'Jeevana Chadarangam - Episode 18' - New Telugu Web Series Written By
Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 07/04/2024
'జీవన చదరంగం - ఎపిసోడ్ 18' తెలుగు ధారావాహిక చివరి భాగం
రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది.
పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది.
ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది.
వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి.
బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు.
మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది.
రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి. పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి.
మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ. మైత్రి నెల తప్పుతుంది. ఇంటినుండి పారిపోయి రాఘవను పెళ్లి చేసుకుంటుంది. మైత్రి తనను దూరం పెట్టిందని రాధతో చెప్పి బాధ పడుతుంది సిరి. డబ్బు అవసరమని మైత్రి నగలు తీసుకుంటాడు రాఘవ. అతని తండ్రి రాజాను పోలీసులు అరెస్ట్ చేస్తారు.
మైత్రి పుట్టింటికి చేరుతుంది. రాఘవ కూడా వచ్చేస్తాడు.
కానీ ఏ ఉద్యోగం కుదురుగా చెయ్యడు. శ్యామల కేసు రీ ఓపెన్ అవుతుంది. రాజా, రాఘవ చిక్కుల్లో పడతారు. ఆశ్రమం అక్రమాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తాయి.
ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 18 (చివరి భాగం) చదవండి.
పోలీస్ ట్రైనింగ్ అకాడమీ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన IPS ఆఫీసరు కార్తీక్, ASP గా చార్జి తీసుకున్నారు. వారి కంట్రోల్ లోకి వచ్చే 8 స్టేషన్లలో ఆ స్టేషనూ ఉంది. కేసు దర్యాప్తుకు రాజేశ్వరిగారు ప్రతి రోజూ స్వయంగా సందర్శిస్తున్న స్టేషన్ అది. ఆవిడకే రిపోర్ట్ చేసి, డ్యూటీలో జాయిను అయ్యాడు కార్తీక్. కార్తీక్ కు ఈ కేసును అప్పచెప్పారు. డ్యూటీ లో చేరుతూనే ఇంతటి కీలకమైన కేసు ఉండడంతో రేయింబవళ్లు ఫైళ్లన్నీ జాగ్రత్తగా పరిశీలించి దర్యాప్తుకు కావలసినవన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు.
కనకరాజ్ తో సహా పది మందపన్న ఆ గ్యాంగ్ లో, అనేక మంది ఆడ పిల్లల్ని మాయమాటలతో మభ్యపెట్టి వారి అశ్లీల ఫోటోలను పంపమని ప్రలోభపెట్టి, ఆ తరువాత వారిని బెదిరించడం, డబ్బు లాగడం ఒక రాకెట్ గా జరుగుతోంది. డబ్బును ఊరవతల చేర్చడానికి మాత్రమే కరీమును వాడుకుంటారు. ఐతే, మరింత పెద్ద స్థాయిలో జరుగుతున్న స్టాంప్ పేపర్ల కేసుకీ దీనికి సంబంధం ఉన్నదన్న అతి కీలకమైన విషయాన్నీ తేల్చారు ASP కార్తీక్. ఆ స్టాంప్ పేపర్ల లావాదేవీలలో పెద్ద-పెద్ద రాజకీయనేతల హస్తాలుండడంవల్ల, వ్యసనాలకు బానిసలైన ఈ చిన్న ముఠాను ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ వెనుక ఆ లావాదేవీలు జరుపుతున్నట్టు తేలింది. ఈ స్కెట్చ్ అంతటికి నాయకత్వం వహిస్తున్నది తెలంగాణకు చెందిన బలరామ్ గా క్లూ అందింది.
హంస ట్రావెల్స్ మానేజింగ్ డైరెక్టర్ బలరామ్ కనీసం 50 SUV వాహనాలు పెట్టుకుని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలతో డైలీ పిక్-అప్ డ్రాప్ ల ఒప్పందాలతో బిజినెస్ చేస్తున్నాడు. ఐతే, అది పైకి చెప్పుకునే వ్యాపారం. ట్రావెల్స్ పేరుతో, అక్రమంగా నల్లధనాన్ని మరియు స్టాంప్ పేపర్లను అంతర్రాష్ట్రాల మధ్య రవాణా చేస్తూ ఉండడం వారి అసలు వ్యాపారం. ప్రభుత్వంలో కీలక మంత్రివర్గం మద్దతు ఉన్న ఆశ్రమం ఈ కుట్రలన్నిటికీ కేంద్రంగా వ్యవహరిస్తోంది.
చెన్నై నుండి ధనాన్ని బెంగుళూరు ఆశ్రమం వరకూ చేర్చడం కరీము బాధ్యతైతే, హైదరాబాదు బెంగుళూర్ల మధ్య లావాదేవీలన్నీ రాజా, భూషణం చూసుకునేవారు.
చెన్నై నుండి కార్తీకు స్పెషల్ ఆఫీసరుగా మూడు రాష్ట్రాలలో దర్యాప్తులు జరిపి కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించాడు.
******
నాలుగు దక్షిణ రాష్ట్రాలలోను కేసుకు సబంధించిన స్థావరాలుండడంతో ఈ కేసుపై విపరీతమైన విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. రాజకీయ నాయకుల హస్తం ఉందని వచ్చిన వార్తల కారణంగా కేసుని సిబిఐ వారికి అప్పగించడం జరిగింది. మూడు రాష్ట్రాల పోలీసులకూ సమన్వయము కుదరక కేసుని నియమిత సమయంలో ట్రాక్ చేయలేరన్న అనుమానంతో CBI చేతుల్లోకి వెళ్ళింది. సిబిఐ ఆఫీసర్ సౌరవ్, యంగ్ కార్తీకును తన టీంలోకి తీసుకున్నాడు. అతని సహకారం వారికి ఎంతో ఉపయోగపడుతుందనే ఆ నిర్ణయం తీసుకున్నాడు సౌరవ్. కీలకమైన అంశాలను తన మొట్టమొదటి కేసులోనే పట్టిన కార్తీక్ అందరి మన్ననల నందుకున్నాడు. కార్తీక్ తమ టీంకు ఒక అసెట్ అవుతాడని నమ్మాడు సౌరవ్.
హైదరాబాద్ రెజిస్ట్రేషన్లతో ఉన్న ట్రావెల్స్ జైలో వాహనాలలో, చెన్నైలోని ఒక ముఠాతో కూడి బెంగళూరులోని ప్రింటింగ్ ప్రెస్ లోని నకిలీ స్టాంప్ పేపర్లను తమ డీలర్లయిన కంపెనీకి అందచేసినట్టు వచ్చిన వార్త వెంబడించి వెళ్లారు కార్తీక్ టీము. ఇలా మూడు రాష్ట్రాల నడుమా తిరుగుతూ రెండుమూడు కేసులను పెనవేసుకున్నందు వలన యీ కేసు కూపీ లాగడం కష్టమయ్యింది. ప్రతీ దర్యాప్తూ తప్పుత్రోవే పట్టింది.
బలరామ్ తో చేతులు కలిపి తను పని చేస్తున్న చిన్న కంపెనీ ట్రావెల్స్ కారును హంస ట్రావెల్స్ బండ్లలోని వాటిగా చూపించి నల్ల ధనాన్ని స్టాంప్-పేపర్లను బెంగళూరునుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ఉపయోగించడాన్ని సాక్ష్యాలతో పసిగట్టారు. ఈ క్రైం లో ముఖ్య పాత్రను పోషించినది రాఘవ అని తేలింది.
బెంగ్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి, ఇక్కడ ఉద్యోగం నెపంతో చేరిన ట్రావెల్స్ కారును ఆసరాగా చేసుకుని తన పాత వ్యాపారంలో అండర్గ్రౌండ్ పనులు చేస్తూ లావాదేవీలు కొనసాగిస్తున్నాడు. డైరెక్టర్లు అందరు అరెస్టులో ఉన్నందున ఆ కోణంలో మరెవ్వరు చెయ్యడానికి ఆస్కారం లేదనుకున్నారు పోలీసులు.
ఊరు మార్చి కార్యకలాపాలన్నింటినీ బంకర్నుంచే కొనసాగించాడు రాఘవ. అసలు పోలీసులకు చిక్కకుండా ఉండడానికి మరొక కేసుకు సంబంధఇంచిన కరీమును మాత్రం తన పనులకు కొంత వరకూ ఉపయోగించు కున్నాడు.
సిబిఐ క్రైమ్ బ్రాంచ్ టీం హెడ్ సౌరవ్ తో సహా, కేసుని దర్యాప్తు చేసి అసలైన నిందితుడిని పసికట్టిన కార్తీక్ ను అభినందించారు సిబిఐ డైరెక్టర్ గారు. రికార్డు సమయంలో ఛేదించిన ఈ కేసు సిబిఐ చరిత్రలోనే ఒక మైలు రాయి అవుతుందని కొనియాడారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా మీడియా అంతా యీ సంచలనమైన కేసు తేలిన తీరును మెచ్చుకున్నారు.
ఇంతటి కీర్తి తన ఉద్యోగ ధర్మం నెరవేరుస్తున్న మొదట్లోనే లభించినందుకు ఆనందంగా ఉన్నా అంతకంటే ఎక్కువ బాధే కలిగింది కార్తీక్ కి. కారణం, తాను గెలిచినది ఆన్నయ్య రాఘవ కేసుపై. కారణాలేమైనా సరే, రాఘవ గురించి ఆలోచిస్తూ బాధ పడ్డాడు.
కొన్ని సంవత్సరాల క్రితమే ఊళ్ళో సంక్రాంతికి పండుగకు కలుసుకున్నారు వారంతా. అప్పుడే రాఘవ అన్నయ్యను మొదటి సారి కలిసాడు. మద్రాసు నుండి వచ్చిన చంద్రం బాబయ్య కొడుకుగా కార్తీక్ తెలుసు సిరికి. ఆ పండుగకు వెళ్ళిన నాలుగురోజుల్లో మైత్రి రాఘవ ఎక్కువ సమయం కబుర్లలో గడిపితే కార్తీక్ సిరి ఎన్నో విషయాలపై చర్చించుకుంటూ చాలా సమయం గడిపేవారు. అలా కార్తీక్ అన్నయ్యను చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది సిరికి.
******
“కంగ్రాట్స్ కార్తీక్ అన్నయ్యా. కెరీర్ ప్రారంభంలోనే ఇంతటి విజయాన్ని సాధించిన నీకు నా అభినందనలు” అంది సిరి.
“ఏంటో సిరి, ఇది ఆనందించాల్సిన విజయమో విచారించాల్సిన పరాజయమే అర్ధంకావట్లేదు. ఎక్కడో చెన్నై లో చదువుకుని మొట్టమొదటి జాబ్ లో చాలెంజింగ్ కేసు ఛేదించే అవకాశం దొరికినందుకు, సిబిఐ వారు నన్ను ఆ స్పెషల్ టీంలో భాగంగా ఎన్నుకున్నందుకు ఎంతో ఆనందంగా అనిపించింది.
బెంగళూరులో చదువుకుని వ్యాపారంచేసుకుంటున్న రాఘవ అన్నయ్య, మన అత్తయ్య కూతురైన మైత్రి భర్తగా ఇప్పుడు హైద్రాబాదులో అరెస్టవుతున్నాడు. ఒక అన్నయ్యను ఇలాంటి స్థితిలో చూస్తున్నందుకు విచారించాలో, లేక నా ఉద్యోగంలో నేను గెలిచినందుకు ఆనందించాలో తెలియని స్థితి ఇది!” విచారించాడు కార్తీకు.
“నీకు మనం సంక్రాంతికి కలుసుకున్న ఆ రోజులు జ్ఞాపకం ఉన్నాయా సిరి? అందరమూ ఎంత చక్కగా కలిసిమెలిసి ఆడుతూ-పాడుతూ గడిపేవాళ్ళమో. జీవిత ప్రయాణం ఇన్ని మలుపులు తిప్పుతుందని, మనమందరము ఇలాంటి నేపథ్యంలో కలుసుకుంటామని ఆ నాడు కల్లో కూడా అనుకోలేదు కదా?” భావోద్వేగంతో అన్నాడు కార్తీక్.
“నువ్వూ ఎన్నో ఘనతలు సాధించావని వింటున్నాను. మన మైత్రిని మళ్ళీ మాములు మనిషిని చేసే గొప్పపనిలో ఉన్నావని రాధ అత్తయ్య ద్వారా విన్నాను. చాలా సంతోషం సిరీ!” కార్తీక్ చెప్పీ చెపుతుండగానే,
“హలో బావ!! కంగ్రాట్స్. నీ కెరీర్ ప్రారంభిస్తూనే మంచి పేరు తెచ్చుకున్నావు. కీప్ ఇట్ అప్. అల్ ది బెస్ట్ బావ” అప్పుడే వచ్చిన మైత్రి చిరునవ్వుతో అభినందించింది.
మైత్రిని చూసి ఎలా స్పందించాలో తెలియలేదు రాఘవకి. స్థావువై నిలబడిన రాఘవను చూసి “బావా, ఎవరు ఎంచుకున్న మార్గాలకు వారే బాధ్యులు. రాఘవ చేసుకున్నదానికి తానే బాధ్యుడు. నువ్వు నీ విజయానికి సంతోషపడడానికి సంకోచించకూడదు. నీ విజయానికి నాకెంతో ఆనందంగా ఉంది. నువ్వు మరెన్నో గౌరవాలు పొంది ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అంది మైత్రి.
మైత్రిని చూసి ఆ స్థితప్రజ్ఞతను చూసి అభినందించకుండా ఉండలేకపోయాడు కార్తీక్. మార్పు వచ్చినది మైత్రిలోనైనా, దానికి కారకురాలైన సిరిచందనను కళ్ళతోనే మరొక్కసారి అభినందించాడు.
”రాధత్తయ్య, మైత్రిలను ఇంతటి మానసిక సమతుల్యతలో నిలపగలిగిన నీ విజయానికి నేను నిన్ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మన జీవితాలు మనమెంచుకున్న మార్గాల వల్లే నిర్ణయించబడతాయి. అలా ఎన్నుకున్న మార్గంలో మనం చేసే కృషి వల్ల కలిగే జయాలు మనకిచ్చే ఆనందానికి ఎల్లలే ఉండవు” చెల్లెలు సిరిచందనను అభినందిస్తూ అన్నాడు కార్తీక్.
“అవునన్నయ్యా, మైత్రి నేనూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము. రాధత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం. కారణం, తనకున్న అనేక అసౌకర్యాల మధ్య ఉద్యోగం చేసుకుంటూ తన చుట్టూ అక్కచెల్లెళ్ళలా కాలయాపన చేయకుండా ఎప్పటికప్పుడు మావయ్యకు ఆర్థికంగా సహాయపడుతూ ఆ కుటుంబానికే ఒక బలంగా నిలబడింది. నిజానికి, మైత్రి కూడా అలా స్వావలంబనతో బ్రతకాలని ఆశపడేది రాధత్తయ్య” రాధత్తయ్యలోని ఆదర్శమైన లక్షణాలను తనవిగా చేసుకున్న సిరిని చూసి మురిసిపోయాడు కార్తీక్.
*****
“అమ్మా, ఆఫీసుకి వెళ్ళొస్తాను. ప్రణవ్ స్కూల్లో స్కూల్-డే వేడుకలు జరుగుతున్నాయిగా. వాడి వక్తృత్వ ప్రదర్శన పెర్ఫార్మెన్సు ఉంది. సాయంకాలం ఆఫీసులో పర్మిషను అడిగి అలా వెళ్ళి వస్తాను. అలా వస్తూ వాడినీ తీసుకొస్తాను. వేనులో రాడని నువ్వు ఆఫీసుకి వెళుతున్నప్పుడు పెద్దమ్మకి మరోసారి చెప్పి వెళ్ళు. కంగారు పడుతుంది” అంది మైత్రి.
బాధ్యతా రహితంగా ఉంటూ ఎన్ని సార్లు చెప్పినా వేకువనే లేవడం, తన పనులు తాను చేసుకోవడం చేసేది కాదు. అలాంటిది, తల్లిగా తండ్రిగా రెండు బాధ్యతలూ నిర్వర్తిస్తూ ప్రణవ్ ని పెంచుతోంది. దానిలో వచ్చిన మార్పును చూసి ఆనందించింది రాధ.
కన్నతల్లైన గౌరి కష్టం వచ్చినప్పుడల్లా భోరుమని ఏడుస్తూ మైత్రి మనోధైర్యాన్ని మరింత తగ్గేలా చేస్తుంటే రాధత్తయ్య మాత్రం, జీవతంలో మన ప్రమేయం లేకుండా జరిగేవాటికి కృంగిపోకుండా మన ప్రమేయంతో జరిగే తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవాలని చెపుతూ ఉండేది. ఎదురు దెబ్బలు తగిలినా రాధ ఇచ్చిన ఆ మనోధైర్యం వల్లనే, అన్ని దారులూ మూసుకుపోయి చీకటిమయమై పోయిందనుకున్న జీవితాన్ని అందరూ చూసి మెచ్చుకునేలా ముందుకు సాగిపోతోంది మైత్రి.
మాట తీరు మారింది, నడత మెరుగైంది, హుందాతనం వచ్చింది. ఆత్మస్ధైర్యం నిండిన స్త్రీగా, మమత నిండిన మాతృత్వముతో బాధ్యతగా నడుచుకునే యువతిగా తయారైంది మైత్రి. భర్తనీడన లేకున్నా నా జీవితాన్ని నేను సవ్యమైన మార్గంలో నడుపుకుంటానని ప్రస్ఫుటంగా కనబడుతున్న మైత్రి నడవడికను చూసి ముక్కున వేలేసుకుంది గౌరి.
“ఆఫీసుకి వెళ్ళొస్తానమ్మా. పెద్దమ్మాప్రణవ్ జాగ్రత్త. బాయ్ బంగారూ..” అంటూబాబుని ముద్దాడి, హడావుడిగా పరుగులు పెడుతూ వీధిలోని ఆక్టివాను స్టార్ట్ చేసి రివ్వున వెళ్లిపోతున్న మైత్రిని వంకచూస్తూ, ఆనందమూ ఆశ్చర్యమూ మిళితమైన ధారలురెండు కళ్ళవెంటా కారగా, ‘స్వశక్తికి నమ్మిన నీకు ఇంక తిరుగులేదు తల్లీ’ అని మనసులోనే ఆశీర్వదించింది రాధ. మైత్రిని ఆశీర్వదిస్తూ దారి చూపుతున్న ముక్కోటి దేవతలకి దణ్ణం పెట్టుకుంది.
*******
జైలుకి అన్నయ్యను చూడడానికి వచ్చాడు చంద్రం.
“చంద్రం, నువ్వు చెపుతూనే ఉన్నావు. పోకాలం దాపురించిన వాడికి మంచి వినపడదని ఊరికే అనలేదు. నాకు నువ్వు చెప్పిన మంచి వినపడలేదు. ఏదో నీకంటే చాలా ధనవంతుడనైయ్యానని విర్రవీగాను. నిన్ను చిన్నచూపు చూసాను. డబ్బుకి దాసుడనై చెయ్యరాని పనులు చేసాను. నేను అనుభవిస్తున్న శిక్ష కూడా నాకు చాలదు.
ఈ జైలువాసంతోనే నాకు జ్ఞానోదయం కలిగింది. ఇంత జరిగినా నన్ను చూడడానికి వచ్చావు చూడు, అదే నీ గొప్పతనం! నా కన్నా చిన్నవాడివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నీ కొడుకు కార్తీకుని మన కుటుంబమే గర్వపడేలా తయారు చేసావు. వాడిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది” రాజా.
“అంత మాట అనకన్నయ్యా! నువ్వు ఎప్పటికీ మన ఇంటికి పెద్దవే. నాకా గౌరవం ఎప్పుడూ ఉంది. అన్నీ సద్దుకుంటాయి. ధైర్యంగా ఉండు” చమర్చిన కళ్ళతో చెప్పాడు చంద్రం.
*****
బార్ కౌన్సిల్ సమావేశమైయ్యింది. సీనియర్ అడ్వకేట్ మరియు జస్టిస్ పురుషోత్తమ్ గారు తమ ప్రసంగం లో ప్రస్తుత న్యాయస్థానాలు ఎదుర్కుంటున్న సమస్యలు, న్యాయస్థానం సమయం వృథా కాకుండా న్యాయస్థానంలో అనేక పదవులను అలంకరించి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతను అందరికి తెలియచెప్పారు. అలా న్యాయ పరిరక్షణకు పాటుపడుతున్న ప్రతి ఒక్కరూ తమవంతు కృషితో ఈ వ్యవస్థను మెరుగు పరచగలమని తెలిపారు. బార్ కౌన్సిల్ లో సభ్యులైన షర్మిలను ఆత్మీయంగా ఆహ్వానిస్తూ..
“గరగలాట అంతరించిపోతున్న ఒక కళ. మన దేశంలోని సంప్రదాయ కళల్లో ఇది ప్రముఖమైనది. బుర్రకథ, హరికథ, చికుముకులాట, గంగిరెద్దులాట, తోలుబొమ్మలాట వంటి ప్రాంతీయ కళలు నశించిపోయాయి. పెరుగుతున్న సాంకేతిక ప్రగతిఇందుకో కారణమైతే, ఈ కళల నిపుణులకు తగిన గుర్తింపు లేకపోవడం మరొక కారణం. అటువంటి గరగలాటనే తమ కులవృత్తిగా చేసుకున్న కుటుంబంలో జన్నించిన శ్యామల, భర్తను పోగొట్టుకుని పొట్ట చేతపట్టి బెంగుళూరు మహానగరానికి చేరుకుంది. ఆశ్రయమిచ్చిన రాజా కుంటుంబం ఆమెను ఆశ్రమ సేవలకు ఉపయోగించ సాగారు.
అట్టి తరుణంలోనే మహర్షి హత్య జరిగింది. దానికి ప్రత్యేక సాక్షియైన శ్యామల అనేక కష్టాలననుభవించింది. కడసారి తండ్రిని చూడడానికి ఊరు వెళ్ళిన శ్యామల తిరిగి రాలేదు. అనాధగా మిగిలిన షర్మిల అనేక ఒత్తిడిలకు గురైంది. ఆశ్రమ అకృత్యాల బాధితుడు, సంఘ సంస్కర్త ఐన రాజారామ్ గారి ఆశ్రయంలో షర్మిలతన జీవితానికోపరమార్థాన్ని వెతికింది. ఎందుకోసం బతకాలి, తన బ్రతుకుకో పరమార్థం, సమాజానికి తనవల్ల జరగవలసిన ప్రయోజనం గురించి ఆలోచించింది.
తన జీవితానికో సార్థకత ఉండాలని అందుకు సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలని సంకల్పించింది. తదనుగుణంగా తన కార్యకలాపాలని కొనసాగించింది. రాజారామ్ గారితో పోరాటాలు చేస్తూ, అనేక వర్గాలవారి న్యాయానికై పోరాడుతూ న్యాయశాస్త్రంలో పట్టాను అందుకుంది. లాయర్ వేదవ్యాస్ గారి శిక్షణలో అనేక కేసులను గురించి తెలుసుకుంది. ఆయనకు జూనియర్ గా చేస్తూ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మన బార్ కౌన్సిల్ లో తన పేరును నమోదు చేసుకుని షర్మిల స్వయంగా కేసులను వాదించబోతున్నది. ఆమెను మన కౌన్సిల్ కు సాదరంగా ఆహ్వానిస్తున్నాను”
తన తల్లి మరణానికి కారకులైన వారందరినీ నిలదీసి ప్రశ్నించి న్యాయం కోసం పోరాడింది. తమ కుటుంబంలా మరెన్నో కుటుంబాలు వీధులపాలవ్వడానికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు తగు సాక్ష్యాధారలను సేకరించి న్యాయం జరిగే వరకూ పాటుపడింది.
ఇటువంటి వారి మన న్యాయవ్యవస్థకు గొప్ప వరం. బార్ కౌన్సిల్ లోకి షర్మిలను సాదరంగా ఆహ్వానిస్తూ లాయర్ షర్మిలగారివల్ల సమాజానికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను” అంటూ ముగించిన పురుషోత్తమ్ గారి ప్రసంగం ముగిసింది. హాలంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగి పోయింది.
========================================================================
సమాప్తం
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
========================================================================
వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.
Comments