'Jeevana Chadarangam - Episode 16' - New Telugu Web Series Written By
Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 29/03/2024
'జీవన చదరంగం - ఎపిసోడ్ 16' తెలుగు ధారావాహిక
రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది.
పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది.
ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది.
వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి.
బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు.
మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది.
రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి. పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి.
మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ.
మైత్రి నెల తప్పుతుంది. ఇంటినుండి పారిపోయి రాఘవను పెళ్లి చేసుకుంటుంది.
మైత్రి తనను దూరం పెట్టిందని రాధతో చెప్పి బాధ పడుతుంది సిరి.
డబ్బు అవసరమని మైత్రి నగలు తీసుకుంటాడు రాఘవ.
అతని తండ్రి రాజాను పోలీసులు అరెస్ట్ చేస్తారు.
మైత్రి పుట్టింటికి చేరుతుంది.
రాఘవ కూడా వచ్చేస్తాడు.
కానీ ఏ ఉద్యోగం కుదురుగా చెయ్యడు.
ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 16 చదవండి.
“మైత్రీ, నువ్వు మనసు విప్పి బాధనంతా బయటకు చెప్పావు. అక్కడితోనే సమస్య పరిష్కారానికి నాంది పలికావు. కొత్త జీవిత పయనానికి అడుగులెయ్యడం మొదలెట్టావు. ఇక మీద నిన్ను నువ్వు నిందించుకోవడం మానెయ్యాలి. అపరాధ భావాన్ని వదిలెయ్యాలి. తప్పు చెయ్యడం మానవ సహజం, అది దిద్దుకోవాలని అనిపించడమే ఒక గొప్ప ప్రారంభం. దానికి ఎంతో ధైర్యం కావాలి. అది నీకుంది. గతం గతః! ఇకపై జరగాల్సినదాని మీద దృష్టి సారించాలి.
అన్నిటికంటే ముందు నీ మనసులోంచి ఆ ఆత్మన్యూనతా భావాన్ని తొలగించాలి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. శారీరికంగా చాలా బలహీనంగా ఉన్నావు. ఇలా ఉంటే నువ్వు బాబుకి బలాన్ని ఎలా ఇవ్వగలవు. అందుకే చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ముందు శారీరికంగా పుంజుకోవాలి. మానసికంగా తనని సరిచేయడం తన చేతిలో ఉన్నపనే కనుక ముందు ఆరోగ్యంగా ఉంటే కానీ ఏది సాధించడం కుదరదని నొక్కి వక్కాణించింది. ఒక్క నెలలో మళ్ళీ మునపటి మైత్రి గా నిన్ను చూడాలి” అంటూ ధైర్యం చెప్పింది.
“అత్తయ్యా, అసలే మైత్రి తప్పు చేశాను అని కుమిలిపోతోంది. దానికిప్పుడు మనందరి ఆత్మీయత, అభిమానాలతో పాటు క్షమించామన్న హామీ కూడా కావాలి. జరిగినదానికంతటికీ అదొక్కత్తే బాధ్యురాలన్న భావన మనెవ్వరికీ ఉండకూడదు, వ్యక్తపరచకూడదు. దాని మనసులోంచి కూడా అది తుడిచెయ్యాలి. నిజం కూడా అదే. మానసిక శాస్త్రం క్షుణ్ణంగా చదివితే అదే తెలుస్తుంది. లోకంలో ప్రతి వ్యక్తీ తను వ్యవహరించే తీరుకి ఒక నేపథ్యం ఉంటుంది. ఎంతటి చట్టవిరుద్ధమైన నేరాలు చేసిన వారికైనా ఇది వర్తిస్తుంది. ఆ వ్యక్తి చర్య వెనుకఅనేక కారణాలుంటాయి. కుటుంబం, సమాజం, మానసికత, పరిసరాల ప్రభావం తప్పక ఉంటుంది. తప్పు జరిగేసరికి మిగిలినవన్నీ పట్టించుకోకుండా, ఒక్క వ్యక్తిని మాత్రమే నిందించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. సగటు మనషి వల్ల తప్పు జరిగితే అది తన ఒక్కడిదేననుకోవడం, నిందించడం పొరపాటు. సమాజానికి అందులో తప్పక భాగం ఉంటుంది. సమాజంలోభాగంగా మనమందరమూ అందుకు బాధ్యత తీసుకోవలసిన అవసరం తప్పక ఉంది. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని, మనసులో కూడా దాన్ని తప్పుచేసిన వ్యక్తిగా చూడకుండా ఉండడం ప్రయత్నపూర్వకంగా పాటించాలి. మీ నుంచి ఇదొక్కటే నా కోరిక” క్షుణ్ణంగా చదివిన మైత్రి మానసికతను, తన ప్రయత్నంలో కావలసిన సహకారాన్ని సవినయంగా చెపుతూ అత్తయ్యను అభ్యర్థించింది సిరి.
“సరే, ఆమె జీవితంలో జరిగినదేదో జరిగిపోయింది. జరిగినదానికి ఇప్పుడు మనమెవ్వరమూ ఏమి చేయలేము. కానీ జరగనున్నదాని గురించి మనమందరమూ కలిసి ఆలోచించి మైత్రికి సహకరించగలం. ఇక మీద జీవితమెలా ఉండాలో దానిమీద దృష్టి కేంద్రీకరించి ఆ త్రోవలో మైత్రిని నడిపించడానికి ప్రయత్నిస్తే, కొద్దికాలంలోనే అది ఎంతో గొప్ప స్థితికి వెళుతుందన్న నమ్మకం నాకుంది”తన నమ్మకంతో అత్తయ్యకూ ఆత్మస్థైర్యాన్ని రంగరించింది. సహజంగా ధైర్యస్థురాలైన అత్తయ్య మైత్రి విషయంలో బలహీనురాలవ్వుకూడదని, తమ ఎదుట ప్రశ్నార్థకంగా ఉన్న వాటన్నిటికీ అనతికాలంలోనే సమాధానాలు దొరుకుతాయని రాధకు చెప్పకనే చెప్పింది సిరిచందన.
******
రాజారామ్ చేస్తున్న పోరాటం వల్ల పోలీసులపై ఒత్తిడి పెరిగింది. షర్మిల నిలదీసిన విషయాలకు సమాధానంలేని చిక్కుప్రశ్నలు వారికెదురైయ్యాయి. ఎప్పుడో మూసేసిన శ్యామల మరణం కేసును తిరగతోడ వలసిన నిర్బంధం వారిపై ఏర్పడింది.
“సీబీసీఐడీకి బదిలీ చేయడమేకాక, మన డిపార్టుమెంటుని దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకు కారణమూ లేకపోలేదు. వీ హావ్ డెల్ట్ ది కేస్ సో షాబీలీ” కొత్తగా చార్జి తీసుకున్న ఏసీపీ ఆగ్రహంగా అన్నాడు.
“శ్యామల కేసు ఈస్ ఎ లీడ్ టూ మహర్షి కేస్. కోర్ట్ రిట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఎనీ మోమెంట్” ఇప్పుడు స్వరంలో ఆందోళన కనిపించింది.
శ్మామల కేసు ఒక కొలిక్కి వస్తేకానీ మహర్షికై కోర్టు విషయమై జారీ చేసిన హబియస్ కార్పస్ రిట్ లోంచి బయటపడే అవకాశం కోల్పోయారు పోలీసులు. మహర్షి చావుకు ఏకైక సాక్షి శ్యామల. ఆశ్రమంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాడనితప్పుడు కేసు బనాయించి బాధ పెట్టారు మహర్షిని. ఆ తరువాత మాయమైన మహర్షికోసం హైకోర్టు వేసిన రిట్ అది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 మరియు 226 ఆధారంగా పైకోర్టు హబియస్ కార్పస్ రిట్ జారీ చేసింది. సరిగ్గా పదిహేను రోజులలో మహర్షినో లేక అతడి మృతదేహాన్నో కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. పోలీసులకు మహర్షి కేసు కంఠకమైంది. మహర్షి కేసు ఒత్తిడిలో తమపై వచ్చిన నిందను మాపుకోవడానికి ఎప్పుడో మూసిన శ్యామల హత్యకేసుని పునఃప్రారంభించారు పోలీసులు.
రాజాపై ఉన్న నకిలీ నోట్ల కాగితాల సరఫరా కేసు ఉంది. ఇప్పుడు హబియస్ కార్పస్ వల్ల వ్యవధి అతి తక్కువ. పోలీసులు తీగ లాగితే డొంక కదుల్తుంది. శ్యామల హత్య జరిగిన కారణాలను పరిశీలించి ఆ దిశగా అవ్వేషణ మొదలుపెట్టారు. షర్మిల ద్వారా ఆశ్రమం గురించిన ప్రతి విషయాన్నీ సేకరించారు. మహర్షిని చంపవలసిన అగత్యం ఆశ్రమానికి తప్ప మరెవ్వరికీ లేదని తన అనుమానాన్ని చెప్పింది షర్మిల. తన తల్లి అర్థాంతరంగా చంపబడిందని, ఈ విషయంలో కూడా ఆశ్రమ హస్తం ఉండవచ్చుననన తన అనుమానాన్ని పోలీసులకి చెప్పింది.
“ఏళ్ళ క్రితం రాజా గారి ఇంట పనికి చేరింది అమ్మ. నాన్న లేని నన్ను చదివించుకునేందుకు ఒంటరిగా పట్నం వచ్చింది. తాతయ్యకు కూడా దూరమైయ్యింది. ఇంటి పనికి వచ్చిన అమ్మను ఆశ్రమ పనులకు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు రాజాగారు. భోజనం పెట్టే వారి వద్ద ఆంక్షలు పెట్టకూడదని దానికీ ఒప్పుకుని చేసేది. ఒక సారి అమ్మ దగ్గరకు సెలవులకు వచ్చాను. అప్పుడు ఆశ్రమంలో వింతైన విషయాలు నా కంట పడ్డాయి. చిన్నతనం వల్ల వాటిని తెలుసు”, అనతికాలంలోనే శ్యామల హత్యకు కారణం రాజా, ఫణిభూషణ్ అని నిరూపించారు.
ప్రాణంతోనో లేక మృతదేహాన్నో నిర్దేశించిన సమయంలోపు కోర్టుకు చూపవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. అంచేత మహర్షిని గురించన వివరాలకై పోలీసులు ఆశ్రమాన్ని సంప్రదించారు. ఇంతలో రాజాకూ మహర్షికి జరిగిన ఘర్షణ వివరాలు. విషజంతువులతో చిన్నారులను బాధిస్తున్న ఆశ్రమ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం జరిగింది. ఇందులో ఆడపిల్లల లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని వెలికి వచ్చింది. పోక్సో చట్టం పరిధిలో కూడా కేసు నమోదు కానున్నది.
రాజా జీవితం విప్పలేని చిక్కు ప్రశ్నలవలయంగా మారింది. ఆ ఇంట పడిన మైత్రి జీవితం మరింత ప్రశ్నార్థకంగామారింది. రాఘవ మారతాడా అన్న ప్రశ్నతో మైత్రి, తన కాళ్ళమ్మీద తను నిలబడే ప్రయత్నం ప్రారంభించింది.
*******
“మ.. మ్మ.. త. త. ” అంటూ ముద్దుగా అంటూ మాటలు పలికే ప్రయత్నం చేస్తున కొడుకుని చూసి ఆనందం కలిగినా దాన్ని సంపూర్ణంగా అనుభవించలేని స్థితిలో ఉంది మైత్రి.
ఎదుగుతున్న కొడుకుని చూసి మురిసేటట్టు లేదు తన సంసార జీవితం. చిక్కుల వలయంలో విప్పలేని ముడుల నడుమ నలిగిపోతోంది మైత్రి.
“అమ్మ.. ” అని మొదటి సారి అన్న ఆ పలుకులను విన్ని ఆనందంతో ఉప్పొంగిపోయింది. మరుక్షణమే వాడిని ఎలా పెంచుతానోనన్న ప్రశ్న తనను దహించేస్తోంది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మైత్రికి తన కాళ్ళపై తాను నిలబడాలన్న ఆవశ్యకత కనిపించ సాగింది. ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోవడానికి డిగ్రీ ఐనా పూర్తి చేయలేదు. నాడు అమ్మ చెప్పిన మాటలు పదేపదే గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. అక్కడ మామగారు జైలుపాలైయ్యారు. తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించి రాఘవ స్థిరపడతాడా అంటే ఆ ఆశ కూడా అడియాశే అయ్యింది. నిజాయితీగా నాలుగు రాళ్ళు సంపాదించి భార్యా పిల్లలను పోషించుకోవాలన్న ఆలోచన కంటే ఎక్కువ కష్టపడకుండా కోట్లు సంపాదించే మార్గాన్నే ఎంచుకునే తత్వం రాఘవది. రాజా పెరిగిన వాతావరణం అలాంటిది. కానీ మైత్రి పెరిగిన ఇప్పుడుంటున్న ఇల్లు అలా కాదు. ఇది అనురాగ నిలయం.
“ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంత తేడా? ఆ ఇంట గొప్పగా కనిపించినవన్నీ ఈ ఇంట అందంగా కనిపిస్తున్నాయి. ఆ ఇంట ఆడబరాలు ఎక్కువ ఈ ఇంట అప్యాయతలు ఎక్కువ. ఆకాశానికి నిచ్చెన వేసి నేలపై కాలు మోపలేక పాతాళంలోకి పడిపోయాను కదా!” మథన పడిపోయింది మైత్రి.
****
అతి సామాన్యమైన చిన్నఇల్లు. పొట్ట చేతపట్టి మహానగరం చేరిన ప్రతీ హైద్రాబాదు వాసికీ అలాంటి స్వంతఇల్లును అమర్చుకోవాలన్న కోరిక కలుగుతుంది. ప్రతీ మధ్యతరగతి ఉద్యోగికీ అదే పెద్ద లక్ష్యం. అలా ఒక చిన్న పొదరిల్లు కట్టుకుని నిలబెట్టుకోవడంజీవితానికే గొప్ప సాఫల్యంగా భావిస్తారు. నెల జీతాలమీద ఆధారపడిబ్రతికే మధ్యతరగతి వారంతా పొదుపు చేసుకుంటూ కొంత డబ్బు కూడబెట్టిన తరువాతి ఇంటికోసంమై స్థలం కొని దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఇంటి లోను తీసుకుని ఒక గూటిని ఏర్పరచుకునేవారు. అలా చేయగలిగితే అదో ఘనకార్యమని చెప్పినా అతిశయోక్తి కాదు.
గేటు నుంచి వీధి గుమ్మం వరకూ పదడుగుల దూరం ఉంది. ఆ చిన్ని పూలతోటప్రాంగణంలోని పరిసరాలన్నిటినీ పరికించి చూస్తున్నాడు సౌరవ్. వరండాలోని ప్రతీ వస్తువునీ పరిశీలిస్తూ ఏదో క్లూ కోసం వెతుకుతున్నట్టు చూస్తున్నాడు సౌరవ్. పోలీసుల సహజ లక్షణమదే కాబోలు అనిపించేలా ఉంది అతడి ధోరణి. ఇంట్లోకి వెళ్ళకుండానే ఇంటి గుట్టంతా పట్టేసినట్టు పక్కనే ఉన్న అనుచరుడు డైరీలో గబగబా రాసుకుంటున్నాడు.
కాలింగ్ బెల్ కు తలుపు తెరచిన ప్రసాదుతో, "ఐ అం ఫ్రొం సీబీసీఐడీ, రాఘవకోసం వచ్చాము", అంటూ తమ ఐ. డి. కార్డు చూపుతూ అన్నాడు సౌరవ్. పక్కనే ఎంతో ఎలర్టుగా నిలబడున్నాడు కార్తీక్. సౌరవ్ కనుసైగలకు వెంటనే ఆచరిస్తున్న అతన్ని చూస్తే అతడిఅనుచరుడిగా ఇట్టే అర్థమవుతుంది.
అసలు ఏమీ అర్ధం కానట్టు అరనిముషమైనాషాక్ నుంచి తేరుకోని ప్రసాదు చూస్తూ నిలబడిపోయుండగా, ముందుగా షొక్లోంచి తేరుకున్న రాధ వెనుక నుంచి "ఎనీ థింగ్ సీరియస్?" అంటూ మాటను సగం మింగేస్తూ ప్రశ్నర్ధకంగా అడిగింది.
“వెల్, సర్టన్ల్యీ మేడం. కరెన్సీ నోట్ల లావాదేవీల కేసులోరాఘవని అనుమానిస్తున్నాము. ప్రాధమిక దర్యాప్తులో కొన్ని విషయాలు వెలువడ్డాయి, ఇప్పుడు పూర్తి దర్యాప్తు, అదే ఇంటర్రోగేషనుకు తీసుకుని వెళుతున్నాము” నిఖ్కచ్చిగా చెప్పేసాడు ఇన్స్పెక్టర్ సౌరవ్.
ప్రాంతీయ పోలీసుల చేయిదాటి సీబీసీఐడీ వరకూ కేసు వెళ్ళిదంటేనే అందులో ఎదో చాలా లోతైన సంగతే వుంటుందని సమయస్పూర్తి గల రాధ అంచనా వేయగలిగింది. అంతే, విషయంలోని తీవ్రతను గ్రహించి నిర్ఘాంతపోయింది. నిశ్చేష్టురాలై నిలిచింది.
“ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసామో! మైత్రి రాఘవ జీవితాలను సవ్యమైన బాటలో నిలబెట్టాలని, కాపురాన్ని చక్కదిద్దాలని ఎంత ప్రయత్నించామో!మానవ ప్రయత్నం ఎంత చేసినా, అనేక దారులు చూపుతూ శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయిందే?బూడిదలో పోసిన పన్నీరైనట్టు, చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి” నిట్టూర్చించింది రాధ.
“గుర్రాన్ని నీటివరకు తీసుకెళ్లగలమే కానీ, బలవంతంగా నీరు తాగించలేముకదా అన్నట్టు, మంచి మార్గంలో నీతీ-నిజాయితీలతోసగర్వంగా తలెత్తుకు తిరిగేటట్టు ఆ కుటుంబాన్ని నిలబెట్టాలన్న ప్రయత్నం చేయగలమే కానీ ఫలితాన్ని ఆశించలేముగా. వారొక పది రూపాయలు సంపాదించుకుంటే మనమో పది రూపాయలు సహాయంచేస్తూ నలుగురిలో నవ్వులపాలవ్వకుండా సమాజంలో తలెత్తుకు బ్రతికేలా చేయాలని ఎంతగానో అనుకున్నాము. ఎన్నో విధాల ప్రయత్నించాము. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మనమెంత అనుకున్నా, దైవ లిఖిత రాతను మార్చగలమా, విధి శాసనాన్ని ఆపగలమా?”ప్రసాదుతో చెప్పుకుని బాధ పడింది.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిఅన్నట్టు, మైత్రి జీవితానికై చక్కటి బాటలెన్ని వేసినా చివరకు దానికి దక్కినది ఇక్కట్ల బ్రతుకే. ఎన్నో ఆశలు పెట్టుకుని చిన్నప్పటినుంచి ఎంతో గారంగా పెంచాము, చివరికి విధిలిఖితానికే తలఒగ్గాలి. విధిరాతకుఅందరమూ తలవంచాల్సిందే అన్నది మరోసారి రుజువైంది. మనసుని గట్టి చేసుకునేందుకు ప్రయత్నించింది. కర్తవ్యం పైకి ధ్యాస మళ్లించింది. ఒంటరిగా తన జీవితాన్ని సక్రమ మార్గంలో నడుపుకోవడానికి మైత్రికి తగిన దారి చూపడం తప్ప ఇప్పుడు చేయగలిగింది లేదనుకుంది రాధ.
సౌరవ్ చెప్పగానే మారు మాట్లాడకుండాఅతని వెంట నడచివెళుతున్న రాఘవను చూస్తూనే అందరికీకొంతవరకూ విషయం అర్ధమయ్యింది. అక్కడ జరుగుతున్నది అర్ధంకానిదల్లా, మైత్రి చంకనున్న ఆ చిన్నారి అభిరామ్ కి మాత్రమే. ఆరు నెలల పసికందు అభిరామ్ కి తన తండ్రిని ఎవరు ఎందుకు ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలిసే వయసుకాదు. ముద్దుముద్దు పలుకులతో చుట్టూ చూస్తున్న అభిని చూస్తూ గుండె మరింత భారమైయ్యింది అందరికీ. రక్షణకు అమ్మ మైత్రి, అమ్మమ్మమ, తాత ఉన్నారు. అయినవారంతా చుట్టూ ఉన్నారు. అభి తండ్రి లాలన గురించి ఆరాటపడడు ఇప్పట్లో తండ్రి లేని లోటు కూడా తెలియదు. ఇంత చిన్నవయసులోనే తండ్రి నీడ కరువవ్వడం దురదృష్టకరమని చూస్తున్న సౌరవ్ కూడా అనుకున్నాడు. అతని మనసు కదిలింది.
మైత్రి అచేతనంగా ఉండిపోయింది. ఇంక కంటతడి కూడా ఇంకిపోయినట్టు కన్నీరు కూడా రావట్లేదు.
“కడుపున పుట్టనిపురిటి గుడ్డును అక్కున చేర్చుకుని, సర్వస్వమూ ధారపోసి క్షీరముగా చేసి పెంచి లాలించినా, ఆరోగ్య సమస్యలతో పోరాడి ప్రాణాపాయ స్ధితులనుంచి కాపాడి పాలించినా, తనవేలితో తనకంటినే పొడుచుకుంటున్నప్పుడుఆ చిన్నారిని కాపాడలేని దౌర్బల్యస్థితిలో ఉండడమే విధి విలాసము కాబోలు. విధి ఎంత బలీయమైనదో!!” మైత్రిని చూస్తూ అనుకుంది రాధ.
ప్రశ్నార్ధకంగా మారిన నేటి మైత్రి జీవితాన్ని చూస్తూ, పసికందుగా తన వడిలోఎంతో నిశ్చింతగా పెరిగిన ఆనాటి మైత్రిని జ్ఞాపకం తెచ్చుకుంది రాధ. తన ఒడిలోకి మైత్రి చేరిన మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకుంది. విషాదభరితమైన ఈ రోజు ఆనాటి గత-స్మృతులను పునర్దశింప చేస్తోంది.
జీవితం ఎప్పుడూ మనకి కావలసినట్టు ఉండదు. ఎప్పుడూ రాధకు అలా జరుగలేదు కూడా. కానీ ఇంతటి పరీక్షలకు గురిచేస్తుందని కూడా ఊహించలేదు రాధ. తనకున్న ధైర్యానికి మరింత పరీక్ష పెడుతున్న విధిని నిందించలేదు. ఎలా నడిపిస్తే అలా నడవవలసిందే అనుకుంది.
******
“కాంగ్రజులేషన్స్, సిరిచందన. నేరస్తుల మనస్తత్వం, నేర ప్రవృత్తి పై నువ్వు పంపించిన పేపర్ ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించాడనికి సెలెక్ట్ అయ్యిందని యూనివర్సిటీ నుంచి మెసేజ్ వచ్చింది. వి అర్ ప్రౌడ్ అఫ్ యు మై గర్ల్” అభినందించారు ప్రిన్సిపాల్ గారు.
“అరియర్ పేపర్లు ఉంచుకుని ఎలా క్లియర్ చెయ్యాలా అని సతమత మవుతున్న మూడొంతుల విద్యార్థుల మధ్యన, గ్రాడ్యుయేషన్ లెవెల్ లో పేపర్ పబ్లిష్ చేయడంకోసం నువ్వు చేసిన కృషి చాలాఅభినందనీయం. హర్షనీయమే కాక ఉదాహరణ ప్రాయమైనది కూడా. నీకు మున్ముందు ఫండ్స్ లో సపోర్ట్ చెయ్యడానికి కూడా రికమెండ్ చేస్తున్నాను. కీప్ ఇట్ అప్” అన్నారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.
Comments