top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 1

శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ధారావాహిక ప్రారంభం


'Jeevana Chadarangam - Episode 1' - New Telugu Web Series Written By Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 10/01/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



‘గుర్తుకొస్తున్నాయీ...... గుర్తుకొస్తున్నాయీ...... ’ పాటను ఇయర్ ఫోన్స్ లో వింటోంది సిరి చందన. 


‘డియర్ తాతగారూ.. ’ అంటూ వారంవారం వ్రాసిన ఉత్తరాలు, నాలుగు రోజులు తిరక్కుండా వచ్చే జవాబులను ఎంతో ఆరాటంగా చదువుకోవడం, ఊరు వెళ్ళినప్పుడు పెరట్లోపట్టెమంచంమ్మీద పడుక్కుని ఆకాశాన్ని చూస్తూ లెక్క పెట్టిన చుక్కలూ, తాతగారు చెప్పగా విన్న కథలూ... ఎన్నెన్నో తీపి గురుతులు. 


జగపతిరాజపురం పేరు విన్నప్పుడల్లా సిరిచందన మనసు చెప్పలేని పరవశంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆమెకుఆ ఊరెంత ఇష్టమో, అంతకంటేఇష్టంతాతగారితో గడిపినక్షణాలు. అందుకేనేమోఅస్తమానూ మైత్రితో ఆ కబుర్లే చెపుతూ ఉంటుంది. సిరి చుట్టూ ఉన్నవాళ్ళందరికీ ఆ విషయాలు తెలిసి తీరతాయి. స్నేహితురాళ్ళకైతే పూసగుచ్చినట్టు విదితమే అనడంలో అతిశయోక్తి లేదు. 


‘తెలుసా అంటే, ఏదో చూచాయగా తెలియడం కాదు. బాగా నలిగి తెలిసేంతలా ఆ విషయాలను తలచుకోవడం, మా అందరికీ చెప్పడం’ అంటుందిసిరి వెన్నంటే ఎప్పుడూ ఉండే మైత్రి. మైత్రికి సిరికి చుట్టరికం కంటే స్నేహమే ఎక్కువ. ఎనిమేళ్ళ క్రితం ప్రారంభమై, రోజురోజుకూ చిక్కపడుతూ, ప్రాణానికి ప్రాణంగా కొనసాగుతూ పటిష్టమైన స్నేహం. పద్దెనిమిదేళ్ళ వయసున్న వారిద్దరూ ఇప్పుడు మేజర్లనిపించుకున్నా, ఆ చిన్న నాటి చిలిపి కబుర్లతో యుక్త వయసు కొత్త కబుర్లు చేరాయే కానీ, స్నేహంలో పంచుకోవడం ఎంత మాత్రమూ తగ్గలేదు. 


మైత్రి సిరికి మావయ్య కూతురు. సిరి తల్లి మైత్రి తండ్రి అన్నదమ్ముల పిల్లలు. పదేళ్ళ క్రితం సిరి చదువుతున్న స్కుల్లో నాల్గవ తరగతిలో చేరింది మైత్రి. అప్పటి వరకూ ఈ బంధుత్వం కూడా ఇద్దరికీ పెద్దగా తెలియదు. సిరి తండ్రి ఉద్యోగం చేస్తున్న చోటికే మైత్రి తండ్రికీ బదిలీ అవ్వడంతో, బావమరిది ఇంటికి దగ్గరగా ఇల్లు తీసుకోవడం, వాళ్ళమ్మాయి చదువుతున్న స్కూల్లోనే వేయడం. అలా ప్రారంభమైంది రెండు కుటుంబాలకు స్నేహం. కుటుంబాలతో పాటు సిరి మైత్రిల స్నేహం మాత్రం ఇంటితో పాటు బడిలో కూడా కొనసాగింది. 


ఇక జగపతిరాజపురంమాటకొస్తే, ప్రతీ ఏడూ తాతగారి ఊరు వెళ్ళడం, అక్కడి కబుర్లెన్నో మోసుకు రావడం, అవన్నీ మైత్రితో పంచుకోవడంసిరికి అలవాటైపోయింది. వారి మధ్య జరిగే సంభాషణల్లోజగపతిరాజపురం ప్రస్తావన లేకుండా ఏ రోజూ ఉండేది కాదు. అలా ఏళ్ళతరబడి ఎన్నెన్నోఅనుభూతులనుకథలుగా చెప్పుకుని పంచుకుంటూనే వారివురూ పెరిగారు. ఇద్దరికీ ఇప్పుడు పద్దెనిమిదేళ్లు నిండాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే.......... 

*****


ఇంచుమించు పదేళ్ళ నాటి విషయం అది. అప్పుడు సిరికిఎనిమిదో ఏడు. ఏటేట వెళ్ళేటట్టే ఆ ఏడు కూడాసంక్రాంతి పండుగకు తాతగారింటికి ప్రయాణమవ్వడానికి ఉత్సాహంగా తయారవుతున్నారు. 


“అమ్మా, మనం ఊరు వెళ్ళేదెపుడూ? రైలెప్పుడమ్మా?” ఆతృతగా అడిగింది సిరి. 


సంక్రాంతి పండుగ టైముకి రైళ్ళన్నీ చాలా రద్దీగా ఉంటాయి. అది తెలిసే మూడు నెలల ముందునుంచీ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అంచేతనే సిరి ఇంత ముందుగా ఆ ప్రశ్న వేసింది. 


“మూడు నెలల ముందుగానే రైలుటిక్కెట్టు రిజర్వు చేయించేస్తేగానీ స్థిమితంగా ఉండరుగా మీ నాన్నగారు. ఎప్పుడనగానో టిక్కెట్లు కొనేసారు. మీ పరీక్షలైన మర్నాడే మన ప్రయాణం. అంచేత ప్రస్తుతానికి మీరిద్దరూ పరీక్షలమీద శ్రద్ధపెట్టండి. వచ్చే ఆదివారం నాన్నగారితో బజారు వెళ్ళి కొత్త బట్టలు, కొనుక్కోవచ్చు” అనునయంగా అంది శ్యామల. ఉత్సాహంగా గంతులు వేసారు పిల్లలు. 


రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఎంతోఆతృతగా ఎదురుచూస్తున్న ప్రయాణం రోజు రానేవచ్చింది. తాతగారికి చూపించవలసిన వస్తువులన్నీ జాగ్రత్తగా సద్దుకుంది సిరి. 


సరిగ్గా 17. 45 నిముషములకు గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాదు స్టేషను నుండి బయలుదేరనున్నది. ప్ల్లాట్ ఫారమ్-1 లోకి రానున్న గోదావరి కోసం ప్రయాణీకులంతా వేచియున్నారు. అసలే పండుగ రోజులు రానున్నవి కనుక స్టేషను అంతా రద్దీగా ఉంది. దానికి తోడు ఎవరైనా ముఖ్యులో, రాజకీయనాయకులో ప్రయాణిస్తున్నారు కాబోలు, ఉన్న రద్దీకి తోడు ఆరోజు స్టేషనంతా పోలీసులతోనూ, రైల్వే సెక్యూరిటీ సింబ్బందితోనూ మరింత హడావుడిగా ఉంది. అంతలో ఒక ప్రకటన వినిపించింది. 


“దయచేసి వినండి. సెక్యూరిటీ కారణాల వల్ల ప్లాట్ ఫారమ్-1కి రావలసిన గోదావరి ఎక్సప్రెస్, ప్లాట్ ఫారమ్ నెం. 3నకు వచ్చును. టింగ్ టాంగ్” అంటూ మైకులో మూడు భాషల్లోనూ వినిపించారు రైల్వే సిబ్బంది. అప్పుడే పుట్టిన అయోమయం వల్ల ప్రయాణీకులంతా హడావుడి పడసాగారు. బరువులతో పరుగులు తీయసాగారు. 


రైలొచ్చేలోపు ప్లాట్ ఫారమ్-3 చేరడానికి ప్రయాణీకులంతాఅష్టకష్టాలు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేకే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రైళ్ళలో గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటి. అందుకనే ఎప్పుడూ గోదావరి మొదటి ప్లాట్ ఫారమ్ నుండే బయలుదేరడం పరిపాటి. కానీ ఆ నాటి ఇబ్బంది ఏమిటో తెలియదు కానీ మూడులోకి రానున్నదని చెప్పారు. 


ప్రతీ ఐదు నిముషాలకు ఒకసారి నాలుగడులు ముందుకేసి, రైలు వస్తోందేమోనని కళ్ళు చూడగలిగినంత దూరాన్ని చూసి, ఇంకా రావట్లేదని నిరాశగా మళ్ళీ అడుగులు వెనక్కి వేస్తున్నాడుసిద్ధు. పెట్టి మీద కూర్చుని చుట్టూ చూస్తోంది సిరిచందన. 


అంతలో, ఎదురుగా ఉన్న ప్లాట-ఫారమ్ పైన చిన్నగా ఆరంభమైన ఘర్షణకు అందరూ ఆకర్షితులైయ్యారు. చెన్నైఎక్స్ప్రెస్ ప్లాట్ ఫారమ్-2 నుండి కదలడానికి సిద్ధంగా ఉంది. అప్పటికే ప్రయాణీకులంతా ఎక్కేసి వారివారి సీట్లలో స్థిరపడిపోయారు. ఇంకా రైలు ఎక్కని ఒక కుటుంబంపై పడ్డాయి సిరిచందన కళ్ళు. ఆ కుటుంబ సభ్యుల మధ్యనే చిన్న వాగ్వివాదం లాంటిది జరుగుతోంది. 


యుక్త వయసు వచ్చిన ఇద్దరమ్మాయిలను బ్రతిమాలుతున్నట్టుగా ఆ సంఘటన చూస్తున్న ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. 


ప్లాట్ ఫారమ్-2 పై నిలబడి ఉన్న రాజారామ్ దంపతులు, వారిద్దరి అమ్మాయిల చేతులనూ పట్టుకుని ఆర్తిగా బతిమాలుతున్నారు. అది చూస్తే హృదయం ద్రవ్యమైపోతుంది. కానీ, అక్కడే వారి పక్కనే దృఢమైన శరీరసౌష్ఠవం కలిగి యూనీఫార్మ్ ధరించిన నలుగురువ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. చూడడానికి మాత్రం వారు రాజకీయ నాయకుల సెక్యూరిటీ గార్డులలా అనిపించారు. కానీ ఖాకీకి భిన్నంగా వారందరూ కాషాయవర్ణం కుర్తా, తెల్లటి పైజామా ధరించి ఉన్నారు. దానివల్లనే వారు రాజకీయాలకు సంబంధించిన వారు కాదని తేలిపోయింది. 


“అమ్మా, నా మాట వినమ్మా! కనీసం చదువు పూర్తి చేసిన తరువాత నీకిష్టమైన మార్గాన్ని ఎంచుకోమ్మా. ఇప్పటికి మా మాట వినండి. ఇలా అర్థాంతరంగా వెళ్ళకండమ్మా! మీ గురించి ఎన్ని కలలు కన్నామో మీకు తెలీదా? గొప్ప చదువులు చదువుకుని మీరు ఎంతో ఎత్తుకి ఎదగాలనుకున్నాము. కనీసం మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే స్థాయికి కూడా రాకుండా ఇలా చదువు కూడా వదిలేసి అర్థాంతరంగా వెళ్ళడం మీకు భావ్యమేనా? మీ నాన్నగారికి చదువంటే ఎంత మక్కువో మీకు తెలియంది కాదు. అన్నీ తెలిసి కూడా మీరు ఇలా చేయడం మీకూ మంచిది కాదు కదా?” పమిటి చెంగుతో కళ్లు ఒత్తుకుంటూ శివాని చేతులు పట్టుకుని బతిమాలుతోందిసీతాలక్ష్మి. 


“నీకు చాలా సార్లు చెప్పడమైంది. ఈ మాయలో పడిపోయిన నువ్వు, నీ జీవితంతో పాటునీ చెల్లెలి జీవితం కూడా నాశనం చేస్తున్నావు. చేతులు కాలాకా ఆకులు పట్టుకునేందుకు ఆస్కారం కూడా లేని మాయాకూపంలోకి వెళ్ళిపోతున్నారు. మీరెంచుకున్న ఈ మార్గం మిమ్మల్ని సన్మార్గంలో పెడుతుందని అనుకోవడం కేవలం అపోహ. అదలా ఉంచి, ఇదే మార్గం కావాలనుకున్నా, చదువు పూర్తి చేసాకా అందులో నడవడానికి మేమెన్నడూ అడ్డు చెప్పం. ముందు మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి కనీసం ఒక పట్టాను అందుకోవాలి కదా! తల్లిదండ్రుల కంటే మీ క్షేమం కోరేవారు వేరెవరూ ఉండరు. మా మాట వినండమ్మా” బుజ్జగిస్తూనే హెచ్చరించాడు రాజారామ్. 


“నాన్నా, మీరు నాకు హితవు చెబుతున్నాననుకుంటున్నారు. కానీ నేను అన్నీ ఆలోచించిన తరువాతే మనస్పూర్తిగా తీసుకున్న నిర్ణయం ఇది. ఇక వెనుతిరిగే ప్రసక్తే లేదు. నేనెంచుకున్న ఈ మార్గం మా ఉన్నతికే దారి తీస్తుందన్న నమ్మకం మాకుంది. మీకా నమ్మకం లేకపోతే మేం చేయగలిగింది లేదు”కాఠిన్యంగా మాట్లాడుతూ తల్లి చేతులను తన చేతుల నుండి విదిలించుకుంది శివాని. 


శివాని పక్కనే నిలబడిన భవానిలో కొంచం బెరుకు, మరికొంచం అస్థిరతాకొట్టొచ్చినట్టు కనబడుతోంది. కానీ తన తరఫున కూడా అక్కే చప్పింది కనుక, ఇక తనకు మాట్లాడడానికి ఏమీ లేదన్నట్టు నిశ్శబ్దంగా ఉండిపోయింది. యూనీఫామ్ ధరించిన ఆ నలుగురినీ పదేపదే చూస్తోంది. ఏదో నిర్భంధం ఆమెను కట్టిపడేస్తోందని ఆమె కళ్ళే చెపుతున్నాయి. ఐనా సరే, తండ్రి మాటలనుఏ మాత్రమూ పట్టించుకోవట్లేదు. గౌరవించటమూలేదు. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మద్రాసు రైలు ఎక్కేసారు. తామెంచుకున్న మార్గమంటూ ఆశ్రమవాసానికి తరలిపోయారు శివాని, భవానీలు. కదలిపోతున్న రైలుతో పాటు తమ నోముల పంటలైన పిల్లలిద్దరూ వెళ్ళిపోతుండగా ఏమీ చేయలేక ప్లాట్ ఫారమ్-2పై నిస్సహాయంగా నిలబడిపోయారు రాజారామ్ దంపతులు. 


స్టేషను నుండి బయలుదేరిన చెన్నై ఎక్స్ప్రెస్ఇంకా వేగం పుంజుకోలేదు. గంటకు పది కిలోమీటర్ల వేగంలోనే కదుల్తోంది రైలు. వేగం పుంజుకుంటున్న రైల్లోంచిసరిగ్గా అదే సమయానికి, పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ అమ్మాయిప్లాట్ ఫారమ్-2 మీదకు దూకింది. ధబాల్న పడడంతో అప్రయత్నంగా ‘అమ్మా’ అని కేకవేసింది. ఆ వేగానికి విసిరి నట్టు పడడం వల్ల ఆమె మోకాళ్ళు చెక్కుకుపోయి రక్తం చిందుతున్నా, అంత చిన్న పిల్ల ఏడవడమో బెదిరిపోవడమో చేయకుండా మరేదో ఆలోచనల ముసురులో సతమతమవుతోంది. తెలియని భయంతో కంగారు పడుతోందని ఆమె కళ్ళల్లోకి చూసిన ప్రతీవారికీ అర్థమైంది. 


“షర్మిలా, షర్మిలా”అంటూ రైల్లోంచి వినిపించస్తున్న పిలుపుకి, భయంతో ఒణికిపోతూ నలుపక్కలా బెరుకుగా చూడసాగింది ఆ అమ్మాయి. 


ఇంత చిన్న పిల్లైనా, తగిలిన గాయాలను లెక్క చేయకుండా మరేదో విషయంపై దృష్టి సారించినట్టు, ఆమెకు సహాయపడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గ్రహించారు. ఆమె ఏదో ఆపదలో ఉన్నట్టు ఆ కంగారు స్పష్టంగా తెలుపుతోంది. కదిలిపోతున్న రైలునే తీక్షణంగా చూస్తోంది. ఇంకా ఏదో వెతుకుతున్నట్టు ప్లాట్ ఫారమ్ఇరు వైపులా మరోసారి వేగంగా తిరిగాయి ఆమె కళ్ళు. ఎవరి కోసమో అన్నట్టు చురుగ్గా వెతికాయి ఆ కళ్ళు. తాను ఊహించివారెవ్వరూ లేనట్టు నిర్థారించుకుని, నిశ్చంతగా బలమైన ఊపిరి తీసుకుంది. అప్పటికే అక్కడికిచేరినజనంషర్మిల కాలికి తగిలిన గాయానికి మందు రాసి, కట్టు కట్టే ప్రయత్నంచేస్తూ సహాయపడ్డారు. 


ఆ చిన్నారి పరిస్థితి అక్కడున్న వారిలో అర్థమైన వారు ఇద్దరే. వారికే ఆ చిన్నారి ఉన్న ప్రమాదకర స్థితిని గురించి అవగాహన కలిగింది. ఆ ఇరువురూ రాజారామ్, సీతాలక్ష్మి దంపతులు. ఆమెను చూసి వారికి కొద్దిపాటి గర్వం కూడా కలిగింది. ఆమె పరిస్థితిని, తీసుకున్న నిర్ణయాన్ని ఇట్టే పసికట్టేసారు. చిన్నపిల్లైనా ఆమె తీసుకున్న నిర్ణయానికి మనసులోనే అభినందనలు తెలుపుకున్నాడు రాజారామ్. కంట తడిని ఒత్తుకుంటూ తమ పిల్లలు చేయలేని సాహసం ఆ అమ్మాయి చేసిందని ఆనందించింది శ్యామల. 


ఇంకా ప్రమాదం ఆ పిల్ల చుట్టూ పొంచి లేదు కదా అని ఆశ్వాసన చెందడానికి చుట్టూ చూసారు రాజారామ్ దంపతులు. వెళ్ళిపోతున్న రైల్లో ఆ యూనీఫారమ్ వేసుకున్న వారు కనిపించారు. మనసులోనే హమ్మయ్య అనుకున్నారు. 


కదిలిపోతున్న రైల్లోంచి ఆక్రోశంగా చూసారు యూనీఫామ్ ధరిచిన వారు. వారి ముఖాల్లో విషాదం ప్రస్ఫుటంగా కనిపించింది. షర్మిలను తీసుకెళ్ళడంలో విఫలమైనందుకే వారి ఆగ్రహం అని వారిని చూసి అర్థమైయ్యి విషయం తను ఊహించినదేనని మరొకసారి నిర్ధారించుకున్నాడు రాజారామ్. 


ప్లాట్ ఫారమ్-3 నుండి ఈ సన్నివేశాన్ని చూస్తున్న జనం, ఆ సంఘటనను చూస్తున్నంతసేపూ వారి ప్రయాణం గురించి మరచే పోయారు. అలా చూస్తున్న వారిలో సిరి చందన కూడా ఉంది. ఈ సంఘటన సిరి మనసులో బలంగా నిలిచిపోయింది. 


చిన్నారి సిరినికదిలించి వేసిన ఆ సంఘటన ఆమెమనసులో ఒక చెరగని ముద్రని వేసింది. చూడకూడనిది చూసినట్టు ఆమె మనసు వికలమైంది. జరిగినదేమిటో తెలియక పోయినా భయకంపితురాలైంది. రైల్లో వెళ్ళిపోయిన యూనీఫార్మ్ దుస్తుల్లో ఉన్న వ్యక్తుల రూపాలు ఆమె మనసులో నాటుకుపోయాయి. వారి కర్కశ రూపమే పదేపదే కళ్ళల్లో కనిపించింది. సిరి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. 


‘విశాఖపట్టణమునకు వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ మూడవ నెంబరు ప్లాట్ఫారము పై వచ్చుచున్నది’ అని వినిపించిన సూచనతో సిరి మళ్ళీ వాస్తవానికి వచ్చింది. ప్లాట్ ఫారమ్-3పై గోదావరి వచ్చి ఆగింది. సంఘటనను అంతలోనే మరచిపోయి తమతమ వాస్తవాలలోకి వచ్చిన జనమంతా తమ వస్తువులను అందుకుని కోచులలోకి ఎక్కసాగారు. 


“ఆ బెర్తు కింద నా పెట్టుందా? ఇక్కడ నా బ్యాగ్ పెట్టాను” అంటూ వారివారి సూట్ కేసులు సద్దేసుకుని సీటుల్లో సెటిలైయ్యారు. వారివారి దైనందిన జీవితాల్లోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి క్రితం జరిగినదంతా అంతలోనే మరచిపోయారు. 

*****

ఊరు పేరేదో తెలియని స్టేషనులో రైలుఆగింది. రైలు దిగిన నాన్న ఇంకా ఎక్కక పోయేసరికి, కళ్ళు కొలవగలిగినంత దూరాన్నికిటికీలోంచి చూస్తూ కొలవసాగింది సిరి. నాన్నజాడతెలియలేదు. సిరి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. 


‘అన్ని స్టేషన్లకుమల్లే, రైలు ఇక్కడ కూడారెండే నిముషాలుఆగుతుందేమో. అంతే మరి కొద్ది సేపట్లో రైలు కదిలిపోతుంది’తలచుకునే కొద్దీ సిరి భయం రెట్టింపైయ్యింది. ఎదురుకుండా ప్రశాంతంగా కూర్చున్న అమ్మ ముఖంలోకి చూసింది. అమ్మ ముఖం ఎంతో నిశ్చింతగా ప్రశాంతంగా ఉంది. అమ్మను అలా చూసినా సిరి ఆందోళన మాత్రం తగ్గలేదు. కిటికీ బయటకీలోపలికీ పదేపదే ఆదుర్దాగా చూస్తూ కలవరపడింది. అమ్మను అడిగితే విసుక్కుంటుందన్న భయం. అడగకపోతే నాన్నగారిని గురించిన ఆందోళన పెరిగిపోవడం. ఆ చిన్ని మనసు ఆ క్షణాన ఎంతగానో నలిగిపోయింది. ఇంక ఉండబట్టలేక పోయింది. 


“అమ్మా, నాన్న ఇంకా రాలేదు, రైలు కదిలిపోతుందేమో! రెండు నిమిషాలే ఆగుతుందేమో! నాన్నఎంత దూరం వెళ్లారో ఏంటో? కిటికీలోంచి చూసినంత వరకూ కనిపించట్లేదు. పోనీ, ఈ బోగీ గుమ్మం దాకా వెళ్లి చూసి రానా?” కళ్ళనీళ్ళు గిర్రున తిరగ్గా, అమ్మను అడిగింది. 


“నాన్నగారు వచ్చేస్తారు. నువ్వెక్కడికీ వెళ్ళకు. అలా గుమ్మం దగ్గర నుంచోవడం ప్రమాదకరం. రైలు కదిల్తే ప్రమాదం” అంది సుశీల. అమ్మచెప్పిన ఆ మాట, సంతృప్తికరంగా అనిపించలేదు. కంగారూ తగ్గలేదు. 


రెండు నిముషాల సమయం గడిచిపోయింది. ఆ మజిలీ ముగిసింది. బయలుదేరుతున్నానంటూ కూత కూసేసిందిరైలు. కూస్తూనే, ఛుక్-ఛుక్ అంటూ ప్రయాణం పునఃప్రారంభం అవ్వడమేంటి, వేగం కూడా వేగంగానే లంఘించుకుంది. అమ్మవంక మరోసారిబేలగా చూసింది. 


“ఎక్కడో ఎక్కేఉంటారు, వచ్చేస్తారు లే” అంతే నిశ్చింతగా వచ్చింది సమాధానం. 


నిర్మలంగా అమ్మచెప్పిన ఆ మాటసిరికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా అనిపించలేదు. రైలు వేగంతో పోటీ పడుతూ తన గుండెలూధడధడా కొట్టుకుంటున్నాయి. ఆసవ్వడి కూడా తన చెవులకి స్పష్టంగా వినిపిస్తోంది. కానీ, ఆ రెండు చప్పుళ్ళతో తమకెలాంటి సంబంధమూ లేదన్నట్టు సుశీల మాత్రం పక్కనున్న ప్రయాణీకురాలితో మాట్లాడుతోంది. నిస్సహాయంగా కూర్చుండి పోయిందిసిరి. 


సిరి పక్కనే కూర్చున్న సిద్ధు ఎంతో హాయిగా కిటికీలోంచి వెనక్కి వెళ్లిపోతున్న చెట్టూచేమల్ని, దాటిపోతున్న కొట్లనీ, అమ్మకాలు చేసుకుంటున్న వ్యాపారుల్నీ చూస్తూ దివ్యానందం పొందుతున్నాడు. సిద్ధు ఆనందాన్ని చూసిన సిరి బాధ ఇప్పుడు కోపంగా మారింది. 


‘నాన్న ఇంకారాలేదు, రైలు వేగం పుంజుకుంది, మీకసలు చీమ కుట్టినట్టైనా లేదు’ అని మనసులోనే అనుకుంటూ, ఏమీ పట్టనట్టున్న అమ్మ వైపుఇప్పుడు కొంచం కోపంగా చూసింది. అమ్మ ఏ మాత్రం చలించలేదు. చేసేది లేక నిశబ్ధంగా కూర్చుందే కానీనిశ్చింతగా మాత్రం కూర్చోలేకపోయింది. నిస్సహాయంగా అనిపించినపుడు తన మనసులో ఎప్పుడూ ఒకే మంత్రాన్ని స్మరించుకుంటుంది. 


‘శ్రీరామ రామ రామేతి, రమేరామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అంటూ మనసులోనే స్మరించుకుంది. కళ్ళూ మూసుకుని, దాన్నే మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటోంది సిరి. రోజూ రాత్రి పక్కనే పడుక్కుని బోల్టు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నాన్నగారు నేర్పిన మంత్రమది. సరిగ్గా తొమ్మిది సార్లు పఠించడం పూర్తి అవ్వకుండా వచ్చాడు సూర్యం. 


సుమారు మూడు డజన్లచుక్కలఅరటిపళ్ళు రెండుచేతులనిండా పట్టుకుని, తాపీగానడుచుకుని చెరినసూర్యాన్ని చూసిన సిరి మొహం చాటంత అయ్యింది. కొత్త ఊపిరి వచ్చినట్టైంది. తన ఆందోళనను చదవని సుశీలకు తన ఆనందం కూడా పెద్దగా తెలియలేదు. 


“హమ్మయ్య నాన్న వచ్చేసారు” కళ్ళనీటి పర్యంతమైన సిరి ఎగిరి గంతేసినంతపని చేసింది. అప్పటికి కానీ సిరి మనోభావం తెలియలేదు సుశీల సూర్యాలకి. 


తెచ్చిన అరటిపళ్ళల్లోంచి రెండు తీసి, పిల్లలిద్దరిచేతుల్లో తలా ఒక అరటిపండుపెట్టి, మిగిలిన పళ్ళను భద్రంగాఒక తెల్లటి మెత్తని గావంచాలో వదులుగా ముడివేసికట్టి విశాలమైన చేతిబుట్టలో భద్రపరిచాడు సూర్యం. 


సూర్యం వచ్చాక కుదుటపడింది సిరి మనసు. సిద్ధూతో కలిసి కిటికీ లోంచి వెనక్కి వెళ్లిపోతున్న చెట్లను చూస్తూ ఆనందించడం అప్పటి వరకూ చేయలేక పోయింది. అప్పుడే స్థిమిత పడ్డ మనసుతో వాస్తవాన్ని ఆనందించడం మొదలెట్టింది. సిద్ధూతో కబుర్లు చెప్పసాగింది. 


ఓ రాత్రివేళ కిటికీ లోంచి బయటకు చూసిన సిరికి మనసులో మరో బెంగ మొదలయ్యింది. రైలు వెనక్కి వెళ్ళిపోతోందే! సాయంకాలం ఎక్కిన సమయాన్నీ, అప్పుడు కూర్చున్న చోటునీ మరో సారి జ్ఞాపకం చేసుకుంది. 


‘నిన్న రైలు ఎక్కినప్పుడు నేను 13వ నెంబరు సీటులోనే కూర్చున్నానే!! అప్పుడు, రైలు ముందుకు వెళ్లింది. ఇప్పుడూ అక్కడే ఉన్నాను, కానీ ఇప్పుడు వెనక్కెళుతోందేంటీ??!’ 

ఎదురుకుండా బెర్తుపై పడుకున్న సిద్ధూ ఇంకా కదుల్తూనే ఉన్నాడు, మెల్లిగా దగ్గరకు వెళ్లి, “అన్నయ్యా, రైలు చూడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతోంది. నిన్న సాయంకాలం ముందుకి వెళ్ళిందిగా? ఇప్పుడు మనం ఊరు వెళ్ళమా?” అమాయకంగా అడిగింది. 


నిద్రకళ్ళను నులుముకుంటూ ముందు కాస్త చిరాకు పడ్డా, సిరి కళ్ళల్లో బెంగని చూసిన సిద్ధుకి నవ్వొచ్చింది. 


“అయ్యో పిచ్చి మొద్దూ, మనం పిఠాపురంలో దిగి అక్కడి నుంచి జగపతిరాజపురమే వెళుతున్నాము. విజయవాడలో రైలు ఇంజను మారుస్తారు, అప్పుడు రివర్సులో వెళుతున్నట్టు అనిపిస్తుంది అంతే” ఎప్పుడో ఒకసారి నాన్న చెప్పినది గుర్తుంచుకుని చెప్పాడు సిద్ధు, మహా జ్ఞానిలా. 


ఆ సమాధానం నమ్మశక్యంగా లేకపోయినా, చేసేది లేక, నమ్మక తప్పలేదు సిరికి. నమ్మడం వల్ల తాతగారి దగ్గరకు వెళ్ళడం ఖాయం కనుక పెద్ద బెంగ తీరినట్టయ్యింది. 


సామర్లకోట జంక్షన్ దాటగానే, సామాన్లను కోచ్ తలపు వద్దకు చేరేశాడు సూర్యం. అందరూ తలుపు వద్దకు సిద్ధంగా ఉన్నారు. రైలు రివ్వున సాగిపోతోంది. గొల్లప్రోలు లెవెల్-క్రాసింగ్-గేట్ దాటే సరికి, పిఠాపురం పొలిమేరకు చేరింది రైలు అన్న సంకేతం అన్నమాట. రైలు ఆగుతూనే దిగేందుకు సంసిద్ధంగా వున్నారు. 


స్నేహితులకు చెప్పడం కోసం సిరి ప్రతీ విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. తన మనసులోనే ముద్రించుకుంటోంది. సమయం చూసుకుని డైరీలో కూడా వ్రాస్తోంది. 


“రైలు ఆగీ ఆగడంతో, ముందస్తుగా రైలు దిగాడు సూర్యం. ఆ తరువాత ముందుగా పిల్లల్ని దింపి, శ్యామల అందించగా ఒకొక్క సామాను గబగబా దింపాడు. శ్యామల చెయ్యి అందుకుని ఆమెనూ దింపి, చివరగా అరటిపళ్ళు ఉంచిన బుట్టను దింపారు. ఒక్క నిముషంలో అన్నీ పూర్తి అయి పోయాయి. క్రితం సంవత్సరం ప్రయాణం చేసినప్పుడు చివరి కంపార్టుమెంటు అవ్వడం వల్ల ఆ ఊరి ప్లాట్ ఫారము చిన్నది అవ్వడంతో, బాగా ఎత్తు నుంచి ఉరికి దిగాల్సి వచ్చింది. అందుకేనేమో ఈ సారి సూర్యం అట్టి పరిస్థితిని ఎదుర్కోవడానికి పెట్టెలు ముందు దింపి, వాటి మీదకు అందరినీ దింపడానికి సిద్ధపడ్డాడు. కానీ అట్టి అవసరం రాలేదు. ఇవన్నీ చూసిన సిరి అన్నీ డైరీలోకి ఎక్కించడానికి అన్నిటినీ బుర్రలో పెట్టుకుంటోంది. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కధలకు, బహుమతులు పొందాను.



115 views2 comments

2 Comments



@user-mo4ye7vd9z

• 13 hours ago

Asalu vintu unte inka yemi cheyalani pinchatledu. Next yenti ani chala excited ga undi. Keep it kameswari. Great going, very proud of u talli

Like

Vijaya Bhanu Machiraju •13 hours ago

Wow! Chala bagundhi. Poorna keep it up 👍❤

Like
bottom of page