి ఉసురుకి ఊపిర్లూదడం లేదూ!

--------------------------------

మెస్సుని అంతటి రద్దీ ప్రాంతాన మార్కెట్ వీధి ప్రక్కన అంత పకడ్బందీగా మెరుపు తీగలా చురుగ్గా నడుపుతున్నది మరెవ్వరో కాదు- మంగళూరుకి చెందిన తెలుగు మహిళ-- ఆమే దానికి ఓనర్. పేరు రూపవతి. గంగాధరం స్వయంగా వచ్చి తనను ఆమెకు పరిచయం చేస్తున్నప్పుడు ఆమెను చూసి నిజంగానే ఆశ్చర్యపోయాడు.


అక్కడి పార్కుల్లో రాత్రిపూట రహదా రుల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చే మాఫియా గ్యాంగులు తొట్టి గ్యాంగులూ క్రూరనీడల్లా తచ్చాడుతుంటాయిని అతను విన్నాడు. ఆ మ్యాఫియా గాళ్లు దేనికైనా తెగిస్తారట. అందులో దుండగ స్త్రీలు సహితం మగాళ్లతో చేరి జమిలిగా అక్రమ కార్యకలాపాలలో పాలు పంచుకుంటారట. అలాంటప్పుడు ఒక దక్షిణాది మహిళకు అటువంటి సంక్షోభిత వాతావరణంలో నలగురు వచ్చీపోయే మెస్ నడిపేంత నిబ్బరం ఎలా వచ్చింది? పొరుగున ఉన్న రెస్టారెంట్ల పోటీని యెలా యెదురొడ్డి నిలవగలుగుతుంది?


కారణం నిదానంగా తలపోస్తే తెలిసొచ్చింది భద్రానికి-- ఆమెగారి భర్త ఒక లెఫ్టనంట్ కర్నల్- మిలిటరీ రూల్సు ప్రకారం ముందస్తుగా ఉద్యోగం విరమణ పొంది అదెక్కడో అజ్మీర్ వేపు ఆయిల్ కంపెనీలో పోస్టు రిటైర్మెంటు జాబ్ చేస్తున్నాడట. ఈమెగారిని చూడటానికి సమయం చిక్కినప్పుడల్లా గడువు తీసుకుని ఢిల్లీకో మంగళూరుకో వచ్చిపోతుంటాడు. సమయ సందర్భం ఏదీ కుదురకపోతే, ఆమెగారే భర్తకోసం అజ్మీర్ వేపు వెళ్లి వస్తుంటారు. ఈలోపల ఉత్తరాల రాకపోకలు- ముఖ పుస్తక సమాచారాలు, వాట్సప్ వీడియో కాల్స్ ఎలాగూ ఉంటాయిగా మరి--


ఇక పోతే, మెస్ ఓనర్ అమ్మగారికి తోడుగా ఉండి సేద దీర్చడానికి, పిల్లలు కలగలేదు. కలిగితే బాగున్ను-- తోడుగా కలివిడిగా ఉన్ను-- ఏమి బ్రతుకులో మరి—పెళ్లయినా తోడుగా భర్తలేడు- భర్త ఉన్నా ఆసరా కోసం పిల్లలు లేరు. మానవ జీవితం ఒక విధంగా ఊహకందని విచిత్ర చక్రభ్రమణమే మరి చివరి వరకూ-- ఏదో ఉందనుకుని పరిపూర్ణంగానే ఉందనుకుని సంబరపడుతుంటే- ఎక్కణ్ణించో చేతులు చాచి మరేదో లాక్కుంటాడు బ్రహ్మదేవుడు. ఆయనకు అదొక వింతైన ఆటలాట. అన్నీ బొంతగా ఒకేసారి ఇస్తే, నిలకడలేని మనుషులు మతులు చెడి పాడయిపోతారేమోనని కాబోలు-


ఇకపోతే- రూపవతి మేడమ్ గారు పనులు చక్కదిద్దు కోవడంలో, మెస్సు పనివాళ్లపైన అజమాయిషీ వహించడంలో దిట్ట. మెస్సు వ్యవహారాలలో నిర్వహణా పరిధిలో కచ్చితత్వంతో మెసలుతుంది. చిన చిన్నవాటికి చిరాకు చెందకుండా సాగదీతకు లోను చేయకుండా హుందాగా ఉంటుంది. నిజానికి ఆమెది నిఘానేత్రం. పని వారందరిపైనా సూపర్ వైజరీ పట్టు కట్టుదిట్టంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో రూపవతి తనకు నమ్మకస్థులైన ఇద్దరు స్త్రీలను తోడుగా ఉంచుకుంది.


వాళ్ళలో ఒకరు ఆమకు స్వయాన మరదలు పిల్ల- మంజులాదేవి. మరొకరేమో- స్వంత ఊరులోనుంచి వచ్చిన దగ్గరి బంధుత్వం గల ఆవిడ. పేరు మాలిని. ఈవిడ ఎక్కువగా వంటవాళ్ళకు వత్తాసు గా ఉంటూ వాళ్ళ దైనందిన పనుల్ని గమనిస్తుంటూ కావలసినవి సమకూరుస్తూ బాస్ గారికి రిపోర్టు చేస్తుంటుంది. పైకి వాళ్లిద్దరూ అకౌంట్స్ అసిస్టెంటులుగా సహాయకులుగా ఉన్నా- నిజానికి అన్ని కార్యకలాపాలూ ఆర్థిక లావాదేవీలూ రూపవతి మేడమే స్వయంగా తాలు తప్పాలు లేకుండా చూసుకుంటుంది; ఏదీ పొల్లుపోకుండా- కనుచూపు మీరి దాటిపోనివ్వకుండా--


వాస్తవానికి కొన్ని వ్యవహారాలలో స్త్రీలలోని సహజ స్వభావాలూ సూక్ష్మ గుణాంశాలూ ఆయువుపట్టులా అదనంగా పనికి వస్తాయి. కాని పర్యాలోకించి చూస్తే - అతడికి మరొక విధమైన ఆలోచన కలిగింది. మెస్సంతటా సంపూర్ణ ఆడపెత్తనం విరాజిల్లడం రాను రాను క్షేమకరంగా ఉండదేమో! నమ్మకం కుదరలేదని ఒదిగి కూర్చుంటే సరిపోదు మరి- నమ్మకస్థుడైన మేల్ స్టాప్ ని కూడా వెతికి తెచ్చుకోవాలి. అదీ వ్యవహారదక్షతంటే--


ఐనా తనకెందు కిదంతా- కొత్త డోలుకు మ్రోతెక్కువన్నట్టు. ముగ్గురు మరాఠీల దూకుడులా ముగ్గురు మహిళా మణులు కట్టడిగా నిర్వహణ చేస్తున్నప్పుడు- కందకులేని దురద కత్తి పీటకెందుకన్నట్టు. జీతం డబ్బులు కరాఖండీగా చేతికందితే చాలు- కంచెరపాలెం లో తనను నమ్ముకుని ఉన్న కుటుంబం గట్టెక్కి నట్టే-- ఏది ఏమైనా ఒకటి మాత్రం బలంగా తీర్మానించాడు; అక్కడున్న ముగ్గురు స్త్రీలకూ సాధ్యమైనంత మేర ఆమడ దూరాన ఉండాలని, వాళ్ళెదుట నిదానంగా మాట్డాడాలని- వాళ్ళతో మెళకువతోనే మెసలు కోవాలని.


మొన్న మొన్ననే తను చూసాడు; పనికి ఎగనామంపెట్టి ముందస్తు భోగట్టా లేకుండా గైర్హాజరువుతున్నారని ఇద్దరు కుక్ అసిస్టెంటుల కు—విస్తళ్లు వేసే మరొక ఇద్దరు పనివాళ్ళకూ హెవీగా జీతం కట్ చేసారు బాస్ గారు.

అంతటితో ఊరుకోలేదు- నేరుగా శ్రీముఖం అందించింది; ఉద్యోగం పీకేస్తానని. ఎంతైనా మిలిటరీ ఆఫీసర్ జీవన సహచరి కదూ! వారు వీరూ- వీరు వారూ కావడానికి ఆపాటి దాంపత్య జీవితానుభవం చాలదూ!


మాటలో మాటగా అతడి తోటి కుక్ అసిస్టెంటు భీమన్ మరొకటి కూడా చెప్పాడు. ఆమె కూర్చునే బల్ల డెస్కులో చిన్నపాటి నలుపు రంగు లైసన్ట్ పిస్టోలు కూడా ఉందట- సమయం వస్తే దేనికైనా తను సిధ్దమేనని మెస్సులోకి వచ్చీపోయే కస్టమర్లకు సంకేతమిచ్చేలా అక్కడక్కడ ప్రస్తావిస్తుందట--


ఐనా ఏదేదో అనుకుంటూ అసహనంగా ఊహించేసుకోవడమే గాని—నేర ప్రవృత్తి పెరిగిపోతూన్నఈ రోజుల్లో ఆ పాటి కాఠిన్యతా ముందు జాగ్తత్తా అవసరమేనేమో! హనీబర్గర్ లా కాసింత మొండితనం కూడా చూపిస్తుండాలేమో! ఇకపోతే కష్టాలుగాని యిక్కట్లు గాని చెప్పిరావుగా!


తనతోటి ఇద్దరు కుక్ అసిస్టెంట్లతో రామభద్రానికి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. నిజంగానే చిన్నపాటి వాగ్వాదమే. కావున తను అప్పటిక్కప్పుడే మరచిపోయాడు. వాగ్వాదం పెట్టుకున్న ఆ ఇద్దరు కుక్ అసి స్టెంటులూ దానిని మరచిపోయారేమో కూడా-- కాని రూపవతి మేడమ్ మాత్రం మరవలేదు. విడువలేదు. వాళ్ళ మధ్య జరిగిన ఆ వాగ్వాదం గురించి ఎలాగో ఒకలా- ఎలాగోలా యేమటి; మెస్సులో తను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి ఉంచిన మహిళా అసిస్టెంటుల ద్వారానే తెలుసుకుని ఉంటుంది.


సాయింత్రం పూట మెస్సులో సందడీ హడావిడీ తగ్గుముఖం పెట్టిన తరవాత భద్రాన్ని పిలిచింది; పిలిచి విడిగా సౌమ్యంగా వాకబు చేసింది విషయం యేమిటని--


“మరేం లేదు మేడమ్. గొడవేమీ జరగలేదు. కొలిమికి నిప్పుపెట్టేముందు చేయవలసిన మొదటి పని- అంతా శుభ్ర పరచడం. ఆ తవాతనే మిగితా వంటా వార్పూను- అన్నాను“


అప్పుడామె అడిగింది- “దానికి వాళ్ళేమన్నారు? ”అని.


“తిన డానికి వచ్చేవాళ్ళందరూ సరాసరి ఇక్కడకి వచ్చి తొంగి చూస్తారేమిటి- మరి రాత్రి భోజనాలు కస్టమర్లకు వడ్డన చేసిన తరవాత శుభ్రం చేయకుండానే పోతున్నామా ఏంవిటి- అని తిరుగు ప్రశ్నవేసారు. దానితో మామధ్య చిన్నటి మాట వచ్చింది- అంతా ఫ్రెండ్లీగానే—అంతే మేడమ్-- “


“మరి వాళ్ళన్నదాంట్లో వాస్తవం ఉంది కదా రామభద్రంగారూ! ప్రతిరోజూ వాళ్లు శుభ్రం చేస్తూనే ఉన్నారుగా! అది జరిగేది ఎప్పు డైతేనేమి? ”


ఆ మాటతో భద్రం వెనక్కి తగ్గుతాడనుకుందామె. కాని వెంటనే బదులు వచ్చింది. ”కాని అది పధ్ధతి కాదు మేడమ్. తినేది మనమా లేక పొరుగువారా అన్నది కాదు అంశం. శుభ్రత శుభ్రతే! అది వంటకు ముందే ప్రారంభించాలి- ఓ పదినిమిషాలు అటూ ఇటూ ఐనా సరే-- “.


అప్పుడు మంజుల రింగులా ముందుకు వచ్చి కలుగచేసుకుంది- “మీరెవరితో మాట్లాడుతున్నారో తెలిసే మాట్లా డుతున్నారా మిస్టర్ భద్రం! ”


అతడీసారి నోరు మెదపకుండానే తలూపాడు. ఈసారి రూపవతి స్పందించింది మరదలు పిల్లకు ఊరుకోమని సంజ్ఞ చేస్తూ- అలా సంజ్ఞ చేస్తూ రూపవతి అందుకుంది- “ఉదయమే శుభ్రత పాటించాలని అంత కచ్చితంగా అనుకుంటున్నారే- మరి దానికి కారణం అంటూ ఏదైనా ఉందా?"


అతడు తలూపుతూ బదులివ్వడానికి ఉద్యుక్తుడ యాడు-- “అన్నం పరబ్రహ్మం అంటారు కదండీ- అన్నాన్ని అన్నపూర్ణంటారు కదండీ- దానికర్థం మరేమిటో కాదండి. అన్నిట్లోనూ దైవం ఉందనే కదా! అలాంటప్పుడు అంతటా పవిత్రత ఉంటుందనేగా- మరప్పుడు శుభ్రత లేనిదే పవిత్రత ఎలాగొస్తుందండీ! వంటా వార్పులోనూ స్వఛ్ఛతా పవిత్రతా ఉంటేనే భోజన పదార్థాలలో రుచి కూడా అమోఘంగా ఉంటుందండీ. ఇది నా అభిప్రా యమండీ - నాకు మాబాబు రాఘవయ్యగారు నేర్పిన బ్రహ్మ రహస్యమండీ- అటుపిమ్మట మీరు చెప్పినట్లే—హెడ్ కుక్ సోమనాథంగారి సలహా ప్రకారమే మేమందరమూ ముందుకు సాగుతామండి” అంటూ అక్కణ్ణించి కదలబోయాడు రామభద్రం.


కాని రూపవతి మేడమ్ అతణ్ణి ఆపింది- ”మీరు చెప్పినట్టే జరగనివ్వండి. రెండు పూటలూ వంటగదిని శుభ్రం చేయాలని నామాటగా సోమనాథంగారికి చెప్పండి“


అతడు ధన్యవాదాలు చెప్పి కదిలాడు. ఆమె మళ్లీ అంది అతణ్ణి ఉద్దేశించి- ”మీకిచ్చిన డాబా గదిలో స్టే ఎలాగుంది? సౌకర్యంగానే ఉంది కదూ? ఏదైనా ప్రోబ్లెమ్ గాని ఉంటే మంజులకు గాని మాలినికిగాని చెప్పండి”


అతడు మర్యాద పూర్వకంగా తలూపుతూ పాకశాల వేపు నడిచాడు; బడిరోజుల్లో తన గురువుగారు తనకు చెప్పిన గుణ పాఠాన్ని నెమరు వేసుకుంటూ-- గొప్ప గొప్ప పనులు చేసామని చెప్పుకోవడం కంటే—చిన్న చిన్న పనులు సహితం సవ్యంగా శ్రధ్ధగా ముగించామనడంలోనే ఉన్నది మనిషి ఔన్నత్యం‘


మరైతే- అనుకున్నవీ, అనుకుని కలబోసుకున్నవీ రాత్రికి రాత్రి గాలిలోకి ఎగిరిపోయిన పేలపిండిలా చెదరిపోయాయి. ఊరుకాని ఊళ్ళో తను తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గంగాధరం చెప్పిన బోధనలన్నీ కనుచూపుకాననంత దూరాన వెడలి పోయాయి. పట్టుకందని ఒక విధమైన మానసిక కల్లోల పరిస్థితి ఎదురైంది రామభద్రానికి. అతడికి వచ్చింది కలే- కాని నక్కతోక తొక్కడం మరచి పులితోక తొక్కేసినట్టు తత్తర పడ్డాడతడు.


జరిగిందేమంటే- అతడికి మెస్సులో పనిచేసే పెళ్లికాని మంజలవాణి గాని- మరొక మంగళూరు అమ్మాయి మాలిని గాని ఏ కోశానా జ్ఞాపకానికి రాలేదు. అసలు కలలో ఏమూలనా కనిపించలేదు. అతడు అప్పుడప్పుడు బైటకి వెళ్లి వస్తూన్నప్పుడు ఎదురొచ్చే ఎత్తైన ఎద సంపదగల పంజాబీ సిక్కు స్త్రీలు గాని, బిగి నడుములతో నిటారుగా నడిచే ఆఫ్గన్ అమ్మాయిలు గాని కనిపించలేదు. మరెవరొచ్చారని—వచ్చి తన తలంపుల తలుపుని తట్టి, మనసుని గజిబిజి చేసారని—అతడి బాస్ లెఫ్టనెంట్ కర్నల్ భార్య రూపవతి--


ఎందుకలా జరిగిందో-- తనకు మాత్రమే ఎందుక లా జరిగిందో అతడికి ఏమాత్రమూ అర్థం కావడం లేదు. రాక- రాక- ఆమెగారే తన స్వప్న సౌధుంలోకి రావాలా తన గజిబిజి కలలోకి పంచరంగుల చిలకలా ఎగురుతూ వాలుతూ-- దాపురిస్తున్నవి చెడురోజులు కాకాపోతే- కలలో ఊహలో సహితం అటువంటి గంభీర సుందర వదన రూపవతి గురించి తలపోసే సాహసానికి పూనుకోగలడా తను!

తను బడి రోజుల్లో ఊరి పొలిమేరన చూసిన “ఆంజనేయ విజయం” వీధినాటకంలో హనుమంతుడు రావణున్ని ఉద్దేశించి పలికిన హీతోపదేశం మనసున కదిలింది- “నీ నాశనం రెండు కారణాల వల్ల సంభివిస్తుంది రావణా! ఒకటి నీలోని అహంకారం వల్ల- రెండవది- నీకున్న పరదారనాపేక్ష వల్ల సంభవిస్తుంది”


ఇద్దరు కొడుకుల తండ్రయిన తను అటువంటి ఉన్నత ఉత్తేజకర సూత్రాన్ని యెలా విస్మరించాడు! తనకు సహితం చెడురోజులు దాపురించబోతున్నాయేమో!


=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





50 views0 comments

Comments


bottom of page