top of page

జన్మభూమిని మరువ వద్దు

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #జన్మభూమినిమరువవద్దు, #JanmabhuminiMaruvaVaddu

 జన్మభూమిని మరువ వద్దు (చిన్ననాటి జ్ఞాపకాలు)

Janmabhumini Maruva Vaddu - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 12/01/2025

జన్మభూమిని మరువ వద్దు - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


రాజ్యానికి మహరాజైనా అమ్మకి కొడుకే అన్నట్టు ఏ హోదా పదవిలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మనిషి పుట్టి పెరిగిన ఊరును, కుటుంబ మూలాలను, అమ్మభాషను మరువ కూడదు. అవకాశం ఉన్నంత వరకు జన్మభూమి అభివృద్ధికి కృషి చెయ్యాలి. 


 మా ఊరి పేరు చోడవరం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేది. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉంది. రాష్ట్ర శాసనసభ నియోజక వర్గంగా పిలవబడుతోంది. 


ఆ రోజుల్లో మా ఊరు మేజర్ పంచాయతీగా ఉండేది. ఊరి పొలిమేరల్లో నర్సయ్య పేట, రమణయ్య పేట, గాంధీనగర్, పకీర్ సాహెబ్ పేట, గవరవరం, లక్ష్మీ దేవిపేట లాంటి పేటలు ఊరి జనాల బట్టలు ఉతికే చాకళ్లు, మంగలి కుమ్మరి వంటి చేతి వృత్తుల వారు నివాసం ఉండేవారు. జనాభా ఎక్కువే. తాలూకా కేంద్రమైనందున వ్యాపార కేంద్రంగా ఉండేది. చుట్టు పక్కల పల్లెలు ఏజెన్సీ ప్రాంతం నుంచి నిత్యావసర పాలు కాయకూరలు ఫలాలు వచ్చేవి. వారానికి ఒకరోజు సంత జరిగేది. 


ఊరిలో పూర్ణా థియేటర్ సినేమా హాలు ఉండి కొత్త పాత సినేమాలు ప్రదర్సింప బడేవి. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ టికెట్లతో లోకల్ వ్యాపార ప్రకటనలు, న్యూస్ రీలు నడిచేవి. సినేమా హాలులో కొత్త సినేమా వచ్చిందంటె సైకిలు రిక్షా, గుర్రం బండికి వాల్ పోస్టర్లు కట్టి మైకులతో మాటలు, పాటలతో పాటు రంగుల కరపత్రాలతో వీధులంట ప్రచారం చేసేవారు.


పాత చెరువు, తామర చెరువు లాంటి నీటి వనరులు ఉండి చేపల పెంపకం జరిగి పంచాయతీకి ఆదాయం సమకూరేది. కొత్త ఊరు, పాత ఊరు, పాత బస్టాండు, మైన్ రోడ్ లాంటి

ప్రదేశాలతో వర్తకుల లావాదేవీలతో సందడిగా కనబడేవి. అప్పట్లో శ్రీ రామకృష్ణ, శ్రీ సత్యనారాయణ, శ్రీ రామదాసు ట్రాన్స్ పోర్టు ప్రైవేట్ బస్ సర్వీసులే నడిచేవి. మా పెద్దలు చెప్పుకుంటె వినేవాడిని, ఏమంటే బస్సులు బొగ్గు, కర్రలతో రేడియేటర్లో నీళ్లు వేడిచేసి నీటి ఆవిరితో నడిపేవారట. 


నాకు బాగా చిన్నప్పటి వయసులో ఊళ్లో విధ్యుత్ ఉండేది కాదు. కిరోసిన్ లాంతర్లు, కోడిగుడ్డు దీపాలు అందుబాటులో ఉండేవి. రాత్రిళ్లు ఇళ్లలో వెలుగు కోసం నూనె దీపాలు వాడేవారు. ఎవరెడీ, ఎస్ట్రెలా, జీప్, కంపెనీల టార్చి లైట్లు స్టీలు, అల్యూమినియం లోహాలవి అమ్మకం జరిగేవి. లెడ్, లీక్ ప్రూఫ్ సెల్సుతో అవి కాంతిని ఇచ్చేవి. లెడ్ బేటరీ సెల్స్ తొందరగా యాసిడ్ లీకై టార్చి లైటు పాడయేది. 


బాక్స్ రేడియోలు మీడియం, షార్ట్ వేవ్ బాండ్లతో ఎత్తైన ప్రదేశంలో బయట రెండు వెదురు కర్రలను దూరంగా అమర్చి ఏరియల్ తో శబ్ద తరంగాల్ని ఆకర్షించేవారు. పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులప్పుడు వాతావరణం సరిగ్గా లేక శబ్ద తరంగాలకు అంతరాయం కలిగి మాటలు పాటలు

 స్పష్టంగా వచ్చేవి కావు. లారీ బేటరీలతో పెద్ద రేడియోలు, పంచాయతీ రేడియోలు నడిపేవారు. అప్పట్లో ఎక్కువగా ఆకాశవాణి, సిలోన్ కార్యక్రమాలు, వార్తలు రేడియోలో వచ్చేవి. అలాగే రాత్రి వీధుల్లో, నాలుగు రోడ్ల కూడలిలో పంచాయతీ ఆఫీసు వారు కిరోసిన్ దీపాలు ఏర్పాటు చేసేవారు. 


పండగలు, పెళ్లి వేడుకలు, సమావేశాలప్పుడు, పెద్ద షాపులలో కిరోసిన్తో మేంటిల్ కట్టిన పెట్రోమాక్స్ దీపాలు వాడుకలో ఉండేవి. మా ఇల్లు పాత బస్టాండు దగ్గర హైస్కూల్ దగ్గర ఉండేది. మా ఇంటి పేరుతో కందర్ప కోలనీ అని వీధికి పేరుండేది. 


 ఆ వీధిలో మా పెదనాన్నలు బాబయ్యలు వారి బంధువుల ఇళ్లతో బ్రాహ్మణ కళ ఉట్టి పడేది. వారి కుటుంబాల్లో డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారాలు

చేసేవారు ఉండేవారు. 


భూముల ఇళ్ల క్రయ విక్రయాలు చుట్టు గ్రామాల నుంచి వచ్చే జనాలతో రిజిస్ట్రేషన్ ఆఫీసు సందడిగా కనబడేది. సెక్షన్ కోర్టు, పోలీస్ స్టేషన్, సబ్ జైల్, సినేమా హాలు, 

హైస్కూలు, పెద్ద స్థానిక గ్రంథాలయం, రోజరీ క్లబ్, ఆధ్యాత్మిక వాతావరణంతో అనేక దేవాలయాలు, జవహర్ క్లబ్ లాంటి పార్కు, సాయంత్రం పెద్దలకు పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండేది. 


ఉద్యోగస్తులు టెన్నీస్ కోర్టులో టెన్నీస్, రీడింగ్ రూములో పెద్దలు దిన పత్రికలు చదువుతు గడిపేవారు. హార్డింగ్ రెస్టు హౌస్ అనే విడిది భవనం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారస్తులు వినోద కార్యక్రమాల వారికి అందుబాటులో ఉండేది. 


తాలూకా ఆఫీసులో ఖజానా ఆఫీసుతో పాటు రిమాండ్ ఖైదీల గదులు పోలీసుల రాత్రి పగలు పహారాతో ఉండేది. కాపలా పోలీసు గార్డులు గంట కొకసారి సమయం తెలియ

చేస్తూ పెద్ద ఇత్తడి గంట వాయించేవారు. రాత్రప్పుడు సమయం తెలియచేస్తు సమయాను కూలంగా అన్ని సార్లు ఇత్తడి గంట మోగించేవారు. పహరా హుసార్ అంటూ కేక లేసేవారు. 


సెక్షన్ కోర్టులో బిళ్ల బంట్రోత్తు వాది ప్రతివాదుల్నీ సాక్షుల పేర్లు బయటకు వచ్చి మూడుసార్లు కేకేస్తే చెట్ల కింద కూర్చున్న జనాలు పరుగులు తీసే వారు. లోపల పెద్ద వేదిక మీద జడ్జిగారు నల్లకోటు మెడలో తెల్లని రిబ్బనులాంటిది కట్టుకుని న్యాయవాదుల వాదోపవాదాలు వింటు సాక్ష్యుల్ని ప్రశ్నలడిగే వారు. వేదిక కింద గుమస్తా కూర్చుని జడ్జికి సహకరిస్తు సాక్షుల చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించేవారు. 


కరెంట్ లేనందున పైన ఒక పెద్ద వెదురు బొంగుకు కుచ్చుల పరదా కట్టి ఒక బండ్రోత్తు తాడుతో లాగుతు జడ్జి గారికి గాలి విసిరే వాడు. ఈ తతంగమంతా మాకు అవకాశం చిక్కినప్పుడు కోర్టు కార్యకలాపాలు చూసేవారిమి. 


అప్పుడప్పుడు మా నాన్నతో ప్రేమ సమాజానికి వెళ్లేవాడిని. అక్కడ కుష్టురోగులు అనాథలు ముసలి రోగులు దీనావస్థలో ఉండేవారు. స్వచ్ఛంద సంస్థలు, పెద్దల విరాళాలతో వారి

బాగోగులు జరిగేవి. 


దసరా పండగలప్పుడు పులివేషాలు, కత్తి సాములతో దుర్గా నవరాత్రులు సాగేవి. సంక్రాంతి పండగ మూడు రోజులు బంధువుల రాకపోకలు ప్రతి ఇంటి ముందు రంగ వల్లికలు, గంగిరెద్దుల కోలాహం, హరిదాసుల కీర్తనలు, కోతి తిమ్మరాజు వినోద పగటి వేషాలు ఇళ్లలో పిండివంటలతో ఊరంత సందడిగా కనబడేది. 


మరో పక్క కోడి పందేలు, పొట్టేళ్ల పందేలు, ఎడ్లబళ్ల పందేలు సాగేవి. భోగి పండగ నుంచి ముక్కనుమ వరకు ఊళ్లో ఒక్కొక్క చోట తీర్థాలు (జాతర)జరిగేవి. రంగుల కాగితం కళ్లజోళ్లు, రంగు పంచదార చిలకలు, బెల్లం జీళ్లు, కిర్రు శబ్దాల బాజాలు కొనుక్కు తెచ్చుకునే వాళ్లం.


మా ఊరు జాతీయ రహదారికి దూరంగా ఉన్నందున మాకు రైల్వే స్టేషన్ అనకాపల్లి ఉండేది. అప్పట్లో హైస్కూలు తర్వాత కాలేజీ చదవాలంటే అనకాపల్లి లో ఉండే ఎ. ఎమ్ ఎ ఎల్ కాలేజీ కి వెళ్లాల్సిందే. మున్సిపాలిటీగా బెల్లం మార్కెట్ కేంద్రంగా ఎంతో పేరుంది. అక్కడి నూకాలమ్మ దేవత గుడికి చాలా ప్రాముఖ్యముంది. 


చుట్టు ప్రాంతాల్లో చెరకుపంట ఎక్కువ అయినందున సహకార చక్కెర ఫేక్టరీ అనకాపల్లి తుమ్మపాల, కాకుండా చోడవరంలో మరొక సహకార చక్కెర ఫేక్టరి ఉండేది.

 

బస్సులో ప్రయాణిస్తుంటే రోడ్డు పక్కన చెరకు పొలాల్లో ముదిరిన చెరకు గడలను నరికి క్రష్ మిషన్ల మీద చెరకు రసం పెద్ద పాత్రలలో చేర్చి పక్కన పెద్ద ఇనప పెనంలో పోసి కింద ఎండిన చెరకు చెత్తతో వేడి చేస్తూ కావల్సిన పాకం వచ్చే వరకు కర్ర తెడ్లతో చుట్టూ కలుపుతూంటారు. ఆ

సమయంలో బస్సు ప్రయాణీకులకు చక్కటి బెల్లం వాసన ముక్కులకు తాకేది. కావల్సిన బెల్లం పాకం రాగానే ముందుగా తయారు చేసుకున్న వెదురు తట్టలలో పోసి చల్లారిన తర్వాత అనకాపల్లి బెల్లం మార్కెట్లో అమ్ముకునేవారు. 


కోసిన చెరకు గడలను ఎడ్లబళ్ల మీద, లారీలలో షుగర్ ఫేక్టరీలకు తరలించేటప్పుడం వెనక పరిగెత్తి చెరకు గడలను తస్కరించే వాళ్లం.


నాకు పాత రోజులు తలుచుకుంటే అప్పడు ఇళ్లలో మరుగు దొడ్లు ఎంతో అసహ్యం అనిపించేవి. ఇంటికి వెనక నూతికి దూరంగా నాలుగు గోడల లేక తాటి కమ్మల దడి లోపల 

ఇటికలు లేదా సున్నంతో గట్టు తయారు చేసి లోపల ఇసక పోసేవారు. తలుపులకు బదులు గోనె పట్టా ఉండేది. ఎవరైన మల విసర్జన చేసేటప్పుడు తువ్వాలో మరేదైన గుడ్డ గోనె

పట్టా మీద ఉంచితే లోపల ఎవరో ఉన్నారని సంకేతం. 


మర్నాడు పాకీ వారు లేక చచ్చడి వాళ్లు గంపలతో ఆ అశుద్ధాన్ని రేకు ముక్కలతో సేకరించి దూరంగా పడ వేసేవారు. మన మలమూత్రాలే మనకు అసహ్యం పుట్టి ముక్కు మూసుకుంటే అప్పట్లో ఆ సఫాయి వారు ఎలా ఆ పని చేసేవారో తలుచుకుంటే బాధనిపిస్తుంది. మాలాంటి చిన్న పిల్లలం దూరంగా ఏ చెట్లు తుప్పల వెనక పని కానిచ్చే వాళ్లం. 


గ్రామాలలో అప్పుడు ఆడా మగా ఊరి బయట పొలం గట్లు, తుప్పలు డొంకల వెనుక కాల కృత్యాలు తీర్చుకునే వారు. ప్రతి ఇంటి పెరళ్లలో మంచి నీటి బావులు ఉండేవి. 


ఇంక నేను బాల్యంలో చదివిన పాఠశాల గురించి : నేను చిన్నప్పుడు చదివిన పాఠశాల పేరు శ్రీరామా ప్రాథమిక పాఠశాల. గవర్ణమెంటు ఎయిడ్ తో నడిచేది. మా పాఠశాల కమ్మల పాకలో ఉండేది. మట్టిదిమ్మల మీద కూర్చొని చదువు సాగేది. నల్లబోర్డు, డస్టరు, ఒక కర్ర కుర్చీ, కర్ర టేబిల్ ఉండేవి. 


పాఠశాల యజమాని, ప్రధానోపాధ్యాయుడు శోభనాద్రి మాస్టారు శ్రీ వైష్ణవులు. భారీ శరీరం నల్లగా ముఖం మీద వెంకట తిరునామాలతో సమయ పాలన క్రమశిక్షణతో విద్యార్థుల్ని తీర్చి దిద్దేవారు. ముందు పాఠశాల ఉంటే వెనక వారి నివాసం పెంకుటిల్లు ఉండేది. శోభనాద్రి హెడ్ మాస్టరు

కాకుండా మరో ఉపాధ్యాయుడు ముష్టి సూర్యనారాయణ గారు సహాయంగా తరగతులు నడిపేవారు. 


 పాఠశాల చుట్టూ ఆటల మైదానం, దగ్గరలో బాగా విస్తరించిన మర్రి చెట్టు నీడలో పూల మొక్కలు, వాటి పక్క మట్టితో కట్టిన జండాదిమ్మ ఉండేవి. సమయాను కూలంగా తరగతులు ఆటలు, పూలమొక్కలకు నీళ్లు పొయ్యడం, పరిసర ప్రాంతాల శుభ్రతతో క్లాసులు సాగేవి. నీతి శతక పద్యాలు, ఎక్కాలు వల్లె వేయించేవారు. చెప్పులు లేకుండా కాలి నడకన నిక్కరు కమీజుతో పాఠశాలకు వచ్చేవారిమి. ఎటువంటి యూనిఫామ్ ఉండేది కాదు. తరగతి పుస్తకాలు గుడ్డ సంచిలోనో ప్లాస్టిక్ పేపరుకి చుట్టి తెచ్చుకునే వారిమి. 

 

ఉదయం ఏడు గంటలకు పాఠశాల జాతీయగీతం ప్రార్థనతో మొదలయేది. ఆడపిల్లలు మగపిల్లలు ఆటపాటలు కలసి చదువుకునే వారిమి. దశరా పండగ వచ్చిందంటే ఉపాధ్యాయుల వెంట రంగుల కాగిత బాణాలు చేతబూని దసరా పద్యాలు పాడుకుంటూ ఆఖరున పప్పుబెల్లాలు పంచుకు తినేవాళ్లం. 


బాల్యంలో చదివే ఆరోజులే వేరు. ఆ కాలంలో ఐదు సంవత్సరాలు నిండిన వారినే అక్షరాభ్యాసం కావించి పాఠశాలకు పంపేవారు. అప్పటి వరకూ ఇళ్లలో గుమ్మాలంట ఆటలతో సమయం గడిచిపోయేది. అప్పట్లో పిల్లలకు చదువుల ఒత్తిడి లేకుండా ఆట పాటలతో పెద్దల

పర్యవేక్షణలో క్రమశిక్షణతో సాగేవి. ఏ వయసు వారైనా ఆడ మగ ఒక కుటుంబ సహోదరులుగా ప్రేమానురాగాలతో చదువులు సాగిపోయేవి. 


మనం ఎక్కడ బ్రతుకు తెరువు కోసం స్థిర పడినా, పుట్టి పెరిగిన ఊరిని మరిచిపోకూడదు. 


 నమస్తే


 కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


19 views0 comments

Comments


bottom of page