top of page
Writer's picturePandranki Subramani

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - పార్ట్ 6


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 6' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 6' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి. ఇంటికి వెళ్లిన రామభద్రం ఢిల్లీకి రావడానికి తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తాడు.


ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి.

రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు.

అతను ఆఫీసుకు రాకపోవడంతో ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది రూపవతి.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 6' చదవండి.


అనుకున్నట్టే రామభద్రం ముందస్తుగా తన సెల్ ఫోను ద్వారా మెస్సుకి వస్తున్నట్టు తెలియ చేసి మరునాడు డ్యూటీకి ఠంచనుగా వచ్చాడు. కాని మామాలు స్థితిలో కాదు; దవడలపై రెండు- నుదుటపైన మరొక చోటా ప్లాస్టరూ కట్టుకుని కనిపించాడు. అతడి వాలకం చూసి రూపవతితో బాటు తతిమ్మా ఇద్దరు లేడీ మెస్ స్టాఫ్ కూడా నివ్వెరపోయారు.


“ఏమైంది రామభద్రం?" అని ముక్తకంఠంతో అడిగారాడాళ్ళూ ముగ్గురూ-- ఎందుకంటే అతడి ముఖం కూడా నీరసంతో జేవురించి ఉంది.


“ఏమి లేదు మేడమ్. బాత్రూములో జారిపడ్డాను. మరేమీ కాలేదు“ అంటూ పాకశాల వేపు వెళ్లిపోయాడు. ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంత వరకూ అతడు చాలామంది ఢిల్లీ వాసుల్లా, సాయంత్రం పూట ఇల్లు చేరుకున్న తరవాత మజాగా మందు ద్రావకం వేసుకుంటాడన్న అనుమానం వాళ్ళకెప్పుడూ కలగలేదు. అలాగని అదొక పెద్ద నేరమని కాదు-- ఎందుకంటే అక్కడ హైస్కూలు పిల్లకాయలు సహితం కొందరు ధారాళంగా బీర్ అంటూ- జిన్ అంటూ మామూలు తేనీరులా పుచ్చుకుంటుంటారు.


కాని- కుటుంబం పట్ల మిక్కిలి అక్కర చూపిస్తూ- మంచీ మర్యాద పాటిస్తూ- హందాగా కనిపించే రామభద్రం వాటి జోలికి వెళ్తాడా-- ముగ్గురూ ఎటూ తేల్చుకోలేక సతమయారు. అతను నిజంగానే ఏదైనా ప్రమాదానికి లోనై ఉంటే తనకు ఫోన్ చేసి చెప్పడూ-- అలా కాకుండా రోజంతా కబురు కూడా లేకుండా కనుమరుగవడానికి ప్రయత్నించాడంటే- ఇంకేదో జరిగుంటుంది.


ఇక విషయానికి వస్తే- ఎదుటి మనిషిని అర్థం చేసుకొని ఎంత వరకు నమ్మాలో యెంతవరకు నమ్మకూడదో తేల్చుకోవడం నిప్పుకణి కల మీద సాగే నడకే-- ఏమో యిప్పటికిప్పుడు చెప్పడం కష్టం గాని యిరుగు పొరుగు వాళ్ళ సహవాస దోషం కూడా కావచ్చే మో! ఢిల్లీ నగరంలో చాలా మంది సిక్కు పంజాబీలకు గుంపుగా మందు పుచ్చుకోవడం అలవాటు. అటువంటి గుంపులోకి చేరక పోతే నామోషీగా భావిస్తారు వాళ్ళు. రామభద్రం వాళ్ళ వలయంలో చిక్కుకున్నాడేమో!


సాయంత్రం మెస్సులో కస్టమర్ల రాక తగ్గిన తరవాత ఇద్దరు లేడీ అసిస్టెంట్లనూ ఎక్కడికో పనిపైన పంపించి రామభద్రాన్ని తన క్యాష్ క్యాబిన్ కి పిలిపించింది రూపవతి. అతడికి తెలుసు రూపవతి తననెందుకు పిలిపిస్తుందో-- అందుకే అతడు కూడా తగురీతిన స్పందించడానికి సంసిధ్ధుడుగానే ఉన్నాడు. అతణ్ణి చూసిన వెంటనే—లేడీ స్టాఫ్ ఇద్దరూ ఇంకా అక్కడే ఉన్నారా లేక కదలి వెళ్ళారో లేదో తేల్చుకుని, ఆ తరవాత భద్రాన్ని క్యాబిన్ గదిలో వచ్చి కూర్చోమని కుర్చీ చూపించిందామె. అతడు కూర్చో లేదు.


”పర్వాలేదు మేడమ్”అంటూ అలానే నిల్చున్నాడు.


మరొక మారు అతణ్ణి కూర్చోమని చెప్పకుండానే సంభాషణ సాగిం చింది రూపవతి. “చెప్పండి.. నిన్న ఏమి జరిగింది? నిజం చెప్పాలి. నాకు మీపైన అభిమానం ఉంది. మీకు కూడా నాపైన నిజంగా నే కాస్తంతైనా అభిమానం ఉంటే మీరు నాకు నిజం చెప్తారు-- ఎలా పడ్డారు?” .


ఆమె గొంతుకలో ప్రస్ఫుటితమైన చిన్నపాటి వణకు గమనించిన రామభద్రం ఇక సాగదీయడమెందుకని సరాసరి విషయానికి వచ్చేయాలని తీర్మానించాడు- “గొడవ పడ్డాను”.


ఆ జవాబు విన్నంతనే రూపవతి విడ్డూరంగా చూసింది- కళ్ళు పెద్దవి చేసుకుని. “ఊరు కాని ఊళ్ళో- అందునా హిందీ పూర్తిగా రాని పరిస్థితిలో- ఇక్కడి వాళ్ళతో గొడవ పడ్డారా! మీకేమైంది? మతి గాని పోలేదు కదా! పోలీసు కేసయితే ఏమి చేస్తారు? నేనిక్కడున్నానని- నాకొక మాట చెప్పాలన్న ధ్యాస కలగలేదూ? కలగదు— ఎందుకంటే— తమ మగతనం దెబ్బతింటుంది కదా-- ”

కాసేపు నిదానంగా చూస్తూండి పోయి ఎట్టకేలకు బదులిచ్చాడు- “గొడవ పడింది నేను కాదు— కొందరు పార్కు రౌడీలు. మొన్న మీరు నన్ను పార్కు మధ్యలో దారికి అడ్డంగా వెళ్లమన్నారా—వెళ్ళాను. వెళ్లి సేఠ్ గారికి చెక్కిచ్చి ఫర్ వార్డింగ్ లెటర్ పైన రిసీప్ట్ తీసుకుని వచ్చేటప్పటికి కొంచెం ఆలస్యమైంది. ఎలాగంటే-. సేఠ్ గారు లక్ష్మీపూజ చేస్తున్నారు నేను వెళ్ళేటప్ప టికి. మీరు నాకిచ్చింది మామూలు పత్రం కాదు-- విలువైన చెక్కాయె. మరొకరికి ఇచ్చి ఎలా రాగలను?

అంచేత అక్కడే నిల్చుని సేఠ్ గారు పూజాపునస్కా రం ముగించుకున్నపిమ్మట ప్రసాదం పంచి పెట్టిన తరవాత ఆయనకు స్వయంగా చెక్కిచ్చి కదలేటప్పటికి జాప్యమైంది”


ఆ బదులుతో ఆమె కళ్లు అల్లార్చాయి. ”ఆలస్యమైతే, తిన్నగా ఆటోరిక్షా పట్టుకుని తిన్నగా ఇంటికి వెళ్లి పోవలసిందిగా! ”


“లేదు-- మీరలా చెప్పలేదు. తిన్నగా అదే దారిన వెనక్కి వచ్చి సర్దారు పటేల్ రోడ్డుమ్మట ఇల్టుచేరుకోమన్నారు”


“సరే—అలాగే చెప్పాననుకోండి. ఆ తరవాత ఏమైంది? “


“డిష్యూం డిష్యూం! నేను మరల అదే దారమ్మట వస్తున్నప్పుడు ముగ్గురు రౌడీ కుర్రాళ్ళు ఎదురొచ్చారు. షర్ట్ జేబులో ఉన్నది ఇవ్వమన్నారు. నేను వాళ్ళు చెప్పినట్టే ఉన్నది ఇచ్చేసాను-- అనువుగాని చోట మనం శౌర్యం చూపించడమెందుకని. కాని వాళ్ళు దానిని అందుకుని నా దారిన నన్ను విడిచిపెట్టలేదు”.


అప్పుడామె ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది “మరి?”


“ఇంకేముంది? చూడటానిక డాబుగా ఉన్నావు- జేబులో వట్టి ఇరవై రూపాయలుంచుకుని తిరుగుతావా- మాటైము వేస్ట్ చేస్తావా” అని నా వీపు పైన పెద్దగా చరచి, నా పైన చేయి చేసుకోవడానికి సిధ్ధపడ్డారు. అప్పుడు వాళ్ళ మితిమీరిన పోకడ భరించలేక తిరగబడ్డాను. ముగ్గురినీ వాయించేసాననుకోండి. పార్కులో చెరొకవేపూ పరుగెత్తారు.


నాకు నేను గొప్పలు చెప్పుకోవడం ఎందుకు - నేను కూడా దెబ్బలు తిన్నాను. నాకు నిజంగా కోపం రావడానికి కారణం- చేసేది దొంగతనం- సిగ్గుమాలిన దోపిడీ-- అందులో డాబుసరి మాటలా! ”


“సారీ! నేను సరిగ్గా మార్గదర్శకం చేయకపోవడం వల్లనే అలా జరిగింది”


“మీరెందుకి సారీ చెప్తున్నారు మేడమ్? దుండగలు- రోడ్ డెవిల్స్ నా పైన దౌర్జన్యం చేసారు. ఇంకా నయం- చాలా అర్జంట్ అంటూ నన్ను తప్పించి ఇక్కడి లేడీస్ ఇద్దర్నీ పంపించలేదు. పంపి ఉంటే ఇంకేమై ఉన్నో! ఇకపైన కూడా ఇటువంటి అర్జంటు పనులు నాకు మాత్రమే అప్పచెప్పండి మేడమ్. నాకు జరిగిందానికి మీరు మరీ నొచ్చుకోకండి. ఉపాధిలో ఇది కూడా ఒక భాగమే కదా-- ఇక నేను మా చీఫ్ కుక్ వద్దకు వెళ్ళాలి”.


అప్పుడామె అతణ్ణి ఆపింది- “కొంచెం ఆగండి!” అంటూనే, అతడికి దగ్గరగా వచ్చి భుజంపైన చేయి వేసి అంది- “మీ ఇద్దరి అబ్బాయిల స్కూలు అడ్మిషన్ గురించి మాట్లాడాలి. కొత్తగా చేరబోయే వారందరికీ ఏదో ఇంటర్వ్యూ వంటిది పెట్టబోతున్నారట. ఆ తరవాత యేదో చిన్నపాటి టెస్టు కూడా పెట్టబోతున్నారట-- ”.


ఆ మాట విన్నంతనే అతడు ఉన్న పళంగా యథా స్థితికి వచ్చేసాడు ఎలార్టుగా-- కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ “అలగా! ” అన్నాడు నోరు తెరచి.


“మరేమీ కంగారు పడకండి. అక్కడి మీ ఊరి స్కూలుకీ ఇక్కడి స్కూలుకీ మధ్య సిలబస్ లోనే కాక, ఇతర విషయాలలో కూడా కొంచెం వ్యత్సాసం ఉంటుందని నాకు తెలుసు. అంచేత ఈరోజు సాయంత్రం నేనొక హిందీ టీచర్ని మీ ఇంటికి పంపిస్తాను. ఇంటర్వ్యూకి ఇంకా రోజులున్నాయి కాబట్టి, ఈలోపున అబ్బాయిలిద్దర్నీ ఇప్పుడు నేను పంపించబోయే టీచర్ సహాయంతో స్టడీస్ లో కుదుట పడనివ్వండి.


నేనెలాగూ ఇంటర్వ్యూరోజున నేనక్క డేగా ఉంటాను. నాకు బిడ్డలు కలగకపోవచ్చుగాని- కమల కాంతం బిడ్డలు నాకు బిడ్డలు వంటి వారుకారా! ”


ఆ ఒ క్కమాట అతడిలోని గుండె కొండను సాంతమూ కదలించింది. కను కొలకులు తడిసాయి. చప్పున ఆమె చేతిని అందుకుని కళ్ళకద్దుకున్నాడు- ఆనందంగా ఆవేశంగా--- ఆమె విషయంలో అతడలా చేయడం అది రెండవసారేమో!


***

అబ్బాయిలిద్దరికీ స్కూలు అడ్మిషన్ ఇంటర్వ్యూలు దగ్గరపడుతున్నాయి. కాంతం ప్రతి సాయంత్రమూ ప్రక్కన కూర్చుని స్పెష ల్ ట్యూషన్ ఇవ్వడానికి వచ్చే హిందీ టీచరమ్మకు తోడుగా కూర్చుంటుంది మరొక పని జోలికి వెళ్లకుండా-- అడిగినా అడక్క పోయినా వచ్చినప్పుడు ఒకసారి- వెళ్ళేటప్పుడు మరొక సారి టీ అందిస్తూంది. ఇష్టమని టీచరమ్మకు లడ్డూలు జిలేబీలూ అట్టే తీసి ఉంచుతుంది. ఇప్పటికి తన కొడుకులిద్దరి భవిష్యత్తూ ఆమె చేతిలోనే ఉంది మరి- ఇంతకీ ఆ హిందీ టీచరమ్మ మరెవ్వరో కాదు;అదే స్కూల్లో ముప్పై ఏళ్ళ సర్వీసు చేసి ఉద్యాగ విరమణ చేసిన వ్యక్తే- స్కూలు మేనేజిమెంట్ మెళకువలన్నీ ఎరిగిన వ్యక్తి.


కాంతం దానితో ఊరుకోలేదు. హిందీ టీచరమ్మతో బాటు తన భర్త బాస్ ని కూడా మరచిపోలేదు. తనలోని కృతజ్ఞతా భావా న్ని కచ్చితమైన రీతిలో కనబర్చుకోవడానికి పూనుకుంది. ఒక రోజు డ్యూటీ ఆప్ లో ఉన్నప్పుడు రామభద్రాన్ని పిలిచి వాళ్ళ మేడమ్ గారికి ముద్ద పప్పూ గుత్తి వంకాయ వేపుడూ ఇచ్చి రమ్మంది.


భార్య మితి మీరిన చర్యకు విసుక్కుని గట్టిగానే గసి రాడు భద్రం- “ఆమె గురించి ఏమనుకున్నావు? మనలా సంపాదన లేక ఊరు విడిచి ఊరొచ్చిన వలస పక్షుల కుటుంబం అను కుంటున్నావా! సీనియర్ మిలిటరీ ఆఫీసర్ గారి భార్య- ఆమెగారి అలవాట్లు మామూలుగా ఉండవు. ఖరీదైనవి. తలచుకుంటే ఒక రిద్దరిని కాదు- ఏకంగా నలుగురు వంటగత్తెలను పనిలో పెట్టుకోగలదు.

ఇక నీ విషయానికి వస్తే- కొడుకులిద్దరి చదువుల వ్యవహా రంలో అక్కర చూపిస్తుందని నీకామెపైన అభిమానం కలిగుండవచ్చు. అది మనసులో మాత్రమే ఉంచుకో! సమయం వచ్చినప్ప డు చూపించుకో-- అది చాలు”.


కాంతం ఊరుకోలేదు. “మీకక్కడకు వెళ్ళడానికి మొహమాటంగా ఉంటే—తోటి ఆడదానినేగా నేను వెళ్ళి ఇచ్చొస్తాను. ఆమెగారి ఇంటి అడ్రెస్ ఇవ్వండి”.


దానితో అతడు బదులు వెతుక్కోవలసి వచ్చింది. ‘మేడమ్ గారికి ఎంతైనా ఇవ్వచ్చు. కాని తమింటి భోజన పదార్థాలు ఇష్టపడుతుందా? ఏమో మరి.. తెలుగు రుచులు కదూ! కాస్తం ఘాటుగానే ఉంటాయి కదూ! ’ అనుకుంటూ కూరల డబ్బా, ముద్ద పప్పు డబ్బా తీసుకుని రూపవతి ఇంటికి బయల్దేరాడు భద్రం.


అతణ్ణి చూసి మొదట మెస్సులో పని గత్తెగా చేరిన వళ్ళరసి- పిదప క్రమంగా బాస్ కి పర్సనల్ అసిస్టెంటుగా మారడానికి పూనుకున్నట్లుంది. వచ్చిన పని అడిగి లోపలకు వెళ్ళి రూపవతికి అతడి రాక గురించి చెప్పి వచ్చింది. అప్పుడు గుమ్మం వరకూ వచ్చి తనను తొంగి చూసిన రూపవతి విస్మయాత్మకంగా చూసింది.


“మీరా!” అంటూ లోపలకు తీసుకువెళ్ళింది. కూర్చోమని సోఫా చూపించింది. కాని అతడు ఆసీనుడు కాలేదు. చుట్టూ పరకాయించి చూస్తూ నిల్చున్నాడు. అపార్టుమెంట్ చిన్నదై నా నీటుగా కుదురుగా లేత పచ్చరంగు పైంటింగుతో శోభాయమానంగా ఉంది. తన కుటుంబం కోసం- తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె ఇప్పటి చిన్నపాటి అపార్టుమెంటుకి రావలసి వచ్చిందన్న వైనం గుర్తుకు వచ్చి మనసు మూలన అసహనం వంటి శీతల పవనం తారాడింది. ఇంతటి ఉన్నతురాలికి తను చేబదులుగా ఏమి చేయగలడు?


ఆ మిలిటరీ ఆఫీసర్ గాని అందరిలా యాక్టివ్ ఉద్యోగ బాధ్యతలు తగ్గించుకుని- సంపాదన కోసం యావ తగ్గించుకుని వాచా కర్మణ:పూర్తి స్వఛ్ఛంద ఉద్యోగ విరమణ చేసేస్తే మేటర్ అంతా గట్టుకి చేరుకుంటుంది. అదెప్పుడు జరుగుతుందో! అలా ఉద్యోగ వ్యవహారాన్ని ముగించి భార్య చెంతకు చేరాలన్ని ఆలోచన ఎప్పుడు కలుగుతుందో ఆ బుర్రమీసాల పటాలం ఆఫీసరుకి!


ఆ మాటకు వస్తే, వెన్నెల ఏడాది పొడవునా కురుస్తూ ఉండదుగా-- కురిసే ఆ కొద్దిపాటి యవ్వన ప్రాయపు బంగారు వెన్నెలనూ అడవి పాలు చేయకూడదు. ఇప్పుడో అప్పుడో వయసు పైబడదూ-- ఇక వాళ్ళ మరదలు విషయానికి వస్తే ఆమె కూడా అంతేమరి-- పెళ్లీడు వచ్చి చాలా నాళ్ళ యుంటుంది. ఆమె కూడా చెక్కు చెదరకుండా యవ్వన ప్రాయపు బరువుని చీకూ చింతా లేకుండా అజంతా శిల్పంలా నిల్చుని వాంఛల బరువుని మోసుకుంటూ గడిపేస్తుంది.


ఎలాగో మరి- ఇంకెక్కడైనా బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడేమో! ఎంతటి నిగ్రహం గల ఆడదైనా పంటిబిగువన ఉలక్కుండా ఊరుకోవడానికి పూనుకున్నా వయసు మాత్రం ఊరుకోదు కదా!

అలా ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు ఎక్కడికో బైటకు వెళ్లి వచ్చినట్లుంది మంజుల- తలుపు తోసుకుని వస్తూనే పలకరించింది- “ఎప్పుడొచ్చారు భద్రంగారూ? మీ మేడమ్ గారిని చూసారా? లేక పిలిచేదా? ”.

అతడు నవ్వుతూనే వచ్చిన కార్యం చెప్పాడు. అలాగే- అంటూ తలూపుతూ లోపలకు వెళ్లిపోయింది. ఆ లోపల అక్కడకు రూపవతి రానే వచ్చింది చేతిలో ఏదో ప్లాస్టిక్ సంచీతో-


అతడు నవ్వుతూ ఎదురెళ్లాడు- “ఇదంతా ఎందుకు మేడమ్! మా ఆవిడ పంపిన కూరల డబ్బాలు ఖాళీ చేసి ఇచ్చేస్తే చాలు” అంటూ-


అప్పుడామె అందుకుంది- “మా ఇంట్లోనేమో పిల్లల చప్పుడు ఎలాగూ లేదు. మీ ఇంట్లో ఎలాగూ వాళ్ళ ఉనికి మెండుగానే ఉంది కదా! వాళ్లకోసం తీసుకు వెళ్ళండి” అంటూ సంచీని అందిచ్చింది.

అందిస్తూ అందామె- “స్కూలులో బుధవారం పిల్లకాయలిద్దరికీ ఇంటర్వ్వూ-- మొన్న స్కూలు అడ్రెస్సు ఇచ్చాను కదూ- ఉదయమే వచ్చేయండి. అక్కడ కొంచెం జాప్యం జరగవచ్చు. మీరూ మీ ఆవిడా సిధ్ధమయే రండి. నేనేమో వైస్ ప్రిన్సపాల్ రూము ప్రక్కనే ఉంటాను. మీరు మరీ టెన్షన్ అవకండి”.


అతడు థేంక్స్ చెప్పి నిల్చున్న చోటనుండే మంజులకు కూడా ఓమాట చెప్పి అక్క ణ్ణించి బైటకు కదిలాడు.


అతడెప్పుడో మాధవధార ప్రక్కన జరిగిన ఆధ్యాత్మిక ప్రసంగంలో విన్నట్టు గుర్తు- వాల్మీకి మహర్షి అన్న బంగారు పలు కు- ‘మంచి మనిషి కనిపిస్తే, అతడి చెంతన కూర్చుంటే చల్లగా ప్రవహించే నీటి వాగు ప్రక్కన కూర్చున్నట్లుంటుంది! ’అదే భావం అతడి మనసున పెనవేసుకుంది.


తన కొడుకులిద్దరి చదువూ గాడిలో పడటానికి యెవరేమి చేసినా వాళ్ళ కాళ్లపైన పడటానికి అతడికి యిసుమంత మొహమాటమూ లేదు. తనకే కాదు. తన భార్య కమల కాంతానికి కూడా ఆవిషయంలో అదే మనోభావం-

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




49 views0 comments

Commentaires


bottom of page