జీవన రాగాలు ఎపిసోడ్ 13
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Jul 14, 2024
- 7 min read
Updated: Jul 19, 2024

'Jeevana Ragalu Episode 13' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 14/07/2024
'జీవన రాగాలు ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. ఆయన భార్య పేరు సుందరి. దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో జరుగుతుంది. వారికి కవలలు పుడతారు. ఆ పిల్లలకు దశరథ నందన, సునంద అని పేర్లు పెడతారు.
గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య, బండి నడిపే ఫకీరా మరణిస్తారు.
పిల్లల్ని, దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి కౌసల్య చెల్లెలు సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దలు. వారి పిల్లలే గోపినందన, హిమబాల. పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది.
దశరథనందన వివాహం మన్మధరావు కూతురు భానుప్రియతో జరిపించాలనుకుంటుంది సుందరి.
తాగిన మైకంలో దశరథనందన, భానుప్రియను బలాత్కారం చేసినట్లు ఆరోపిస్తారు మన్మధరావు, అతని భార్య మంగ. నందనను ఇంటినుంచి వెళ్లిపొమ్మంటాడు దశరథరామయ్య.
తానూ ఏ తప్పూ చేయలేదని విశ్వసిస్తాడు నందన. నిజం నిరూపించడానికి సర్కిల్ ఇన్ స్పెక్టర్ మురారి సహాయం కోరుతాడు. తను ప్రేమించిన భారతిని కలకత్తా నుండి తీసుకోని రావడానికి వెళ్తాడు నందన.
ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 13 చదవండి.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదినారాయణ చెప్పిన ప్రకారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ మురారి.. కావలికి పోయి బంగారన్న యింటికి వెళ్ళాడు. ఆ క్రిందటి రాత్రి ఫణీంద్ర తన యాత్రను ముగించుకొని యింటికి చేరాడు. తన కోసం ఎవరో వచ్చి వున్నారని పనిమనిషి చెప్పగా యింటి వరండాలోకి వచ్చాడు ఫణీంద్ర.
మురారిని చూచి..
"మీరు ఎవరు?”
“నా పేరు మురారి.. మీరు నాతో నెల్లూరుకి రావాలి!..”
“ఎందుకు?”
“పెండ్లి చూపులకు.”
“ఎవరికి?” ఎంతో ఆశ్చర్యంతో అడిగాడు ఫణీంద్ర.
“నీకే!.. యిది మా బాబాయిగారి ఆదేశం.”
"మీ బాబాయి ఎవరు?..”
“పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదినారాయణగారు.” ఫణీంద్ర ముఖంలోకి పరీక్షగా చూస్తూ చెప్పాడు మురారి.
“నేను మా నాన్నగారిని అడగాలి.” సాలోచనగా తల దించుకున్నాడు ఫణీంద్ర.
“అడుగు.”
ఫణీంద్ర తండ్రి బంగారన్నకు ఫోన్ చేశాడు.
“అవున్రా.. అడ్వకేటు ఆదినారాయణ మంచి సంబందాన్ని గురించి సెప్పినాడు. ఆ వచ్చిన మనిషితో ఎల్లి పిల్లని చూడు. ఆదినారాయణ చాలా మంచోడు. మనమేలు కోరేవాడు. పిల్ల నీకు నచ్చితేనే పెళ్ళి. ఎల్లిరా.” తన అనుమతిని కుమారుడికి తెలియజేశాడు బంగారన్న.
“కూర్చోండి.. పది నిముషాల్లో వస్తాను.” లోనికి వెళ్ళిపోయాడు ఫణీంద్ర.
మురారి కూర్చీలో కూర్చున్నాడు.
నీట్ గా తయారై వచ్చాడు ఫణీంద్ర. యిరువురూ కార్లో కూర్చున్నారు. మురారి కారును నెల్లూరు వైపుకు త్రిప్పాడు.
“మీరు ఏం చేస్తుంటారు?” అడిగాడు ఫణీంద్ర.
“కొద్దిసేవట్లో నీకే తెలుస్తుంది.” నవ్వాడు మురారి.
గంటన్నరలో కారు నెల్లూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. యిరువురూ కారు దిగారు.
ఫణీంద్ర ఏదో సందేహం, లోన కొంచెం భయం కలిగాయి.
మురారి స్టేషన్ లోనికి నడిచాడు. వేరే మార్గం లేక ఫణీంద్ర అతన్ని అనుసరించాడు. లోనవున్న పోలీసులను బయటికి వెళ్ళమని చెప్పాడు మురారి. వాళ్ళు వెళ్ళిపోయారు.
“కూర్చో ఫణీంద్ర!..”
కుర్చీలో కూర్చున్నాడు ఫణీంద్ర. ఎదుటి వైపు కుర్చీలో కూర్చున్నాడు మురారి. యిరువురికి మధ్యన టేబుల్ కొన్ని ఫయిల్సు వున్నాయి.
“మనం ఆదినారాయణగారి యింటికి వెళ్ళాలి కదా!..” సందేహంగా మురారి ముఖంలోకి చూస్తూ అడిగాడు ఫణీంద్ర.
“అవును. యిక్కడ కాస్త పని వుంది. ముగించుకొని వెళదాం.” ఫణీంద్ర ముఖంలోకి పరీక్షగా చూచాడు మురారి.
“ఏమిటి సార్!.. అలా చూస్తున్నారు?”
మురారి నవ్వి.. “యిప్పుడు నీకు అర్థం అయ్యి వుంటుంది నేను ఎవరో..’’ సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు.
కొన్ని క్షణాల తర్వాత..“మీ నాన్నగారికి రాజకీయంగా మంచి పేరు వుంది. దానికి కళంకం కలిగేలా నీవు ఏ పనీ చేయకూడదు. అవునా!..”
“అవును..” మెల్లగా చెప్పాడు ఫణీంద్ర.
“మన్మధరావుగారి యింట్లో.. ఆయన యం.పి. అయిన రోజు సాయంత్రం పార్టీ జరిగింది.. దానికి నీవు వెళ్ళావా..!” ఫణీంద్ర కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు మురారి.
"వెళ్ళాను. కానీ.. నేను వాళ్ళ పార్టీలో కలవలేదు. మన్మధరావు కొడుకు రఘనందన నా ఫ్రెండ్. నేను వాడు మా యిద్దరు మిత్రులతో పార్టీ జరుపుకొన్నాము.”
“రఘనందన బావ.. దశరధనందన ఆ పార్టీలో మీతో కలిశాడా!..”
“కలిశాడు.”
“రఘనందన చెల్లెలు భానుప్రియ.. నీ కాలేజ్ మేట్ కదూ!..”
“అవును.”
“ఆమెను గురించి నీ అభిప్రాయం ఏమిటి?”
ఫణీంద్ర ఆశ్చర్యంతో మురారి ముఖంలోకి చూచాడు. అతనికి చిరు చెమటపట్టింది. తలదించుకొన్నాడు.
కొన్ని క్షణాల్లో తమాయించుకొని..
"ఏమిటి సార్ యీ ప్రశ్న. ఆమె ఫస్టు యియ్యర్ లో చేరినప్పుడు నేను ఫయినల్ యియ్యర్, ఆమె నా క్లాస్ మేట్ కాదు.”
"ఫణీంద్రా!.. ఆ విషయం నాకూ తెలుసు. నీవు ఆమె కాలేజీకి వచ్చిన మొదటి రోజున ర్యాగింగ్ పేరిట ఆమెను ఏం చేయమన్నావు?”
యింతలో ఆదినారాయణ అక్కడికి వచ్చాడు. మురారి కుర్చీ నుంచి లేచి ముందుకు నడిచి..
“రండి బాబాయ్!.. కూర్చోండి." సాదరంగా ఆహ్యానించాడు.
ఆదినారాయణ నవ్వుతూ కుర్చీలో కూర్చున్నాడు.
మురారి తన స్థానంలో కూర్చున్నాడు.
“బాబాయ్.. వీరే ఫణీంద్ర. బంగారన్న సుపుత్రుడు.”
ఆదినారాయణ ఫణీంద్రను పరీక్షగా చూచాడు. ఆయన చూపుల్లోని తీక్షణతను చూచి తట్టుకోలేక ఫణీంద్ర తలను దించుకొన్నాడు.
“ఎంత వరకూ వచ్చింది నీ విచారణ?”
“క్లయిమ్యాక్స్ బాబాయ్." నవ్వాడు మురారి.
“సరే!.. సాగించు.”
“ఫణీంద్రా!.. చెప్పు.. తొలిరోజు భానుప్రియ కాలేజీకి రాగానే ఆమెను నీవు ఏం చేయమన్నావు?”
"కోతిలా గెంతుతూ కాలేజ్ కాంపస్ చుట్టూ తిరిగి రమ్మన్నాను.” మెల్లగా భయంతో పలికాడు ఫణీంద్ర.
“ఆమె అలా చేసిందా!..”
“లేదు. నేను ఆమెను బెదిరించాను. విమర్శించాను.”
“అప్పుడు ఆమె ఏం చేసింది?..”
“నన్ను తన చెప్పుతో కొట్టింది. వేగంగా నడిచి ఏడుస్తూ కార్లో కూర్చొని యింటికి వెళ్ళిపోయింది.”
హీన స్వరంతో, భయంతో చెప్పాడు ఫణీంద్ర.
“అంటే.. ఆ కారణంగా నీకు భానుప్రియ మీద పగ. అవునా!..” గద్దించాడు మురారి.
ఫణీంద్ర నేరస్థుడిలా తలదించుకొన్నాడు.
“ఆ రాత్రి పార్టీ ముగిసిన తర్వాత ఏం చేశావ్?”
“మా యింటికి వెళ్ళిపోయాను.”
"ఎప్పుడు?”
“వెంటనే..”
"ఫణీంద్రా!.. యిది పోలీస్ స్టేషన్. వీడు సర్కిల్ ఇన్ స్పెక్టర్.. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్. నీవు మాతో నిజం చెప్పాలి. లేకపోతే.. నిన్ను ఆ కటకటాల వెనక్కు త్రోసి.. బడిత పూజ చేసి, నీ చేత నిజం చెప్పిస్తామ్. నిజం చెప్పు.” ఫణీంద్ర ముఖంలోకి క్రోధంగా చూస్తూ పలికాడు ఆదినారాయణ.
ఫణీంద్ర హడలిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళునిండాయి.
“తప్పతాగి ఆ రాత్రి నీవు ఏం చేశావో చెప్పు?” గద్దించాడు మురారి.
"నా మిత్రులు వెళ్లిపోయారు. రఘనందన యింట్లోకి వెళ్ళిపోయడు. దశరధనందన మైకంలో నడవలేకపోయాడు. అతన్ని మేడ మీది తన గదిలోనికి చేర్చాను. మంచంపై కైపుతో తూలి పడిపోయాడు. నేను మెట్లు దిగి క్రిందకు వచ్చాను. ట్యాప్ క్రింద తల వంచి.. తల వరకూ స్నానం చేశాను. నందన గదిలోనికి వెళ్ళాను. టవల్తో తల తుడుచుకొన్నాను. వాణ్ణి వరండాలో పడేశాను.
రెండు గదులకు మధ్యన వున్న తలుపు తెరిచాను. మంచంపై భానుప్రియ నిద్రపోతూవుంది. కరంట్ ఫెయిల్ అయింది. మెల్లగా నేను భానుప్రియ మంచం వద్దకు, తలుపు మూసి నడిచాను. మంచంపై కూర్చుని, భానూను లేపాను. నాకు మిమిక్రీ చేయడం తెలుసు కాబట్టి దశరధనందన గొంతుతో భానును పలకరించాను.
తన్ను పెండ్లిచేసుకొంటానని చెప్పాను. ఆమె ఆనందంగా నాదరికి చేరింది. నా చేతుల్లో వాలిపోయింది. తర్వాత..” చెప్పటం ఆపేశాడు ఫణీంద్ర. నిట్టూర్చి కన్నీటిని తుడుచుకొని..
“రెండు గంటల తర్వాత భానూ నిద్రపోయింది. నేను నందన గదిలో ప్రవేశించి మెట్లుదిగి మాయింటికి వెళ్ళిపోయాను." నేరస్థుడిలా కన్నీటితో తలదించుకొన్నాడు ఫణీంద్ర.
“అంటే.. నీవు తప్పు చేశావన్నమాట?" మురారి ప్రశ్న.
“అవును సార్!.. నన్ను క్షమించండి. నేను భానుప్రియను పెండ్లి చేసుకొంటాను.” గద్గద స్వరంతో పలికాడు ఫణీంద్ర.
“నిన్ను క్షమించవలసింది మేము కాదు భానుప్రిమ.” సాలోచనగా పలికాడు ఆదినారాయణ.
ఆ ముగ్గురూ కార్లో ఆదినారాయణ యింటికి వచ్చారు. అదే సమయానికి ముందు మన్మధరావు, తర్వాత కొద్దినిముషాల్లో బంగారన్నా అక్కడికి వచ్చారు.
ఆదినారాయణ వారిని సాదరంగా ఆహ్వానించాడు.
“కంగ్రాచులేషన్స్ మన్మధరావు.. యం.పి. అయినందుకు.” నవ్వుతూ చెప్పాడు. అతనితో చేయి కలిపి కరచాలనం చేశారు.
“బంగారన్న!.. నమస్కారాలు. కులాసానా!..”
“ఆఁ.. ఆఁ.. బాగుండా! అర్జంటుగా రమ్మంటివి. ఎందుకు?..
“రండి మాట్లాడుకుందాం!..” తన ఆఫీసు గదిలోకి ప్రవేశించాడు. మురారి, మన్మధరావు, బంగారన్న ఫణీంద్ర వారిని అనుసరించాడు. ఆదినారాయణ చెప్పడంతో అందరూ కుర్చీలల్లో కూర్చున్నారు. మురారి కుర్చీని లాక్కొని ఆదినారాయణ ప్రక్కగా కూర్చున్నాడు.
“ఏరా పిల్లని చూచినావా?.." కొడుకును చూస్తూ అడిగాడు బంగారన్న.
ఫణీంద్ర తలదించుకొన్నాడు.
"చూచాడు. యిప్పుడు కాదు ఎప్పుడో!.." ఫణీంద్రను చూస్తూ చెప్పాడు ఆదినారాయణ నవ్వుతూ.
“ఏంది ఆదినారాయణా!.. నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలా!..” బంగారన్న ఆశ్చర్యంతో చూచాడు.
“అర్థం అవుతుంది. మురారీ.. కానీ!..”
మురారి టేప్ ను ఆన్ చేశాడు. ఫణీంద్ర ముద్దు పలుకులను విన్నారు. మన్మధరావు, బంగారన్న.. ఆశ్చర్యపోయారు.
ఆవేశంతో మన్మధరావు.. ఫణీంద్రను కొట్టబోయాడు. మురారి.. అతన్ని పట్టుకొని ఆపాడు. బంగారన్న తల పట్టుకొని విచారంగా కూర్చున్నాడు.
“అంతా విన్నారుగా!.. యిది అవేశానికి సమయం కాదు. విషయం.. ఒక ఆడపిల్ల జీవిత సమస్య. పెద్దలు.. మీరిరువురూ.. ఒకే నిర్ణయానికి రావాలి. భానుప్రియకు.. ఫణీంద్రకు వివాహం జరిపించాలి. మీ హితుడుగా నేను యిచ్చే సలహా యిది. పాటిస్తే అందరికీ మంచిది. ” ఎంతో అనునయంగా పలికాడు ఆదినారాయణ.
“అన్నా!.. నీవు మంగతో నందన.. భానూ, రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొన్నారని చెప్పింది..” ఎంతో ఆత్రంగా అడిగాడు మన్మధరావు.
“అబద్ధం.. నీవు ఆవేశంతో నందనను భానూను.. హింసిస్తావని అలా చెప్పాను. వయస్సులో చిన్నవాడైనా నందన.. మనకంటే ఎంతో గొప్ప మనస్సు వున్నవాడు. మీ యింట్లో వుండి అనుక్షణం మీ కఠోర సంభాషణ వింటూ బాధపడుతుందని.. ఆమె శ్రేయస్సు కోరి.. యిక్కడికి తీసుకొని వచ్చాడు. వాడు మన బావగారు దశరధరామయ్య కొడుకు కదా!.. మంచిని గురించి ఆలోచించడం తప్ప చెడ్డను గురించి ఆలోచించే అలవాటు ఆ రక్తానికి లేదు.
ఫణీంద్ర చిన్నవాడు.. ఆవేశంతో తప్పుచేశాడు. తన తప్పును ఒప్పుకొన్నాడు. యిక.. మీ యిరువురూ ఆనందంగా చేతులు కలపండి. భానూకు ఫణీంద్రకు వివాహం జరిపించండి. నా భార్య ఊర్మిళ.. భానుకు విషయాన్ని వివరించింది. ఆమెకు నచ్చ చెప్పింది. తనూ.. ఫణీంద్ర విషయంలో తప్పు చేశానని ఒప్పుకుంది. ఆమె నీ కూతురు కదా మన్మధా..” నవ్వుతూ వారిని చూస్తూ తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించాడు.
ఫణీంద్ర.. అశ్రునయనాలతో తండ్రిని.. మన్మధరావును పాదాలు తాకి క్షమాభిక్షను కోరాడు.
మిత్రులు మన్మధరావు, బంగారన్నలు చేతులు కలిపారు. కౌగలించుకొన్నారు. త్వరలో మంచి ముహూర్తాన వారి వివాహం జరిపిద్దాం అనే నిర్ణయానికి వచ్చారు. యింతలో సునంద.. శాంతారామ్ లు అక్కడికి వచ్చారు.
“భోజనాలు వడ్డించాము మామయ్యా!.. అందరూ రండి.” అంది సునంద.
అనంతరం అందరూ కలసి ఆదినారాయణ యింట్లో విందు ఆరగించారు.
*
నందన, భారతి నెల్లూరిలోని ఆదినారాయణగారి నిలయం చేరారు. ఊర్మిళ సునంద.. భారతికి స్వాగతం పలికారు. శాంతారామ్ ప్రేమతో నందనను కౌగలించుకొన్నాడు. అభినందనలను తెలియజేశాడు.
భారతి చాలా అందగత్తె. శాంతారామ్ సునంద నందనలతో కలసి బి.టెక్ చదివింది. సునంద తన అత్తమామలకు ముందుగానే వివరించింది. కనుక ఆ యింటి వారంతా భారతిని ఎంతగానో అభిమానించారు. ఆదరించారు.
భోజనానంతరం ఆదినారాయణ భారతి నుండి ఆమె తండ్రి ఛటర్జీ సెల్ నెంబర్ తెలుసుకొని విషయాన్ని వివరించారు. మొదట ఛటర్జీ ఆగ్రహంతో ఆవేశంగా.. మాట్లాడినా, ఆదినారాయణగారి మృదుమధుర వచనాలకు శాంతపడి.. 'త్వరలో మిమ్మల్ని కలవడానికి వస్తున్నామని. ప్రశాంతంగా చెప్పాడు.' అందరి వదనాల్లో ఆనందం.
చెప్పిన ప్రకారం.. ఛటర్జీ వారి అర్ధాంగి ఈశ్వరి నెల్లూరు రాలేకపోయారు. ఆదినారాయణ వారికి ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడిగాడు.
చటర్జీ గారు, తన మామగారి అనారోగ్య కారణంగా చెప్పిన ప్రకారం నెల్లూరికి రాలేక పోయామని, త్వరలో వస్తామని ఆదినారాయణకు తెలియజేశారు.
భారతి తన తల్లి తండ్రితో ఎంతగానో భయపడుతూ మాట్లాడింది. ఆదినారాయణ గారి మాటలు వారికి బాగా నచ్చిందని భారతితో వారు ప్రీతిగానే మాట్లాడారు. ఆమె తాతగారి ఆరోగ్యం చక్కబడగానే నెల్లూరు వస్తానని చెప్పారు. భారతికి ఆనందం. సునంద, శాంతారాం, ఊర్మిళ, ఆదినారాయణ, దశరథనందన భారతిని గురించి చర్చించుకున్నారు.
ఆదినారాయణగారు అల్లూరికి వచ్చాడు. దశరధరామయ్య గారిని కలిసాడు. కుటుంబ యోగక్షేమాలను గురించి విచారించాడు. తను తెచ్చిన టేప్ ఆన్ చేశాడు. టేప్ ప్రసారం ముగిసింది.
“బావా!.. మన నందన నిర్దోషి..” నవ్వుతూ పలికాడు ఆదినారాయణ.
దశరధరామయ్య అంతా విని.. ఆశ్చర్యపోయాడు.
ఆవేదనతో కన్నీరు కార్చాడు.
"బావా! ఏమిటిది?.. పులి కడుపున పిల్లి పుట్టదు కదా ! బావా !.. యిది మీరు ఎంతగానో సంతోషించాల్సిన సమయం. ఏడవకండి.” అనునయించాడు ఆదినారాయణ.
“నా బిడ్డను నేను అవమానించాను. అసహ్యించుకొన్నాను. యింటి నుంచి బయటికి గెంటాను. బావా!.. మీరు నన్ను క్షమించగలరా!..” దీనంగా గద్గద స్వరంతో పలికాడు దశరధరామయ్య.
“బావా!..ఎంతమాట!..నేను మిమ్మల్ని క్షమించడమా.. మీరు మేరుపర్వతం బావా !.. మీ ముందు నేను చాలా చిన్నవాణ్ణి. నాకు ఏనాడూ.. మీ మీద కోపంలేదు. రాదు.” ఎంతో భవ్యంగా చెప్పాడు ఆదినారాయణ.
అక్కడే వుండి.. అంతా విన్న సుందరి కూడా.. పశ్చాత్తాపంతో.. కన్నీరు పెట్టుకొంది. బాధపడింది.
బావగారి వద్ద శలవు తీసుకొని ఆదినారాయణ నెల్లూరికి కార్లో వెళ్ళిపోయారు.
శంకరయ్య సుశీలా అక్కడికి వచ్చారు. అంతులేని ఆవేదనతో కళ్ళు మూసుకొని వున్నదశరధరామయ్యను సమీపించారు. సుశీల తన పవిట చెంగుతో అన్నగారి కన్నీళ్ళను తుడిచింది.
“అన్నయ్యా!.. మన నందన నేరస్థుడు కాదు. వాడు ఆ నేరం చేయలేదు.” అనునయంగా పలికింది సుశీల.
“బావా!.. రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఫ్యాక్టరీ ఓపినింగ్ బావా!.. మీరు వచ్చి నందనను ఆశీర్వదించి.. వాణ్ణి మన యింటికి తీసుకొని రావాలి.” అభ్యర్ధనగా అర్ధించాడు శంకరయ్య.
“అవును అన్నా! నీవు తప్పకుండా మాతో రావాలి." అన్నగారి చేతులు పట్టుకొని ప్రాధేయపూర్వకంగా చెప్పింది సుశీల.
సుందరి, గోపీనందన హిమబాల వరండాలోకి వచ్చి దశరధరామయ్యను సమీపించారు. హిమబాల తండ్రిని సమీపించింది. తన చేతుల్లోకి తండ్రి ముఖాన్ని తీసుకొని.. ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.. “నాన్నా!.. మా అన్నయ్య చాలామంచివాడు. మేము కలిసినప్పుడల్లా మిమ్మల్ని గురించి అమ్మను గురించి పదే పదే అడుగుతాడు నాన్నా!.." బొంగురుపోయిన కంఠంతో పలికింది హిమబాల.
“నాన్నా!.. ఫ్యాక్టరీ ఓపెనింగ్ కు రాకపోతే.. మేమూ వెళ్ళలేము నాన్నా.. మనం వెళ్ళకపోతే అన్నయ్య పాపం.. ఎంతగానో బాధ పడతాడు నాన్నా..మీరు వస్తానని మాతో చెప్పండి నాన్నా!.. చెప్పండి.” తండ్రి చేతులు పట్టుకొని కన్నీటితో చెప్పాడు గోపీనందన.
“హిమబాలా!.. గోపీనందన!.. మనమంతా కలసి అన్నయ్య ఫ్యాక్టరీ ఫంక్షన్ కు వెళుతున్నాము. మీరు బాధ పడకండి.” అశ్రునయనాలతో తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేసింది సుందరి.
భార్య ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు దశరధరామయ్య.
“మనమంతా కలిసి వెళ్ళి నా పెద్ద బిడ్డకు ఆనందాన్ని కలిగించాలి బావా!.. నా మాటను మన్నించండి.” ఎంతో ప్రీతిగా భర్త కళ్ళల్లోకి చూస్తూ పలికింది సుందరి.
దశరధరామయ్య కుర్చీ నుంచి లేచాడు. అందరి ముఖాలనూ పరీక్షగా చూచాడు. వారి అందరి కళ్ళలోనూ వారికి ఒకే భావన.. అభ్యర్ధన.. గోచరించింది. మనస్సుకు చాలారోజుల తర్వాత.. ఎంతో శాంతి కలిగింది.
“అవును!..మనం.. మీ అమ్మ చెప్పినట్లే చేద్దాం.” ఆనందంగా పలికాడు. హిమబాలా.. గోపీనందనలు తమ తండ్రిని కౌగలించుకొన్నారు.
అందరి హృదయాల్లో.. ఎంతో ఆనందం, సంతోషం.
దశరధరామయ్య వేగంగా హాల్లోకి వెళ్ళాడు. తండ్రి, తల్లీ.. ఫోటోలు గోడకు తగిలించి వున్నాయి. వాటిని పరీక్షగా చూచాడు.
“నాన్నా, అమ్మా!.. మన దశరధనందన నిర్దోషి. మన నందన ఏ నేరాన్ని చేయలేదు. నేను వెళ్ళివాణ్ని కలుస్తాను. మన యింటికి తీసుకొస్తాను. యిప్పుడు నీకు.. సంతోషమే కదా నాన్నా!.. సంతోషమే కదా!..” చెమ్మగిల్లిన కళ్ళును పై పంచెతో తుడుచుకొన్నాడు. వేగంగా ఫోన్ దగ్గరకు వెళ్లి పుండరీకకు ఫోన్ చేసి.. వెంటనే వచ్చి తనను.. కలవమన్నాడు. ఆయనలోని పూర్వపు వేగాన్నీ.. మాట తీరుకు అందరూ సంతోషించారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentários