top of page

జై జై దెయ్యం



'Jai Jai Dayyam' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 06/03/2024

'జై జై దెయ్యం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


తల్లిదండ్రులు ఆక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత.. ఎవరూ లేని తనని చూసి జాలిపడి, చుట్టుపక్కల వారు అనాధ ఆశ్రమం లో జాయిన్ చేసారు. అక్కడే ఉంటూ, తన మంచితనంతో అందరితో కలిసిపోయి.. అందరికి అవసరమైన సాయం చేస్తూ.. అందరినీ ఆనందంగా ఉంచుతూ.. తాను ఆనందంగా ఉండేవాడు రాజు. మంచితనం తో పాటు ధైర్యం చాలా ఎక్కువ రాజుకి.. 


ఒకరోజు ఒక జంట అక్కడకు వచ్చి.. తమకి పిల్లలు లేరని, ఒక తెలివైన అబ్బాయిని పెంచుకుంటామని అడిగారు. అక్కడ ఉన్న వారిలో రాజు అంత తెలివైనవాడు ఎవరూ లేరని, రాజుని ఎంచుకుని.. ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు ప్రసాద్ ఉమా దంపతులు. 


ప్రసాద్ ఎప్పుడూ ఆఫీస్ వర్క్ లో బిజీ గా ఉండే వ్యక్తీ. భార్య ఉమ ఇంటి పని చేసే మనిషి కాదు. ప్రతీదానికి పనివారి మీద ఆధారపడుతుంది. పని విషయం లో ఎప్పుడూ పనివాళ్ళతో గొడవ పడేది. తక్కువ డబ్బులు ఇచ్చి.. ఎక్కువ పని చేయించుకునేది ఉమ. అప్పటినుంచీ ఆమె ఇంట్లో పని చెయ్యడానికి ఎవరూ రావడానికి ఇష్టం చూపలేదు. అందుకే, ఉమ వేసిన ఐడియా ప్రకారం.. రాజుని ఇంటికి తీసుకుని వచ్చారు. పాపం అందరూ రాజుని బాగా చదివిస్తారని.. మంచి భవిష్యత్తు ఇస్తారని ఆశపడి వారితో పంపడానికి చాలా ఆనందపడ్డారు. 


రాజు తోనే ఇంట్లో పనులు చేయించుకునేది ఉమ. పోనీ, తిండి సరిగ్గా పెడుతుందా అంటే, మిగిలిపోయిన అన్నం, చపాతీలు పెట్టేది. స్వతహాగా మంచి మనిషి అయిన రాజు.. ఇదంతా ఈజీ గా తీసుకునేవాడు. పోనీ, చదివిస్తున్నారా అంటే.. అదీ లేదు. అక్కడ అనాధ ఆశ్రమం లో చెప్పే చదువు కుడా ఇక్కడ చెప్పించట్లేదు పాపం.. !. 


ఇంట్లో పొయ్యిలోకి కట్టెలు కోసం.. రాజుని అడవి లోకి వెళ్లి తీసుకుని రమ్మనేవారు. ఏ పని చెప్పినా.. కాదనకా.. అంతా మంచికే అనుకుని చేసేవాడు రాజు. అందుకే, చెప్పిన వెంటనే, అడవికి బయల్దేరాడు. ఒకరోజు, అలా కట్టెల కోసం అడివికి వెళ్ళిన రాజుకి.. కట్టెలు కొట్టిన తర్వాత.. నిద్ర ముంచుకొచ్చింది. ముందు రోజు అర్ధరాత్రి వరకూ ఇంట్లో పనులు చెయ్యడం చేత.. నిద్ర లేక, అక్కడే ఉన్న ఒక చెట్టు మీదకు ఎక్కి పడుకున్నాడు. 


చాలా సేపు తర్వాత, అలికిడికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి.. ఒక దెయ్యం లాంటి ఆకారం కనిపించింది. రాజు భయపడకుండా.. అలాగే ధైర్యంగా ఉన్నాడు. అప్పుడు ఆ దెయ్యం భయంకరమైన స్వరం తో.. 


"నాకు ఆకలి వేస్తోంది.. ఏమైనా ఉంటే, పెట్టవా.. ?" అని అడిగింది.


ఏ మాత్రం భయపడకుండా.. సాయం చేసే గుణం ఉన్న రాజు.. 'ఇదిగో తీసుకో.. ' అని ఇంటి నుంచి తన కోసం తెచ్చుకున్న చపాతీలు ఇచ్చాడు. 


దెయ్యం ఆ చపాతీలు తినేలోపే, ఆలస్యం అయ్యిందని.. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాజు. మళ్ళీ, కొన్ని రోజుల తర్వాత రాజు వచ్చి.. అదే చెట్టు మీద పడుకున్నాడు. చల్లగా ఉండడం, చక్కటి గాలి తో ఉన్న ఆ ప్రదేశం రాజుకి చాలా బాగా నచ్చింది. ఈ సారి ఆ దెయ్యం మళ్ళీ వస్తుందేమోనని చూసాడు. కానీ అది రాలేదు. గట్టిగా దెయ్యాన్ని పిలిచాడు.. 


వెంటనే.. చెట్టు కింద నుంచి ఒక స్వరం వినిపించింది. ఎక్కడ నుంచి వస్తోందో రాజుకి అర్ధం కాలేదు. దెయ్యం వచ్చిందేమోనని కిందకు వెళ్లి చూసాడు. ఆ స్వరం ఆ చెట్టు తొర్ర లోంచి వస్తుందని గ్రహించి.. అందులోకి చూసాడు.. 


"ఎవరు నువ్వు.. ?" అని అడిగాడు రాజు.


"నేను ఈ చెట్టుని మాట్లాడుతున్నాను. నిన్న నువ్వు చేసిన సాయానికి ఆ దెయ్యం మెచ్చి ఈ చెట్టు కింద బోల్డంత నిధి ఉందని చెప్పి.. నిన్ను తీసుకోమని నాకు చెప్పింది. ఈ చెట్టు కింద తవ్వితే నీకు ఆ నిధి దొరుకుతుంది.. తీసుకో.. " అంది ఆ చెట్టు.


"నిధి కోసం చెట్టుని తవ్వి.. నిన్ను ఇబ్బంది పెట్టలేను. నాకే కాదు, చాలా మందికి నువ్వు చల్లటి నీడని ఇస్తున్నావు.. నాకు నిధి అవసరం లేదు.. " అని చెప్పి వెళ్ళబోయాడు రాజు.. 


"నువ్వు చాలా ధైర్యవంతుడవే కాదు.. చాలా మంచివాడివి కుడా. ఈ చెట్టు తొర్ర లోనే ఆ దెయ్యం ఉండేది. ఇప్పుడు అది వేరే చోటుకి వెళ్లిపోయింది. వెళ్ళే ముందు.. నీకు ఒక పరిక్ష పెట్టి.. ఇమ్మని ఒక ఉంగరం ఆ తొర్ర లో ఉంచింది. 


నేను పెట్టిన పరిక్ష లో నువ్వు గెలిచావు. వెళ్లి దానిని తీసుకో. ఆ ఉంగరం పెట్టుకుని.. 'జై జై దెయ్యం' అని తలచుకుని.. నువ్వు ఏది అనుకుంటే, అది జరుగుతుంది. నీ లాంటి మంచివారి దగ్గర ఆ ఉంగరం ఉంటే, చాలా మందికి మంచి చేస్తావు.. " అని చెప్పింది ఆ చెట్టు. 


ఆ రోజు నుంచి.. ఆ ఉంగరం సాయంతో, రాజు.. అందరి అవసరాలు తీరుస్తూ.. ప్రసాద్ ఉమా మనస్తత్వాన్ని కూడా మార్చేశాడు. అప్పటినుంచీ వాళ్ళు రాజుని సొంత కొడుకు లాగ చూసుకుంటూ.. గొప్పగా చదివించి, ఏ లోటు లేకుండా చూసుకున్నారు. కాలచక్రంలో ఆ ఉంగరం దాని మహిమ కోల్పోయి.. రాజు చేతికి ఒక అలంకారంగా ఉండిపోయింది. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా.. నలుగురికి మంచి చెయ్యడం అనేది రాజు ఎప్పుడూ మానలేదు.. 


***********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ



Comments


bottom of page