top of page

ఇరుకైన ఇల్లు

Writer's picture: Divakarla Venkata Durga PrasadDivakarla Venkata Durga Prasad

#DVDPrasad, #డివిడిప్రసాద్, #ఇరుకైనఇల్లు, #IrukainaIllu, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు


Irukaina Illu - New Telugu Story Written By - D V D Prasad

Published In manatelugukathalu.com On 19/02/2025

ఇరుకైన ఇల్లు - తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



బజారుకెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన ఆనందరావు కూరలసంచీ భార్య శారదమ్మకు అందించి, "కాయగూరల ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. మనలాంటి సామాన్యులు, అందులోనూ మనలాంటి రిటైరైన వాళ్ళు ఎలా బతుకుతారు? ఉద్యోగం చేసేటప్పుడైతే పర్వాలేదు కానీ, ఇప్పుడు ఉద్యోగ విరమణ తర్వాత మాత్రం చాలా కష్టంగా ఉంది. బజారుకెళ్ళాలంటేనే భయంగా ఉంది. " నిట్టూర్చుతూ కుర్చీలో కూలబడ్డాడు. ఎండలో నడిచి వచ్చినందువల్ల మొహానికి పట్టిన చెమట జేబు రుమాలుతో తుడుచుకున్నాడు. 


అతని చేతులోంచి కూరల సంచీ అందుకుంటూ, "ధరలు పెరిగాయని భోజనం మానేస్తామా ఏమిటి, చోద్యం కాకపోతేనూ! ఇంతకు ముందు కొనే దాంట్లో సగమే తెచ్చుకుందాం. అప్పుడు అరకిలో తెచ్చుకుంటే, ఇప్పుడు పావుకిలోతోనే సరిపెట్టుకుందాం. ఇంకా మనం నయం! ఒకటో తేదీ కల్లా పెన్షన్ చేతిలో పడుతోంది. ఇలాంటి సౌకర్యాలు లేని వాళ్ళ సంగతి కూడా కాస్త ఆలోచించండి. " అంది శారదమ్మ. 


"నువ్వు చెప్పేదీ నిజమే సుమా! రోజురోజుకూ పెరిగే ధరలు మధ్యతరగతి, బీదవాళ్ళ నడ్డి విరుస్తోంది. బీదవాళ్ళకి ప్రభుత్వం చౌక బియ్యం వంటి సౌకర్యాలు అందిస్తున్నా, సమస్తం అందించలేదు కదా! ఆ సౌకర్యాలు కూడా అందనివారూ ఉన్నారు. " అన్నాడు ఆనందరావు సాలోచనగా. 


ఆమె అందించిన మంచినీళ్ళు తాగి ఆయాసం తీర్చుకోసాగాడు ఆనందరావు. వంటింట్లోకి వెళ్ళిన శారదమ్మ వెంటనే తిరిగి వచ్చింది. "అన్నట్లు చెప్పటం మర్చాను. మన అబ్బాయి హరి ఫోన్ చేసాడండీ!" అంది. 


"చాలా రోజులైంది వాడు ఫోన్ చేసి, ఎందుకు చేసాడేంటి?" అడిగాడు ఆనందరావు. 


"ఏందుకు చేసాడో మరి, నాతో మాములు విషయాలు మాత్రమే మాట్లాడాడు. కోడలు, మనవలు బాగున్నారు. కానీ మీతోనే ఏదో మాట్లాడాలిట, వచ్చే ఆదివారం ఇక్కడికి వస్తానన్నాడు. మీకు అప్పుడు అన్ని విషయాలు ముఖాముఖీ చెప్తాడట!" అందామె. 


"ఏ విషయమై మాట్లాడాలనుకున్నాడో చూచాయగానైనా చెప్పలేదా?" అడిగాడు ఆనందరావు. 


"లేదండీ, నేనడిగినా మీతోనే మాట్లాడాలని అన్నాడు. " అంది శారదమ్మ. 


హరి ఎందుకు ఫోన్ చేసినట్లో, తనతో ఏం చెప్పాలని అనుకున్నాడో అని ఆలోచించసాగాడు ఆనందరావు. తనిప్పుడు ఫోన్ చేసినా ఆఫీసు పనిలో బిజీగా ఉంటాడు. అందుకే హరికి మెసేజ్ పెట్టాడు. ఆదివారం వస్తాను, అప్పుడు చెప్తాను అని బదులిచ్చాడు. 


ఆనందరావు ఉపాధ్యాయుడిగా పని చేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేసాడు. రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ సందర్భంగా అందవలసిన పైకం కూడా అందింది. తనకు అందిన ఆ సొమ్ము ఎలా భద్రపరచాలా అన్న ఆలోచనలో ఉన్నాడు ఇప్పటి వరకూ. తనపేర కొంత, భార్య పేర కొంత బ్యాంకులో జమ చేసి ఉంచాలని ఇప్పటికే నిశ్చయించుకున్నాడు. అలా జమచేసిన డబ్బులపై వచ్చే వడ్డితో విశ్రాంత జీవితం సుఖంగా గడిచిపోతుందని ఆనందరావు యోచించాడు. కొంత డబ్బులు మనవల పేర కూడా జమ చేయాలని భావించాడు ఆనందరావు. ఆ విషయమే హరితో మాట్లాడాలని అనుకున్నాడు కానీ, ఇప్పుడు హరే ఇక్కడికి వస్తాననడంతో ఆనందరావు తిరిగి ఆలోచనలో పడ్డాడు. తనకు డబ్బులు అందాయన్న విషయం తెలిసి, కొంత తనకి ఇమ్మనుడు కదా! 


హరికి మొత్తం సొమ్ము ఇచ్చేస్తే, తనకు ఎప్పుడే అవసరం కలిగినా ఎలా? వయసు పైబడటంతో రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. డబ్బులకోసం తడుముకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తన దగ్గర కొంతైనా డబ్బులు ఉంచుకోవాలి. ఇంతకీ హరి మనసులో ఏముందో? డబ్బుల విషయమేనా లేక, ఇంకేమైనా మాట్లాడటానికి వస్తున్నాడా అన్న అతని ఆలోచన తెగలేదు. ఆ విషయం తేలాలంటే ఆదివారం వరకూ వేచి ఉండాల్సిందే!


"మాటల ప్రస్తావనలో డబ్బుల విషయమేమైనా ఎత్తాడా హరి?" ఉండబట్టలేక భార్యనడిగాడు ఆనందరావు. 


"ఏమోనండీ, ఆ విషయమే ఎత్తలేదు వాడు. అయినా బెంగుళూరులో లక్షణమైన ఉద్యోగం చేసుకుంటున్నాడు. పైగా కోడలది కూడా మంచి ఉద్యోగమే! ఇద్దరూ ఆర్జిస్తూండగా, వాడికి మన డబ్బుల మీద ఆశ ఎందుకుంటుందండీ?" అందామె. 


మరేం మాట్లాడలేదు ఆనందరావు. సాలోచనగా తలపంకించాడు. 


"భోజనానికి లేవండి! వంటై చాలా సేపైంది. ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి మీకు పది గంటలకే భోజనం చేసే అలవాటు ఉందికదా!" అంది శారదమ్మ వంటింట్లోకెళ్తూ. 


ఆనందరావు చేసింది చిన్న ఉద్యోగమైనా, తన తలకు మించిన భారమైనా హరికి ఉన్నత విద్య అందించాడు. హరి ఇంజినీరింగ్ పూర్తి చేసి పేరున్న కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. హరి కోరుకున్నట్లే తను ప్రేమించిన అమ్మాయి రమతో పెళ్ళి జరిపించాడు. కోడలు తెచ్చే కట్నకానుకల మీద ఏనాడూ ఆశపెట్టుకోలేదు ఆనందరావు. అసలా ఉద్దేశ్యమే లేదతనికి. కొడుకూ, కోడలూ ఇద్దరూ బెంగుళూరులో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇద్దరు మనవలూ అక్కడే చదువుకుంటున్నారు. ఇన్నేళ్ళ ఉద్యోగంలో ఆనందరావు దాచిన డబ్బులేమీ లేకపోయినా, అప్పులు మాత్రం లేవు. 


హరి చదువు కోసం తీసుకున్న బ్యాంకులోను కూడా కూడా ఇటీవలే తీర్చేసాడు. తండ్రి ఇచ్చిన స్వంత ఇల్లు ఉంది. ప్రస్తుతం ఏ లోటూ లేకుండా విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. చేతికి అందిన పింఛనుతో హాయిగానే కాలం గడిచిపోతోంది. 

ఆనందరావు ఆతృతగా ఎదురుచూసిన ఆదివారం రానే వచ్చింది. శనివారం రాత్రి బెంగుళూరు నుండి బయలుదేరిన హరి, భార్యా పిల్లలతో తెల్లారే ఇల్లు చేరాడు. హరి ఏ ప్రస్తావన తీసుకు వస్తాడోనని ఆనందరావులో ఉత్కంఠ నెలకొంది. 


శారదమ్మ వంట హడావుడిలో ఉంది. ముందు గదిలో వాలుకుర్చీలో వెనక్కు వాలిన ఆనందరావు చేతిలో ఆ రోజు వార్తా పత్రిక ఉంది. అయినా అతని మనసు మాత్రం హరి చెప్పబోయే విషయం పైనే ఉంది. 


హరి స్నానం చేసి వచ్చాడు. కోడలు రమ వంటింట్లోకెళ్ళి శారదమ్మ తయారు చేసిన పెసరట్, ఉప్మా భర్తకు, మామగారికి అందించింది. పిల్లలిద్దరూ ఉదయమే లేచి, వీధిలో ఆడుకోవడానికి వెళ్ళారు. 


ప్లేటులోని పెసరట్ ముక్క తుంచి, అల్లం చట్నీలో ముంచి నోట్లో వేసుకొని మొదలెట్టాడు హరి. 


"నాన్నా! నేనూ, రమ బెంగుళూరులో ఓ ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడుంటున్న అపార్ట్మెంట్ అద్దెకే చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. పైగా అరకొర సౌకర్యాలతో విసిగిపోయాం. అద్దె కోసం చెల్లించే డబ్బులతో బ్యాంక్ ఇ. ఎం. ఐ. లు సులభంగా కట్టొచ్చు. ఇద్దరమూ ఉద్యోగస్తులమే కనుక, హౌసింగ్ లోన్ కూడా సులభంగానే లభిస్తుంది. అయితే, ఆ కొనేదేదో అపార్ట్మెంట్ కొనేకన్నా, స్వతంత్రంగా ఉండే డూప్లెక్స్ ఒకటి కొంటే బాగుంటుందని మా ఉద్దేశ్యం. మీరేమంటారు?" అని అడిగాడు హరి తండ్రి మొహంలోకి చూస్తూ. 


ఈ మాటలు ఏ విషయానికి నాందో తేలిగ్గానే పసిగట్టాడు ఆనందరావు. అంటే హరి తను అనుకున్నట్లుగానే డబ్బులు కోసమే వచ్చాడన్నమాట!


"శుభం! చాలా సంతోషకరమైన వార్త చెప్పావు!" మనస్పూర్తిగా అన్నాడు ఆనందరావు మొహంలో ఏ భావాలు కనపర్చకుండా. 


శారదమ్మ కూడా ఆ మాట విని చాలా సంతోషించింది. "సంతోషం నాయనా!" అందామె. 

అప్పుడు రమ నోరు తెరిచింది. "మామయ్యగారూ, మీ ఆశీర్వాదమే కాదు, ఆర్థిక సహకారం కూడా మాకు కావాలి. మాకు మాత్రం మీరు కాక ఇంకెవరున్నారు? మేము ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం మా ఆఫీసులకూ, పిల్లల స్కూళ్ళకూ దూరంగా ఉంది. అపార్ట్మెంట్ కన్నా, స్వతంత్రంగా ఉండే డూప్లెక్స్ తీసుకోవడమే మంచిదని మా ఇద్దరి అభిప్రాయం. ఇప్పుడు కొనబోయే డూప్లెక్స్ మాకు అనుకూలమైన ప్రాంతంలో ఉంది. " అందామె. 


కొడుకూ, కోడలు ఇంకేం చెప్తారోనని ఆసక్తిగా వింటున్నాడు ఆనందరావు. శారదమ్మ మాత్రం అతని భావాలు పట్టించుకోకుండా, "ఇన్నాళ్ళకు చాలా మంచి పని చెయ్యబోతున్నారు. మాకు కూడా మీరు కాక ఇంకెవరున్నారు?" అంది. 


"నాన్నా! అందుకే విషయమంతా ముఖముఖాగా మీతో మాట్లాడటానికి మేం వచ్చాం. మాకు హౌసింగ్ లోను లభిస్తుంది కానీ, ఇంటి కోసం అయ్యే డబ్బులు పూర్తిగా దొరకవు. కొంత డబ్బులు అంటే.. మార్జిన్ మనీ మన చేతిది కూడా పెట్టుకోవాలి. మా వద్ద సేవింగ్స్ కూడా ఎక్కువగా లేదు. వచ్చేదంతా పిల్లల చదువులకి, ఇతరత్రా అయిపోతోంది. మీరెలాగూ రిటైర్ అయ్యారు, మీకు టెర్మినల్ బెనిఫిట్స్ వచ్చే ఉంటాయి కదా, అందులోంచి కొంత మీరు సర్దితే.. " అర్ధోక్తిలో ఆగాడు హరి. 


విషయమంతా ముందే ఊహించిన ఆనందరావుకు ఇక మాట్లాడక తప్పింది కాదు. 

"అంటే.. ఎంత డబ్బులు కావాలి?" అడిగాడు ఒక్క క్షణం ఆలోచించి. 


"ఎంతంటే.. పెద్దగా ఏమీ అక్కరలేదు మావయ్యగారూ, ఓ యాభై లక్షలు మాత్రం మీరు సర్దితే చాలు, అంతే!.. " చాలా తేలిగ్గా అంది కోడలు రమ. 


'యాభై లక్షలా.. ' గుండెల్లో రాయిపడింది ఆనందరావుకి ఒక్కసారి. ఇంటి మరమత్తులకు కొంత డబ్బులు ఖర్చు చేసాడు. కొంతైనా డబ్బులు తన దగ్గర ఉండటం అవసరం. ఎప్పుడు ఆరోగ్య సమస్యలు, ఆస్పత్రి ఖర్చులు వస్తోయో ఎవరికి తెలుసు? అంత సర్దాలంటే తనకి కష్టమే! 


"యాభై లక్షలా!.. " మనసులో అనుకున్న మాటలు బయటకు అనేసాడు ఆనందరావు. 

తండ్రి మొహంలోని భావాలు గమనించాడు హరి. 


"నాన్నా! మీ దగ్గర అంత డబ్బులు లేకపోవచ్చని అనుకుంటున్నాను. అందుకే ఈ పాత ఇల్లు అమ్మకానికి పెట్టండి నాన్నా! కనీసం, పాతిక లక్షలు వస్తాయి. మీరెలాగూ ఇప్పుడు ఖాళీయే కదా, ఇక్కడుంటేనేం, బెంగుళూరులో ఉంటేనేం! ఈ ఇల్లు అమ్మేసి మాతో మీరు కూడా అక్కడే ఉండొచ్చు. ” అన్నాడు హరి. 


కొడుకు ఉద్దేశ్యం పూర్తిగా అర్ధం అయిపోయింది ఆనందరావుకు. ఇంతవరకూ ఎవర్నీ చేతులు చాచి అడగాల్సిన అవసరం లేకుండా బతుకుతున్నాడు తను ఇవాళ. ఉన్న ఇల్లు అమ్మేసి, బెంగుళూరు వెళ్తే అక్కడ తను, శారద వాళ్ళ మధ్య ఇమడగలరా? అయితే మరో విషయం, ఈ ఊళ్ళో వృధ్యాప్యంలో ఏదైనా అవసరం వస్తే తమనెవరు చూస్తారు? 


ఎప్పటికైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళవలసిందేగా! పోనీ హరి చెప్పినట్లు ఇల్లు అమ్మేసో, లేక తాకట్టు పెట్టో హరి అడిగిన డబ్బులు సమకూర్చొచ్చు కదా అని ఆలోచించాడు. తన స్నేహితుడు నారాయణ గుర్తుకు వచ్చాడు అతనికి. ఉన్న ఇల్లు అమ్మేసి, తన దగ్గరున్న డబ్బులన్నీ పిల్లలికి పంచేసి, వాళ్ళ దగ్గర ఇమడలేక మళ్ళీ ఊరికి తిరిగి వచ్చాడు నారాయణ. రెంటికీ చెడిన రేవడిలా తయారయ్యాడు. చివరికి వృద్ధాశ్రమం గతైంది అతనికి. తనకీ అలాంటి పరిస్థితి ఎదురవదు కదా? ఆందోళనగా చూసాడు శారదమ్మవైపు. 

భర్త మనసులోకి వచ్చిన ఆలోచన అర్ధం చేసుకుందామె. 


"ఈ ఇల్లు మీ నాన్న చిన్నప్పటి నుండి పెరిగిన ఇల్లురా! ఇల్లు పాతదైనా పెంచుకున్న అనుబంధం అటువంటిది. ఇప్పుడు అమ్మాలంటే నాన్నకి చాలా బాధగా ఉంటుంది. " అందామె ఆనందరావుకు వత్తాసు పలకడానికి. 

ఆమెవైపు ఆగమన్నట్లు చూసాడు ఆనందరావు. 

"సరే!.. నువ్వు చెప్పినట్లు ఇల్లు అమ్మేసి మీ దగ్గరకే వచ్చి ఉంటాం సరేనా!" అన్నాడు క్షణంలో ఓ నిర్ణయానికి వచ్చి. 


శారదమ్మ విస్మయంగా భర్తవైపు చూసింది. 


"అలా మీరు మాట ఇస్తే ఇంక చాలు నాన్నా!" అని రమ వైపు తిరిగి, "ఏదీ మన కొనబోయే ఇంటి ప్లాన్, ఇతర వివరాలు తీసుకురా, నాన్నగారికి చూపిద్దాం!" అన్నాడు హరి. 


రమ లేచి, తన బ్రీఫ్ కేస్ తెరిచి కొనబోయే డూప్లెక్స్ వివరాలు, నమూనాలు తెచ్చి మామగారికి అందించింది. శారదమ్మ కూడా ఆసక్తిగా చూస్తోంది. కళ్ళజోడు సవరించుకొని ఆ కాగితాలు అందుకున్నాడు ఆనందరావు. హరి ఉత్సాహంగా తండ్రి దగ్గరకు చేరి, వివరాలు అన్నీ చెప్తున్నాడు. 


"మనం కొనబోయే డూప్లెక్స్ ఇటు విమానశ్రయానికి, మేం పని చేసి ఆఫీసుకూ మధ్యలో ఉంది. పిల్లలు చదువుకొనే స్కూలు కూడా మూడు కిలోమీటర్ల దూరంకి మించదు. విశాలమైన స్థలంలో ‘గణేశా స్వగృహ’ అన్న పేరుపొందిన బిల్డర్స్ నిర్మిస్తున్నారు దాదాపు రెండువందల ఇళ్ళు. పూర్తిగా గేటెడ్ కమ్యునిటీ అది. డూప్లెక్స్ ధర ఆరు కోట్లు. మిగతా ఖర్చులు అంటే.. రిజిస్ట్రేషన్, ఫర్నిచర్ లాంటివి అదనంగా ఉంటాయనుకోండి. " అన్నాడు హరి వివరిస్తూ. 


"ఇక ఇంటి విషయానికి వస్తే, అంతా వాస్తు ప్రకారమే నిర్మాణం జరుగుతోంది. ఇటు చూడండి, ముందుకి పెద్ద హాలు, పక్కనే ఓ వాష్ రూం, వెనుక విశాలమైన కిచెన్, యుటిలిటీ ఉన్నాయి. కిచెన్ ఎదురుగా పూజ గది ఉంది. పై అంతుస్తులో మేడ మీద మూడు బెడ్ రూములు ఉన్నాయి. ఒకటి మా కోసం మాస్టర్ బెడ్ రూము, మిగతా రెండూ.. పిల్లలు పెద్దవాళ్ళైయ్యారు కదా, ఇద్దరికీ చెరో రూమూ.. " అని ఆగింది రమ అత్తగారూ, మామగారూ తన మాటలు వింటున్నారో లేదో అని వాళ్ళ కేసి చూస్తూ. 


అప్పుడు అందుకున్నాడు హరి. "నాన్నా! చూసారా, ఇటు పక్క బయట ఓ చిన్న ఔట్ హౌస్ ఉంది, అది ఇంట్లో పని చేసే నౌకర్లు లేక వాచ్ మేన్ కోసం. " అన్నాడు. 


కళ్ళజోడు చేతిలోకి తీసుకొని, హరి వైపు చూసాడు ఆనందరావు. "మరి మా కోసం కోసం గది ఏదీ?.. " అని ప్రశ్నించాడు. 


ఇద్దరూ బిత్తరపోయారు ఒక్కక్షణం. ఆనందరావు మాటలు వాళ్ళకి షాక్ తగిలి నట్లనిపించింది. అతను ఏమంటున్నాడో అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. శారదమ్మ కూడా అయోమయంగా భర్త వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెకూ మొదట అర్ధం కాలేదు అతను ఏమంటున్నాడో అని. 


"అంటే.. నాన్నా! మీరు పిల్లలతో పాటు ఉంటారు కదా, మరి మీకెందుకు ప్రత్యేకంగా గది?" అన్నాడు క్షణం తర్వాత తేరుకొని. అవునన్నట్లు తలూపింది రమ. 


ఒక్క నిమిషం మౌనం వహించాడు ఆనందరావు. 


"వద్దురా ఇలాంటి ఇరుకైన ఇంట్లో మేముండలేము. అది పేరుకు డూప్లెక్స్ అయినా, ఇల్లు మాత్రం ఇరుకే! ఎంత పెద్ద ఇల్లైనా అది ఇరుకైన ఇల్లు మాత్రమే నా దృష్టిలో! పెద్దలకోసం, అందునా తల్లి తండ్రుల కోసం గదిని కేటాయించలేని ఇల్లవనీ, బంగళా అవనీ మేము ఉండలేము. రేపొద్దున్న పిల్లలు ఇంకా పెద్దైతే మేము బయట నౌకర్లు ఉండే ఔట్ హౌసులోనే సర్దుకోవలసి రావచ్చు భవిష్యత్తులో. " అన్నాడు ఆనందరావు. 


అతనివైపు ముగ్గురూ నోటమాటరాక చూస్తూ ఉండిపోయారు. 


"రేపు ఇదే పరిస్థితి మీకూ భవిష్యత్తులో ఎదురు కావచ్చు. మీ పిల్లలు పెద్దయ్యాక పెళ్ళిళ్ళైతే, మీరూ మాలాగే అదే ఔట్ హౌస్ లో సర్దుకోవలసి రావచ్చు. సీనియర్ సిటిజన్స్ అయిన మా కోసం.. తల్లి తండ్రుల కోసం.. అంటే వయసు మళ్ళిన వాళ్ళ కోసం.. ఒక గదైనా కేటాయించమని ఆ స్వగృహ వాళ్ళకి చెప్పండి. అలాగైతేనే మేం మీ దగ్గరకు వచ్చి ఉండేది. లేకపోతే, చివరి శ్వాస విడిచేవరకూ, ఈ ఊరే.. ఈ ఇల్లే మా చిరునామా అవుతుంది. " తన మనసులో మాట బయటపెట్టాడు ఆనందరావు. 


తండ్రి అంతరంగం అర్ధమై ఆలోచనలో పడ్డాడు హరి. 


'నిజమే నాన్న చెప్పిందాంట్లో సత్యముంది! నిజమే! ఏ విల్లా అవనీ, డూప్లెక్స్ అవనీ మాస్టర్ బెడ్ రూములు, ఛైల్డ్ బెడ్ రూములు, ఔట్ హౌసులు ఉన్నాయి తప్పితే, పెద్దవాళ్ళ కోసం రూములు ఏవీ? బిల్డర్స్ ఎవరూ అలాంటి ఆలోచన ఎందుకు చెయ్యలేదు? తండ్రి చెప్పినట్లు అది ఇరుకైన ఇల్లే! తండ్రి వద్ద నుండి డబ్బులు తీసుకొని, వాళ్ళకి ఓ రూమైనా కేటాయించకపోతే ఎలా?' అని ఆలోచించి అలా వీలున్న ఇల్లే కొనాలని మనసులో గట్టిగా అనుకున్నాడు. పైకి ఆ విషయమే చెప్పాడు. 


అతని మనసు గ్రహించిన రమ కూడా తన ఆమోదం తెలిపింది. 


ఆనందరావు, శారదమ్మ హృదయం తేలిక పడింది. 

 ------



దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


58 views1 comment

1 Comment



@umaburra1043

• 58 minutes ago

Very good decision Nice narration. Very good short story with good message

Like
bottom of page