జీవన రాగాలు ఎపిసోడ్ 3
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- May 17, 2024
- 6 min read
Updated: Jun 18, 2024

'Jeevana Ragalu Episode 3' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 17/05/2024
'జీవన రాగాలు ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. అయన భార్య సుందరి పుట్టింటికి వెళుతుంది.
దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య.
దశరథరామయ్యకు నలుగురు పిల్లలు. దశరథనందన, గోపీనందన కొడుకులు. సునంద, హిమబాల కూతుళ్ళు.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన.
గతంలో అయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది.
ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 3 చదవండి.
‘ఈ పుండరీకుడు యింకా రాలేదు. ' అసహనంగా తనలో తాను అనుకొంటూ గెస్టుహౌస్ వరండాలో పచార్లు చేస్తున్నాడు దశరధరామయ్య. కొద్దిక్షణాల తర్వాత పరుగున తనవైపుకు వస్తున్న పుండరీకశర్మను చూచాడు.
పుండరీకశర్మ వరండాలో ప్రవేశించి “హ.. ” సుదీర్ఘమైన నిట్టూర్పును విడచి.. “ఏమిటి మిత్రమా!.. వెంటనే రమ్మన్నావట?.. ” ఎగశ్వాసతో పలికాడు.
“అవును. ముఖ్యమైన విషయంలో నాకు నీ సలహా కావాలి. అందుకే పిలిచాను. ముందు కూర్చో.. ”
యిరువురూ సుఖాశీనులైనారు. దశరధరామయ్య వెంటనే లేచి వరండా ముందుకు నడిచాడు.
“వీరన్నా!.. వీరన్నా!.. ” బిగ్గరగా అరిచాడు.
పది సెకండ్లలో వీరన్న పరుగున వచ్చి.. "ఏం చినబాబూ!.. ” ఆత్రంగా అడిగాడు.
“నాలుగు టెంకాయలు కొయ్యి. నా మిత్రుడు ఎంతో అలసి వున్నాడు.. ” పుండరీకశర్మ వైపు చూస్తూ నవ్వుతూ చెప్పాడు దశరధరామయ్య.
“అట్టాగే చినబాబు. ” తలపంకించి వీరన్న వెళ్ళిపోయాడు.
“మిత్రమా!.. విషయం ఏమిటి?.. ” ఆత్రంగా అడిగాడు పుండరీకశర్మ.
"పుండరీక!.. మనం కావలి వెళ్ళాలి. ”
“ఎందుకు?.. ”
"అమ్మానాన్నా నాకు ఆ వూర్లో పిల్లను చూచారు. ”
"అంటే త్వరలో అయ్యగారికి వివాహం జరుగనున్న దన్నమాట. ” గలగలా నవ్వాడు పుండరీకశర్మ.
“అవును. ” నవ్వును ఆపుకోలేక తనూ పుండరీకశర్మకు వంత పాడాడు దశరధరామయ్య.
“చాలా మంచి వార్త మిత్రమా! సరే, చెప్పు. ఎప్పుడు వెళ్ళాలి?.. "
“రేపే. ”
"ఓ. కే. వెళదాం. ”
యిరువురు మిత్రులూ కరచాలనం చేసుకొన్నారు. యింతలో కోసిన నీళ్ళ టెంకాయలతో వీరన్న రంగంలో ప్రవేశించాడు. కాయలను యిరువురికీ అందించాడు. యిరువురూ పరమానందంతో నాలుగు కాయల నీళ్ళు త్రాగారు.
“యిక మాకు చాలు.. వీరన్నా! మిగతావి నీవు నీ భార్య త్రాగండి.. ” సంతుష్టుడై ఆనందంగా పలికాడు పుండరీక.
"వీరన్నా.. యిక మేము వెళతాం” చెప్పాడు దశరధరామయ్య.
“మంచిది చినబాబు. ” వినయంగా పలికాడు వీరన్న.
యిరువురు మిత్రులూ చేతులు పట్టుకొని వూరివైపుకు బయలుదేరారు.
*
ఉదయం తొమ్మిది గంటలకు మిత్రులు యిరువురూ కావలి రైల్వేస్టేషన్లో దిగారు. అడ్రసు వాకబుచేసి.. ఆ అమ్మాయి వాళ్ళ యింటి ముందుకు చేరారు.
కాలం కలిసివస్తే.. మొగకవలలు పుట్టారనే సామెతలా వధువు కౌసల్య.. ఆమె సోదరి సుందరి అదే సమయానికి వాకిట్లోకి వచ్చారు. గేటుముందు పుచ్చకాయలు తోపుడు బండి విక్రయదారుడు నిలబడివున్నాడు.
కౌసల్యా ఆమె చెల్లి.. బండిని సమీపించారు. మంచికాయలను పరిశీలనగా చూస్తున్నారు.
మంచి తరుణం. దశరధరామయ్య, పుండరీకశర్మ యిద్దరూ అమ్మాయిలను బాగా నేత్రానందంగా చూడగలిగారు.
యింతలో వారి జనని రంగప్రవేశం చేసింది. పేరు సంధ్య. "కౌసల్యా!.. యింతసేపు వీధిలో ఏం చేస్తున్నావ్!.. ” అంటూ బండిని సమీపించింది. రెండు కాయలు తీసి కూతుళ్ళ చేతుల్లో వుంచి..
“యిక పదండి లోపలికి. ” బండివాణ్ణి అడిగి యివ్వవలసిన డబ్బు యిచ్చేసింది. వెనక్కు తిరిగి చూసింది. పిల్లలు యిద్దరూ గేటు వద్ద నిలబడి వున్నారు. వారిని సమీపించి.. "ఏమిటే.. ఎందుకు యిక్కడ నిలబడ్డారు?.. ” తల్లి ప్రశ్న.
కౌసల్య తల్లిని సమీపించి.. “అమ్మా, అటుచూడు. ”
“ఎటు!.. "
“ఎదురింటి వైపు. అక్కడ యిద్దరు మొగవాళ్లు నిలబడి నన్నే చూస్తున్నారు. ” అమాయకంగా చెప్పింది కౌసల్య.
“ఏరీ!.. ” ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి చూచింది సంధ్య.
విషయాన్ని గ్రహించిన దశరధరామయ్య.. పుండరీక వేగంగా అక్కడి నుంచి ముందుకు నడిచారు.
సంధ్యకు వారి వెనుక భాగం కనిపించింది. కూతురు వంక తిరిగి.. “అది వీధి.. ఎందరో నడుస్తారు.. నిన్నే చూస్తున్నారనుకోవడం నీ తెలివి తక్కువతనం.. పద లోపలికి. ” చిరాగ్గా పలికింది సంధ్య.
“అది కాదమ్మా!.. ” ఏదో చెప్పబోయింది కౌసల్య.
“ఇక మాట్లాడకు. నడువు. ” శాసించింది సంధ్య.
తల్లీ కూతుళ్ళు వారి యింట్లో ప్రవేశించారు.
దశరధరామయ్య.. పుండరీకశర్మ రోడ్లో నడుస్తూ స్టేషన్ వైపుకు వెళుతున్నారు.
“పుండరీక.. పిల్ల ఎలా వుంది?.. ” చిరునగవుతో అడిగాడు దశరధరామయ్య.
పుండరీకశర్మ నిలబడి పోయాడు. దశరధరామయ్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూచాడు.
“ఏం.. ఆగిపోయావ్?.. ”
“నీవు మాట్లాడ్డం సరిగా లేదు. పిల్ల.. పిల్లేదిరా!.. మీ వదినగారు ఎలా వున్నారు?.. అని అడగాలి. ” నవ్వుతూ చెప్పాడు పుండరీకశర్మ.
“ఓ.. సారీ సోదరా!.. యిప్పుడు చెప్పు.. మీ వదినగారు ఎలా వున్నారు?”
పుండరీకశర్మ దశరధరామయ్య సమీపించి అతని కుడిచేతిని తన చేతిలోనికి తీసుకొని సంతోషంగా.. "దశరధ!.. మా వదినగారు రంభలా వున్నారు. నీవు చాలా అదృష్టవంతుడివి. ” తన సంతృప్తిని.. ఆనందాన్ని వ్యక్తం చేశాడు పుండరీకశర్మ.
గుడిలో గంటలు మ్రోగాయి. ఆ ధ్వని యిరువురి చెవులకు ఎంతో హాయిని కలిగించింది.
“ఆహా!.. తధాస్తు.. యిది ఆ దేవుడి పలుకు. పద దశరధ.. దేవుణ్ణి చూచి స్టేషన్ కు వెళదాం. ”
“సరే పుండరీక.. పద. ”
యిరువురు మిత్రులు శివాలయం వైపుకు నడిచారు. దేవుని దర్శించారు. కానుకలు సమర్పించారు. తమ యీప్సితం నెరవేరాలని కోరుకున్నారు.
పూజారిగారు యిచ్చిన తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. ఆనందంగా స్టేషన్ వైపుకు నడిచారు.
*
ఊయల హాలు మధ్యన వుంది. వెంకటరామయ్య అందులో శయనించి వూగుతూ వున్నారు.
ప్రక్కన వున్న సోఫాలో అర్ధాంగి పార్వతమ్మ కూర్చొని వుంది. ఆమె ఒడిలో సుశీల తల పెట్టుకొని శయనించి పాఠ్యపుస్తకాన్ని చదువుతూ వుంది. ఆమె తొమ్మిదవ తరగతి విద్యార్ధిని. వయస్సులో దశరధరామయ్య కన్నా పదిసంవత్సరాలు చిన్నది.
“ఏమండీ!.. బలరామశర్మగారు ఎన్ని గంటలకు వస్తానన్నాడు?.. ”
“నాలుగు గంటలకు. ” చేతి వాచీని చూచి.. "కొద్ది నిముషాల్లో వస్తారు పారూ!.. ” అనునయంగా పలికాడు వెంకటరామయ్య.
వరండాలో ప్రవేశించిన బలరామశర్మను చూచింది పార్వతమ్మ.
“సుశీ!.. లే. శర్మగారు వచ్చారు. ” అంది పార్వతమ్మ.
సుశీల చెంగున లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది.
వెంకటరామయ్యగారు ఊయల నుంచి దిగారు భార్యాభర్తలు శర్మగారికి ఎదురు వెళ్ళారు.
“నమస్కారం శర్మగారూ!.. రండి. ” సాదరంగా ఆహ్వానించాడు వెంకటరామయ్య.
“నమస్కారం” నవ్వుతూ ఆ దంపతులను అనుసరించాడు బలరామశర్మ.
“కూర్చోండి బాబాయ్. ” సాదరంగా చెప్పింది పార్వతమ్మ.
ఆ ప్రాంతం పల్లెటూళ్ళల్లో పెద్దవారిని ఏదో ఒక వరసతో పిలవడం పిన్నలకు ఆనవాయితీ. వారి ఆ సంబోధన ఏదైనా.. కులమాతాలకు అతీతం. ఆ పిలుపు ఒకరిపట్ల వేరొకరికి వున్న గౌరవ అభిమానాలను తెలియజేస్తుంది.
బలరామశర్మగారు సోఫాలో కూర్చున్నారు. ఎదుటివైపు సోఫాలో వేంకట రామయ్యగారు కూర్చున్నారు. “నిశ్చితార్ధానికి.. వివాహానికి ముహూర్తాలను నిర్ణయించారా బాబాయ్.. ” ఆతృతతో అడిగింది పార్వతమ్మ. చిరునవ్వుతో పంచాంగం మధ్యనుంచి ఒక కాగితాన్ని తీసి వెంకటరామయ్యగారికి అందించాడు బలరామశర్మ, పుండరీకశర్మ తండ్రిగారు.
“దివ్యమైన ముహూర్తాలను నిర్ణయించాను. పైనెల ఆరవతేది శనివారం ఉదయం తొమ్మిది పదన్నర మధ్య నిశ్చితార్థ ముహూర్తం. యిరవై ఆరవతేది రవివారం.. ఉదయం ఆరున్నర ఏడున్నర మధ్యకాలంలో వివాహానికి ముహూర్తం కుదిరాయి. యీ విషయాన్నే ఆ కాగితంలో వ్రాశాను. ”
“ఐదు నిముషాల్లో వస్తానండి. ” చెప్పి పార్వతమ్మ లోనికి వెళ్ళింది.
బలరామశర్మగారు అందించిన కాగితాన్ని వెంకట రామయ్య ఆసాంతం చదివారు. వారి వదనంలో ఎంతో ఆనందం.
"ధన్యవాదాలు బలరామశర్మగారు!.. ” కృతజ్ఞతా పూర్వకంగా చేతులు జోడించాడు
వెంకటరామయ్య.
ట్రేలో పండ్లు పూలు కొంత డబ్బు వుంచి.. పార్వతమ్మ హాల్లోకి వచ్చింది. బలరామశర్మను సమీపించి "బాబాయ్ తీసుకొండి. ” ఎంతో ప్రియంగా పలికింది.
“ఏమిటమ్మా యిది!.. ” చిరునగవుతో పలికాడు బలరామశర్మ.
"బాబాయ్!.. మా తృప్తికోసం. ” అనునయంగా చెప్పింది పార్వతమ్మ.
చిరునగవును చిందిస్తూ ట్రేని అందుకొన్నాడు బలరామశర్మ. ముందున్న టీపాయ్ పై వుంచాడు.
పనిమనిషి పెద్ద కవర్ తీసుకొని వచ్చి పార్వతమ్మకు అందించి లోనికి వెళ్ళిపోయింది.
ట్రేలోని పళ్ళను పూలను కవర్లో సర్దింది పార్వతమ్మ.
“అమ్మా!.. నాన్నా!.. ” యింటి ముంగిట నుంచి దశరధరామయ్య పిలుపు.
అందరూ వాకిటివైపు చూచారు. వేగంగా దశరధరామయ్య హాల్లోకి ప్రవేశించాడు.
“నేను యూనివర్సిటీ ఫస్టుగా పాసయ్యానమ్మా!.. ” తల్లిని సమీపించాడు ఎంతో సంతోషంతో.
“నా భవిష్యత్తు బాగుండాలని నన్ను ఆశీర్వదించండి నాన్నా. ” తండ్రి పాదాలు తాకాడు.
పరమానందంతో వెంకటరామయ్య కుమారుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు. హృదయపూర్వకంగా శుభ ఆశీస్సులను తెలియజేశాడు.
తర్వాత.. తల్లి.. బలరామశర్మలకు పాదాభివందనం చేశాడు దశరధ.
తల్లి “చల్లగా నూరేళ్ళు వర్ధిల్లు నాన్నా!” ఆనందంతో పలికింది పార్వతమ్మ.
"శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు" ఎంతో ప్రేమాభిమానాలతో దీవించాడు బలరామశర్మ.
వరండా ముందు కారు ఆగిన శబ్దం.. అందరూ ఆశ్చర్యంతో ఆ వైపు చూచారు. కారు నుంచి ఆనందరావు సంధ్య దిగారు.
వారిని చూచిన దశరధరామయ్య తన గదికి వెళ్ళిపోయాడు.
వెంకటరామయ్య పార్వతులు వరండాలోకి వచ్చారు. ఆనందరావు సంధ్యలకు స్వాగతం పలికారు. నలుగురూ హాల్లోకి వచ్చారు. వారి వదనాలు వికసించిన తామరపువ్వుల్లా వున్నాయి.
బలరామశర్మగారిని వచ్చిన వారికి పరిచయం చేశాడు వేంకటరామయ్య. “నమస్కారం శర్మగారు. ” చేతులు జోడించాడు ఆనందరావు.
“నమస్కారమండి. ” ప్రతి నమస్కారాన్ని తెలియజేశాడు బలరామశర్మ.
“కూర్చోండి అన్నయ్యా.. వదినా కూర్చోండి. ” వరసను కలిపి సాదరంగా పలికింది పార్వతమ్మ.
అందరూ కూర్చున్నారు. ఊయల పైనున్న కాగితాన్ని చేతికి తీసుకొని ఆనందరావు అందించి.. "వీరు నిశ్చితార్థానికి.. వివాహానికి ముహూర్తాలు నిర్ణయించారు. మేమూ రేపు వచ్చి మిమ్మల్ని కలవాలనుకొన్నాము. యిప్పుడు మీరు రావడం మాకు ఎంతో ఆనందంగా వుంది బావగారూ!.. " ఎంతో సంతోషంగా చెప్పాడు వెంకటరామయ్య.
ఆనందరావు కాగితంలోని విషయాన్ని పరిశీలనగా చూచి "సంధ్యా!.. చూడు.. ” అర్థాంగి చేతికి అందించారు.
సంధ్య కొద్ది క్షణాల తర్వాత నవ్వుతూ.. యీ ముహూర్తాలనే మా శాస్త్రిగారు నిర్ణయించారు” అంది.
“అమ్మా!.. మీ శాస్త్రిగారు ఎవరు?” బలరామశర్మగారి ప్రశ్న.
“విష్ణుశాస్త్రిగారు”
ఆ పేరు వినగానే ఆనందంగా నవ్వాడు బలరామశర్మ.
"శర్మగారూ!.. ఎందుకు నవ్వుతున్నారు" ఆశ్యర్యంతో బలరామశర్మ ముఖంలోకి చూచాడు వెంకటరామయ్య.
“వెంకటరామా!.. వాడు ఏవడోకాదు. నా చెల్లెలి భర్త నా శిష్యుడు” ఆనందంగా పలికాడు బలరామశర్మ.
“మంచి గురుశిష్యుల అనుబంధం అంటే.. యిదే కాబోలు.. ఒకే మాట ఒకే బాట.. ” సంతోషంగా పలికాడు వెంకటరామయ్య.
అందరూ మహదానందంతో గలగలా నవ్వుకొన్నారు.
“వెంకటరామా.. ” యిక నేను వెళ్ళివస్తాను. ” సోఫానుంచి లేచాడు బలరామశర్మ.
భార్య అందిన కవర్ ను చేతికి తీసుకొని బలరామశర్మతో వరండా మెట్లుదిగే వరకూ నడిచి ఆ కవర్ వారిచేతికి ఇచ్చాడు. బలరామశర్మ వీధివైపుకు నడిచారు. వెంకటరామయ్య యింట్లోకి ప్రవేశించారు.
“బావగారూ!.. మావాడు యూనివర్సిటీ ఫస్టు. యీ రోజే తెలిసింది. ”
"నేను మీకన్నా ముందే చెప్పేశాను" నవ్వుతూ అంది పార్వతమ్మ.
“అగ్రికల్చర్ లో డిగ్రీకదూ!.. ” అడిగాడు ఆనందరావు.
“అవును” వెంకటరామయ్యగారి జవాబు.
“చాలా సంతోషం బావగారు!.. ” సంధ్య వైపుకు తిరిగి..
"యిక మనం బయలుదేరుదామా!.. ” అడిగాడు ఆనందరావు.
“సరేనండి”
“వదినగారూ!.. వుండండి. ఐదునిముషాలు ఆగండి. ” వేగంగా యింట్లోకి పోయింది పార్వతమ్మ.
“అబ్బాయిగారు యింట్లోలేరా?” ఆనందరావుగారి ప్రశ్న.
“వున్నాడు.. పిలవనా!.. ” ఆనందరావు ముఖంలోకి చూచి వారి భావాల్ని గ్రహించి.. “దశరధా” కాస్త హెచ్చుస్థాయిలో పిలిచాడు వెంకటరామయ్య.
కొద్దిక్షణాల్లో అక్కడికి వచ్చాడు దశరధరామయ్య. అత్తగారి, మామగారిని చూచి చేతులు జోడించి.. “నమస్తే” ఎంతో వినయంగా నవ్వుతూ చెప్పాడు దశరధ.
పార్వతమ్మ హాల్లోకి వచ్చింది. ఆమె చేతిలోని తట్టలో చీరా రవిక పూలు పండ్లు వున్నాయి. సంధ్యను సమీపించింది.
“వదినగారూ!.. తీసుకొండి. ”
సంధ్య నవ్వుతూ ప్లేటును అందుకొంది. ఆనందరావు సోఫానుంచి లేచారు.
“బావగారూ!.. యిక మేము వెళ్ళివస్తాం. ” చేతులు జోడించాడు.
వెంకటరామయ్య చేతులు జోడించి నవ్వుతూ.. “మంచిది బావగారు” ఆనందంగా పలికడు వెంకటరామయ్య.
“వదినా.. వెళ్ళిస్తాను” అంది సంధ్య.
“మంచిది వదినా” నవ్వుతూ పలికింది పార్వతి.
అందరూ వరండాలోకి వచ్చారు. డ్రయివర్ యజమానిరాలు చేతిలోనీ తట్టను అందుకొన్నాడు. కార్లో వుంచాడు.
“అనుకున్న ప్రకారం అన్నీ జరగాలి బావగారు. ” నవ్వుతూ చెప్పాడు ఆనందరావు.
“తప్పకుండా.. అంతా ఆ సర్వేశ్వరుని నిర్ణయం. ” మహదానందంతో చెప్పాడు వెంకటరామయ్య.
డ్రయివర్ తన స్థానంలో కూర్చున్నాడు. కారు ఆ గృహప్రాంగణాన్నిదాటి వీధిలో ప్రవేశించింది.
తల్లి తండ్రీ తనయుని ముఖంలోకి చూచారు దరహాసవదనాలతో. ముగ్గురి మనస్సులకు ఎంతో ఆనందం.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments