#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
![](https://static.wixstatic.com/media/acb93b_fef65c0710dc4de8bda9c11e9ec31e0c~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_fef65c0710dc4de8bda9c11e9ec31e0c~mv2.jpg)
జీవిత చిత్రాలు ధారావాహిక ప్రారంభం
Jeevitha Chitralu - Part 1 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 06/02/2025
జీవిత చిత్రాలు - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆదిత్య.. రచ్చ అరుగు ముందు కారును ఆపి దిగాడు.
అరుగు మీద ఇరువురు వయస్సు మీరిన పెద్దలు కూర్చొని చుట్ట దమ్ము లాగుతూ ఏదో మాట్లాడుకొంటున్నారు.
ఆదిత్య.. అరుగును సమీపించాడు. వారిరువురూ ముఖాలను చిట్లించి ఆదిత్యను పరీక్షగా చూచారు.
"తాతా!.. భాస్కర్ ఇల్లు ఎక్కడ?" అడిగాడు.
"ఏ భాస్కరూ!" ఇరువురిలో ఒకతను అడిగాడు.
"మంచినేని.."
"ఓ.. మంచినేని భాస్కరా!.." రెండవ వ్యక్తి అడిగాడు.
"అవునండి!"
"మీరెవరు?" మొదటి వ్యక్తి అడిగాడు.
"నేను.. అతని బాల్య స్నేహితుణ్ణి. చూడాలని వచ్చాను" చిరునవ్వుతో చెప్పాడు ఆదిత్య.
"వాడు నా మనవడే.. నాతోరా. మా ఇంటికి పోదాం" అరుగు దిగాడు ఆ పెద్దాయన.
"తాతా!.. కార్లో కూర్చోండి వెళదాం."
కారును సమీపించి.. డోర్ తెరిచి..
"కూర్చోండి తాతయ్యా!.." అన్నాడు ఆదిత్య.
ఆ తాతయ్య.. కార్లో కూర్చున్నాడు.
ఆదిత్య కార్లో కూర్చుని స్టార్ట్ చేశాడు. తాతగారు చెప్పిన దిశలో ఆదిత్య కారు నడిపి ఐదు నిమిషాల్లో వారి ఇంటిని సమీపించారు.
"బాబూ!.. కారు ఆపు. అదే మా ఇల్లు."
ఆదిత్య.. కారును కాంపౌండ్ గోడ ప్రక్కగా ఆపి.. దిగాడు. తాతగారి వైపు డోర్‍ను తెరిచాడు. వారు దిగారు.
గేటును తెరిచి..
"రా బాబూ.. రా!.." తాతయ్య ఆప్యాయంగా చెప్పారు.
ఇరువురూ.. ఇంటి ముందున్న ఆవరణాన్ని దాటి వరండాలో ప్రవేశించారు.
"కూర్చో బాబూ!.. అవునూ, నీ పేరేమిటి?"
"ఆదిత్య.."
ఆదిత్య కుర్చీలో కూర్చున్నాడు. చుట్టు కలయజూశాడు. దాదాపు నాలుగు గ్రౌండ్ల స్థలం. ఇంటి ముందు రెండు గ్రౌండ్ల స్థలం. టెంకాయ చెట్లు, రకరకాల పూల మొక్కలు, చెట్లు, కాంపౌండు వాల్ ప్రక్కన క్రమంగా నాటబడి ఏపుగా పెరిగి వున్నాయి.
తాతయ్యగారు కుర్చీలో కూర్చున్నారు.
"బాలా!.." కాస్త హెచ్చు స్థాయిలో పిలిచాడు.
రెండు నిమిషాల్లో.. అరవై ఐదేళ్ళ పండు ముత్తైదువు వరండాలోకి వచ్చింది. సాక్షాత్ పార్వతీ మాతలా ఉంది.
’తాతయ్య గారి ఇల్లాలు కాబోలు’ అనుకొన్నాడు ఆదిత్య.
లేచి.. చేతులు జోడించి.. "నమస్తే అమ్మా!" అన్నాడు.
ఆమె.. చేతులు జోడించి.. "నమస్తే బాబు!.. కూర్చో" అంది.
"బాలా!.. ఈ అబ్బాయి మన భాస్కర్ స్నేహితుడట. మనోడికి చెప్పి, రమ్మను."
"అలాగే!" ఆమె లోనికి వెళ్ళిపోయింది.
కొద్ది క్షణాల్లో టవల్‍తో తల తుడుచుకొంటూ పంచకట్టుతో భాస్కర్ వచ్చాడు. ఆదిత్యను చూచి గుర్తుపట్టలేకపోయాడు.
ఆదిత్య పరిస్థితీ.. అంతే. వాళ్ళురువురూ కలిసి దాదాపు ఇరవై సంవత్సరాలైంది. తననే పరీక్షగా చూస్తూ..
"మీరు!.." అడిగాడు భాస్కర్.
"భాస్కర్!.. నేను ఆదిత్యను" లేచి నవ్వుతూ చెప్పాడు ఆదిత్య.
"ఓ.. ఆదిత్యా!.. నీవా!.. ఎంత కాలమైందిరా!.. నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను" నవ్వుతూ చెప్పాడు భాస్కర్.
"నిన్ను చూచిన తొలి క్షణంలో.. నా పరిస్థితీ అంతే.. కానీ నేను నిన్ను మరువలేదు. మన చిన్ననాటి జ్ఞాపకాలు నా మనస్సు నిండా వున్నాయి. అందుకే.. నిన్ను చూడాలని వచ్చాను."
"ఆదీ!.. నాకు చాలా ఆనందంగా వుందిరా.. నా గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రా!.."
ఆదిత్య చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు ఆప్యాయంగా.
ఇరువురూ.. భాస్కర్ గదివైపుకు నడిచారు.
వారికి.. భాస్కర్ చెల్లెలు సుధ ఎదురైంది.
"ఏయ్!.. సుధా!.. వీణ్ణి బాగా చూడు. ఎవరో చెప్పు" నవ్వుతూ అడిగాడు భాస్కర్.
సుధను చూచి ఆదిత్య అయోమయ స్థితిలో నిలబడిపోయాడు. సుధ పరిస్థితీ అంతే. కొన్ని క్షణాలు ఆదిత్య ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొంది.
’ఎవరయ్యుంటారబ్బా!’ అనే ఆలోచనలో మునిగిపోయింది సుధ.
ఇరవై సంవత్సరాల క్రింద ఆ మిత్రులు ఇరువురూ విడిపోయిన సమయానికి సుధ వయస్సు నాలుగు సంవత్సరాలు.
భాస్కర్ ఆది వైపుకు తిరిగి.. "ఏరా!.. నీవు గుర్తుపట్టావా!" నవ్వుతూ అడిగాడు.
యధార్థానికి ఆదిత్యకు ఆమె ఎవరన్నది గుర్తుకు రాలేదు. కానీ.. భాస్కర్‍కు ఒక చెల్లి వున్నదన్న విషయం గుర్తుంది. ఆ జ్ఞాపకంతో..
"నీ చెల్లి.. సుధ కదూ!.." సందేహంతోనే చెప్పాడు.
"ఎస్!.. యు ఆర్ రైట్" కిల కిలా నవ్వాడు భాస్కర్.
క్షణం తర్వాత "సుధా!.. వీడు నా స్నేహితుడు ఆదిత్య. మేము విడిపోయి ఇరవై సంవత్సరాలైంది. అప్పుడు నీ వయస్సు నాలుగు సంవత్సరాలు. మా వయసు తొమ్మిది సంవత్సరాలు. నీవు ఎంత ఆలోచించినా.. వీణ్ణి గుర్తించే అవకాశం లేదమ్మా!.."
"అలాగా!.." నవ్వుతూ అంది సుధ.
"అవును"
సుధ.. నవ్వుతూ ఆదిత్య ముఖంలోకి చూచింది.
"నమస్తే.." చేతులు జోడించింది.
ఆదిత్య చిరునవ్వుతో అదే పదాన్ని చెప్పాడు.
"సుధా!.. టిఫిన్ రెడీనా!" అడిగాడు భాస్కర్.
"అయిందన్నయ్యా!.. వస్తారా. వడ్డిస్తాను. సార్!.. మీరూ రండి" ప్రీతిగా చెప్పింది సుధ.
ఆదిత్య చిరునవ్వుతో తలాడించాడు.
"నీవు అరెంజ్ చెయ్యి. నేను వీడు ఫైవ్ మినిట్స్ లో వస్తాము."
"అలాగే అన్నయ్యా!.." సుధ లోనికి వెళ్ళిపోయింది.
ఐదున్నర అడుగుల ఎత్తు. తెల్లని దేహఛ్ఛాయ. పొడుగాటి కురులు. సాంప్రదాయబద్ధమైన చీరా రవిక.. నొసటన సిక్కర్ బొట్టు, చెవులకు బంగారు జంకీలు, ఒక చేతికి నాలుగు బంగారు గాజులు, కుడి చేతికి వాచ్, చంద్రబింబం లాంటి ముఖము, మాటల్లో ఎంతో సౌమ్యత.. సుధను చూచిన ఎవరికైనా తోచేది అందాలబొమ్మ అని. ఆ భావనే కలిగింది ఆదిత్యకు.
భాస్కర్ వెనకాల అతని గదిలోకి నడిచాడు ఆదిత్య.
"టిఫిన్ చేసి గదిలో కూర్చొని అన్ని విషయాలూ స్థిమితంగా మాట్లాడుకొందాం ఆది. అమ్మా నాన్న బంధువుల వివాహానికి శ్రీశైలం వెళ్ళారు. ఈరోజు గాని రేపు సాయంకాలానికల్లా వస్తారు. తాతయ్యను, నాయనమ్మను నీవు చూచావుగా." చెప్పాడు భాస్కర్.
"అవును.." అన్నాడు ఆదిత్య.
భాస్కర్ బనీన్ వేసుకొని, పంచె మార్చుకొని.. తల దువ్వుకొని..
"పద.. టిఫిన్ చేసి వద్దాం" అన్నాడు.
ఇరువురు మిత్రులు డైనింగ్ రూమ్‍కు వెళ్ళారు. సుధ, బాలమ్మలు వారికి టిఫిన్ పెట్టారు. దోశలు కొబ్బరి చట్నీ.
"సిగ్గు పడకుండా తిను బాబు. ఇది నీ ఇల్లే అనుకో" అంది బాలమ్మ.
సుధ బాలమ్మ సూచన మేరకు ఇరువురికీ కొసరి కొసరి వడ్డించింది.
వారి ఆప్యాయతకు ఆదిత్య ఆశ్చర్యపోయాడు. వారు టిఫిన్ తినడం ముగించే సరికి సుధ రెండు గ్లాసుల్లో వేడి పాలను వారి ముందు వుంచింది.
ఇరువురూ పాలు తాగి.. భాస్కర్ గదిలో ప్రవేశించారు. సోఫాలో కూర్చున్నారు.
"ఆదీ!.. ముందు నీ కథ నాకు చెబుతావా లేక నా కథ నీకు చెప్పనా!" అడిగాడు భాస్కర్.
"ముందు నీ కథను నాకు వినిపించు భాస్కరా!" అన్నాడు ఆదిత్య.
"సరే!.. నీకు తెలిసిన విషయం. అమ్మా నాన్నలకు నేను సుధ పిల్లలం. మీ కుటుంబం ఈ వూరిని వదలి వెళ్ళేనాటికి నాన్నగారు ఎస్.ఐ. మీరు వెళ్ళిన నాలుగు సంవత్సరాలకు.. ప్రమోషన్ మీద నాన్నగారికి వైజాగ్‍కు ట్రాన్స్ ఫర్ అయింది. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. నెలకు ఒకసారి వచ్చి నాన్నగారు తాతయ్య నానమ్మలను చూచి వారికి కావలసినవి ఏర్పాటు చేసి.. తిరిగి వైజాగ్ వస్తుండేవారు. నేను సుధ.. సెలవుల్లో ఇక్కడికి వచ్చి వారితో.. ఈ పల్లె వాతావరణంలో ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం. సెలవలు ముగియగానే నాన్న అమ్మ వచ్చేవాళ్ళు.. వాళ్ళతో వైజాగ్ వెళ్ళిపోయేవాళ్ళం.
ఆ కారణంగా చిన్నతనం నుంచీ.. నాకు సుధకు పల్లెటూరు అన్నా, ఇక్కడి వాతావరణం.. చుట్టూ వున్న పొలాలు, తోటలు, చెరువు, రామాలయం.. కల్లాకపటం లేని ఈ పల్లె ప్రజలు.. వారందరికీ మా కుటుంబం మీద వున్న అభిమానం.. వారితో కలిసి గడిపే రోజులు అంటే ఎంతో ఇష్టం. ఈ విషయంలో అమ్మా నాన్నల అభిప్రాయం కూడా అదే.
తాతయ్య గోపాలయ్య.. స్వాతంత్ర్య సమరంలో పూజ్య గాంధీజీ గారితో కలిసి.. ఈ ప్రాంతంలో ఉద్యమాల్లో పాల్గొన్నవారు. వారు ఆ కాలంలో లెవెన్త్ వరకు చదివినవారు. దేశాభివృద్ది పురోగతికి.. రైతు వెన్నెముక అనే సిద్ధాంతాన్ని నమ్మినవారు. వారి తండ్రిలాగే వారూ వ్యవసాయ వృత్తినే చేపట్టారు.
ఉద్యమదారులను తెల్లదొరలు జైలుపాలు చేశారు. రెండు మూడుసార్లు తాతయ్య జైలుకు కూడా వెళ్ళారు.
స్వాతంత్ర్యం వచ్చాక మన ప్రభుత్వం తాతయ్యను స్వాతంత్ర్య సమరయోధుడుగా గుర్తించి.. ఐదు ఎకరాల భూమిని ఇచ్చింది. ఉన్న ఐదు ఎకరాలు వచ్చిన ఐదెకరాలలో వ్యవసాయాన్ని సాగిస్తూ.. పౌర రక్షణకు మూలం అయిన పోలీస్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం అయిన కారణం.. నాన్నగారిని పోలీస్‍గా చేశారు.
కాలక్రమేణా రాజకీయాల్లో జరిగిన మార్పులు.. నీతి నిజాయితీ న్యాయం ధర్మం.. వీటిపట్ల రాజకీయ నాయకులకు వున్న అభిప్రాయానుసారంగా.. తన ఉద్యోగ నిర్వహణలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని.. అలసిన మనస్సుతో పది సంవత్సరాల క్రింద డి.ఎస్.పి హోదాలో వుండగా.. అన్యాయ చర్యలకు వచ్చే రాజకీయ ఒత్తిడిలను భరించలేక.. నాన్నగారు తన ఉద్యోగానికి.. వాలెంటరీ రిటైర్‍మెంట్ తీసుకొని గ్రామానికి వచ్చి. తాతయ్యకు అండగా వ్యవసాయాన్ని సాగిస్తూ.. నన్నూ.. చెల్లినీ మా ఇష్టానుసారంగా చదివించారు.
నేను.. ఐదేళ్ళ క్రింద ఎం.బి.బి.ఎస్ పూర్తిచేసి తాతయ్య నాన్నగార్ల ఇష్టానుసారంగా ఈ గ్రామంలో ఓ చిన్న హాస్పిటల్‍ను నడుపుతున్నాను. చెల్లి సుధ.. ఎం.ఎ, బి.ఇడి పూర్తి చేసి ఈవూరి హైస్కూల్లో టీచరుగా పనిచేస్తూ ఉంది.
కన్న తల్లిదండ్రులను కళ్ళను చూచుకున్నంత జాగ్రత్తగా చూచుకోవాలన్నది.. నాన్నగారి సిద్ధాంతం. నాన్న.. తన తల్లిదండ్రుల విషయంలో తన సిద్ధాంతాన్ని తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు.
వారికి వారసుడనైన నేను.. నా చెల్లి, నా తల్లిదండ్రుల విషయంలో అలాగే వర్తించాలనేది మా ఇరువురి నిర్ణయం. ఆ కారణంగా నేను.. ఈ పల్లె జీవితాన్ని అభిమానిస్తున్నాను. ఈ పేద ప్రజలకు సేవ చేస్తూ ఆనందిస్తున్నాను.
నాతో ఎం.బి.బి.ఎస్ చేసిన కిషోర్ అనే వాడు ఎం.డి చేసేదానికి అమెరికాకు వెళ్లాడు. వాడికి అక్కడ ఒక ఈస్ట్ గోదావరి పిల్ల ఆమె కూడా ఎం.డి చేసేటందుకు వెళ్ళినదే. వీడికి పరిచయం అయింది. కొద్ధిరోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆవేశంతో ఇరువురూ ఒకటైనందున.. ఆ పిల్లను వాడు పెళ్ళి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఆ విషయాన్ని తల్లిదండ్రులకు ఫలానా పిల్లను నేను ప్రేమించాను. వివాహం చేసుకోదలిచానని తెలియజేశాడు.
వాడి తల్లిదండ్రులు.. ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళి, ఆ పిల్ల తల్లిదండ్రులను గురించి విచారించగా కులాల తేడా కారణంగా వారు.. వాడి వివాహాన్ని ఆ పిల్లతో అంగీకరించలేదు.
ఫలితంగా క్షణికావేశంతో వాడు చేసిన తప్పు కారణం, ఆమె గర్భవతి అయినందున.. తల్లిదండ్రులను ధిక్కరించి, వాడు ఆ పిల్లను పెండ్లి చేసుకొన్నాడు. తల్లిదండ్రుల తత్త్వాల్లో మార్పు రానందున.. వాడు ఆమె అమెరికాలో వుండిపోయారు.
ఒక్కగానొక్క కొడుకు.. ఈరీతిగా రెక్కలు వచ్చాక.. తన దారి తాను చూచుకొన్నందుకు ఆ తల్లిదండ్రులు ఎంతగానో కుమిలిపోయారు. అవమానంతో సాటివారి మధ్యన ఎంతగానో బాధపడ్డారు. కొడుకు మీద పిచ్చిప్రేమ అభిమానం కారణంగా ఆ తల్లి మనోవ్యధతో కళ్ళు మూసింది.
అంతదూరంలో వున్న వాడు.. ఆమె అంతిమ సంస్కారానికి కూడా రాలేకపోయాడు.. అదే సమయానికి వాడి భార్య ప్రసవవేదనలో వున్నందువలన.
కొడుకు చేయవలసిన తల్లి అంతిమ విధానాలను ఆ తండ్రే నిర్వహించాడు.
ఆదిత్యా!.. అంతిమ దశలో ఆ తల్లి మనస్సు వాడి కారణంగా ఎంతటి వేదనను అనుభవించిందో.. వాడిని చూడాలని ఆ తల్లి ఆత్మ ఎంతగా పరితపించిందో ఎవరి వూహకు అందని విషయం కదూ!..
ప్రతి మనిషికీ మనుగడకు మనీ.. అవసరం. దాని సంపాదన ముఖ్యం. ఆ ఆశ హద్దుల్లో వుంటే మంచిది. హద్దు మీరిన ధనార్జన కాంక్ష.. ఆనందాన్ని కలిగించలేదు. దానికి వాడి జీవితమే సాక్షి. అమెరికాలో లక్షలు సంపాదించవచ్చు. ఆ లక్షలతో పోయిన తల్లిని బ్రతికించగలడా!.. ఆ తల్లిని వాడు శాశ్వతంగా మరిచిపోగలడా!.. ఆమె గుర్తుకు వచ్చినప్పుడు వాడికి ఆవేదన వుండదా!..
వాడిని తలుచుకొన్నప్పుడు నాలో ఉత్పన్నం అయ్యే ప్రశ్నలివి.
వాడి కథ మూలంగా నేను గ్రహించింది.. కేవలం ధనార్జనే ముఖ్యం.. అనే నిర్ణయంతో వర్తించేవారికి.. బాంధవ్యాలు బంధుత్వాలు.. ప్రేమాభిమానాలు వుండవనే నిర్ణయానికి వచ్చాను" ఎంతో ఆవేశంగా చెప్పిన భాస్కర్ చెప్పడాన్ని ఆపాడు. కళ్ళు మూసుకున్నాడు.
పుట్టిన ఊరు.. ఆ గ్రామ ప్రజలు.. ఆ పరిసరాలు తన కుటుంబ సభ్యుల మీద భాస్కర్‍కు వున్న గౌరవం.. ఆదరాభిమానాలను అతని మాటల్లో విన్న ఆదిత్య.. అతనిలోని మానవతా వాదానికి ఎంతగానో సంతోషించాడు. తన బాల్య స్నేహాన్ని గుర్తుంచుకొని.. ఎంతో అభిమానంతో పలకరించి స్నేహానికి వున్న విలువను ఆదరించినందుకు ఆనందించాడు. భాస్కర్ కళ్ళు తెరిచాడు. తననే పరీక్షగా చూస్తున్న ఆదిత్య ముఖంలోకి చూచాడు.
"ఆదీ!.. ఏం అలా చూస్తున్నావ్?"
"నీ వ్యక్తిత్వాన్ని.."
"హుఁ.. నేను మామూలు మనిషినే ఆదీ!.. నాకు ఆశలు ఆశయాలు వున్నాయి. కానీ.. వాటిని తీర్చుకొనేటందుకు సాటివారికి ఎలాంటి బాధనూ కలిగించకూడదన్నది నా అభిప్రాయం. పెద్దలు అంటుంటారు. మనది కర్మభూమి అని. ఖర్మ అంటే ధర్మం. ధర్మం అంటే.. బాధ్యత. ప్రతి వ్యక్తీ వారి వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి కదా!.."
ఆ బాధ్యతను విస్మరించి వర్తించేవారు ధర్మబద్ధులు కాలేరుగా!.. నా ఉద్దేశ్యంలో కిషోర్ తన ధర్మాన్ని తన స్వార్థంతో విస్మరించాడు. వాడు వూహించని రీతిలో కష్టాల పాలైనాడు. మనశ్శాంతిని కోల్పోయాడు.
’ఋణాణు బంధరూపేణా.. పశుపత్ని సుతాలయా’ ఇది పెద్దల మాట. ఋణం.. అంటే బాకీ, అప్పు.. ఎవడైతే దాన్ని చేస్తాడో, వాడు ఆ ఋణాన్ని.. తీర్చుకోవాలిగా!.. ఈ తత్వానుసారంగా మన పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసిందే. నేను నమ్ముతాను.
’జన్మరాహిత్యమే మోక్షం’ అంటే ఈ జన్మలో మనం మన స్వధర్మాన్ని క్రమంగా నెరవేర్చాలి. అంటే ఎవరికీ మనం ఏ రీతిగా కూడా స్వార్థ చింతనతో తప్పు చేసి ఋణపడకూడదు. ఇది నేను నమ్మి ఆచరించే సత్యం.
నీకు నా మాటలు.. ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కదూ!.. ఎం.బి.బి.ఎస్ డాక్టరయ్యిండి వీడు ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడని అనుకొంటున్నావు కదూ!.. పెద్దల మూలాన మనకు సంక్రమించిన అక్షర జ్ఞానాన్ని సత్యాసత్య విచక్షణకు.. మన స్వధర్మాన్ని గుర్తించి ఆచరించే దానికి ఉపయోగించుకోవాలన్నది నా తత్వం. స్వార్థంతో స్వప్రయోజనాలకు, మనస్సు కోరిన రీతిగా ఉపయోగిస్తే.. మనం ఋణగ్రస్తులం అవుతాము. అన్ని బాధలకన్నా గొప్ప బాధ ఋణ బాధ దాన్ని భరిస్తూ జీవితాన్ని ముందుకు సాగించడం చాలా కష్టం. అలాంటి స్థితి అంటే నాకు చాలా భయం. అందుకే.. నా స్వధర్మ నిర్వహణలో నేను ఒకటికి పదిసార్లు ఆలోచించి.. సమస్య పరిష్కారానికి ఒక నిర్ణయానికి.. వచ్చి ముందుకు సాగుతాను.
జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల ఋణాన్ని మనం తీర్చుకోవాలంటే.. ఈ జన్మ, బ్రతికే కాలం చాలదని నా అభిప్రాయం. అందుకే.. వాళ్ళ కళ్ళముందు వుండి వారికి ఆనందాన్ని కలిగించే రీతిలో, నా జీవితాన్ని సాగిస్తూ వున్నాను" చెప్పడం ఆపి.. ఆదిత్య ముఖంలోకి చూచాడు భాస్కర్.
ఆదిత్య.. కళ్ళల్లో కన్నీరు. వదనంలో ఎంతో బాధ.
"ఆదీ!.. ఎందుకురా బాధపడుతున్నావ్?" ఆత్రంగా అడిగాడు భాస్కర్.
ఆది.. ముఖ భంగిమను చూచిన భాస్కర్ మనస్సులో ఏదో సందేహం.
"నీవు ఇప్పుడు హాస్పిటల్‍కు వెళ్ళాలా!" కర్చీఫ్‍తో కన్నీటిని తుడుచుకొని అడిగాడు ఆది.
"వెళ్ళాలి"
"నేనూ నీతో రానా!"
"నీవెందుకురా!.. విశ్రాంతి తీసుకో. రెండు గంటల్లో వస్తాను. సుధతో చెప్పి వెళతాను. నీకు కాఫీ.. టీ.. ఏదైనా కావాలంటే ఆమె ఇస్తుంది."
సుధ.. గది వాకిటి దగ్గరకు వచ్చింది.
"అన్నయ్యా!.. హాస్పిటల్‍కు వెళ్ళడం లేదా!" అంది.
"వెళ్ళాలమ్మా. లోనికి రా, మాట"
సుధ గదిలో ప్రవేశించింది.
"అమ్మా చూడు. ఆది ఇక్కడే వుంటాడు. నేను రెండు గంటల్లో వస్తాను. వీడికి కాఫీ, టీ, స్నానానికి ఏర్పాటు చెయ్యి"
ఆది వైపుకు తిరిగి..
"ఆదీ!.. ఇది నీ ఇల్లే అనుకో. మొహమాట పడకు. ఏది కావాలన్నా సుధను అడుగు. సరేనా!" అనునయంగా చెప్పాడు.
"అలాగే!.."
సుధ గది నుంచి వెళ్ళిపోయింది. భాస్కర్ డ్రస్ మార్చుకొని కార్లో హాస్పిటల్‍కు వెళ్ళిపోయాడు. భాస్కర్‍ను సాగనంపి.. ఆది గదిలోకి వచ్చి మంచంపై వాలిపోయాడు. అతని మనస్సులో.. మూగ బాధ. కళ్ళు మూసుకొన్నాడు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
![](https://static.wixstatic.com/media/acb93b_5b9cf161e7bf4d898862e25c0f9ebe83~mv2.jpeg/v1/fill/w_865,h_1156,al_c,q_85,enc_auto/acb93b_5b9cf161e7bf4d898862e25c0f9ebe83~mv2.jpeg)
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
コメント