'Jeevana Ragalu Episode 8' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 18/06/2024
'జీవన రాగాలు ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. అయన భార్య సుందరి పుట్టింటికి వెళుతుంది.
దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య.
దశరథరామయ్యకు నలుగురు పిల్లలు. దశరథనందన, గోపీనందన కొడుకులు. సునంద, హిమబాల కూతుళ్ళు.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది. ఆమె చెల్లెలే సుందరి.
నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది.
వివాహం అంతకంటే ఘనంగా జరుగుతుంది.
అత్తవారింటికి చేరుతుంది కౌసల్య.
శంకరయ్య, సుశీలల వివాహం కూడా జరుగుతుంది.
కౌసల్య, దశరథ రామయ్యలకు కవలలు పుడతారు. వారికీ దశరథ నందన, సునంద అని పేర్లు పెడతారు.
ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 8 చదవండి.
ఘనచరిత్ర వున్న బంగారన్న కావలి ప్రాంతంలో మంచి రాజకీయవేత్త. దశరథరామయ్యకు మంచి హితుడు. మన్మథరావుకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఆశ కలిగింది. బావగారిని కలిసి, బంగారన్నను తనకు పరిచయం చేయమని, తనకు ఆయన పార్టీలో స్థానాన్ని కల్పించమని దశరథరామయ్యను కోరాడు.
విషయం సాంతం విన్న దశరథరామయ్య.. "బంగారన్న నా బాల్య మిత్రుడు. చాలాకాలం నుంచి రాజకీయాల్లో వున్నవాడు. ఒక సమయంలో నన్నూ రాజకీయాల్లో తన పార్టీలో ప్రవేశించమని కోరాడు. రాజకీయాలు నచ్చని నేను కాదన్నాను నేను ఎప్పటికీ నీకు మంచి స్నేహితునిగానే వుంటానన్నాను. అది వారికి రుచించలేదు. ఆ కారణంగా నేను యిప్పుడు నీ గురించి మాట్లాడలేను. ఆ ప్రయత్నాన్ని నీవే చేసికోవాలి.” తన ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలియజేశాడు దశరథరామయ్య.
బావగారి జవాబు మన్మధరావుకు రుచించలేదు. తన కోర్కెను తిరస్కరించినందుకు దశరథరామయ్య పట్ల అతనికి ఆగ్రహం కలిగింది. తన కోర్కెను మంగ తండ్రి కోటేశ్వరరావుగారి ద్వారా నెరవేర్చుకొన్నాడు.
ఆ సందర్భంలో తన చెల్లెలు కౌసల్య తన భర్తను సమర్థించినందువలన ఆ బావా చెల్లెలు మీద మన్మధరావు మదిలో అంత వరకూ వారి పట్లవున్న ఆదరాభిమానాల స్థానంలో కోపం పగ చోటుచేసుకొన్నాయి.
బంగారన్న వూసరవిల్లి.. తలలు మార్చేరకం.. యీ విషయాన్ని ఆనందరావు, కొడుకు మన్మధరావుకు చెప్పాడు. కానీ.. అతనికి తండ్రి మాటలు రుచించలేదు. మామ కోటేశ్వరరావుగారి మాటలు తియ్యటి తేనె అయింది. కొంత సొమ్ము ఖర్చుపెట్టి బంగారన్న పార్టీ తరపున వార్డు మెంబరు అయ్యాడు.
ఒంగోలు నుంచి కార్లో వస్తుండగా ఆనందరావుకు ప్రమాదం జరిగింది. ఆ విషయం తెలిసిన దశరథరామయ్య, కౌసల్య.. తమ బిడ్డలతో కావలికి వచ్చారు ఆనందరావుకు పుత్తూరు కట్టు కట్టించారు. వైద్యులు త్వరలో మరో రెండు కట్లు కడితే నయం అవుతుందని చెప్పారు.
అది ఆశ్వీయుజ మాసం, వర్షాకాలం. మామగారికి జాగ్రత్త చెప్పి దశరథరామయ్య తమ గ్రామానికి బయలుదేరారు. తల్లి సంధ్య కోరికపై మరో నాలుగురోజులు వుండి వస్తానని భర్తను కౌసల్య కోరింది.
పిల్లలు దశరథనందన, సునందలు.. తండ్రితో తమ వూరికి వెళ్ళాలని మారాంచేశారు. కారణం.. మన్మధరావు కొడుకు రఘునందన వారిని బెదిరించే వాడు.. కొట్టేవాడు. యీ అన్నా చెల్లెళ్ళకు వాడితత్వం సరిపడలేదు. ముఖ్యంగా తాతయ్య వెంకటరామయ్య, నానమ్మ పార్వతమ్మ, తండ్రి దశరథరామయ్య అంటే ఆ పిల్లలకు ఎంతో ఇష్టం.
అందువల్ల తల్లిని వదిలి తండ్రితో తను వూరికి వెళ్ళాలని పట్టు పట్టారు. ఆ కారణంగా దశరథనందన, సునందలు తండ్రితో తమ వూరికి వచ్చేశారు.
కౌసల్యకు అది యిష్టం లేకపోయినా, రఘునందన అల్లరి.. తమ బిడ్డలు భయం భయంగా వుండడం నచ్చక భర్తతో పిల్లలను పంపింది. తల్లికి సాయంగా పుట్టింట తను వుండిపోయింది.
దశరథరామయ్య ఫకీరును, గుర్రబండినీ అక్కడే వుంచి..“నీవు ఎప్పుడు రావాలనుకొంటే అప్పుడు బయలుదేరిరా” చెప్పి బిడ్డలతో వారి వూరికి చేరాడు దశరథరామయ్య.
ఆ మరుదినం ఉదయం నుంచీ కుంభవర్షం.. వురుములు.. మెరుపులు. తెరిపిలేకుండా వర్షం కురియసాగింది.
కౌసల్య తనువు అమ్మగారి యింట. మనస్సు తనయింట. అలా మూడు రోజులు భారంగా గడిచాయి. ఆమె మనస్సులో తన బిడ్డలను భర్తను అత్తమామలను చూడాలనే తపన.
నాల్గవరోజు ఆకాశం మేఘావృతంగా వున్నా.. వర్షంలేని కారణంగా తన వూరికి బయలుదేరింది కౌసల్య.
"అమ్మా, నేను వెళ్ళివస్తాను. నాన్నను జాగ్రత్తగా చూచుకో. అన్నయ్యలో మార్పు కలిగింది. వదిన మాటలను, చేష్టలను లెక్కచేయకు. దేనికీ నీవు దిగులు పడకు. పైవారం నేను మరలా వస్తాను. నా భర్త, అత్తమామలు చాలా మంచివారు. నీవు, నాన్నా అంటే వారికి ఎంతో యీష్టం. నాన్నకు నీకు యిక్కడ కష్టంగా వుందని తోచిందంటే మా యింటికి రండి. నేను మిమ్మల్ని బాగా చూచుకొంటానమ్మా” గద్గద స్వరంతో పలికింది కౌసల్య.
ఆ బిడ్డకు తమపట్ల వున్న ప్రేమాభిమానాలకు సంధ్య ఎంతగానో సంతోషించింది. “అలాగే తల్లీ!.." అశ్రుపూరిత నయనాలతో మెల్లగా పలికింది సంధ్య.
తల్లిదండ్రుల పాదాలు తాకి ఆశీర్వాదాలను తీసుకొని ఫకీరా గుర్రంబండిలో కావలి నుంచి తన వూరికి బయలుదేరింది కౌసల్య.
బండి బిట్రగుంట నరవదాటి మెయిన్ రోడ్డు నుంచి తూర్పు వైపున అల్లూరికి వెళ్ళే గ్రావల్ రోడ్డు మీద వెళుతూ వుంది. సన్నగా తూర, గాలిజోరుగా వీస్తూ వున్నాయి. మెరుపులు, వురుములు అధికమయ్యాయి.
“అమ్మా!.. పెద్దవాన వచ్చేటట్టుగా వుంది. వులవపాడులో కరణంగారింటికెళ్ళి వానతగ్గిన తర్వాత వెళదామా!..” చలికి వణుకుతూ అడిగాడు ఫకీరా.
“వద్దు ఫకీరన్నా!.. పిల్లలు, ఆయన, అత్తమామలు కళ్లల్లో మెదులుతున్నారు. త్వరగా వెళ్ళి నేను వారినందరినీ చూడాలి. బండిని ముందు చూచి జాగ్రత్తగా తోలు..” అంది కౌసల్య.
“అట్టాగే అమ్మా.”
వులవపాడు ఆ రోడ్డుకు దక్షిణపువైపున రోడ్డుకు దగ్గరలో వుంది. ఆ వూరికి తూర్పున పెద్ద చెరువు వుంది. బండి ఆ చెరువుకట్ట ప్రక్కగా వున్న రోడ్లో వెళుతూ కట్టకు ముందువైపుకు మరలింది.
నాలుగు రోజులుగా కురిసిన ఎడతెరిపిలేని వాన వల్ల.. ఆ చెరువు పూర్తిగా నిండిపోయింది. చుట్టూవున్న కట్టకు ఆరు అంగుళాలు మాత్రమే నీరు తక్కువగా వుంది.
ఆ కట్టమిట్ట తూముల ముందు రోడ్డు భాగంలో కాంక్రీటు చపటా వుంది. నీళ్ళు చెరువులో అధికమైతే.. ఆ మిట్ట తూములను తెరుస్తారు. నీరు చపటా మీదుగా దానికి ముందున్న పల్లపు ప్రాంతం, వాదలోనికి వెళ్ళిపోతుంది. ఆ వాదలో జమ్ము బాగా పెరుగుతుంది. ఆ జమ్మును యిండ్ల కప్పుకు వుపయోగిస్తారు ఆ వూరివారు.
చపటా ముందు బండిని ఆపి.. ఫకీరా నడిచి చపటా మధ్య భాగం వరకూ వెళ్ళాడు. నీళ్ళు మోకాటి లోతున ప్రవహిస్తున్నాయి. వెనక్కు వచ్చి బండి ఎక్కాడు.
“ఫకీరన్నా!.. మన కళ్యాణి ఆ లోతును దాటగలదు కదూ!..” ఎదురుగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని చూచి గడగడ వణకుతూ అడిగింది కౌసల్య.
అదే స్థితిలో వున్న ఫకీరు.. "వెళుతుందమ్మా!..” మెల్లగా చెప్పాడు.
బండి కదిలింది. వాన జోరు పెరిగింది. కళ్యాని ఫకీరా సౌజ్ఞలతో మెల్ల మెల్లగా ముందుకు నడుస్తూ వుంది. పెద్ద మెరుపు. వురుములు. కుండపోతగా వర్షం. బండి చపటా పై రెండు వంతులు దాటింది.
మిట్ట తూములు వెనక వున్న నీటి వత్తిడికి పగిలిపోయాయి. ప్రవాహం వువ్వెత్తున చపటా పైకి దూకింది. కళ్యాణి ముందుకు కదలలేకపోయింది. క్షణాల్లో ప్రవాహం బండిని ఢీకోన్నది. బండి వాదలో పడిపోయింది!!!
“అమ్మా!..” అన్న ఫకీరా కేక గాలిలో కలిసిపోయింది.
కౌసల్య బండి నుంచి జారి నీళ్ళల్లో పడిపోయింది. కొద్దిక్షణాల్లో చపటా మీద పదిపన్నెండు అడుగుల ఎత్తు నీటి ప్రవాహం.. ముందుకు దూసుకు వెళుతూవుంది.
ఆ ప్రవాహంలో కౌసల్య, ఫకీరా కలసిపోయారు.
బండి నీటిలో ఎటో కొట్టుకపోయింది.. ఆ గంగమ్మ ప్రవాహంలో.
కౌసల్య, ఫకీరాలు అంతిమశ్వాసను వదలి శాశ్వతంగా కళ్లుమూశారు.
కొద్దినిముషాల తర్వాత.. గుర్రం కళ్యాణి యీదుకొంటూ ఒడ్డుకు చేరింది. వెనక్కు తిరిగి చూచింది. ఆమె కళ్ళకు కౌసల్య ఫకీరాలు గొచరించలేదు. అటూ యిటూ తిరిగింది వారికోసం. ఫలితం శూన్యం. కళ్యాణి నయనాల్లో అశ్రుధారలు. వెను తిరిగి వేగంగా తన నిలయం వైపు పరుగుతీసింది.
వరండాలో తాత వెంకటరామయ్య తొడలపై కూర్చొని వున్న దశరథనందన.
“తాతయ్యా!.. అటుచూడు. అమ్మ వచ్చింది.” నవ్వుతూ పలికాడు దశరథనందన.
ఆత్రంగా ఆవైపుకు చూచాడు వెంకటరామయ్య.
ఆయన చూపులకు ఏమీ గోచరించలేదు.
"అవును తాతయ్యా! అదిగో అమ్మ వస్తూ వుంది." చిన్నారి సునంద ముద్దుగా పలికింది.
ఆమె ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూచి.. వెంటనే వీధి వైపుకు చూచాడు. తన కళ్ళకు కౌసల్య.. కౌసల్య.. కనిపించలేదు. అయోమయస్థితి. మనస్సులో ఏదో బాధ. మనుమడు మనుమరాలి ముఖాల్లోకి పరీక్షగా చూచాడు. వాళ్ళు ఆనందంగా నవ్వుతున్నారు.
యింతలో.. కళ్యాణి పరుగున వచ్చి వరండా ముందు ఆగింది. బిడ్డలను దించి వెంకటరామయ్య కళ్యాణిని సమీపించాడు. దాని మూతిని తడుముతూ కళ్ళలోకి చూచాడు. కళ్యాణి కళ్ళల్లో కన్నీరు.
“దశరథా!.. బిగ్గరగా పిలిచాడు.
మేడపైన వున్న దశరథరామయ్య పెరటివైపున వున్న పార్వతమ్మ.. పనివారు.. పరుగున అక్కడికి వచ్చారు వెంకటరామయ్యగారి గావు కేకవిని.
వర్షం ఆగింది. ఒంటరిగా వచ్చిన కళ్యాణిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు.
“కౌసల్య.. ఫకీరా.. బండి.. ఎక్కడ.!.. గద్గద స్వరంతో అందరినీ చూస్తూ వ్యాకుల వదనంతో పలికాడు వెంకటరామయ్య.. వారి అందరి తలలపై పిడుగు పడినట్లయింది.
దశరథనందన, సునందలను.. ముంతాజ్ ఎత్తుకొంది. మిగతా అందరూ రోదిస్తూ వీధిన పడ్డారు. వారిని చూచిన శంకరయ్య మరికొందరు గ్రామస్తులూ కావలి దారి పట్టారు. ఎదురుగా కనబడ్డ వారిని కౌసల్య, ఫకీరాల గురించి అడిగారు. అందరూ ఒకే సమాధానం చెప్పారు 'మేము చూడలేదని.’
బండ్ల మీద ఆ వాద ప్రాంతానికి చేరారు. అప్పటికి ప్రవాహం తగ్గి బండి ఒక అంచు వాద నీటిలో కనిపించింది.
విషయాన్ని గ్రహించిన వెంకటరామయ్య బోరున ఏడుస్తూ నేలకూలాడు. తోటే వున్న జనం వారిని ఎత్తి పట్టుకొన్నారు. దశరథరామయ్య దుఃఖ సాగరంలో మునిగిపోయాడు.
గజయీతగాళ్ళు వాదలో దూకారు.. జమ్మును విరగదీస్తూ కౌసల్య.. ఫకీరాల కోసం గాలించారు. అర్థగంట వారి తీవ్రశ్రమ మూలంగా వారు.. కౌసల్యా ఫకీరాల శవాలను బయటికి తీశారు.
ఆ క్షణంలో ఆ ప్రాంతం.. అక్కడవున్న వారందరి తీవ్రరోదనతో మారుమ్రోగింది. వివసులైన వెంకటరామయ్య పార్వతమ్మను దశరథరామయ్య శంకరయ్యను గ్రామస్థులు వారి హక్కున చేర్చుకొన్నారు. రొండు ఎడ్లబండ్లమీద అందరూ.. కౌసల్య ఫకీరాల శవాలతో.. అవధులు లేని దుఃఖసాగరంలో మునిగి వెంకటరామయ్య యింటికి చేరారు. వెంకటరామయ్యగారి భవంతి మధ్య హాల్లో కౌసల్య వెల్లికిలా పడుకొని శాశ్వత నిద్రలో వుంది. చుట్టూ అయిన వారంతా చేరి బోరున రోదిస్తున్నారు.
ఫకీరా యింట కూడా యిదే పరిస్థితి. ఆ రాత్రి వారందరి పాలిటా ప్రళయపు రాత్రి.
విషయం తెలిసిన ఆనందరావు కుటుంబం.. మరుదినం ఏడుగంటలకల్లా గుండెలు బాదుకొంటూ భోరున ఏడుస్తూ వచ్చి యీ గుంపులో కలిసిపోయారు.
పురోహితులు బలరామశర్మ.. పుండరీకశర్మ సోమయాజులు, విష్ణుశాస్త్రి.. వెంకటరామయ్య దశరథరామయ్య ఆనందరావులను ఎంతగానో ఓదార్చారు. జరిగినదానికి, వారు ఎంతగానో వాపోయారు.
ఆ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కౌసల్యమ్మ.. వూరేగింపు పుట్టెడు పూలు, పసుపు కుంకుమలతో ఆ భవంతినుండి బయలుదేరింది.
అదే విధంగా.. ఫకీరా నిలయం నుంచి వారి ప్రయాణం కూడా ముందుకు సాగింది.
కౌసల్య.. ఫకీరాలు ఏకకాలంలో శాశ్వత నిద్రతో భూమాత ఒడిలో ఒరిగిపోయారు. తమ వారినందరినీ విడిచి వేరేలోకానికి, వెళ్ళిపోయారు. బ్రతికి వున్న వారికి వారి తీపి జ్ఞాపకాలను శాశ్వతంగా మిగిల్చారు.
కౌసల్య అకాలమరణంతో ఆ యింటికి కారు చీకట్లు క్రమ్ముకున్నాయి. అభంశుభం ఎరుగని పసిపిల్లలు తల్లిని గురించి ఏడుస్తూ అమ్మ కావాలని అడిగేవారు.
‘అమ్మ దేవుడు వద్దకు వెళ్లింది నాన్నా!.. ఇక రాదు.' అని జవాబు చెప్పేవారు. దశరథరామయ్య, క్రతువు ఖర్మలను యాంత్రికంగా అయిన వారి సాయంతో.. అవధులులేని దుఃఖంతో ముగించారు. దానధర్మాలు గొప్పగా జరిగాయి.
*
చరిత్ర శేషులై కాలగతిలో కలసిపోయారు కౌసల్య.. ఫకీరాలు. మంచి కోడళ్ళకు ప్రతీకగా కౌసల్య.. నమ్మినబంటుకు సాక్షిగా ఫకీరా.. ఆ వూరి జనులందరి హృదయాల్లో నిలిచిపోయారు.
ఆ కుటుంబానికి.. భారంగా మరో సంవత్సరం గడిచింది. దశరథరామయ్య.. కౌసల్య సంవత్సరీకాలను యధావిధిగా నిర్వర్తించారు.
బలరామశర్మ.. ఆ సంవత్సరం రోజులూ ప్రతి రోజూ ఆ యింటికి వచ్చేవారు. వెంకటరామయ్యకు.. దశరథరామయ్యకు.. పార్వతమ్మకు భగవద్గీతను.. పురాణాలను చదివి వినిపించేవారు. స్వాంతన వచనాలతో వారి హృదయాలకు శాంతిని కూర్చేవారు.
బావమరదిలు సోమయాజులు, బలరామశర్మ కాశీక్షేత్రాన్ని దర్శించాలని సంకల్పించారు. వారితోపాటు యీ రెండు కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళితే బాగుంటుందని నిర్నయించుకొన్నారు.
ఆ విషయాన్ని బలరామశర్మ.. వెంకటరామయ్య గారితోనూ.. సోమయాజులు ఆనందరావుగారితోనూ ప్రస్తావించారు. మీరు మాతో తప్పక రావాలి. మీ మనస్సులకు శాంతి.. ఆనందం సంప్రాప్తిస్తుందని చెప్పారు.
హితుల వచనాలను వెంకటరామయ్య.. ఆనందరావులు అంగీకరించారు. అందరూ కలసి అలహాబాద్ మీదుగా.. వారణాశి, గయ, బుద్ధగయ.. మహాక్షేత్రాలను దర్శించారు. అందరూ వారి వారి పితృదేవతలకు.. గయలో శ్రార్ధపిండప్రదానాలు చేశారు. వారి మనస్సులకు ఎంతో శాంతి కలిగింది.
ఆడవాళ్లంతా పవిత్ర గంగానదిలో స్నానం చేసి ఒడ్డుకు చేరారు. మగవారంతా స్నానం చేస్తూ వున్నారు. సంధ్య చిన్నకూతురు సుందరి చూపులు.. తన బావగారైన దశరథరామయ్య మీద నిలిచాయి.
“అమ్మా!.. అటు చూడు.. బావ ఎలా మెరిసిపోతున్నాడో!.." అతన్ని తదేకంగా చూస్తూ చిరునవ్వుతో పలికింది సుందరి.
కుమార్తెను.. దశరథరామయ్యను మార్చి మార్చి చూచింది సంధ్య. సుందరి చూపులు బావ దశరథరామయ్య మీదనే వుండటాన్ని గమనించింది. ఆ క్షణంలో.. ఆమె మస్తిష్కంలో ఓ తియ్యని భావన కలిగింది. వసతి గృహానికి చేరిన తర్వాత.. ఏకాంతంగా బలరామశర్మను కలిసింది.
"స్వామీ!..”
"ఏమ్మా!.."
"అల్లుడుగారు వివాహం చేసుకోవచ్చుగా!..” ప్రశ్నార్ధకంగా బలరామశర్మ ముఖంలోకి చూచింది సంధ్య.
ఆమె అడిగిన ప్రశ్న సరిగా అర్థంకాక.. పరీక్షగా సంధ్య ముఖంలోకి చూచాడు బలరామశర్మ.
“వయస్సులో చిన్నవాడే కదా స్వామీ!..” ఎంతో జాలిగా పలికింది సంధ్య.
“ఆ.. ఆ.. నాకు మీ అభిప్రాయం అర్థం అయిందమ్మా.. అలా జరిగితే మీరొండు కుటుంబాలకు పట్టిన గ్రహణం విడిపోతుందమ్మా!..” ఎంతో ఆనందంగా పలికాడు బలరామశర్మ.
“యీ విషయాన్ని గురించి మీరు అన్నయ్య గారితో మాట్లాడతారా!..”
“వెంకటరామయ్య తోనేగా!.. తప్పకుండా మాట్లాడుతాను.
మరి.. వధువు!!!” ప్రశ్నార్ధకంగా సంధ్య ముఖంలోకి చూచాడు బలరామశర్మ.
“మన సుందరి.” ఘనంగా నవ్వుతూ చెప్పింది సంధ్య.
ఎంతో ఆశ్చర్యంతో సంధ్య ముఖంలోకి చూచాడు బలరామశర్మ.
“మీరు అన్నయ్యగారితో మాట్లాడండి. ఒప్పించండి. మా వారి విషయంలో నాకు వదిలేయండి. వారు నా మాటను కాదనరు.” తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేసింది సంధ్య.
బలరామయ్య వదనంలో ఎంతో ఆనందం. "ఆమ్మా!.. నీవు పలికిన పలుకులు. నిర్ణయం.. నీది కాదు. సాక్షాత్ ఆ జగత్ జనని అన్నపూర్ణమ్మ పలుకులు. నా ప్రయత్నాన్ని నేను యధావిధిగా చేస్తానమ్మా. మీ సంకల్పం నెరవేరుతుంది.” ఆనందంతో అతని కంఠం బొంగురు పోయింది. నయనాలు చెమ్మగిల్లాయి. కొన్ని క్షణాల తర్వాత..
“అమ్మా!.. నీ మాతృత్వానికి యిదే.. నా జోహార్లు. తల్లీ నీవు నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలి.” పరవశంతో చేతులు జోడించాడు బలరామశర్మ.
ఆనందంతో నవ్వుకొంటూ వెళ్ళిపోయింది గదికి సంధ్య.
వెంకటరామయ్య, బలరామశర్మ, ఆనందరావు, సోమయాజులు గంగానది ఒడ్డున వాహ్వళి చేస్తున్నారు.
అంతకు ముందే బలరామశర్మ, సోమయాజులు యీ విషయాన్ని గురించి చర్చించుకొన్నారు. దశరథరామయ్యకు సుందరికి వివాహం జరిగేలా చేయడం వారి కర్తవ్యంగా భావించారు.
ఒక చోట ఆగి.. నలుగురూ కూర్చున్నారు. విషయాన్ని తొలుత బలరామశర్మ ప్రస్తావించారు.
"అయ్యా!.. ఆనందరావుగారూ!.. చిన్న అమ్మాయిగారి వివాహం ఎప్పుడు చేయాలనుకొంటున్నారు..?”
“సరైన సంబంధం ఏదైనా మీకు తెలిసివుంటే చెప్పండి. యీ సంవత్సరంలోనే వివాహం జరిపిద్దాం” నవ్వుతూ పలికాడు ఆనందరావు.
“వుంది.. మంచి సంబంధం వుంది”
“ఎక్కడ?”
“తమరి ముందే వుంది.” నవ్వుతూ పలికాడు సోమయాజులు.
“అంటే!..” ఆశ్చర్యంతో సోమయాజులు ముఖంలోకి చూచాడు ఆనందరావు.
"వెంకటరామయ్యగారి కుమారుడు దశరథరామయ్య.”
“మా అల్లుడుగారా!..” ఆశ్చర్యపోయాడు ఆనందరావు.
“అవును. వారే!.." నవ్వుతూ చెప్పాడు బలరామశర్మ.
“బావా!.. వీరిమాటలు!..” వెంకటరామయ్య ముఖంలోకి చూస్తూ ఆశ్చర్యంతో చెప్పాడు ఆనందరావు.
“నాకు నచ్చాయి బావా!..” నవ్వాడు వెంకటరామయ్య.
ఆనందరావు వదనంలో ఎంతో ఆనందం. “నా సుందరికి అంతటి అదృష్టమా!” ఆశ్చర్యంతో పలికాడు.
“మీరు సమ్మతిస్తే.. యీ వివాహం జరుగుతుంది.” నవ్వుతూ మెల్లగా పలికాడు సోమయాజులు.
“అల్లుడిగారి అంగీకారం..?” వెంకటరామయ్య ముఖంలోకి చూచాడు ఆనందరావు.
“బావా!.. ఆ విషయాన్ని నాకు వదిలెయ్యి.”
“మీరు ముగ్గురూ నా శ్రేయోభిలాషులు. మీరు ఒకటై.. పలికిన మాటను నేను ఎలా కాదనగలను. సంధ్యతో మాట్లాడి..”
"వారికి పరిపూర్ణ సమ్మతం. మీతో మాట్లాడమని వారే నాతో చెప్పారు.” నవ్వుతూ చెప్పాడు బలరామశర్మ.
“అలాగా!..”
"అవును ఆనందరావు గారూ!..”
“ఆనందరావుగారూ!.. యిది మన నిర్ణయంకాదు. ఆ కాశీ విశ్వేశ్వర ప్రభువు నిర్ణయం.” నవ్వుతూ పలికాడు సోమయాజులు.
“బావా!.. మీకు..”
“పరిపూర్ణ సమ్మతం.” ఎంతో ఆనందంగా పలికాడు వెంకటరామయ్య. అందరి వదనాల్లో అనిర్వచనీయమైన ఆనందం.
గదిలో సుందరి మంచంపై చేరి.. దశరథనందన, సునంద ఆమె చెప్పే కథను వింటున్నారు. సంధ్య మరో మంచంపై పడుకొని కళ్ళు మూసుకొని వుంది. ఆనందరావు గదిలోకి వచ్చాడు. అంతవరకూ సుందరి చెప్పే కథను వింటున్న దశరథనందన సునందలు తాతయ్యను చూచి మంచం దిగి పరుగున ఆయన్ను చుట్టుకొన్నారు. యిద్దరినీ చెరొక చేతిలోకి ఎత్తుకొన్నాడు నవ్వుతూ ఆనందరావు. వారి లేత బుగ్గల మీద ప్రీతిగా ముద్దులు పెట్టాడు.
“తాతయ్యా!.. పిన్ని కథలను బాగా చెబుతుంది.” నవ్వుతూ చెప్పాడు దశరథనందన.
"పిన్ని పాటలు కూడా బాగా పాడుతుంది తాతయ్యా!..” సునంద కళ్ళు పెద్దవి చేసి చెప్పింది.
ఆనందరావు నవ్వుతూ.. పిన్ని కాదమ్మా.. అమ్మ అని చెప్పాలి." ఎంతో అనునయంగా చెప్పాడు.
యీ సవ్వడికి సంధ్య లేచి మంచం దిగి భర్తను సమీపించింది.
"మా అన్నయ్యగారు ఏమన్నారు?..” పరీక్షగా ఆనందరావు వదనంలోకి చూస్తూ అడిగింది సంధ్య.
ఆనందరావు బిడ్డలను క్రిందికి దించి.. “తనకు పరిపూర్ణ సమ్మతం అని చెప్పారు.”
విషయం అర్థం అయిన సుందరి తన్ను సమీపించిన దశరథనందన సునందను తీసుకొని వరండాలోకి వెళ్ళిపోయింది.
ఆ భార్య భర్తలు కొద్దిక్షణాలు ఒకరినొకరు పరీక్షగా చూచుకొన్నారు. యిరువురి మనస్సుల్లో ఎంతో శాంతి.. వదనాల్లో చిరునవ్వులు నాట్యం చేశాయి.
ఆ రాత్రి సుందరి మంచం వద్దకు వచ్చి కూర్చుంది సంధ్య. బిడ్డలిద్దరూ ఆమెకు యిరువైపునా పడుకొని నిద్రపోమన్నారు. సుందరిని తట్టి లేపింది సంధ్య.
వులిక్కిపడి కళ్ళు తెరచింది సుందరి. “ఏమ్మా!..” తల్లి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
“నీవు మీ బావను పెండ్లి చేసుకొంటావా!.. యీ పిల్లలకు తల్లిలేని లోటు తీరుస్తావా!.. నాకు మీ నాన్నగారికి మనశ్శాంతి కలిగిస్తావా!..” సుందరి ముఖంలోకి చూస్తూ మెల్లగా అడిగింది సంధ్య.
సుందరి వదనంలో చిరునవ్వు.. సిగ్గు..” అంతా మీ యిష్టం అమ్మా!..” తల దించుకొని పలికింది సుందరి.
సుందరి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని.. “నా తల్లి బంగారు.” ఆనందంతో సుందరి నొసటన ముద్దుపెట్టింది సంధ్య.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments