జీవిత చిత్రాలు - 12
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 1 hour ago
- 7 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

jeevitha-chitralu-part-12-telugu-web-series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 22/04/2025
జీవిత చిత్రాలు - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు.
యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు.
కిరణ్ ప్రేమించిన గులాబీ పేరెంట్స్ ని కలవడానికి గోవిందరాజులు, ఇన్స్పెక్టర్ దివాకర్, గులాబీలతో హైదరాబాద్ వెళ్తాడు ఆదిత్య. గులాబీ తండ్రి ప్రొడ్యూసర్ వినాయకం అంగీకరించడు. గులాబీని తీసుకొని రావడానికి ఆమె తల్లి చిలకమ్మ వెళ్తుంది. కిరణ్ గులాబీల వివాహానికి అంగీకరిస్తుంది. తిరిగి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చెయ్యబడుతుంది చిలకమ్మ.
ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పార్ట్ 12 చదవండి.
డ్రైవర్.. ముందు సీట్లో వున్నవాడు.. వెనుక సీట్లో వున్నవాడు కారు దిగారు.
కోటయ్యను.. చిలకమ్మను కూడా దిగమన్నారు. కానీ..వారు కదిలితే ఏమంటారో అనే భయంతో కారు నుండి దిగలేదు.
ముందు సీట్లో వున్నవాడు కోటయ్య చేతికి రెండు చపాతీల పొట్లాలు.. ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చి..
"ఇద్దరు తిని నీళ్ళు త్రాగండి" అన్నాడు.
వారు కారు ప్రక్కగా పది అడుగుల దూరంలో రోడ్డు చివరన కూర్చున్నారు. బీర్ సేవనాన్ని ప్రారంభించారు.
"అమ్మగారు!.. వాళ్ళు వచ్చేదానికి ఓ పావుగంట పడుతుంది. మీరు చపాతీని తిని నీళ్ళు త్రాగండి. మీకేం భయం లేదు. మీ ప్రక్కన నేను తోడుగా వున్నానుగా!.. తినండి" పొట్లాన్ని విప్పి చిలకమ్మకు అందించాడు.
ఆకలితో వున్న చిలకమ్మ మారు మాట్లాడకుండా తినడం ప్రారంభించింది.
కోటయ్య కూడా తినడం ప్రారంభించాడు. వారికి వున్న ఆకలికి ఆ రెండు.. రెండు పలచటి చపాతీలు చాల్లేదు. ఇరువురూ బాటిల్ నీళ్ళు ఖాళీ చేశారు. కడుపు కొంచెం చల్లబడ్డట్టు అనిపించింది.
"కోటయ్యా!.. వీళ్ళు మనలను ఎక్కడికి తీసుకెళతారు?" మెల్లగా అడిగింది చిలకమ్మ.
"నాకు మాత్రం ఏం తెలుసమ్మా!.. మనల్ని చేర్చాల్సిన చోటుకు చేర్చి.. వాళ్ళే మనకు చెబుతారు" అన్నాడు విచారంగా.
"వీళ్ళు కిడ్నాపర్స్ కదా!"
"అవును వస్తున్నారు, మాట్లాడకండి."
ముగ్గురూ యధాస్థానాల్లో కూర్చున్నారు. కారు కదిలింది.
*
"చిలకమ్మకు చెప్పినట్లుగానే.. అరగంటలో తయారై.. దివాకర్, గోవిందరాజు, ఆదిత్య, గులాబీలు కార్లో వైజాగ్ బయలుదేరారు.
పార్వతి గులాబీకి బెస్ట్ విషెస్ చెప్పింది. ఆమె చర్యల్లో తన అక్క జ్ఞాపకాలు రావడంతో.. బయలుదేరే ముందు మరోసారి ఆమెను పరీక్షగా చూచాడు ఆది. మనస్సున ఏదో కలవరం. పాత జ్ఞాపకాలు.
"వెళ్ళొస్తామండి" చెప్పి కారు ఎక్కాడు.
ఆ సాయంత్రం వినాయకం.. పార్టీ సభ్యుల్లో ముఖ్యుడైన రామకోటి పుట్టిన రోజు కారణం.. రామకోటిగారు బ్రహ్మాండమైన పార్టీని అరేంజ్ చేసి పార్టీ సభ్యులందరినీ ఆహ్వానించాడు.
తన కార్యాలయం నుండి పి.ఎ రంజిత్ కలిసి.. వినాయకం ఆ పార్టీకి హాజరైనారు. అందరూ కలిసిన కారణంగా పలు విషయాల మీద చర్చలు.. వాద ప్రతివాదాలు జరిగి ముందు.. విందు భోజనం రాత్రి పన్నెండు గంటలకు ముగిసింది.
వినాయకం గారు పన్నెండున్నరకు ఇంటికి చేరారు మిత్రుడి కార్లో.
పని మనుషులను భార్య గురించి అడిగాడు. వారు అమ్మగారు ఇంకా ఇంటికి రాలేదని చెప్పారు.
వినాయకం పరిస్థితి అయోమయంలో పడింది. లేడీస్ క్లబ్‍కు ఫోన్ చేశాడు. అందరూ పదిగంటలకే వెళ్ళిపోయారని వాచ్‍మెన్ చెప్పాడు.
చిలకమ్మ తరుచుగా వెళ్ళే ఆమె స్నేహితురాండ్ర ఇండ్లకు ఫోన్ చేశారు. రాలేదనే జవాబును విన్నాడు.
చిలకమ్మ బయలుదేరే ముందు హడావిడిలో సెల్‍ను తీసుకోలేదు. ఆమె ప్రాంతానికి బయలుదేరాడు. ఇరవై నిముషాల్లో ట్రాఫిక్ లేని కారణంగా అక్కడికి చేరాడు. విజయ్‍ని కలుసుకొన్నాడు. కోటయ్య ఫోన్ తీసుకొని.. విజయ్ సాయంతో తన స్కూటర్ డిక్కీలో ఎక్కించి.. విజయ్‍కు ధన్యవాదాలు చెప్పి.. వినాయకం గారి ఇంటివైపుకు బయలుదేరాడు.
అరగంటలో చేరాడు. కారును కార్ పోర్టికోలో ఆపి ఇంట్లోకి ప్రవేశించాడు రంజిత్.
హాల్లో.. పిచ్చోడిలా ఎర్రని కళ్ళతో సోఫాలో కూర్చొని వున్న వినాయకాన్ని సమీపించాడు.
"సార్!.. కారును తీసుకొచ్చాను" మెల్లగా చెప్పాడు.
"మీ అమ్మగారు.. కోటయ్య.. ఏమైనట్టురా!.." విచారంగా అడిగాడు.
నాకు ఏమీ తోచడం లేదు సార్!..ఆఁ.. ఒక్కమాట సార్!.."
"చెప్పు.."
"ఆ రోజు.. మనం కొట్టామే, వాళ్ళు కిడ్నాపర్స్ అయ్యి వుంటారని నా అనుమానం సార్!.."
వినాయకం ఆవేశంతో.. రంజిత్ ముఖంలోకి చూచాడు. అతనికి వినాయకం వాలకం భయాన్ని కలిగించింది.
"సార్!.. నేను చెప్పింది.. కేవలం నాకున్న అనుమానమే!.. అది నిజం కావచ్చు. కాకపోవచ్చు. మనం. డి.ఐ.జి కొండలరావు గారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పడం మంచిది కదా సార్!" ఏం జవాబు చెబుతాడో అని బిక్క ముఖంతో వినాయకం వంక చూచాడు.
వినాయకం కొన్ని క్షణాలు ఆలోచించి.. "రంజిత్ డి.ఐ.జి కి ఫోన్ చెయ్" అన్నాడు.
రంజిత్ చేతి వాచీని చూచాడు. టైము రాత్రి రెండు గంటలు. ’ఈ సమయంలో వారికి ఫోన్ చేస్తే వారు ఏ స్థితిలో వుంటారో.. ఏమంటారో..’ సందేహంతోనే సెల్‍లో నెంబర్ నొక్కాడు.
రింగ్ అయ్యి ఆగిపోయింది.
"ఏరా! వాడు ఫోన్ ఎత్తలేదా!.."
విచారంగా లేదు అన్నట్లు తలాడించాడు రంజిత్.
"మళ్ళా చెయ్యి!"
’ఈ సెల్ ఫోన్స్ వచ్చినా వచ్చినాయి కాని.. కొందరి జీవితాలకు శాపాలైనాయి. పెరిగే విజ్ఞానం వల్ల మనిషి శాంతాన్ని.. సౌఖ్యాన్ని కోల్పోతున్నాడు. ఈ నిశిరాత్రిలో నిద్రపోయే మనిషికి అంతరాయాన్ని కలిగిస్తున్నానంటే.. అంతా దీని మహిమేగా!.. ఆ మహాశయుడు ఫోన్ ఎత్తకపోతే.. ఈ రావణాసురుడు నన్ను వెళ్ళి పిలుచుకొనిరా అని శాసిస్తాడు.’
"తిరుమల వెంకన్నా నన్ను కనికరించి, డి.ఐ.జి గారు ఫోన్ ఎత్తేలా చెయ్యి స్వామీ!" మనస్సులో ఈ భావాలతో మరోసారి ప్రయత్నించాడు. డి.ఐ.జి గారు ఫోన్ ఎత్తారు.
రంజిత్ ముఖంలో సంతోషం..
"సార్! గుడ్ మార్నింగ్"
"ఎవర్రా నువ్వు. ఇది గుడ్ మార్నింగా!.." డి.ఐ.జి గారి మాట ఎంతో కర్కశంగా వినిపించాయి రంజిత్ చెవులకు.
"సార్!.. సార్!.. నేను రంజిత్‍ను సార్!"
"ఏమోయ్!.. రాత్రి రెండుగంటల సమయంలో నీ కొంపేం మునిగింది. ఇదా నాకు ఫోన్ చేసే సమయం?"
"సారీ సార్!.. నిజంగా మా అయ్యగారి కొంప మునిగింది సార్!" దీనంగా చెప్పాడు రంజిత్.
"మీ అయ్యగారి కొంపా!" ఆశ్చర్యపోయాడు కొండలరావు.
"అవును సార్!.. మా అమ్మగారిని, మా డ్రైవర్‍ని.. ఎవరో ఎత్తుకుపోయారు."
"ఏమిటీ!.." ఆశ్చర్యపోయాడు కొండలరావు. అతనికి నిద్రమైకం వదిలిపోయింది.
వినాయకం రంజిత్ చేతిలోని ఫోన్ లాక్కున్నాడు.
"ఇదిగో కొండలరావ్!.. నీవు వచ్చి వెంటనే నన్ను కలవాలి" శాసించాడు.
కొండలరావు మనస్సులో వినాయకాన్ని తిట్టుకొంటూ "సరే సార్!.." అన్నాడు సెల్ కట్ చేశాడు.
దెబ్బ తిన్న సింహంలా వినాయకం సోఫాలో.. పిల్లిలా రంజిత్ నేలమీద కూర్చొని డి.ఐ.జి గారి రాకకోసం ఎదురుచూస్తూ వుండిపోయారు.
*
ఆదిత్యా.. దివాకర్, గోవిందరాజు, గులాబీలు విజయవాడలో కారును ఆపి భోజనం చేశారు.
నలుగురూ కారును సమీపించారు. ఆది సెల్ రింగ్ అయింది. చూచాడు. ఫోన్ చేసింది భాస్కర్.
"హలో భాస్కర్!"
"ఎక్కడున్నావు?"
"విజయవాడలో"
"ఎందుకు?"
"అదో పెద్ద కథ. మనం కలిసినప్పుడు చెబుతాను" గులాబీని చూస్తూ నవ్వాడు ఆది.
గులాబీ.. సిగ్గుతో చిరునవ్వుతో తలదించుకొంది.
"యువరాణి నిన్ను కలవాలనుకొంటూ ఉంది. ఆ స్థలాన్ని నీకు ఇచ్చేదానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ లేదట. నిన్ను ఇన్స్ స్పెక్టర్ మోహన్.. రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ముకుందయ్యగారు.. పదే పదే అడుగుతున్నారు. మా అమ్మా నాన్న కూడా నిన్ను చూడాలని అంటున్నారు. ఇక్కడికి ఎప్పుడు వస్తావ్?" అడిగాడు భాస్కర్.
"నేను ఇప్పుడు వైజాగ్ వెళుతున్నాను. అక్కడ రెండూ మూడురోజులుండి తర్వాత వస్తాను."
"సరే!.. త్వరగా వచ్చేయ్. పెట్టేస్తున్నాను" భాస్కర్ సెల్ కట్ చేశాడు.
"చిన్నా!.. ఫోన్ చేసింది ఎవరు?"
"భాస్కర్ బాబాయ్"
"ఏం చెప్పాడు?"
భాస్కర్ తనతో చెప్పిన విషయాలను ఆది.. గోవిందరాజుకు చెప్పాడు. అన్నీ విన్న తర్వాత..
"చిన్నా!.. కిరణ్ సమస్య పరిష్కారం అయిందిగా.. నీవు కార్లో నెల్లూరికి వెళ్ళు. మేము టాక్సీలో వైజాగ్ వెళుతున్నాము. ఆ స్థలాన్ని ఇంకా నీవు ఏమేమి అక్కడ కొనాలని నిర్ణయించుకొన్నావో.. వాటికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి కొనేసెయ్యి. నీ అకౌంట్‍లో డబ్బు ఎంత వుందో చూచుకో. చాలకపోతే ఫోన్ చెయ్యి. క్రెడిట్ చేస్తాను. త్వరగా వచ్చేదానికి ప్రయత్నించు. ఆఫీస్ వ్యవహారాలు నాకంటే నీకే కదా బాగా తెలుసు. నీవు వచ్చేవరకూ నేనూ కిరణ్ చూచుకొంటాం.
వూరికి చేరగానే పురోహితులను పిలిపించి కిరణ్.. గులాబీల వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయిస్తాను. వెడ్డింగ్ కార్డులను రెడీ చేస్తాను. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా చెయ్యి చిన్నా!.. పగ ప్రతీకారం మనం నచ్చనివి. ప్రేమ సౌభ్రాతృత్వం మనం మెచ్చినవి. ఇవి నీకు తెలిసిన విషయాలే. నీవు ఆ స్థానానికి వెళుతున్నావు కాబట్టి గుర్తు చేశాను" చిరునవ్వుతో చెప్పాడు గోవిందరాజు.
"అలాగే బాబాయ్!.. కూర్చోండి. మిమ్మల్ని టాక్సీలో ఎక్కించి నేను బయలుదేరుతాను"
నలుగురూ కార్లో కూర్చున్నారు. ఆది కారును టాక్సీ స్టాండ్ వద్ద ఆపి.. క్యాప్ వ్యక్తితో మాట్లాడాడు. ఆ ముగ్గురు కార్లో కూర్చున్నారు.
"బావగారూ!.. జాగ్రత్త త్వరగా రండి" చిరునవ్వుతో చెప్పింది గులాబీ.
మగవారు ముగ్గురూ ఆనందంగా నవ్వారు. డ్రైవర్ సీట్ ప్రక్కన కూర్చున్న దివాకర్‍ను సమీపించాడు ఆది.
"సార్!.. మీరు చేసిన సహాయానికి నా ధన్యవాదాలు" వినయంగా చేతులు జోడించాడు.
"నో.. నో.. మీరు అలా చెప్పకూడదు. ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ!" వారి కారు కదిలింది.
ఆది తన కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు.
మూడు గంటల ప్రాంతంలో డి.ఐ.జి కొండలరావు వినాయకం నిలయాన్ని చేరుకొని వారిని దర్శించాడు. తాగిన మైకంతో.. జిడ్డుకారే ముఖంతో సోఫాలో కూర్చొని కునికిపాట్లు పడుతున్న వినాయకం ’సార్!’ అన్న కొండలరావు గారి పిలుపుతో ఉలిక్కిపడి కళ్ళుతెరిచాడు.
భయంతో.. కళ్ళు మూసుకొన్న నిద్ర పట్టని రంజిత్ వారి బూట్ల చప్పుడుకు కళ్ళు తెరిచాడు. లేచి నిలబడ్డాడు.
ఆ రోజు.. అయ్యగారి మెప్పును పొందేదానికి ఆ ఇరువురు వ్యక్తులపై తనూ చెయ్యి చేసుకున్నాడు. అయ్యగారికి వారు స్పాట్ పెట్టారు. తనకూ అలాంటి స్థితిని వారు కల్పిస్తారేమో అనే భయం రంజిత్ గుండెల్లో మారు మ్రోగుతూ ఉంది.
"ఆఁ.. కొండలరావ్!.. వచ్చినావా!.. మా ఆడోళ్లని ఆ డ్రైవరు కోటిగాణ్ణి ఎవరో నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసినారు. వాళ్ళు నీ మాట మీద మా పోరిని తీసుకొచ్చేదానికి.. నీవు యిచ్చిన అడ్రస్‍కు వచ్చినారు కదా!.. మా పోరి ఏమైనాది?.. మా ఆడోళ్ళు కోటిగాడు ఏమైనట్టు డి.ఐ.జీ!" విచారంగా అడిగాడు వినాయకం.
పోరీ, అని కుమార్తె విషయాన్ని వినాయకం అడగగానే.. కొండలరావు గుండె జల్లుమన్నది. ’తనకు తెలిసిన నిజాన్ని చెబితే బూతులు తిట్టి కాల్చి పారేస్తాడు. అన్యధాశరణం నాస్తి. అబద్ధం చెప్పాల్సిందే..’ అనుకున్నాడు.
"సార్!.. ఇప్పుడు గంట మూడున్నర. మీరేం.. భయపడకండి. సిటీని గాలించి వాళ్ళను తెల్లవారి పట్టుకొంటాం."
"కొండలరావూ!.. నాకు భయం లేకుండా ఎట్టా వుంటదయ్యా!.. కనబడకుండా పోయింది నా భార్య, నా కూతురు, నా డ్రైవర్. నాకు బాధగా.. అవమానంగా వుండదంటావా?" గద్ధించినట్లు అడిగాడు.
"వుండదని ఎవరైనా అంటారా సార్!"
క్షణం సేపు ఆగి..
"సార్!.. మీకు ఎవరి మీదన్నా అనుమానంగా వుందా!.." మెల్లగా అడిగాడు కొండలరావు.
"నాకుంది సార్!.." అన్నాడు రంజిత్ ఆవేశంగా.
"ఆఁ.."
"అవును సార్!.."
"ఎవరి మీద?"
వారం రోజుల క్రిందట బచేలీ నుండి తిరిగి వచ్చేటప్పుడు జరిగిన సంఘటన గురించి వివరంగా చెప్పాడు రంజిత్.
రంజిత్‍ను చూపులతోనే కాల్చి పారేసేటట్లుగా.. అతన్ని చూచాడు వినాయకం.
"సార్!.. మన వాళ్ళను మాయం చేసింది కిడ్నాపర్స్ కాదు."
"మరెవరు?" గద్దించాడు వినాయకం.
"నక్సల్స్"
"నక్సల్సా!" ఆశ్చర్యపోయాడు వినాయకం.
"అవును సార్!.. త్వరలో వారి నుండి మీకు ఫోన్ కాల్ రావచ్చు."
"నా నెంబర్ వాళ్లకి ఎట్టా తెలుస్తది?"
"అమ్మగారినడిగితే.. వారు చెబుతారు కదా సార్!"
"సార్!.. నా అనుమానం నిజమే కదా సార్!.." దీనంగా అడిగాడు రంజిత్.
"అక్షరాలా నిజం"
"ఐతే నీవు ఇప్పుడు ఏం చేస్తావ్?" కసిగా అడిగాడు వినాయకం.
"వారి వద్ద నుంచి కాల్ వచ్చేవరకూ ఏమీ చేయలేను. సార్!.. మీరు తప్పు చేశారు" విచారంగా చెప్పాడు కొండలరావు.
వినాయకం ముఖంలో కోపం.. కసి.. బాధ ముప్పిరిగా.. గోచరించాయి కొండలరావుకు.
"సార్!.. ఆవేశపడకండి. ప్రశాంతంగా కూర్చోండి. మీకు నమ్మిక వున్న దేవుని పేరును తలచుకోండి. నావారిని రక్షించు తండ్రీ అని వేడుకోండి. ఆపద సమయంలో అందరూ ఆశ్రయించేదీ.. వేడుకొనేదీ ఆ సర్వాంతర్వామినే కదా సార్!.." అనునయంగా చెప్పాడు.
"సార్!.. నాకో చిన్న సందేహం?"
"ఏమిటది?"
"సార్!.. వారి వలన అమ్మాయిగారికి, అమ్మగారికీ.. కోటన్నకు ఎలాంటి ఆపదా వుండదు కదా!" దీనంగా అడిగాడు రంజిత్.
"ఆడవారికి వారు హాని కలిగించరు."
"మరి కోటన్నకు!"
"ఏమో.. ఏం చేస్తారో చెప్పలేను. అది కోటయ్య వారితో వ్యవహరించే రీతిని బట్టి వుంటుంది."
రంజిత్‍కు.. వారు తన కుటుంబం మీద దాడి చేస్తారనే భయంతో ఒళ్ళంతా చెమట పట్టింది. కళ్ళల్లో నీళ్ళు..
అతని వాలకాన్ని చూచి కొండలరావు..
"రంజిత్!.. నీవు ఎందుకు అంతగా భయపడుతున్నావ్?"
"సార్!.. మా అయ్యగారి పుణ్యమా అని.. నాకూ ఆ సీన్లో ఓ పాత్ర వుండింది సార్!" గద్గద స్వరంతో చెప్పాడు.
"భయపడకు. వారు నిన్నేమీ చేయరు"
క్షణం తర్వాత..
"సార్!.. ఇక నేను బయలుదేరుతాను. వాళ్ళు ఫోన్ చేస్తే.. వివరాలు నాకు ఫోన్‍లో చెప్పండి. నేను ఎలా ప్రొసీడ్ కాబోతున్నాను. వారితో మాట్లాడేటప్పుడు మీరు మితంగా శాంతంగా మాట్లాడి.. వారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి. వాదన కూడదు.." అనునయంగా చెప్పాడు కొండలరావు.
వినాయకం..వెర్రివాడిలా దిగాలు పడి కొండలరావు ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.
"జై సార్!.." చెప్పి, కొండలరావు వెళ్ళిపోయాడు.
వినాయకాన్ని చూస్తూ మ్రింగలేక.. కక్కలేక తనలో అతని పట్ల వున్న కసిని దిగమ్రింగి సోఫాకు ఆనుకొని కళ్ళు మూశాడు రంజిత్. భయంతో అతని హృదయం కంపిస్తూ ఉంది.
హృదయంలోని ఆవేదనను భరించలేక వినాయకం.. సోఫాలో పడుకొని కళ్ళు మూసుకొన్నాడు.
తన బ్రతుకు పీనుగ దగ్గిర జాగారంలా మారిపోయిందని విలపించాడు రంజిత్.
క్షణం.. ఎంతో భారంగా, యుగంలా సాగిపోతూ ఉంది.. ఆ ఇరువురు వ్యక్తుల మధ్యన.
=======================================================================
ఇంకా వుంది..
జీవిత చిత్రాలు - పార్ట్ 13 త్వరలో..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentarios