జాబిలమ్మ
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Sep 3, 2023
- 7 min read

'Jabilamma' - New Telugu Story Written By Ch. C. S. Sarma
'జాబిలమ్మ' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
వివాహం అయిన ప్రతి యువతికి మాతృత్వదశ అన్నది మహాభాగ్యం. స్త్రీ తత్వానికి సంపూర్ణం. ఆ దశ కొందరి విషయంలో వక్రిస్తుంది. అప్పుడు ఆ ఆలుమగలు ఆనందంగా సంతతితో శాంతియుతంగా బ్రతకాలంటే ఏంచేయాలి? చేసిన ప్రయత్నాలు ఫలించకపోతే పర్యవసానం ఏమిటి?..
ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీ.. వుమెన్స్ డే (ఆడవారి రోజు). భాస్కరరావు తన అర్థాంగి రంజనీకి సర్‌ప్రైజ్‌గా వజ్రాల నెక్లెస్ ను ఆ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి రాగానే బహుకరించాడు. రంజనీకి ఎంతో ఆనందం..
భాస్కరరావు గారి తల్లి దుర్గాదేవి ఆ సన్నివేశాన్ని చూచింది. లక్షలు ఖర్చుపెట్టి వజ్రాల నెక్లెస్ ను కొడుకు కోడలికి బహూకరించడం దుర్గాదేవికి నచ్చలేదు.
కారణం.. భాస్కర్, రంజనీల వివాహం జరిగి నాలుగు ఏళ్ళు పూర్తయినాయి. వారికి సంతానం కలుగలేదు.
కోడలు కడుపు పండలేదని దుర్గాదేవికి రంజనీపై కినుక. నిర్లక్ష్యం.. ఆమె అన్నగారు ప్రముఖ రాజకీయ నాయకుడు సత్యమూర్తి. కోటీశ్వరుడు. జనం అభిమానించే నాయకుడు. ఎం. పి. అన్నంటే దుర్గాదేవికి భయం. అందువలన కోడలిపై తనకున్న ఆగ్రహాన్ని గుండెల్లోనే దాచుకొంది దుర్గాదేవి.
భాస్కర్ రంజనీతో కార్లో బయటికి డిన్నర్‌కు వెళ్ళాడు..
దుర్గాదేవి గారికి ఒక సోదరి. పేరు ఛాయాదేవి. దుర్గాదేవి వయస్సు అరవై ఏనిమిది. ఛాయాదేవి వయస్సు అరవై ఐదు. ఇరువురి పతిదేవులు.. భార్యల నలభై సంవత్సరాల ప్రాయంనుండి పదిహేను సంవత్సరాలు.. వారి ఆగాడాలు భరించి.. భరించి.. ఇక ఈ జీవితం చాలని చుక్కలూరికి చేరారు. తొలి ప్రయాణం దుర్గాదేవి భర్తగారిదే. అక్కాచెల్లెలు, ఆకాలపు బి. ఎ. ఇంగ్లీషు బాగా మాట్లాడుతారు. విచక్షణా జ్ఞానం తక్కువ. అహంకారం అధికం. బాగా వున్న బలంతో..
ఛాయాదేవి ఆటోలో వచ్చి దిగి.. హడావిడిగా ఇంటివైపు నడుస్తూ..
‘‘అక్కా!.. అక్కా!.. ’’ అరిచింది. ఆమె తోటే ఇరవై సంవత్సరాల యువతి. ఊయల బెంచీమీద ఊగుతున్న దుర్గాదేవి చెల్లెలి పిలుపు విని ఊయల దిగి సింహద్వారాన్ని దాటి వరండాలోకి ప్రవేశించింది. ఛాయాదేవి ఆ అమ్మాయి వరండాలో ప్రవేశించారు. దుర్గాదేవి ఆ అమ్మాయిని పైకి క్రిందికి పరీక్షగా చూచింది.
‘‘నమస్కారం అమ్మా!.. ’’ చేతులు జోడించింది ఆ అమ్మాయి.
‘‘దుర్గా!.. ’’
‘‘చెప్పు.. ’’
‘‘ఈ పిల్లపేరు జాబిలి.. నీ సమస్యని తీర్చేటందుకుగా తీసుకొని వచ్చాను. అవునూ రంజనీలో ఏదైనా మార్పా!.. ’’ అడిగింది ఛాయాదేవి.
‘‘ఏమీలేదు. ఈరోజు ఉమెన్స్ డే కదూ.. మన ప్రబుద్ధుడు వజ్రాల నక్లెస్ బహూకరించాడు’’ వ్యంగ్యంగా చెప్పింది దుర్గాదేవి.
‘‘అక్కా!.. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ డాక్టర్ విద్యావతి గైనకాలజిస్ట్‌ను కలిసి మాట్లాడి వస్తున్నాను. విద్యావతి మన అమ్మాయిని కౌన్సిలింగ్ చేయాలని అంది. ఆమె మన భాస్కర్, రంజనీలతో మాట్లాడాలంటోంది ఇంట్లో వున్నారా!’’
దుర్గాదేవి కోడలు రంజని వేరొకరి బిడ్డ అయివుంటే, తన అన్న కూతురు కాకుండా.. కొడుకు భాస్కర్ చేత రంజనీకి విడాకులు ఎప్పుడో ఇప్పించి.. అతనికి మరో పెళ్ళి చేసివుండేది. మేనకోడలైన కారణంగా.. తనలోని మనవడు, మనవరాలుపై వున్న కోర్కెను మనస్సులోనే దాచుకొని సహనంతో వున్నది. తన మనోవేదనను చెల్లెలు ఛాయాదేవికి వారం రోజుల క్రిందట ఫోన్‌లో చెప్పగా, అక్క సమస్యను పరిష్కరించే దానికి వచ్చింది ఛాయాదేవి.
***
‘‘బావా!.. ’’
‘‘చెప్పు రంజనీ!.. ’’
స్టార్ హోటల్‌లో భోజనం చేస్తున్నారు భాస్కర్, రంజనీ.
‘‘అత్తయ్యగారు నాతో సరిగా మాట్లాడ్డం లేదు. పూజలు, పునస్కారాలు.. గుళ్ళూ గోపురాలు ఎన్నిచేసి ఎంతగా తిరిగినా.. మనకు సంతానం కలుగలేదు. ఆ కారణంగా అత్తయ్య నన్ను నిర్లక్ష్యంగా చూస్తూవుంది. నాకూ చాలా కష్టంగా బాధగా ఉంది. నేనొక మాట చెబుతాను. వింటారా!’’
‘‘చెప్పు!.. ’’
‘‘మీరు మరో వివాహం చేసికొండి. నా ఆశ, మీ అమ్మగారి ఆశ, మీ ఆశను తీర్చుకోండి. నేను నా సమ్మతిని మీ రెండవ వివాహానికి వ్రాసిస్తాను’’ మెల్లగా చెప్పింది రంజనీ విచారంగా.
భాస్కర్ ఆశ్చర్యపోయాడు.
‘‘అది ఈ జన్మలో జరుగని పని. రంజనీ! నీవు నా గురించి ఏమనుకొంటున్నావు?.. నాకు సంతతి ముఖ్యం కాదు. నీవు నాకు ముఖ్యం.. నీ ఆనందం తరువాతనే నాకు ఏదైనా ఈ ప్రపంచంలో. నాకు నీవు కావాలి.. పిల్లలు లేరని నాకు బాధలేదు’’ అనునయంగా చెప్పాడు భాస్కర్.
‘‘మరి మీ అమ్మగారి ఆవేదన తీరేదెలా!.. నాకు మనశ్శాంతి కలిగేదెలా!’’ దీనంగా అడిగింది రంజనీ.
వెంటనే భాస్కరం జవాబు చెప్పలేదు. కొన్ని క్షణాలు వారిమధ్యన మౌనంగా జరిగిపోయాయి.
‘‘ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుంది రంజనీ. కాలం కలిసి రావాలి. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. మనలో సహనం అవసరం. ప్రశాంతంగా భోజనం చేయి’’ చిరునవ్వుతో చెప్పాడు భాస్కర్.
భాస్కర్, రంజనీలు వారి బాల్యం నుండి ప్రేమికులు. వరుస వున్నవారు. ఒకరిమీద ఒకరికి ఎంతో ప్రేమ.. అభిమానం.. గౌరవం.. భోజనానంతరం ఇరువురూ బీచ్‌కి వెళ్ళారు. ఓ గంటసేపు ఏవేవో వారి చిన్ననాటి కబుర్లు చెప్పి రంజనీకి ఆనందం కలిగించే దానికి ప్రయత్నించాడు భాస్కర్. ఇరువురూ రాత్రి పదిన్నరకు ఇంటికి చేరారు.
మార్బుల్ గ్రానెట్ వ్యాపారం వారిది. జపాన్‌కు ఎక్స్‌పోర్ట్. భాస్కర్, రంజనీలు ఇరువురూ ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. భాస్కర్ సివిల్ ఇంజనీర్. రంజనీ ఎం. కామ్.
వీరు ఇంటికి చేరేసరికి అక్కాచెల్లెళ్ళు జాబిలిని గెస్ట్‌రూమ్‌లోకి పంపి.. భోజనం చేసి దుర్గాదేవి రూంలో శయనించారు.
కారు శబ్దం విని.. ఛాయాదేవి..
‘‘అక్కా!.. భాస్కర్ రంజనీ వచ్చినట్లున్నారు. పిలిచి మాట్లాడుతావా!.. ’’ అడిగింది ఛాయాదేవి.
‘‘పొద్దుపోయింది. రేపు వుదయం మాట్లాడదాం’’ అంది దుర్గాదేవి.
ఇరువురూ నిద్రకు ఉపక్రమించారు.
***
గెస్ట్‌రూంలో పడుకున్న జాబిలికి నిద్రపట్టడం లేదు. తన కుటుంబ సమస్యలు.. తన గతచరిత్ర మస్తిష్కంలో సినీ ఫిలిమ్ రీల్స్‌లా తిరుగుతున్నాయి.
జాబిలి తండ్రి గోవిందు. లారీ డ్రైవర్. ఉత్తరదేశం నుండి దక్షిణదేశానికి సరుకులను, యంత్రాలను తరలించేవాడు. లారీని రాత్రి, పగలు నడిపేవాడు. సహాయకంగా ఒక పదహారేళ్ళ చిన్న అబ్బాయి క్లీనర్. జాబిలి తల్లిపేరు నిర్మల. ఒక అక్క శాంతి.
శాంతి ప్లస్ టు వరకూ చదివింది. జాబిలి తొమ్మిది చదువుతుండగా శాంతికి అయినవాళ్ళలోని సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి పోలీస్. పేరు వీర్రాజు.
వివాహ ముహూర్తం పెట్టుకొన్నారు..
వీరి ఇంటి ఎదురుఇంట్లో రంగా, రాఘవ కాలేజీ స్టూడెంట్స్ వుండేవారు. రంగా కలవారి అబ్బాయి. రాఘవ అదేవూరివాడు. రంగాకు బాల్యం నుంచి స్నేహితుడు.
వారి వూర్లో వారి ఇంటి పక్క పోర్షన్‌ల్లో బాడుగకు వుంటున్న టీచర్ శంకరమ్మ రంగాకు చదువు నేర్పుతూ ఆ కళను కూడా నేర్పింది. అప్పుడు అతని వయస్సు పది సంవత్సరాలు.
ఇరవై సంవత్సరాల ప్రాయంలో కాలేజీ చదువుతున్న రంగా కళ్ళకు ఎదురింటి జాబిలి బాగా నచ్చింది.. మాటలు కలిపాడు. స్నేహం చేశాడు.
పెండ్లి ఖర్చులుకుగా ముఫ్పైవేలు తన యజమాని దగ్గరనుండి అప్పుగా తీసికొని వచ్చాడు జాబిలి తండ్రి గోవిందు.
పరిచయం వున్న కారణంగా జాబిలి తన అక్క పెండ్లికి రంగాను, రాఘవను ఆహ్వానించింది.
వివాహం.. వారంరోజుల తరువాత సోమవారంనాడు..
జాబిలి ఇంట్లో దొంగలు పడ్డారు. చెక్కపెట్టెలో దాచిపెట్టివున్న ముఫ్పైవేలు దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు.
మరుదినం.. పెట్టెతెరిచి చూస్తే డబ్బు మాయం..
భోరున ఏడుస్తూ నేలకు ఒరిగారు గోవిందు అతని భార్య నిర్మల, అక్క శాంతి.
జాబిలి కళ్ళల్లో కన్నీరు.. డబ్బు.. డబ్బూ.. అక్క పెండ్లి జరగాలంటే డబ్బుకావాలి!?
రెండురోజుల క్రింద రంగా అన్నమాటలు జాబిలికి గుర్తుకు వచ్చాయి. ‘నీవు సరే అంటే నీకు ఏం కావాలన్నా ఇస్తాను జాబిలీ!’
వెంటనే లేచింది.. వీధిలో నుండి ఎదురు ఇంటివైపు చూచింది.
అప్పుడే బయటనుంచి వచ్చిన రంగా ఇంటి తాళం తీసి లోన ప్రవేశించి తలుపు మూశాడు.
జాబిలి వేగంగా వెళ్ళి తలుపును తోసింది. అది తెరుచుకొంది. రంగా గడియ బిగించలేదు.
బాజిలి గదిలోకి ప్రవేశించి తలుపు మూసింది.
గంట తరువాత తలుపు తెరువబడింది. జాబిలి తన ఇంటికి వెళ్ళింది.
ఆ మధ్యాహ్నం రంగా, జాబిలి ఇంటికి వెళ్ళి గోవిందును కలిశాడు.
‘‘జాబిలి విషయాన్ని చెప్పింది. ఇదిగో డబ్బు ముఫ్పైవేలు’’ అని రంగా గోవిందు చేతిలో ఉంచాడు.
వారి ఇంటినుండి బయటికి నడిచాడు. నిర్ణయించిన లగ్నానికి శాంతి వివాహం జరిగింది. జాబిలి వివాహానికి వచ్చినవారిలో రంగా కోసం వెదికింది. ఆమెకు.. రంగా కనుపించలేదు. జాబిలి కళ్ళల్లో కన్నీరు. మనసు నిండా అతని తలపులు..
శాంతి అత్తవారి ఇంటికి వెళ్ళిపోయింది. వీర్రాజుకు ప్రమోషన్‌తో విజయనగరానికి మార్చారు. జాబిలి రోజూ ఎదురింటి తలుపును ఉదయాన.. సాయంత్రం ఆత్రంగా చూచేది. రంగా వచ్చాడేమోనని. రంగా అంతులేదు.
ఆ రోజు.. గదినుండి జాబిలి బయటికి వచ్చేముందు.. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని.. ‘మనం త్వరలోనే పెళ్ళి చేసుకొందాం’ అన్నాడు రంగా.
గోవిందు లోడ్ లారీతో రాత్రిపూట ప్రయాణం చేస్తున్నాడు. ఘాట్‌రోడ్ హేర్‍పిన్ టర్నింగ్‌లో బ్రేక్ ఫెయిల్ కారణంగా లారీ లోయలో పడిపోయింది. గోవింద్ మరణించాడు. క్లీనర్ దూకి తప్పించుకొన్నాడు.
ప్రక్క ఇంట్లో రేడియోలో ప్రాంతీయ వార్తలు.. ప్రసారం.. ’సాలూరు దామంజోడి మధ్యన వున్న ఘాట్ రోడ్‍లో లారీ లోయలో పడి డ్రైవర్ గోవిందు మరణం. క్లీనర్ పండు క్షేమం.. ’
’విశాఖ నగరంలో కాలేజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రంగా విపరీతంగా త్రాగి బులెట్‍ను నడిపిన కారణంగా అది ఎదురుగుండా వస్తున్న ఆర్. టి. సి బస్సుకు మోది స్టూడెంట్ స్పాట్ డెడ్. పేరు రంగా.. ’
రెండు వార్తలను విన్న జాబిలీ, ఆమె తల్లి శాంతి భోరున ఏడ్చారు. నేల కూలారు.
రెండవరోజు గోవిందు శవం వారి ఇంటికి చేరింది. ఆ సాయంత్రం.. గోవిందు భూమాత వడిలో శాశ్వత నిద్రలో మునిగిపోయాడు.
జాబిలి మనసున.. రంగా జ్ఞాపకాలు.. కళ్ళల్లో కన్నీరు.. రెండు నెలలు గడిచాయి. జాబిలి నెల తప్పింది. లేడీ డాక్టర్‍ను కలిసింది. డాక్టర్ ఆమె సమస్యను తీర్చింది. జాబిలి వివరాలు తెలిసికొని ఉపాధికిగాను జాబిలికి ఒక మార్గాన్ని వివరించింది.
"జాబిలీ!.. ప్రస్తుత కాలంలో సైన్స్ చాలా అడ్వాన్స్ గా వుంది. అలాగే స్త్రీలకు, పురుషులకు సమస్యలు బలంగానే వున్నాయి. ముఖ్యంగా సంతానం, వివాహం అయిన రెండు సంవత్సరాల లోపల స్త్రీకి తొలి గర్భం.. ప్రసవం జరుగకపోతే వారిలో ఎవరికో లోపం వారి ముందు సమస్యగా నిలిస్తుంది. నీవు నీ అండదానంతో ఒక స్త్రీ సమస్య రూపుమాపవచ్చు. రెండవ విధానం.. పురుషుని వీర్యకణాలను నీలో ఇముడ్చుకొని గర్భంధరించి.. నవమాసాలు మోసి బిడ్డను కని ఆ దంపతులకు ఇచ్చి - వారినుండి నీవు కోరిన ధనాన్ని పొందవచ్చు. నీవు నీ తల్లితో హాయిగా వుండవచ్చు.
నిన్నుమెచ్చిన.. నీవు కోరిన వారిని వివాహం చేసికోవచ్చు. నీకు ఎంతో జీవితం ముందు ఉంది. దేనికీ భయపడకు. బాధపడకు.. పరోపకారం మిధం శరీరం.. " నవ్వుతూ చెప్పింది డాక్టర్ ప్రియదర్శిని.
లైట్లు ఆరిపోయాయి. జాబిలి వులిక్కిపడింది. గతం చెదిరిపోయింది. వాస్తవంలోకి వచ్చింది. లైట్లు వెలిగాయి. కళ్ళను గట్టిగా మూసుకొని నిద్రకు వుపక్రమించింది జాబిలి.
***
మరుదినం ఉదయం దుర్గా, ఛాయాదేవిలు భాస్కర్‍తో చర్చించారు. జాబిలిని తనతో తీసికొని వచ్చిన కారణాన్ని ఛాయాదేవి భాస్కర్, రంజనీలకు వివరించింది.
కొంతసేపు భాస్కర్, రంజనీలు ఏకాంతంగా మాట్లాడుకొన్నారు. ఐదుగురూ కలసి డాక్టర్ విద్యావతి హాస్పిటల్‍కు వెళ్ళారు.. ఛాయాదేవి, దుర్గాదేవి, భాస్కర్, రంజనీలతో చర్చలు ముగించి వారిని బయటికి పంపి జాబిలిని లోనికి పిలిచింది డాక్టర్ విద్యావతి.
"నమస్కారం మేడం!.. "
"నీ పేరు జాబిలి కదూ!.. "
"అవును మేడం!.. "
"నీవు కృత్రిమ గర్భాన్ని ధరించి శిశువును నవమాసాలు మోసుకొని వారికి ఇవ్వాలి. ఆ తరువాత వెళ్ళిపోవాలి. నీవు చేయబోయే ఈ కార్యం చాలా గొప్పది. నీవు ఒకరికి మంచి చేస్తున్నావు కనుక ఆ దేవుడు నీకు తప్పక మేలు చేస్తారు. మేము చేయబోయే ఐ. ఐ. ఎన్ (Intruterine insemination) ప్రయోగానికి నీవు సిద్ధమేనా!.. " అనునయంగా అడిగింది డాక్టర్ విద్యావతి.
"మేడం!.. "
"చెప్పండి.. "
"మీకు డాక్టర్ ప్రియదర్శిని మేడం తెలుసా!.. "
"ప్రియదర్శినీ!.. ఆమె నా సొంత చెల్లెలు!.. " చిరునవ్వుతో చెప్పింది విద్యావతి.
"వారితో నేను ఒకసారి మాట్లాడాలి మేడం!.. " దీనంగా అడిగింది జాబిలి.
విద్యావతి ప్రియదర్శినికి ఫోన్ చేసింది.
"అక్కా!.. ఎలా వున్నావ్?.. బావగారు పిల్లలూ కులాసేగా!.. "
"ఆ.. ఆ.. అంతా కుశలమే!.. నీకు జాబిలి తెలుసుగా!.. "
"ఆ.. తెలుసు చాలా మంచి అమ్మాయి.. "
"ఆమె ఇప్పుడు నా దగ్గరవుంది. ఒక ముఖ్యమైన.. ఐమీన్.. ఐ. ఐ. ఎన్ విషయంగా వచ్చింది. ఆమెకు తీసుకొని వచ్చినవారు మన పాత క్లయింట్స్. ఆ అమ్మాయి నీతో మాట్లాడాలంటోంది మాట్లాడు" చిరునవ్వుతో విద్యావతి సెల్‍ను జాబిలికి అందించింది.
"మేడమ్!.. నమస్కారం.. " మెల్లగా చెప్పింది జాబిలి.
"ఆఁ జాబిలీ.. నీవు ప్రిపేర్ అయిపోయావా!.. "
"అవును మేడం.. మీరు ముందే నాకు వివరాలు చెప్పారుగా.. మేడమ్. మీరు చేస్తే బాగుంటుందని నా ఆశ. మీరు ఇక్కడికి రాగలరా లేక నన్ను అక్కడికి పిలిపించుకొంటారా!.. మేడం.. ప్లీజ్!" దీనంగా పలికింది జాబిలి.
"విద్యావతి నా అక్క. నాకన్నా సీనియర్. నీకోసం.. నేను తెనాలి నుండి గుంటూరు వస్తాను. సరేనా!.. ఫోన్ మా అక్కకివ్వు.. " చెప్పింది డాక్టర్ ప్రియదర్శిని.
జాబిలి ఫోన్ ను డాక్టర్ విద్యావతికి అందించింది.
కొన్ని క్షణాలు వారిరువురు ఇంగ్లీషులో మాట్లాడుకొన్నారు.
మూడవరోజు ఉదయం పదిగంటలకు కాత్యాయనీ తెనాలి నుండి గుంటూరుకు విద్యావతి హాస్పిటల్‍కు వచ్చింది. దుర్గాదేవి, ఛాయాదేవి, భాస్కర్, రంజనీలను సమావేశపరిచి జాబిలికి ఐదులక్షలు ఇవ్వవలసిందిగా, జాబిలి కధను తెలిసివున్న డాక్టర్ కాత్యాయని నిర్ణయించింది.
భాస్కర్ ఐదులక్షలు చెక్కును డాక్టర్ కాత్యాయనికి జాబిలిపేర అందించాడు.
ఆ తర్వాత.. జరుగవలసిన క్రియను ఇరువురు డాక్టర్స్ కలసి నిర్వర్తించారు.
జాబిలి.. వారిని ఒక కోరిక కోరింది.
"నేను డాక్టర్ కాత్యాయని గారి హాస్పిటల్‍లో వుంటూ నర్స్ గా పనిచేసికొంటాను. బిడ్డను కని మాట ప్రకారం మీకు ఇస్తాను. ఆ తరువాత.. మీరు కోరినట్లు నేను ఏనాడూ నా జీవితాంతం.. మీ వూరికి, ఇంటికి రాను" దీనంగా చెప్పింది జాబిలి. డాక్టర్ విద్యావతి మాటల ప్రకారం దుర్గాదేవి, ఛాయాదేవి, భాస్కర్, రంజనీ, డాక్టర్ కాత్యాయనితో పంపేదానికి అంగీకరించారు.
కాత్యాయనీ జాబిలిని వారి ఇంటి ముందు దించింది.
జరిగిన అన్నీ విషయాలు జాబిలి తల్లికి తెలియజేసింది. తల్లితో కలసి కాత్యాయనీ హాస్పిటల్‍కు వెళ్లారు.
డాక్టర్ కాత్యాయని ఆ తల్లీ కూతుళ్ళకు హాస్పిటల్లో నర్స్ పనిని కల్పించింది. వారు ఉండేదానికి ఒక గదిని ఏర్పాటు చేసింది. కాలగతిలో రోజులు.. వారాలు.. నెలలూ జరిగిపోతున్నాయి. దుర్గాదేవి కొడుకు భాస్కర్‍తో రెండు నెలల తర్వాత వచ్చింది. ఏకాంతంలో దుర్గాదేవి.. డాక్టర్ కాత్యాయనీని ఒక ప్రశ్న వేసింది.
"డాక్టర్! యధార్థం చెప్పండి. లోపం నా కోడలిలోనా! కొడుకులోనా!"
దుర్గాదేవి ప్రశ్నకు కాత్యాయని ఆశ్చర్యపోయింది.
వైద్యరీత్యా జరిగిన ఫలితం మీ కళ్ళముందు వుంది. మరో ఏడునెలలలో జాబిలి ప్రసవిస్తుంది. మీరు నానమ్మ అవుతారు. ఈ తరుణంలో మీలాంటివారు అడగకూడని ప్రశ్నను అడిగారు. లోపం నీ కొడుకు, కోడలిది కాదు. వారి విషయంలో ఆ దేవుడిది. జన్మసుకృతం అంతే. అనవసరపు ఆలోచనలతో బుర్రను పాడుచేసికోకండి" అనునయంగా చెప్పింది డాక్టర్ కాత్యాయని.
దుర్గాదేవి, గోపాల్ జాబిలిని చూచారు. వెళ్ళిపోయారు. అప్పటికి దుర్గకు నవమాసాలు.
రాఘవ ఆ హాస్పిటల్‍కు అనారోగ్య కారణంగా వచ్చి అడ్మిట్ అయినాడు. డాక్టర్ కాత్యాయనీ అతనికి ట్రీట్‍మెంట్ ఇచ్చింది. రాఘవ నర్స్ వేషంలో వుండి తన బెడ్‍ను సమీపించిన జాబిలిని చూచాడు.
నాలుగు రోజుల తర్వాత రాఘవ డిశ్చార్జి అయినాడు. బయటికి వెళ్ళేముందు డాక్టర్ కాత్యాయనిని కలసి ఆమెను గురించి అడిగాడు. కాత్యాయనికి రాఘవ మాటల్లో, అతనికి ఆమె పట్ల ప్రేమ, అభిమానాలు కలిగియున్నట్లు గమనించింది. జాబిలి కథను వినిపించింది.
"రాఘవా!.. జాబిలి డెలివరీ కాగానే ఆ బిడ్డను దుర్గాదేవి వారికి అప్పగించాలి. జన్మలో జాబిలి ఆ బిడ్డను చూడరాదు. వారు జాబిలికి ఐదు లక్షలు బిడ్డను మోసి కని ఇచ్చేదానికి ఇచ్చారు. నేను భారతి పేర అకౌంట్ ఓపెన్ చేసి ఆ చెక్‍ను ఇండియన్ బ్యాంకులో డిపాజిట్ చేశాను. నీకు యదార్థంగా జాబిలి పట్ల ప్రేమ, దయ, సానుభూతి వుంటే.. మీ ఇరువురికీ నేను పెండ్లి జరిపిస్తాను.
బొంబాయిలో మా అన్నయ్య కుటుంబం వుంది. వారికి కాటన్ ఫ్యాక్టరీ వుంది. నీకు అక్కడ వుద్యోగం ఇప్పిస్తాను. నీవు జాబిలి వారి అమ్మతో బొంబాయ్ వెళ్ళిపోండి. అక్కడ మీ జీవితం బాగుంటుంది" అనునయంగా చెప్పింది డాక్టర్ కాత్యాయని.
రాఘవ.. "సరే మేడం!.. " సంతోషంగా చెప్పాడు.
రాఘవతో తాను మాట్లాడిన విషయాన్ని డాక్టర్ కాత్యాయని జాబిలికి ఆమె తల్లికి చెప్పింది.
జాబిలి ప్రసవించింది. మొగబిడ్డ. డాక్టర్ కాత్యాయని.. బిడ్డను జాబిలికి చూపలేదు. పేగుబంధంతో ఏర్పడు మమకారం ఏర్పడకూడదని.. జాబిలి మౌనంగా కన్నీరు కార్చింది.
దుర్గాదేవి, ఛాయాదేవి, భాస్కర్, రంజనీలు వచ్చారు. బిడ్డను చూచుకొన్నారు. వారంరోజుల తర్వాత బిడ్డను వారికి ఇచ్చి పంపింది డాక్టర్ కాత్యాయని.
రెండు వారాల తర్వాత రాఘవ.. జాబిలి వివాహాన్ని జరిపించింది. బాంబేలోని తన అన్న శ్యామ్‍సుందర్‍తో మాట్లాడి.. జాబిలిని ఆమె తల్లి నిర్మల, రాఘవలను తెనలి టూ హైదరాబాద్ బస్.. హైదరాబాద్ టు బాంబేకు ట్రయిన్ టిక్కెట్లను ఏర్పాటు చేసి, వారిని ఆశీర్వదించి సాగనంపింది డాక్టర్ కాత్యాయని. కాత్యాయనీ మూలంగా చుట్టూవున్న చీకట్లను చీల్చుకొని పున్నమి రేయిలో పండువెన్నెల్లో బాంబేకి భర్త తల్లితో ఆనందంగా సాగిపోయింది జాబిలమ్మ.
సమాప్తి
* * *
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
Comments