top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 2

Updated: Jan 28, 2024



'Jeevana Chadarangam - Episode 2' - New Telugu Web Series Written By Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 15/01/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది.


పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని , బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. 


అదే ట్రైన్ లో పక్క  కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తులని విడిపించుకొని  ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది.

ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది.

 ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 2  చదవండి. 


“అందరమూ తలో సామానూ పట్టుకుని, స్టేషన్ బయటకు నడవ సాగాము. చైత్రపు చలి, చిమ్మ చీకటి, మిణుకు మిణుకుమంటూ మిణుకు పురుగులు. ఆ ఊరి మన్ను వాసన, ఆ గాలి తగలగానే మన ఊరు వచ్చేసామన్న ఆనందం అందరిలోనూ కలిగింది. ఒకటికి రెండడుగులు వేస్తూ నడుస్తుండగా, తెల్లటి పంచ తెల్లటి లాల్చీ ధరించి, ‘వచ్చారా నాన్నా’ అంటూ నాన్నని పలకరిస్తున్న తాతగారిని చూసి ఒళ్ళు పులకించి పోయింది” కొడుకుని చూసిన తాతగారి కళ్ళలోని కాంతులను కొలవడానికి ఎట్టి యంత్రాలూ సరిపోవు. 


“అబ్బీ, బళ్ళు తిప్పండి రా” తీసుకొచ్చిన రెండు రిక్షా వాళ్ళతోనూ అన్నారు తాతగారు.


“మేమే వచేద్దుము కదా నాన్నా, మళ్ళీ మీరెందుకు శ్రమపడి ఈ చలిలో రావడము” అన్న నాన్న మాటలను కొట్టేస్తూ, “పిల్లలు వస్తుంటే రాకుండా ఎలా వుంటానురా?” అన్నారు.


 పరుగున వెళ్లి తాతగారిని చుట్టేసాము ఇద్దరమూ. తలను నిమురుతూ మాకేసి చూస్తున్న తాతగారి ఆనందానికి అవధుల్లేవు.


“రండర్రా మనం ఆ బండిలో వెళదాము, అమ్మా-నాన్నా ఈ బండిలో వస్తారు” అన్నారు తాతగారు. తాతగారితో రిక్షాలో ఎక్కీ ఎక్కగానే ఎన్నో కబుర్లు మొదలు పెట్టాము. మా స్కూలు, చదువు, ఆయనకి మేము కనీసం రెండు వారాలకైనా ఒక సారి రాయవలసిన ఉత్తరాలు, మరెన్నో విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాము. కబుర్లలో పడ్డ మాకు, అసలు సమయమే తెలియలేదు. భోగి ఛలి అంతకంటే తెలియలేదు. 

*****


ఆ రోజు భోగి కావడంతో ప్రతి వీధిలోనూ, పెద్ద పెద్ద మొద్దు దుంగలు వేసి భోగి మంటలు మండుతున్నాయి. ఆ భోగి వెలుగులలో కొత్త పెళ్ళికూతురిలా ఊరంతా మరింత శోభాయమానంగా ఉంది. ఆ చలిలో, ఆ మంటల వెచ్చదనంలో, తాతగారితో కబుర్లతో ఆ ఉదయం స్వర్గంగా అనిపించింది. రిక్షా ఒక్కో వీధిలోకీ పోగా అందమైన దృశ్యాలు కళ్ళలో నిలిచిపోయాయి. నులక మంచాలు వేసుకుని హాయిగా నిద్రలోనున్న వాళ్ళను దాటుకుంటూ వెళుతున్న రిక్షా, అలిసి పడుకున్నవారు అలికిడికి అప్పుడప్పుడే లేస్తున్నారు. చిటపటలాడుతున్న మంటల రవ్వలను చూసి, ముగ్గులను దాటుకుంటూ సాగిపోతున్న రిక్షాలు. మరీ పల్లెటూరు కాని, పట్నం కాని ఊరు మాది. టౌనుగా రూపు దిద్దుకుంటున్న ఆ ఊరికి, పల్లెల పసిమితనపు పరువం తగ్గి వెలవెలగా ఉన్నా నాగరిక హంగులు మాత్రం ఇంకా పూర్తిగా అబ్బలేదు. స్టువర్టుపేట దాటుతూనే మరో పెద్ద భోగి మంట కనిపించింది. దాని చుట్టూ చలికాచుకుంటున్న జనాలను చూస్తే, చూడముచ్చటగా అనిపించింది” అంటూ డైరీలో రాయాలనుకుంది సిరి.

 

అంతలోనే సిరి దృష్టి ఆ జనాల మధ్యన ఒక అమ్మాయి మీద పడింది. ఎక్కడో చూసినట్టుంది. ఒక్క సారిగా సిరికి ప్లాట్ ఫారమ్-2 పై జరిగిన సంఘటన గుర్తొచ్చింది. 


‘సందేహం లేదు. అదే అమ్మాయి! పేరూ... పేరు.. షర్మిల. అవును షర్మిలే. ఆ పక్కనున్న ఇద్దరూ అదే యూనీఫార్మ్ ధరించి ఉన్నారు. బెరుగ్గా చూస్తోంది షర్మిల’. 


‘అంటే, మద్రాసు రైల్లోంచి దూకిన ఆ అమ్మాయి మా రైల్లోకి ఎక్కిందా? ఇలాంటి దుస్తులు ధరించిన వారి నుండి తప్పించుకునే కదా ప్లాట్ ఫారమ్-2 మీదకు కదుల్తున్న రైల్లోంచి దూకింది? మరి మళ్ళీ...ఇక్కడ???’ అంతర్మథనం జరిగింది ఆ చిన్ని మనసులో. అంతకు మించి ఆలోచించేందుకు వయసు కానీ విషయంపై పరిజ్ఞానము కానీ లేవు సిరికి. 


“తాతగారూ, వాళ్ళెవరు? ఒకే రంగు దుస్తులతో నలుగురైదుగురు ఉన్నారే? వాళ్ళు?” అమాయకంగా అడిగింది సిరి.


“వాళ్ళా? మీ బాబాయ్ వెళతాడు కదా, ఆ ఆశ్రమం వాళ్ళమ్మా. వాళ్ళంతా ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. ఒకే కూటమి అని సూచిస్తూ అలా వేసుకుంటారు. మీ స్కూలు యూనీఫార్మ్ ఉంటుందిగా అలాగన్న మాట” వివరంగా చెప్పారు తాతగారు.


“ప్ల్లాట్ ఫారమ్-2 నుండి జగపతిరాజపురం వరకూ అవే దుస్తుల మనుషులు. వారి ముఖాల్లో క్రూరత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వారెవరో మాత్రం అర్థం కాకున్నది” అంతు చిక్కని ఆలోచనల్లో ఉంది సిరి. అంతలో రిక్షా ఇంటి ముందు ఆగింది.


******


“మన వీధిలోనూ పెద్ద మంటలు వేసారు. మీరు కావాలంటే కాసేపు వెళ్ళి చూసి రావచ్చును” అన్నారు తాతగారు.


“తాతగారి పొయ్యి మంటలే మా ఇంట నిత్య భోగి మంటలు. రిక్షా దిగి నేరుగా పెరటి వైపుకే దారి తీసాము. మూడు పెద్ద రాళ్లు పొయ్యిగా అమర్చి, దానిపై ఒక పెద్ద కాగుతో నీళ్ళు పెట్టి ఉన్నాయి. పక్కనే ఉన్న గంగాళం నిండుగా అప్పటికే కాగిన నీళ్లు సిద్ధంగా వున్నాయి. పండుగ స్నానాలకు సన్నాహాలన్నమాట. పొయ్యికి రెండడుగుల దూరంలో కూర్చున్నా వెచ్చగానే ఉంది. ఎడం పక్కన పెద్ద నుయ్యి, ఆ చుట్టూ విశాలమైన నూతి గట్టూ, గిలకా, దానికి వేలాడుతున్న తాడు. నీళ్ళు తోడడానికి చేద. ఆలా చేదతో నూతి లోంచి నీళ్లు తోడడం నాకెంతో సరదా. పక్కనే సిమెంట్ తొట్టిలో నిండుగా నీళ్ళు పట్టి ఉన్నాయి. ఆ పక్కనే మరో గోలెంలో కూడా. తాతగారు, తోట పని కోసం చేసుకున్న ఏర్పాట్లు అవి. తెల్లారిన దగ్గర్నుంచీ మొక్కల్లోనే ఉంటారు. వాటితో మాట్లాడుతూ, పరామర్శిస్తూ ఉంటారు. వాటి లాలనా పాలనా చూడడమే ఆయన కాలక్షేపం.


పొయ్యి పక్కనే కూర్చుని చలి కాచుకుంటున్నాం. సపోటా చెట్టునుండి సపోటా పళ్ళ వాసన. వేకువనే లేచి తమ ఉనికిని చెపుతున్న పక్షుల కువకువలు. పొగమంచు ముసుగులోంచి బయటకు వస్తున్న భానుడు తన కిరణాలను మా ఊరంతా వ్యాపింపచేస్తున్నాడు. భోగి మంటల వెచ్చదనం ఒక రకమైతే ఆ కిరణాల వెచ్చదనం మరో రకం. 


పొయ్యి పక్కనే కూర్చుని కాసేపు చలి కాచుకుంటూ కూర్చున్న మమ్మల్ని మామ్మగారు పిలిచారు. చేతిలో చమురు గిన్నితో సిద్ధమైయ్యారు. స్నానానికి ముందుగా మామ్మగారు అందరికీ పండుగ చమురు పెట్టడం ఆనవాయితీ. అదో పెద్ద ప్రహసనంగా ఉండేది. ఇంటికి పెద్ద కొడుకైన మా నాన్నగారితో మొదలు పెడతారు మామ్మగారు. ఆయన ఆ తరువాత వరస తప్పకుండ పెద్ద బాబయ్య, ఆ తరువాత రెండో బాబయ్య, అత్తయ్య అలా వాళ్ళ వయసు క్రమంలో వరుస తప్పకుండా ఒక్కొక్కరికి చమురు పెడుతూ వస్తారు. మూడో బాబయ్య కాస్త కోపిష్టి వాడని మామ్మగారు భయపడుతూనే ఉన్నా, ఎట్టి పరిస్థతిలోనూ ఆ బాబయ్యతో సహా అందరికీ చమురు పెట్టాల్సిందే. 


‘ఏవిఁటే అమ్మా ఈ చాదస్తాలు’ అంటూ బాబయ్య తీసిపారేసే లోపే పని కానిచ్చేసి నాలుగో బాబయ్య దగ్గరకు వెళ్లిపోయేవారు మామ్మగారు.


ఆ తరువాత మనుమల వరుస మొదలవుతుంది. పెద్దవాళ్ళందరి విషయంలో సంశయించినా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆ రాగం మాత్రం గట్టిగానే వినిపించేది.


“అమ్మ కడుపు చల్లగా అత్తకడుపు చల్లగా, నీ కడుపు చల్లగా, నా కడుపు చల్లగా వెయ్యేళ్ళు పిల్లాపాపలతో వర్ధిల్లి, పెళ్లిళ్లూ, పేరంటాళ్ళూ అయ్యి, కొడుకులుపుట్టి, మనుమలనెత్తి” అంటూ తలంతా నూని రాస్తూ పాడతారు. ఆ తరువాత వేడివేడి నీళ్ళతో తలంట్లు పోస్తే కానీ పండగ హడావుడికి ప్రారంభం జరుగదు. ప్రతీ ఏడు లాగానే, తాతగారికి మామ్మగారికి కొన్న కొత్త బట్టలు వారికి పెట్టి నమస్కారం చేసారు అమ్మానాన్నలు. అత్తయ్యలకు కొన్న కొత్త బట్టలు కూడా వాళ్ళకి ఇచ్చాకా మిగిలిన పనుల్లోకి దిగేవారు” 


వీధి వసారాలో పెద్ద ఉయ్యాలబల్ల. ఉయ్యాల గొలుసులకు గ్రీసు రాసి, కొత్త గోను సంచీలు చెక్క దూలాలకు చుట్టి ఊగడానికి రంగం సిద్ధం చేసారు తాతగారు. తుప్పు పట్టకుండా, రాపిడికి కిర్రుకిర్రుమని గట్టిగా చప్పుడు అవ్వకుండా అలా ఏర్పాటు చేస్తారన్నమాట. తాత గారి దాయాదుల మనుమలందరూ ఆటలకి మా ఇంటికే చేరేవారు. అలా గడిపిన ఎన్నో సంక్రాంతులు నుంచే జీవితం నాకు ఎంతో నేర్పింది. అంతకు మునుపూ ఎన్నో సంక్రాంతులు చూసాము, ఆ తరువాతా చూసాము. కానీ ఆ సంక్రాంతి మాత్రం మనసులో ఒక తీపి జ్ఞాపకంగా మిగలడమే కాక ఒక చెరగని ముద్రనూ వేసింది. 

****

“మీరంతా నాకు వారానికో ఉత్తరం రాయాలి” అన్నారు తాతగారు.


‘అలాగే తాతగారూ అనేసాము’. అన్నానే కానీ ఉత్తరాల్లో ఏముంటుంది అనుకున్నాను.


కానీ ఇప్పుడు తెలుస్తోంది, తాతగారికి రాసిన ఉత్తరాలు, అయన ప్రత్యుత్తరాల ద్వారా జీవితం గురించి ఎంతగా తెలిసిందోనని. బడిలో చదవని చదువులు ఎన్నో ఆ ఉత్తరాలు నేర్పాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రు గారికి ఇందిరా గాంధీ రాసిన ఉత్తరాలు, ప్రత్యుత్తరాలు ఆమె జీవితానికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని చదువుకున్నాము. ఆ మాట ఎలా వున్నా, నాకు మాత్రం మా తాతగారి ఉత్తరాల ద్వారా బోలేడు విషయాలు తెలిసాయి. ఉత్తరాల్లో రాసిన తప్పొప్పులను సున్నితంగా దిద్దుతూ, ఎన్నో విషయాల గురించి చెపుతూ ఉండేవారు తాతగారు. 


వారి చిన్నతనంలో స్వతంత్ర్య సమరంలోని చిన్నచిన్న ఘట్టాలను వివరించే సన్నివేశాలను ఉత్తరాల్లో చదివినప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ఉండేవి. కొన్ని సంఘటనలైతే మనసును హత్తుకునేవి. తాతగారు ఇంగ్లీషు మాస్టారు. ఆంగ్ల సాహిత్యంలో షేక్స్పియర్ నాటకాల్లో డైలాగులు అనర్గళంగా చెప్పేవారు. మాక్బెత్, హామ్లెట్, రోమియో జూలియట్ కథలు వినాలంటే అవి ఆయన నోటే వినాలి”


జగపతిరాజపురం జ్ఞాపకాలను సిరి తన డైరీలో పదిలపరచుకుంది.

 

*****


పండుగకు వెళ్ళి ఆనందంగా గడిపి తిరిగి వచ్చిన సిరి మనసులో ఆ విషయం మాత్రం కదలాడుతూనే ఉంది. అంతే, తనను తరుముతున్న ఆ సంఘటన తాలూకు వివరాలన్నీ బరువెక్కిన తన మనసు నుండి తాతగారికి రాసిన ఉత్తరంలోకి దింపింది సిరి.


“డియర్ తాతగారు, ఎప్పటి లాగానే ఈ సంవత్సరం కూడా మన ఊళ్ళో గడిపిన రోజులు మరపురాని రోజులుగా మనసులో నిలిచిపోతాయి. ఇవి నా తీపి గురుతులు చేసుకుని నా డైరీలో పొందుపరుచుకున్నాను కూడా. కొద్ది రోజులే ఐనా ఎంతో ఆనందంగా గడిచాయి. ఈ పండుగను గురించిన రోజుల్లో ఒకటే ఒక విషయం మాత్రం నన్ను బాధిస్తోంది.

భోగినాడు మనం రిక్షాలో ఇంటికి వెళుతుండగా మీరు చూపిన ఆ యూనీఫామ్ వ్యక్తులను గుర్తు చేసుకుంటే మాత్రం నాకెందుకో మనసులో తెలియని భయం కలుగుతోంది. బాబయ్యకు వారితో అనుబంధం ఉందని మీరు చెప్పినది విని నాకు బెంగగా కూడా అనిపించింది. అందుకు కారణం లెకపోలేదు. మనం రిక్షాలో వెళుతున్నప్పుడు ఆ దుస్తులతో ఉన్న వారి పక్కనే భయ కంపితురాలై చూస్తూ ఉన్న ఒకమ్మాయిని చూసాము, మీకు గుర్తుందా? ఆ షర్మిలే నాకు అస్తమనూ గుర్తొస్తోంది. ఆ అమ్మాయిని మన ఊర్లో చూసేందుకు ముందు, నేను సికింద్రాబాదు స్టేషనులో చూసాను. ఆమో మద్రాసు రైలు కదిలాకా అందులోంచి ఉరికింది. కాళ్ళకు దెబ్బలు కూడా తగిలాయి. వారి నుండి తప్పించుకునేందుకే కాబోలు ఆ అమ్మాయి అలా చేసింది. అప్పుడే బయలుదేరిన మద్రాసు రైల్లోంచి ఆ అమ్మాయి దూకడం నేను కళ్ళారా చూసాను. అలా తప్పించుకున్న ఆ అమ్మాయికి అక్కడున్నవాళ్లు మందురాసి ఆదరించి సహాయం చేసారు. అలా జరుగుతున్నపుడు ఇవే దుస్తులు వేసుకున్న వారు ఆ మద్రాసు రైల్లో ఉండడమూ నేను చూసాను. వారిని చూసే, ఆ అమ్మాయి భయంతో దూకినట్టు సులువుగా అర్థమైంది.

 కానీ, అలా అక్కడ నుంచి తప్పించుకున్న ఆ అమ్మాయి మళ్ళీ మా రైల్లో ఎక్కిందన్న విషయం మాత్రం నాకు తెలియదు. మళ్ళీ మనం రిక్షాలో వెళుతున్నప్పుడు, ఆ అమ్మాయిని చూసాను. ఆమె క్రితం రోజు చూసిన అమ్మాయే అని తెలిసిపోయింది. మళ్ళీ అవే దుస్తులు వేసుకున్న వారి చేతుల్లో మన ఊరు దాకా వచ్చి చిక్కింది. అందులో మర్మం నాకు అర్థం కాలేదు. ఆ రోజు షర్మిలా అంటూ రైల్లోంచి పిలిచిన పిలుపు నాకు స్పష్టంగా వినిపించింది. ఆ షర్మిల ఎవరో? అలా ఎందుకు భయంగా చూస్తోందో? వాళ్శనుండి తప్పించుకుందుకు ఎందుకు ప్రయత్నిస్తోందో నాకు అర్థమవ్వట్లేదు. ఆ దృశ్యం నా కళ్ళల్లోంచి కానీ, ఆ సంఘటన నా మనసులోంచి కానీ తొలిగి పోవట్లేదు. మన బాబాయ్ ఆ మనుషులతో మెసులుతున్నాడని మీరన్నది తలచుకుంటే, బాబాయ్కి భయం లేదుకదా అని మనసుకి అనిపిస్తోంది. మనసు ఆ అమ్మాయిని గురించి ఆందోళన పడడంమే కాక బాబాయ్ గురించి కూడా భీతి చెందుతోంది. నాకు అనిపించినది మీకు చెప్పాలనిపించింది తాతగారూ” మనసులోని భావాలన్నీ ఉత్తరంలోకి దింపింది సిరి.

సరిగ్గా పదేళ్ళ క్రితం విషయాన్ని మైత్రికి వివరిస్తున్న సిరిని చూస్తూ ఉండిపోయింది మైత్రి. 

‘ప్లాట్ ఫారమ్-2లో ఆరంభమైన ఆ అమ్మాయి కథ ఏంటి? మన సిరి చిన్నారి మనసును ఇంతగా ప్రభావితం చేసిన ఆ విషయం ఏవిఁటి?’ పదేళ్ళు దాటినా కళ్ళకు కట్టినట్టు చెపుతున్న సిరి నోట వెంట ఆ తరువాత కథంతా వినాలన్న ఉత్సుకత మైత్రిలో పెరిగింది. మైత్రి ఆలోచనల్లో పడింది. 


ఎప్పుడూ చాదస్తంగా అనిపించే సిరి మాటలు, ఇప్పుడు ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. ‘షర్మిల ఎవరు? ఆ ఒకే రంగు దుస్తులవాళ్ళకీ షర్మిలకీ ఏవిఁటి సంబంధం? ఆ తరువాత ఏం జరిగుంటుంది?’


సిరి చెప్పగా వినాలని ఆసక్తిగా వేచి ఉంది మైత్రి.

******


“షర్మిల గురించి తెలియాలంటే అసలు మన ఊరు గురించీ, చుట్టరికాల గురించీ తెలియాలి మైత్రీ. ఆ రోజు హైదరాబాదులో ప్లాట్ ఫార్మ్ పై చూసిన షర్మిలను మరల మన ఊర్లో చూడడంలో నాకు ఆశ్చర్యం కొంత కలిగినా, ఆందోళనే ఎక్కువగా కలిగింది. దానికి కారణం ఆమెను చూసిన పరిస్థితులు. అంత చిన్న వయసులోనూ షర్మిలను చూసిన పరిస్థితి నాలో చెరగని ముద్రను వేసింది. మరువలేని జ్జాపకంగా నన్ను తరచూ వేధిస్తూనే ఉండేది”


“మైత్రీ, కాలేజీలో చదువుతున్న స్నేహితురాలి గానే నీకు నేను ఎక్కువగా తెలుసు. అసలు మన ఊరూ, మన చుట్టరికమూ, మీ అమ్మ నాకు అత్తయ్య వరస ఎలా అవుతుంది, మీ అమ్మానాన్నల పెళ్ళి ఎలా జరిగిందో ఇవన్నీ నీకు తెలియాలి. అంతెందుకు, నీకు మీ అమ్మ కథ తెలిస్తేనే చాలు, ప్రతీ వ్యక్తి, అందునా స్త్రీలు ఎంత మనోధైర్యంతో ఉండాలో మీ అమ్మ కథనంతా తెలుసుకుంటే నీకే తెలుస్తుంది. మా తాతగారితో ఎప్పుడూ కబుర్లు చెబుతూ గడపడంతో ఏటేటా ఊరెళ్ళినప్పుడల్లా అందరి గురించీ, అన్నిటి గురించీ నాకు తెలిసేది. నీకూ చెపుతాను విను” ఇంతకు మునుపు ఏమాత్రమూ ఆసక్తి చూపించని మైత్రికి వివరంగా చెప్పసాగింది సిరిచందన.


మన తాతగార్లు నలుగురు అన్నదమ్ములు. అందరి ఇళ్ళూ ఒకే వరుసలో ఉండేవిట. రామ్మూర్తి, జోగారావు, విశ్వనాధం, వెంకట్రావు గార్లు. అన్నదమ్ముల్లో మూడోవాడు మా తాతగారు. మన చిన్నతనం వరకు కూడా ఆ నాలుగిళ్ళలో రాకపోకలు, మంచి చెడులకు నిలబడడాలు ఉండేవి. ఏటేటా పండుగల పేరిట ఊరు వెళుతున్నా చిన్నతనం చేతను, అంతమందిలో ఎవరెవరో తెలియక మనకి చుట్టరికాలు సరిగ్గా తెలిసేవి కావు. నాకు అందరి గురించి తెలుసుకోవడమంటే ఇష్టంగా ఉండేది. ప్రతి ఏడూ చూసిన వారి గురించి వెంటనే తాతగారిని అడుగూతూ ఉండేదాన్ని. డైరీ రాయడం అలవాటు కనుక రాసుకునే దాన్ని. వంశ వృక్షంగా గీసుకుని అందులో అందరి పేర్లూ రాసుకున్నాను కూడా. ఊరెళ్ళినప్పుడల్లా తాతగారితో కూర్చుని ఆ వంశవృక్షాన్ని అప్-డేట్ చేసుకుంటూ ఉండేదాన్ని. నీకూదాన్ని చూపిస్తాను ఉండు” చూపిస్తూ వివరించింది సిరి.

********

“ఆ నలుగురు అన్నదమ్ముల్లో పెద తాతగారు రామ్మూర్తిగారింట్లో ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. పెళ్లైన మొదటి రోజే పెద్దావిడ భర్త చని పోవడంతో అరిష్టమంటూ అత్తారింట్లో ఆమెను చేరతియ్యలేదుట. ఉమ్మడి కుటుంబానికి వంటలక్కగా మిగిలిపోయింది. మరో అత్తయ్య ఎప్పుడో కానీ పుట్టింటికి రాదు. పెద్ద మామ్మగారు అసలు ప్రాపంచిక జ్ఞానం తెలియని మనిషి. పెద తాతగారింట్లో ఎవ్వరూ పెద్దగా చదువుకోలేదు. కానీ ఆయన చాకచక్యంతో పరపతిలో ఉన్నవాళ్ళను పట్టుకుని కొడుకులు ముగ్గురినీ గవర్నమెంట్ ఆఫీసుల్లో చిన్నాచితకా ఉద్యోగాల్లో పెట్టించారు. వాటిని నిలబెట్టుకుని వాళ్ళ బ్రతుకులు బాగానే సాగిపోతున్నాయి.  సామాన్యులుగా చెలామణి అయిపోతూ సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో మున్ముందు అల్లకల్లోలం రేగనుందని అప్పటికి వారికి తెలియదు.


రెండో తాతగారు జోగారావు గారు. వీళ్ళ కుటుంబంతోనే షర్మిల జీవితం ముడిపడి ఉంది. ఆ తాతగారికి ముగ్గురు కొడుకులూ ఒక కూతురు. ఆ కొడుకులే మీ అమ్మకు తోడ బుట్టిన వారు. అంటే నీకు అసలు మావయ్యలన్నమాట. సూర్యం, చంద్రం సుమారుగా సంపాదిస్తే, రాజా మాత్రం ఎవో వ్యాపారాలంటూ ఎన్నో ఆస్తులు సంపాదించాడని గొప్పలు చెప్పడాలు విన్నాం.  వ్యాపారాల వివరాలు మాత్రం పెద్దగా తెలిసేవి కాదు. వారి తోబుట్టువే గౌరి.  అదే మీ అసలు అమ్మ!!”  నవ్వుతూ అంది సిరి.


“సరే ఇక మా తాతగారికి మా నాన్నగారితో సహా ఆరుగురు సంతానం.  అందరినీ చదివించాలన్నదే ఆయన కోరిక.  ఐతే ఆర్థిక ఇబ్బందుల వల్ల మా నాన్నగారు, ఆరోజుల్లో పియూసీతో చదువు ఆపేసి ఉద్యోగంలో చేరిపోయారు. తరువాత అందరూ ఒకళ్ళకొకళ్ళు చేయూతనిస్తూ, ఆయన ఆశ ప్రకారం డిగ్రీలూ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు కూడా పూర్తి చేసి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆడ పిల్లలతో సహా ఎవ్వరికీ చిన్నతనం లోనే పెళ్లిళ్లు చేసేయాలని గాబరా పడేవారు కాదు అయన. అప్పటి రోజులకు భిన్నంగా ముందు చదువులు ముఖ్యం, చదువయ్యాకా చేద్దాములే అని అంటూ ఉండేవారుట. కానీ అంత చదువు చదువుకున్నవారు కూడా ప్రలోభాల్లో పడిపోతే పెడదారులే పడతారని ఆయన అప్పటికి ఊహించలేక పోయారు.


ఇంక ఆఖరి తాతగారు వెంకట్రావుగారు. వారింట్లో ఇద్దరే అమ్మాయిలు. పెద్ద కూతురికి పెళ్ళి చేసారే గానీ అల్లుడు దేశాలు పట్టుకు పోవడంతో, ఆ అమ్మాయి పుట్టింటికి చేరింది. చిన్న కూతురు రాధ చాలా తెలివైంది. పెద్దగా చదువు అంటక పోయినా ప్రాపంచిక జ్ఞానం చాలా ఎక్కువ. తండ్రి పోలికలు పూర్తిగా పుణికి పుచ్చుకుందని అనుకునేవారు ఊరంతా. తల్లిలేని పిల్లలవ్వడంతో గారంగానే పెంచారు. ఆయనకి రాధ కూతురే అయినా, కొడుకుగానే పెంచారు. చివరి దాకా కొడుకులాగే ఆయన్ని బాధ్యతగా చూసుకుంది. తాతయ్యగారికి రాధ తన కాళ్ళ మీద తాను నిలబడాలన్న కోరిక ఎక్కువగానే ఉండేది. చదువు అంటకున్నా, తనకున్న పలుకుబడిని ఉపయోగించి, రైల్వేలో పెద్దగా చదువుకోని చిన్నత్తయ్య రాధకు హైద్రాబాదు మహానగరంలో ఉద్యోగం ఇప్పించారు. హైదరాబాద్ మహానగరంలో అలా రాధత్తయ్య ప్రభుత్వోద్యోగంలో స్థిరపడి పోయింది.  కష్టపడే స్వభావం కలది. అందరితోనూ కలివిడిగా ఉండడం, తోక జాడించిన వారికి సరైన బుద్ధి చెప్పడం, అన్ని విషయాల్లోనూ మంచి నేర్పుగల మనిషే.  


మా మేనత్తలు మాత్రం వాళ్ళ సంసారాల్లో ఈదు కుంటూ ఎప్పుడూ పెద్దగా కలిసేవారు కాదు. మా మేనత్తలూ అదే హైదరాబాదుకు చేరారు. మాట ఖచ్చితం వున్న రాధత్త, పెడసరంగా మాట్లాడడం వీళ్ళకి అంత నచ్చేదికాదు. ఊళ్ళో ఒకే సారి కలవక పోయినా, హైదరాబాదులో పుట్టినరోజులనీ, గెట్-టుగెదర్లనీ అన్నదమ్ముల పిల్లలందరూ కలుస్తూనే ఉండేవారు. కలిసికట్టుగానూ ఉండేవారు. అస్తమానూ ఒకరింటికి ఒకరు రావడం, పండగలకు, పబ్బాలకూ ఊకుమ్మడిగా వేడుకలు చేసుకోవడం పరిపాటి అయ్యింది. సరదాలకూ సంబరాలకూ ఎప్పుడూ ఎలాంటి లోటు ఉండేది కాదు. 


ఐనా మీ అమ్మైన రాధ అత్తయ్య గురించి నేను చెప్పడం ఏవిఁటీ!! నీకే తెలుసు. ఏదో ఫ్లోలో మా తాతగారు చెప్పినదే అలా చెప్పేసాను. ఇదీ క్లుప్తంగా మన తాతల ఫ్యామలీ చరిత్ర!!” అంది సిరి.  


“అమ్మో ఇది క్లుప్తమా తల్లీ?! ఇంక యీ సోది వద్దే తల్లీ. అసలు షర్మిల గురించి చెపుతానంటూ మొదలెట్టిన మనిషి వంశవృక్ష చరిత్ర విప్పింది బాబోయ్. నా వల్ల కాదు” విసుక్కుంది మైత్రి.


“అసలు నాకు తెలీక అడుగుతానూ, నీకు వస కంటే పెద్ద రకం ఏదో రంగరించి పోసారేమో చిన్నపుడు. ఏ విషయమైనా, విన్నామా వదిలామా అన్నట్టు కాకుండా, దాన్ని బుర్రలోకి పెట్టేసి, రుబ్బేసి, దాని మీది బోల్డంత పరిశోధన చేసేసి, దాన్ని గురించి కిందామీదా పడి అలోచించడం నీకు అలవాటు. పైగా, అవన్నీ జీవితానికి చాలా అవసరం అంటూ వేదాంతం చెపుతావు. అసలీ అలవాటు నీకెక్కడి నుంచి వచ్చిందే?” నిలదీసింది మైత్రి.


“ఏదో మజా వచ్చే విషయమైతే పరవాలేదు కానీ, ఆ ఊరు, ఆ చింతకాయ పచ్చడి కథలూ నాకు పరమ బోరు. నాకు ఆ ఊరే ఒక పెద్ద బోర్. మా అమ్మ పోరు పడలేక సెలవల్లో వస్తాను కానీ, అక్కడ నాకు అసలు నచ్చదనుకో” అంది మళ్ళీ.


“అసలు మేము హైదరాబాదు వచ్చి నువ్వు చదువుతున్న స్కూల్లో చేరినప్పుడు కూడా మనకి చుట్టరికం ఉన్నట్టు నాకు తెలీదు. అంతెందుకు, ఓ ఇంట్లో పుట్టి ఓ ఇంట్లో పెరుగుతున్నాను. ఆ అమ్మకు పుట్టాను ఈ అమ్మ దగ్గర పెరుగుతున్నానే కానీ, అలా ఎందుకు జరిగిందో కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. అమ్మ నన్ను గారంగా చూసుకుంటుంది, అన్నీ అమర్చి పెడుతుంది. ఆ అమ్మ దగ్గర అలా జరిగేది కాదేమో. నా మటుకు నాకు ఈ రిచ్ లైఫ్ బాగానే ఉంది” తేలిగ్గా తీసి పారేసింది మైత్రి.


“ఏదో మొదలుపెట్టి ఎక్కడికో వెళుతున్నాము. మీ తాతగారు నీకు చెప్పిన శతకోటి విషయాలను పక్కన పెట్టి ఒక్క షర్మిల గురించి మాత్రం చెప్పమ్మా తల్లీ. నువ్వు చెప్పిన దాంట్లో నాకదే థ్రిల్లర్ స్టోరీలా ఎక్సైటింగు గా ఉంది” విసుక్కుంటూ అంది మైత్రి.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కలకు, బహుమతులు పొందాను.

Comentários


bottom of page