top of page
Kopalle Vijaya Prasad

జీవనం




Jeevanam written by Kopella Vijaya Prasad

రచన : కోపల్లె విజయప్రసాద్ (వియోగి)

“మనిషి ఒక సాంఘిక జంతువు!” తీర్మానించాడు అభిషేక్.

“అదేంటి గురూ! అలా అనేశావు! మమత, మానవత్వం ఇవన్నీ జంతువులకు ఉండని లక్షణాలు కదా! మనిషి

రెండు కాళ్ళతో నడుస్తాడు. జంతువు నాలుగు కాళ్ళతో నడుస్తుంది. మనిషికి మాట, తెలివి ఉన్నాయి.” అతని మాటను ఖండిస్తూ అన్నాడు నరసింహం.

“సారీ! నా స్టేట్మెంటును సవరించుకుంటాను. మనిషి ఒక తెలివైన క్రూరజంతువు!” అభిషేక్‌ చెప్పాడు.

“మళ్ళీ మనిషిని అవమానిస్తున్నావు!”

“మనిషి వెన్నెముక గల జంతువు, కాకపోతే కూసింత తెలివి, జ్ఞాపకశక్తి మాట్లాడే శక్తి ఉన్నాయి.” అభిషేక్ తిరిగి అన్నాడు.

“మూర్ఖులతో నేను వాదించను.” నరసింహం అన్నాడు.

“నేను వాదిస్తాను, నీకు నేను చెప్పిన సత్యం వెంటనే మింగుడు పడక పోవచ్చు. తరువాత ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది.”

“నాకెప్పటికీ కాకపోవచ్చు.”

“ఇంకా చెప్పాలంటే మనిషి జిత్తులమారి క్రూర మృగం! ఇంకా ఇంకా చెప్పాలంటే మేకవన్నె పులి! తన క్రూరత్వాన్ని కనపడకుండా అందమైన మేకప్పులో దాచుకుంటున్నాడు, తెలుసా?” అభిషేక్‌ అడిగాడు.


నరసింహం అడ్డంగా తలవూపాడు.


“అయితే నీకు జ్ఞానోదయం చెయ్యవలసిందే! ఈ రావిచెట్టు మనకి బాగా సూటయింది. ఏ జంతువూ రేపటికోసంఆహారం దాచుకోదు. రేపు కాకపోయినా భవిష్యత్తుకోసం ఆహారం దాచుకోదు” చెప్పాడు.


“మనిషి కాబట్టి దాచుకుంటాడు. నువ్వు చెప్పిన ఈ ఉదాహరణ చాలు మనిషి జంతువు కాదని.” నరసింహం అన్నాడు.


“కానీ, ఆహారం తన తలకుమించి దాచుకుంటాడు. ఇతరులకు దొరకకపోయినా ఫర్వాలేదులే, అన్నంతగా దాచుకుంటాడు. గోడౌన్లలలో బస్తాలు బస్తాలు దాచుకుంటాడు.

జంతువుకు ఆహారం దొరికిన తరువాత ఇంకొకరి జోలికి పోదు, అంటే యితరుల ఆహారం దోచుకోదు. ఉదాహరణకు సింహం కానీ పులి కానీ తమ ఆకలి తీరిన తరువాత వేటాడిజంతు హింస తలపెట్టవు” అభిషేక్‌ చెప్పాడు.


“అయ్యా! షేకు గారు తమరు చెప్పదలచుకున్నది చెప్పెయ్యండి. ”


“ఒక జంతువు యితర జంతువులు దాచుకున్నదాన్ని దోచుకోదు. జంతువుకు జాతి భేదం లేదు. మతం లేదు. కులం లేదు. జాతివైరం లేకపోతే ఎంతో స్నేహంగా మెలగుతాయి. పేపర్లల్లో చూస్తూ ఉంటావుగా తల్లికుక్క, పిల్లిపిల్లలకు కూడా పాలు తాపుతుంది తన పిల్లలతో పాటు. కాకి, కోకిల పిల్లలను కూడా సాకుతుంది అవి ఎగిరిపోయేదాకా!”

“ఇన్ని ప్రవచనాలు నాకెందుకుగాని, నీ ఉద్దేశ్యం చెప్పు. మనుషులను జంతువులతో సమానం ఎందుకు చేశావు?”నరసింహం ప్రశ్న.

“మనిషి జంతువు ఆటవిక మానవునిగా అరణ్యాలలో, కొండ గుహలలో సంచరించేది. ఇతర జంతువులను వేటాడటానికి పదునైన ఆయుధాలు తయారు చేసుకునేది. తరువాత ఎలా అలవాటయిందో వ్యవసాయం అలవాటైంది. వ్యవసాయం చేస్తూనే తన వేట లక్షణాలను ఏ మాత్రం వదులుకోలేదు. పంటలు పండిస్తూనే జంతువులను, పక్షులను తన తోటి వారిని వేటాడుతూనే జీవిస్తున్నది.” అభిషేక్ చెప్పాడు.


“నిజంగా నువ్వు ఆటవిక మానవుడివే అయివుంటావు, ఎందుకంటే నీకు మానవుడు సాధించిన నాగరికత కనపడటంలేదు. మనిషి సాధించిన వైజ్ఞానిక ప్రగతి నీ మెదడుకు అందడం లేదు” నరసింహం కించిత్తు విచారంతో చెప్పాడు.


“నరసింహం! నీ పేరులోనే సింహం ఉంది! అంటే నీలో కూడా క్రూరమైన జంతువు దాగి ఉంది! కాకపోతే అది బయటకు రాకుండా ఆధునిక దుస్తులు తొడిగావు. ఆధునిక విజ్ఞానం అంటూ గొప్పగా నువ్వు చెబుతున్నది, అది మనిషి పతనానికి బాటలు వేస్తున్నది!” అభిషేక్‌ చెప్పాడు.


“ఎలా ! సెల్లుఫోనుతో ఎంతగా సుఖపడగలుగుతున్నాము?”


“సెల్లుఫోను కూడా ఆధునిక విధ్వంసం సృష్టిస్తున్నది. మనిషిని మనిషిని దగ్గర చేస్తున్నట్లు కనిపించినా, నిజానికి దూరం చేస్తున్నది. ఎండమావుల వెంట పరుగులు పెట్టిస్తున్నది. ఛాట్‌లంటూ సెల్లుఫోన్లు, కంప్యూటర్లలో గంటలు గంటలు టైము వేస్టు చేసుకుంటున్నాడు. కానీ కంటికి ఎదురుగా కనిపించే మనుషులతో మాట్లాడటం లేదు. అంతా కృతిమత్వం!

అందినదానితో తృప్తిపడక ఇంకా ఏదో కావాలని పరుగులు పెడుతున్నాడు. ఎవ్వరి యిళ్ళల్లో బంగారు పొయ్యిలు లేవని గ్రహించడం లేదు. అందరూ తినేది అన్నమే, బంగారాన్ని కాదు.” అభిషేక్‌ ఆవేశంగా చెబుతున్నాడు.


నరసింహం చెవులప్పగించి వింటున్నాడు. “గురూ! ఈ సెల్లులు వచ్చిన తరువాత దూరాలు తగ్గిపోయాయి, కమ్యూనికేషను బాగా పెరిగిపోయింది.”నరసింహం నోరు తెరిచి చెప్పాడు.


“అని నువ్వు అనుకుంటున్నావు. ఆ కమ్యూనికేషను చాలామటుకు భ్రమ! ఇంట్లో తల్లి, చెల్లి, తండ్రి, అన్నలు పనికిరారు కానీ, ఎక్కడో అల వైకుంఠపురంలో వున్న సుందరో, సుందరుడో కావలసి వస్తున్నారు.


ఎలక్ట్రానిక్ మీడియా పోతున్న వింతలు నీకు తెల్సుకదా! మానవత్వం కంటే సెక్సుకు ఎక్కువ ప్రాధాన్యత యిస్తున్నాడు నేటి మనిషి! విచ్చలవిడితనానికి పనికి వస్తున్నది నేటి ఆధునిక విజ్ఞానం!” అభిషేక్‌ ఆరోపించాడు.


“అరే! ఈ కార్లు, విమానాలు నీ కంటికి కన్పించడం లేదా!”


“సౌకర్యాలు పెరిగే కొద్దీ మనిషి ఆరోగ్యం క్షీణిస్తున్నది. నడక తప్పిన తరువాత అన్ని నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో సహా అన్ని వ్యాధులు ప్రబలిపోతున్నాయి. ఈ చక్కెర వ్యాధి, రక్తపోటు ఎందుకు ఎక్కువయ్యాయి? కుర్చీలోంచి లేచి నడవక పోవడం వల్లనే కదా! ఈ ఆధునిక ప్రయాణమార్గాలు, వాహనాలు, లేనప్పుడు మనిషి సుఖపడినంతగా నేటి మనిషి సుఖపడటం లేదని నా అభిప్రాయం. ఈ చదువులతో బాల్యం కబ్జా అయిపోతున్నది. పోనీ ఆ చదువులు మనిషికి జ్ఞానం, దయ నేర్పిస్తాయా అంటే అది భ్రమే! నేటి ఆధునిక చదువు పోటీతత్వం, స్వార్థం, క్రూరత్వం, పశుత్వం నేర్పిస్తున్నాయి. మంచి అన్నది మచ్చుకైనా కానరాకున్నది. ఎంత సేపటికి యితరులను తొక్కేసి, తాను పైకి రావాలనుకుంటున్నాడు కానీ తనతో పాటు పదిమందిని పైకి తీసుకు వద్దామన్న విశాలహృదయం మాయమై పోయింది” అభిషేక్‌ ఆగాడు.


అయితే నీకు ఈ డాక్టర్లు, సర్జరీలు, ఓల్దేజి హోమ్స్‌, ఆర్ఫన్ హోమ్స్‌ కనపడటం లేదు. కేవలం నెగటివ్‌ సైడు మాత్రమే చూస్తున్నావు.”


“నెగిటివ్ సైడు పాజిటివ్‌ సైడును కప్పివేస్తున్నది. మనిషికి సంపద పిచ్చి పట్టింది. దానికోసం తల్లిలాంటి భూమిని ముక్కలు ముక్కలుగా చేసి అమ్మేస్తాడు. వాతావరణాన్ని కాలుష్యంతో నింపేస్తాడు. ప్రాణాధారమైన నీళ్ళను కూడా విషతుల్యం చేస్తున్నాడు.


నాగరికత అంటూ ఫ్యాక్టరీలను పెట్టి, భూకాలుషాన్ని, వాయుకాలుష్యాన్ని, జలకాలుష్యాన్ని, శబ్ధకాలుష్యాన్ని, నేత్ర కాలుష్యాన్ని పెంచుతున్నాడు” అభిషేక్ ఆవేదన.


“అరే! ఎంతో మందికి ఉద్యోగాలు సృష్టిస్తున్నాడు. ఎంతో మంది బతికేట్లు సహాయ పడుతున్నాడు!” నరసింహ వాదించాడు.


“కానీ ఆ బ్రతుకులు సహజమైన బ్రతుకులా! బానిస బ్రతుకులు! సంబంధాలను తెంపివేసే బ్రతుకులు! మనిషిలోని సహజ జ్ఞానాన్ని చంపివేసి, అజ్ఞానాన్ని పెంచివేసే బ్రతుకులను ప్రోత్సహిస్తున్నాడు. పంచభూతాలకు కోపం తెప్పించే బతుకులు! యాంత్రిక నీచబతుకులు!”


వాళ్ళిద్దరూ రోడ్డు ప్రక్కన చెట్టుకింద నిల్చుని మాట్లాడుకుంటున్నారు. అభిషేక్‌ ఎప్పుడూ అశాంతితో ఉంటాడు.


నరసింహం జీవితాన్ని చాలా లైటుగా తీసుకుంటాడు. అందుకే అతనికి జీవితం ఒక అందమైన అనుభవంలా కనపడుతూ ఉంటుంది. ఇద్దరూ నడివయస్సులే! ఓ మాదిరి ఉద్యోగాలు చేస్తూ జీవితాలను నడిపించుకుంటున్నారు. సాయంత్రం వేళల్లో కలుసుకుని మాట్లాడుకోవడం అలవాటు.


అనుకోకుండా ఒక కారు బాగా రాష్ గా వచ్చి రోడ్డుదాట బోతున్న ఒక యువతిని ఢీకొట్టి వెళ్ళిపోయింది. కారు కనీసం ఆగి ఆమె ఎలా ఉంది అని కూడా చూడలేదు. ఆమె రోడ్డుమీద గిలగిల కొట్టుకుంటున్నది. బాధతో మూలుగుతూ. జనం మూగడం చూశారు. ఇద్దరూ దగ్గరికి వెళ్ళారు.


“పోలీసులకు ఫోన్‌ చెయ్యండి.” ఎవరో అంటున్నారు.


“పోలీసులకు కాదు ముందు నూట ఎనిమిదికి చెయ్యండి.” ఇంకెవరో అన్నారు.


“లేదు గురూ! నూట ఎనిమిది రింగు కావడం లేదు. బిజీగా ఉన్నట్లుంది.”


“పాపం ! బాగా బతికిన ఆవిడలాగుంది!” ఎవరో జాలి చూపుతున్నారు. అభిషేక్‌చలించిపోయాడు. నరసింహంను ఆటో పిల్చుకురమ్మన్నాడు. అతను ఆటో తెచ్చేలోగా ఆమెను రెండు చేతులతో ఎత్తుకున్నాడు. ఆటో రాగానే ఆమెని వెనుకసీటులో పడుకోబెట్టాడు అభిషేక్‌. తను డ్రైవరు ప్రక్కన అడ్జెస్టు అయ్యాడు. నరసింహంను బైకు వేసుకుని రమ్మని చెప్పాడు.


ఎక్కడికి పోవాలి సార్‌?” ఆటో వాలా అడిగాడు.


“దగ్గరలో ఏ ఆస్పత్రి ఉంటే అక్కడికి!” చెప్పాడు అభిషేక్‌.


“కానీ యాక్సిడెంటు కేసుల్లో గవర్నమెంటు హాస్పిటల్‌కు తీసుకుపోవడం మంచిది సార్‌!” అతను చెప్పాడు.


“నిజమే! కానీ ఈ ట్రాఫిక్కులో అంతదూరం పోవాలంటే అరగంటపైన పడుతుంది. తీరా అక్కడికి పోయిన తరువాత డాక్టర్లు ఉంటారో ఉండరో! అందుకే ఏ ప్రయివేటు నర్సింగుహోము దగ్గరలో వున్నా తీసుకుపోదాము” చెప్పాడు.


అయిదు నిమిషాల్లో ఒక ప్రయివేటు నర్సింగుహోముకు తీసుకువచ్చాడు.


క్యాజువాలిటీలో అడ్మిట్‌ చేయించాడు. ఆమె అప్పటికి స్పృహలో లేదు. డాక్టరుకు కబురు చేశారు స్టాపు! అక్కడ రిసెష్టనులో వున్న ఒక యువతి అంటున్నది. “ఇది మెడికో లీగలు కేసులాగుంది. పోలీసులకు తెలియపరచవలసి ఉంటుంది.”


“ఏంకాదులేండి సిస్టర్!ఎమర్జెన్సీ! అవన్నీ చూసుకుంటే కష్టం! మీకు ఎటువంటి యిబ్బంది ఉండదు, ట్రీట్మెంట్ యిప్పించమనండి” అభిషేక్‌ ఆమెను అర్థించాడు. ఏ మూడులో వుందో, లేక, పేషంట్లు లేక యిబ్బంది పడుతున్నారో ఆమె ఓకే అంది.


డాక్టరు వచ్చి ఆ స్త్రీని పరీక్షించాడు. వీళ్ళ వంక చూశాడు.


“ఈమె మీకేమవుతుంది?” అడిగాడు డాక్టరు.


“జస్ట్, మా కళ్ళ ఎదుట యాక్సిడెంటు అయితేనూ తీసుకువచ్చాము.


“మరి డబ్బులు ఎవరిస్తారు?” డాక్టరు అడిగాడు.


“ముందు ట్రీట్మెంట్ యివ్వండి సార్‌, డబ్బులు గురించి ఆలోచించద్దు, ముందు ఆమెకు బాగయితే....” నరసింహం అన్నాడు.


“బాగయినా కాకపోయినా మా ట్రీట్మెంట్ ఫీజులు చెల్లించాల్సిందే కదా! ఎవరిస్తారు?” అడిగాడు డాక్టరు.


“ఇది వాదనలకు సమయం కాదు సార్‌! ముందు ఒక డాక్టరుగా ఆమె ప్రాణాలు కాపాడండి. మీ డబ్బులు ఎక్కడికి పోవు!” నరసింహం చెప్పాడు.


“ముందు ఒక పాతికవేలు అక్కడ కౌంటరులో డిపాజిట్టు చెయ్యండి. అప్పుడు మొదలెడతాము” చెప్పాడు డాక్టరు. నరసింహం అభిషేక్‌ వంక చూశాడు.


“నీ దగ్గర ఎంత వుంది నరసింహం?”


“జస్టు ఒక్క అయిదు వందలు, నీ దగ్గర?”


“నా దగ్గర ఒక్కవుంద ఉంది. అది కూడా యిందాక ఆటోవాడికి యిచ్చా! మరి పోలీసులకు ఫోను చేసి చెబుదామా, వాళ్ళే చూసుకుంటారు?” అభిషేక్‌ నిస్సహాయంగా అన్నాడు.


నరసింహంకు గుర్తుకొచ్చింది. తన జేబులో ఎటిఎం కార్డు ఉన్నట్లు. “ఫర్వాలేదు. డెబిట్‌ కార్డు చూపిస్తాను కౌంటరులో!”


నరసింహం చకచకా రిసెప్షన్ కౌంటరు దగ్గరకుపోయి, కార్డు స్వైప్ చేయించాడు. బిల్లు తెచ్చి డాక్టరుకు చూపించాడు. దాక్టరు అప్పటికే కొన్ని మందుల లిస్టులు రాసి అక్కడున్న సిస్టరుకు యిచ్చాడు, ఫార్మసీ నుండి పట్టుకురమ్మని. గాయపడ్డ ఆ స్త్రీని లోపలికి తీసుకుపోయి ట్రీట్‌ మెంటు యివ్వడం మొదలెట్టారు. రెండు గంటల తరువాత ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె తన భర్త సెల్లు నంబరు చెప్పింది. నరసింహం అతనికి ఫోను చేశాడు, ఫలానా హాస్పిటల్‌కు వెంటనే

రమ్మని.


ఒక పదిహేను నిమిషాల్లో అతను వచ్చాడు వెతుక్కుంటూ.


“నేను నరసింహంను, మీరేనా సుధీర్‌?” అడిగాడు నరసింహం.


“ఆ! మా ఆవిడ ఎక్కడుంది?” అడిగాడు సుధీర్‌.


నరసింహం సుధీర్‌ను తీసుకుని ఆమె వున్న రూములోకి వచ్చాడు. అక్కడ అభిషేక్‌ కూర్చుని ఆమెకు ధైర్యం చెబుతున్నాడు.


“సీతా! బాగున్నావా? ఎలా జరిగింది?” ఆతృతతో అడిగాడు సుధీర్‌.


అభిషేక్‌ ఎలా జరిగిందో చెప్పాడు సుధీర్‌కు.


డాక్టరు వస్తే అడిగాడు “ఇంటికి పోవచ్చా?” అని.


“ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ ఒక రోజున్నా అబ్జర్వేషన్ లో ఉంచాలి!” దాక్టరు చెప్పాడు.


“ఎందుకు బాగానే ఉన్నానుగా!” నీరసంగా అంది సీత.


“తలకు బాగా గాయం అయింది. యమ్మారై చేయించాలి. రేపొద్దున టెక్నీషియన్ వస్తాడు. మా రేడియాలజిస్టు కూడా రేపుదయం ఉంటాడు. ఆయన ఒపీనియను తీసుకుని, ఆ తరువాత మా చీఫ్‌ చెకప్‌ చేస్తారు అప్పుడు అన్నీ ఓకే అయితే డిశ్చార్జి చేస్తాము.” చెప్పాడు డాక్టరు.


సుధీర్‌ బేలమొహం పెట్టాడు.


“ఇవన్నీ అవసరం అంటారా?”


“రేప్పొద్దున ఏమన్నా జరిగితే మమ్మల్ని బ్లేము చేస్తారు.”


“వాళ్ళ రిస్క్ కు వాళ్ళని వదిలెయ్యండి. ఇప్పటి దాకా అయిన బిల్లు చెబితే చెల్లిస్తారు.” అభిషేక్‌ చెప్పాడు.


“ఇరువై రెండు వేలు అయింది. ఏవన్నా జరిగితే నాది బాధ్యత లేదు.” డాక్టరు చెప్పాడు.


“ఆ ఇరవైరెండు వేలా?” సుధీర్‌ ఆశ్చర్యపోయాడు.


“మూడు వేలు మనకే వాపసు వస్తాయి!” నరసింహం అన్నాడు.


“మా మెడికల్ రీఇంబర్స్మెంట్ లో ఈ హాస్పిటలు లేదు ఎలా?” సుధీర్‌ బాధపడుతున్నాడు.


“ఏం పెద్ద మనిషివయ్యా! ఎమర్జన్సీ ట్రీట్మెంట్ యిచ్చి, మీ ఆవిడ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించు”

డాక్టరు అన్నాడు.


“బ్రదర్, మీ యింటికి పోయి మాట్లాడుకుందాం!” అభిషేక్‌ చెప్పాడు.


ఫార్మాలిటీలు పూర్తి చేసుకుని సీతను డిశ్చార్జి చేయించారు. డాక్టరు సుధీర్‌తో తన తప్పు లేదని రాయించుకున్నాడు.


“థాంక్స్ ! మళ్ళీకలుద్దాం!” సుధీర్‌ అన్నాడు నరసింహం, అభిషేక్‌లతో.


“సార్‌! నా డబ్బులు యిరవై రెండు వేలు ఎప్పుడిస్తారు?” నరసింహం.


“ప్లీజ్! నాకు ఒక్కవారం రోజులు టైమివ్వండి. మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి యిస్తాను.” సుధీర్‌ దీనంగా చెప్పాడు.


నరసింహంకు తల వూపక తప్పలేదు. అతని సెల్లు నెంబరు రాసుకుని తన నెంబరు యిచ్చాడు. సుధీర్‌ సీతను తన బైకులో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోయాడు.

అభిషేక్‌, నరసింహంలు మిగిలారు.


“సింహం! ఈ రోజు నీలో ఒక మానవత్వం చూశాను. మనిషి కరువైపోతున్నాడనుకున్నాను, కానీ నా కళ్ళ ఎదుట కూడా ఉన్నాడు” అభిషేక్‌ అభినందించాడు.


వారం తరువాత నరసింహం సుధీర్‌ సెల్లుకు కాల్ చేశాడు. స్విచ్చాఫ్‌ వచ్చింది. కొన్ని గంటల తరువాత మళ్ళీ చేశాడు. ఆఫ్‌లో వుంది. మరునాడు కూడా అదే రిప్లై! ఆగి, ఆగి చేశాడు, అయినా ఫలితం లేదు. అలా వరుసగా నాలుగురోజులు చేశాడు. ఆ నంబరు నుండి స్పందన లేదు.


“పిచ్చోడా! వాడు ఆ సిమ్మును చెత్తబుట్టలో వేసి, కొత్తది తీసుకుని ఉంటాడు. నిన్ను సులభంగా మోసం చేశాడు.” నవ్వుతూ చెప్పాడు అభిషేక్‌.


నరసింహం గుండెల్లో గునపాలు దిగినట్లయింది.,


“ఇప్పుడతన్ని ఎలా పట్టుకోవడం?”


అభిషేక్‌ పెదవి విరిచాడు. “అసాధ్యం కాదు కానీ, చాలా కష్టం!”


అభిషేక్‌, పనిమీద హైదరాబాదుకు రెండు రోజులు వెళ్ళవలసి వచ్చింది. అంతకు ముందే అతని భార్య పిల్లలను తీసుకుని సెలవులకని పుట్టింటికి వెళ్ళింది. అతనుండేది ఒక అపార్టుమెంటులో, మూడవ అంతస్తులో.


మూడవరోజు ఉదయం యింటికొచ్చిన అతను బిగుసుకుపోయాడు తలుపు తెరవగానే! ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.


బీరువా తలుపులు తెరిచి వున్నాయి. అదిరే గుండెలతో బీరువాలోని విలువైన వస్తువుల కోసం వెతికాడు, కనపడలేదు. ఎమర్జెన్సీకి ఒక యాభైవేలు క్యాష్ దాచుకున్నాడు. అది లేదు. భార్యనగలను, బస్సులో పోతాయని, యింట్లో దాచుకోమన్నాడు. ఏడుతులాల బంగారు నగలు మాయం! ఇంకా పట్టుచీరలు, వెండి సామానులు పోయాయి. అతని అంచనా ప్రకారం, ఆరు లక్షల విలువైన వస్తువులు దొంగిలించబడ్దాయి. అదీగాక ల్యాప్‌టాప్‌, వీడియో

కెమెరా పోయింది.


పోలీసు స్టేషనుకు ఫోన్‌ చేసి చెప్పాడు. హుటాహుటిన పోలీసులు వచ్చి అంతా పరిశీలించారు. వాచ్ మాన్ ని ఆరా తీశారు. చుట్టు ప్రక్కల నివసిస్తున్న వాళ్ళని అడిగారు.


దొంగలు వెనుకవైపు కిటికీ తొలగించి లోపల ప్రవేశించినట్లున్నారు. పగటి పూటే ఎవరూ ఎవరిగురించీ పట్టించుకోరు. అటువంటిది, రాత్రిపూట ఎవరు గమనించి ఉంటారు.


పోలీసులు కేసు బుక్కుచేసుకుని అతనిని పొమ్మన్నారు. అతని భార్య అనుపమ, పిల్లలు, భైరవి, సింధులు వచ్చి గోల పెట్టారు. అభిషేక్‌ చాలాసార్లు స్టేషనుకు పోయి, దొంగలు దొరికారా అని విచారించసాగాడు. రెండుసార్లు చాలా మర్యాదగా జవాబిచ్చారు. మూడవసారి మాకు నీ ఒక్క కేసేకాదు, చాలా ఉన్నాయి, చూస్తాం పోవయ్యా అని దురుసుగా సమాధానం యిచ్చారు. నరసింహంకు చెబితే యితని అమాయకత్వానికి నవ్వాడు.


“నువ్వు ఏ కాలంలో ఉన్నావు! ఫైలు కదలాలంటే ఎక్కడైనా దానికి ఇంధనం అవసరం అవుతుంది. చేతులు తడిపి చూడు, ఉపయోగం ఉంటుంది” సలహా యిచ్చాడు.


“ఆరు లక్షలపైన పోయి నేను ఏడుస్తుంటే, మధ్యలో ఆ అమ్యామ్యాలు మాట ఏంటి? సెన్సు లేకుండా!” విసుక్కున్నాడు.


“అయ్యా! నీ నొప్పితో డాక్టరుకు ఏం బాధ! ఫీజు యిస్తే ఆపరేషను చేసో, మందులిచ్చో దాన్ని తగ్గిస్తాడు. ఇదీ అంతే!” నరసింహం.


“నా పాలసీకి విరుద్దం! నేను లంచం యివ్వను.” తిరస్కరించాడు.


“అయితే వేచి చూస్తూ ఉండు కాలం కలిసి వచ్చేదాకా!” నరసింహం.


ఒక రోజు అభిషేక్‌, నరసింహంలు హడావిడిగా ఫ్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వాళ్ళ మిత్రుడు గోపికి యాక్సిడెంటు అయిందని తెలిసి. అతను పోతున్న కారును ఒక లారీ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. డ్రైవింగ్ చేస్తున్న గోపీ తీవ్రంగా గాయపడ్డాడు. చూసిన వాళ్ళు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. దాక్టర్లు వైద్యం చేస్తున్నారు ఐసీయూలో వుంచి.


సమయానికి గోపీ భార్య కళ్యాణి, అక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలో స్కూలు టీచరుగా పని చేస్తున్నది. ఆమెకు కబురు వెళ్ళి, అక్కడికి రావడం ఆలశ్యం అయింది. వారిది ప్రేమపెళ్ళి! ఆదర్శజంటగా అందరితోనూ కొనియాడబడుతున్నారు. వారిని చూసి ఈర్ష్యపడుతుంటారు చాలామంది.

డాక్టర్ల విశ్వప్రయత్నాలు ఫలించలేదు. ఆ రాత్రి పదికి గోపీ ఈ లోకం వదిలిపోయాడు. కళ్యాణిని ఓదార్చడం మిత్రులవలన కాలేదు. యాక్సిడెంటు కావడం వలన ఆ రాత్రి శవాన్ని యివ్వకుండా మార్చురీకి తరలించారు. మరునాడు పోస్టుమార్టం చేసి యిస్తామన్నారు.


మరునాడు అది అంతసులభం అయిన పని కాదని తెలిసింది. గోపీబాడీ కంటే ముందు యింకా కొన్నింటికి చెయ్యవలసి ఉంది. డాక్టరు ఉండేది ఒక్కడే! అక్కడున్న స్టాఫుకు, బ్రోకర్లకు చేతులు తడపవలసి వచ్చింది కళ్యాణికి, అంత దుఃఖంలోనూ.


ఎద్దుపుండు కాకికి ఏం ముద్దు అని, ఆ పోస్టుమార్టం అయిన తరువాత కూడా ఆ బాడీని యింటికి చేర్చడం, పెద్ద తలనొప్పి అయింది. ప్రతిచోటా గోతికాడ నక్కలు కాచుకున్నట్టు, తోడేళ్ళు మనుషుల రూపాలలో కాచుకుని ఉన్నాయి.


అక్కడ కళ్యాణి విషాదం ఎవరికీ పట్టదు. తోటి మనిషి అకస్మాత్తుగా, అన్యాయంగా పోయాడన్న జాలి, దయ ఎవరిలో కనిపించలేదు. అందినకాడికి దోచుకోవాలన్న తాపత్రయం దాదాపు అందరిలో కనిపించింది.


ఇదిలా వుంటే, కర్మకాండలో కూడా పెద్ద దోపిడీ కనిపించింది అభిషేక్‌కు. కర్మ బ్రాహ్మడు ఏకంగా కర్మకాండ మొత్తానికి ఒక లక్ష డిమాండు చేశాడు. ఇంక వంటవాళ్ళయితే రెండు లక్షల దాకా అడిగారు. వీరందరితో బేరాలు చేసి, కొంతలో కొంత తగ్గించేసరికి అభిషేక్‌కు, నరసింహంకు తలప్రాణం తోక కొచ్చింది. ఇవి గాక సరుకులకు, షామియానా, కుర్చీలు లాంటి ఇతర వాటికి బాగా ఖర్చు అయింది.


అక్కడంతా వ్యాపారమే ముఖ్యం కాని, కళ్యాణి దుఃఖం ఎవరికీ పట్టలేదు. ఏదో శుభకార్యంకు అడిగినట్లు ప్రతి మనిషి అయితే నాకేంటి, నాకేం వస్తుందని ఆలోచించినవాడే! ఆఖరికి కళ్యాణి సోదరులు, చుట్టాలు కూడా యిదంతా జీవితంలో మామూలే అన్నట్లు ప్రవర్తించారు.


దగ్గరుండి యివన్నీ చేయించిన అభిషేక్‌, నరసింహంలకు తల తిరిగినట్లయింది. “మానవత్వమా నువ్వెక్కడ?” అని తలకొట్టుకున్నారు.


ఇంక డెత్‌ సర్టిఫికెట్‌ కోసం తెగ తిరిగారు. దానికి కూడా భారీగా ముట్ట చెప్పంది పని కాలేదు. ఆ సర్టిఫికెట్టు పట్టుకుని గోపీ ఆఫీసుకు వెళ్ళి అతని తాలూకు డబ్బులు కళ్యాణికి యిప్పించడానికి ఆరు నెలలు తిరగవలసి వచ్చింది. తన కొలీగు చనిపోయాడన్న జాలి, దయ లేకుండా అక్కడ కూడా నిస్సిగ్గుగా లంచాలు మెక్కారు. ప్రతీదానికి కొర్రీలు వేసి సతాయించిన వాళ్ళే!


లంచం లేకుండా చాలా తొందరగా గోపీ బెనిఫిట్లు చెల్లించిన వాళ్ళు కేవలం భీమా కంపెనీవాళ్ళే! గోపీకి రావలసిన ఆఫీసు బెనిఫిట్లు కంటే ఎన్నో నెలల ముందే భీమా డబ్బులు రావడం వలన కళ్యాణి కర్మకోసం చేసిన అప్పులు తీర్చుకోగలిగింది.


నరసింహం, అభిషేక్‌లు కళ్యాణికి జీవితాంతం అండగా నిలబడదామనుకున్నారు. కానీ వారికి ఆ అవకాశం యివకుండా గోపీ చనిపోయిన సంవత్సరంలోపే కళ్యాణి తన కోలీగును పెళ్ళిచేసుకుని షాక్కు గురి చేసింది.

“మనమే గోపీని మరచి పోలేక పోతున్నాం! అటువంటిది భార్య అయిన తను ఎలా మర్చిపోగలిగింది?” నరసింహం ప్రశ్నిస్తే, అభిషేక్‌ అన్నాడు “కళ్యాణి ఈ కాలం మనిషి. సుఖాన్వేషిణి! మనలాగా సెంటిమెంటల్‌ ఫూల్ కాదు. జరిగిపోయిన దానికి విచారించి ఉపయోగం లేదని, తన జీవితాన్ని బాగు చేసుకుంది.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


38 views1 comment

1 ความคิดเห็น


lkamakoti
lkamakoti
12 ม.ค. 2564

ప్రస్థుత పరిస్థితిని, మనుష్యుల మనస్తత్వాలను, సందర్భాన్నిబట్టి వారు ప్రవర్తించిన తీరును చక్కగా సినిమాలా చూపించిన ఈ కథ ప్రతి ఒక్కరూ చదివాలి. అభినందనలు చక్కటి రచనకు. .....లక్ష్మీ రాఘవ

ถูกใจ
bottom of page