'Jeevana Chadarangam - Episode 7' - New Telugu Web Series Written By
Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 10/02/2024
'జీవన చదరంగం - ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక
రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది.
పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది.
ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది.
వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి.
బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు.
మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది.
రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి. రాధకు పితృ సమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం ప్రసాద్ అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు.
ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 7 చదవండి.
ఆదిలోనే హంస పాదమన్నట్టు, పిడుగులాంటి వార్త వచ్చి పడింది. పెళ్ళై మరో ఊళ్ళో కాపురముంటున్న అక్క దగ్గరనుంచి ఫోను వచ్చంది రాధకు.
“బావగారికి మరో స్త్రీతో సంబంధం ఉన్నా, ఇన్నేళ్లూ ఎన్ని బాధలు పెట్టినా భరించాను. నా ఖర్మింతేలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఆమెను సరాసరి ఇంటికే తీసుకు వచ్చారు. ఇక నావల్ల కాదు. ఏ నుయ్యోగొయ్యో చూసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదు” అంటూ గొల్లుమనింది రాజీ.
‘భర్త వేధింపులను తట్టుకోలేక, ఇల్లు దాటితే నిలువ నీడలేక, ఎక్కడికెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్న అక్కకి ఉన్న ఒక్క ఆధారమూ రాధే. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆమో కడుపున ఒక కాయ కాయలేదన్న నెపంతో మరో స్త్రీని ఇంటికి తెచ్చిన భర్తను ఏమనాలి? భర్త ఆదరణలేక బాధపడుతున్న అక్కకు పుట్టిల్లంటూ లేకనే కదా, ఇంత దారుణానికి ఒడికట్టాడు? నాన్ననై బావను నిలదీయలేకపోవచ్చు కానీ, నా కాళ్ల మీద నేను నిలబడుతున్న తోబుట్టువుగా అక్కను ఆదుకోలేనా? తనకంటే చిన్నదాన్నైనా, అమ్మా నాన్ననై దాన్ని కడుపులోపెట్టుకుని చూసుకోవాలి. దాని బాధ తీర్చలేకున్నా, ప్రాణాలు కాపాడగలను. అదే నా కర్తవ్యం’ దృఢంగా నిశ్చయించుకుంది.
‘కొంగుముడితో, మంగళసూత్రంతో కొత్త జీవితానికి నాంది పలుక వలసిన సమయంలో, కొత్త కాపురం గురించి బంగారు కలలుకనే తరుణంలో, తలకుమించిన మరో బాధ్యతను మోయవలసి వస్తోంది. ఐతే తనపై పడుబోతున్న ఆ బరువుతో అత్తారింటికి వెళ్ళవలసి వస్తే, అందరూ తనను చులకన చేసి మాట్లాడితే, దాన్ని ఏ ఆడపిల్లా భరించలేదు. అట్టి పరిస్థితి ఎంత నరకప్రాయంగా ఉంటుందో తను ఊహించగలదు.
భర్తకు దూరమైన పరిస్థితులను అందరూ తలోరకంగా అనుకోవడానికి ఇదో అవకాశం. అక్క గురించి నలుగురూ చెవులు కొరుక్కోవడం తను భరించలేదు. కొత్త ఇంట అడుగుపెట్టగానే ఎదిరించడమూ సరైన పని కాదు. ఎలా చూసినా విడని చిక్కుముడిగా తయారైంది జీవితం. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టైంది. ఐనా ఫరవాలేదు. దైవం నాకేంచేసినా మంచే చేస్తాడు అని నమ్మాను నమ్ముతాను. అలా చేయమనే కదా ఆరోజు ప్రసాదుగారిని చూసిన రోజున కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించాను! ఇప్పుడిదే ఆ దైవ నిర్ణయమైతే, దాన్ని శిరసావహించాలి. ఆనందంగా!!!’ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామకృష్ణగారి వద్దకు వెళ్లి విషయమంతా విపులంగా చెప్పింది రాధ.
“సార్. మీరు ప్రసాదు గారితో మాట్లాడిననాడు పరిస్థితులు వేరు. ఇప్పుడవి పూర్తిగా తారుమారైయ్యాయి. ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా పెళ్ళి కుదిరినా కుదరకపోయినా, ప్రస్తుత తక్షణ కర్తవ్యం అక్కయ్యకు నీడనివ్వడం. పెళ్ళి కుదిరేదాకా పిన్ని వాళ్ళింట్లోనే కాలక్షేపం చేసుకోవాలనుకున్న నిర్ణయం మార్చుకుని, వెంటనే మరో ఇల్లు చూసుకోవాలి. అక్కయ్యతో అక్కడుండాలి. వెంటనే ఇది చేయవలసిన ఆకస్మిక పరిస్థితులు వచ్చినందువల్ల వేరు దారిలేదు. ఈ కొత్తమలుపు వల్ల ఆ పెళ్ళివారు ఇప్పుడేమంటారో కూడా మీరు కనుక్కోవాలి. అక్కయ్యను నేను ఒక్కనాటికి వదిలి పెట్టను. ఆమె చాలా అమాయకురాలు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి కావలసిన తెలివితేటలు అసలు లేవు ఆమెకు. ప్రాపంచిక జ్ఞానం అసలు బొత్తిగా లేదని నాన్నగారు భయపడుతూనే ఉండేవారు. ఆయననుకున్నంతా అయ్యింది. దాన్ని అనాధగా ఎలా వదిలేస్తాను. కలో గంజో, ఇద్దరం కలిసే బతుకుతాము. దానికి అదృష్టం మెండుగా ఉండి మరో జీవితం అమిరితే సరే. లేకపోతే నా కంఠంలో ప్రాణమున్నంతసేపూ అక్కయ్య నాతోనే ఉంటుంది.
ఇది ప్రసాదు గారు ఊహించని విషయం కనుక, మీరు వివరంగా చెప్పండి. నాకు జీవితాంతమూ అక్క భారమే. అది నాకు సమ్మతమైనట్టు వారికి అవ్వవలసిన అవసరం లేదు. వారికి అగీకారమైతేనే నేను ఈ సంబంధం చేసుకోగలను. కాని పక్షంలో, నా అదృష్టం అంతే అని సరిపెట్టుకుంటానేకానీ వారిని అపార్థం చేసుకోను. ఈ ఒక్క విషయం ఒప్పుకుంటే నా తరపునుండి మరెటువంటి ఆంక్షలూ, అభ్యంతరాలూ ఉండవు. తండ్రి సమానులైన మీతో కూడా ఈ విషయంలో నా ఉద్దేశ్యం చెపుతున్నానే కానీ, మీ సలహా కోరనందుకు నన్ను మన్నించడి. నా ఈ మాట ప్రసాదు గారితో చెప్పండి” తొణకని కుండలా చెప్పింది.
రాధ దృఢ నిశ్చయాన్ని చూసి ఆశ్చర్యపోయారు రామకృష్ణగారు. ‘ఈ వయసులో ఇంతటి లోతైన ఆలోచనలూ, దూరదృష్టా? ఇంతటి దృఢ సంకల్పమా?’ రాధలోని మరో కోణాన్ని చూసిన ఆయనకు ఆనందమే ఎక్కువ కలిగింది.
ప్రతి వ్యక్తిలోనూ పునాదులు వేసుకుని నాటుకుపోయి స్వార్థం తాండమాడుతున్న రోజులివి. ప్రపంచమంతా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ, తల్లితండ్రులను కూడా చూసుకోవడానికి ఆలోచిస్తున్నసమయమిది. అలాంటిది, ఇంత పిన్న వయసులో అక్క పరిస్థితిని గురించి ఇంత కూలంకషంగా ఆలోచిస్తూ, బాధ్యతాయుతంగా మాట్లాడుతున్న రాధను చూసి మనసులోనే శభాష్ అనుకున్నారు రామకృష్ణగారు.
రామకృష్ణగారికి రాధంటే ఎంత ప్రీతో, ప్రసాదన్నా అంతే అభిమానం. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నా సంకల్పం ఎంతో సబబైనదని మరోసారి ధృవీకరించుకున్నారు ఈ సంఘటన వల్ల రాధ పట్టుదల, న్యాయబద్దమైన ఆలోచనా విధానం మరింత తెలిసింది. ఈ ఇరువురూ కలిస్తే, వారి భావి జీవితం ఆనందంగా సాగుతుందని గాఢంగా తనవరకూ తీర్మానించుకున్నాకా, ప్రసాదు నాన్నగారితో మాట్లాడడానికి వెంటనే బయలుదేరారు.
“అయ్యా రఘురామయ్యగారూ, మీ ముగ్గురి సంతానంలో అందరికంటే చిన్నవాడైనా, ప్రసాదు ఎంతో పరిపక్వత కలిగినవాడు. ఎంతో హుందాగా నడుచుకుంటూ, తనకంటే పెద్దల మెప్పును, చిన్నవారి ప్రేమాభిమానాల్నీ గెలుచుకున్నాడు. తల్లిలేని అతడిని గారాబం చేయకుండా ఎంతో బాధ్యతగా పద్ధతులు నేర్పి పెంచారు. ప్రసాదు నాకు పుత్రసమానుడు. అలా భావిస్తున్న కారణంగానే అతడి విషయంలో కాస్త స్వతంత్రం తీసుకుని ఓ చక్కని సంబంధం తీసుకుని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే ఆ సంబంధం వివరాలు చెపుతాను.
సాక్షాత్తు ఆడపిల్ల తండ్రి కూడా పిల్లనివ్వడానికి వెళ్ళినపుడు ఇంత వినయంగా విన్నవించుకుంటారో లేదో!! ఈ పెళ్లి ఎలాగైనా జరగాలన్నదే అయన అభిలాష. విషయం ఆరంభించినప్పటినుండి ప్రతి అడుగు చూసిచూసి వేస్తూ, ఎక్కడ ఎలా నడచుకుంటే అభిప్రాయభేదాలు లేకుండా సక్రమంగా జరుగుతుందో అలా ముందుకు నడిపారు.
“మా వాడిమీద అక్కరతో మీ అంతటివారు నా గుమ్మం తొక్కి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. వాడి మేలుకోరి మీరు సంబంధం చెపుతానంటే వద్దనేంత కుసంస్కారిని కాను నేను” అంటూ ప్రసాదు తండ్రి రఘురామయ్య అన్న మాటలు ఆయన నమ్మకాన్ని బలపరిచాయి.
“మా ఆఫీసులోనే పనిచేసే రాధ అనే అమ్మాయిని మీ ప్రసాదుకు చేసుకోమని అడగడానికి వచ్చాను. ఆ అమ్మాయి మీ కుటుంబానికి కానీ, ప్రసాదు గుణానికికానీ సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నాను. పేరుకైతే నేను ఆఫీసులో ఆమెకు పై అధికారిని కానీ, సాక్షాత్తు నాకు బిడ్డలాంటిది. వాళ్ళ నాన్నగారు రెండేళ్ళ క్రితం కాలంచేసారు. పినతల్లి గారింట్లో ఉండి ఉద్యోగం చేసుకుంటోంది. ఆడదిక్కులేని మీ ఇంటికి రాధ తప్పకుండా వెలుగు నింపే దీపమవుతుంది. ఇది నా నమ్మకమే కాదు, హామీ కూడాను. అయితే.. . ” విన్నవిస్తూనే సందిగ్ధాన్ని చెప్పబోతూ ఆగారు రామకృష్ణగారు.
వారు సంశయించడం చూసి, అయోమయంగా చూసాడు ప్రసాదు తండ్రి. మళ్ళీ చెప్పడం ప్రారంభించారు రామకృష్ణ.
“ఈ మధ్యనే వాళ్ళ అక్కయ్యకు ఒక కష్టం వచ్చింది. భర్త నుంచి దూరమైన అక్క వీధిన పడడంతో ఆమె బాధ్యత ఉద్యోగం చేస్తూ తన కాళ్ళమీద తాను నిలబడిన రాధ మీద పడింది. ఇద్దరు తోబుట్టువలు. చిన్నతనంలోనే తల్లిపోయింది. తండ్రి రెండేళ్ళక్రితం పోవడంతో పుట్టిల్లంటూ లేని రాజీకి ఇప్పుడు రాధే అండగా నిలబడవలసిన పరిస్థితి. తోడబుట్టిన వారు ఒకరికొకరు ఆదుకుంటూ నిలబడకపోతే ఇంక రక్తసంబంధానికి అర్థమేముంది? స్వార్థం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో రాధ, అక్క రాజి గురించి ఆలోచిస్తోందంటే, రేపు మీ ఇంట్లో ప్రతి వ్యక్తి గురించీ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇలాంటి గుణమున్న పిల్ల మీ ఇంటి దీపమవ్వడం మీ అదృష్టమే అవుతుందని నేనంటాను. ఇక రాజీ విషయానికొస్తే ఆ అమ్మాయి బరువనుకుంటే బరువు, కాస్త పెద్ద మనసుతో ఆలోచిస్తే మీకు మరో బిడ్డ అవుతుంది. ఆసరా లేని ఆమెకు నీడనిచ్చినట్టవుతుంది. రాధ ప్రసాదులు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఉరుకులు పరుగులు పెడుతున్న వారికి చేదోడువాదోడుగా ఉంటుంది. ఇంట్లో ఒక ఆడపిల్ల తిరుగాడుతుంది. మీకీ వయసులో కుతురి నీడ ఉన్నట్టవుతుంది. రేపు వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు, ఎక్కడో విడిచిపెట్టకుండా చూసుకుంటుంది. కాస్త ముందుచూపుతో ఆలోచిస్తే, ఆమె వల్ల మీ ఇంటికి కలిగే ఇబ్బంది కంటే మీకు కలిగే ప్రయోజనమే ఎక్కువ. అన్ని విధాలా అలోచించేవాణ్ణి కనుక, మీరూ అభ్యంతరం తెలుపలేదు కనుక, అన్ని కోణాల్లోనూ ఆలోచించి నా ఉద్దేశ్యం చేప్పాను. అన్యధా భావించకండి. మీరేమంటారు?” తన ఉద్దేశ్యాన్ని సుదీర్ఘంగా చెప్పి, నిర్ణయాన్ని ఆయనకే వదిలేస్తూ, విషయాన్ని ముగించారు రామకృష్ణగారు.
ప్రసాదు తండ్రి రఘురామయ్య చాలా మంచి వ్యక్తి. జీవితాన్ని కాచి వడపోసినందువల్ల, కష్ట సుఖాలు చవిచూసినందువల్ల రాటుపోట్లను అర్థం చేసుకోగలడు. జబ్బుచేసి భార్య పోయినప్పటినుండి ఎన్నో ఇబ్బందులు పడుతూనే సంసారాన్ని ఈదుకొచ్చాడు. పిల్లల బాధ్యతను ఒంటరిగానే మోసాడు. అన్నీ సక్రమంగా నెరవేర్చుకుని వచ్చాడు. పెద్దకొడుకు పెళ్ళి చేసినా అతడు బాధ్యతా రహితంగా ఉన్నందువల్ల వారి ఆదరణా అంతంత మాత్రమే రఘురామయ్యకి. అణకువలేని కోడలితో ఇబ్బందులు పడ్డుతున్నా, ఆమెతో సమానంగా నోరుపారేసుకోకుండా సమస్యను నేర్పుగా ఎదుర్కొంటూ వాళ్ళకి వేరే కాపురం పెట్టించి చిన్న కొడుకుతో ఉండసాగాడు.
ఇంతటి పెద్ద హోదాలోవున్న ఒక పెద్దమనిషి ఇంటివరకూవచ్చి చెప్పేహితం అర్ధము చేసుకునే సంస్కారమూ ఉంది. అణకువగలపిల్ల తమ ఇంటికి ఎంతో అవసరమని గ్రహించి అయన చెప్పిన మాటల్లోని అంతరార్ధాన్నీ, అట్టి నిర్ణయం వల్లకలిగే ప్రయోజనాన్ని గ్రహించి, ఈ సంబంధాన్ని ఖాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రావణమాసంలో మంచి ముహూర్తాన, సహృదయులైన రామకృష్ణగారి చేతుల మీదుగా, పెద్దల ఆశీర్వాదములతో రాధా ప్రసాదుల పెళ్లి వారికున్నంతలో అంగరంగ వైభవంగా జరిగింది. చూడముచ్చటైన జంట అని ఊరంతా అనుకున్నారు. సంతోషంగా ప్రారంభమైన పెళ్లి పుస్తకం, ఆనందంగా వున్న కొత్త కాపురం, కలతలు లేని సంసారంగా చక్కగా సాగిపోతోంది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.
Commenti