'Jeevana Chadarangam - Episode 3' - New Telugu Web Series Written By
Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 19/01/2024
'జీవన చదరంగం - ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక
రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది.
పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని , బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు.
అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది.
ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది.
అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది.
వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది.
వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి.
ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 3 చదవండి.
“జోగారావు తాతగారి మూడో కొడుకు రాజా అన్నానా, అదే మీ స్వం... త మావయ్య, ఆయన బాగా సంపాదించాడని చెప్పాను గుర్తుందా? మీ అమ్మకు సాక్షాత్తూ అన్నగారు. మన ఊరి సర్పంచి నాగభూషణానికీ అతనికీ బాగా స్నేహం కూడా ఉందిట. వ్యాపార లావాదేవీలు కూడా వారి మధ్య బాగానే సాగుతూ ఉన్నాయిట. ఇప్పుడు ఆయనపై అరెస్టు వారంట్ ఉందిట తెలుసా?” నిజంలో కాస్త వ్యంగ్యం కలబోసి అంది సిరి.
“అరెస్టు వారంటా?” నోరు వెళ్ళబెట్టి అంది మైత్రి.
“అసలు ఏం జరిగింది? నువ్వన్నట్టు వివరాలన్నీ తెలిస్తే కానీ అసలు సంగతి తెలియదన్న మాట. నీ రామాయణం అంతా వింటేనే చిక్కుముడి విడుతుంది కాబోలు. అంతేనా? చెప్పమ్మా చెప్పు. తప్పేదేముంది” తన అల్లరి ధోరణిలో అంది మైత్రి.
“ప్రతీ ఏటికిమల్లే ఏటా జరిగే నూకాలమ్మ ఉత్సవాలకి ఆ సంవత్సరం కూడా రాజా కుటుంబం ఆ ఊరు వచ్చారు. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితమే బెంగుళూరులో స్థిర పడిపోయింది రాజా కుటుంబం. రెండు చేతులా సంపాదిస్తూ ఆస్తి పాస్తులు సంపాదించుకుంటున్నాడని చెప్పుకుంటూ ఉంటారు.
ప్రపంచంలో ఎక్కడున్నా, ఎక్కడ స్థిర పడ్డా ఆ ఉరితో మూలాలున్న కుటుంబాల వారందరూ ఈ ఉత్సవానికి తప్పక హాజరవుతారు. దేశ విదేశాల నుంచే వస్తుంటే బెంగుళూరు నుంచి రావడం పెద్ద కష్టమేమీ కాదు. రాజా కుటుంబం కూడా వచ్చారు. వారం రోజుల పాటు ఉత్సవం జరగనుంది కనుక ఊరంతా జనాలతో కిటకిటలాడుతూ వీధులన్నీ కోలాహలంగా ఉన్నాయి. రాజా కుటుంబంతో పాటు వారితో ఊరికి వచ్చింది శ్యామల. వారి పనులు చూసుకుంటూ వారితోనే అన్నీ ఊళ్లు ప్రయాణం చేస్తూ ఉంటుంది శ్యామల. ఆమె ఒకప్పుడు ఆ ఉరి సర్పంచి నాగభూషణం ఏర్పాటు చేసిన పని మనిషి. వ్యాపారాల రీత్యా ఎదుగుదల వస్తున్న రోజుల్లో ఇంటి పనులకు నమ్మకమైన మనిషి కావాలని రాజా అడిగితే, తమ ఊళ్ళోని రాజన్న కూతురు శ్యామలను అమర్చాడు నాగభూషణం. అలా కొన్నేళ్ళ నుండీ రాజా ఇంట్లోనే పని చేస్తోంది శ్యామల. శ్యామల గురించి చెపుతాను విను.
మధ్య తరగతికి దిగువ స్థాయి రాజన్న కుటుంబానిది. ఏదో ఉన్న దాంట్లో చూసి ఒక అయ్య చేతిలో పెట్టి పెళ్ళి చేసాడు రాజన్న. కవులకు భూమి చేస్తున్నా చెడు అలవాట్లు లేని అల్లుడ్ని చూసుకుని మురిసిపోయేవాడు. శ్యామల బాధ్యత తీరిందని, మంచి భర్త నీడలో ఉందని ఆనందించినంత సేపు పట్టలేదు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు అల్లుడు. భర్తను కోల్పోయి పుట్టింటికి చేరింది శ్యామల. రాజన్న గుండె చెరువైయ్యింది. గరగలెత్తి అమ్మోరుని సేవించినా చిన్న చూపు చూసింది అని ఎప్పుడైనా మనసులో అనుకునేవాడు. కానీ కూతురిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాడు.
తరతరాలుగా గరగలు ఆడి ఆ తల్లిని కొలుచుకునే కుటుంబం రాజన్నది. ప్రతి పున్నానికి గరగలు నెత్తిన ఎత్తి ఆట ఆడితే ఆ నూకాలమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉంటాయన్న నమ్మకం. తాతలనాటి నుండి అదే పని. గుడి మాణ్యం నుంచి ధాన్యం కొలిచి ఇచ్చేవారు. తరతరాల నుంచి అదే వారి సంపాదన. అలాగే తరాలు పొట్టపోసుకునేవారు.
గ్రామ దేవత నూకాలమ్మతల్లి ఉత్సవం పౌర్ణమి నాడు ప్రారంభిస్తారు. ఉత్సవాలప్పుడే గరగలను తీస్తారు. పక్షం పాటు ప్రతి రోజూ సంధ్యా సమయంలో గరగ ఆటలతో ప్రారంభమై రాత్రి వరకూ భక్తులను అలరిస్తూ కనువిందు చేస్తారు. అమావాస్య రోజు వరకు చిన్నజాతర నిర్వహించి, ఆ రోజున పెద్ద జాతర వైభవంగా జరుపుతారు. వారి వారి పనల్లో ఎక్కడున్నా గ్రామస్తులందరూ ఈ జాతర సమయానికి ఇళ్లకు చేరకొని అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ జాతరకు ఉంటే, రాబోయే ఏడంతా కష్టాలు లేకుండా అమ్మ కాస్తుందనీ, ఇల్లు సుభిక్షంగా ఉంటుందనీ వారి నమ్మకం.
నూకాలమ్మ గరగలు మునపట్లో ఐతే నెలనెలా ఎత్తడమూ జరిగేది. ఇప్పుడు కాలమాన పరిస్థితుల వల్ల అలా జరగడం తగ్గిపోయింది. ఏటికోసారి జరిగే ఉత్సవంలోనే గరగలెత్తి అమ్మవారి ఊరేగింపు జరుపుకుంటున్నారు.
క్రితం కంటే మునపటేడు, అప్పటి కంటే ఈ ఏడు, రాజన్న ఆరోగ్యం కొద్దికొద్దిగా క్షీణిస్తోంది. వయసు భారం తెలుస్తోంది. రాజన్న ఆరోగ్యం శ్వాసకోశ జబ్బుతో కొంత క్షీణిస్తే, కూతుర్ని చూసి గుండె తరుక్కుపోయి మరికొంత క్షీణిస్తోంది. ఆమె జీవితం గురించి బెంగ పెట్టుకోవడంతో సగమైపోయాడు రాజన్న.
“నేను బతికుండగా నా కూతురికి ఏదైనా దారి సూపండయ్యా” సర్పంచి నాగభూషణంతో అనేక సార్లు మొర పెట్టుకునేవాడు.
“ఏదో నీ ఆరాటం గానీ, మనూళ్ళూ దానికి చెప్పగల పనులేవుంటాయి రా రాజన్నా? ఐనా చూద్దాంలే, శ్యామల చేయగలిగే పనేదైనా ఉంటే తప్పకుండా చెపుతాను” అన్నాడు భూషణం.
*****
“రాజన్నా, ఒక్క సారి బేగ రావాలి. అయ్యగారు ఉన్న పళంగా నిన్ను తీసుకు రమ్మన్నారు” అన్నాడు పాలేరు ఎంకన్న.
“ఎంటనే రమ్మని పిలిపించారు. ఏం పనేంటి అయ్యగారూ?” అన్నాడు రాజన్న.
“నేను చెప్పేది జాగ్రత్తగా విన్నతరువాత తగు నిర్ణయం తీసుకోవచ్చు రాజన్నా. నాకు తోచినది నేను చెపుతున్నాను.
నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. పేరు రాజా. రాజా మన ఊరివాడే. ఆ అగ్రహారంలో అన్నదమ్ముల ఇళ్ళు వరుసగా ఉండవూ? ఆ ఇంటి మనవడే. నీకు కూడా చూసిన జ్ఞాపకం తప్పకుండా ఉంటుంది. నాకు వ్యాపారాల్లో భాగస్వామి, మంచి స్నేహితుడు కూడా.
ఏనాడో పట్నానికి వెళ్ళి వ్యాపారాలు చేసి ఎంతో గడించాడు. మొన్ననే పట్నంలో లంకంత కొంప కట్టుకున్నాడు. నిన్ననే నాతో మాట్లాడుతూ ఇంటిని కనిపెట్టుకుని ఉండడానికి ఒక నమ్మకమైన మనిషి కావాలని అన్నాడు. అప్పుడు నాకు నువ్వు అన్న మాటలే గుర్తొచ్చాయి. నమ్మకస్తురాలు కావాలంటున్నాడని మా పాలేరు కూతురినే చెపుదామని ముందు అనుకున్నాను కాని అంతలోనే నీ మాట గుర్తొచ్చింది. నీకా, ఆయాసం రోజు రోజుకి ముదురుతోంది. మునపట్లా గరగలెత్తలేక పోతున్నావు. ఏళ్ళ తరబడి గరగలు ఎత్తి అమ్మోరి సేవ చేసుకున్న నువ్వు పొలం పనికి కూడా వెళ్ళలేనంటున్నావు. వయసులో ఉన్న కూతురుని, చంటి పిల్లని ఇప్పుడు ఎలా సాకుతావు. పిల్లను పెంచి పెద్ద చెయ్యాలంటే అదో పెద్ద బాధ్యత. ఈ వయసులో నువ్వు ఆ పెద్ద బాధ్యతను నీ నెత్తిన పెట్టుకోలేవు. నీ కూతురు దాని కాళ్ళ మీద అది నిలబడితే తన పిల్లను చదివించడమేకాక రేపు నీకు నీ ఇంటావిడకీ కూడా అండగా ఉంటుంది. ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాదు రాజన్నా. నా మాట ఇని, దాన్ని రాజా ఇంట్లో పనికి పంపు. తిండికి, బసకి ఖర్చులేదు. గడించుకున్న నాలుగు రాళ్ళూ పోగేసుకుంటుంది. పట్నంలో ఐతే పిల్లకి కూడా కాస్త చదువూ సంధ్యా అబ్బుతుంది” నచ్చ చెప్పాడు సర్పంచి నాగభూషణం.
“మాకో దారి సూపించడానికి మీరు సెప్పింది కాదని ఎందుకంటానయ్యా. అట్టాగే సేత్తానండయ్య” ఆనందంగా ఒప్పుకున్నాడు రాజన్న.
అలా రాజా అరెస్టుని గురించి చెప్పి శ్యామల కథలోకి దింపింది సిరి. మైత్రి ఆతృతగానే వింటోంది.
‘అలా బెంగుళూరు ప్రయాణమై వెళ్ళిన శ్యామల మళ్ళీ ఊరికి ఒక్కసారే వచ్చింది. తల్లిని కడసారి చూసుకుని ఆమె నోట్లో నాలుగు బియ్యపు గింజలు వెయ్యడానికి. ఆ తరువాత ఇదే రావడం. ఊళ్ళో ఉత్సవం జరుగుతోంది. ఆ రోజు రాత్రి ఎంత వద్దంటున్నా గరగ ఎత్తడానికి తయారైయ్యాడు రాజన్న. మేళం వాయిస్తున్న వారితో సమానంగా గరగని తిప్పుతూ ఉత్సవంలో తన ఉత్సాహాన్నంతా నింపి ఆడుతున్నాడు. నాగభూషణం, రాజాలు ఆట చూడడానికి నిలబడి దీర్ఘంగా చర్చించుకుంటున్నారు. ఏదో నెప్పి బాధిస్తున్నా గరగ నేలపడకుండా కాపాడాలని, లేకపోతే ఊరికే అరిష్టమని నమ్మిన రాజన్న నిలువెల్లా పిండేస్తున్న బాధని సైతం కాసాడు. ఆట పూర్తై గరగలన్నీ వరుసగా మండపంలో పెట్టారు. అంతే, గరగను యథాస్థానంలో దింపిన మండపంలో పెట్టిన తరువాత రాజన్న ఒక్కసారి నేలకొరిగాడు. చలనం లేదు. తుది శ్వాస విడిచాడు.
గుండె పగిలేలా ఏడ్చింది శ్యామల. తన జీవితానికున్న ఒక్క ఆసరా నేలకొరిగింది. ఎదుగుతున్న బిడ్డ తప్ప తనకంటూ ఎవ్వరూ లేని ఏకాకైయ్యింది. ఉత్సవం ముగిసాక తండ్రికి నచ్చ చెప్పి తనతో తీసుకెళ్ళాలనుకుంది.
దానకి ముందు తండ్రితో ఏదో విషయం చెప్పాలకుంది. అలా తండ్రికి ఏదో విషయం చెప్పాలనుకున్న శ్యామలకు ఇక ఏం చేయాలో పాల్పోలేదు. ఎప్పుడూ తనకు దారి చూపే తండ్రి అండ కూడా ఇప్పుడు కరువైయ్యింది.
“అదే, ఆ కాషాయరంగు దుస్తులు, ఆ గుర్తు, ఆ స్కార్ఫ్” అనుకుంటూ, ఆ వేష ధారణలో ఊరు వరకూ వచ్చిన వారిని చూసి భయకంపితురాలైంది. ఆమెనే చూస్తూ, ఆమెపై నిఘా వేసిన వారిని చూస్తే భయమేసింది. బెంగుళూరు వరకే పరిమితమైన ఆ ముఠా ఈ ఊళ్ళోకి కూడా వచ్చారు. వాళ్ళను ఇక్కడ కూడా చూసేసరికి ఏదో ఆపద పొంచి ఉందని తెలుసుకోలేనంత అవివేకి కాదు శ్యామల. ప్రాణాలకు అపాయముందని అనుకుంది. తను పుట్టి పెరిగిన ఊరితో అనుబంధమూ ఇప్పుడు తెగిపోయింది. బెంగుళూరులో పని చేస్తున్న ఇంట్లోనే తనకు అపాయకరమైన పరిస్థితి వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళడం అసాధ్యం. కూతురుని గొప్పగా చదివించి మంచి ఉద్యోగంలో చూడాలని ఆశ పడింది. ఇప్పుడు దానికి దారేది? వినూత్నమైన పేరు పెట్టాలంటూ పుట్టగానే ‘షర్మిల’ అని పేరు పెట్టాడు భర్త. నా బిడ్డను గొప్పగా చదివిస్తాను అని ఆశపడ్డాడు. ప్రమాదంలో అల్పాయుషుడు గానే కన్నుమూసాడు. భర్త కోరిక తీర్చాలని అనుకుని, కష్టపడుతున్నా ఇప్పుడు ఇలాంటి చిక్కుల్లో పడ్డానని బాధ పడింది శ్యామల. పెద్దోరి అండలో అమ్మాయిని చదివించాలనుకుంది అలాంటిది, రాజా నీడలో షర్మిల చదువు సాగదు సరికదా, ప్రాణాలకే అపాయమొచ్చి పడేట్టు ఉంది అనుకుంది. ఆ విషయాలన్నీ తండ్రితో చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంది. అంతలో...
******
ఆ రోజు శ్యామలకు కంటిపై కునుకు పట్టలేదు. కళ్ళు మూసినా తెరచినా ఆదే దృశ్యం.
బెంగుళూరు, రాజా బాబుగారి ఇంటి పనికని వెళ్ళిన శ్యామల పనులు ఇంటి వరకే పరిమితమవ్వలేదు. రాజా బాబుగారికి ఒక ఆశ్రమంతో సంబంధం ఉండేది. అప్పుడప్పుడూ ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆరితో పాటు సహాయం కోసం తననూ తీసుకెళ్ళేవారు రాజాబాబు దంపతులు. అమ్మగారి వెనకాలే ఉంటూ పనులను అందిపుచ్చుకుని చేస్తూ ఉండేది శ్యామల. అలా ఆశ్రమంలో ఉన్న రోజుల్లో మరచిపోలేని రోజు కళ్ళల్లో మెదిలింది. సరిగ్గా అలాంటి గగుర్పాటు వచ్చే సంఘన ఒక సారి షర్మిలకు కూడా ఎదురైయ్యింది. సర్పసేవ శిబిరం సమయంలో షర్మిలకు జరిగిన జుగుప్సలాంటిదే శ్యామల అనుభూతి కూడాను. చిన్నపిల్ల కావడంతో షర్మిల నోరు నొక్కి అప్పుడు మాట్లాడ నివ్వలేదు శ్యామల. ఆ తరువాత ఎన్నడూ రాజా ఇంటికి కానీ, ఆశ్రమానికి కానీ, షర్మిల రాకుండా జాగ్రత్త పడిందే కానీ ఆమె భీతిని తొలగించడానికి మరే రకమైన చర్యా తీసుకోలేక పోయింది. ఎలాంటి ముందు జాగ్రత్త పనీ చేయలేకపోయింది. హాస్టల్ ఫాదరు గారి నీడనున్న షర్మిల కూడా ఆ షాక్ నుండి మెల్లిమెల్లిగానే కోలుకోసాగింది. కానీ. తను చూసింది అంతకు మించినదే. భయానకమైనది. ఆ సంఘటనే శ్యామల కళ్ళల్లో మెదిలింది.
ప్రతి శుక్రవారం ఆశ్రమంలో జనాల రద్దీ ఉంటుంది. అంచేత శ్యమలనూ అక్కడి పనులు చూసుకుందుకు తీసుకెళ్ళేవారు రాజా కుటుంబం. శుక్రవారాలు పాదపూజలకు అనుమతి ఉంటుంది. నమోదు చేసుకున్న వారందరినీ వరుసలో టోకెన్ల ప్రకారం పంపడం జరుగుతుంది. పక్కనే ఉన్న గదిలో రాజా, స్వామీజీ అకౌంట్సు చూసే మహర్షి ఘర్షణ పడడం చూసంది శ్యామల.
“ఇక్కడ జరుగుతున్న అక్రమాలను నేను బయట పెట్టి తీరతాను. ఎందరో అమాయకులను అనేక ఇబ్బందులకు గురిచేసి మీరు దోచుకుంటున్నది వెలుగులోకి తెస్తాను ఆక్రోశంగా అరిచాడు మహర్షి. ఇక్కడ కేవలం ధనదోపిడీ, లైంగిక వేధింపులేకాదు అంతకంటే హానికరమైన మూఢనమ్మకాలను నూరిపోస్తూ సాధారణ జనాలను పెడత్రోవపట్టిస్తున్నారు. ప్రమాదకరమైన కార్యక్రమాలతో మనుషుల ప్రాణాలతోనే చలగాటాలాడుతున్నారు. పురోగతివైపుగా పయనిస్తున్న మన సమాజాన్ని దశాబ్దాల వెనక్కి తీసుకువెళ్ళడమే మీ ఉద్దేశ్యం. అప్పుడు మీ ఆగడాలకు హద్దు, అదుపు ఉండదనే మీ పథకం. ఈ నా తిరుగుబాటుకి ప్రాణాలకే ముప్పని నాకు బాగా తెలుసు. ఆ తరువాత సాక్ష్యాలను కూడా తారుమారు చేసే సామర్థ్యమూ మీకుందని నాకు తెలుసు. ధన, అంగ బలమున్న అనేక శక్తులతో కూడిన రాజకీయ వ్యక్తి మీ వెనుక అంతర్గతంగా దాగి ఉన్నాడన్న సంగతి అందరికీ విదితమే ఐనా, ఎక్కడో నావంటి వాడే అన్యాయాన్ని చూస్తూ ఊరుకోకుండా ఎదిరిస్తాడు. దీని పర్యవసానం ఏదైనా సరే, దానికీ నేను సిద్ధమే” పూనకం వచ్చిన వాడిలా నిలువెల్లా ఊగిపోతూ అన్నాడు మహర్షి.
బలవంతంగా అతడి నోరునొక్కే ప్రయత్నం చేసాడు రాజా. పెనుగులాటలో పక్కనే ఉన్న సోఫాపై పడి కిందకు దొర్లిన మహర్షి ముఖాన్ని సోఫా కుషనుతో గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఒక మోచేతితో అదిమి పట్టి మరో చేతితో నోటిని గట్టిగా నొక్కిపెట్టాడు. కాసేపటికి రాజా బలంగా ఊపిరి పీల్చుకున్నాడు. మహర్షిలో ఎటువంటి చలనమూలేదు.
గది బయట నుండి చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది శ్యామల.
ఆ రోజు తరువాత భయంగానే ఉంటోంది శ్యామలకి. ఎవ్వరితోనూ మాట్లాడవద్దని హెచ్చరించాడు రాజా. అక్కడితో ఊరుకుంటుందని నమ్మాడు. ఐతే, తండ్రి సమానులైన ఫాదరుతో తన మనసులోని బాధను భయాన్ని పంచుకుంది శ్యామల. ప్రభువు వారిని శిక్షిస్తాడులేమ్మా. మనం ప్రార్థన మాత్రమే చేయగలం. రాజన్నను మరపించే మాటలు చెప్పడంతో అప్పటి నుండి మనసు తేలికపడింది. కానీ, ఇంక అక్కడ ఉండడం ప్రమాదకరం. ఇంటి పనంటూ వచ్చిన మొదటికొన్ని సంవత్సరాలు బాగానే గడిచాయి. వ్యాపార భాగస్వామ్యం అంటూ బావమరిది ఫణిభూషణ్ తో చేతులు కలిపి, ఆశ్రమ విషయాల్లో లోతుగా దిగిన దగ్గర్నుంచి ఆ ఇంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకటిరెండు సార్లైతే విషంకక్కే ఫణి దుష్ప్రవర్తన నుండి తప్పించుకోవడమే కష్టమైంది శ్యామలకి.
******
“ఆగు శ్యామలా, మమ్మల్ని తప్పించుకుని ఎక్కడికీ పోలేవు. మా రహస్యం తెలిసిన నిన్ను మేము ఊరికే వదలము. మమ్మల్ని కాదని ఎక్కడికెళ్ళినా నిన్ను బతకనిస్తామని అనుకుంటున్నావా?”
తరుముకుంటూ వస్తున్న వారికి చిక్కకుండా మరింత వేగంగా పరుగుతీస్తోంది.
బెంగుళూరు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న షర్మిలను, ఊళ్ళో ఒంటరిగా ఉన్న నాన్నను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకుంది. షర్మిల మూడేళ్ళ క్రితమే భయంతో ఏనాడో చెప్పిన మాటే అది.
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు, ఉత్సవాలకని ఊరికి వచ్చి తండ్రి చావు చూసింది. దిక్కు తోచని పరిస్థితిలో ఇలా తననే తరుముకొస్తున్న మృత్యువు. భయపడుతున్న తనని గమనించి బెదిరించడంతో ఏం చేయాలో పాల్పోక పారిపోవాలనుకుని చిక్కుల్లో పడింది.
అడుగు ముందుకు పడట్లేదు. పర్వతాన్ని మోస్తున్నంత భారంగా ఉంది తన శరీరం. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇంక ప్రాణాలను కాపాడుకోవడం కష్టమని అర్థమైపోయింది. ష... షర్మిల అంటూ నేలకి ఒరిగింది. యూనీఫామ్ లో ఉన్నవారు మరుక్షణం అక్కడికి చేరారు, కసాయిగా ఆమె గొంతునులిమారు. కాళ్ళు గిలగిలా కొట్టుకోవడానికి దాదాపు నాలుగు నిముషాలు కూడా పట్టలేదు. బతుకు పోరాటంలో ఓడిపోయింది శ్యామల.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.
Comments