గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.
Jeevanayanam written by Kotamarthi Radhahimabindu
రచన : కోటమర్తి రాధాహిమబిందు
"నమస్తే సార్" ఉదయం ఆరుగంటల సమయం.. చల్లటి గాలిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రాన్సిస్టర్ వింటూ కళ్ళు మూసుకొని మరో లోకంలో విహరిస్తున్న ధనుంజయరావు కళ్ళు తెరిచి వెనక్కి చూశాడు. తెరచిన గేటు దగ్గర నిలబడి ఉన్నాడు అతను.
"నమస్తే అండీ" అంటూ లేచి అతని దగ్గరకు నడిచాడు ధనుంజయరావు..
"నా పేరు సర్వేశ్వరరావు.. మీకు నాలుగు వీధుల వెనుక నేను ఉంటాను..మీరు ధనుంజయరావు గారే గదూ"
"అవునండి"
"ఈమధ్య పాత డైరీ తిరగేస్తుంటే మీ అడ్రస్.. ఫోన్ నెంబర్ కనిపించాయి.. ముందు ఫోన్ చేద్దాం అను కొని దగ్గరే
కదా అని ఇలా వచ్చాను"
"అరే.. గమ్మత్తుగా ఉందే.. రండిసార్..లోపలికి రండి"అంటూ అతన్ని ఆహ్వానించాడు ధనుంజయ రావు.
"కూర్చోండి"
"మీ చెల్లెలు పెళ్లి అప్పుడు.. ఆవిడ మామగారు.. అంటే.. నాకు మామయ్య వరుస అయ్యే జానకి రామారావు గారు మీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చారు..
అప్పట్లో నేను వారికి చాలా అండగా ఉండే వాడిని.. మీతో రెండు మూడు సార్లు ఫోన్ లో మాట్లాడినట్లు గుర్తొస్తుంది..
మీ చెల్లెలి పెళ్లిలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం.. ఒక్క రోజు కార్యక్రమం.. జ్ఞాపకం పెట్టుకోమనుకోండి..
దాదాపు పాతిక సంవత్సరాల క్రితం విషయం"
"లేదు లేదు.. నాకు కొద్దిగా గుర్తొస్తోంది"
"నేను రిటైర్అయి నాలుగు సంవత్సరాలు అయింది
ఈ మధ్యనే ఇక్కడ ఇల్లు తీసుకున్నాను"
"అవునా.. చాలా సంతోషంగా ఉంది సార్.. మీ భార్య.. పిల్లలు"
"నా భార్య పేరు భానుమతి.. పిల్లలు వినయ్ వివేక్..
ఒకరు అమెరికా..ఒకరు ముంబై..మీ భార్య పిల్లలు"
"నా భార్య పేరు కల్పవల్లి.. మాకు ఇద్దరు అమ్మాయిలు.. శ్రావ్య.. కావ్య.. పెళ్లిళ్లు అయిపోయాయి.. రండి లోపలికి వెళ్దాం"
"పర్వాలేదు సార్.. ఇక్కడ చాలా బాగుంది.. మీకు మొక్కలు అంటే చాలా ఇష్టం అనుకుంటాను" ఇంటి ముందు అంతా బండలు పరిచి చుట్టూ పూల మొక్కలు.. ఎక్కడ చూసినా పరిశుభ్రంగా కనిపిస్తుంటే అలాగే చూస్తుండిపోయాడు సర్వేశ్వరరావు.
"నేను రిటైరై నాలుగేళ్లయింది.. నాకు మొక్కలు పెంచడం మీరన్నట్టుగా చాలా ఇష్టం.. బోలెడంత ఖాళీసమయం
కాస్తటైం గడిచినట్లుగా ఉంటుంది ఆకుపచ్చదనం మన కళ్లముందు కనిపిస్తుంది"
"చాలా బాగుంది సార్"
"రండి" అంటూ ఇంటి చుట్టూ చూపించాడు ధనుంజయరావు.. ఇంటి వెనుక పక్కలకు నిమ్మ.. జామ.. మామిడి..
సపోటా.. సీతాఫలం చెట్లు.. రకరకాల పూల మొక్కలు.. మళ్లీ ఇంటి ముందుకు వచ్చి లోపలికి తీసుకువెళ్లాడు..
భార్యను పరిచయం చేశాడు.
"ఇల్లంతా విశాలంగా అనిపిస్తుంది"
"సోఫాలు.. డైనింగ్ టేబుల్ లాంటివి కొనలేదు.. ఇద్దరికీ మోకాళ్ళ నొప్పులులాంటివి లేవు సార్..
సో.. క్రింద కూర్చొనే భోజనం చేస్తాం వస్తువులతో గదులను నింపటం మా ఇద్దరికీ ఇష్టం ఉండదు.. అవసరం అనిపించినవే కొనుక్కుంటాం.. గదుల దేముంది లేండి.. మనసులు ఇరుకుగా లేకుంటే చాలు"
చిరునవ్వుతో చూసాడు సర్వేశ్వరరావు.. కల్పవల్లి ఇద్దరికీ టీ ఇచ్చి కాసేపు మాట్లాడింది.
"మీ ఇద్దరూ మా ఇంటికి రండి" అంటూ ఇద్దర్ని ఆహ్వానించి వెళ్ళిపోయాడు సర్వేశ్వరరావు.
**** **** ****
రెండు కుటుంబాల మధ్య రెండు సార్లు రాకపోకలు జరిగాయి,. ఆరోజు ధనుంజయరావు పుట్టినరోజు..
ప్రతి సంవత్సరంలాగా తన ఆనవాయితీ ముగించుకొని భార్యతో బైక్ మీద వెనక్కు బయల్దేరాడు.
"సర్వేశ్వరరావు గారింటికి వెళ్దామా..ఇల్లు దాటుకునే వెళ్లాలి కదా"
"ఈమధ్యనే కలిశాం..వెంటవెంట వెళితే ఏమనుకుంటారో" అంది కల్పవల్లి.
"ఇంటికి వెళ్లి చేసేది ఏముంది? ఏం కాదులే.. వెళ్దాం" అంటూ బైక్ ఆపి స్వీట్ కొన్నాడు..ఇద్దరూ
వెళ్లేసరికి సర్వేశ్వరరావు భానుమతి ఏదో గొడవ పడుతున్నారు.. లోపలికి వెళదామా.. వద్దా.. అని తటపటాయించే లోపలే సర్వేశ్వరరావు వీళ్ళను చూశాడు.
"ధనుంజయరావుగారు వాళ్ళు వచ్చారు" అంటూ భార్యతో చెప్పటం.. భార్య లోపలికి తప్పుకోవటం జరిగాయి.
"హలో సార్ రండి"
ధనుంజయరావు ఏం విననట్లే లోపలికి వచ్చాడు కానీ కల్పవల్లి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది.
"ఏం సార్ ఎటో వెళ్ళి వస్తున్నట్లుంది"?
"ఈరోజు నా బర్త్ డే సార్.. స్వీట్ తీసుకోండి" అంటూ స్వీటు అందించాడు ధనంజయరావు. అప్పుడే బయటకు వచ్చి పలుకరించింది భానుమతి ఇద్దరూ విషెస్ చెప్పారు.
"మీరు పుట్టిన రోజు చేసుకుంటారా సార్"?
"మీరు చేసుకోరా"?
"అంటే"...
"అయ్యో.. మన పుట్టినరోజునే మనం ప్రేమించుకోక పోతే ఎట్లా సార్?.. మనం పుట్టటమే ఓ గొప్ప విషయం తర్వాత చదువుకున్నాం ఉద్యోగస్తులం అయ్యాం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం వాళ్ళని ప్రయోజకుల్ని చేశాం మనవడిని మనవరాలిని ఎత్తుకున్నాను మనం పుట్టకపోతే ఇవన్నీ జరిగేవా? సో.. ఖచ్చితంగా పుట్టినరోజు జరుపుకోవాలి.. నా పుట్టినరోజున వృద్ధాశ్రమానికి.. ఈవిడ పుట్టినరోజున అనాధ ఆశ్రమానికి వెళ్ళటం మాకు అలవాటు.. స్వీట్స్ పండ్లు పంచి డబ్బు ఇచ్చి వస్తుంటాం.. అదో తృప్తిగా అనిపిస్తుంది మాకు"
"బాగుంది సార్" మెరుస్తున్న కళ్ళతో అంది భానుమతి.
"ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి.. ప్రతి పుట్టిన రోజుకు అందరికీ ఒక సంవత్సరం పెరుగుతుంది.. కానీ నాకు తగ్గుతుంది"
"అవునా.. అదెలా"? ఆశ్చర్యపోయాడు సర్వేశ్వరరావు.
"అలా నేను అనుకుంటాను కాబట్టి" నవ్వాడు ధనుంజయ రావు.
"వెళ్తామండీ" భార్య లేచేసరికి "వస్తాంసార్" అంటూ తనూ లేచాడు ధనుంజయరావు.
"ఈరోజు మీ పుట్టినరోజు అన్నారు.. మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి మాకూ ఒక స్పెషల్ గా ఉంటుంది" అంది భానుమతి.
"వంట చేసుకునే వచ్చామండి.. మరోసారి కలిసి భోంచేద్దాం" అంది కల్పవల్లి.
"అలా కాదు.. మీరు భోజనం చేయాల్సిందే" పట్టుదలగా అంది భానుమతి. ఏం చెప్పాలో తోచక దిక్కులు చూసింది కల్పవల్లి.
"అయితే ఓ పని చేద్దామా? మీరు వండిన వంటలన్నీ తీసుకొని మా ఇంటికి వెళదాం.. అక్కడ అన్నీ కలిపి విందు భోజనం చేద్దాం.. సార్.. మీకు ఓకేనా.. భానుమతిగారు అన్నట్లు ఇలా మాకూ ఓ స్పెషల్ గా ఉంటుంది"
సర్వేశ్వరరావు సరే అన్నాడు.
**** **** ****
రోజులు గడిచిపోతున్నాయి.. ఓరోజు అనుకోకుండా గుడిలో కలిసారు ధనుంజయరావు సర్వేశ్వరరావు..
దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ధనుంజయరావుని అడిగాడు సర్వేశ్వరరావు.
"సార్.. ఎప్పుడూ మీరు ఇలా హుషారుగా ఎలా ఉంటారు"?
"ఉండాలని అనుకున్నాను.. అంతే"
"అదికాదు సార్"
నవ్వాడు ధనుంజయ రావు.
"ఇన్నాళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాను.. ఎలాగైనా మీది సుఖజీవితం సార్"
"మీది కాదా"
"ఏమో.. అర్థం కావటం లేదు"
"ఏంటి.. మీ జీవితం గురించి మీకు అర్థం కావటం లేదా..అదేంటి? మీరు మీపట్ల శ్రద్ధ చూపించుకోనట్లు ఉంది"
"నా మిసెస్ ఇదే మాట అంటుంది..మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండదు అని.. కాదు సార్.. ఇంకా యువకులమా? మీ
బర్త్ డే నాడు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ విషయంలోనే గొడవపడుతుంది"
"అసలు.. ఇంకా యువకులమా? అని అనటంలోని అర్థాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను.. సంపూర్ణ ఆరోగ్య వంతుడైన అరవై డెబ్బైఏళ్ళ వ్యక్తి యువకుడితో సమానమే"
"అలా ఏదో అనుకోవటమే గాని.. గడిచిన వయసు తిరిగి వస్తుందా? రిటైర్ అయిపోయాం"
"రిటైర్ అయింది ఉద్యోగ విషయంలో.. జీవితంలో కాదుకదా.. నేను మీలా ఆలోచించనండీ.. వయసు అయిపోయింది అని అనుకోవటంలోనే మూడు వంతుల బద్ధకం పెరుగుతుంది.. జీవితం పట్ల ఆసక్తి తగ్గుతుంది"
"ఇదిగో ఇలాగే అచ్చంగా.. ఇలాగే నా మిసెస్ కూడా అంటుంది.. నిజానికి జీవితంలో కూడా రిటైర్ గాక ఇంకేముంది చెప్పండి..ఇలా అనటం మీకు అంత నచ్చదేమో కానీ దేవుడు పిలుపు కోసం ఎదురు చూస్తూ జీవించడమేగా.. ఇంకో పది పదిహేను సంవత్సరాలు బ్రతుకుతామేమొ"
"అరే.. అంత ఖచ్చితంగా ఎలా చెబుతారు? సరే.. మీరన్నట్లు పది పదిహేను సంవత్సరాలు అలా బ్రతికి ఆ తర్వాత అనారోగ్యం ఏదో వచ్చి మందులు మింగుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ.. ఒకరు సేవలు చేసే పరిస్థితి తెచ్చుకుంటూ ఆ మిగతా సంవత్సరాలు బ్రతుకుతూ వందేళ్లు పూర్తి చేస్తా మేమో"
"అమ్మో.. అలా మాత్రం అనకండి"
"మీరే నా చేత అలా అనిపిస్తున్నారు"
"ఏమో సార్.. ఈ భూమ్మీదకు వచ్చినందుకు అన్ని ముగించుకున్నాం.. ఇంకేం చేయాలి? రోజులు ఇలా ఈడుస్తూ బలవంతంగా వెళ్ళదీయటం నాకైతే అసహనంగా ఉంది.. నెలలు గడిచి సంవత్సరాలు కరిగిపోతున్నాయి"
"సార్.. మీరు మరోలా అనుకోనంటే ఒక విషయం చెబుతాను..మనిషి సుఖం వుంటేనేమో ఆనందపడడు..అదే కష్టం వస్తే మాత్రం ఆహ్వానించి మునిగిపోయే నీళ్లలో ఈదినట్లు ఈదుతుంటాడు..ఎందుకు సార్ అలా..ఇప్పుడు మీకు ఎంతో తీరిక దొరికింది.. ఏం చేయాలో తోచక అలా అంటున్నారు"
"తీరిక.. తోచక అనికాదు సార్"
"ఖచ్చితంగా అంతే సార్.. ఈ విషయాల్లో బుకాయించకండి.. ఈ తీరికను మరే విషయానికి తరలించినా పనికి పని.. మీకు ప్రశాంతత దొరుకుతుంది"
"అంటే"
"రెండే రెండు విషయాలు సార్.. ఖాళీగా ఉండకుండా వ్యాపకం కలిగించుకోవాలి అంటే.. మన కళ్ళముందు ఎన్ని లేవు? అనాధ ఆశ్రమాలకి వృద్ధాశ్రమాలకు వెళ్లొచ్చు.. వాళ్లకోసం రకరకాల టాపిక్స్ మీద మాట్లాడి వాళ్లని ఉత్సాహపరిచేలా కొన్ని క్లాసెస్ తీసుకోవచ్చు.. పర్మిషన్ తీసుకుని జైళ్లకు కూడా వెళ్లొచ్చు..ఇలాంటి వారందరి దగ్గరికి వెళ్ళి వారిని ఎంకరేజ్ చేస్తూ వాళ్లలో పోయిన మానసిక బలాన్ని పెంపొందించవచ్చు.. అసలు ఎన్ని.. ఎన్ని ఉన్నాయి.. ఇంకా ఏదైనా సహాయ కార్యక్రమాలు చెయ్యొచ్చు.. మనంవిద్యావంతులం.. ఉచితంగా బోధన చేయొచ్చు.. మా ఇంటి ఎదురుగా బ్యాంకు ఉంది.. పాపం ఏమీ తెలియని వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు.. వాళ్లకు ఫారాలు నింపి ఇవ్వటం.. తెలియనివి చెప్పటం.. అలా ఏదో.. నా వంతు సహకారం నేను ఈ మధ్య అందిస్తున్నాను.. బ్యాంకు ఉద్యోగస్తులు సహకరించరని కాదు నా ఉద్దేశం.. వర్కింగ్ అవర్స్ లో వాళ్ళు ఎంతగా సతమతం అవుతుంటారో నాకు తెలుసు.. అలా వారికి కొంత అండగా ఉండాలని.. పూర్తిగా ఖాళీగా ఉన్నాను కాబట్టి.. అలా కొన్ని కొన్ని అనుకుంటూ ఆచరిస్తూపోతే.. రోజుకి ఇరవై నాలుగుగంటలు బదులుగా ముప్పయి ఆరుగంటలు వుంటే బాగని అనుకునేలా చేసుకోవచ్చు"
"ఆ.. ఇవన్నీ ఎందుకు సార్.. కృష్ణా రామా అనుకుంటూ హాయిగా ఉండక"
"అందుకే అన్నాను రెండు విషయాలు అని.. ఇలా ఒకటి.. రెండో విషయం ఏంటంటే.. తన వాళ్లతో ఆనందంగా బ్రతుకుతూ రోజుని పూర్తిగా తన గుప్పిటలో పెట్టుకొని బందీగా చేసుకోవటం.. అర్థాంగి విషయానికి వస్తే ఎంతమంది తన లైఫ్ పార్టనర్ ని ప్రేమిస్తున్నారు? గౌరవిస్తున్నారు? ఏదో మనతో కలిసి బ్రతికే ఓ మనిషి అనుకుంటున్నారు తప్ప.. ఒక్కసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుని.. ఆమె కోసం ఈ తీరికను వినియోగిస్తే ఎంత బాగుంటుంది అని అనుకోగలరా? మీ మిసెస్ అడిగినవి మీరు హేళనతో.. మీ అయిష్టంతో.. నిర్లక్ష్యంగా ఆమె మనసు గాయపడేలా మీకు తోచింది చెప్పే బదులు ఒకసారి మనసుపెట్టి ఆలోచించి ఆమె కోరుకున్నట్లుగా అనుకూలంగా ఉంటే ఆవిడ ఎంత ఆనందిస్తుంది అని ఓసారి అనుకోండి. భార్య భర్త ఒకరికొకరు తోడు నీడ అన్నది వందశాతం నిజం. మనసున మనసై బ్రతికితే ఎంత తియ్యగా హాయిగా ఉంటుందో అనుభవం అంటూ ఉంటేనే తెలుస్తుంది.. దౌర్భాగ్యం ఏంటో గాని చాలా మంది భార్యాభర్తలు అలా ఉండరు..సార్ జీవితాన్ని అందంగా మలచుకోవడం మార్చుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది.. పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే మన ముఖం కూడా పగిలినట్టుగానే ఉంటుంది.. ఏదైనా మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది..
దిగులు ఓ వ్యాధి లాంటిది.. సంతోషంగా ఉండటమే దానికి మందు.. జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులు అంటూ ఉంటూనే ఉంటాయి.. నాకు కూడా చాలా సమస్యలు ఉండేవి.. ఇంకా ఉన్నాయి కూడా.. అవి పరిష్కరించుకోవాల్సింది నేనే..కాబట్టి దిగులుపడను..అలా ఉంటే వాటిపై దృష్టి నిలపలేను అవి అలాగే ఉండిపోతాయి.. మళ్లీ కొత్తవి మొదలవుతాయి..అందుకే చాలా తేలిగ్గా అనుకొని చేయాల్సినవి చేస్తుంటాను. మీరు అన్నట్లుగా ఎప్పుడూ హుషారుగా ఉంటాను.. నేను చేయాల్సినవి నాకు భారం గా అనిపిస్తే ఎలా? ఖాళీగా ఉండి తిండి తింటూ వళ్ళు పెంచుకోవటం అన్నది నాకు అత్యంత అసహ్యమైన విషయం.. అలా నాగురించి నేను చాలా జాగ్రత్త పడతాను.. ఉన్నదానితో అసంతృప్తి.. లేని దేనికోసమో తపన..ఇదే మానవ నైజంగా అయిపోయింది.. కోరినవి ఎన్ని లభించినా.. మనిషి సంతోష పడడు..ఇంకా ఆరాటం.. ఇంకా తపన.. కొత్త పరిస్థితుల వలన కొత్త కోరికలు చిగిర్చి.. అవి నెరవేరనప్పుడు.. వెనుకటి సంతోషం కూడా దూరం అవుతుంది.. ఇదే నిజమైన దుఃఖం.. కానీ నేను ఆ పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోలేదు.. నన్ను నేను ఎంతగానో ప్రేమించుకుంటాను.. అలాగే నా భార్యను ఎంతగానో ప్రేమిస్తాను. ఎనలేని గౌరవం ఇస్తాను.. మంత్రిలా నువ్వు చేసిన సేవలుచాలు..ఇక రాజులా ఉండు.. నేను మంత్రిని అవుతాను అని సరదాగా అంటుంటాను..
ఆవిడ అండ నాకెంతో గొప్పగా అనిపిస్తుంది సార్.. మనం చేయాల్సింది మనకు చేతగాక.. దాని మీద మనసు పెట్టక.. సుఖం ఎక్కువైపోయి.. తీరిక మరింతగా పెరిగి .. నిర్లిప్తత కు అలవాటు పడిపోయి.. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా సార్.. ఒక సారి ఈ జీవితం నుండి బయటపడి మరోలా ఉండటానికి ప్రయత్నించండి.. మీరు ఏంటో నాకు అర్థం అయ్యారు కాబట్టి ఇదంతా చెప్పాను.. సంతోషం సగం బలం అన్నారు.. కొత్తగా సామెతలు ఏమి పెద్దగా పుట్టటం లేదు.. ఇంకా వాటిని ఫాలో అవుతున్నారు.. మన ముందుతరాలు కూడా ఆ సామెతలే అనుసరిస్తారు.. ఎందుకంటే ఆ సామెతల్లో అంత బలం ఉంది.. మనల్ని నడిపించే శక్తి ఉంది..
అందుకే మీతో అంటుంటాను.. మనం అనుకోవాలే గానీ ఏది సాధ్యం కాదు? అని.. అనుకోవాల్సిన మనం అనుకోక.. భార్య మీదనో.. పిల్లల మీదనో.. ఎదుటి వ్యక్తి మీదనో.. సమాజం మీదనో.. నింద వేయడం న్యాయమా? రేపటి రోజు ప్రారంభాన్నిఈ రోజే అనుకోండి. మరోలా మలుచుకున్న ఈ అందమైన జీవితంలో మీ కార్యక్రమాలు ప్లాన్ ఏం టో నిర్ణయించుకోండి.. కొత్తగా ఉండండి.. కొత్త దనపు ఆలోచనలు చేయండి.. వయసు శరీరానికే గానీ మనసుకు కాదు యువకుడిలా ఉంచుకోండి.. మంచిగా బ్రతకడానికి సరిపోయేంత డబ్బు ఉంది.. ఎలాంటి అనారోగ్యాలు లేవు.. ఇంతకంటే ఎక్కువగా ఇంకేం కావాలి సార్.. మీ జీవితం పూర్తిగా మీ ఇష్టం అనుకోండి.. కానీ.. మీ జీవితంలో నిరంతరం మీ కోసం ఆలోచించే.. ఆరాటపడే మీ శ్రీమతి జీవితం ముడిపడి ఉందని సదా గుర్తుంచుకోండి"
సర్వేశ్వరరావు ఏమీ మాట్లాడలేకపోయాడు.
**** **** ****
ఫోన్ మోగింది.. ట్రాన్సిస్టర్ వింటూ మొక్కలకు నీళ్లు పెడుతున్న ధనుంజయరావు వేడి వేడిగా కాఫీ కలుపుకుని వచ్చిన కల్పవల్లి ఇద్దరూ ఒకేసారి ఫోన్ దగ్గరికి వచ్చారు.
"ఇంకెవరు? సర్వేశ్వరరావుగారు అయి ఉంటారు" చేతులు తుడుచుకుంటూ వచ్చి"హలో" అన్నాడు.
"సార్.. గుడ్ మార్నింగ్.. నేనే.. నేను భానుమతి కాసేపట్లో మీ ఇంటికి వస్తున్నాం"
"అవునా.. వెల్ కమ్.. రండి.. ఎదురు చూస్తుటాం" అంటూ రిసీవర్ పెట్టేసి కల్పవల్లి తో విషయం చెప్పాడు ధనుంజయరావు.. టైం చూసింది కల్పవల్లి
ఆరుంపావు.
"ఏంటో విశేషం.. ఇంత ఎర్లీ అవర్స్ లో వస్తున్నారు"
"అదే.. నాకూ అర్థం కావటం లేదు"
ఇద్దరూ కాఫీ తాగి గేటు దగ్గరకు వచ్చారు.. అన్నట్లుగా కాసేపట్లో ఇద్దరూ వచ్చారు..బైక్ దిగారు.
"ఏంటి.. ఇంత ఘస్వాగతం.. పదండి లోపలికి..
మీఇంట్లోకి మిమ్మల్ని నేను ఆహ్వానించాల్సివస్తుంది"
అంటూ చనువుగా ముందు తనే ఇంట్లోకి వెళ్ళాడు సర్వేశ్వరరావు. పట్టు చీరలో కళకళలాడిపోతోంది భానుమతి.
"చాలా కాలం తర్వాత భానుమతి పుట్టినరోజుని నేను జరుపబోతున్నాను సార్.. ఇదిగో మీకుస్వీట్ ఇచ్చి ప్రారంభించాలి అనుకున్నాను.. మా పెళ్లి రోజుని కూడా మేము ఎప్పుడూ పెద్దగా చేసుకోలేదు. మరోపది రోజుల్లో అదీ రాబోతుంది.. ఆ విషయంలో కూడా ప్లాన్ చేస్తాను.. ప్రస్తుతానికి గుడికి వెళ్లి పూజ చేయించుకుని.. తర్వాత హోటల్ లో టిఫిన్.. తర్వాత మార్నింగ్ షో.. తర్వాత లంచ్ అదీ హోటల్ లో.. ఆ తర్వాత.. మనం ఇంకేమనుకున్నాం"? భార్య వైపు తిరిగి అడిగాడు సర్వేశ్వరరావు.
"గవర్నమెంట్ హాస్పిటల్ కి.. వృద్ధాశ్రమానికి" వెలుగుతున్న ముఖంతో చాలా ఆనందంగా చెప్పింది భానుమతి..
విస్తుపోతూ ధనుంజయ రావు చూస్తుంటే సిగ్గుపడిపోయాడు సర్వేశ్వరరావు.
"సార్. హెయిర్ డై చేయించాను.. నా జీవితంలో మొదటిసారి టీ షర్టు వేసుకున్నాను.. మా పిల్లల్ని మీరు చూడలేదు కాబట్టి చెబుతున్నాను.. నా పెద్ద కొడుకు అచ్చంగా నాలాగే ఉంటాడు.. ఇప్పుడు నన్ను ఎవరైనా చూస్తే 'హలో వినయ్' అనేట్లుగా కూడా ఉన్నానేమో.. సార్.. సాయంత్రం మీరు మా ఇంటికి రావాలి.. నలుగురం కలిసి డిన్నర్ చేద్దాం.. ఇంకో విషయం సార్.. నలుగురం అనుకొని రెండు మూడురోజుల టూర్ వేసుకుందాం..మా కారులోనే మన ప్రయాణం" ఉత్సాహంగా అతను చెప్తుంటే చిరునవ్వుతో చూసాడు ధనుంజయరావు.. భానుమతి వాళ్ళిద్దరి విషెస్ ని చెమర్చిన కళ్ళతో స్వీకరించింది.
"థాంక్యూ సర్.. మీతో మాట్లాడి వెళ్ళాను . కొద్దిసేపు ఒంటరిగా కూర్చొని ఆలోచించాను..నిజంగా చాలామంది తమ జీవితాలని తాము సక్రమంగా ఆలోచించకుండా చిన్నాభిన్నం చేసుకుంటున్నారే మొ అనిపిస్తుంది.. మీరు అన్నట్లుగా రోజునే కాదు సార్ జీవితాన్నే గుప్పిట్లో బంధించుకోవాలి.. చాలా ఆనందంగా ఉంది.. తీయదనం రుచి ఏంటో ఈరోజే తెలిసినట్లుగా ఉంది.. మా పిల్లలు వస్తారట వాళ్ళు నన్ను ఇలా చూస్తే చాలా ఆనంద పడతారు.. నా మిసెస్ ఎప్పుడూ పిల్లలతో నా విషయంలో ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటుంది.. ఇకనుండి చెప్పుకోవటానికి ఏమీ ఉండవు.. ఏదైనా చెబితే నాకే చెబుతుంది.. సార్.. నాదో కొత్త ఆలోచన"
"చెప్పండి.. ఇప్పుడు పుట్టిన ఆలోచన కాబట్టి చాలా బాగుంటుంది"
"నాలా ఉన్న వాళ్లకి నేను ఉదాహరణగా మారి ఇలా బ్రతకండి.. ఇలా జీవించండి.. అందమైన జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించండి.. అని ఎలుగెత్తి చెప్పి కొందరినైనా ఆ సంకెళ్ళ నుండి బంధ విముక్తుల్ని చేయాలని ఉంది.. అబ్బో..భాషకూడా ఏదో తేడాగా వస్తుంది సార్"
"చూసారా.. మీ టైంపాస్ లో భాగంగా ఓ బ్రహ్మాండమైన ఐడియా చెప్పారు.. ఒరిజినల్ మీరు ఇలాగే సార్.. ఏదో కాస్తా మసకబారి అలా అయ్యారు.. విష్ యు ఆల్ ద బెస్ట్"
"థాంక్యూ సర్.. ఒరిజినల్ గా నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు.. లేని గొప్పతనాన్ని నాకు ఆపాదించకండి.. నూతన బలాన్ని నూతన శక్తిని మీరే నింపారు. థాంక్యూ సార్.. థాంక్యూ వెరీ మచ్.. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. కలుస్తామో అన్నదానికి మనమే ఓ నిదర్శనం.. మీతో చాలా చాలా మాట్లాడాలనిపిస్తుంది.. ముందు ముందంతా మీతో మాట్లాడుకోవడానికి నాకు కావలసినంత సమయం..వెళ్తాం సార్ ఇక.. థాంక్యూ" అంటూ ఎంతో ఆత్మీయంగా ధనుంజయ రావు ను ఆలింగనం చేసుకున్నాడు సర్వేశ్వరరావు.
"భానుమతీ.. వస్తున్నావా" లోపల కల్పవల్లితో మాట్లాడుతున్న భానుమతికి వినపడేలా సర్వేశ్వరరావు కేకేస్తుంటే సంతోషంగా చూశాడు ధనుంజయ రావు.
**** సమాప్తం ****
రచయిత్రి పరిచయం :
పేరు : కోటమర్తి రాధాహిమబిందు
నేను జన్మించింది నల్లగొండ జిల్లా కోదాడ.. మావారి ఉద్యోగరీత్యా ఖమ్మం జిల్లా మణుగూరులో ఉండి జిల్లాకి సాహితీ సేవలు అందించాను.. ప్రస్తుతం కె ఎల్ ఆర్ ఎవెన్యూ.. కోమరబండ కోదాడలో నివాసం ఉంటున్నాము.
నా రచనా వ్యాసంగం ప్రారంభించి రెండుదశాబ్దాలు పూర్తయ్యింది.నా సాహిత్య ప్రస్థానంలో ఇప్పటివరకు 150 పైగా కథలు నాలుగు నవలలు వ్రాశాను.అందులో రెండు ఎమెస్కో వారు ప్రచురించారు. తెలుగు భాషలో వెలువడుతున్న అన్ని దిన వార పక్ష మరియు మాసపత్రికల్లో నా కథలు, నవలలు ప్రచురింపబడ్డాయి. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడే చందమామ అయినా కార్మికుల పత్రిక కార్మిక లోకం అయినా అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు సృజించి అక్షర రూపంలో పాఠకులకు అందజేశాను.
నా కథల్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటాను. కడుపుబ్బ నవ్వించే హాస్య కథలూ కన్నీళ్లు తెప్పించే హృద్యమైన కథలూ వ్రాశాను. నేను రచయిత్రిగా ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందాను.
2005, 2006, 2007 సంవత్సరాలలో జివిఆర్ కల్చరల్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీల్లో మూడుసార్లు ఉత్తమ రచయిత్రిగా గెలుపొంది శ్రీ త్యాగరాయ గానసభలో సన్మానం పొందాను. 2006 ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ఉత్తమ రచయిత్రి గా గుర్తించి సత్కరించింది.
2007 లో ప్రభుత్వం నిర్వహించిన స్తంభాద్రి సంబరాలలో ఉత్తమ రచయిత్రి గా అప్పటి కేంద్ర మంత్రి శ్రీమతి రేణుకాచౌదరి గారి ద్వారా అప్పటి రాష్ట్ర మంత్రి శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు అప్పటి కలెక్టర్ శశిభూషణ్ కుమార్ గారు మరియు శాసన సభ్యుల సమక్షంలో అవార్డు, సన్మానం పొందాను.
2008లో సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు నది మాస పత్రికలో రాసిన 'వీళ్లనేం చేద్దాం' అనే నవలకు ముగింపు రాసి
ప్రథమ బహుమతి పొందాను. 2010 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారు నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో ఉత్తమ రచన అవార్డు పొంది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు, సన్మానం అందుకున్నాను. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ 'సేవా'
ద్వారా సన్మానం పొందాను.
ఇవి కాకుండా ఈనాడు ఆదివారం
లో అనేక కథలు ప్రచురితమై బహుళ ప్రజాదరణ పొందాయి. స్వాతి, నది ఇంకా ఇతర పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో పలుమార్లు బహుమతులు గెలుచుకున్నాను.
నేను రేడియో మాధ్యమం ద్వారా అనేక కథలు, కథానికలు, నాటకాలు నాటికలు రచించాను. ఇవన్నీ ఆకాశవాణి హైదరాబాద్ విజయవాడ కొత్తగూడెం కేంద్రాల నుండి ప్రసారం అయ్యాయి. మహిళల కోసం "ఆడవాళ్ళు మీకు జోహార్లు" అనే 16 వారాల ధారావాహిక నాటికను రచించాను. ఆకాశవాణి రేడియో నాటికల సప్తాహం సందర్భంగా 'ప్రేమా నీ పేరు మార్చుకో' అనే నాటకం 2007 లో ప్రసారం అయింది. ఈ నాటకాన్ని ప్రశంసిస్తూ ఎన్నెన్నో ఉత్తరాలు రావడం విశేషం. నేను రచయిత్రినే కాక గాయనినీ కూడా. నేను పాడిన పాటలు కొత్తగూడెం విజయవాడ కేంద్రాల నుంచి ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం 'బి' గ్రేడ్ కళాకారిణిగా ఆకాశవాణి, దూరదర్శన్ లో నూ
కొనసాగుతున్నాను.
సింగరేణి కాలరీస్ కంపెనీ వారు నిర్మించిన రెండు లఘు చిత్రాలకు కథ, మాటలు సమకూర్చును. కార్మికుల శ్రేయస్సు కోరుతూ నిర్మించిన "గులాబీ ముళ్ళు" మరియు అనుకోని ప్రమాదం వల్ల భర్త లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తన సమస్యలను ఎలా అధిక మించిందో తెలిపే ఓ మహిళ కథ "గమ్యం".. ఈ రెండు కూడా కార్మిక కుటుంబాలలో బహుళ ప్రజాదరణ పొందాయి.
2012 డిసెంబర్లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఖమ్మంలో జరిగిన జిల్లాస్థాయి సన్నాహక కార్యక్రమంలో జిల్లా ఉత్తమ రచయిత్రి గా గజల్ శ్రీనివాస్ గారి ద్వారా సన్మానం అందుకున్నాను.
2015, 2019 ఫిబ్రవరి, డిసెంబర్ లలో విజయవాడలో జరిగిన మూడవ నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యాను. 2018 డిసెంబర్ లో
ఈనాడు ఆదివారం అనుబంధం లో ప్రచురించిన కథలను "ఆరిళ్లలోగిలి" పేరుతో కథా సంకలనం వెలువరించాను.
కధ చాలా బాగుంది హిమబిందు గారు. రిటైర్మెంట్ తో జీవితం లో ఇంకేమి లేదని ఆలోచిస్తూ అకాల వృద్దాప్యంలోకి వెళ్ళేవాళ్ళకి ఇదొక మేలుకొలుపు.
At the out set very good morning Smt. Himabindu garu. Aa Ushodayam lone unnadi himabindu Hima garu. Tqs lot for such encouraging n mind blowing description of life n life partner n the parlance one should peep in the life at different stages. A big S there is no retirement for life but for govtt. Service. So the service to humanity is service to God. So I strongly believe n my personal view that one should help others physically mentally n financially if provided by HIM.
Hats off once again for all awards u achieved. May God bless U madam with good health to write good articles n stories to awake the necessitated.
Tq
Nandagopal makarla
Retd. Central bank of…
ధన్యవాదములు. హిమబిందు గారు నిరాశా నిస్పృహలతో ఉన్నా వయోవృద్ధులకు చక్కని ఉస్తాహం ఇచ్చే కథ. ఇటువంటి కథలు ఎన్నో మీ కలం నుండి రావాలని నేను కోరుకుంటున్నాను.
నక్షత్రం శ్రీనివాసాచారి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. దిల్సుఖ్నగర్.
An inspiring and Excellent story. Could have been little more brief.
Congratulations HimaBindu Madam !