'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 12' - New Telugu Web Series Written By Pandranki Subramani
'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 12' తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.
తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి.
ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి. రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు.
మెస్ లో సహాయకురాలిగా ఉన్న మంజుల రూపవతికి సంబంధించిన రహస్యాలు చెబుతుంది. రూపవతి భర్త మరణించి చాలా కాలమైందన్న విషయం విని ఆశ్చర్యపోతాడు రామభద్రం.
మంజులదేవి, సోమనాథాల వివాహం జరుగుతుంది.
రామభద్రం కోరికపై అతని బావమరిదికి కూడా పని ఇస్తుంది రూపవతి.
'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 12' చదవండి.
ఢిల్లీ నగరంలో రోజులు సాగుతున్నాయి చలి చలిగా రద్దీ రద్దీగా--
సాధారణంగా అనుకున్నవి జరగవు. జరిగినా విపరీతంగా జరుగుతుంటాయి. రివర్సులో యెదురవుతుంటాయి. కమల కాంతం విషయంలో అలాగే జరిగింది. ఒకరోజు ఉదయమే తలుపు తట్టి యింటి గుమ్మం ముందు నిల్చుంది లలిత భర్తా పిల్లలతో బాటు. తలుపుతీసిన కాంతం గుడ్లప్పగించి చూస్తూ నిలుచుంది. మంది మార్బలంతో ఆడపడుచు అంత ప్రొద్దుటే యేతెంచిందంటే యేదో జరగబోతున్నదన్నమాటే! అది శుభ సూచకం కాబోదన్నమాటే!
“అదేంవిటి వదినా అలా కొత్తగా షాకయినట్టు చూస్తు న్నావు? కాస్తంత తొలగి నిల్చుంటేనే కదా మేం లోపలకు అడుగు పెట్టేది! ”
అప్పుడు గాని కాంతం స్పృహలోకి రాలేకపోయింది.
“ఇంత ప్రొద్దుటే చూస్తుంటే యెవరో అనుకున్నాను. ఫోను చేసి వస్తే బాగున్ను కదా! ”
“భలే దానివే! మాయింటికి రావడానికి ముందస్తు కబుర్లెందుకూ?"
“ఔనవును. మనింటికి రావడానికి ఫార్మాలిటీస్ యెందుకూ!” అంటూ లలిత పదప్రయోగాన్ని సరిదిద్దుతూ, లలిత భర్త వాసుని లోపలకు రమ్మనమని సాదరంగా సాహ్వానిస్తూ, పిల్లలిద్దర్నీ లోపలకు తీసుకు వెళ్ళింది.
“రండర్రా! ఊరునచ్చిందా?"
“ఫ్రెండ్స్ లేరత్తయ్యా! అందరూ హిందీలోనూ పంజాబీలోనూ మాట్లాడుకుంటున్నారా, అప్పుడప్పుడు అయోమయంగా తోస్తుంటుంది“ ప్రసన్నకుమార్ బదులిచ్చాడు.
“కొత్త కదా! ఆ తరవాత అంతా మామూలయిపోతుందిలే— వాసు వేంకట్ లు కూడా కొత్తలో మీలాగే ఇబ్బంది పడ్డారు. అదిగో.. అవ్వా తాతయ్యలిద్దరూ పిలుస్తున్నారు. వెళ్ళిరండి. ఆ తరవాత ఆలూ కూరతో పూరీలు చేస్తాను. వచ్చి తినండి” అని యిద్దర్నీ లోపలకు పంపింది కాంతం.
ఆ తరవాత ఇద్దరు పిల్లలు నలుగరయారు. ఆటలు కీచులాటలు ఆరంభమయాయి. కేరింతలతో సందడి యింటి గోడల్ని అదరగొట్టింది. సుమధూళి పరిమళం వ్యాపించింది.
పిల్లలందరూ టిఫిన్ గట్రా తినడం పూర్తి చేసిన తరవాత రామభద్రం స్నానం చేయడం ముగించి అక్కడకు చేరాడు. బామ్మర్దినీ చెల్లినీ ఆత్మీయంగా పరమార్శిస్తూ-- అంత వరకూ అన్నయ్య కోసం యెదురు చూపులు చూస్తూ, అదను కోసం కాచుక్కూర్చున్న లలిత, కాంతం ఊహించినట్టే అమ్మానానృలిద్దరి ముందూ పిర్యాదుల పుస్తకం తెరిచింది.
“ఏంరా అన్నయ్యా! తెలియకడుగుతాను. నీకూ- నా కొడుకూ కూతుళ్ళ మధ్య యేమీ లేదా? అసలు నీకు వాళ్ళిద్దరూ యేమీ కారా!”
ఆ మాటకు రామభద్రం విస్తుపోయినట్టు చూసాడు లలితి వేపు. ”అవేం మాటలే.. వచ్చీ రావడంతోనే అలా నిరసన తెలియచేస్తున్నావూ! నీ పిల్లలకూ, మేనమామ, అత్తయ్యల మధ్యా యేమీ లేకుండా యెలా పోతుంది? నువ్వు లేదన్నా వద్దనుకున్నా మా మధ్య బంధం చిరకాలం అలానే నిలుస్తుంది. ఇక రచ్చ బండ జోలికి వెళ్ళకుండా విషయానికి రా—”
“నేనిప్పుడిక్కడకు వచ్చింది అది రూఢి చేసుకోవడానికేగా! నేనిక్కడకు పిల్లలతో వచ్చింది నిన్నుచూసేగా! పిల్లలిద్దర్నీ ఓ కంట కనిపేడ్తావనేగా?"
ఈసారి భద్రం చెల్లి వేపు అదోలా ముఖం పెట్టి చూసాడు- “విషయానికి వస్తావా లేక యిలా గోలపెడ్తూ ఉంటావా! ” బావ ముందు సహనం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తూ అడిగాడతను. ఈసారి లలిత రాఘవయ్య వేపు తిరిగింది.
“నేను చెప్తాను విను నాన్నా! మేడమ్ గారు ప్రసన్న కుమార్ నీ, భార్గవినీ పేద్దస్కూలులో వేయకుండా చిన్న స్కూలులో వేసారు. ఆ కోవన చూస్తే నా పిల్లలిద్దరూ ఏ స్థాయిలో తగ్గిపోయారని. నా మేనల్లుళ్లు యిద్దరితో కలసి అదే పెద్ద స్కూలులో చదువుకోవచ్చుకదా! అది నలుగురికీ సౌకర్యంగానే ఉంటుంది కదా! ”
అప్పుడు విషయం గ్రహ్యానికి వచ్చిందతనికి. ఇదన్న మాట అసలు సంగతి! అతడు నోరు విప్పి యేదో చెప్పే లోపల రాఘవయ్య అందుకున్నాడు. “ఇదేం పధ్ధతిరా భద్రం! ఒకరికి చిన్న స్కూలూ మరొకరికి పెద్ద స్కూలా? వినడానికేమైనా బాగుందా!”
అప్పుడు సావధానంగా కలుగచేసుకున్నాడు భద్రం- “నేనిప్పుడు మాట్లాడ వచ్చా”
ఉఁ అన్నారందరూ కాంతం తప్ప. ఆమె పంటి బిగువున సహనం కొని తెచ్చుకుంటూంది. పొరుగూరు వచ్చి పొరుగు వారి సహాయ సహకారాలు పొందుతూ ఎదురు దాడిలా అంతటి అధికార ధోరణా!
అప్పుడు భార్యను ఓర్పు వహించమని కళ్ళతో సంకేతం యిస్తూ భద్రం అడ్డు వచ్చాడు- “చూడు లలితమ్మా! రూపవతి గారు మనకు బంధుత్వం గల స్నేహితురాలు కాదు. నాకూ వాసుదేవరావుకీ బాస్. ఇంకా చెప్పాలంటే మనందరికీ మార్గదర్శి. ఇది గుర్తు పెట్టుకో! ఇక స్కూలు విషయానికి వస్తాను. పిల్లల భవిష్యత్తుకి కావలసింది స్కూలు పెద్దదా చిన్నదా అన్నది కాదు. స్థాయి గల మంచి బడా కాదా అన్నదే ముఖ్యం. రూపవతి గారు పిల్లల చదువుల విషయమై జాగ్రత్త వహిస్తారు.
మరొకటి—ప్రసన్న కూమార్, భార్గవీ వేరే రాష్ట్రం నుంచి వేరే సిలబస్ తో వచ్చారిక్కడకి. వచ్చిన వెంటనే ఇద్దరికీ స్కూలులో సీట్లు దొరకడమే ఘనకార్యం. ఈ విషయంలో ఆమెగారు మనకు చేసింది ధర్మకార్యం. ఆమెను నిలదీసేంత స్థాయి మనకెవ్వరికీ లేదు. మరీ చొరవ తీసుకుంటే కార్యం బెడిసి కొట్టవచ్చు.
ఇక చివరి మాట—విషయం యిప్పటి మాట కాదు. గమనించ వలసింది రేపటి మాట. ఆమె సహాయంతో మనకు పలు కార్యాలు అవాల్సుంది, ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో— వాళ్ళ భవిష్యత్తు విషయంలో— ఇది గుర్తు పెట్టుకుని మెసలుకోవడం నేర్చుకోండి”
దానితో సంభాషణకు ఫుల్ స్టాప్ పెడ్తూ లేచి వెళ్ళిపోయాడు రామభద్రం.
కొడుకు విసురుగా వెళ్ళిపోయిన తరవాత తాయారమ్మ కూతుర్ని సమీపించింది. “విన్నావు కదూ మీ అన్నయ్య చెప్పింది—ఇది మనిల్లు కాదు. కంచరపాలెమో మద్దిలపాలెమో కాదు. భాషా యాసా తెలియని పొరుగు రాష్ట్రం. మనకిక్కడ తల దాచుకునటానికి నీడ దొరకడమే గగన కుసుమం. ఆ గంగాధరం పుణ్యమా అని కాసింత చోటు దొరికింది. అది చాలదని ఇది చాలదని ఈ గొంతెమ్మ కోర్కెలు కోరడం యేమిటే!
ఎవరికి యేమేమి చేయాలో యెలా చేయాలో రూపవతి మేడమ్ గారికి తెలుసు. లెక్కలూ ఖాతాలూ త్వర త్వరగా ముగించడానికి వీలుగా అల్లుడిగారికి ఆమె యేదో షార్ట్ టార్స్ కంప్యూటర్ ట్రైనింగు యిప్పిస్తుందన్నావే—అదేంవిటి మనం అడిగా చేసింది? తానుగానేగా చేసింది. దాని అర్థం యేమిటి? రాను రాను మీ ఆయనకు యెక్కువ బాధ్యతలు యివ్వడానికేగా!
ఊరకే ఉన్నంత సౌలభ్యం- బోడు గుండంతటి సుఖమూ లేదంటారు. ఇందుకే—మరొకటి- మీ అన్నయ్య అడిగిందంతా మక్కికి మక్కీగా రూపవతి గారు చేసి తీరాలన్న షరతేమీ లేదు. ఆమెకు మీ అన్నయ్య కాదు బాస్. ఆమె గారే మీ అన్నయ్యకు బాస్. ఏదో అభిమానం కొద్దీ తనకున్న పరపతి ఉపయోగించి పనులు చేసి పెడ్తుంది ఇది ముందు తెలుసుకో— పిల్లలిద్దరూ భవ్యంగా పదవ తరగత పాసయేలా చూసుకో—
ఇందులోయేమైనా యిక్కట్లుంటే ఆమె గారిని కలుసుకో— ఆమె దారి చూపెడ్తుంది. ఊరకే పడున్న శంఖాన్ని ఊది పాడు చేయకు”.
మన్ను తిన్నపాములా నోరు మెదపకుండా మిన్నకుండి పోయింది లలిత. అంతవరకూ దూరాన చేతులు కట్టుకుని ఊపిరి బిగబట్టి గోడుకు చేరబడి నిల్చున్న కమల కాంతానికి గుండె బరువు తగ్గి తేలికపడింది. ఇంకెన్నెన్ని గొంతెమ్మ కోరికల చిట్కా విప్పబోతుందో ఈ మహాతల్లి!
----------------------------------------------------------------------------------------
హుబ్లీలో జరిగే చాముండేశ్వరి జాతరకు సోమనాథం దంపతులతో వెళ్ళి వచ్చింది రూపవతి. అది వంశ పారంపర్యంగా నగర దేవతకు జరిగే పవిత్ర ఉత్సవం. లక్షార్చనలతో బాటు దివ్య నైవేద్యాలు సమర్పించడం- ఆ తరవాత అర్చక స్వాముల నిర్దేశాలతో యాగాదులు చేసి ముగించడం వాళ్ళ కుటుంబానికున్న ఆనవాయితీ. ఆనువంశికంగా వస్తూన్నఆచారం ప్రకారం పూజాదికాలు సంపూర్ణంగా ముగించి ఒక రోజు విరామం తీసుకుని దానికి మరునాడు ఢిల్లీకి చేరుకుంది.
అంతకుముందే అక్కడకు చేరుకున్న మాలిని అన్ని ఖాతా పుస్తకాలనూ వాసుదేవరావు సహకారంతో సర్ది సిస్టమ్ లో లావాదేవీల డేటాను అప్టేట్ చేసి ఉంచింది. క్యాష్ క్యాబిన్ వద్ద తగిలించిన దైవ చిత్ర పటాలకు కర్వూర ఆరతి అర్పించి, హుబ్లీ జాతర నుంచి తెచ్చిన ప్రసాదాన్ని కొంత మాలినికి యిచ్చి రివాల్వింగ్ చైర్ లో కూర్చునేటప్పటికి యెదురుగా రామభద్రం నిల్చోవడం గమనించి ఆశ్చర్యంగా కనురెప్పలల్లార్చింది.
“మీరా రామభద్రం! నేను ఇంత పెందలకడే రమ్మని పిలవలేదే--”
“శుభోదయం మేడమ్! ఔను. మీరు నన్ను పిలవలేదు. నేనే వచ్చాను”
ఎందుకన్నట్టు కళ్ళెత్తి చూసింది.
“మీతో కొంచెం మాట్లా డాలి”
రూపవతి తలూపుతూ మాలిని వేపు దృష్టి సారించింది. మాలిని లేచి కదులుతూ- “రెండు నిమిషాలలో కాఫీ పంపిస్తాను మేడమ్” అంటూ సాగిపోయింది.
ఆమె కదలి వెళ్ళిపోయిన తరవాత రూపవతి అడిగింది. “మీరు మాట్లాడబోయేది సీరియస్ మేటర్ లా ఉంది! ఉఁ- ఎదురుగా వచ్చి కూర్చోండి. మనీ మేటరా? ”
రామభద్రం తల అడ్డంగా ఆడించాడు.
“మరి—”
“కొంచెం ఊపిరి తీసుకోనివ్వండి చెప్తాను. కాంతం రోజంతా భయపడ్తూంది మీరు మాపైన చిరాకు పడ్రారేమోనని—“
“నేనా! నేనెందుకు చిరాకు పడాలి? ఇంతవరకూ నేనెప్పుడైనా మీపైన చిరాకు పడ్డానా! “
“లేదు. ఇంతవరకూ మీరెప్పుడూ మాపైన చిరాకు పడలేదు. కాని నేడు రేపులా ఉండదు కదండీ! ”
“ఔను. కాలం యెళ్ళప్పుడూ ఒకేలా ఉండదు కదా! సరే— దాని గురించిన తాత్విక చింతన యిప్పుడెందుకు గాని— మీరెందుకో డిస్టర్బ్ అయినట్టున్నారు. విషయానికి రండి” అంటూ మంచి నీరు గ్లాసుని అతడి ముందుకు తోసింది.
అతడు గడగడా తాగేసి చెప్పనారంభించాడు. “వాసుకి టెన్త్ పరీక్షలు పూర్తయాయి. వేంకటేశం మరుసటేడాది అదే తరగతికి వెళ్ళబోతున్నాడు”
“ఔను. ఇందులో విశేషం యేముంది? బాగా చదువుకుంటూన్న అబ్బాయిలు ప్యాస్ అవుతూనే ఉంటారు”
“మీ చూపులో అదేమీ విశేషం కాకపోవచ్చు. మా చూపులో అది పెద్ద విషయమే—“
“కావచ్చు. కాని మీరు అసలు విషయానికి రావడం లేదు. ప్లీజ్ కమ్మౌట్! ”
“విషయానికి రావాలనే ప్రయిత్నిస్తున్నాను. కాని— గొంతు పెగలడం లేదు. సారీ-- ఇప్పుడు చెప్తాను. వాసునీ వేంకటేశ్ నీ మీ వద్ద వర్క్ అనుభవం కోసం ట్రైనీలుగా చేర్చుకోండి, స్టయి ఫెండ్ గట్రా యేదీ మీరు యివ్వనవసరం లేదు. పనితో బాటు వాళ్ళకు మంచీ చెడూ బోధిస్తే చాలు—“
ఈసారి తెల్లబోవడం రూపవతి వంతయింది.
సూటిగా చూస్తూ అడిగింది- “ఇప్పటికిప్పుడే వాళ్ళ కు వర్క్ ఎక్సీపిరియన్స్ యెందుకు? వాసుని పదవ తరగతి పాస్ కానివ్వండి. అదే రీతిన వేంకటేశ్ ని కూడా పదవ తరగతి పూర్తి చేయనివ్వండి. ఆ తరవాత యేం చేయాలో ఆలోచిద్దాం”
=======================================================================
ఇంకా వుంది
=================================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments