top of page

జీవన సమరం

Writer's picture: Goparaju Venkata SuryanarayanaGoparaju Venkata Suryanarayana


'Jeevana Samaram' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana Published In manatelugukathalu.com On 27/06/2024

'జీవన సమరం' తెలుగు కథ

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పరశురామన్న స్ఫురద్రూపి, ఆజానుబాహుడు! గంభీర స్వభావి!! చదివింది పెద్దగా లేక పోయినా.. లోకజ్ఞానం, వ్యవహార జ్ఞానం బాగా ఎరిగిన వాడు. ఊరి మోతుబరులు, వ్యాపారవేత్తలు అందరితో స్నేహ సౌహార్ద సంబంధాలు కలిగి.. ఊళ్ళో మంచి పేరున్న పెద్దమనిషిగా చెలామణి అవుతున్న వ్యక్తి. అదే స్నేహబలంతోనే ఊరిలో సహకార సంఘం నడిపే ఒక వ్యాపార సంస్థకు డైరెక్టరుగా మంచి స్థాయి ఉద్యోగమే చేస్తూ.. హుందాగానే జీవితం సాగిస్తున్నాడు. 


ఇంటి విషయానికొస్తే.. పరశురామన్న కుటుంబంలో తనకు చాలా ప్రేమపాత్రురాలైన పక్క ఊరి లో నివసించే.. విధవరాలైన అక్క బాలమ్మ కూతురు నాగమణిని.. పద్నాలుగేళ్ళ పిన్న వయసులోనే.. బాంధవ్యం దృష్టితో పెళ్ళి చేసుకున్నాడు. తండ్రి లేని నాగమణి ఒంటరి తల్లి పెంపకంలో చదువు సంధ్య లేకుండా గారాబంగా పెరిగింది. చిన్న వయసులో కాపురానికి వెళ్ళిన నాగమణికి.. ఆమె అత్తగారు భద్రమ్మ.. వరుసకు అమ్మమ్మే అయినా.. అత్తగారు హోదాలో భద్రకాళిలా విరుచుకు పడుతూ.. పెట్టే ఆరళ్ళకు తట్టుకోలేక.. ప్రక్క ఊరు పుట్టింటికి.. తరచు పలాయనం చిత్తగించేది! అది నచ్చని ఆమె భర్త పరశురామన్న.. తల్లి భద్రమ్మ చెప్పే చాడీలకు లొంగి పురుషాధిక్యత ప్రదర్శిస్తూ.. వాస్తవాలు ఎరుగక.. భార్యను.. చిన్నపిల్ల అని కూడా చూడకుండా.. హింసించేవాడు. అత్తవారింట్లో ఆ పసివయసులో.. దుర్భర జీవనం, ఆరళ్ళు, హింసలు భరించలేక.. నాగమణి పుట్టింటికి వెళ్ళి.. తిరిగి కాపురానికి వెళ్ళనని మొండికేసింది! బలవంతాన తిట్టి, కొట్టి.. కాపురానికి తీసికెళితే.. మానసికంగా దెబ్బతిని.. కృంగిపోయిన ఆ పసిహృదయం.. మతి స్థిమితం తప్పి.. దేనికీ, ఏపనికీ, ఎవ్వరికీ, ఏమాటకు స్పందించని స్థితికి.. బండబారిపోయి స్థబ్దుగా మారి పోయింది!

 

ఆ పరిస్థితిలో ఉన్న భార్యను.. పుట్టింటిలో తోబుట్టువు అక్క దగ్గరకు జేర్చి..చేతులు దులుపుకున్నాడు భర్త పరశురామన్న. ఏదిఏమైనా.. తల్లి బాలమ్మకు.. ఆ స్థితిలో ఉన్న కూతురు సంరక్షణ బాధ్యత తీసుకోక తప్పలేదు. అప్పటి నుంచి.. కన్న కూతురును.. కంటికి రెప్పలా.. కాచుకుంటూ.. కాపాడుకొస్తూనే.. ఉంది బాలమ్మ. ఆ స్థితిలోనే.. నాగమణి ఒక కొడుకును కన్నా.. ఆ బిడ్డ.. ఆ పిచ్చి తల్లి ఒడిలో.. బాలారిష్టాలు దాటి.. బ్రతికి బట్టకట్ట లేకపోయాడు. ఆ కన్న తల్లికి.. ఆమాత్రం భవిష్యత్ భరోసా కూడా లేకుండా పోయింది. 


యవ్వనంలో ఉన్న పరశురామన్న ఇంటి పట్టున కట్టడి లేక.. చెడు తిరుగుళ్ళకు అలవాటు పడ్డాడు. ఆడది తిరిగి చెడితే.. మగవాడు తిరక్క చెడతాడు అని నమ్మే ఇంట్లో వాళ్లు.. ఆ చర్యలకు.. చూసీ చూడనట్లు ఊరుకున్నారు. కొన్నాళ్ళకు ఆ అలవాటు కాస్తా.. వారవనితలను ఇంటికే తీసుకువచ్చి.. మేడమీద తన గదిలో.. ఏకాంతంగా గడిపే స్థితికి.. దిగజారాడు. ఇంట్లోవాళ్ళు కూడా.. అతని అధికార దర్పం, దురుసుతనానికి భయపడుతూ.. ఏమీ ఎదురు చెప్పలేని పరిస్థితి. 


చెడు అలవాట్లకు బానిసైన పరశురామన్న ఉద్యోగ బాధ్యతల్లో.. అలసత్వం కారణంగా విధి నిర్వహణలో పట్టు కోల్పోయి.. బోర్డు మీటింగులో నిందారోపణలకు గురై.. మాట పట్టింపుతో రాజీనామా చేసి ఉద్యోగం చేజార్చుకున్నాడు. ఆపైన మరి ఏం చేయాలన్న సమస్యతో బాధపడుతూ గడుపుతున్న సమయంలో.. కర్నాటకలో కొత్తగా నిర్మించిన.. తుంగభద్ర డామ్ దిగువన.. వ్యవసాయానికి వీలైన భూములు.. నీటి వసతితో కారు చౌకగా లభిస్తున్నాయని తెలుసుకొని పెట్టుబడి సొమ్ము కోసం.. స్థితిమంతురాలైన అక్క బాలమ్మనే ఆశ్రయించి ప్రాధేయపడ్డాడు. బాలమ్మ కూడా తమ్ముడి బాగుకోరి అభిమానంతో కాదనలేక అడిగిన సొమ్ము ఇచ్చి సాయం చేసి వాత్సల్యం చూపింది. ఆ సొమ్ముతోనే కర్నాటకలో చవకగా.. ఎన్నో ఎకరాల సాగు భూమిని కొని.. అక్కడివారికి అప్పటివరకు అనుభవం కాని.. ఆధునిక వ్యవసాయం చేసి.. లాభాలు గడించి.. మోతుబరి రైతుగా నిలిచాడు. గడించిన సొమ్మును.. సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు వడ్డీలకు తిప్పి.. మరింతగా ధనాన్ని పెంపుచేస్తూ వచ్చాడు. 


తను ఉంటున్న చోట.. తన ఒంటరి జీవితంలో.. తనకు వంటా వార్పూ చూసేందుకై.. ఏ బాదరబందీ లేని.. అంజనమ్మ అనే ఒక మధ్యవయస్సు స్త్రీని చేరదీసి.. ఇంట్లోనే ఉంచుకుని.. ఆమెను లోబరచుకుని.. సహజీవనం చేయడం మొదలు పెట్టాడు. వయసు మీరుతున్న కొద్దీ పరశురామన్నకు.. తనకంటూ ఒక సొంత వారసుడు కావాలనే కోరిక.. బలంగా ఏర్పడ సాగింది. ఆ సంకల్పం తోనే.. అంజనమ్మ ద్వారానే.. ఒక కొడుకును కనడంలో సఫలీకృతుడయ్యాడు. కోరిక కొద్దీ పుట్టిన కొడుకును.. కోటి ఆశలతో.. భాస్కర్ అని పేరుపెట్టుకొని.. అల్లారు ముద్దుగా మురిపెంగా పెంచుకో సాగాడు. 


కుర్రాడికి నాలుగేళ్లు వచ్చేసరికి తాను పొలాలు కొన్న చోట.. పరిస్థితులు మారి.. భూముల ధరలకు దశ తిరిగి అమాంతం రెక్కలొచ్చి ఇబ్బడిముబ్బడిగా ధరలు పెరగడంతో.. వాటిని అమ్మేసి.. ప్రవాసం వదిలి.. కొడుకుతో పాటుగా మంచి ఉచ్ఛస్థితిలో.. స్వదేశం, సొంత ఊరుకు, సొంత గూటికి తిరిగి వచ్చి.. స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. 

 

ప్రవాసం వదిలే ముందే.. కన్న కొడుకు భాస్కర్ కు.. భవిష్యత్తులో.. ఎలాంటి కించపడే దుస్థితి రాకూడదనే దూరాలోచనతో.. తాను చేరదీసి సహజీవనం చేసిన.. కొడుకు తల్లి అంజనమ్మకు అక్కడే.. ఆమె స్వస్థలం లోనే.. ఇల్లు, జీవనోపాది కల్పించి.. తెగతెంపులు చేసుకుని.. కేవలం కొడుకుతోనే.. స్వదేశం, స్వజనం మధ్యకు.. సొంతూరుకు స్థితిమంతుడై.. తిరిగి చేరుకున్నాడు.. పరశురామన్న. అలా.. భాస్కర్ ను తల్లి లేని కుమారుడు గానే.. సంఘంలో చెలామణి చేస్తూ.. పెంచసాగాడు. అయినా.. నిజం నిప్పు లాంటిదనీ.. ఏనాటికైనా భాస్కర్.. తనకు అక్రమ సంతానమని తెలిసినప్పుడు.. తన కొడుకును.. ఆ మచ్చ నుండి కాపాడగలిగేది.. ఎప్పటికైనా తను సమకూర్చగలిగే.. ఆస్తి సంపద దన్నే అని నమ్మి.. తన సొమ్మును వడ్డీ వ్యాపారంలో.. వృధ్ధిచేయడం మొదలు పెట్టాడు. కాలం గడుస్తోంది.. భాస్కర్ చురుగ్గానే పెరుగుతున్నాడు తండ్రి సంరక్షణలో. 


కొంత కాలానికి పొరుగు జిల్లాలో ఉండే పరశురామన్న చెల్లెలు సావిత్రమ్మ.. విధివశాన భర్త గుండెపోటుతో మరణించడంతో.. ఇంటిపెద్ద, సంపాదించే ఆధరువును కోల్పోయి.. నిస్సహయంగా నలుగురు ఆడపిల్లలతో సహా పుట్టింటికి చేరింది. వారిని ఆప్యాయంగా అక్కున జేర్చుకొని.. ప్రేమగా, రక్షణ బాధ్యత తీసుకుని సొంత కుటుంబంగా భావించి.. వారి ఆలనాపాలనా, మంచిచెడ్డలూ అభిమానంగా చూడ్డం సాగించాడు పరశురామన్న. అన్న నీడన.. ఇంటిపట్టు బాధ్యతలు తీసుకుని.. నిశ్చింతగా జీవనం గడప సాగింది సావిత్రమ్మ. 


చెల్లెలు మీది అనుబంధంతో.. ఈడొచ్చిన మేనకోడళ్ళు ఒక్కొక్కళ్ళకు పెళ్ళి సంబంధాలు వెదకి.. ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా.. బాధ్యతలు నెరవేరుస్తూ వచ్చాడు పరశురామన్న. చివరి పిల్ల వరలక్ష్మి.. తన కొడుకు భాస్కర్ కు వయసు రీత్యా ఈడు జోడూ కావడంతో.. అత్యవసర పరిస్థితిలో సంబంధం కలుపుకోవచ్చన్న భావన పరశురామన్నకు మనసులో లేకపోలేదు! కానీ.. అన్నకు సక్రమ సంతానం కాదన్న తలంపుతో.. సావిత్రమ్మకు భాస్కర్ పట్ల ఏవగింపు, మనసులో ఈసడింపు ఎంత ఉన్నా.. ఏహ్యభావం బహిరంగంగా ప్రకటించే ధైర్యం అవకాశం లేకపోవడంతో మిన్నకుండిపోయింది!


తీరా భాస్కర్ కు యుక్తవయసు వచ్చేసరికి.. లేటు వయసు సంతానం కావటంతో.. పరశురామన్న కు వృధ్ధాప్యం సమీపించింది. వ్యవహారాలు చక్కబెట్టే ఓపిక సన్నగిల్లింది. ఒకటి రెండు సార్లు భాస్కర్ కు వరలక్ష్మి నివ్వడం విషయమై చెల్లెలుతో సంప్రదించినా.. ఏదో ఒక ఉద్యోగంలో చేరి స్థిరపడనీ.. అంటూ నానుస్తూ వచ్చిందేకానీ.. సానుకూలంగా స్పందించలేదు. పైగా తన పెద్ద కూతుళ్ళ సంబంధీకుల ద్వారా తగిన వరుల కోసం.. లోపాయికారీగా వాకబు చేస్తూనే ఉంది! 


రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారి.. వృద్ధాప్యం కారణంగా పరశురామన్నకు.. జీవన అవసరాలకై.. చెల్లెలు సావిత్రమ్మ పైనే.. ఆధారపడక తప్పని దుస్థితి! కొడుకు భవిష్యత్తు గురించిన బెంగ, వ్యాకులత.. ఆయనను ఆ ముసలితనంలో క్రుంగదీసాయి! ఆరోగ్యం క్షీణించ సాగింది!! అంతుబట్టని కామెర్ల వ్యాధి ముదిరి లొంగక.. పరశురామన్నను ఈ లోకానికి, .. కొడుకుకూ దూరం చేసింది! చివరకు ఆయన జీవన సమరం.. అలా కొడుకు స్థిరపడడం చూడకుండానే.. విషాదంగా ముగిసింది! అంతిమంగా.. భాస్కర్ కు తండ్రి కూడబెట్టిన స్థిర చరాఆస్తులే.. 

 కొండంత అండగా నిలిచాయి. అన్న పోవడంతోనే.. సావిత్రమ్మ కూడా.. కూతుళ్ళ పంచకు.. తన దారి తాను చూసుకుంది!


ఆపైన భవిష్యత్తులో.. సమాజంలో ఏ తోడు లేని ఒంటరి జీవితంలో.. భాస్కర్ సాగించిన బ్రతుకు పోరాట చిత్రణ మరో కధగా మరోసారి వివరంగా.. -


 సమాప్తం


గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

 ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు! 




66 views0 comments

Comments


bottom of page