'Jeevana Ragalu Episode 4' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 22/05/2024
'జీవన రాగాలు ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. అయన భార్య సుందరి పుట్టింటికి వెళుతుంది.
దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య.
దశరథరామయ్యకు నలుగురు పిల్లలు. దశరథనందన, గోపీనందన కొడుకులు. సునంద, హిమబాల కూతుళ్ళు.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన.
గతంలో అయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది. ఆమె చెల్లెలే సుందరి.
ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 4 చదవండి.
“ఎలా చేయాలనుకొంటున్నారు నా బిడ్డ వివాహాన్ని?” పూజానివేదనా కార్యక్రమాన్ని ముగించి, వరండాలో దినపత్రిక చదువుతున్న వెంకటరామయ్యను సమీపించి అడిగింది పార్వతమ్మ.
ప్రక్కకు తిరిగి అర్థాంగి వదనాన్ని పరీక్షగా చూచాడు వెంకటరామయ్య. కొన్ని క్షణాలు తర్వాత..
“ముందు నీ అభిప్రాయాన్ని చెప్పు పారూ.. కూర్చో.”
పార్వతమ్మ ఎదుటి కుర్చీలో కూర్చుంది.
“నా వుద్ధేశ్యం.. నా బిడ్డ వివాహం యింతవరకూ యీ ప్రాంతంలో కనివినీ ఎరుగని రీతిలో జరగాలి” తన నిర్ణయాన్ని తెలిపింది.
వరండా మెట్లు పక్క వస్తున్న శంకరయ్య ఆమె మాటలను విన్నాడు. నవ్వుతూ.. “అత్తయ్యా.. మా బావ వివాహం ఒక చరిత్రను సృష్టించేలా చేద్దాం సరేనా!..”
“రా శంకరా.. కూర్చో.” ఆప్యాయంగా చెప్పింది పార్వతమ్మ.
“మామయ్యా.. నమస్కారం.” చేతులు జోడించాడు శంకరయ్య.
శంకరయ్య వెంకటరామయ్య చెల్లెలికొడుకు. బి.ఎ. పాసై తనతండ్రి వీరరాఘవయ్య వలెనే వ్యవసాయం, కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నాడు. చాలా తెలివైనవాడు. సహృదయుడు. వీరరాఘవయ్య కీర్తిశేషులు.
తమ కుమార్తె సుశీలను అతనికి యిచ్చి వివాహం చేయాలని వెంకటరామయ్య పార్వతమ్మల సంకల్పం.
“కూర్చో శంకరా.. విన్నావుగా, మీ అత్తయ్యగారి కోరిక. యీ వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ నీవు పుండరీకశర్మ మీ యితరమిత్రులు కలసి చేయాలి. మీ అత్తయ్య అన్నట్లుగా దశరధుని వివాహం ఎంతో ఘనంగా, యీ ప్రాంత జనం పదికాలాల పాటు గుర్తువుంచుకొనేలా జరగాలి. ఏ విషయంలోనూ ఎవరికీ ఎలాంటి అసంతృప్తి కలుగకూడదు. కావలసిన ధనాన్ని మీ అత్తయ్యను అడిగి తీసుకో.. సరేనా!.."ఎంతో గంభీరంగా చెప్పాడు వెంకటరామయ్య.
పార్వతమ్మ ముఖంలో పున్నమి చంద్రుని కాంతి గోచరించింది శంకరానికి, వెంకటరామయ్యకు.
“శంకరా..! పదిరోజుల్లో అన్ని పనులు పూర్తికావాలి. రేపటి నుంచి భవంతికి రంగులు వేయించే ఏర్పాటు చెయ్యి.” నవ్వుతూ పలికాడు వెంకటరామయ్య.
"రంగులకు ఆర్డరు యిచ్చాను అత్తయ్యా!.. యీ సాయంకాలానికి అవి మన యింటికి చేరుతాయి. రేపటి నుంచి పని ప్రారంభిస్తాను..” క్షణం ఆగి “అత్తయ్యా.. బావ యింట్లో లేడా?" అడిగాడు శంకరయ్య.
"పుండరీకశర్మ వచ్చాడు. యీరోజు పౌర్ణమికదా!.. కొండ బిట్రగుంటలో శ్రీవెంకటేశ్వరస్వామికి గరుడసేవ చూచి వస్తామని వాళ్ళిద్దరూ వెళ్ళారు.”
"అలాగా.. మామయ్యా, అత్తయ్యా ఇకనేవెళ్ళొస్తాను" ఎంతో వినయంగా చెప్పాడు శంకరయ్య.
“సరే శంకరా” అంది వెంకటరామయ్య మృదుమధురమైన పలుకు.
“మంచిది శంకరా!.. యిది అత్త పార్వతమ్మగారి అభిమాన పూర్వకవాక్కు.
గుర్రపు బండి వచ్చి వరండా ముందు ఆగింది. సుశీల బండి నుంచి దిగింది. ఆమె రాక స్కూలునుంచి. మెట్లుదిగుతున్న శంకరయ్యను చూచింది. సిగ్గుతో ఒదిగి నిలబడింది.
“బాగున్నావా సుశీల?” నడుస్తూనే ఆమెకు దగ్గరై అడిగాడు.
నవ్వుతూ సుశీల యింట్లోకి పరుగెత్తింది. తల్లిదండ్రులకు ఎంతో ఆనందం.
*
ఏవైపు చూచినా ఆ కొండ చుట్టూ జనసమూహం. ఆ రోజు చైత్రశుక్లపౌర్ణమి. నెల్లూరు జిల్లా కొపూరు తాలూకా, కావలి తాలూకా గ్రామవాసులకు బిట్రగుంట శ్రీవెంకటేశ్వరస్వామి ఆరాధ్యదైవం. తూర్పుతీరాన సముద్ర ప్రాంతంలో వున్న పల్లెవాసులకు బెస్తలకు.. యిలవేల్పు, ఆ స్వామివారికి సప్తాన్నీకం జరుగుతుంది.
గరుడసేవ నాటికి రెండుఎడ్ల బండ్ల మీద ఆయా ప్రాంతాలనుంచి జనం సకుటుంబంగా ఆ కొండకు వచ్చి శ్రీవెంకటేశ్వరస్వామి, శ్రీదేవి భూదేవిలను దర్శించి మొక్కులను చెల్లించుకొని, తమకోర్కెలను ఆ మాతాపితలకు విన్నవించి, ముడుపులను కట్టి, తలనీలాలను సమర్పించి, చెరువులో స్నానం చేసి, మూలవిరాటు వీక్షించి, రాత్రి గరుడసేవను సందర్శించి ఎంతో ఆనందంగా తమ నిలయాలకు చేరుతారు.
బ్రాహ్మణా వైశ్య యితర సత్రాలలో వుచిత అన్నదానం.. చలివేంద్రాలలో మజ్జిగలో వూరపెట్టిన అటుకులు, నీరు మజ్జిగలను, కొందరు కార్యకర్తలు వచ్చిన జనానికి సమకూర్చుతారు.
మిఠాయి దుకాణాలు.. పూసలు, గాజులు, యితర అంగళ్ళు రోడ్డుకు యిరువైపుల క్రమంగా ఏర్పాటు చేయబడి వుంటాయి. ఆ వాతావరణం, ఆ పల్లెల ప్రజలకు ఎంతో ఆనందాన్ని సంబరాన్ని కలిగిస్తుంది.
అక్కడికి రైల్వేస్టేషన్ సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. కొందరు రైలులో వచ్చి దేవుణ్ణి దర్శించి రైల్లోనే తమ వూర్లకు వెళ్ళిపోతారు.
సమయం ఉదయం పదిగంటలు దశరధరామయ్య, పుండరీకశర్మ స్టేషన్లో రైలు దిగారు. కొండ బిట్రగుంట చేరుకొన్నారు. పాదప్రక్షాళన గావించి కొండఎక్కి ఆలయ ప్రాంగణంలలో ప్రవేశించారు. గర్భగుడిలోకి వెళ్ళి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించి ఆలయం బయటకి వచ్చి ఎంతో భక్తితో ఆ తండ్రిని జపిస్తూ ఐదు ప్రదక్షిణాలు చేశారు.
“దశరధా!.. ప్రసాదం కొందామా!..”
“పద పుండరీక కొందాం.”
చక్కర పొంగలి, పులుసన్నం నాలుగుపాకెట్లు కొన్నారు.
“ఏదైనా ఓ ప్రక్కన కూర్చొని తిందాం.”
“అలాగే.”
యిరువురూ ఆలయప్రాంగణంలో దక్షిణపువైపుకు వచ్చారు. వారికి పాతిక అడుగుల దూరం వలయాకారలంలో కూర్చొని ప్రసాదాన్ని ఆరగిస్తున్న ఆనందరావు, సంధ్య, మన్మధరావు, కౌసల్య, చెల్లెలు సుందరి గోచరించారు. ముందు చూచింది దశరధరామయ్య, పుండరీక చేయిని పట్టుకొని ఆపాడు.
“ఎందుకు ఆగావు దశరధ?..” ఆశ్చర్యంతో దశరధరామయ్య ముఖంలోకి చూచాడు పుండరీకశర్మ.
“అలా చూడు!..” మెల్లగా చెప్పాడు దశరధరామయ్య.
అతను చూపిన వైపుకు చూచాడు పుండరీక.. ఆశ్చర్యపోయాడు.
"దశరధా! మొత్తం కుటుంబం వచ్చింది.” మెల్లగా చెప్పాడు.
“అవును.. యిప్పుడు మనం ఏం చేయాలి?”
“వారు మనలను చూచి చూడనట్లు నటిస్తున్నారేమో! వాళ్ళను మనం చూడనట్లు నటించి ఒదిగి పోవడం మంచిదికాదు. దగ్గరకు వెళ్ళి పలకరిస్తా పద. యీ కారణంగా నీవు మా వదినగారిని మరోసారి ఆనందంగా చూడవచ్చు. అది నీకు సంతోషమే కదా!..” నవ్వాడు పుండరీకశర్మ.
“అదే వుత్తమం. అనవసరంగా ఆలోచించకు. పద..” దశరధరామయ్య పుండరీకశర్మ ముఖంలోకి పరీక్షగా చూచాడు.
“నో సందేహం. ఛలో..” దరహాసంతో పలికాడు పుండరీకశర్మ.
యిరువురూ వారిని సమీపించారు. ఆనందరావు వారిని చూచాడు.
ఆ సమయంలో దశరధరామయ్యగారి చూపులు కౌసల్య మీద వున్నాయి. తల్లోనిండా మల్లెపూలు, నొసటన సింధూరం, నీలపు వర్ణం పవిట, రవిక పావడా అంతా మ్యాచింగ్.. రెండు చేతులకు ధగధగా మెరుస్తూ బంగారుగాజులు మెడలో పతకంతో బంగారు దండ చెవులకు లోలకాలు, సాక్షాత్ లక్ష్మీదేవిలా పద్మాసనం వేసుకొని కూర్చొనివుంది.
“సార్!.. నమస్కారాలు.” ఆనందరావును చూచి కాస్త హెచ్చు స్థాయిలో పలికాడు పుండరీక.
పుండరీకుని కంఠస్వరాన్ని విని వెనక్కు తిరిగి చూచాడు ఆనందరావు. అందరూ వీరిరువురినీ చూచారు.
“నమస్కారం అండీ!..” తొట్రుపాటుతో యాంత్రికంగా పలికాడు దశరధ.
"అమ్మా నాన్నా రాలేదా?” సంధ్య అడిగింది.
“రాలేదు.”
“రండి కూర్చోండి.” ఆప్యాయంగా ఆహ్వానించాడు ఆనందరావు.
రావుగారి ప్రక్క దశరధరామయ్య పుండరీక కూర్చున్నారు.
"మీ చేతిలో వుండేది ప్రసాదం కదూ?" అడిగింది సంధ్య చిరునగవుతో.
“అవునండి.” పుండరీకశర్మ జవాబు.
“తినండి.. మా దగ్గర మంచి నీళ్ళు వున్నాయ్.” సంధ్య చెప్పింది.
తన చేతిలో రెండు పొట్లాలను దశరధరామయ్యకు యిచ్చాడు పుండరీకశర్మ.
మౌనంగా అందుకొన్నాడు దశరధరామయ్య.
“తిను.” మెల్లగా చెప్పాడు పుండరీక.
యిరువురూ తలలు వంచుకొని ప్రసాదాలను ఆరగించసాగారు.
కౌసల్య క్రీకంట దశరధరామయ్యను చూచింది. తెల్లని మల్లెపూల వంటి పైజమా జుబ్బా వేసుకొని వున్నాడు దశరధరామయ్య. కసరత్తు చేసి బాగా పెరిగిన కండరాలు, తెల్లని శరీరఛాయ నొక్కులజుట్టు, నొసటన సింధూరపు బొట్టు.
కౌసల్యల కళ్ళకు దశరధరామయ్య ఎంతో అందంగా గోచరించాడు. 'మనిషి చాలా అందగాడు, అనుకొంది మదిలో.
“పెండ్లి పనులు ప్రారంభించారా బాబూ?” అనందరావు మెల్లగా అడిగారు.
“ఊం” నవ్వుతూ పలికాడు దశరధరామయ్య. అతనికి పొరపోయింది. కౌసల్య బాటిల్లోని నీరు గ్లాసులో వంచింది. సంధ్య, చేతికి గ్లాసును అందించింది.
“మంచి నీళ్ళు త్రాగుబాబు.. బహుశా అమ్మా నాన్న అనుకొంటుంటారు.” నవ్వుతూ అంది సంధ్య.
'వాళ్ళు అనుకొంటున్నారో లేదో.. ఎదురుగా వున్న నేను అనుకొంటున్నానే సంధ్యా' నవ్వుకొంటూ మనస్సులో అనుకొంది కౌసల్య.
“అమ్మా!.. ఆకలేస్తూవుంది” అంది చిన్న చెల్లి సుందరి.
“పదండి క్రిందకిపోదాం.” ఆనందరావు చెప్పాడు.
అందరూ లేచి నిలుచున్నారు.
"మిత్రమా మన పరిస్థితి ఏమిటి?” దశరధరామయ్య దగ్గరగా జరిగి అడిగాడు పుండరీకశర్మ.
"మీరూ మాతో రండి. సత్రంలో అందరం కలసి భోంచేద్దాం." ప్రీతితో పిలిచింది సంధ్య.
దశరధరామయ్య పుండరీక ముఖంలోకి చూచాడు 'ఏంచేయాలిరా' మనస్సులో అనుకొంటూ.
“ముందు క్రిందకి పద” మెల్లగా దశరధరామయ్య చెవి దగ్గర పలికాడు పుండరీక.
“సత్రంలో మనవాళ్ళే వున్నారు. భోజనం బాగుంటుంది.” దశరధరామయ్య ముఖంలోకి చూస్తూ చెప్పాడు ఆనందరావు.
“సరే!” ముక్తసరిగా తన సమ్మతిని తెలియజేశాడు దశరధరామయ్య పుండరీక ముఖంలోకి చూస్తూ.
ఆ క్షణంలో కౌసల్య దశరధరామయ్యను పరీక్షగా చూచింది.
“మావాడు కాస్త మితభాషి.. తప్పుగా అనుకోకండి.” నవ్వుతూ చెప్పాడు పుండరీక.
'మితభాషి అని చెప్పేదానికి బదులుగా మూగవాడని చెప్పుంటే సవ్యంగా వుండేది,’ మనస్సులో అనుకొని తనలోతాను నవ్వుకొంది కౌసల్య.
మొగవారు ముందు నడువగా.. వెనక ఆడవాళ్ళు మెట్లమీద క్రిందికి నడిచారు. కొండదిగారు. సత్రాన్ని సమీపించారు.
"పుండరీకశర్మగారూ.. వంట చేసేది బ్రాహ్మణులే.. మీరూ మాతో కలసి భోంచేయండి..” సాదరంగా ఆహ్వానించాడు ఆనందరావుగారు.
“సార్! నాకు అలాంటి పట్టింపులు లేవు. కానీ.. బ్రాహ్మణ సత్రంలో మా అత్తయ్యకొడుకు విష్ణుశాస్త్రి వున్నాడు. వాడితో కొంచెం మాట్లాడాలి. నేను ఆ వైపు వెళతాను.” వినయంగా చెప్పాడు పుండరీక.
“పుండరీకా!..” ప్రశ్నార్ధకంగా చూచాడు దశరధరామయ్య.
అతనికి దగ్గరగా వచ్చి “నీవు వీరితో వెళ్ళి భోంచేసిరా.. నేను విష్ణుతో మాట్లాడి రెండు మెతుకులు తిని పదినిముషాల్లో యిక్కడికి వస్తాను.” దశరధరామయ్య భుజం తట్టి చెప్పాడు పుండరీకశర్మ.
బిక్క ముఖంతో దశరధరామయ్య పుండరీక ముఖంలోకి చూచాడు.
'ఏం ఫర్వాలేదు' అన్నట్లు సైగ చేసి పుండరీక బ్రాహ్మణ సత్రం వైపుకు నడిచారు.
దశరధరామయ్య.. ఆనందరావు, వారి కుటుంబసభ్యులను అనుసరించాడు మౌనంగా. అతని స్థితిని చూచి కౌసల్య లోన నవ్వుకుంది.
*
“ఐదు నిముషాలయింది నేను వచ్చి. బాగా భోం చేశావా?" తన్ను సమీపించిన దశరధరామయ్యను అడిగాడు పుండరీక.
“క్రొత్త వాళ్ళ మధ్యన కూర్చొని భోం చేయడం కాస్త యిబ్బందిగానే వుండింది”
“నీ ప్రక్కన ఎవరు కూర్చున్నారు?”
“ఎడమవైపున..” చెప్పడం ఆపాడు దశరధరామయ్య.
“ఏం ఆగిపోయావ్?.. చెప్పు”
“కౌసల్య కూర్చుంది. కుడివైపు ఆమె చెల్లెలు కూర్చుంది. మమ్మల్ని ఆనందరావుగారు ఫొటో కూడా తీశారు.” నిరుత్సాహంగా చెప్పాడు దశరధరామయ్య.
“ఎంత అదృష్టం.. ఎంత అదృష్టం.. ఎంతో సంతోషంతో చెప్పవలసిన విషయాన్ని అంత నీరసంగా చెప్పావేం దశరధా!” నవ్వుతూ అడిగాడు పుండరీక.
“కొత్తకదా పుండరీక?”
“కొత్తా!.. ఏం కొత్త?.. అది సరే.. వదినతో ఏమైనా మాట్లాడావా?”
“తనే మాట్లాడింది.”
“ఏమని?”
“నేను మీకు నచ్చానా అని అడిగింది.”
“నీవేం చెప్పావ్?”
“మాటలతో చెప్పలేను అన్నాను.”
“వారెవ్వా.. సూపర్ దశరధ” ఆనందంగా నవ్వాడు పుండరీకశర్మ.
యింతలో సత్రం నుంచి ఆనందరావు కుటుంబం వెలుపలికి వచ్చారు. వారిని చూచి పుండరీక..
“సార్.. గరుడసేవను చూచేకదా మీరు వెళతారు?" ఆనందరావును సమీపించి అడిగాడు పుండరీకశర్మ.
"లేదు. మేము బయలుదేరుతున్నాము. నిశ్చితార్తం ఏర్పాట్లు చేయాలి.” నవ్వుతూ పలికాడు ఆనందరావు.
"అమ్మా! నాన్నగారిని అడిగినట్లు చెప్పండి." దశరధరామయ్యతో చెప్పింది సంధ్య.
“అలాగే.. ” చిరునవ్వుతో చెప్పాడు దశరధరామయ్య.
దశరధరామయ్య పుండరీక ముఖంలోకి చూచాడు.
“మేము రాత్రి గరుడసేవను చూచుకొని బయలుదేరుతాం.” నవ్వుతూ చెప్పాడు పుండరీకశర్మ.
“వెళ్ళివస్తాం బాబూ.” నవ్వుతూ చెప్పాడు ఆనందరావు.
“మంచిదండి.” చేతులు జోడించాడు దశరధరామయ్య.
కౌసల్య దశరధరామయ్య చూపులు కలిశాయి 'వెళ్ళొస్తా'నని కళ్ళతోనే తెలియజేసింది కౌసల్య. 'సరే' అన్నట్లు దశరధరామయ్య కళ్ళతోనే సమ్మతిని తెలియజేశాడు.
కారు వచ్చి వారి ప్రక్కన ఆగింది. అందరూ ఎక్కారు. కారు కదలి ముందుకు పోయింది.
యిరువురు మిత్రులు వెళుతున్న కారును చూస్తూ చిత్తరువుల్లా నిలబడ్డారు.
దశరధరామయ్య మస్తిష్కంలో కౌసల్య ప్రశ్న.. దానికి తను చెప్పిన జవాబు మెరుపులా మెరిశాయి. మదిలో అనిర్వచనీయమైన ఆనందం. మధురాతి మధురమైన వూహలు. తనలో తానే నవ్వుకొన్నాడు దశరధరామయ్య.
మిత్రుని ముఖభావాలను గమనించిన పుండరీక.. "సోదరా!.. వదినగారు సూపర్ కదూ!..” గలగలా నవ్వాడు.
సుధీర్ఘమైన నిట్టూర్పును విడచి.. "అవును పుండరీక..” క్షణంసేపు ఆగి “మరోసారి స్వామిని దర్శిద్దాం” తన నిర్ణయాన్ని తెలియజేశాడు.
“సరే.. పద..” పుండరీకశర్మ అంగీకారం.
యిరువురూ మెట్లెక్కి ఆలయప్రాంగణంలో ప్రవేశించారు. శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించారు. క్రిందకు వచ్చారు. చెరకుగడలను కొన్నారు. దూరంగా వున్న వేప చెట్లుక్రింద కూర్చొని చెరకు రసాన్ని గ్రోలారు. విష్ణుశర్మ వారిని కలిశాడు. ఆనందరావు సంధ్యలను గురించి, కౌసల్యను గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. దశరధరామయ్యకు ఎంతో ఆనందం.
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో స్వామిగరుడ వాహనంపై వూరేగింపుకు బయలుదేరారు. దర్శించి ఆ మిత్రులు స్టేషన్ చేరారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentários