Intinti Katha Written By Sammetla Venkata Ramana Murthy
రచన : సుస్మితా రమణ మూర్తి
సుదర్శనంకి ఏమీ తోచటం లేదు. కూతురు అమృత, మనవరాలు దివ్య గుడికి వెళ్ళారు.
తనను రమ్మని పిలిచినా వెళ్ళలేదు. సోఫాపై చిందరవందరగా ఉన్న స్కూలు పుస్తకాలు బేగులో సర్దుతుంటే, కూతురు, మనవరాలి మాటలు గుర్తుకి వచ్చాయి.
“ మమ్మీ! రేపు నాకు తెలుగు పరీక్ష. “
“అన్ని పాఠాలు చదువుకున్నవే కదా?...గుడి నుండి వచ్చింతర్వాత మరోసారి చదువుకో! రాత్రికి నేను చదివిస్తాను.”
“ అవసరం లేదు మమ్మీ! ఇప్పుడు రాయమన్నా పరీక్ష రాయగలను. “
“ గుడ్! బాగా చదువుకున్నావన్న మాట! “
బేగులోంచి తెలుగు వాచకం, నోట్సు పుస్తకం బయటకు తీసి
చూడసాగాడు సుదర్శనం.
‘ ఆ రాజు అదరు హఇగ నవకనరు. ‘
నోట్సు పుస్తకంలో ఓ చోట ఆ వాక్యం చూసిన తన భృకుటి
ముడిపడింది. తెలుగు వాచకం చూస్తేనేగాని ఆ వాక్యం
అర్థం కాలేదు—’ ఆ రోజు అందరూ హాయిగా నవ్వుకున్నారు. ‘
‘ మదుర మదుర ఆ పాట ఎత మదుర!’
ఈసారి తెలుగు వాచకం చూడాల్సిన అవసరం లేకపోయింది తనకు.
‘పెన్సిల్ తో మధురం మధురం ఆ పాట ఎంత మధురం!’—అని
ఆ వాక్యం క్రింద రాసాడు .
మరికొన్ని చోట్ల కూడా అక్షర దోషాలు కనిపించాయి .
బాధని---భాదగా….బాధ్యతని---బాదతగ ….భేదంకి---బేధంగ
శుభ్రతకి---సుబరతగ….రాసిన పదాలకు రైటని టీచర్ పెట్టిన టిక్కులు చూసి,వాటిని కూడా సరి చేసి, ఆలోచనలో పడ్డాడు తను.
‘ఇంట్లో బాగా చదువుకున్న తల్లి తండ్రులు -- పిల్లల చదువు గురించి పట్టించుకోకుంటే
వారి తెలుగుకి ఇలాగే తెగులు పడుతుంది. తను చెబుతామంటే--
” నాకు అన్నీ వచ్చు తాతా!” అంటూ దివ్య తన మాట వినటం లేదు.
ఇలా వదిలేస్తే పిల్లకు మాతృభాష తప్పులు లేకుండా రాయడం ఎలా వస్తుంది?ఈ దశలోనే పెద్దలు పట్టించుకోవాలి. దిద్దుబాటు చర్య చేపట్టాలి….’
సుదర్శనం ఆలోచనలు పరిష్కారం కోసం తపన పడుతున్నాయి.
“ ఏఁవిటి డాడీ! ఏదో ఆలోచిస్తున్నట్లుంది?” అన్న కూతురు మాటలకు—
“ఆలోచించడానికి ఏముందమ్మా! రేపు దీనికి తెలుగు పరీక్ష కదా?.....
నోట్సు పుస్తకంలో మొదటి పాఠాలు చూస్తే…..”
తన మాటలు పూర్తి కాలేదు. మనవరాలు నోరు విప్పింది.
“ రేపటి పరీక్ష ముందు పాఠాల్లో కాదు తాతా!...ఆఖరి పాఠాల్లో.నాకు అన్నీ వచ్చు. “
“అలాగా!?...మీ తెలుగు టీచర్ ఎవరు తల్లీ? “
“ లావణ్య మేడమ్! ఇక్కడే మీద ఫ్లోర్లో ఉంటున్నారు. పాఠాలు చాలా బాగా
చెబుతారు. “
మనవరాలి మాటలు వింతగా తోచాయి తనకు.
“ అవును డాడీ! దానికి అన్ని పాఠాలు వచ్చు. మీరేమీ పట్టించుకోవాల్సిన
అవసరం లేదు. రాత్రికి నేను చదివిస్తాను. “
“నోట్సులో అన్నీ తప్పులే రాసింది. ఎక్కడ ఒత్తులు పెట్టాలో, ఎక్కడ
సున్నాలు పెట్టాలో దానికి తెలియటం లేదు. నేర్పించాలి కదమ్మా?”
“ మీకెందుకు డాడీ?...హాయిగా ఓమూల కూర్చుని పేపరు చదువుకోండి!
మమ్మల్ని తినకండిలా! దాని చదువు సంగతి నేను చూసుకుంటాను.”
కూతురు మాటలకు సుదర్శనం ఆశ్చర్యపోయాడు. మాతృభాషంటే ఎనలేని అభిమానం గల సుదర్శనంకి వారి ధోరణి నచ్చలేదు. బాధ పడుతూ నోరు విప్పాడు.
“నా మాటలు నీకు నచ్చక పోవచ్చు. కోపం రావచ్చు. అయినా చెప్పక తప్పదు . ఇంటిలో ఎవరికీ పిల్ల చదువు పట్ల బాధ్యత లేదు. పిల్లలకు రేపు పరీక్షనగా, ఈరోజు అర్ధరాత్రి దాకా పాఠాలు చదివించడం , ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదు. మీరు వారంలో రోజు విడిచి రోజైనా దాని చదువు సంగతి పట్టించుకుంటే పరీక్షల ముందు హైరాన ఉండదు. “
‘ ఈమధ్య డాడీకి చాదస్తం బాగా పెరిగి పోయింది. ఊరుకోమన్నా ఊరుకోవటం లేదు. ‘
స్వగతంలా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది తను. కూతురు మాటలకు మరోసారి బాధ పడ్డాడు సుదర్శనం.
‘ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లల అందరి తెలుగు ఇలానే ఉంటోందా!?...అమృత చదువంతా ఇంగ్లీష్మీడియంలోనే కదా?...తెలుగు నేర్పింది తనేగా!..అలాంటిది ఈరోజు తనుకూడా మాట వినటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పిల్లకు మాతృభాష సరిగ్గా రాదు. తెలుగు వాళ్ళం అయివుండి కూడా తెలుగు భాషను పట్టించుకోకపోవడం క్షమించరాని నేరం!...తెలుగు దేశంలో ఉంటూ, తెలుగు భాషకు అన్యాయం జరుగుతుంటే తనెలా ఊరుకో గలడు?.....’
సుదర్శనం ఆలోచనలు అలా సాగిపోతున్నాయి.
****
కాలింగ్ బెల్ మోగుతూంటే తలుపు తీసింది లావణ్య.
ఎదురుగా నవ్వుతూ సుదర్శనం.
“ నా పేరు సుదర్శనం. మీ స్టూడెంట్ దివ్య తాతగారిని.”
“ నమస్కారం సార్! రండి. అలా కూర్చొండి. “
“ మా దివ్య మీ గురించి ఎప్పుడూ చాలా మంచిగా చెబుతుంది.
ఎంతవరకు చదువుకున్నావమ్మా? “
“ ఇంటర్ పాసయ్యానండీ! బి.ఏ ప్రయివేటుగా చదువుతున్నాను.”
“ ఇంటర్ దాకా ఇంగ్లీష్ మీడియంలోనేనా?”
“ అవునండీ! ఎల్ కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే!”
‘ ఇంగ్లీష్ మీడియం అమ్మాయి, టీచర్ ట్రయినింగు లేకుండా
తెలుగు పాఠాలు చెప్పడం!?...అందుకే దివ్య తెలుగలా!...’
మనసులో అనుకున్నాడు సుదర్శనం.
“ మంచిది తల్లీ! నేనిలా రావడం ఆశ్చర్యంగా ఉంది కదా? …ఒక విషయం చెప్పాలని వచ్చాను.మాతృభాష అమ్మ భాష. మన తెలుగు భాష. చిన్న క్లాసులలో పిల్లలకు టీచర్ల మాటే వేదం.స్కూల్లో చెప్పే ప్రతి మాట, ప్రతి విషయం ఆ చిట్టి బుర్రల్లో చాలా బలంగా నాటుకు పోతుంది. మా టీచర్ చెప్పిందే కరెక్ట్—అంటారు . పిల్లలకు చాలా జాగ్రత్తగా పాఠాలు చెప్పాలి. ముఖ్యంగా అక్షర దోషాలు లేకుండా రాయడం నేర్పించాలి. “
ఆమె ఆశ్చర్యంగా సుదర్శనం మాటలు వినసాగింది.
“ నా గుర్తుగా ఈ తెలుగు నిఘంటువు ఉంచుకో తల్లీ! పదాలకు అర్థాలు, ఎక్కడ ఒత్తులు పెట్టాలో తెలుసుకోవడానికి పనికొస్తుంది. అక్షర దోషాలు కూడా సరి చేసుకోవచ్చు. “
నిఘంటువు తీసుకొని చేతులు జోడించిందామె.
“ఇక్కడే ఉంటున్నాంగా! ఎప్పుడైనా అవసరం వస్తే కలుస్తాను. “
‘ వారు ఎందుకు వచ్చినట్టు!?...ప్రత్యేకంగా ఇంటికి వచ్చి, తెలుగు నిఘంటువు ఇవ్వడంలో అంతరార్థం ఏమిటి!? ‘
సుదర్శనం రాక ఆమెను ఆలోచింపజేస్తోంది.
****
నమస్కారం సార్!
మిమ్మల్ని కలిసి మాట్లాడటానికి జంకు గాను, సిగ్గు గాను ఉంది. తెలుగు నిఘంటువు ఇవ్వడంలోని ఆంతర్యం వెంటనే అర్థం కాలేదు.నిఘంటువు పేజీలు తిరగేస్త్తుంటే ,దివ్య నోట్సులోని కొన్ని పేజీల జిరాక్స్ కాపీలు అందులో చూసాను.నేను కరెక్ట్ అని టిక్కు లు పెట్టిన పదాలను, వాక్యాలను మీరు పెన్సిలుతో సరిచేయడం గమనించాను.
స్కూలులో కాకుండా ఇంటికి వచ్చి సున్నితం గా, పెద్ద తరహాగా పరోక్షంగా మందలించిన తీరు ఎప్పటికీ మరచిపోలేను.ఇకమీదట జాగ్రత్తగా ఉంటాను.
దివ్య టీచర్—లావణ్య .
మనవరాలు దివ్య ద్వారా ఆ ఉత్తరం అందుకున్న సుదర్శనం మనసు కాస్త కుదుటపడ్డది.
------------------------------ / సమాప్తం /--------‐----------------------
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
తెలుగు భాష కు పట్టిన గతి ని
చక్కగా వివరించింది
రచయితకు అభినందనలు
కథ చాలా బాగుంది. ప్రతివారు చదవవలసిన కథ. సుస్మిత రమణమూర్తి గారికి ధన్యవాదాలు.
మంచి కథ. అభినందనలు రచయితకు.
ఇందులో సమస్యని చాలా సున్నితంగా పరిష్కరించారు. మీ వ్రాత శైలి అభినందనీయం.
ఇంటింటి కథ ప్రస్తుత తెలుగు భాష పరిస్థితిని తెలుపుతుంది రచయిత చక్కగా వ్యక్తపరిచారు