జీవిత చిత్రాలు - 10
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 7 days ago
- 6 min read
Updated: 21 hours ago
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Jeevitha-Chitralu-Part-10-Telugu-Web-Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 09/04/2025
జీవిత చిత్రాలు - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు.
యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. యువరాణికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు ఆదిత్య.
కిరణ్ ఫోన్ చెయ్యడంతో వైజాగ్ వెళ్లి అతను ప్రేమించిన గులాబీని స్టేషన్ నుండి విడిపిస్తాడు. గులాబీ పేరెంట్స్ ని కలవడానికి గోవిందరాజులు, ఇన్స్పెక్టర్ దివాకర్, గులాబీలతో హైదరాబాద్ వెళ్తాడు.
ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పదవ భాగం చదవండి.
కారు నుండి దిగి వేగంగా కొండలరావు, దివాకర్- ప్రొడ్యూసర్.. వినాయకం గారి ఆఫీస్ గదిని సమీపించారు. వారి పి.ఎ గారికి కొండలరావు తన విజిటింగ్ కార్డును ఇచ్చాడు.
అతను లోనికి వెళ్ళి నాలుగు నిముషాల్లో తిరిగి వచ్చాడు.
"కూర్చోండి సార్!.. ముగ్గురూ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ లోపల అయ్యగారితో మాట్లాడుతున్నారు. వారు బయటికి రాగానే.. మిమ్మల్ని లోనికి పంపమన్నారు." వినయంగా చెప్పాడు.
ఇరువురూ కూర్చున్నారు. పావుగంట తర్వాత ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ బయటికి వచ్చారు.
"మీరు వెళ్ళండి సార్!" చెప్పాడు పి.ఎ రంజిత్.
ఇరువురూ.. వినాయకం గారి గదిలో ప్రవేశించారు.
"గుడ్ ఆఫ్టర్ నూన్ సార్!" విష్ చేశాడు కొండలరావు.
"రండి సార్ రండి కూకోండి"
ఇరువురూ వారి ఎదుట టేబుల్ ముందున్న కుర్చీలలో కూర్చున్నారు.
"అమ్మాయి ఎప్పుడూ వస్తదని చెప్పినావూ!"
"ఈ సాయంత్రానికల్లా అమ్మాయిగారు వచ్చేస్తారు సార్!" వినయంగా జవాబిచ్చాడు కొండలరావు.
"కొండలరావ్!"
"సార్!"
"ఈయనెవరు?"
"వీరు వైజాగ్ ఎస్.ఐ పేరు దివాకర్. వీరే అమ్మాయిని ట్రేస్ చేసింది."
"మా పోరి నీకు ఏడ కనబడింది?"
"సార్!.. తప్పుగా భావించకండి. అమ్మాయిగారు వారి లవర్‍తో వుండగా నేను చూశాను."
"వాడెవడు?"
దివాకర్.. కొండలరావు ముఖంలోకి చూచాడు.
"సార్!.. విషయాన్ని నేను మీకు వివరంగా చెబుతాను."
"చెప్పు"
కొండలరావుగారు కిరణ్, గులాబీల పరస్పర ప్రేమ విషయాన్ని.. వాళ్ళ నిర్ణయాన్ని.. గోవిందరాజు దంపతుల అభిప్రాయాన్ని.. వివరంగా వినాయకం గారికి తెలియజేశారు.
చివరగా..
"సార్!.. ప్రస్తుత యువతీ యువకుల మనస్తత్వాలు.. మీకు తెలియంది కాదు. రెండేళ్ళలో రిటైర్ కాబోయే వాణ్ణి. నాకు అంతో ఇంతో అనుభవం ఉంది. మీరు మంచి మనస్సు చేసుకొని వారి వివాహానికి అంగీకరిస్తే.. మీ రెండు కుటుంబాల వారూ ఆనందంగా హాయిగా ఉండవచ్చు. అబ్బాయి పేరు కిరణ్. వారి నాన్నగారి పేరు గోవిందరాజు. వారికి లారీ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ఉంది. ఓ ముఫ్ఫై లారీలకు పైగా వున్నాయి. మీ అమ్మాయి గారితో పాటు సాయంత్రం వారు వస్తున్నారు. మీతో మాట్లాడాలని. ఆ పిల్లలిద్దరి భవిష్యత్తు ఆనందం.. మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది సార్" వినయంగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు డి.ఐ.జి కొండలరావు.
"ఎందరికో సలహాలిచ్చే నాకు నీవు సలహాఇస్తా వుండావ్?.. తప్పు నీది కాదు. నా కూతురిది. దాన్ని వాళ్ళమ్మ సరిగా పెంచలా!.. అందుకే ఇలా తయారైంది. ఇదిగో డి.ఐ.జి!.. ఆ లారీలోడి ఆస్థి మొత్తం ఎంత వుంటది?.. పది కోట్లు.. ఇరవై కోట్లు.. నా కూతురు వెయ్యి కోట్లకు వారసురాలు. ఒక్కతే.
అలాంటి నా పోరిని.. నాకు అన్ని విధాలా తగిన జాతోడికిచ్చి పెళ్ళి చేయాలనుకోవటం తప్పా. అది చిన్నపిల్ల. దానికేం తెలుసు.. ఏది బాగో. ఏది ఓగో. నా పోరి విషయంలో నేనేం చేయాలో నాకు బాగా తెలుసు" రోషంతో చెప్పాడు వినాయకం.
"సార్!.. చిన్న సందేహం?"
"ఏమిటది?"
"అమ్మాయి ఇల్లు విడిచి పారిపోయిందనే విషయం మీరు నిర్ణయించిన ఆ సంబంధం వారికి తెలిస్తే.. ఈ సంబంధానికి వారు.."
"తప్పకుండా ఒప్పుకుంటారు. కారణం.. నా కూతురు వెయ్యికోట్లకు వారసురాలు" వికటంగా నవ్వాడు వినాయకం.
అతని అహంకార పూరిత మాటలను విని దివాకర్, కొండలరావులు ఆశ్చర్యపోయారు.
దివాకర్.. కొండలరావు ముఖంలోకి చూచి ’ఇక బయలుదేరుదాం’ అన్నట్లు సౌంజ్ఞ చేశాడు.
ఇరువురు కుర్చీల నుంచి లేచారు.
"సార్!.. అమ్మాయిగారు మా దగ్గరకు చేరగానే.. తీసుకొచ్చి మీకు అప్పగిస్తాము బై" సెల్యూట్ చేశాడు కొండలరావు.
అదే రీతిగా.. దివాకర్ కూడా సెల్యూట్ చేశాడు.
ఇరువురూ.. గది నుండి బయటికి నడిచారు.
వినాయకం సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది వారి శ్రీమతి చిలకమ్మ.
"హలో!.."
"ఏమండీ!.. అమ్మాయి సమాచారం ఏమైనా తెలిసిందా!.."
"ఆఁ.. తెలిసింది చిలకా!.."
"ఏం తెలిసింది!"
"ఈ సాయంకాలానికి మన అమ్మాయి మనలను కలుసుకొంటది"
"ఇప్పుడు ఎక్కడ వుంది?"
"దార్లో!.."
"తోటే ఎవరున్నారు?"
"పోలీసులు"
"ఆడా మగా"
"ఆడ. పెట్టేయ్!" విసుగ్గా ఫోన్ కట్ చేశాడు వినాయకం.
దివాకర్, కొండలరావు కార్లో కూర్చొని బయలుదేరారు.
"సార్!.. ఈ మనిషి!!!"
"కేవలం డబ్బు మనిషి దివాకర్"
"ఇక.. కిరణ్, గులాబీల వివాహం జరిగేదానికి ఎలాంటి ఆస్కారం లేదు కదూ!.."
దివాకర్ ముఖంలోకి చూచి.. "అవును దివాకర్" విచారంగా చెప్పాడు కొండలరావు.
ఇంటికి చేరి.. విషయాన్నంతా గోవిందరాజు, ఆదిలకు వివరించారు ఆ ఉభయులు.
గోవిందరాజు.. ఆది ఆశ్చర్యపోయారు. సమస్య.. తీవ్రరూపం దాల్చినందుకు విచారించారు.
పార్వతి మూలంగా విషయాన్ని విన్న గులాబీ భోరున ఏడవసాగింది. పార్వతి ఆమెను ఓదార్చింది. కానీ.. పార్వతి అనునయ వాక్యాలు గులాబి ఆవేదనను ఆర్పలేకపోయాయి.
వినాయకానికి చెప్పిన మాట ప్రకారం ఐదు గంటలకు గులాబీని తీసుకొని వెళ్ళి అతనికి అప్పగించే దానికి వికలమైన మనస్సులతో దివాకర్ కొండలరావుగారు ఆఫీసు గదిలో కూర్చొని వున్నారు.
పార్వతి.. ఆ గదిలో ప్రవేశించింది. ఆ ఇరువురినీ చూచింది. ఆ ఇరువురూ వారి ప్రయత్నం ఫలించనందు వలన ఎంతో విచారంగా వున్నారనే విషయాన్ని గ్రహించింది. కొండలరావు గారిని ఉద్దేశించి..
"సార్!.. నేను ఒక విషయం మీతో చెప్పనా!.."
"చెప్పమ్మా!"
"గులాబీని తీసుకొని వారి ఇంటికి మీరు వెళ్ళడం ఎందుకు సార్!.. అమ్మాయి మా దగ్గర వుంది.. వచ్చి తీసుకొని వెళ్ళండని ఫోన్ చేసి చెప్పండి."
"దాని వలన మనకు వచ్చే లాభం!" అడిగాడు కొండలరావు.
"నా ఊహ ప్రకారం.. వినాయకం గారు రారు. బహుశా గులాబీ తల్లిని పంపుతారు. ఆమె వస్తే.. మనమందరం కలిసి ఆమెతో.. గులాబీ అభిప్రాయాన్ని గురించి వివరంగా చెబుదాం. తల్లి కదా!.. తన బిడ్డ కోర్కెను.. ఆవేదనను అర్థం చేసుకొంటుందని నా ఉద్దేశ్యం. అలా జరిగితే.. అది మనకు ప్లస్ పాయింట్ కదా సార్!" తన ఉద్దేశ్యాన్ని తెలియజేసింది అడ్వకేట్ పార్వతి.
కొండలరావుగారికి పార్వతి సలహా ఇచ్చింది.
"దివాకర్!.. మీ మిసెస్ చెప్పినట్లే చేద్దాం" అన్నాడు.
"అలాగే సార్" తన ఆమోదాన్ని తెలియజేశాడు దివాకర్.
చిరునవ్వుతో పార్వతి వెళ్ళి.. తాను తన భార్యకు.. డి.ఐ.జి గారికి చెప్పిన మాటలను గులాబికి చెప్పింది. ’బహుశా మీ అమ్మగారు వస్తారు కాబట్టి నీ ప్రేమ విషయాన్ని ఆమెకు వివరంగా చెప్పి ఒప్పించి.. నీ వివాహం కిరణ్‍తో జరిగేలా చేస్తాం’ అని గులాబికి చెప్పి ఊరడించింది.
పార్వతి మాటలు.. గులాబీకి కొంత వూరటను కలిగించాయి.
ఆదిత్య.. పార్వతిని చూచినప్పటి నుంచీ.. తన అక్క పార్వతి జ్ఞాపకాలు అతన్ని సతమతపరుస్తున్నాయి. పదెనిమిది సంవత్సరాల క్రితం తనకు దూరం అయిన ఆ అక్క పదే పదే గుర్తుకు వస్తూ మనస్సును ఎంతగానో కలవర పరుస్తూ ఉంది. మీ భార్య పేరు ఏమిటి అని దివాకర్‍ను అడగడం అసభ్యత అనే భావన అతని మదిలో.
ఇక.. కిరణ్, గులాబీల వివాహం.. ఎం.పి గారు కాదనడంతో కిరణ్‍కి తాను ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలనే ప్రశ్న.. ఎంతగానో ఆలోచించినా ఆ సమస్యకు పరిష్కార మార్గం గోచరించడం లేదు. అనేక రకాల ఆలోచనలతో మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. ఏదో కలవరం, బాధ.. ప్రసన్నంగా వున్న వదనంతో సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని వున్న గోవిందరాజు గారి ముఖంలోకి చూచాడు ఆది.
తన.. నిర్ణయాన్ని వారికి చెప్పాలని దగ్గరకు జరిగి వారి భుజంపై చేయి వేసి..
"బాబాయ్!.." మెల్లగా పిలిచాడు.
గోవిందరాజు కళ్ళు తెరిచాడు. వారి నేత్రాలు చింత నిప్పుల్లా ఎర్రగా వున్నాయి. గడిచిన రోజు పగలంతా.. రాత్రీ.. కార్లో ప్రయాణం. పైగా మనస్సున అశాంతి, వ్యాకులం.. కారణం అనుకొన్నాడు ఆదిత్య.
"బాబాయ్! నేను ఒక నిర్ణయానికి వచ్చాను"
"చెప్పు చిన్నా!"
"మనం గులాబీని తీసుకొని మన వూరికి వెళ్ళిపోదాం. కిరణ్, గులాబీల వివాహాన్ని వెంటనే జరిపిద్దాం. వివాహానికి ఇరవై నాలుగు గంటల ముందు ఆ వినాయకానికి ఫోన్ చేసి.. మీ అమ్మాయి సమ్మతంతో.. గులాబీకి, కిరణ్‍ల వివాహం జరుగబోతూ వుందనే విషయాన్ని తెలియజేస్తాం. మంచి మనస్సుతో ఆ దంపతులు వచ్చి వివాహంలో పాలు పంచుకొంటే అందరికీ ఆనందం. రాని పక్షంలో మనవరకు.. మనకు ఆనందం. తలెత్తిన సమస్యకు ఇదే తగిన పరిష్కార మార్గం అని నా అభిప్రాయం బాబాయ్!.. మీ నిర్ణయం ఏమిటి?" అడిగాడు ఆది.
"అనేక విధాల ఆలోచించి.. చివరకు నేనూ ఇదే నిర్ణయానికి వచ్చాను చిన్నా!" చిరునవ్వుతో చెప్పాడు గోవిందరాజు.
వారి సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది వారి అర్థాంగి శాంతమ్మగారు.
"హలో!.."
"ఏమండీ క్షేమంగా చేరారా!"
"చేరాము"
"ప్రొడ్యూసర్ గారిని కలిశారా!"
"వారు మాకు అలాంటి అవకాశాన్ని కల్పించలేదు."
"అంటే!.."
"గులాబీ వివాహాన్ని వారు నిర్ణయించిన సంబంధంతోనే చేయాలని వారి నిర్ణయం. ఆ కారణంగా మేము గులాబీతో తిరిగి వస్తున్నాము. కిరణ్‍కి చెప్పు త్వరలో మనం.. గులాబీ, కిరణ్‍ల వివాహాన్ని జరిపిద్దాం."
"మీరు చెప్పే మాటలు వుంటుంటే నాకు భయంగా వుంది?" విచారంగా చెప్పింది శాంతమ్మ.
"పాతిక సంవత్సరాల నాటి నీ భర్తను జ్ఞాపకం చేసుకో. నీ భయం ఎగిరిపోతుంది" నవ్వాడు గోవిందరాజు.
వారి నవ్వును చూచి ఆది వదనంలోనూ నవ్వు.. ’అంటే ఆ రోజుల్లో బాబాయిగారి మాటకు చేతకు తిరుగు లేదన్నమాట’ అనుకొన్నాడు ఆది.
పార్వతి టీ కప్పులతో వచ్చింది. ఇరువురికీ అందించి.. "టీ త్రాగి, వినాయకం గారికి ఫోన్ చేయండి. వారు మీ మాటలకు జవాబు ఏం చెబుతారో విందాం." నవ్వుతూ చెప్పింది పార్వతి.
టీ కప్పును టేబుల్ పై వుంచి చేతి వాచ్‍ను చూచి..
"దివాకర్!.. ఐదున్నర. వినాయకానికి ఫోన్ చేస్తున్నాను" అన్నాడు కొండలరావు.
"చేయండి సార్" దివాకర్ జవాబు.
కొండలరావ్ గారు సెల్‍లో వినాయకం నెంబర్ నొక్కారు. వారు కాల్‍ను రిసీవ్ చేసుకొన్నారు.
"హలో!.."
"నేను కొండలరావును సార్!.."
"నీ గొంతు నాకు బాగా గుర్తులే చెప్పు. అమ్మాయి వచ్చిందా!.. వాళ్ళ అమ్మ నన్ను చంపేస్తా వుంది" విసుగ్గా చెప్పాడు వినాయకం.
"అమ్మాయిగారు వచ్చారు సార్!.. సార్!.. హోం మినిస్టర్ గారు రమ్మని ఫోన్ చేశారు. మీరు అమ్మగారిని పంపితే.. అమ్మాయిగారు వారితో, నేను.."
"సరే.. సరే.. నీవు చెప్పేది నాకు అర్థం అయినాదిలే.. మా ఆడోళ్ళని పంపిస్తుండా..!"
"థాంక్యూ సార్!"
"ఏడకు పంపాలో సెప్పలేదే డి.ఐ.జీ!"
కొండలరావు అడ్రస్ చెప్పాడు. వినాయకం సెల్ కట్ చేసి పి.ఎ ని పిలిచాడు. అతనితో డ్రైవర్‍ను పిలవమని చెప్పాడు.
యాభై సంవత్సరాల డ్రైవర్ కోటయ్య గదిలోకి వచ్చాడు. అడ్రస్ చీటీని కోటయ్యకు అందించాడు వినాయకం.. "అమ్మగారిని తీసుకొని ఆడకెళ్ళు.. వాళ్ళ ఇంట్లో మన పోరి ఉంది. ఇద్దర్నీ జాగ్రత్తగా తీసుకురా" చెప్పాడు వినాయకం.
"అలాగే అయ్యా!.." అడ్రస్ కాగితాన్ని జేబులో పెట్టుకొని కోటయ్య వెళ్ళిపోయాడు.
వినాయకం పి.ఎ ని పిలిచాడు. రంజిత్ లోనికి వచ్చాడు.
"అయ్యా!.."
"ఒరే రంజితూ!.. ఆ రోజు మనం ఆ బుల్లెట్టు మీద వున్నోళ్ళను అనవసరంగా కొట్టాం కదరా!.."
సాలోచనగా అడిగాడు.
రంజిత్ ఆశ్చర్యంతో వినాయకం ముఖంలోకి చూచాడు. ’ఆది ముగిసిపోయిన కథ. ఇప్పుడు అదెందుకు గుర్తుకొచ్చిందో వీరికి’ అనుకొని..
"వాళ్ళు చేసింది తప్పు కదయ్యా!" మెల్లగా నసిగాడు.
"తప్పే అనుకో. మనం వాళ్ళని అంతగా కొట్టుండకూడదురా!.."
’గతజలసేతు బంధనం అన్నట్లు ఇప్పుడు విచారించి ఏం లాభం’ అనుకొన్నాడు రంజిత్.
వినాయకం ఫోన్ మ్రోగింది.
"హమ్మయ్యా!.." నిట్టూర్చి గది నుంచి బయటికి వచ్చాడు రంజిత్.
తను ఫోన్ వస్తే.. రంజిత్ గదిలో వుండకూడదని.. అతనికి వినాయకం ఆదేశం.
ఫోన్ చేసింది అర్థాంగి చిలకమ్మ.
"ఆఁ.. ఆఁ.. వింటుండా. ఎల్లి పోరిని తీసకరా. ఇంట్లో అన్నీ మాట్లాడుకుందాం" చెప్పి సెల్ కట్ చేశాడు వినాయకం.
చిలకమ్మ.. నిజంగా అందాల బొమ్మ. నలభై ఐదేళ్ళ ప్రాయంలోనూ పాతికేళ్ళ పడుచులా వుంటుంది. ఆ కాలంలో బి.ఎ వరకు చదివింది. ఇంగ్లీష్ వినాయకం కన్నా చక్కగా మాట్లాడుతుంది. లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్. పబ్లిసిటీ కోసం.. తాను ఓ సెలబ్రిటీనని పదిమందీ అనుకోవాలని దానధర్మాలు, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు.. తన క్లబ్ మెంబర్స్ తో వీధులు తిరిగి చందాలు వసూలు చేసి గవర్నమెంటు వారికి అందివ్వడాలు.. తరుచుగా చేస్తూ వుంటుంది. నాలుగు మాటలు ఆమె చర్యలను గురించి పొగిడితే చాలు, పొంగిపోతుంది. వీటన్నిటి దృష్ట్యా.. ఆమెను అమాయకురాలు, మంచి మనస్సున్న మగువగానే చెప్పాలి.
వినాయకంగారు పక్కా వ్యాపారి.., అర్జన.. అర్జన.. తన అర్జనా భావనలో.. అయినవారూ.. పరాయివారూ అనే భేదభావం.. వారికి లేదు. తన పంతం సాధించే దానికి అందితే జుట్టు అందకపోతే చాటుగా కాళ్ళు పట్టుకొనే దానికి వెనుకాడడు.
నల్లగా రుబ్బురాయిలా ఐదున్నర అడుగుల ఎత్తు డెభ్బై కేజీల బరువు వున్న ఈ మన్మధునికి చిలకమ్మ చాలక.. మరో సెటప్పు. వారి పేరు మందాకిని. వారిది అమలాపురం. వీరి ఆశీర్వాదంతో మందాకినికి ఒక సుపుత్రిక.. మాళవిక.
కోటయ్య కారు దివాకర్ ఇంటివైపు పోతూ ఉంది. ఇరువురు వ్యక్తులు గల కారు.. వీరి వెనుకాలే రావడాన్ని కోటయ్య గమనించాడు. సందుగొందుల్లో త్రిప్పి కారును దివాకర్ గారి ఇంటిముందు ఆపాడు. చిలకమ్మ కారు దిగి ఇంట్లో ప్రవేశించింది.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments