'Jeevana Ragalu Episode 9' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 23/06/2024
'జీవన రాగాలు ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. ఆయన భార్య పేరు సుందరి.
దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య.
దశరథరామయ్యకు నలుగురు పిల్లలు. దశరథనందన, గోపీనందన కొడుకులు. సునంద, హిమబాల కూతుళ్ళు.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది. ఆమె చెల్లెలే సుందరి.
వివాహం ఘనంగా జరుగుతుంది. అత్తవారింటికి చేరుతుంది కౌసల్య.
కౌసల్య, దశరథ రామయ్యలకు కవలలు పుడతారు. వారికీ దశరథ నందన, సునంద అని పేర్లు పెడతారు.
గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య, బండి నడిపే ఫకీరా మరణిస్తారు.
పిల్లల్ని, దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి సుందరితో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయిస్తారు.
ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 9 చదవండి.
ఛలోక్తులతో.. సరస సంభాషణలతో ఆ యాత్రికులు స్వస్థలాలకు తిరుగు పయనం సాగించారు. రైల్లో తల్లి ఆదేశానుసారం... దశరథరామయ్యకు కావలసినవి సుందరి అందించేది. అతనూ ఆనందంగా అందుకొనేవాడు.
పిల్లలు యీ రెండు వారాల్లో సుందరికి ఎంతగానో చేరువ అయ్యారు. ఎప్పుడూ ఆమె ప్రక్కనే కూర్చునేవారు. వెంకటరామయ్య ఆనందరావు, సంధ్య ఎంతగానో ఆనందించారు.
ఒక్కో సమయంలో సుందరి స్థానంలో కౌసల్య దశరథరామయ్యకు గోచరించేది. ఆ కల్పనా జగత్తునుండి వాస్తవానికి వచ్చినప్పుడు... అతని హృదయంలో అనిర్వచనీయమైన మూగబాధ.
యింటికి చేరిన మరుదినం వెంకటరామయ్య... బలరామశర్మ సమక్షంలో, తన నిర్ణయాన్ని తనయుడు దశరథరామయ్యకు తెలియజేశాడు. "బిడ్డల క్షేమం కోసం... యింటికి యిల్లాలు కోసం... నీవు సుందరిని వివాహం చేసుకోవాలి దశరథా!...” ఎంతో అనునయంగా చెప్పాడు బలరామశర్మ.
వారి మాటలను ఏనాడూ కాదూ అనని దశరథరామయ్య సుందరితో వివాహానికి అంగీరించాడు.
సాంప్రదాయబద్ధంగా... ఆనందరావు సంధ్యలు వెంకటరామయ్యగారి యింటికి వచ్చి తమ నిర్ణయాన్ని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
పురోహితులు ముహూర్తాన్ని నిర్ణయించారు. యీ విషయాన్ని విన్న వారి హితులు... ఆప్తులు.. పనివారు... వూరి జనం... ఎంతగానో సంతోషించారు.
దశరథరామయ్య... సుందరీల వివాహం జరిగింది. సుందరి అత్తగారి యింటికి వచ్చింది. బిడ్డలు 'అమ్మా!... అమ్మా!...' అంటూ ఆమెను హత్తుకుపోయారు. వెంకటరామయ్య, పార్వతమ్మల వదనాల్లో పూర్వపు కాంతులు వెల్లివిరిశాయి.
సుందరి... దశరథనందనను... సునందను కన్నబిడ్డల్లా ఎంతో ప్రేమాభిమానాలతో చూచుకొనేది. ఆ దృశ్యాలను చూచి... దశరథరామయ్య మనస్సులో ఎంతో ఆనందించేవాడు. సుందరిని ఏకాంతంలో మెచ్చుకునేవాడు.
కాలచక్ర పరిభ్రమణంలో మరో రెండు సంవత్సరాలు ఆ కుటుంబాల మధ్య... ఎంతో ప్రశాంతంగా సాగిపోయాయి. దశరథరామయ్యకు... రెండుసార్లు రాష్ట్రస్థాయిలో ఉత్తమ వ్యవసాయదారుని గౌరవం... సన్మానం జరిగాయి. పత్రికల్లో వార్తల్లో.. మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి.
పిల్లలు దశరథనందన... సునంద, యల్కేజీ... యల్ కేజీ ముగించి... రెండవ తరగతి చదువుతున్నారు. స్కూల్లో వీరికి ఏకసంతాగ్రాహులని పేరు. వీరంటే... తోటి పిల్లలకు ఎంతో ప్రేమ... గౌరవం... అధ్యాపకులకు... వీరిపట్ల అధిక ప్రీతి... వాత్సల్యం... అభిమానం.
*
సుందరికి నెలలు నిండాయి. పురిటికి అమ్మగారి యింటికి వెళ్ళింది. కవలపిల్లలు పుట్టారు. ఆ వార్త విన్న వెంకటరామయ్య... పార్వతమ్మ... దశరథరామయ్య ఎంతగానో ఆనందించారు.
బాలసారె ఘనంగా జరిగింది. పిల్లలకు గోపినందన, హిమబాల.. నామకరణాన్ని చేశారు. అందరూ... ఎంతగానో సంతోషించారు.
సుందరి తన బిడ్డలతో అత్తగారి యింటికి వచ్చింది. దశరథనందన.. సునంద.. తమ తమ్ముడిని చెల్లెల్ని చూచి ఎంతగానో సంబరపడ్డారు. అప్పటికి వారి వయస్సు ఏడుసంవత్సరాలు.
తన యిద్దరు బిడ్డలను చూచుకొంటూ సుందరి దశరథనందనను, సునందను... పూర్వపు రీతిలో చూచుకోలేకపోయింది. వారు తండ్రితో... “అమ్మ మారి పోయింది నాన్నా!...” విచారంగా చెప్పేవారు. “కాదు నాన్నా!.. యిప్పుడు మీకు మరో తమ్ముడు... చెల్లెలు వున్నారు కదా!... వాళ్ళు మీకంటే చిన్నవాళ్ళు కదా!... కొంతకాలం వారిని అమ్మే చూసుకోవాలి. మిమ్మల్ని చూచుకొనేటందుకు నానమ్మ... తాతయ్య.... నేను... ముంతాజ్ అమ్మ... వున్నాంగా!... యికపై అలా మాట్లాడకూడదు. నాన్నా!.. అమ్మ వింటే బాధ పడుతుంది.” ఎంతో అనునయంగా ఆ చిన్ని మనస్సులకు నచ్చచెప్పేవాడు దశరథరామయ్య.
విషయాన్ని కొంతవరకు అర్థం చేసుకొన్న ఆ అన్నాచెళ్ళెల్లు ఎక్కువ సమయం తాతయ్య నాయనమ్మల తోటే గడిపేవారు.. స్కూలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. ఎప్పుడూ ముంతాజ్... ఆ యిద్దరినీ కన్నబిడ్డల్లా చూచుకొనేది. అప్పటికి దశరథనందన.... సునంద మూడవతరగతి చదువుతున్నారు. ఎంతో తెలివిగా... క్లాసులో వీరే ఫస్టు.
తమ బిడ్డలు గోపీనందన హిమబాల ఎదిగో కొద్దీ సుందరి దశరథనందన సునందలకు దూరం అయింది. మనస్తత్వంలో స్వార్థం చోటుచేసుకుంది. కోడలిలోని మార్పును గ్రహించిన పార్వతమ్మ వెంకటరామయ్యలు దశరథనందన సునందలను ఎక్కువగా చేరదీసి అభిమానించేవారు. ముంతాజ్ వారిని ప్రాణసమానంగా చూచుకొనేది. తండ్రి దశరథరామయ్య క్రమంగా వారు కోరినవి సమకూర్చేవారు. ఎంతగానో అభిమానించేవారు.
అప్పుడప్పుడూ అన్న మన్మథరావు ఆ వూరికి వచ్చి చెల్లెలి యోగక్షేమాలను విచారించి సుందరికి నయబోధ చేసి వెళ్ళేవాడు.
కాలవాహినిలో మరో అయిదు వసంతాలు... గడిచిపోయాయి. అప్పటికి దశరథనందన... సునందకు పన్నెండుసంవత్సరాలు. గోపినందన, హిమబాలలకు ఐదేళ్ళవయస్సు.
ఆనందరావు సంధ్యలు.. కలకత్తాకు వెళ్లాలని అనుకొన్నారు. ఆ విషయాన్ని వెంకటరామయ్యకు తెలియజేశారు. పిల్లల ఆలనా పాలనా దృష్ట్యా.. వెంకటరామయ్య ఆ ప్రయాణానికి అంగీకరించలేదు. కానీ... ఎప్పటినుంచో తన మనస్సులో కలకత్తా కాళీమాతను దర్శించాలన్న కోర్కె వున్న పార్వతమ్మ... భర్త తనయుల సమ్మతంతో ఆనందరావు దంపతులతో బయలుదేరింది.
వారు కాళీమాత ఆలయాన్ని, దక్షిణేశ్వరం, బేలూరు రామకృష్ణ మఠాన్ని, వివేకానందుని, రవీంద్రనాధ్ ఠాగూర్ ఆశ్రమాలను దర్శించారు. ఎంతో ఆనందాన్ని పొందారు.
తిరుగు పయనంలో... జరిగిన రైలు ప్రమాదంలో ఆ ముగ్గురూ పరమపదించారు.
మృతదేహాలు వారివారి నిలయాలకు చేరాయి.
వెంకట రామయ్య కుప్పలా కూలిపోయాడు. రెండు కుటుంబాలు శోకసాగరంలో మునిగిపోయాయి.
మహాతల్లి పార్వతమ్మకు తనయుడు దశరథ, అంతిమ సంస్కారాలను యధావిధిగా నిర్వహించాడు, హితుడు బలరామశర్మ సాయంతో.
మరోమారు ఆ యింటికి కారుచీకట్లు క్రమ్ముకొన్నాయి. దశరథరామయ్య తన బాధను దిగమ్రింగి తండ్రిని ఓదార్చాడు. ఎక్కువకాలం ఆయన చెంతనే వుంటూ.. ఆయనకు అండగా నిలిచాడు. హితుడు బలరామశర్మ పగలు దగ్గర వుండడమేకాక... రాత్రివేళ ఆయన చెంతనే పడుకునేవాడు.
ఆ సంవత్సరం రాష్ట్రస్థాయిలో దశరథరామయ్యగారికి వుత్తమ వ్యవసాయదారునిగా...సన్మానం... ప్రశంసా పత్రం లభించింది. అన్ని పేపర్లలో ఫోటో పడింది.
పొరుగు రాష్ట్రాలవారు ఆ వూరికి వచ్చేవారు. దశరథ వ్యవసాయ క్షేత్రాలను తిలకించేవారు. వారినుండి సలహాలను పొందేవారు.
కొడుకు కీర్తి ప్రతిష్టలకు వెంకటరామయ్య ఎంతగానో సంతోషించారు. “వీటినంతా చూచేదానికి మీ అమ్మ నోచుకోలేదు. వెళ్ళిపోయింది.” అర్ధాంగిని తలచుకొని కన్నీళ్ళు కార్చేవారు.
“అమ్మ ఎక్కడికీ వెళ్ళలేదు నాన్నా! మనలోనే వుంది. తను ముందు నడిచి నన్ను నడిపిస్తూ వుంది." ఆవేదనను మ్రింగి నవ్వుతూ పలికి తండ్రిని ఓదార్చేవాడు దశరథరామయ్య.
*
దశరథరామయ్య సోదరి సుశీల.. తండ్రి వెంకటరామయ్యకు, దశరథనందనకు సునందకు తన యింట్లో పని త్వరగా ముగించుకొని తను పుట్టిన యింటికి వచ్చి... వారికి కావలసినవి సమకూర్చేది.
సుశీల యీ విధంగా తన యింట్లో తిరగడం సుందరికి నచ్చేదికాదు. ఒక్కోసారి సుశీలతో కటువుగా మాట్లాడేది. కానీ సుశీల ఆమె మాటలను పట్టించుకొనేది కాదు. తనకు కావలసింది తన వారి ఆనందం. ఒకరోజు దశరథరామయ్య... సుందరి సుశీలతో మాట్లాడే తీరును చెవులారా విన్నాడు. అతని మనస్సుకు బాధ కలిగింది. చెల్లెలిని నొప్పించకుండా ఆమెకు చెప్పవలసిన మాటలను... ఆమెతో చెప్పాడు.
తన బిడ్డలు ఎదిగేకొద్దీ సుందరిలో ఏర్పడుతున్న మార్పును... గమనిస్తూనే వున్నాడు దశరథరామయ్య. వ్యతిరేకించి విమర్శిస్తూ సుందరితో మాట్లాడితే... రగడ అవుతుంది. కానీ ప్రయోజనం వుండదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
టెన్త్ పరీక్షలు దశరథనందన... సునంద వ్రాశారు. వారిని... ప్లస్టు నెల్లూరులో చేర్పించి చదివించాలనుకొన్నాడు. తన నిర్ణయాన్ని తండ్రి వెంకటరామయ్యకు ఎంతో సౌమ్యంగా వివరించాడు.
పరిస్థితులను... వ్యక్తుల తత్వాలను గమనిస్తూ వున్న వెంకటరామయ్య అంతా విని విరక్తిగా నవ్వి...“నీకు మేలు అని ఏది తోస్తే అది చెయ్యి నాయనా!.... నాకు నీకు ముఖ్యం నీ బిడ్డల అభివృద్ధి... ఆనందం.”
“బాగా ఆలోచించే... ఈ నిర్ణయానికి వచ్చాను నాన్నా!..” ప్రాధేయపూర్వకంగా పలికాడు దశరథ. “నాన్నా!... నా బిడ్డ తత్వం నాకు తెలీదా!...నీ యిష్టప్రకారమే కానీ... అదే అందరికీ మంచిది.” నవ్వుతూ చెప్పాడు వెంకటరామయ్య.
దశరథరామయ్య... దశరథనందన, సునందలను నెల్లూరులో కాలేజీలో చేర్చాడు. ఒక యింటిని అద్దెకు తీసుకొని ముంతాజ్ ని ఆ యింట్లో వుంచాడు. తల్లి తర్వాత తల్లితో సమానమైన ముంతాజ్ ఆ అన్నా చెల్లెళ్ళను తన సొంత బిడ్డల్లా చూచుకొనేది. వారానికి ఒకసారి దశరథరామయ్య... రెండు వారాల కొకసారి తాతయ్య వెంకటరామయ్య నెల్లూరికి వెళ్ళి పిల్లల యోగక్షేమాలను విచారించి వారికి కావలసినవి సమకూర్చి వస్తూ వుండేవారు. నెలకు ఒకమారు ఆ అన్నాచెల్లెళ్ళు తమ వూరికి వచ్చి తాతగారిని, పిన్ని, తమ్ముడు, చెల్లిని, నాన్నగారిని, స్నేహితులను, అత్తమామలు సుశీల శంకరయ్యలను వారి పిల్లలను చూచి... సరదాగా గడిపి నెల్లూరుకు చేరేవారు.
ముంతాజ్ కొడుకు మస్తాన్... తన తండ్రి స్థానంలో వెంకటరామయ్యగారి గుర్రపు బండికి సారధి అయినాడు. వెంకటరామయ్య కుడిభుజంగా మారిపోయాడు.
కాలగమనంలో మరో రెండు వసంతాలు వన్నెలు కురిపించి వెళ్ళిపోయాయి. దశరథనందన సునంద స్టేట్ ఫస్టులో ప్లస్ టు పాసయ్యారు. వారిని హైదరాబాద్ లో.. బి.టెక్ లో చేర్పించాడు దశరథరామయ్య ముంతాజ్ వారితోనే వుండేలా చక్కటి యింటిని ఏర్పాటు చేశాడు. రెండు కార్లు కొని ఒకటి తండ్రిగారికి... ఒకటి పిల్లలకు యిచ్చాడు. దశరథరామయ్య, నెలకు ఒకటి రెండు సార్లు... ఏదో పనిమీద హైదరాబాద్ వెళ్ళేవాడు. వారినిచూచి కావలసినవి ఏర్పరచి వచ్చేవాడు.
*
జనాన్ని డబ్బుతో కొని... మన్మథరావు యం.యల్.ఏ. అయ్యాడు. ఆయన కొడుకు రఘునందన యూత్ లీడర్. బంగారన్న కొడుకు ఫణీంద్ర రఘునందనకు ప్రియమిత్రుడు.
పది వసంతాలు... మన్మథరావును ఆ ఎత్తుకు చేర్చాయి.
దశరథనందన, సునంద యం.టెక్. పూర్తి చేశారు. గోపీనందన హిమబాల ప్లస్.టు సెకండ్ ఇయర్.
సునందకు నెల్లూరు నుంచి మంచి సంబంధం వచ్చింది. పిల్లవాని పేరు శాంతారామ్. తండ్రి అడ్వకేట్. తల్లి కాలేజి లెక్చలర్. శాంతారామ్ దశరథనందనకు కాలేజ్ మేట్, బి.టెక్. యం.టెక్ కలిసి చదివారు.
ఆ రోజుల్లో దశరథనందన సునంద వారి యింటికి రెండు మూడుసార్లు శాంతారామ్ తో కలసి వెళ్ళడం జరిగింది.
శాంతారామ్ తల్లి ఊర్మిళకు సునంద బాగా నచ్చింది. ఆ కారణంగా ప్లీడర్ గుమాస్తా రామకోటి ద్వారా తమ నిర్ణయాన్ని దశరథరామయ్య... వెంకటరామయ్యలకు తెలియజేశారు ఆ దంపతులు.
దశరథనందన ఎంతో ఆనందంగా... “సునందకు శాంతారామ్ కు యీడూ జోడు బాగుంటుంది. జాతకాలు చూపించి సరిపడితే వివాహం జరిపిద్దాం తాతయ్యా!...” తాతగారి ప్రక్కన కూర్చొని తన నిర్ణయాన్ని తెలియజేశాడు.
యీ మాటను విన్న సునంద లేచి... సిగ్గుతో తలదించుకొని తన గదికి వెళ్లిపోయింది.
ఆమె పరుగులోని అర్థాన్ని గ్రహించిన వెంకటరామయ్య, దశరథరామయ్య... బలరామశర్మకు కబురు పంపారు.
“జాతకాలు దివ్యంగా సరిపోయాయి. పైనెలలో మంచి ముహూర్తం వుంది. కలసి వచ్చిన సంబంధాన్ని కైవశం చేసుకోవాలి దశరథ. " నవ్వుతూ పలికాడు బలరామశర్మ.
“బలరామశర్మగారూ!... మీరు వెళ్ళి వారికి యీ విషయం చెప్పి అమ్మాయిని చూచుకొనేటందుకు రమ్మని ఆహ్వానించిరండి!...” అది వెంకటరామయ్యగారి ఆదేశం.
“అలాగే బావా...!” ఆనందంగా అంగీకరించాడు బలరామశర్మ.
అడ్వకేట్ ఆదినారాయణ, సతీమణి ఊర్మిళ మరో నలుగురు వరుడు శాంతారామ్ వచ్చి సునందను చూచారు.
దశరథరామయ్యగారి అతిధిసత్కార్యాలకు వారు మురిసిపోయారు. ముహూర్తాన్ని వివరించాడు బలరామశర్మ.
నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మూడు వారాల తర్వాత శుభముహూర్తాన శాంతారామ్, సునందల వివాహం ఘనంగా జరిగింది. పుట్టింట మూడు నిద్రల తర్వాత... సునంద అత్తగారి యింటికి బయలుదేరింది.
అంతా హాల్లో సమావేశం అయ్యారు. మొదట తాతగారి పాదాలు త్రాకి నమస్కరించింది సునంద. ఆమె కంటి నుండి కారిన నీళ్ళు వెంకటరామయ్యగారి పాదాలను త్రాకాయి. వులిక్కిపడ్డాడు.
“అమ్మా!...” వంగి ఆమె భుజాలను పట్టుకొని తన ముసలి హృదయానికి హత్తుకున్నాడు. మనసారా ఆశీర్వదించాడు.
ఆ క్షణంలో వెంకటరామయ్య కళ్ళు కన్నీటి కడవలైనాయి. తండ్రి దశరథరామయ్య తన బిడ్డను హృదయానికి హత్తుకున్నాడు. తలపై తన అశ్రుధారలను కురిపించి... “నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు తల్లీ" గద్గద స్వరంతో ఆశీర్వదించాడు. తాత తండ్రి మధ్యన నిలబడి వారి భుజాలపై తన చేతులను వేసి, వారి ముఖాలను మార్చి మార్చి చూచి కన్నీటితో వారిని వారించాడు దశరథనందన.
సునంద పినతల్లి సుందరిని సమీపించింది. ఆమె కాళ్ళను తాకి నమస్కరించింది. లేచి... ఆ తల్లి చేతులు పట్టుకొంది.
“అమ్మా...! నేను ఎప్పుడైనా నా మాటలతో నిన్ను నొప్పించి వుంటే.. నన్ను క్షమించమ్మా! నా చిన్నప్పుడు నీవు నన్ను దశరథను ఎలా చూచుకొనేదానివో... అది నేను యీ జన్మలో మరిచిపోలేను.” గద్గద స్వరంతో కన్నీటితో పలికింది సునంద.
సుందరి సయనాల్లో అశ్రువులు నిండాయి. ఆమెలోని మాతృత్వం... పాతజ్ఞాపకాలు మస్తిష్కంలో మెదిలాయి. సునందను హృదయానికి హత్తుకుంది. తలపై చేతిని వుంచి మనసారా దీవించింది.
సునంద తన అత్త మామాలు సుశీల, శంకరయ్యలకు నమస్కరించింది. వారి ఆశీస్సులను పొందింది. తమ్ముడు గోపినంద హిమబాలలను సమీపించింది. “తమ్ముడూ!... చెల్లీ!... తాతయ్యను, నాన్నగారిని జాగ్రత్తగా చూచుకోవాలి. వారు ఎంతో పేరుప్రతిష్టలతో బ్రతికినవారు. వారికి కష్టం కలిగించి మన కుటుంబానికి తలవంపు కలిగించే ఏ పనీ చేయకూడదు. అమ్మ మాటను ఎన్నడూ మీరకూడదు. యీ అక్కయ్యను మరచిపోకూడదు.” పవిటతో కన్నీటిని తుడుచుకొంటూ ఎంతో ప్రీతిగా, పలికింది సునంద.
కన్నీటితో ఆ తమ్ముడు చెల్లెలు అక్క ముఖంలోకి చూస్తూ... "అలాగే అక్కయ్యా!...” ఏక కంఠంతో పలికారు గోపీనంద, హిమబాలలు.
శాంతారమ్ సునందను సమీపించాడు. ఆ యిరువురూ కలసి పెద్దలయిన వెంకటరామయ్య దశరథరామయ్య సుందరి శంకరయ్య సుశీల పాదాలకు నమస్కరించారు. వారి అందరి ఆశీర్వాదాలను తీసుకొన్నారు.
అందరూ వరండాలోకి వచ్చారు. శాంతారామ్ సునందలు కార్లో కూర్చున్నారు. కారు కదిలింది. వీధిలో ప్రవేశించి ముందుకు నెల్లూరి వైపుకు వెళ్ళిపోయింది.
*
“టయిమ్ కలసి వచ్చింది సుందరీ!... యం.పి నైనాను.” ఎంతో ఆనందంగా పలికాడు ఫోన్లో మన్మధరావు.
"అలాగా అన్నయ్యా!..."
“అవును” గలగలా నవ్వి “యీ వార్తను మా బావగారికి తెలియజెయ్యి. అన్నయ్యను అభినందించేదానికి వస్తావా రావా!...”
“రేపే పిల్లలతో కలిసి వస్తానన్నయ్యా. మీ బావగారు కర్నాటకకు వెళ్ళి వున్నారు. వారం రోజుల తర్వాత వస్తారు.”
“ఆయనకు యీ వార్త రుచించదులే. మామయ్యకు చెప్పు ఆయన సంతోషిస్తారు.”
“అలాగే అన్నయ్యా!...”
అదే సమయానికి అక్కడికి వచ్చిన వెంకటరామయ్య....
“ఎవరమ్మా!...” అడిగాడు.
“మా అన్నయ్య!... యం.పి అయినాడట.”
“ఏదీ... ఫోన్ యిలా యివ్వు”
సుందరి రిసీవర్ను వెంకటరామయ్య అందించింది.
“అల్లుడూ!... నీకు నా శుభఆశీస్సులు” నవ్వుతూ పలికాడు వెంకటరామయ్య.
“థ్యాంక్యూ మామ.”
“పది మందికి మంచి చెయ్యి. నాన్నగారి పేరును నిలబెట్టు.”
“అలాగే”
రిసీవర్ ను సుందరికి అందించాడు వెంకటరామయ్య. ఫోన్ చేసి విషయాన్ని దశరథరామయ్యకు చెప్పింది సుందరి. కావలికి వెళ్ళి వస్తానని కోరింది. దశరథ అంగీకరించాడు.
మరుదినం మామగారి అంగీకారంతో సుందరి... దశరథనందన, గోపీనందన, హిమబాలలతో కార్లో కావలికి వెళ్ళింది. అన్న మన్మధరావు వదిన మంగమ్మ వారి బిడ్డలు రఘనందన, కూతురు భానుప్రియ వారిని ఎంతో ఆదరంతో ఆహ్వానించారు.
సుందరి అన్నకు వదినకు శుభాశీస్సులను హృదయపూర్వకంగా తెలియజేసింది. దశరథనందన, గోపీనందన, హిమబాల మామయ్యతో కరచాలనం చేశారు. అభినందించారు.
పిల్లలందరూ కలసి ఆనందంగా కలసిపోయి పెద్దలను కనువిందుచేశారు.
మొదటి నుంచీ మంగమ్మకు దశరథనందన అంటే చాలా యిష్టం. తన కూతురు భానుప్రియకు దశరథనందనకు వివాహం జరిపించాలని ఆమె సంకల్పం.
భోజనాల తర్వాత తన గదిలో... సుందరితో ఆ విషయాన్ని ప్రస్తావించింది.
“భానూకేం తక్కువ వదినా!... మంచి అందగత్తె. మా దశరథనందకు తగింది. వూరికి వెళ్ళగానే మావారితో యీ విషయాన్ని గురించి మాట్లాడతాను." అనునయంగా దరహాసవదనంతో పలికింది సుందరి.
"మాట్లాడడం కాదు వదినా!... నా కోర్కెతీరేలా చూడాలి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది మంగమ్మ.
“అలాగే వదినా!... నవ్వుతూ తన సమ్మతిని తెలియజేసింది సుందరి.
ఏకాంతంగా మంగమ్మ కూతురు భానుప్రియతో “భానూ!... మేడ మీద నీ ప్రక్క గదిలో మీ బావ దశరథనందన యీ రాత్రికి పడుకొంటాడు. నిర్భయంగా అతనితో నీ అభిప్రాయాన్ని తెలియజెయ్యి. అతని పట్ల నీకు వున్న ప్రేమను చేతలలో కనుచూపులతో విశదపరచు. అతడు నీవాడు అయ్యేలా చూచుకో... సరేనా!...” తన మనో అభిప్రాయాన్ని కుమార్తెకు తెలిపింది మంగ.
“బావంటే నాకూ యీష్టమేనమ్మా.... అలాగే చేస్తాను.” అంది ఆనందంగా భానుప్రియ.
ఆ సాయంత్రం పార్టీకి సంబంధించిన వారంతా వచ్చారు. మన్మధరావు వారందరికీ ఘనమైన విందు, మందు ఏర్పాటు చేశాడు. వారంతా మన్మధరావును ఘనంగా పొగిడి మందుసేవించి విందును ఆరగించారు.
పిన్నలు.... మన్మధరావు కొడుకు, అతని స్నేహితులు భవంతికి వెనుక భాగంలో వున్న తోటలో అదే కార్యక్రమాన్ని కొనసాగించారు.
రఘనందన తన మిత్రులను దశరథనందనకు పరిచయం చేశాడు. బంగారన్న కొడుకు, ఫణీంద్రను చూపించి... "వీడు నా ప్రాణమిత్రుడు. మంచి మిమిక్రీ కళాకారుడు. నాలాగే వీడూ యూత్ లీడర్.” దశరథనందన, ఫణీంద్రతో కరచాలనం చేశాడు. అందరూ సినిమాలను గురించి,
నాయకానాయికలను గురించి రాజకీయాలను గురించి చర్చలు జరిపారు. మందును విందునూ ఆరగించారు. మందును వద్దని వారించాడు దశరథనందన.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments