#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #జయేంద్రుడిప్రజ్ఞ, #JayendrudiPrajna, #జానపదకథ
![](https://static.wixstatic.com/media/acb93b_0eb2558c38954bf5ab2f129475adf0f2~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_0eb2558c38954bf5ab2f129475adf0f2~mv2.jpg)
Jayendrudi Prajna- New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 07/02/2025
జయేంద్రుడి ప్రజ్ఞ - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జయేంద్రుడి తండ్రి రాజేంద్రుడు. క్షత్రీయ వంశానికి చెందిన రైతు. రాజేంద్రుడి పూర్వీకులు రాజ్యాలు ఏలే రాజులు. రాజుకు వందమంది భార్యలు ఉంటే భార్యలకు పుట్టిన కుమారులందరూ రాజులు కాలేరు కదా. మొదటి భార్య కుమారులకు మాత్రమే రాజు అయ్యే అర్హత ఉంటుంది. అది కూడా మొదటి కుమారునికి మాత్రమే అవకాశం ఉంటుంది.
మిగతా వారందరూ సైన్యాధిపతులుగాను, మంత్రులుగాను, సైనిక అధికారులుగాను సైనికులుగాను పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. తరువాత తరంవారు రాజోద్వోగాలు కొందరు, ఏదోక వృత్తి చేసుకుంటూ కొందరు బతుకు కొనసాగిస్తూ ఉంటారు. అలా వ్యవసాయ వృత్తిలో స్థిరపడినవారిలో రాజేంద్రుడు ఒకరు. వ్యవసాయ రంగంలో ఉన్నా కూడా రాజేంద్రుడు క్షాత్ర విద్యలలో ఆరితేరిన వాడు.
ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు అతడు నాయకుడు, పాలెగాడు. బందిపోట్లు, క్రూర మృగాలు గ్రామాలు మీద దాడి చేసినప్పుడు రాజేంద్రుడే ఎదుర్కొని పారద్రోలేవాడు.
కాలక్రమేణా రాజేంద్రుడికి జయేంద్రుడు, విజేయేంద్రుడు అను ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వీరు సకల విద్యలను అభ్యసించి గొప్ప వీరులైనారు. జయేంద్రుడు ఖడ్గోపజీవి అయి కొంతమంది సైనికులను సిద్ధం చేసుకొని ఉజ్జయినికి కాశీకి ప్రయాణిక బృందాలను నడిపేవాడు. అందుకుగాను ప్రయాణికుల నుండి తగిన రుసుం వసూలు చేసేవాడు.
పూర్వకాలంలో ఒక నగరం నుండి మరో నగరానికి వ్యాపారస్తులు ప్రయాణికులు ప్రయాణించాలంటే అడవులను దాటవలసి వచ్చేది. ఆసమయంలో దగ్గులు పిండారీలు బందిపోట్లు ప్రయాణికుల పైబడి దోచుకునే వారు. తిరగబడినవారిని నిర్దాక్షిణ్యంగా చెప్పేవారు. క్రూర మృగాలు కూడా దాడిచేసి మనుషుల్ని చంపేసేవి. అందుకోసం ప్రయాణికులు వ్యాపారస్తులు వీరులైన కొంతమంది పరిరక్షణలో బృందాలుగా ప్రయాణించేవారు.
అలాంటి వీరులైన రక్షణ గుంపుకు జయేంద్రుడు నాయకుడై ప్రయాణికుల బృందాలను ఉజ్జయిని నుండి కాశీకి, కాశీకి నుండి ఉజ్జయినికి నడిపేవాడు. ప్రయాణికుల బృందం కాశీ నగరానికి బయలుదేరడానికి నెల దినముల ముందే జయేంద్రుడు ఉజ్జయిని నగరంలో దండోరా వేయిస్తాడు.
ఫలానా దినం ప్రయాణికుల బృందం కాశీ నగరానికి బయలుదేరుతుందని, దానికి పదిహేను దినముల ముందే కాశీకి రావలసినవారు రుసుం కట్టి పేరు నమోదు చేయించుకొని మీమీ సరుకు సంరజామాలతో సిద్ధంగా ఉండవలసిందిగా ప్రజలను కోరుతాడు జయేంద్రుడు.
రుసుం ధరలు కూడా ప్రకటిస్తాడు జయేంద్రడు. గుర్రాల మీద, ఏనుగుల మీద, ఒంటెల మీద ప్రయాణించే వారికి ఒక వెల, గుర్రపు బండ్ల మీద, ఒంటెల బండ్ల మీద ప్రయాణించే వారికి ఒక వెల, సరుకులు సామాన్ల బండ్ల మీద ఒక వెల వసూలు చేస్తాడు. జయేంద్రుడు ప్రయాణికులకు కేవలం రక్షణ మాత్రమే కల్పిస్తాడు. ఎవరి ఆహారం నీళ్ళు వారే తెచ్చుకుంటారు. దారి మధ్యలో ఎవరికైనా జబ్బు చేస్తే చూడడానికి ఒక వైద్యుడిని బృందం వెంట తీసుకు వెళతాడు జయేంద్రుడు.
పగలంతా ప్రయాణించి రాత్రికి ఒకచోట మజిలీ చేస్తారు. అక్కడ ప్రయాణికులు వంట చేసుకోవడానికి సౌకర్యాలు ఉంటాయి. నీళ్ళు ఉంటాయి. సరుకుల అంగళ్ళు. పూటాకూళ్ళ అంగళ్ళు (భోజనం శాలలు) కూడా ఉంటాయి. వాన వస్తే పడుకోవడానికి సత్రాలు ఉంటాయి. అలా ప్రతి మజిలీకి ఏర్పాట్లు సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణికుల బృందం ప్రయాణించేటప్పుడు ఏ ప్రయాణికుని ఊరు వస్తే ఆ ప్రయాణికుడు బృందం నుండి వెళ్ళిపోతుంటాడు.
జయేంద్రుడి బృందం వెళుతుండగా బందిపోట్లు కానీ క్రూర మృగాలు కానీ దాడి చేసినప్పుడు పోరాడి తరుముతారు. ఆ ప్రయత్నంలో ఎవరైనా సైనికులు చనిపోతే ఆ దఫా బృందానికి వచ్చిన సొమ్మును ఆ సైనికుని కుటుంబానికి ఇస్తాడు జయేంద్రుడు. సాధారణంగా జయేంద్రుడి బృందం పై దాడి చేయడానికి ఎవరూ సాహసం చేయరు. అతని ఖడ్గ చాలనం ముందు ఎవరూ నిలువ లేరు. ఎవరైనా సాహసం చేసి దాడి చేస్తే ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలడు జయేంద్రుడు. అందువలననే ప్రయాణికులు సురక్షితంగా నిర్భయంగా ప్రయాణం సాగిస్తారు. కాబట్టి జయేంద్రుడు బృందంలో ప్రయాణించడానికి ఇష్టపడుతారు ప్రయాణికులు.
ఇలా ఉండగా రాజేంద్రుడి చిన్న కుమారుడు తన తమ్ముడైన విజేయేంద్రుడు తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ వృత్తిని స్వీకరించి తన ఊరికి చుట్టూ ఉన్న నాలుగూర్లకు రక్షణగా పాలెంగారుగా ఉంటూ ఓ చక్కని స్త్రీని వివాహమాడి జీవితంలో స్థిరపడతాడు.
ఒకసారి ఉజ్జయిని రాకుమారి జయంతి కాశీ క్షేత్రాన్ని దర్శించ దలచి తల్లిదండ్రుల అనుమతితో జయేంద్రుడి రక్షణలో సాగుతున్న బృందంలో రథంపై ప్రయాణిస్తుంది. ఆ సందర్భంలో జయంతికి జయేంద్రుడికి సాన్నిహిత్యం ఏర్పడి కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తారు.
రాజకుమారి జయంతి రాజ్యపాలనలో ఎదురైయే పాలనా విషయాలు, ప్రజాసంక్షేమ విషయాలు, రాజకియాలలో ఉండే కుట్రలు కుతంత్రాలు, పన్నాగాలు. ఎత్తులు పైఎత్తులు గురించి జయేంద్రుడికి చెప్పుతుంది.
జయేంద్రుడు ప్రయాణికుల బృందాలను నడిపించడంలో ఉన్న సమస్యలను. జయంతికి వివరించాడు. బృందం ప్రయాణిస్తున్నప్పుడు దగ్గులు పిండారీలు బందిపోట్లు క్రూర మృగాలు దాడి చేస్తే ఎదుర్కొని చంపడయో పారదోలడయో చేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. ప్రయాణం మధ్యలో ప్రయాణికులకు ఆరోగ్యం సమస్యలు ఏర్పడినా, ఆహార కొరత వచ్చిన చూసుకోవాలి. మా వృత్తి కత్తిమీద సాము లాంటిదని చెప్పుతాడు.
బృందం కాశీ నగరం చేరాక జయంతి గంగానదిలో స్నానమాచరించిన తరువాత, జయేంద్రుడు కాశీ విశ్వనాథుని, విశాలాక్షిని, అన్నపూర్ణను దగ్గరుండి దర్శనం చేయిస్తాడు. యువరాణి కాశీరాజు రవివర్మను సందర్శించి సంభాషించే ఏర్పాటు చేస్తాడు. కాశీ యువరాజు సుసేనవర్మకు జయంతి చెల్లెలు సుశీలదేవికి వివాహ సంబంధం ఏర్పడుటకు సహకరిస్తాడు జయేంద్రుడు.
ఉజ్జయినికి తిరిగి బయలుదేరిటకు ఉజ్జయిని పోయే ప్రయాణికులతో బృందం సిద్ధపరుచుకొని పయనం అవుతాడు జయేంద్రుడు. బృందాన్ని అనుసరించి పయనిస్తోంది ఉజ్జయిని రాకుమారి జయంతి. మార్గ మధ్య అడివిలో అకస్మాత్తుగా పిండారిలు అని పిలవబడే బందిపోట్లు బృందంపై దాడి చేశారు. జయేంద్రుడి సైనికులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి బందిపోట్లుపై ప్రతిదాడి చేశారు. ఆ దాడిలో బందిపోట్లు చావగా మిగిలిన వారు అడివిలోకి పారిపోయినారు. ఆ పోరాటంలో జయేంద్రుడి యుద్ధనైపుణ్యం ఖడ్గచాలనం మెరుపువేగం చూసి జయంతి అబ్బురపోతుంది.
"ఇలాంటి వీరుడు ఏ దేశ సైన్యంలో ఉంటే ఆదేశం సురక్షితంగా ఉంటుంది" అనుకుంటుంది యువరాణి జయంతి.
అదే విషయం జయేంద్రుడితో అంటుంది. "మహావీరా! జయేంద్రా! మీరు ఇంత గొప్ప వీరులు కదా! మీరు ఏదైనా రాజ్యాన్ని జయించి పాలించ వచ్చు కదా!" అని.
"అలాంటి బుద్ధి, ఆశ నాకు లేదు రాకుమారి" అంటాడు జయేంద్రుడు.
"పోనీ ఏదైనా రాజ్యంలో సైన్యాధిపతిగా ఉద్యోగం చేయవచ్చు కదా!" అంటుంది జయంతి.
"నాకు ఎవరి వద్ద పని చేయాలని లేదు. స్వతంత్రంగా జీవించడమే నాకు ఇష్టం యువరాణి" అంటాడు.
"మా రాజ్యంపై ఏదైనా శత్రుదేశం దండెత్తి వస్తే మీరు సహాయం చేస్తారా?" అడుగుతుంది.
మీ రాజ్యమంటే మా రాజ్యమే కదా! మా మాతృ దేశం కోసం తప్పక పోరాడుతాను" పలుకుతాడు.
"వచ్చే మాసం దశమి రోజు నా స్వయంవరం. అందులో పాల్గొని మేము ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొంది నన్ను వరించండి మహావీరా! " అభ్యర్థించింది జయంతి.
"మీరు ప్రేమతో ఆహ్వానిస్తే తప్పకుండా పాల్గొంటాను జయంతి గారు!" హామీ ఇస్తున్నట్లుగా అన్నాడు జయేంద్రుడు.
"నేను మీపై నిజంగానే మనసు పడి మిమ్మల్ని హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాను. మీరు పోటీలలో పాల్గొని నన్ను గెలుచుకొని నా రాజ్యాన్ని ఏలుకోండి మహావీరా!" అని జయేంద్రుడిని ప్రేమతో ఆహ్వానించి ఉజ్జయిని నగరం రాగానే అంతఃపురానికి వెళ్లిపోయింది ఉజ్జయిని యువరాణి జయంతి.
ప్రయాణికులు ఎవరి దారిన వారు స్వస్థానాలకు వెళ్లిపోయాక జయేంద్రుడు తన తండ్రి దగ్గరకు పోయి రాకుమారి జయంతితో తసకున్న అనుభవమైన విషయం, ఆమె స్వయంవరం విషయం తెలిపుతాడు. రాకుమారి జయంతి స్వయంగా తన స్వయంవరంలో పాల్గొని పోటీలలో గెలిచి తనను చేపట్టాల్సిందిగా ఆహ్వానించినట్లు తండ్రి రాజేంద్రుడికి, తల్లి రాజేశ్వరికి, తమ్ముడు విజయేంద్రుడికి చెప్పుతాడు.
రాజేంద్రుడు చాల సంతషించి " జయేంద్రా! మన పూర్వీకులు రాజ్యాలు పాలించారు. మళ్లీ ఇంత కాలానికి నువ్వు రాజైయే అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని స్వయంవరం పోటీలలో విజయం సాధించి రాజ్యాన్ని రాకుమారిని సొంతం చేసుకో! విజయీభవ! " ఆశీర్వచనాలు అందించాడు.
తల్లి దీవిస్తుంది. తమ్ముడు విజయేంద్రుడు కూడా అన్నను ఉత్సాహంగా ప్రోత్సాహించాడు. ఆ రోజు నుండి యుద్ధ విద్యలలో కఠోర సాధన చేశాడు జయేంద్రుడు.
జయంతి స్వయంవరం రోజు జయేంద్రుడి కుటుంబంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దేశరాజధాని ఉజ్జయినికి జయేంద్రుడి వెంట బయలుదేరారు. ఉజ్జయిని నగరం స్వాగత తోరణాల అలంకరణతో కళకళలాడుతూ ఉంది. దేశదేశాల రాకుమారులు నగరానికి విచ్చేశారు. ఉదయమే సువిశాలమైన రాజావారి ఆట స్థల మైదానంలో స్వయంవరం పోటీలు ప్రారంభమైనాయి. ఎతైన ఉన్నతాసనాలపై రాజు సింహవర్మ, రాణి నిర్మలాదేవి, యువరాణి జయంతి. రాజోద్యోగులు సైనికోద్యోగులు మంత్రులు సామంతులు ఆసీనురాలై ఉన్నారు.
రాజు సింహవర్మ సింహాసనం నుంచి లేచి "స్వయంవరంనకు విచ్చేసిన రాకుమారులందరికి స్వాగతం సుస్వాగతం. పోటీల్లో భాగంగా ముందుగా మల్లయుద్ధము పోటీలు జరుగుతాయి. అందులో గెలిచిన వారు ఖడ్గ యుద్ధంలో పాల్గొంటారు. అందులో గెలిచినవారు గుర్రపు స్వారీ పోటీలో పాల్గొంటారు. అందులో గెలిచిన వారు విజ్ఞానం పోటీలో పాల్గొంటారు. ఆ చివరి పోటీలో విజయం సాధించిన వీరుడి కంఠంలో మా రాకుమారి జయంతి పుష్ఫమాల అలంకరించి వరిస్తుంది. " గంభీరమైన స్వరంతో ప్రకటించి రాజు ఆసనంపై కుర్చున్నాడు.
పోటీల ప్రారంభ సూచనగా విజయభేరీ మోగించింది. మల్లయుద్ద పోటీలు రాకుమారుల మధ్య భీకరంగా జరిగాయి. అందులో సగం మంది గెలుపుపొందారు. ఆ సగం మంది మధ్య ఖడ్గయుద్ధ పోటీలు భయానకంగా మొదలైనాయి. ఆ పోటీలలో పాతికమంది విజయం సాధించారు. పాతికమందికి గుర్రపుస్వారీ పోటీలు నిర్వహించారు. అందులోనుంచి పదిమంది మాత్రమే నిర్దిష్ట సమయంలో గుర్రాన్ని గీత దాటించి పోటిలో ఉత్తీర్ణులైనారు.
ఆ పదిమందికి విజ్ఞానం పోటీలో భాగంగా అరటితోటకు పోయి రెండు అరటిపండ్లు తెచ్చి మంత్రి చేతికి ఇవ్వాలి. తోటకు ఏడు ద్వారాలను దాటుకుని పోవాలి. ప్రతి ద్వారం దగ్గర ఒక కావలివాడు ఉంటాడు. వచ్చేటప్పుడు మీరు తెచ్చే పండ్లలో సగం పండ్లు మొదటి కావలివాడికి ఇవ్వాలి. మిగిలి పండ్లలో సగం రెండవవాడికి ఇవ్వాలి. ఆ మిగిలిన వాటిలో సగం మూడవవాడికి ఇవ్వాలి. ఈ విధంగా ఏడు ద్వారాల దగ్గర ఉన్న వారికి ఇవ్వగా రెండు పండ్లు మాత్రమే మిగలాలి. ఏడుగురికి పంచడంలో ఎక్కడా శేషం మిగల కూడదు. చివరికి రెండే పండ్లు మిగలాలి. అది పోటీ.
ఈ పోటిలో జయేంద్రుడు శంకరవర్మ ఇద్దరే కృతకృత్యులయ్యారు. వారిని ఎలా తేగలినారు అని అడిగినప్పుడు జయంతుడు "రెండుతో హెచ్చింపు చేసుకుంటూపోతూ అట్లా ఏడు మార్లు హెచ్చింపు చేస్తే తోట నుండి తేవాల్సిన పండ్ల మొత్తం తెలుస్తుంది. మళ్లీ రెండుతో ఏడు మార్లు భావిస్తూపోతే చివరగా రెండు పండ్లు మిగులుతాయి" అని చెప్పాడు జయేంద్రుడు.
ఇక చివరి పోటీ. " కొబ్బరి తోటకు పోయి ఒక్కోక్క బండికి వంద కొబ్బరి కాయలు చొప్పున బండిలో వేసుకుని వస్తూ వందచోట్ల ఉన్న పరిశీలనా కేంద్రాల వద్ద ఒక్కొక కేంద్రానికి ఒక్కొక కొబ్బరి కాయ వంతున బండికొక కాయ ఇస్తూ చివరికి కొబ్బరి కాయలు మిగిలించుకొని రావాలి. ఇది పోటీ. ఇక బయలుదేరండి" అని చెప్పగానే శంకరవర్మ లెక్కలేసుకుంటూ నిలిచిపోయాడు.
"ఎన్ని బండ్లు తీసుకొని పోయినా బండికి వంద కాయలు వేసుకొని బండికొకటి చొప్పున వందచోట్ల వంద కాయలు ఇచ్చినప్పుడు ఇంకా బండిలో కాయలేమి మిగులుతాయి " అనుకొని తన ఓటమిని అంగీకరించాడు.
జయేంద్రుడు మాత్రం రెండు ఎడ్లబండ్లు తీసుకొనిపోయి బండికి వంద కాయల వంతున రెండు బండ్లకెత్తికొని, ఒక్కొక్క పరిశీలన కేంద్రానికి రెండు బండ్లకు రెండు కాయలు వంతున, రెండు బండ్లకు కలిపి ఒకేబండిలో నుంచి రెండు కాయలు ఇచ్చుకుంటూ వచ్చాడు. యాబై కేంద్రాలు దాటిన తరువాత ఒక బండిలోని కాయలు మొత్తం అయిపోయాయి. కాళీ అయిన బండికి కాయ ఇవ్వాల్సిన పని లేదు. ఇక యాబై కేంద్రాలకు కాయలతో నిండుగా ఉన్న బండి నుంచి ఒక కాయ వంతున ఇచ్చుకుంటూ పోయాడు జయేంద్రుడు. చివరకు బండిలో యాబై కాయలు మిగిలాయి. జయేంద్రుడు యాబై కొబ్బరి కాయలు ఉన్న ఎడ్లబండిని నడుపుకుంటూ సభా స్థలికి వచ్చాడు.
కొబ్బరి కాయలతో వచ్చిన జయేంద్రుడికి జయజయ ధ్వనాలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికాడు రాజు సింహవర్మ బంధుసామంతులతో కలిసి. విజయ దుందుభీలు మ్రోగాయి. రాకుమారి జయంతి వరమాల జయేంద్రుడి మెడను అలంకరించి వరించింది.
జయేంద్రుడికి జయంతికి అత్యంత వైభవంగా వివాహ మహోత్సవ జరిగింది. అటు కొంత కాలానికి ఉజ్జయిని రాజ్యానికి జయేంద్రుడు రాజై ప్రజలకు సుపరిపాలన అందించాడు. తండ్రి రాజేంద్రుడు మంత్రిగాను. తమ్ముడు విజయేంద్రుడు సైన్యాధిపతిగాను పెదవులు నిర్వహించారు.
--------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_c3868dad8ad24c4cabbf11824e491400~mv2.jpeg/v1/fill/w_420,h_560,al_c,q_80,enc_auto/acb93b_c3868dad8ad24c4cabbf11824e491400~mv2.jpeg)
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
---------
Comments