top of page

జీవన రాగాలు ఎపిసోడ్ 14



'Jeevana Ragalu Episode 14'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 19/07/2024

'జీవన రాగాలు ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. ఆయన భార్య పేరు సుందరి. దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో జరుగుతుంది. వారికి కవలలు పుడతారు. ఆ పిల్లలకు దశరథ నందన, సునంద అని పేర్లు పెడతారు. 


గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య, బండి నడిపే ఫకీరా మరణిస్తారు. 


పిల్లల్ని, దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి కౌసల్య చెల్లెలు సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దలు. వారి పిల్లలే గోపినందన, హిమబాల. పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది. 


దశరథనందన వివాహం మన్మధరావు కూతురు భానుప్రియతో జరిపించాలనుకుంటుంది సుందరి. 


తాగిన మైకంలో దశరథనందన, భానుప్రియను బలాత్కారం చేసినట్లు ఆరోపిస్తారు మన్మధరావు, అతని భార్య మంగ. నందనను ఇంటినుంచి వెళ్లిపొమ్మంటాడు దశరథరామయ్య. 


తానూ ఏ తప్పూ చేయలేదని విశ్వసిస్తాడు నందన. నిజం నిరూపించడానికి సర్కిల్ ఇన్ స్పెక్టర్ మురారి సహాయంతో నిజం నిరూపిస్తాడు. ఫణీంద్ర తను తప్పు చేసినట్లు అంగీకరిస్తాడు. 

దశరధనందన నిర్దోషి అని అందరికీ తెలుస్తుంది. తను ప్రేమించిన భారతిని కలకత్తా నుండి తీసుకొని వస్తాడు నందన. 



ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 14 చదవండి. 


ఆ ఉదయం దశరధరామయ్య మూడు గంటలకు లేచి స్నానం.. పూజా ముగించారు. గ్లాస్ కో లాల్చీ.. ధోవతి.. పై పంచా ధరించారు. యింతలో పుండరీక అక్కడికి వచ్చాడు. 

“సుందరీ!.. ”


మరుక్షణంలో.. సుందరి పిల్లలు అందంగా తయారైన వారు దశరధరామయ్య ముందు ప్రత్యక్షమైనారు. 


“మీరు!.. ” వారిని చూచి ఆశ్చర్యంతో అడిగాడు దశరధరామయ్య. 


“నాలుగు గంటలకు లేచి మేము నీకంటే ముందే రెడీ అయ్యాం నాన్నా!.. ” నవ్వుతూ పలికింది హిమబాల. 


“దశరధా! బయలుదేరుదామా!.. ” చిరునవ్వులు చిందిస్తూ అడిగాడు పుండరీక. 


భర్తను సమీపించి సుందరి ఆయన కళ్లల్లోకి చూస్తూ.. “యిక మనం బయలుదేరాలి బావా!.. ” చిరునవ్వులు చిందిస్తూ చెప్పింది సుందరి. 


“పదండి. ” ఆనందంగా ముందుకు నడిచాడు దశరధరామయ్య. 


అందరూ వరండా దాటి భవంతి ముందుకు వచ్చారు. గుర్రబండి, కారు, సిద్ధంగా వున్నాయి. మస్తాన్.. యజమానికి నమస్కరించాడు. 


“సుందరీ!.. నేను పుండరీక గుర్రబండిలో వస్తాము. నీవు పిల్లలు కార్లో రండి. నాన్నా!.. గోపీ!.. కారును జాగ్రత్తగా నడుపు.” నవ్వుతూ చెప్పాడు. దశరధరామయ్య. 


“అలాగే!.. ” సుందరి. గోపీనందన ఒకేసారి నవ్వుతూ పలికారు. 


అర్ధగంటలో.. గుర్రబండి.. కారు ఫ్యాక్టరీ ముందు ఆగాయి. అందరూ వాహనాలను దిగారు. 

వారికంటే ముందుగా అక్కడికి వచ్చిన శంకరయ్య సుశీల, నారాయణ, వారిని చూచి.. ఎంతో ఆనందంతో వారిని సమీపించారు. ఆనందంగా.. అందరూ గేటు ముందుకు వచ్చారు. దశరధరామయ్య అర్ధాంగి ముఖంలోకి చూచాడు.


సుందరి గేటు ముందు కర్పూరాన్ని వుంచింది. వెలిగించింది. కర్పూరహారతిని కళ్ళకు అద్దుకొని అందరూ ఫ్యాక్టరీలో ప్రవేశించారు. శంకరయ్య ప్రతి కట్టడాన్ని యంత్రాన్ని గురించి వివరించాడు. అన్ని వైపులా తిరిగి అందరూ గేటు ముందుకు వచ్చారు. అప్పుడు సమయం ఏడున్నర. 

రెండు కార్లు వచ్చి గేటు ముందు ఆగాయి. 


నందన, భారతి.. సునంద, శాంతారామ్ ఒక కారు నుంచీ.. ఆదినారాయణ, ఊర్మిళ, భానుప్రియ మరో కారునుంచీ దిగారు. 


నందన.. గేటుకు ఆవలివైపున వున్న తన వారినందరినీ చూచాడు. పరుగున వారి వద్దకు వెళ్లాడు. దశరధరామయ్య చేతులు జాచాడు. అశ్రుపూరిత నయనాలతో “నాన్నా!.. ” తండ్రిని గట్టిగా కౌగలించుకొన్నాడు.


ఆ కౌగిలి వారిని ఏకం చేసింది. యిరువురూ.. అవధులు లేని ఆనందంతో కన్నీరు కార్చారు. సుందరి.. నందన చేయి పట్టుకొని తన హృదయానికి హత్తుకుంది. “అమ్మా!.. ” అవ్యాజానురాగంతో పసికందులా ఆమె బాహువుల్లో ఒరిగిపోయాడు. మిగతా అందరూ వారిని సమీపించారు. అందరినీ చిరునవ్వుతో ఆహ్వానించారు.. దశరధరామయ్య సుందరీ దంపతులు. 


“మావయ్యా!.. యిదంతా మేము మీ ఆశీర్వాద బలంతోనే చేయకలిగాము. మీరు యిచ్చటికి మాకంటే ముందు రావటం మా అందరికీ ఎంతో సంతోషం. ” దశరధరామయ్య చేతులు పట్టుకొని చెప్పాడు శాంతారామ్. 


“యిందులో నా గొప్పతనం ఏమీ లేదయ్యా!.. అంతా మీ సంకల్ప బలం. ఆ సర్వేశ్వరుని నిర్ణయం.. ” నవ్వుతూ పలికాడు దశరధరామయ్య. 


“బావా!.. మిమ్మల్ని యిక్కడ సకుటుంబంతో చూడటం నాకు ఎంతో.. ఆనందంగా వుంది. ”


“బావా!.. నందన.. శాంతారామ్ వారి లక్ష్యాన్ని సాధించారంటే.. వారి వెనుక వుండి వారిని ముందుకు నడిపించిన రథసారధి నీవేకదా!.. ” ఆనందంతో ఆదినారాయణ ముందు చేతులు జాచాడు దశరధరామయ్య.


సంతోషంతో ఆ బావమరదులు కౌగలించుకొన్నారు. 


యింతలో మురారి.. అతని భార్య ప్రశాంతి.. మన్మధరావు, మంగమ్మ, రఘునందన.. బంగారన్న.. ఫణీంద్ర.. వారి వారి వాహనాల్లో వచ్చి వీరందరినీ కలిశారు. కుశల ప్రశ్నలతో పరస్పర ఆదరాభిమానాలును తెలియజేసుకొన్నారు. వూరిజనం అంతా అక్కడికి చేరారు. 


జిల్లా కలెక్టర్.. పి. వి. నారాయణ శర్మ.. సతీమణి అనసూయతో వేంచేశారు. అందరూ వారిని సాదరంగా ఆహ్వానించారు. వేదికను సమీపించారు. 


కలెక్టర్ గారు.. ఆదినారాయణ, దశరధరామయ్య వేదిక పైన వున్న ఉచిత ఆసనాల్లో కూర్చున్నారు. మిగతా వారంతా.. వేదికకు ముందు అమర్చియున్న కుర్చీలలో కూర్చున్నారు. 

ఆదినారాయణగారు మైక్ ను సమీపించారు. 


"యీ కార్యక్రమానికి విచ్చేసిన నూ హితులకు.. ఆప్తులకు.. నా నమస్కారాలు. చక్కని క్రమశిక్షణతో పెంచబడి, బాగా చదివి విజ్ఞానాన్ని సంపాదించి.. యీ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ణయించుకొన్న మా దశరధనందన శాంతారామ్ కలల పంట యీ ఫ్యాక్టరీ. యీ ప్రాంతంలో వున్న.. కొన్ని పేదకుటుంబాలకు ఆశ్రయం కల్పించాలన్న వారి సత్ సంకల్పానికి యిది నిలయం. యీ నాటికి వారి ఆశయం ఫలించింది. వారి శ్రమకు ఫలితం దక్కింది. పెద్దలైన మీరంతా ఆ చిన్నవారిని ఆశీర్వదించాలనేదే నా కోరిక, యిప్పుడు మన జిల్లా కలెక్టర్.. పి. వి. నారాయణశర్మగారు.. ప్రసంగిస్తారు. ”


ఆదినారాయణగారు తన ఆసనాన్ని చేరారు. కలెక్టర్ గారు మైక్ ముందుకు వచ్చారు. 


“యీ ఫ్యాక్టరీ ఓపెనింగ్ శర్మనీకి విచ్చేసిన మీ అందరికీ నా నమస్సుమాంజలి. యీ నాడు మనమంతా యిక్కడ సమావేశం అయ్యామంటే.. దానికి ప్రధాన కారకులు యీ దశరధరామయ్యగారు. వారికి యిప్పటికి ఐదుసార్లు రాష్ట్రస్థాయిలో ఉత్తమ వ్యవసాయవేత్త గుర్తింపు.. అభినందనలు లభించాయి. ప్రక్క రాష్ట్రాల వారు.. వీరి వ్యవసాయ క్షేత్రాలను వీక్షించి వారిని తమ ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి.. వారి అమూల్య సలహాలను తీసుకొని వ్యవసాయాన్ని చేస్తున్నారు. వీరు వ్రాసిన వ్యవసాయ పుస్తకాలు ఎందరికో మార్గదర్శకం. వారి సుపుత్రుడు దశరధనందన, అల్లుడు శాంతారామ్ వారి వియ్యంకుడు ఆదినారాయణగారు.. యీ ఫ్యాక్టరీ నిర్మాణానికి కారకులు. మంచి ఆశయంతో వారు యీ కార్యాన్ని చేపట్టారు. శ్రమించారు. వారు తలచింది సాధించారు. ఆ సర్వేశ్వరుడు వారిని ఎల్లవేళలా చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. వారు నిండు నూరేళ్ళు.. సర్వసౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. నమస్తే.. ” కలెక్టర్ గారు తన ఆసనంలో కూర్చున్నారు. 


ఆదినారాయణ మైక్ ముందుకు వచ్చి “యిప్పుడు మా బావగారు.. దశరధారమయ్యగారు మాట్లాడుతారు. దశరధరామయ్యకు తన చేతిని అందించాడు. నవ్వుతూ దశరధరామయ్య మైక్ ముందుకు వచ్చారు. 


“పెద్దలందరికీ నా నమస్కారములు.. సిన్నలకు నా ఆశీర్వచనాలు. నేనెవరో మీకందరికి తెలుసు. కానీ.. నాకు సంబంధించింది మీలో కొందరికి తెలియనిది ఒకటుంది. అదేమిటంటే.. మా నాన్నగారు నాతో అప్పుడప్పుడూ చెబుతుండేవారు 'నాన్నా.. ! ముప్పై ఆరు కోట్ల జీవరాసుల్లో యీ మనవజన్మ చాలా గొప్పది. మనిషికి మనస్సు, మస్థిష్కం, జ్ఞాపకశక్తి మంచి చెడ్డలను విమర్శించి తెలసుకొనే జ్ఞానశక్తి వున్నాయి. ఎప్పుడూ మంచిని గురించి ఆలోచించాలి. మనసాటి వారిని మనతో సమానంగా భావించాలి. వారేదైనా కోరితే మనకు వున్నంతలో వారికి యిచ్చి వారిని సంతోష పరచాలి.. స్వార్థం, మోసం, ఆవేశం, అబద్ధం, అవినీతి మనిషి పతనానికి దారితీస్తాయి. అవి తాల్కాలికంగా మనిషికి ఆనందం కలిగించినా.. కడకు అవి మనిషికి శాంతి, సౌఖ్యం లేకుండా చేస్తాయి..


మన సంకల్పం.. చర్య మంచిదైతే ఆ సర్వేశ్వరుడు మన పక్షాన వుంటాడు. యిది మా నాన్నగారు నాకు నేర్పింది. నేను యింత వరకూ ఆచరించింది. దీన్నే నేను నా బిడ్డ నందనకు నేర్పాను.. వాడు దాన్ని నమ్మి ఆచరించాడు. ఫలితాన్ని ఈ రోజు మీరంతా చూస్తున్నారు. మీరంతా మీ సంతతికి మంచిని నేర్పండి. వారు మంచి మార్గంలో నడిచి మీకు కీర్తిప్రతిష్టలను చేకూరుస్తారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా!.. యిది పెద్దలు పలికిన పాత సామెత. ఆలోచిస్తే.. అందులో ఎంతో అర్థం వుంది.. 


నా ప్రాణసమానుడు, మా బావగారు ఆదినారాయణ.. మా అల్లుడుగారు శాంతారామ్.. నా కొడుకు దశరధనందనల కోర్కెను మన్నించి యిక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ”

దశరధరామయ్య ప్రసంగాన్ని ముగించాడు. చేతులు జోడించాడు. వెళ్ళి తనస్థానంలో కూర్చున్నారు. 


తర్వాత.. శాంతారామ్, నందనలు ఫ్యాక్టరీని గురించి, వుత్పత్తిని గురించి వివరించారు. 

అందరూ.. ఎలట్రికల్ రూమ్ ను సమీపించారు. కలెక్టర్ గారు రిబ్బన్ కట్ చేశారు. ప్యానల్ బోర్డుకు పుండరీక పూజచేశాడు. హారతిని యిచ్చాడు. నందన కలెక్టర్ గారిని సమీపించి ఒక బటన్ చూపి ఆన్ చేయవలసిందిగా కోరాడు. 


కలెక్టర్ గారు దశరధరామయ్యగారి భుజంపై చేయివేసి వారిని ముందుకు రమ్మన్నారు. దశరధరామయ్య వారి ముఖంలోకి చూచాడు. 


“దశరధరామయ్యగారూ!.. యీ పని మీరు చేయాలి. ” నవ్వుతూ పలికాడు కలెక్టర్. 


దరహాసవదనంతో దశరధరామయ్య బటన్ నొక్కారు. ఫ్యాక్టరీలోని అన్ని విద్యుత్ దీపాలూ వెలిగాయి. మరో బటన్ నొక్కాడు.. యాంత్రాలు పనిచేయడం ప్రారంభించాయి. 

కరతాళధ్వనులతో ఆ హాలు మారుమ్రోగింది. అందరూ అల్పాహారవిందుకు ఏర్పాటు చేసిన చోటికి చేరారు. 


ఆదినారాయణ దశరధరామయ్య ప్రక్క ప్రక్కన కూర్చున్నారు. వేదిక మీద.. అన్ని చోట్లా తిరుగుతున్న తనకు తెలియని భారతిని చూచాడు పరీక్షగా దశరధ. 

“ఆదినారాయణా!.. ఆ అమ్మాయి ఎవరు?”


"ఎలా వుంది బావా!.. ”


“సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిలా వుంది”


“నచ్చిందా మీకు!.. ”


“ఎంతగానో.. యిలాంటి అమ్మాయే నాకు కోడలుగా కావాలి. ”


"మన నందనతో కలిసి యం. టెక్ చదివింది. పేరు భారతి” దశరధరామయ్య కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ చెప్పాడు ఆదినారాయణ. 


క్షణంసేపు ఆగి.. నందనను పిలిచాడు. 

నందన వారిని సమీపించాడు. 


"మీ నాన్నగారు ఆ భారతిని కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. నీ అభిప్రాయం ఏమిటి?”


“మా నాన్నగారి నిర్ణయమే నా నిర్ణయం మామయ్యా.. ” చిరునవ్వుతో మెల్లగా పలికాడు నందన. 


“భారతిని పిలువు. ”


నందన వెళ్ళి భారతితో కలసి వచ్చాడు. 

వారిని సమీపించి చేతులు జోడించి.. “నమస్తే" మృదుమధురంగా దరహాస వదనంతో పలికింది భారతి. 


ఆమె వినయ విధేయతలు దశరధరామయ్యకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. 

“అమ్మా!.. నీ పేరేమిటి?” దరహాసవదనంతో అడిగాడు దశరధరామయ్య. 


“భారతి!.. ” చిరునవ్వుతో పలికింది భారతి. 


“నేనెవరో నీకు తెలుసా!.. ” నవ్వుతూ అడిగాడు దశరధ. 


"తెలుసు.. నాకు కాబోయే మామయ్యగారు. ” సిగ్గుతో తల దించుకొని పలికింది భారతి. నందన ముఖంలోకి చూచింది. 


నందన భారతీలు దశరధరామయ్య, ఆదినారాయణల పాదాలను తాకారు. 

వారిని మహదానందంతో ఆ యిరువురు పెద్దలు హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. 

భారతి, నందన వదనాల్లో కోటిదీపకాంతులు. 


తృప్తిగా అందరూ భోంచేశారు. కలెక్టర్ గారు.. మరోమారు అభినందనలు, ఆశీస్సులను నందనకు శాంతారామ్ సునంద భారతీలకు తెలియజేసి సతీమణితో కలిసి నెల్లూరు వైపుకు కార్లో బయలుదేరారు. 


అంతవరకూ ప్రేక్షక సమూహంలో ప్రేక్షకులై జరుగుతున్న కార్యక్రమాలను తిలకిస్తూవున్న బంగారన్న, మన్మధరావు బృందం దశరధరామయ్యను సమీపించారు. చేతులు జోడించారు. 

"మీరు మమ్మల్ని క్షమించండి. " ప్రాధేయపూర్వకంగా కోరారు. 


వారిని చూచి దశరధరామయ్య చిరునవ్వుతో పలకరించాడు. 


“మిమ్మల్ని క్షమించ వలసింది నేను కాదు నా కొడుకు దశరధనందన, వాడు మిమ్మల్ని యిక్కడికి వచ్చేలా ఆహ్వానించాడు. అంటే.. వాడికి మీ పట్లవున్న గౌరవం మీకు అర్థం అయ్యి వుంటుందనుకొంటాను. నాకు మీ మీద ఎలాంటి ద్వేషమూ లేదు. వుండదు. వుండబోదు. కారణం నాకు అందరూ నా వారుగా కావాలి. ” నవ్వుతూ ఎంతో ఆనందంగా చెప్పాడు దశరధరామయ్య. 

బంగారన్న, మన్మధరావు దశరధరామయ్యగారి చేతులు పట్టుకొని కళ్ళకు అద్దుకొన్నారు. 


“బావా!.. ఆదినారాయాణా!.. ”


“ఏం బావా!.. ” దశరధరామయ్యను సమీపించాడు ఆదినారాయణ. 


"ఫణీంద్రకు, భానుప్రియకు, నందనకు, భారతికి త్వరలో వివాహాలు జరిపించాలి. మనం యిరువురం కలకత్తాకు వెళ్ళి భారతి తల్లిదండ్రులను కలసి అన్ని విషయాలూ వివరంగా మాట్లాడి వద్దాం.. మన ప్రయాణానికి ఏర్పాట్లు.. ”


“నేను చేస్తాను బావా!” దశరధరామయ్య పూర్తి చేయకముందే ఆదినారాయణ చెప్పాడు ఎంతో ఆనందంగా. 


ఒక జ్యోతి నుండి వేయి జ్యోతులు వెలిగినట్లుగా దశరధరామయ్యగారి చుట్టూ వున్న ఆందరి వదనాల్లో ఆనందం వెల్లివిరిసింది. 

*

దశరథ నందన శాంతారాములు ఊహించిన దానికన్నా కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. అపోహలు కోపతాపాలు సమసి పోయి మన్మధరావు బంగారన్నలు సత్వగుణాభిమానులైనారు. ఆ ఇరు వర్గాల వారు దశరథ రామయ్య గారికి చెప్పి వారి ఊరికి వెళ్ళిపోయారు. 


ఆదినారాయణ, ఊర్మిళ, శాంతారాం, సునంద, దశరదనంద, భారతి, శంకరయ్య, సుశీల, నారాయణ, భానుప్రియ ఆనందంగా అందరూ దశరథ రామయ్య గారి భవంతికి చేరారు. 

ఆ రాత్రి భోజన పదార్థాలను సునంద సుశీల కలిసి మెనూ నిర్ణయించి ఆ ఊరిలో పేరున్న మల్లమ్మ గారి ద్వారా ఆహారాన్ని తయారు చేయించారు. అందరూ కలిసి భోజనం చేశారు. పడక గదుల్లోకి వెళ్లిపోయారు. సుశీల, భారతిలు ఒక గదిలో ఉన్నారు. దశరథ నందన ఆ గదిని సమీపించి భారతిని పిలిచాడు. 


“భారతి నా అల్లుడు నిన్ను పిలుస్తున్నాడు వెళ్ళిరా. ” చిరునవ్వుతో చెప్పింది సుశీల, దశరథ నందన మేనత్త. 


చిరునవ్వుతో తల ఆడించి భారతి గది బయటికి వచ్చేసింది. 


“రా మేడ పైకి వెళదాం!” చెప్పాడు దశరథ నందన. “ఎందుకు?” అడిగింది భారతి. 


"ఈ రాత్రి 10:30 సమయంలో మా టెర్రస్ పైనుండి మా గ్రామం నాలుగు వైపులా ఎలా ఉంటుందో చూద్దువుగాని.. !” చిరునవ్వుతో చెప్పాడు దశరథ నందన. 


ముందు అతను వెనుక భారతి మెట్లు ఎక్కి భవంతి రెండవ అంతస్తు టెర్రస్ పైకి వచ్చారు. ఇరువురు నాలుగు వైపులా చూశారు. 


తూర్పు వైపు హైవే నుంచి ఆ ఊర్లోకి రోడ్డు, ఇరుపక్కలా తోటలు, పడమట వైపున పంట కాలువలు, పొలాలు, చెరువు, దక్షిణం వైపున ఊర్లో శివాలయం, గ్రామ ఇళ్ళు దాటితే చిట్టడవి. దశరధనంద మనసులో గత జ్ఞాపకాలు. తన బాల్యం తన తల్లి, తాతయ్య - నానమ్మ గుర్తుకు వచ్చారు. 

“ఎలా ఉంది భారతి?" సాలోచనగా అడిగాడు. 


గ్రామ వీధి పైట్ల వలన.. అస్పష్టంగా వీధులు, ఇళ్ళు భారతికి గోచరించాయి. 

“రాత్రి సమయం కదా చీకటి వలన స్పష్టత లేదు కానీ చూచే దానికి ఆ చిన్న దీపాల వెలుగులో ఊరు అందంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు నేను చూసిన దృశ్యాన్ని రేపు డ్రా చేస్తాను.. ” నవ్వుతూ చెప్పింది భారతి. 


రెండు క్షణాల తర్వాత “నందా !.. ” భారతి దశరథ నందను ప్రేమగా అలా పిలుస్తుంది.

 

“ఏమిటి భారతి?”


“మీ నాన్నగారికి నేను నిజంగా నచ్చానా?”


“చాలా చాలా బాగా నచ్చావు.. !” నవ్వుతూ చెప్పాడు నంద. 


“నిజంగానే నచ్చానా? లేక నేను బాధపడకుండా ఉండాలని చెబుతున్నావా?”


"నిజం భారతి, మామయ్య ఆదినారాయణ గారు చెప్పారు. రేయ్ అల్లుడు నీ సెలక్షన్ సూపర్, భారతి పుత్తడి బొమ్మలాగా ఉందన్నాడు!” నవ్వుతూ చెప్పాడు నంద. 


నంద చెప్పిన దానికి ఆనందంగా నవ్వింది భారతి. 

ఇద్దరి మధ్య కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం. 


నంద నిశ్శబ్దాన్ని చీలుస్తూ “భారతి.. ! ఇప్పుడు నా మనసులో ఏముందో చెప్పగలవా?" అడిగాడు ఆకాశం వైపు చూస్తూ. 


నంద అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసిన భారతి “నాకు జోస్యం తెలీదు కదా !!!" గలగల నవ్వుతూ అడిగింది. 


నంద భారతి ముఖంలోకి గంభీరంగా చూడటంతో, నందకి కోపం వచ్చింది ఏమో అనుకున్నా భారతి “సారీ నంద, ఏదో సరదాగ అన్నాను. నిన్ను హర్ట్ చేయాలని కాదు!" అంది. 


భారతి ముఖం చిన్నపోవటం గమనించిన నంద, గట్టిగ నవ్వేసి “మన మధ్య సారీ ఎందుకు భారతి, నువ్వేం తప్పు అనలేదులే!” అన్నాడు నంద. 


మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం. 

“భారతి.. !” మళ్ళీ పిలిచాడు నంద. 


“చెప్పండి.. !” అంది భారతి. 


“ఎందుకో నా మనసు అంతా మా అమ్మ, నాన్నమ్మ, తాతయ్యల జ్ఞాపకాలు.. !" అన్నాడు 

సుదురాన మిణుకు మిణుకు అంటున్న చుక్కలనే తదేకంగా చూస్తూ. 


"అవేమిటో నాకు చెప్పండి.. !” అడిగింది భారతి ఆసక్తిగా. 


నంద భారతి వైపు చూసి “ముందు నీకు మా అమ్మ గురించి చెబుతాను!” అన్నాడు. భారతి నందకి కాస్త దగ్గరగా జరుగుతూ “చెప్పండి!” అంది. 


మేడ మీద స్టీల్ స్టాండ్లో ఊయల, దానికి ఆస్బెస్టాస్ షీట్స్ తో స్లోప్ గా రూఫ్, ఎండకి వానకి ఊయల తడవకుండా. నంద ఆ ఊయల ను సమీపించాడు, భారతి కూడా నంద వెనుకే వెళ్ళింది. నంద ఊయల పై కుర్చుని, భారతి ను కూడా కూర్చోమని సైగ చేసాడు. భారతి నవ్వుతూ అతని పక్కనే కూర్చుంది. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



24 views0 comments

Comments


bottom of page