జీవిత చిత్రాలు - 11
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 13 hours ago
- 6 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

jeevitha Chitralu Part 11 - Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 15/04/2025
జీవిత చిత్రాలు - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు.
యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు.
కిరణ్ ప్రేమించిన గులాబీ పేరెంట్స్ ని కలవడానికి గోవిందరాజులు, ఇన్స్పెక్టర్ దివాకర్, గులాబీలతో హైదరాబాద్ వెళ్తాడు ఆదిత్య. గులాబీ తండ్రి ప్రొడ్యూసర్ వినాయకం అంగీకరించడు. గులాబీని తీసుకొని రావడానికి ఆమె తల్లి చిలకమ్మ వెళ్తుంది.
ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పార్ట్ 11 చదవండి.
హాల్లో సమావేశమైయున్న దివాకర్.. కొండలరావు.. ఆదిత్య.. ఆమెను చూచి లేచి నిలబడ్డారు.
"రండి మేడం రండి.. కూర్చోండి" చిరునవ్వుతో చెప్పాడు ఐ.జి కొండలరావు.
చిలకమ్మ అందరినీ పరీక్షగా చూచింది. సోఫాలో కూర్చుంది.
"డి.ఐ.జి గారూ!.. నా కూతురు ఏదీ..?"
కొండలరావు దివాకర్ ముఖంలోకి చూచాడు. అతను లేచి లోనికి వెళ్ళాడు. రెండు నిముషాల్లో గులాబీతో తిరిగి వచ్చాడు.
గులాబీ.. తల్లిని క్షణంసేపు చూచి తలదించుకొంది.
"ధన్యవాదాలు డి.ఐ.జి గారు. ఇక నేను మా అమ్మాయితో బయలుదేరుతాను" అంది చిలకమ్మ.
"కొద్ది నిముషాలు కూర్చోండి మేడం. మీతో మాట్లాడాలి" వినయంగా చెప్పాడు కొండలరావు.
"త్వరగా చెప్పండి. విషయం ఏమిటో!"
కొండలరావు గోవిందరాజుగారి ప్రక్కన సోఫాలో కూర్చున్నారు.
నిలబడే వున్న గులాబీని చూచి.. "అమ్మా!.. గులాబీ.. అమ్మ ప్రక్కన కూర్చో" అన్నాడు కొండలరావు.
గులాబీ తన తల్లి ప్రక్కన కూర్చుంది. తలదించుకొంది.
చిలకమ్మ.. గులాబీ ముఖంలోకి తీక్షణంగా చూచింది. నిట్టూర్చి.. కొండలరావును చూస్తూ..
"చెప్పండి సార్!.." అంది.
దివాకర్‍ను చూపుతూ..
"వీరు దివాకర్.. వైజాగ్ ఎస్.ఐ అమ్మాయిగారిని తీసుకొని వచ్చింది వారే. వీరు.. గోవిందరాజు గారు. వీరి అబ్బాయి కిరణ్ నే మీ గులాబీ ప్రేమించింది. వీరికి వైజాగ్‍లో ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ఉంది. మంచి గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం. వారు వీరి పెద్ద అబ్బాయి ఆదిత్య.
మీరు గులాబీకి తల్లిగారు కదా!.. ఆడబిడ్డ మనోభావాలను తండ్రి కన్నా.. తల్లి బాగా అర్థం చేసుకోగలదని నా నమ్మకం. నేను మీతో ఇప్పుడు చెప్పబోయే మాటలను ప్రొడ్యూసర్ గారితోనూ చెప్పాను. వారి నిర్ణయం వేరుగా ఉంది. మీరు సమస్యను సరిగా అర్థం చేసుకోగలరని నా నమ్మకం.
కిరణ్.. గులాబీలు కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకొన్నారు. తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. మీరు గులాబీకి చూచిన సంబంధం ఆమెను నచ్చని కారణంగా నిశ్చితార్థానికి ముందు రోజు వైజాగ్ వెళ్ళిపోయింది. విషయాన్ని కిరణ్‍కి చెప్పింది. కిరణ్ ఆమెను వారి ఇంటికి తీసుకొని వెళ్ళి.. తల్లిదండ్రులకు పరిచయం చేసి తన నిర్ణయాన్ని వారికి చెప్పాడు.
గోవిందరాజుగారిని చూపుతూ..
"వీరు.. వారి వివాహ విషయాన్ని మీవారితో మాట్లాడాలని వచ్చారు. మీవారు మాతో మాట్లాడిన వ్యతిరేక సంభాషణను మేము చెప్పగా విని.. వారు మీ ఇంటికి రాలేకపోయారు. విషయాన్ని విని వారు వూరికి బయలుదేరబోయారు. మీరు వస్తున్నట్లుగా వారికి చెప్పాము మేడమ్!.. నేటి కొందరు యువతరం.. వారి భావాలు ఆశయాలు.. ఆచరణలు, వాటి పరిణామాలు పెద్దలకు ఎలాంటి గౌరవ ప్రతిష్టలను.. ఆనందాన్ని కలిగిస్తున్నాయో, మేము వీక్షిస్తున్నాము. మీరు టీవీల్లో చూస్తున్నారు.
కాబట్టి.. కిరణ్, గులాబీలు కలలుగన్న వారి భావి జీవితం.. మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మీరు వారి అభిప్రాయాన్ని ఆమోదించి గులాబీని వారితో పంపితే.. గోవిందరాజు గారు వారికి వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించిన అహ్వాన పత్రికను పంపుతారు. వెళ్ళి వాళ్లను ఆశీర్వదించడమా.. వెళ్ళకుండా వుండడమా.. అది కేవలం మీ నిర్ణయం.
చివరగా నేను చెప్పేది.. పరస్పరం ప్రేమించుకొని పెద్దల అనుమతితో వివాహం చేసుకోవాలనుకొన్న ఆ జంటను.. కులం.. ఐశ్వర్యం.. పేరుతో విడదీయడం ఆ ఉభయులకు.. కన్నవారికీ కూడా వేదనను కలిగిస్తుందే కానీ.. ఆనందాన్ని కలిగించదు. మనమంతా కాలం మారింది.. కాలం మారింది అంటాం. మారింది కాలం కాదండీ. ఆ దినకరుని దివ్య దినచర్యలో ఎలాంటి మార్పు లేదు. మారింది మనుషుల మనస్తత్వాలు. నేను చెప్పదలచుకొన్నది చెప్పేశాను. ఇక.. మీకు ఏది మంచిదనిపిస్తే.. ఆ నిర్ణయాన్ని మాకు తెలియజేయవలసిందిగా ఇక్కడ వున్న వారందరి తరుపునా మిమ్మల్ని కోరుతున్నాను మేడం" భావావేశంతో చెప్పిన.. కొండలరావుగారు ఆపి ప్రశ్నార్థకంగా.. చిలకమ్మ ముఖంలోకి చూచాడు.
చిలకమ్మ సాలోచనగా తలను దించుకొంది.
పార్వతి కాఫీ కప్పులను తన చిరునవ్వుతో.. అందరికీ అందించింది.
కప్పును చేత పట్టుకొని ఆలోచనలో మునిగి ఉన్న చిలకమ్మను చూచి..
"మేడం!.. కాఫీ త్రాగండి. మంచి నిర్ణయం స్ఫురిస్తుంది" నవ్వుతూ చెప్పింది పార్వతి.
క్షణంసేపు చిలకమ్మ.. పార్వతి ముఖంలోకి చూచి చిరునవ్వుతో కాఫీ త్రాగడం ప్రారంభించింది.
అందరి చూపులూ ఆమె వైపునే వున్నాయి. కాఫీ త్రాగి కప్పును టీపాయ్‍పై ఉంచింది చిలకమ్మ. తన కూతురుకు దగ్గరగా జరిగి భుజంపై చెయ్యి వేసి.. గోవిందరాజుగారిని చూస్తూ..
"అన్నయ్యగారూ!.. మా అమ్మాయిని మీతో తీసుకొని వెళ్ళండి. మీ అబ్బాయి కిరణ్‍తో నా కూతురు గులాబీ వివాహం నాకు సమ్మతం" నవ్వుతూ చెప్పింది.
అందరి వదనాల్లో ఎంతో ఆనందం. గులాబీ ఆనంద భాష్పాలతో తన తల్లిని గట్టిగా కౌగలించుకొంది.
"మేడమ్!.. యు ఆర్ గ్రేట్. మంచి నిర్ణయం తీసుకొన్నారు" ఎంతో ఆనందంగా చెప్పాడు కొండలరావు.
"అమ్మా!.. మీ నిర్ణయానికి నా ధన్యవాదాలు" సంతోషంతో చెప్పాడు గోవిందరాజు.
క్షణం తర్వాత..
"అమ్మా!.. మరొక్కమాట. మాకు ఆ దేవుడు!.. తినేదానికి.. వుండేదానికి ఏమి తక్కువ చేయలేదమ్మా!..నన్ను నా బిడ్డలను నమ్మి అయిదు వందల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. నా యింట నీ బిడ్డకు దేనికీ కొరత అనే మాట వుండదు." అనునయంగా చెప్పాడు గోవిందరాజు.
"చాలా సంతోషం అన్నయ్యగారు. వారు వచ్చినా రాకపోయినా నా బిడ్డ పెళ్ళికి నేను తప్పకుండా వస్తాను" లేచి.. గులాబీ తన చేతిలోకి తీసుకొని "రా.. " చెప్పి పార్వతి వైపు చూచి.. "మీరూ రండి" అంది.
ఆ ముగ్గురూ ఎదుటి వైపున వున్న గదిలో ప్రవేశించారు.
ఆది.. గోవిందరాజు చేతులు పట్టుకొని.. "బాబాయ్ పిన్నికి కిరణ్‍కి విషయాన్ని చెబుతాను" ఎంతో ఆనందంగా చెప్పి.. ఫోన్ చేసి వారికి విషయాన్ని చెప్పాడు.
దివాకర్.. కొండలరావు గారి చేతిని తన చేతిలోనికి తీసుకొని నవ్వుతూ.. "గ్రేట్ సార్!.. కంగ్రాచ్యులేషన్స్" తన హృదయ ఆనందాన్ని తెలియజేశాడు.
కొండలరావు నవ్వుతూ.. "దివాకర్!.. వుయ్ హ్యావ్ డన్ అవర్ డ్యూటీ డియర్!.. ఇకనే బయలుదేరుతాను" అన్నాడు.
గోవిందరాజు.. ఆదిత్యా వారితో కరచాలనం చేసి ధన్యవాదాలను తెలియజేశారు.
కొండలరావుతో కలిసి ఆ ముగ్గురూ వరండాలోకి వచ్చారు. వారు కార్లో కూర్చొని తన నిలయం వైపు వెళ్ళిపోయారు ఆనందంగా.
గదిలోనికి వెళ్ళగానే చిలకమ్మ.. తన మెడలో వున్న పది సవర్లు బంగారు గొలుసును తీసి కూతురి మెడలో వేసి, చేతులకున్న పన్నెండు బంగారు గాజులనూ తీసి రెండు చేతులకూ తొడిగింది.
"అమ్మా!.. గులాబీ.. తాను కోరిన వాడితో వివాహం జరగడం అన్నది నిజంగా ఆడపిల్ల అదృష్టాన్ని బట్టి ఉంటుంది. నీవు గొప్ప అదృష్టవంతురాలివి. నీమీద నాకు ఎలాంటి ద్వేషం.. కోపం లేదమ్మా. వెళ్ళి నీవు కోరిన వాడిని పెండ్లి చేసుకో. ఈ వివాహం మీ నాన్నగారు అంగీకరించరు. కానీ.. నాకు పరిపూర్ణ సమ్మతం నేను మీ వివాహానికి వస్తాను. ఆ ఇంటి మనుషుల మనస్సు ఎరిగి మసలుకో. ఈ నీ తల్లి ఆశీర్వాదాలు నీ ఎప్పుడూ తోడుగా వుంటాయి" తన కుడిచేతిని గులాబీ తలపై వుంచింది.
"వాళ్ళంతా చాలా మంచి వాళ్ళండి. గులాబీ ఆ యింట హాయిగా వుంటుంది" చిరునవ్వుతో పార్వతి చెప్పింది.
ఇరువురి పాదాలను తాకి గులాబీ వారి అశీస్సులను అందుకొంది. ముగ్గురూ గది నుండి బయటికి వచ్చారు.
చిలకమ్మ గులాబీ చేతిని తన చేతిలోనికి తీసుకొని.. "అన్నయ్యగారు!.. ఇకపై గులాబీకి తల్లి తండ్రి.. అత్తా మామ అంతా మీరే" గోవిందరాజుల గారి చేతిలో గులాబీ చేతిని వుంచింది.
ఆ క్షణంలో ఆమె నయనాల్లో ఆశ్రువులు. వాటిని చూచిన గోవిందరాజు.. "చెల్లెమ్మా!.. మీరు బాధపడకండి. గులాబీని నా బిడ్డలా చూచుకొంటాను." అనునయంగా చెప్పాడు గోవిందరాజు.
"దివాకర్ సార్!.. పార్వతీ మేడమ్.. మీ ఉభయులకు నా ధన్యవాదాలు. నా బిడ్డను మీ బిడ్డగా చూచుకొన్నారు. ఇక నేను బయలుదేరుతాను" సవినయంగా చేతులు జోడించింది చిలకమ్మ.
వారూ.. నమస్కరించారు. అందరూ వరండాలోకి వచ్చారు.
"గులాబీ!.. జాగ్రత్త తల్లీ!" చెప్పి చిలకమ్మ కార్లో కూర్చుంది.
"మేమూ వెంటనే బయలుదేరుతాం మేడమ్!" చెప్పాడు దివాకర్.
డ్రైవర్.. కోటయ్య కారును స్టార్ట్ చేశాడు. కారు వీధిలో ప్రవేశించింది.
ఐదు నిముషాల్లో కారు మలుపు తిరిగింది. రోడ్డు అడ్డంగా ఓ కారు ఆగి వుంది.
వచ్చేటప్పుడు తన కారును ఫాలో చేసిన కారే అది. విషయాన్ని కోటయ్య గ్రహించాడు. ఆ కారును పది అడుగుల దూరంలో తన కారుని ఆపి హారన్ కొట్టాడు.
ఇరువురు దృఢకాయులు వీరి కారును సమీపించారు. అది చిన్న గల్లీ. జన సంచారం లేదు.
ఇరువురికీ తుపాకీలను గురిపెట్టి.. "అరచినా.. చెప్పిన మాటను వినకపోయినా కాల్చి చంపేస్తాము" ఇద్దరూ కారు దిగి ఆ కార్లో కూర్చొండని బెదిరించారు. కోటయ్యకు విషయం అర్థం అయింది. మాట్లాడవద్దని కారు దిగమని చిలకమ్మకు సూచించాడు.
మౌనంగా.. వారు ప్రక్కన నడుపగా ఇరువురూ వారి కారును సమీపించి వారి ఆదేశానుసారం వెనుక సీట్లో కూర్చున్నారు. వారి ప్రక్కన ఒకడు.. డ్రైవర్ సీట్ ప్రక్కన ఒకడు కూర్చున్నాడు. డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. వేగంగా ముందుకు పోసాగాడు.
"మరోసారి చెబుతుండా నోరు విప్పినా, పారిపోవాలని అటూ యిటూ కదిలినా తుపాకిని.. కణత మీద కాల్చి క్రిందకు తోసి మేము వెళ్ళిపోతాం జాగ్రత్త." హెచ్చరించాడు.
తన ప్రక్కన కూర్చొని వున్న.. చిలకమ్మ.. కోటయ్యలను వెనుక సీట్లో తుపాకిని చేత పట్టుకొని కూర్చొని వున్న వ్యక్తి చిలకమ్మ.. నోరు విప్పి ఏదో మాట్లాడబోతే.. ప్రక్కనే వున్న ఆ వ్యక్తి తన చేత్తో ఆమె నోరును మూసి తన నోటిని ఆమె చెవి దగ్గరకు చేర్చి..
"నోరు విప్పితే చచ్చిపోతావ్!" గద్దించి చెప్పాడు.
చిలకమ్మకు వారు కిడ్నాపర్స్ అన్న విషయం అర్థం అయింది. ఏ కారణంగా నన్ను కోటయ్యను వీరు కిడ్నాప్ చేసినట్లు.. డబ్బు కోసమా.. లేక వీరితో నాకేదైనా పూర్వ పరిచయం ఉండి, వారి విషయంలో నేను ఏదైనా తప్పు చేశానా.. ఎంతగా ఆలోచించినా.. అలాంటిదేదీ జరగలేదనే జవాబు తప్ప.. వేరే ఏమీ స్ఫురణకు రావడం లేదు. వీరిని ఎదిరిస్తే చావు తప్పదు. మౌనంగా వుండిపోయి.. వారు దింపిన చోట దిగితే.. వారే మమ్మల్ని ఎత్తుకొచ్చిన కారణాన్ని చెబుతారు. అంతవరకూ సహనంతో దైవాన్ని వేడుకోవడం తప్ప తాము ఏమీ చేయలేము. చేయకూడదు. అనే నిర్ణయానికి వచ్చి కళ్ళు మూసుకొంది చిలకమ్మ.
కోటయ్య.. ఇప్పటి తన అమ్మగారి ఈ స్థితికి.. కారణం.. బచేలీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు అయ్యగారు ఆవేశంతో మోటార్ బైక్ మీద వున్న వారిని కొట్టడమే!.. వారే వీరు. ఆ విషయం తనకు తెలుసు. అమ్మగారికి బదులుగా అయ్యగారు వచ్చి ఉంటే.. ఇప్పటి అమ్మగారి స్థానంలో వారు వుండేవారు. వారు రాని కారణంగా అన్నం పున్నెం ఎరుగని అమ్మగారు నాతోపాటు ఈ వల్లో చిక్కుకున్నారు. పాపం.. ఆడమనిషి.. ఆయన చేసిన పాడు పనికి.. నేను ఈమె శిక్షను అనుభవించవలసి వచ్చింది. ఈ రాత్రిపూట ఈ రాక్షసులు ఎక్కడికి తీసుకొని పోతారో.. ఏం చేస్తారో.. ఏం తిప్పలు పెడతారో.. అంతా అగమ్య గోచరం, ప్రాణాలు పిడికెట్లో పెట్టుకొని కుమ్ కైన్ అనకుండా చచ్చిన పేనుల్లా కూర్చోవడం తప్ప.. ఏమీ చేయలేని దుర్దశ. వడ్లత్గో తట్ట ఎండాల్సిందే అన్నట్లై పోయింది నా బతుకు" విచారంగా అనుకొన్నాడు కోటయ్య.
అర్థగంట గడిచింది. కారు నగర ముఖ్య మార్గాలను దాటింది.
ఆ ఇరువురి హృదయాల్లో.. ఏం జరుగబోతుందో అన్న భయం, ఆవేదన. నోరు విప్పి మాట్లాడేదానికి ఆస్కారం లేదు. ఒకరి ముఖాలొకరు చూచుకొంటూ కన్నీరు కార్చారు.
సమయం మరో రెండు గంటలు భారంగా గడిచాయి. రాత్రి పది గంటల ప్రాంతం. రోడ్డు ప్రక్కన వున్న ఓ డాబా ముందు కారు ఆగింది.
ముందు సీట్లో వున్నవాడు దిగి వెళ్ళి నాలుగు బీర్ బాటిల్స్ నాలుగు వాటర్ బాటిల్స్, ఐదు చపాతీలు కూర్మా పొట్లాలు తీసుకొని వచ్చాడు.
కారు ముందుకు పోసాగింది. అరగంట తర్వాత దట్టమైన అడవి ప్రాంతంలో రోడ్డు ప్రక్కన కారును ఆపాడు డ్రైవర్.
=======================================================================
ఇంకా వుంది..
జీవిత చిత్రాలు - పార్ట్ 12 త్వరలో..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments