'Incubators' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 22/01/2024
'ఇన్‍కుబేటర్స్' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
ప్రతి స్త్రీ మూర్తికి ప్రధమ ప్రసవం మరుజన్మతో సమానం. ఆ తొలి ప్రసవం సవ్యంగా జరిగి తల్లిబిడ్డ క్షేమంగా ఉండటం రెండు కుటుంబాలకు మహా భాగ్యం. దానికి వ్యతిరేకం స్థితి ఆ యువతికి అగ్ని పరీక్షతో సమానం. దీక్షాపూర్వక అగ్నిప్రవేశం చేసిన వారికి ఆ అగ్నిదేవుడు శగలు పుష్పగుచ్ఛపు సీతలం. అంటే భక్తి శ్రద్ధలతో కూడిన దైవ ఆరాధన సదా సర్వులకు ఆనందదాయకం. శాంతి ప్రదాయకం....
జానకిరామ్, సౌజన్యల ఒక్కగానొక్క కూతురు సంధ్య. వారి వివాహం జరిగిన ఐదు సంవత్సరాలకు జన్మించింది. సంధ్య జననం ముందు కాలంలో వారు ఎన్నో గుడులు, గోపురాలను, పవిత్ర నదీ జలస్నానాలను, మొక్కుబడులు, ముడుపులను ఆచరించారు. సంధ్య పెరిగి పెద్దదై బి.ఎ వరకు చదివింది. సౌమ్యురాలు. సంధ్య వివాహం దూరపు బంధువు సత్యానంద్‍తో జరిగింది. సత్యానంద్ గారి తల్లి మంగమ్మ గారు కొడుకు వివాహం అయిన నాటినుంచి తన కోడలు త్వరలో తన చేతిలో మనవడినో, మనుమరాలినో పెడుతుందని కొండంత ఆశతో రోజులను, మాసాలను లెక్కపెట్టేది మంగమ్మ.
సంధ్య నాలుగు సంవత్సరాలు గడిచినా పులుపు తినాలనే మాటను నోట పలుకని కారణంగా విసిగిపోయిన మంగమ్మ తన కోడలికి గర్భధారణ యోగం లేదని తన కొడుకు సత్యానంద్‍కు మరో వివాహం చేయాలని నిర్ణయించుకొంది. అదే విషయాన్ని సత్యానంద్‍తో చెప్పింది. కానీ సత్యానంద్‍కు సంధ్య అంటే పంచ ప్రాణాలు. తల్లికి తెలియకుండా సత్యానంద్, సంధ్యకు అన్ని టెస్టులు మంచి డాక్టర్స్ వద్ద చేయించాడు. వారు వ్రాసి ఇచ్చిన మందులను భార్యచేత సక్రమంగా తినిపించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎంతగానో తాను అభిమానించే భార్య పట్ల తల్లి అనే సూటీపోటీ మాటలను విని సత్యానంద్‍కు భార్య పట్ల నిరసన భావన కలిగింది. ఇరువురి మధ్యన మాటలు తగ్గిపోయాయి. సంధ్య తన దుస్థితికి ఒంటరిగా కూర్చుని భర్తలో కలిగిన మార్పును తలచుకొని భోరున ఏడ్చేది.
సంధ్య తల్లి సౌజన్య, తండ్రి జానకీరామ్ సౌజన్యకు వివాహమై నాలుగు సంవత్సరాలు గడిచినా సంతతి కలగని కారణంగా వారూ ఎంతగానో బాధపడేవారు.
సౌజన్య హార్ట్ పేషంటు. కూతురి హీన స్థితికి తాను ఎంతగానో వాపోయేది. భర్త జానకీరామ్ ఆమెను ఓదార్చేవారు. ’కాలం కలిసి రావాలి కదా సౌజా సహనం దైవ చింతన, మన మనశ్శంతికి అవి రెండే మార్గాలు’ అంటూ భార్యను ఓదార్చేవాడు జానకిరామ్. తన నిర్ణయాన్ని పదేపదే చెప్పి, చెప్పి మంగమ్మ సత్యానంద్‍ను మరో వివాహానికి ఒప్పించింది.
దూరపు బంధువులు ఉన్న ప్రక్క గ్రామానికి వెళ్ళి ఒక పిల్లను చూచింది. రెండవసారి కొడుకు సత్యానంద్‍తో వెళ్ళి అతను అమ్మాయిని చూచేలా చేసింది. అయిష్టంగానే తల్లి బాధలు భరించలేక సత్యానంద్ రెండవ పెళ్ళికి అంగీకరించాడు. విషయాన్ని సంధ్యకు చెప్పాడు.
"సంధ్యా! నేను మా అమ్మ మాటలను కాదనలేను. నీవు గర్భం ధరించలేకపోయావు. అమ్మకు మనుమడినో, మనుమరాలినో చూడాలనే ఆశ. నేను నిన్ను మీ ఇంటికి పంపను. నీవు నాతోనే ఈ ఇంట్లోనే వుంటావు. అమ్మ ఇష్టానుసారంగా ఆమెకు ఆనందాన్ని కలిగించేదానికి నేను చూచి వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకొంటాను. అమ్మను తృప్తి పరిచేదానికి నాకు వేరే మార్గం లేదు" విచారంగా చెప్పాడు సత్యానంద్.
సత్యానంద్ తల్లి విషయంలో ఆ రీతిగా తయారు కావడానికి కారణం సత్యానంద్ తండ్రి రామారావు గారు. ఆయన ప్లీడరు గుమస్తా. సత్యానంద్ వయస్సు పది సంవత్సరాలుగా వున్నప్పుడు లారీ యాక్సిడెంటులో గతించారు. సత్యానంద్ ఒక్కగానొక్క కొడుకైనందున మంగమ్మ తన ఆశలనన్నింటినీ సత్యానంద్ పైనే వుంచుకొని అతిగారాబంగా, ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసింది. సత్యానంద్ ఆనందమే తన ప్రపంచంగా బ్రతికింది. సత్యానంద్‍ను బాగా చదివించి సబ్ రిజిస్టార్‍ను చేసింది.
మంగమ్మ సంధ్య చేత, తనకు సంతానయోగం లేనందున మనస్ఫూర్తిగా భర్త రెండవ వివాహానికి తాను అంగీకరించినట్లు వ్రాయించి సంధ్య చేత సంతకం పెట్టించి, ఆ కాగితాన్ని భద్రంగా తన పెట్టెలో దాచింది. సంధ్యను వారి అమ్మగారింటికి పంపింది.
ఆ రెండవ వధువు పేరు సుగుణ. మంగమ్మ సత్యానంద్, సుగుణల వివాహాన్ని పరమానందంగా జరిపించింది. కొడుకును, రెండవ కోడలిని హనీమూన్ కోసం కాశ్మీరుకి పంపింది.
పదిరోజులు సత్యానంద్, సుగుణతో కాశ్మీరు సుందర ప్రాంతాలను సందర్శించి పరమానందంగా వూరికి తిరిగి వచ్చారు.
సత్యానంద్ రెండవ వివాహం, హనీమూన్ విషయాలను విన్న సంధ్య, ఆమె తల్లిదండ్రులు జానకీరామ్, సౌజన్యలు ఎంతగానో బాధపడ్డారు. సంధ్య గుర్తుకు వచ్చినప్పుడల్లా తన తల్లి కారణంగా సంధ్యకు అన్యాయం (మరో పెళ్ళి చేసుకొని) చేశానని బాధపడేవాడు సత్యానంద్. తల్లిని ధిక్కరించలేని సత్యానంద్, తన మనస్సున వున్న ప్రేమాభిమానాలతో, తల్లికి తెలియకుండా సంధ్య వాళ్ల వూరికి వెళ్ళి వారికి తన దుస్థితిని తెలిపి క్షమాపణ చెప్పి రెండురోజులు సంధ్య ఇంట్లో ఉండి సంధ్యను ఆనందపరిచి, ఇకపై కొంతకాలం మన జీవితం ఇలాగే సాగుతుందని సంధ్యకు చెప్పి తన ఊరికి తిరిగి వచ్చేశాడు.
ఇలా ఒకసారి కాదు ప్రతినెలా సత్యానంద్ సంధ్య వూరికి వెళ్ళి అక్కడ రెండు మూడు రోజులు ఉండి తిరిగి వచ్చేవాడు. తల్లికి తాను క్యాంప్‍కి వెళుతున్నట్లు చెప్పి తన ఆశయాన్ని నిర్భయంగా నెరవేర్చుకునేవాడు సత్యానంద్.
సుగుణ నెల తప్పింది. ఆ వార్త విన్న మంగమ్మకు ఎంతో ఆనందం. కోడలిని అటూ ఇటూ కదలనీయకుండా ఆమెకు ఇష్టమైన రకరకాల వంటకాలను చేసి సుగుణకు దగ్గర కూర్చొని బలవంతంగా తినిపించేది. అది సుగుణ మీద ప్రేమతో కాదు ఆమె గర్భంతో వున్న బిడ్డమీద ఉన్న అభిమానం. ఆ బిడ్డ బాగా ఆరోగ్యంగా పుట్టాలనే వాంఛ.
సుగుణ తల్లిదండ్రులు వచ్చి సీమంతం ఘనంగా జరిపించారు. కాన్పుకు సుగుణకు తమతో పంపమని కోరారు. కానీ మంగమ్మ అందుకు సమ్మతించలేదు. తొలి కాన్పు గాని, మలి కాన్పు గాని తన ఇంట్లోనే జరగాలని తన కఠోర నిర్ణయాన్ని వారికి తెలియజేసి సాగనంపింది.
డాక్టర్ గారు చెప్పిన తేదీ ప్రకారం సుగుణను హాస్పిటల్లో చేర్పించారు. రెండురోజులు గడిచినా కాన్పు జరగక బాధతో సుగుణ అల్లాడిపోయింది.
పరీక్షలను నిర్వహించిన డాక్టర్స్ కడుపులో బిడ్డ అడ్డంగా తిరిగిందని సహజ కాన్పు జరగదని ఆపరేషన్ చేయాలని, బిడ్డ తల్లీ ఎవరో ఒకరే బ్రతుకుతారని చెప్పారు.
ఆ వార్త విన్న సుగుణ తల్లిదండ్రులు హాస్పిటల్‍కు వచ్చి సుగుణను చూచి ఎంతగానో బాధపడ్డారు. మంగమ్మ కూడా శోకాలు పెట్టి ఏడ్చింది. తల్లీబిడ్డను కాపాడమని తాను నమ్మిన దేవతలను వేడుకొంది.
కానీ డాక్టర్లు పెద్ద ప్రాణి అయిన సుగుణను రక్షించగలిగారే కాని బిడ్డను కాపాడలేకపోయారు.
అంతవరకు సుగుణపై ఎంతో ప్రేమను ఒలకపోసిన మంగమ్మ బిడ్డ చనిపోయిన వార్తను విని కోడలు నష్ట జాతకురాలని తీర్మానించుకొంది. ఆమెతో మాట్లాడటం మానేసింది.
మంగమ్మ ధోరణిని వీక్షించిన సుగుణ తల్లిదండ్రులు నాలుగు రోజుల తరువాత సుగుణ డిశ్చార్జి కాగానే తమతో వారి వూరికి తీసుకుని పోయారు.
మంగమ్మ కలలు కల్లలైనాయి. సత్యానంద్ భార్యతో అత్తవారింటికి వెళ్ళాడు.
వారంరోజులు అత్తవారింట వుండిన సత్యానంద్ తన తొలి భార్య సంధ్య వూరికి వెళ్ళాడు. వారికి జరిగిన సంగతులన్నీ చెప్పాడు.
సంధ్య ఏకాంతంలో సత్యానంద్‍కు తాను నెల తప్పానని నాల్గన నెల అని చెప్పింది. సత్యానంద్‍కు చాలా సంతోషం కలిగింది. ఈ విషయాన్ని అప్పుడే తన తల్లికి చెప్పకూడదని నిర్ణయించుకొన్నాడు. సంధ్య హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళి పరీక్షలు చేయించాడు. బిడ్డ బలహీనంగా ఉందని టానిక్, మందులు వ్రాసి ఇచ్చింది డాక్టర్ శాంతి. పదిరోజులు సంధ్య వారి ఇంట్లో ఉండి, సత్యానంద్ తన గ్రామం చేరాడు. పదిహేను రోజులకు ఒకసారి సంధ్య వాళ్ల వూరికి వెళ్ళి సంధ్య ఆరోగ్యాన్ని పరామర్శించి, హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళి పరీక్షలు చేయించి స్వగ్రామం చేరేవాడు సత్యానంద్.
సంధ్యకు అప్పటికి ఏడవ మాసం. ఆమెను చూడటానికి వెళ్ళాడు సత్యానంద్.
ఆ మరుసటి రోజు సంధ్యకు నొప్పులు ప్రారంభం అయినాయి. తమాయించుకోలేక ఏడవసాగింది.
సంధ్యను హాస్పిటల్లో చేర్పించారు. ఆ సాయంత్రం సంధ్య మగశిశువును ప్రసవించింది. బిడ్డ బరువు 0.80 కేజీలు. తక్కువ బరువుతో పుట్టినందున డాక్టర్లు సంధ్యను బిడ్డను ఐ.సి.యులో వుంచారు.
నెలలు తక్కువతో పుట్టిన మగబిడ్డను ’ఇన్‍కుబటర్స్’లో వుంచుతారు. అంటే ఆ యంత్ర వాతావరణం బిడ్డకు తల్లి గర్భంలో వున్నట్లుగానే వుంటుంది. అది విజ్ఞానపూర్వ కృత్రిమ గర్భాశయంగా పనిచేస్తుంది.
వారంరోజుల తర్వాత సంధ్యను డిశ్చార్జి చేశారు. కన్నబిడ్డ హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో వున్నందున సంధ్య, సత్యానంద్, సంధ్య తల్లితండ్రులు హాస్పిటల్లోనే వుండేవారు. ఆ దైవానుగ్రహం వలన, సంధ్య తండ్రి కాంట్రాక్టరుగా, నీతి నిజాయితీలతో, మంచిపేరుతో బాగా సంపాదించినందున హాస్పిటల్ ఖర్చుకు వారు ఇబ్బందు పడలేదు. ’ధనమూలం ఇధం జగత్’ ధనంతో ఒక్క తల్లిని తప్ప ఎవరైనా సరే అన్నింటిని పొందవచ్చు.
రెండు నెలలు బిడ్డ హాస్పిటల్లో వుండి పూర్ణ ఆకృతిని వైద్యక్రియల ప్రభావంతో సంతరించుకొన్నాడు. మనుమడు కూతురు, అల్లుడితో సంధ్య తల్లి సౌజన్య, తండ్రి జానకీరామ్ తమ ఇంటికి చేరారు.
ఈ మధ్య కాలంలో రెండుసార్లు సత్యానంద్ తన వూరికి వెళ్ళాడు. రెండవ పర్యాయం వెళ్ళినప్పుడు తల్లి సంధ్యకు మగబిడ్డ పుట్టినట్లు, తల్లీబిడ్డా క్షేమంగ ఉన్నారు అని క్లుప్తంగా తల్లి మంగమ్మకు చెప్పాడు సత్యానంద్.
తనకు మనమడు పుట్టి వంశపేరు నిలబడినందుకు మంగమ్మ ఆనందించింది. కొడుకుతో సంధ్య, వాళ్ళ వూరికి వచ్చి మనుమడిని చూచి మురిసిపోయింది. కోడలు సంధ్యను ఆమె తల్లిదండ్రులను ప్రీతిగా పలుకరించింది.
సంధ్య తల్లితండ్రులు మంగమ్మ తమ బిడ్డకు పెట్టిన కష్టనష్టాలను మరిచి ఆమెకు ప్రీతిగా పలుకరించి గౌరవించారు.
సత్యానంద్ సుగుణ వూరికి వెళ్ళి సంధ్య మూలంగా తనకు జన్మించిన మగబిడ్డను గురించి చెప్పాడు.
ఎంతో ఉత్తమురాలైన సుగుణ భర్తతో కలిసి సంధ్య ఊరికి వచ్చి తల్లిబిడ్డను, ఆమె తల్లిదండ్రులను చూచి అందరితో ఎంతో ఆప్యాయంగా మసలుకొంది.
"సంధ్యా! అత్తయ్య మంగమ్మ మూలంగా నేను వారి ఇంట్లో నీ స్థానంలో కొంతకాలం గడిపాను. అత్తగారు తన స్వార్థంతో నాకు అతిగా తినిపించి, ఏ పనీ చేయనీయకుండా చేసినందున, బిడ్డ అతి బరువుగా కడుపులో పెరిగినందున, ఊపిరి ఆడక నా ఆడబిడ్డ కడుపులోనే చనిపోయింది. నా కడుపును కోసి చనిపోయిన బిడ్డను బయటకు తీసి కనీసం నాకు చూపకుండానే స్మశానానికి చేర్చారు. నా గర్భసంచిని డాక్టర్లు తొలగించారు. అంటే నాకు ఇకపై సంతాన యోగం లేదు. పుట్టిన బిడ్డపోవడంతో మంగమ్మత్త నన్ను ఆ తరువాత నానా హింసలకు గురిచేసింది.
నీ కాన్పు ఎలా జరిగిందో, ఆ వివరాలన్నీ వారు నాకు చెప్పారు. నాకు ఒకవైపున ఆనందం, మరోవైపున ఆవేదన కలిగింది. ఆనందానికి కారణం నీవు తల్లివైనందుకు అత్తగారి కలను నిజం చేసినందుకు. ఆవేదనకు కారణం నాకు ఇకపై సంతాన యోగం లేనందుకు. ఒక్కటి మాత్రం నిజం ఆయనకు తన కన్నతల్లి అంటే ఎంతో ప్రేమ. కారణం వారి తండ్రి చిన్నవయస్సున పోవడంతో మంగమ్మత్త వారిని పెంచిన రీతి విధానం.
నేను ఇకపై నీకు గాని, వారికి గాని కనిపించను. నీవు వారు బాబు అత్తయ్యా ఆనందంగా బ్రతకాలి. అదే నా కోరిక. నీవు నా కంటే చిన్నదానివి కనుక హృదయపూర్వకంగా దీవిస్తున్నాను. చెల్లీ! నీవు మీ వారు బాబు నిండు నూరేళ్ళూ ఆనందంగా జీవించాలి. నేను అత్తయ్య మంగమ్మ దృష్టిలో గొడ్రాలిని. ఆమె ఇంటి కోడలిగా పనికిరానిదాన్ని. బి.యస్సీ వరకూ చదువుకొన్నాను. ఈ మధ్య కాలంలో ఇన్సపెక్టర్ ట్రైనింగ్ పూర్తయింది. స్త్రీలకు, బాలికలకు, అనాథలకు జీవితాంతం సాయం చేయడమే నా జీవితాశయం. నేను మీ మధ్యన ఉండకూడదు. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. బాబును కాపాడిన డాక్టర్ చల్లగా వర్దిల్లాలి" అని చిరునవ్వుతో చెప్పింది సుగుణ.
తన కుడిచేతిని బాబు తలపై ఉంచి "నాన్నా! నా ఆయుష్షులో అర్థభాగం నీది. నీవు గొప్పవాడివై నిండు నూరేళ్ళు చల్లగా వర్థిల్లుదువు గాక! డాక్టర్ దైవ సమానులు. ఇన్‍కుబటర్స్ జిందాబాద్..." అని నవ్వుతూ మనసారా దీవించి పమిటతో కన్నీటిని తుడుచుకొంటూ వేగంగా వీధివైపు వెళ్ళిపోయింది సుగుణ. సంధ్య, సత్యానంద్ దీనంగా ఆమెను చూస్తూ నిలబడిపోయారు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments