'Ila Jarigina Desam Entha Bagundo' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 10/09/2024
'ఇలా జరిగిన దేశం ఎంత బాగుండో' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
"మీ పేరు ఏమి?...."
వేపచెట్టు చుట్టూ వృత్తాకారంలో అరుగు. అరుగు మధ్యన చెట్టుకు దగ్గరగా కుర్చీ. కుర్చీలో ఆ గ్రామ పెద్ద మనిషి ఆనందరాయుడు.
ఆనందరాయుడు, అరుగు ముందు గుంపుగా నిలబడి వున్న ఊరి జనం మధ్యలో నేరస్థుడై తలదించుకొని నిలబడివున్న ఓంకారయ్యను ఆ ప్రశ్న అడిగాడు.
జనమంతా ఆనందరాయుడిని ఆశ్చర్యంతో చూచారు. కారణం ఆనందరాయుడుగారికి ఆ నేరస్థుని పేరు బాగా తెలుసు. తెలిసీ వారు ఆ ప్రశ్నను అడగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఓంకారయ్య మెల్లగా తలను పైకెత్తి, క్షణంసేపు ఆనందరాయుడి ముఖంలోకి చూచి, వెంటనే తలను విచారంగా దించుకొన్నాడు.
"ఓంకారయ్య!" తన పేరును మెల్లగా చెప్పాడు ఓంకారయ్య.
"ఓంకారయ్యా!" ఆనందరాయుడు సింహనాదం.
ఓంకారయ్య మెల్లగా తలెత్తి ఆనందరాయుడి ముఖంలోకి దీనంగా చూచాడు. అతని కళ్ళల్లో కన్నీరు.
"నీవు పద్మనాభరావు గారి ఇంట్లో దొంగతనం చేశావా?"
"లేదు సామీ!" విచారంగా చెప్పాడు ఓంకారయ్య.
"అయితే.... మేము పెట్టబోయే పరీక్షకు నీవు సిద్ధమేనా?"
సిద్ధం అన్నట్లు తలాడించాడు ఓంకారయ్య.
"ఎర్రగా కాగిన గడ్డపారను చేతుల్లోకి తీసుకొంటావా!.... లేక సలసల కాగే నూనెలో చేతులు పెడతావా!"
"మీ ఇష్టం సామీ!" మెల్లగా చెప్పాడు ఓంకారయ్య.
ఆ గ్రామ పెద్దరికాన్ని ఆనందరాయుని తండ్రి కేశవరాయుడు వారి తండ్రి భాస్కరరాయుడు వారి జీవితకాలంలో నిర్వహించారు.
తాతతండ్రుల పద్ధతిలోనే ఆ గ్రామ వ్యక్తుల మధ్యన ఏర్పడిన సమస్యలను గురించి ఇరువర్గాల వారినీ విచారించి పై పద్ధతులతో నిజాన్ని గ్రహించి, తీర్పును చెప్పడం ఆనందరాయుడికి అలవాటు ధర్మం.
దానికి కారణం ఆ కుటుంబంపై ఆ గ్రామస్థులకు వున్న విశ్వాసం, గౌరవం. గ్రామ ప్రజలంతా ఆనందరాయుడి ఇంటిని ’పెద్ద ఇల్లు’ అని పిలుస్తారు.
ఆ గ్రామ ప్రజలందరూ ఆస్థికులు ’దైవసాక్షి’ అనే పదాన్ని విశ్వసిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు.
ఆనందరాయుడు తన నౌకరు మీరా వైపు చూచాడు. మీరా రాయుడిని సమీపించాడు.
"మీరా!"
"అయ్యగారూ!"
"పిడకలు పేర్చి గడ్డపార నుంచి పిడకలు కప్పి కిరోసిన్ చల్లి నిప్పును వెలిగించు."
"అట్టాగే సామీ!"
శివాలయం ముందు పిడకలను పేర్చి వాటిపై గడ్డపారను వుంచి పైన పిడకలను పేర్చి, కిరోసిన్ చల్లి నిప్పును వెలిగించాడు మీరా.
పిడకలు గణగణ మండసాగాయి. పొగ గాల్లో కలిసిపోతూ వుంది. ముక్కాలు గంటలో పిడకలన్నీ బూడిదగా మారిపోయాయి.
వూరిజనం వలయాకారంలో నిలబడి జరుగుతున్న చిత్రాన్ని చూస్తున్నారు.
మీరా బూడిదను పారతో ప్రక్కకు నెట్టాడు. గడ్డపార ఎర్రగా మారిపోయింది.
"ఓంకారా!... నీవు ఇప్పుడు గడ్డపారను నీ చేతుల్లోకి తీసుకొని దుయ్యాలి" అన్నాడు ఆనందరాయుడు.
ఓంకారయ్య కోనేటిని సమీపించి దిగి నీట మూడుసార్లు మునిగి తడి బట్టలతో గడ్డపార వున్న ప్రాంతానికి వచ్చాడు.
అతని తండ్రి వీరయ్య ఓంకారయ్య చేతిలో మల్లెపూలు పోశాడు. ఓంకారయ్య ఆ పూలను ఎర్రగా కాగివున్న గడ్డపారపై చల్లాడు. చేతులు జోడించి శివపరమాత్మకు నమస్కరించాడు. ఎలాంటి జంకు గొంకులు లేకుండా గడ్డపారను చేతుల్లోకి తీసుకొనేటందుకు వంగాడు.
"ఆగరా!.... ఓంకారా!... అందరూ వినండి. నా దృష్టిలో ఓంకారుడు నిరపరాధి. పద్మనాభరావు అతన్ని అనుమానించాడు. ఇప్పుడు జరుగబోయే పరీక్షలో ఓంకారుడి చేతులు కాలకుండా మామూలుగా వుంటే వారు నిర్ధోషి. మరి దోషి ఎవరు?... నా అనుమానం పద్మనాభరావు కొడుకు రాజారావుపైన. పద్మనాభరావు! నీ కొడుకును వెళ్ళి కోనేటిలో మునిగి రమ్మను. ఓంకారుడు నిర్దోషిగా రుజువైతే, నీ కొడుకు వెంటనే ఓంకారుడు చేతుల్లోని గడ్డపారను అందుకోవాలి. చెప్పు, నీ కొడుక్కు. కోనేటిలో మునిగి రమ్మను" అన్నాడు ఆనందరాయుడు.
పద్మనాభరావు, రాజారావుల ముఖాలు కళావిహీనం అయినాయి. ఆ వూరికి ఆరు కిలోమీటర్ల దూరంలో వున్న పెద్దవూర్లో పోలీస్ స్టేషన్ ఉంది.
ఇంతవరకూ ఆ గ్రామంలో పోలీసులు ఏనాడూ రాలేదు. కొత్తగా ఆ స్టేషనుకు త్రివిక్రం అనే సబ్ ఇన్స్ స్పెక్టర్ వచ్చాడు. క్రిందటి రోజున, ఈరోజు ఈ గ్రామంలో జరుగనున్న ఆనందరాయుడిని గురించి, వారు ఇచ్చే తీర్పును గురించి విని, చూచేదానికిగా త్రివిక్రం ఆ గ్రామానికి వచ్చాడు. ఆనందరాయుని ప్రక్కన సుఖాశీనులైనారు. జరుగుతున్న తంతును చూస్తున్నాడు.
"ఓంకారా!... ఎత్తరా గడ్డపార" శాసించాడు ఆనందరాయుడు.
ఓంకారయ్య ఎర్రగా కాగివున్న ఆ గడ్డపారను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. పైకి క్రిందికి చేతులను గడ్డపారపై మూడుసార్లు జార్చాడు.
చుట్టూ వున్న వూరిజనం ఇన్స్ స్పెక్టర్ త్రివిక్రం ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
ఓంకారయ్య చేతులు కాలలేదు.
రాజారావు పరుగెత్తి పారిపోయాడు.
"రాజారావూ!... నీ కొడుకు పారిపోతున్నాడు" నవ్వుతూ చెప్పాడు ఆనందరాయుడు.
మరుక్షణంలో “పద్మనాభరావు నీవు ఓంకారయ్యకు పాతికవేలు ఇవ్వాలి. మూడునెలలు నీ కొడుకు వూరిలో ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇంట్లోనే వుండాలి. ఇదే నా తీర్పు"
పద్మనాభరావు సిగ్గు అవమానంతో తలదించుకొన్నాడు.
"దొంగ నీ కొడుకు. ఓంకారయ్య కాదు. వాడి చేతులను తాకి చూడు" అన్నాడు ఆనందరాయుడు.
గడ్డపారను క్రింద వుంచి ఓంకారయ్య ఆనందరాయుడుని సమీపించి వారి పాదాలను కళ్ళకు అద్దుకొన్నాడు.
"నా గ్రామ జనులారా! జరిగిన సన్నివేశాన్ని చూచారు కదా! ఎర్రటి గడ్డపార వలన ఓంకారయ్య చేతులు కాలలేదు. గడ్డపారను దూయాలి అనగానే పద్మనాభరావు కొడుకు రాజారావు పారిపోయాడు. ఆ రాజారావే దొంగ. ఓంకారయ్య నిర్దోషి. నిర్దోషులకు ఎప్పుడూ ఆ సర్వేశ్వరుల అండ వుంటుంది" నవ్వుతూ ఆనందంగా చెప్పాడు ఆనందరాయుడు.
"సార్!... మీ గురించి విన్నాను. నేడు ఇక్కడ ప్రత్యక్షంగా చూచాను. మీలాంటి మహనీయులు వూరికి ఒక్కరుండిన ఆయా గ్రామ ప్రజానీకం పద్దతిగా, పరస్పర మైత్రితో, దైవభక్తితో కలిసి కట్టుగా వుంటారు. పెద్దల మాటను గౌరవిస్తూ న్యాయ ధర్మ నిర్ణయం ప్రతి గ్రామంలో ఇలా జరిగిన దేశం ఎంత బాగుందో??? సార్!.... యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్!... మీకు నా హృదయపూర్వక అభినందనలు. నమస్సుమాంజలి" ఆనందంగా నవ్వుతూ చేతులు జోడించాడు ఇన్స్ పెక్టర్ త్రివిక్రం.
వూరిజనం ఆనందరాయుడికి నమస్కరించి వారి వారి ఇండ్లవైపుకు నడిచారు.
దొంగలా పద్మనాభరావు జనం మధ్య జారుకున్నాడు.
ఇన్స్ పెక్టర్ త్రివిక్రం ఆనందరాయుడికి సెల్యూట్ చేసి తన జీప్ వైపుకు నడిచాడు.
ముందు ఆనందరాయుడు వెనుక మీరా, రాయుడిగారి ఇంటి వైపుకు నడిచారు.
దేశానికి గ్రామాలు వెన్నెముక. గ్రామ సఖ్యత దేశ సఖ్యత. కక్షలు, కార్పణ్యాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంతో, పెద్దలను గౌరవిస్తూ, వారి మాటలను ఆదరించి, ఆచరిస్తూ, గ్రామ నగర దేశ సఖ్యతను కుల మత రహితంగా సాధించడం. అందుకు పాటుపడటం ప్రతి భారత పౌరుని కర్తవ్యం, ధర్మం.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments