top of page
Writer's picturePandranki Subramani

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - పార్ట్ 8


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 8' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 8' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి.


ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి. రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు.

అతను ఆఫీసుకు రాకపోవడంతో ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది రూపవతి. అతను పార్కులో ఎవరితోనో గొడవ పడ్డట్టు తెలుసుకొని బాధ పడుతుంది. అతని పిల్లల స్కూల్ అడ్మిషన్ విషయంలో సహాయం చేస్తానంటుంది.


చెప్పినట్లుగానే అడ్మిషన్ ఇప్పిస్తుంది.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 8' చదవండి.


ఆరోజు మంగళవారం. అతడు నిన్ననే రూపవతితో చెప్పి వచ్చాడు మంగళవారం నాడు ఆమెతో ముఖ్యమైన విషయ మొకటి మాట్లాడాలని-- దానికామె ఏమీ అనకుండా- అలాగే అన్నట్టు ‘ఊఁ’ అంది. అంచేత అతడు ప్రొద్దుటే లేచి అంబ ఆలయానికి వెళ్లి ముమ్మార్లు ప్రదక్షిణలు చేసి వచ్చి ఆ తరవాత అల్పాహారం తీసుకుని మెస్సు చేరుకున్నాడు. అతడక్కడికి చేరుకునేసరికి అప్పుడప్పుడే వంటలకు కుంపట్లు వెలగసాగాయి. లోపలకు వెళ్లి బట్టలు మార్చుకోకుండానే సోమనాథానికి ఓ మాట చెప్పి క్యాష క్యాబిన్ వేపు నడుచుకుంటూ వచ్చాడతడు.


అక్కడ వాళ్ల బాస్ రూపవతి సిధ్ధంగా ఉంది, అతడి రాక కోసం. ఆమె మరదలు మంజులాదేవి అకౌంట్సు అసిస్టేంట్ మాలిని ఇద్దరూ అక్కడ లేరు. వేరే పనులపైన మరెక్కడికో వెళ్లినట్టున్నారు. “నమస్కారం! ” అంటూ అంబ గుడినుండి తెచ్చిన ప్రసాదం అందిస్తూ క్యాష క్యాబిన్ లో ఉన్న స్టూలుపైన ఆసీనుడయాడు రామభద్రం. ఆమె నవ్వుముఖంతో నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుంటూ తిరిగి చూసింది చెప్పమన్నట్టు--


“మరేమీ లేదు మేడమ్. మీకు మన సూపర్ వైజింగ్ కుక్ సోమనాధంగారు తెలుసు కదా! ” ఆమె మొదట నవ్వబోయి పిదప ఆపుకుని అతడి వేపు కళ్లు విప్పార్చి చూసింది. “భలే ప్రశ్నే వేస్తున్నారు? తెలియక పోతే అతణ్ణి హెడ్ కుక్ గా అప్పాయింట్ చేస్తానా! అతనికి మా నాన్నగారి వద్ద కూడా మంచి పేరు ఉంది”.


దానికతడు చిన్నగా పొలబారినట్టు దగ్గి విషయానికి రావడానికి ప్రయత్నించాడు- “నేను చెప్పేది వ్యక్తిగతంగా తెలుసానని- మీ దృష్టిలో అతణ్ణి మంచివాడంటారని- నమ్మక స్థుడంటారని నాకు తెలుసు. నేనడిగేది ఆయన కుటుంబ జీవితం గురించి”

“పూర్తిగా తెలియదనుకుంటాను. ఆయన కలివిడిగా మాట్లాడటం నేను చూడలేదు కూడాను. మితభాషి. మావాళ్ళ మిలిటరీ స్టైల్ లో మనుగడ సాగిస్తాడు. ఏదో భారాన్ని మోస్తున్నట్టు కనిపిస్తాడు” ఆ ఒక్క విషయంలో ఆమె ఉపయోగించిన పద ప్రయోగం రామభద్రానికి నచ్చింది. అంటే—అతణ్ణి రూపవతి బాగేనే గమనిస్తుందన్నమాట--


“ఔను! కచ్చితంగా అలాగే ఉంటాడు”అంటూ సోమనాధం కుటుంబ నేపథ్యం గురించి వివరించి చెప్పాడు రామభద్రం. అంతా విన్న తరవాత ఆమె అతడెదురు చూసినట్లే ముఖం బాధగా పెట్టి చూసింది- “వినడానికి నిజంగా సంకటంగానే ఉంది. ఇంట్లో యేవో కారణాల వల్ల మరణాలు సంభవించా యని- ఇంకా సంభవిస్తాయేమోనని భయపడి ఉన్నఊరిని విడిచి రావడం చాలా అరుదుగా జరిగే సంఘటన. వాళ్ళ ఇంటిపైన- వాళ్ళ వాడపైన దుష్టశక్తి చూపు పడినట్టుంది. కనీసం కన్నకూతుర్ని చూడటానికి వెళ్ళినట్టులేదు ఇంతవరకూ-- ”

“మళ్ళీ అదే కారణం- తను గాని ఇంటి గడప దాటి లోపలకు వెళ్తే- తనకూ, ఇంట్లో వాళ్లకూ అదే దుర్గతి పడ్తుందని-- ఐతే ఒకటి —సంగీత కుటుంబానికి చెందినవాడు కాబట్టి తంజావూరుని తలచుకుని, ముఖ్యంగా తిరువయ్యారు తలచుకుని తెగ దిగులు పడుతుంటాడు. ఆ తీరున ఇక్కడెక్కడైనా దక్షిణాదుల సంగీత కచ్చేరి గాని జరిగితే—వెతికి వెతికి మరీ వెళ్తాడు. సంగీత త్రిమూర్తు లంటే- పురంధర దాసంటే-- మహాభక్తి”.


ఆమె భద్రం చెప్పింది విని దీర్ఘంగా నిట్టూర్చింది. నిట్టూర్చుతూనే అంది-- “ఈయేటి వార్షిక లెక్కలు చూసిన తరవాత అతడికి జీత భత్యాలు పెంచాలనుకుంటున్నాను. కాని ఇంతటి కష్టాల కడలిలో ఈదుతున్నాడని మా త్రం తెలియదు. ఇక అతడి గురించి ఇంకేదైనా చెప్పాలా--- “


”నేనిప్పుడిక్కడకు వచ్చింది సోమనాధంగారి గురించి మాత్రమే కాదండి. మంజులదేవిగారి గురించి కూడాను--”


“ఆమె ఆ మాట విన్నంతనే ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూసింది అతడి వేపు. “దాని ఊసెందుకు ఇక్కడా—” అంటూ అర్ధోక్తిలో ఆగిపోయిందామె.



“ఆమెకు కూడా పెళ్లీడు దాదాపు దాటిపోయే వయసు వచ్చింది కదా! గుణవంతుడు. కచ్చితత్వం గల వ్యక్తి కావడాన- మంజులని సోమనాధానికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ తరవాత మీ ఇష్టం--” అంటూ స్టూలుపైనుండి లేచాడు రామ భద్రం.


“ఆగండి! సగం చెప్పి సగంలోనే వెడలిపోతే ఎలా? మీ మాటను అంత తేలిగ్గా కొట్టి పారేయలేనుగా! కాగా- ఇప్పటికే మంగుళూరు లో దాని కోసం రెండు సంబంధాలు చూసాం. త్వరలో ఒక సంబంధం- హుబ్లీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. అందులో సోమనాధానికి రెండవ మనువు కదా! కూతురు కూడా ఉంది కదూ-- అదేమంటుందో మరి. మీరు గాని చెప్తే ఆలోచించవల్సిన విషయమనే తోస్తూంది”,


“కొందరు ఆరితేరిన వారిలా గంభీరంగా కనిపిస్తారు— సంపాదన పుష్ఠిగా ఆర్జించే వాళ్ళు కూడా ఎదురవుతారు. ఐతే— అల్పాశలకు అతీతంగా జీవించే నమ్మకస్థుడు కనిపించడం కష్టం. మంజులదేవి నాకు చెల్లి వంటిది ఆ కోణంలోనుంచే సలహా ఇచ్చాను” అంటూ లేచి వెళ్లిపోయాడు రామభద్రం.


ఆరోజు సాయంత్రం మాలినీ దేవి మంజులా దేవి అప్టేట్ చేసిన జీత భత్యాల రిజష్టర్ చూసాడు రామభద్రం. బాస్ మేడమ్ చెప్పినట్లే సోమనాథం జీతం పెంచారు. అది గుర్తించి చిన్నగా నవ్వుకుంటూ యథేఛ్ఛగా తన జీత భత్యాల వివరాలు చూసాడు. ఆశ్చర్యం కలిగింది. తను మేడమ్ నుండి తీసుకున్న అడ్వాన్స్ నుండి ఏదీ కట్ చేసినట్లు కనిపించలేదు.


విస్మయం చెందుతూ ఆవిషయం మేడమ్ వద్ద ప్రస్తావించాడతడు- “నెలవారీగా సులభ వాయిదాల పధ్ధతిన కట్ చేస్తే నాకు బాగుంటుంది మేడమ్! ఒకే సారి భారీగా కట్ చేయనారంభిస్తే నాకు ఇబ్బంది కరంగా ఉంటుందండీ-- “


“తెలుసు. తెలిసే కట్ చేయలేదు. ఎందుకో తెలుసా?".


తెలియదన్నట్టు తల అడ్డంగా ఆడించాడతను. ఆమె చిన్నగ నవ్వి చెప్పసాగింది- “మీది పెద్ద కుటుంబం. ఖర్చులు అథికంగా ఉంటాయి. దానికి తోడు—మీ అమ్మగారికి ప్రతినెలా మంధులు కొని వ్వాలి. ఔనా?”


అతడు బేలగా చూస్తూ తల ఊపాడు.


“అంచేత మీకు కూడా జీతభత్యాలు పెరిగిన తరవాత అడ్వాన్స్ కట్ట చేయనారంభస్తాం, ఈజిట్ ఓకే!’


అతడు బదులివ్వలేదు. చేతులు జోడించి అక్కణ్ణించి కదలి వెళ్ళిపోయాడు.


మరునాడు ఏమైందో మరి—ఉదయం ఎనిమిది తరవాత కూడా రూపవతి మెస్సుకి రాలేదు. సూపర్ వైజరీ పనులూ ఆఫీసు వ్యవహాలు అన్నీ మంజుల మాలిని ఇద్దరూ చూసుకుంటున్నారు. మేడమ్ గారి ఉనికి లేకపోవడం గమనించిన రామభ ద్రం నిదానంగా సోమనాథం ఆదేశాలనుసరించి వంట పనులు చేసుకుంటున్నాడు. మరి కొద్ది సేపటికి అతడు ఊపించినట్లే జరి గింది. మంజుల వద్దనుంచి పిలుపొచ్చింది- అతణ్ణి వెంటనే రమ్మనమని. అతడు జాప్యం చేయకుండా సోమనాధానికి ఒక మాట చెప్పి భీమన్ కి తన పని అప్పగించి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని వెళ్ళాడు. అతణ్ణి చూసిన వెంటనే స్పందించిందా మె. కాని- తననుకున్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు- ’అలా బైటికిరండి. మీతో మాట్లాడాలి’ అంది.


మొత్తానికి ఆమె తన వ్యక్తిగత వ్యవహార విషయమై పిలువ లేదనిపించింది. “మీరీ చెక్కుని తిన్నగా సేఠ్ గారికి అందిచ్చి, అటునుండి మేడమ్ గారి వద్దకు వెళ్లి రండి. ఆమె మిమ్మల్ని రమ్మన్నారు. అన్నట్టు పగలు కావటాన మీరు పార్కు మార్గం ద్వారానే షార్ట్ కట్ లో వెళ్ల వచ్చు”


అతడేమీ అనకుండా చెక్కునీ ఫర్ వార్డింగ్ లెటర్ నీ అందుకుని కాసిన్ని మంచినీళ్లు తాగి బైటకు నడిచాడు. నడుస్తు న్నవాడల్లా ఆగాడు మంజుల గొంతు విని-- “ఇకపైన ఇటువంటి ముఖ్యమైన పేపర్లు మీకే ఇవ్వమని మేడమ్ ఇదివరకే డైరక్షన్ ఇచ్చారు. ఇదిగోండి దారి ఖర్చులకి-” అంటూ యాభై రూపాయల నోటుని అందిచ్చింది.


కాదనకుండా తీసుకొని కదిలాడు రామ భద్రం. అంటే- తనను మెల్ల మెల్లగా స్టాప్ సైడుకి లాగుతుందన్నమాట మేడమ్. రేపు అకౌంట్సు పని కూడా ఇస్తుందేమో! అతడి మనసు ఉన్న పాటున ఉబలాటపడింది. ఎగిసి పడింది. అతడికి ఆదినుండీ చదువురుల మధ్య ఉండటం, పుస్తకాల దొంతర్లు ముందేసుకుని పని చేయడం అంటే అవధికి మించిన ఆరాటం.


రూపవతికి తప్పకుండా శరీరం సహరించకుండా మొరాయించి ఉంటుంది. లేక పోతే మెస్సుకి ఆమె రాకపోవడం- చెప్పా చేయకుండా ఉండిపోవడం, అసంభవం! అతడదే ఊపున చకచకా పార్కుగుండా నడచి వెళ్లి సేఠ్ గారికి చెక్కుని అందిచ్చి, టిప్స్ గా ఆయనందించిన మరొక యాభై రూపాయల నోటుని కూడా అంది పుచ్చుకుని రైల్వే యార్డు మలుపు తిరిగి డజన్ బత్తాయి నారింజ పండ్లు కొనుక్కొని రూపవతి ఇల్లు చేరాడు. ఈసారి తలుపు పనిగత్తె తెరవలేదు, రూపవతే తెరిచింది.

ఆశ్చర్యంగా చూసి అడిగాడు- “నేను మీకు ఆరోగ్యంగా లేదనుకుని బత్తాయి నారింజ పండ్లు తెచ్చానండీ. మీరు గాని మామూలుగా ఉన్నారని తెలుసుంటే యాపిల్స్ తెచ్చేవాణ్ణి” అంటూ లోపలకు ప్రవేశించాడు.


ఆమె అతడితో బాటు నడుస్తూ అంది- “మీరెలా అనుకున్నా రు నాకు ఒంట్లో బాగానే ఉందని? మీరూహిస్తున్నట్లు నాకు గాని ఒంట్లో బాగుంటే నేనక్కడ కదూ ఉండాలి! ”


“నిజమే! మీ స్ట్రిక్ నెస్ గురించి నాకు తెలియనిదా? తూర్పున ఉదయించడం సూర్యుడు మరచి పోవచ్చు గాని- మీరు సమయ పాలన పాటించకపోవడమా-- కాని—మీ మోము ఎప్పటిలాగే కళగా ఉంటేను- కళ్లు కూడా మెరుస్తుంటేను! ఇకపోతే- పెళ్ళయిన వాణ్ణి ఒక మాట చెప్తాను మీరు మరొక విధంగా అనుకోకపోతే—”


“బాగుంది మీ వ్యవహారం! ఇంకా సందేహాలేనా నా వద్ద? ఉఁ చెప్పండి”.


అతడు వెంటనే నోరు విప్పకుండా క్షణం పాటు ఆగి అన్నా డు- “మీ మిలిటరీ భర్త నిజంగా అదృష్టవంతుడు”.


ఆమె చిన్నగ నవ్వి అంది- “బాగానే చెప్పారు. మా వారి విషయమై మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. మరి నేను కూడా అదృష్ట వంతురాలినేనా అన్నది మీరెప్పుడైనా ఆలోచించారా! సరే—అదలా విడిచిపెట్టండి. నాకు నిజంగానే బాగాలేదు. ఇంట్లో యాపిల్స్ డ్రై- ఫ్రూట్స్ గట్రా ఉన్నా యి గాని, బత్తాయి మాత్రం లేదు. తినాలనిపించింది— మీరు అడక్కుండానే తెచ్చారు. నూరు వందనాలు! ”


“మీరంతటి పెద్ద మాట ఉపయోగించకండి గాని— విషయం చెప్తారా ఒంటికేమి చేసిందో-- “


“ఇంకేముంది? షరా మామూలే! మెడ పట్టేసింది- ఆ సలపరింత నడుం వరకూ ప్రాకిపోయినట్లుంది“

“ఐతే మీరు నేను చెప్పినట్టు తప్పకుండా చేయాలి! బెనారస్ హిందూ వైద్య కళాశాల బ్రాంచీ ఇక్కడెక్కడో ఉన్నట్లుంది. మీరు వెళ్లి పూర్తి చికిత్స తీసుకోవాలి. మీరెలాగూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంటారు కదా- గుణం తప్పకుండా ఏర్పడుతుంది. త్వరగా యేర్పడుతుంది. దయచేసి ఈఒక్క మాటా వినండి”.


ఆమె అతడి వేపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది- “మీరెందుకండీ నా ఆరోగ్యం విషయంలో ఇంతలా కళ వళ పడి పోతున్నారు?".


అతడు చప్పున తలదించుకున్నాడు. నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు-

ఆమె రెట్టించి అడిగింది- “మాట్లాడరేం? ” అని.


“మీరు స్థిమితంగా ఉండటం మాపనివాళ్లందరకూ అవసరం- ముఖ్యంగా ఊరుకాని ఊరని చూడకుండా మిమ్మల్ని నమ్మి ఇక్కడకు వచ్చిన మా ఇంటిల్లపాదీకీ-- ”


“సరే—మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞురాలిని.. మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. ఇద్దరు ముగ్గురు మోతుబరి వ్యాపారస్తులు వచ్చి అడిగారు మెస్సుని అమ్మేయమని బిల్డింగుతో బాటు. నాకు కూడా మంగళూరు వెళ్లిపోవాలనే అనిపించింది.


కాని అప్పటినుంచీ మానాన్నగారిని నమ్ముకుని ఇక్కడ పనిచేస్తూ జీవిస్తూన్న స్టాఫ్ కి ఆడామగా పనివాళ్ళకీ జీవనోపాధికి దెబ్బ తగలకూడదనే నడిపిస్తున్నాను. ఈ విషయంలో మా నాన్నగారి మాటను జవదాటడం నా వల్ల కాదు. ఆ కథంతా ఇప్పుడెందుకు గాని— మీరు నాకేమీ రిలీఫ్ కలుగచేయరా? ”


“ఎందుకు కలుగచేయను? నరాల వత్తిడి, శరీర మర్దన గురించి నాకు తెలుసన్నాగా- ఐతే- ఒక షరతుపైన రిలీప్ కలుగ చేస్తాను”


అదేమిటన్నట్టు అతడి కళ్ళల్లో కళ్లు పెట్టి చూసింది.

“నేను తప్పకుండా మెడ వరకూ మర్దన చేస్తాను. వీపు వేపు మాత్రం నేను సాగలేను”.


ఎందుకూ అన్నట్టు మరొకసారి కళ్ళెత్తి చూసిందామె.

“ఎందుకంటే—అదొక ప్రమాదకరమైన భూమండలం. భూతాపం గల మధ్య రేఖ-- అటుగాని చేతులు చాచితే ఎటువంటి మగాడి చేతులైనా భఘ భఘ మండిపోక మానవు”


“గృహస్థులు—నిగ్రహం గలవారు-- మీకు కూడానా! ”


“నేను ముందే ఈ విషయమై వార్నింగ్ ఇచ్చాను రూపవతీ! మీరు మర్చిపోయుంటారు. ఇప్పుడు నన్ను ఆటలు పట్టిస్తున్నారు”


“నాకు అంత పెద్ద వార్నింగ్ ఇచ్చారా! మరచి పోయినట్టున్నాను. నాకోసం ఒకసారి ఉఛ్చరిస్తారూ! ”


“నానోట చెప్పించాలని చూస్తున్నారు కాబట్టి- చెప్తాను. మీరు నిండుగా ఎత్తుగా ఎనలేని శిల్ప సౌందర్యంతో వయ్యారంగా ఉంటారు. మీశరీరం నుంచి తేలే సువాసనలు సన్నజాజి పూదోటల్ని మరిపిస్తాయి. వాటికి నేనే కాదు- ఎవడైనా సరే పుష్పక విమానం లో తేలిపోవలసిందే! ”.


ఆమె సమ్మోహన కరంగా నవ్వింది. “అంతటి ప్రమాదం మీకు రానివ్వను లెండి- “ అంటూ సోఫాలో అటు తిరిగి కూర్చుని అతడికి అమృతాంజనం డబ్బా అందిచ్చింది రూపవతి.


అతడు చట్టున అడిగాడు- “మరి మీ తమిళ పనావిడ పనికి రాలేదా?"


ఆమె తల అడ్డంగా ఆడిస్తూనే మెడపైనున్న చీర చెంగును తొలగించింది అలవోకగా--. అతడికి తెలియకుండా నే అతడి కళ్ళు పెద్దవయాయి. ఉన్నపాటున ఉలూచితో అర్జునుడు పడ్డ అవస్థ గుర్తుకు వచ్చింది-


“శయ్యకు దార్పగా దురము (కొప్పు) జారె, నదంతట చక్కదిద్దిచో పయ్యెద జారె, నయ్యదిరి పాటున గ్రక్కున నీవి(చీరముడి) జారె- రాజయ్యెడ నవ్విలాసిని యొయూరము జూచి నౌ- నెయ్యడ మేలె చూతురు- గణింపరు జాణలు జారుపాటులన్-- ‘


అతడలా తను వీధి నాటకాలు వేసే రోజుల్లో చదివిన వేంకట కవి పద్యాన్ని తలచుకుంటూ తైలాన్ని రూపవతి మెడన పూసాడు తడబడే చేతులతో- అతడలా మెడ చుట్టూ నుదుట చూట్టూ మర్దన చేసిన తరవాత అతడు భీష్ముడంతటి నిగ్రహాన్ని కొని తెచ్చుకుని అడిగాడు- “నా వంతు మర్దన ఐపోయినట్లుంది రూపవతీ! మరి మంజులకు ఫోను చేస్తారా?".


దానికామె తిరిగి చూడకుండానే బదులిచ్చింది- “ఇప్పుడది ఇక్కడకు రావడం అంత అవసరమా! ఈఒక్కసారికీ మిమ్మల్ని మీరు వైద్య శిఖామణిగా తలచు కోలేరా! ”


ఆమె హస్కీ కంఠస్వరంలోని ఉద్విగ్నతను గమనించిన రామభద్రం ఓపలేకపోయాడు. మెల్లగా వంగి ఆమె వీపుని నడుము పైభాగాన్ని మృదువుగా మూద్దాడి చివుక్కున లేచి గది తలుపు వద్దకు దూసుకు వెళ్లాలని పూనుకున్నాడు.


కాని- నిగ్రహం వ్రేళ్ళసందులోనుండి జారిపోయే నీటి చుక్కల్లా మనసు వశం తప్పి పోతూంది. వివశత్వం చెందుతూంది. నిశ్శబ్దంగా- గాఢంగా- మర్మంగా ఆమెను ఆక్రమించుకున్నాడు. ఇప్పుడామెకు కావలసిందదేనేమో!

=======================================================================

ఇంకా వుంది

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై' పార్ట్ 9 త్వరలో

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




32 views0 comments

Comments


bottom of page