top of page

జీవిత చిత్రాలు 2

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Jeevitha Chitralu - Part 2 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 12/02/2025

జీవిత చిత్రాలు - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


జరిగిన కథ:


చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య.



ఇక జీవిత చిత్రాలు ధారావాహిక రెండవ భాగం చదవండి. 


కళ్ళను మూసుకొనవచ్చును. కానీ.. మనస్సున వున్న ఆవేదనను ఎవరైనా ఎలా మరచిపోగలరు? ఆ మనస్సు ఏ విషయంలో వ్యధ చెందుతూ వుందో.. అది వ్యక్తులకు సంబంధించినదైతే, వారిని కలిసేటంత వరకు.. అది ఏదైనా కోర్కెకు సంబంధించినదైతే.. ఆ కోర్కె తీరే వరకూ.. మనస్సులోని ఆవేదన తీరదు.


పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ వూరికి తన తండ్రి రామచంద్రయ్యను, తల్లి సీతమ్మను, అక్క పార్వతి, తమ్ముడు ఆనంద్‍లను చూడాలని వచ్చాడు ఆదిత్య. తన ఇల్లు వున్న స్థలంలో శిధిలావస్థలో వున్న గోడలు కూలి.. చుట్టూ కరుతుమ్మ చెట్లుతో అరణ్యంలా వుంది.


తమ ఇంటికి ముందు వెనుక వున్న పూరి ఇళ్ళ స్థానంలో.. మిద్దెలు వున్నాయి. అతికష్టం మీద తన ఇంటి ఆనవాలును గుర్తించగలిగాడు. పదేళ్ళ ప్రాయంలో తండ్రి తనను తన్నిన కారణం.. రోషంతో అలిగి ఇల్లు విడిచి.. తన వారికందరికీ దూరంగా వెళ్ళిపోయాడు.


ప్రస్తుతంలో.. అక్కడ తనవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడున్నారో!.. ఎలా వున్నారో!.. వూహకు అందని విషయం.


తన బాల్య స్నేహితుడు భాస్కర్.. పేరును చెప్పగానే తన్ను గుర్తుపట్టడం ఆప్యాయంగా పలకరించి, అతని గదిలో తాను వుండకలిగేలా చేయడం.. తన కుటుంబ కథనంతా చెప్పడం.. అతనిలో వున్న మహోన్నత సంస్కారానికి ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే అన్నారు కాబోలు.. పెద్దలు, సృష్టిలో అన్నింటి కన్నా గొప్పది స్నేహమేనని. తొమ్మిది సంవత్సరాల వయస్సు నాటి స్నేహాన్ని ఇంతవరకూ మరువని.. ’భాస్కర్ రియల్లీ గ్రేట్’ అనుకొన్నాడు ఆదిత్య.


"సార్!.." సుధ పిలుపు.


మనస్సులోని ఆలోచన చెదిరిపోయింది. ఆదిత్య గది తలుపు వైపుకు చూచాడు. చిరునవ్వుతో నిలబడి ఉంది సుధ.


"కాఫీ.. టీ.. కావాలా!"


"వద్దండి"


"మొహమాటపడకండి. ఇది మీ ఇల్లే అనుకోండి" చిరునవ్వుతో చెప్పింది సుధ.


"యథార్థం అండీ. త్రాగాలని లేదు."


"మరీ.. స్నానం చేస్తారా!"


"చేస్తానండి."


వేగంగా గదిలోకి వచ్చి.. బాత్‍రూం తలుపు తెరిచి, గీజర్ ఆన్ చేసి మూసి వెనుతిరిగి.. "గీజర్ ఆన్ చేశాను. పది నిముషాల్లో వేన్నీళ్ళు రెడీ అవుతాయి" అంది సుధ.

ఆమె భంగిమను చూచిన.. ఆదిత్యకు నవ్వు వచ్చింది.


"సరే!.. త్రాగి, స్నానం చేస్తాను" నవ్వుతూ చెప్పాడు.


"ఐదు నిముషాల్లో వస్తాను" వేగంగా వెళ్ళిపోయింది సుధ.


యువరాణి.. జోగారావు.. తన జీవిత విధానాన్ని మార్చి.. తాను, తన వారికి దూరం అయ్యేదానికి వారిరువురూ.. కారకులు. గత జీవిత జ్ఞాపక పుటల్లో వున్నవారి పేర్లు గుర్తుకు వచ్చాయి ఆదికి.

వారు ఇప్పుడు ఎక్కడ వున్నారో!.. ఏ స్థితిలో వున్నారో!.. వారి ఆలోచనలతో కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ వుండిపోయాడు ఆదిత్య.


సుధ కాఫీ కప్పు సాసర్‍తో వచ్చింది. తన రాకను కూడా గమనించకుండా దీక్షగా శూన్యంలోకి చూస్తున్న ఆదిత్యను కొన్ని క్షణాలు పరీక్షగా చూచింది. కాఫీ చల్లారిపోతుంది అనుకొని..

"సార్! కాఫీ" అంది.


ఆదిత్య తొట్రుపాటుతో.. ఆమె ముఖంలోకి చూచాడు.

చిరునవ్వుతో సాసర్ కప్పును ఆదిత్యకు అందించింది సుధ. అదే ఆలోచనతో అందుకొన్నాడు ఆదిత్య.


"మీరు కాఫీ త్రాగేటప్పటికి వేడినీళ్ళు రెడీ అవుతాయి" చిరునవ్వుతో చెప్పింది సుధ.

క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచాడు ఆది. ఆలోచనలో పడిపోయి స్నానం సంగతి మరిచిపోతారేమో!.. అనే భావన సుధ వదనంలో ఆదికి గోచరించింది.


యువరాణి.. జోగారావులను గురించి సుధను అడగాలనుకొన్నాడు. ఆమె సమాధానం కొంతవరకూ తన ఆలోచనా భారాన్ని తగ్గించగలదని అతని ఆశ. కాఫీని సిప్ చేసి..

"ఏమండీ..!"


"చక్కెర సరిపోలేదా!" ముఖాన్ని చిట్లించి అడిగింది సుధ.


"కాఫీ.. అమృతం"


"ఆ.. చక్కెర జాస్తయిందా!" ఆశ్చర్యంతో అమాయకంగా అడిగింది.


"కాఫీ.. సూపర్. నేను అడగాలనుకొన్నదీ!.."


"అదేమిటండీ?"


"మీకు ఈ వూర్లో వుండే.. యువరాణి, ఆమె అన్న జోగారావు తెలుసా!"


"ఆ.. యువరాణి, ఇప్పుడు.. ఈ వూరి సర్పంచ్, జోగారావు పదేళ్ళ క్రిందట.. లోడ్ ట్రాక్టర్ ట్రైలర్ బోల్తాపడి చనిపోయాడు."


"వాళ్ళ అమ్మా నాన్న?"


"అమ్మ కూడా పైకి వెళ్ళిపోయి దాదాపు పదేళ్ళు కావస్తూ ఉంది. కొడుకు పోయాడనే వేదనతో ఆమె కూడా వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు.. ఎనభై ఏళ్ళ వయస్సు.. వున్నారు" చెప్పింది సుధ.


"యువరాణికి పెళ్ళి అయిందా!"


"కాలేదు. తను నాకంటే ఆరేళ్ళు పెద్ద" 


రెండు క్షణాలు ఆగి..

"అవునూ!.. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా!"


"అడగండి."


"యువరాణి వాళ్ళు మీకు ఎలా తెలుసు?"


"నాదీ.. ఈ వూరే. ఉదయం భాస్కర్ చెప్పిందీ.."


"ఓ.. అయాం సారీ!" నవ్వుతూ చెప్పి, 


క్షణం తర్వాత..

"సార్!.. వేన్నీళ్ళు.."


"రెడీ అయ్యి ఉంటాయి కదూ!"


"అవును.." అన్నట్లు తలాడించింది సుధ.


కాఫీ కప్పును టీపాయ్‍పై వుంచి.. "స్నానానికి వెళుతున్నాను" సొఫానుంచి లేచాడు ఆది.


"టవల్ సోప్.. బాత్‍రూంలో వున్నాయండి."


"థాంక్యూ" నవ్వుతూ చెప్పాడు ఆది.


సాసర్ కప్పును తీసుకొని సుధ వెళ్ళిపోయింది.

*

స్నానం చేసి.. గదిలోకి వచ్చాడు ఆది.

"సార్!.. టీపాయ్ పైన వున్న షర్టు ప్యాంటును మా అన్నయ్య మీకు ఇమ్మని ఫోన్ చేశాడు. ఏదో అర్జంటు కేసు వచ్చిందట. ఆయన రెండు గంటలకు వస్తానని చెప్పాడు" తలుపు వెనుక నుంచి సుధ చెప్పింది.


"థ్యాంక్సండి" అన్నాడు యాంత్రికంగా ఆదిత్య.


’ఓ.. ఆ కేసు ఇప్పుడే రావాలా!.. భాస్కర్‍తో మాట్లాడవలసిన విషయాలు ఎన్నో వున్నాయి. త్వరగా వస్తే బాగుంటుంది’ అనుకొన్నాడు ఆది.


ఆ డ్రస్ వేసుకొన్నాడు. తను బయలుదేరేటప్పుడు కట్టు బట్టలతో బయలుదేరాడు. తాను భాస్కర్‍ను కలవాలని.. తన వూరిని చూడాలని వచ్చాడే కాని.. భాస్కర్‍ని కలుస్తానని అతను వూహించలేదు. తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషించాడు.


వాడు వచ్చేదానికి మరో రెండు గంటలు పట్టవచ్చు. ఈలోగా వూరంతా ఒకసారి తిరిగి చూడాలని నిర్ణయించుకొన్నాడు. గది నుంచి బయటికి వచ్చాడు.


"ఏం బాబూ!.. బయటికి వెళుతున్నావా!.." హాల్లో కూర్చొని వున్న బాలమ్మ అడిగింది.


"అవునమ్మా!"


"మంచిది. జాగ్రత్తగా వెళ్ళిరా!.."


"అలాగే.."


సుధ హాల్లోకి వచ్చింది. బహుశా తన కంఠ స్వరాన్ని విని వచ్చి వుండవచ్చు. ఆమె చూపులు ఆదిత్య మీదనే వున్నాయి. గ్రహించిన ఆదిత్య..

"అలా వెళ్ళి వూరంతా ఓసారి చూచి వస్తానండి. భాస్కర్ రెండు గంటలకు కదా వచ్చేది" చిరునవ్వుతో చెప్పాడు ఆది.


’సరే.. అవును’ అన్నట్లు తలాడించింది సుధ.

ఆది తన కారును సమీపించి కూర్చొని బయలుదేరాడు.


తన చిన్న వయస్సులో గ్రావెల్ రోడ్లుగా వున్నవి ఇప్పుడు కాంక్రీటు రోడ్లుగా మారిపోయాయి. రోడ్డు ప్రక్కన విద్యుత్ స్థంబాలు, లైట్లు, కుళాయిలు, పూర్తి ఇండ్ల స్థానంలో కాంక్రీట్ మిద్దెలు.. ఎన్నో కొత్త ఇళ్ళు.. ఊరు పూర్తిగా మారిపోయింది.


ఒకటి రెండుసార్లు తిరిగి ప్రతి విషయాన్ని నిశితంగా పరీక్షించి.. చిన్ననాడు యువరాణి ఇల్లు వున్న చోట కారును రోడ్డు ప్రక్కగా ఆపాడు. కారు దిగి ప్రక్కన నిలబడ్డాడు.


ఆ స్థలంలో.. మూడు అంతస్థుల భవంతి, కాంపౌండ్ వాల్, గేటు.. కాంపౌండ్ వాల్ లోవైపున ఉత్తర, దక్షిణ దిశలో టెంకాయ చెట్లు.. తూర్పు వైపున గేటుకు ఇరువైపుల పూలచెట్లు, ఆ భవంతి పరిసరాలు ఎంతో ఆకర్షణీయంగా అందంగా చూపరులు.. నిలబడి చూచేలా వున్నాయి.


బహుశా.. ఇదే యువరాణి ఇల్లు అయి ఉంటుందని అనుకొన్నాడు ఆది.

ఇంతలో.. ఒక వ్యక్తి పరుగున ఇంట్లో నుంచి బయటికి వచ్చి గేటును తెరిచాడు.

భవంతి ముందరి కార్ పోర్టికోలో బి.ఎం.డబ్ల్యూ కారు ఉంది. ఖరీదైన కాటన్ చీర, రవిక, వాలుజడ, తల్లో మల్లెపూలు, ఒక చేతికి బంగారు గాజులు ఎడం చేతికి వాచ్ కళ్ళకు అద్దాలతో.. ఓ యువతి వరండా మెట్లు దిగి కార్లో కూర్చుంది.


డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. ఆది ప్రక్క నుంచి ముందుకు వెళ్ళిపోయింది. గేటు మూయబడింది. కారు ప్రక్కనే నిలబడి, అంతా చూచిన ఆదిత్యకు.. తాను యువరాణిని గురించి అడిగినప్పుడు సుధ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.


’అవును.. కార్లో వెళ్ళింది యువరాణియే’ అనుకొన్నాడు. కారును స్టార్ట్ చేసి తన ఇంటి స్థలం ముందు ఆపాడు. కారు దిగాడు.


తొలుత.. తన గ్రామంలో ప్రవేశించినప్పుడు రచ్చ అరుగుపై కూర్చొని.. భాస్కర్ తాతగారితో మాట్లాడుతున్న వ్యక్తి ఆదిత్యను సమీపించాడు.


"బాబూ!.. ఉదయం రచ్చ అరుగు దగ్గరకు నీవు వచ్చావు కదూ!.." ముఖాన్ని చిట్లించి కళ్ళు పెద్దవిగా చేసి ఆదిత్యను అడిగాడు.


"అవును తాతయ్యా!.."


"నీ పేరేంది బాబు"


"ఆది!.."


"మీదేవూరు!.. ఈ వూరికి ఎందుకు వచ్చావు?"


తాతయ్య ప్రశ్నలకు జవాబులు తెలిసినా.. చెప్పదలచుకోలేదు ఆదిత్య.

"భాస్కర్ నా స్నేహితుడు. వాణ్ణి చూడాలని వచ్చాను" అన్నారు.


"ఆ ఇల్లు మాదే. రా, కూర్చొని మాట్లాడుకొందాం" చెప్పాడు ఆ తాతయ్య.


"తాతయ్యా!.. మీ పేరేమిటి?" నడుస్తూ అడిగాడు ఆది.


"నా పేరు ముకుందయ్య."


ఇరువురూ వారి ఇంటిని సమీపించారు. కుర్చీని చూపుతూ..

"కూర్చో బాబు" చెప్పాడు ముకుందయ్య.


ఆది కూర్చున్నాడు. మరో కుర్చీలో ముకుందయ్య కూర్చున్నాడు ఆదికి ఎదురుగా.

"ఈరోజు ఎండ తీవ్రంగా ఉంది. చల్లగా మజ్జిగ తాగుదాం" ఆది జవాబుకు ఎదురు చూడకుండానే "పోరీ.. ఓ పోరీ!.." పిలిచాడు ముకుందయ్య.


పరుగున పదహారేళ్ళ పోరి వచ్చింది.

"ఏం తాతా!" అంది.


"నానమ్మకు చెప్పి రెండు గ్లాసుల మజ్జిగ తీసుకురా!"


"అట్టాగే" పోరి లోనికి వెళ్ళిపోయింది.


ఆది చూపులు అడవిలా వున్న తన స్థలం మీదనే వున్నాయి. ఆ స్థలం గురించి ముకుందయ్య గారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకొన్నాడు ఆది.

"తాతయ్య!.. ఆ స్థలం ఎవరిది?" అడిగాడు.


"అదా.." విచారంగా నవ్వాడు ముకుందయ్య.


క్షణం తర్వాత..

"అది మా పెదనాన్నగారిది. పెదనాన్న నా చిన్నప్పుడే పోయాడంట. మా పెద్దమ్మ.. నా తమ్ముడు అతని భార్య పిల్లలు ఒకప్పుడు వుండేవారు."


పోరి మజ్జిగ గ్లాసులతో వచ్చింది. ఆదికి ఒకటి.. ముకుందయ్యకు ఒకటి అందించి లోనికి వెళ్ళిపోయింది.


"మజ్జిగ త్రాగు బాబు కడుపులో చల్లగా వుంటది" ప్రీతిగా చెప్పాడు ముకుందయ్య.


ఆది త్రాగడం ప్రారంభించాడు. ముకుందయ్య ఒక్క వూపున తాగి గ్లాసును క్రింద పెట్టాడు.

"మీ తమ్ముడు వాళ్ళు ఈ వూరిని ఏ కారణంగా విడిచి వెళ్ళిపోయారు తాతయ్యా!.." తనకు జవాబు కావలసిన ప్రశ్న ఇది. 


తనకు వారికి వున్న బాంధవ్యాన్ని తెలుసుకొన్న ఆదిత్య.. ఎలాంటి సంకోచం లేకుండా అడిగాడు.

"బాబూ!.. ఒకప్పుడు ఈవూర్లో వున్న కుటుంబాలన్నింటిలో మా కుటుంబం వున్నతమైంది. అంటే సంపద రీత్యా కాదు. గుణగణాల్లో. అందుకే ఆ రోజుల్లో మా ఇంటిని వూరి జనం పెద్ద ఇల్లు అని పిలిచేవారు. ఆ ఇంటి వారసులైన మా నాయనా, మా చిన్నాయనా రామక్ష్మణుల్లా ఒకేమాట.. ఒకే బాటగా బ్రతికారు. వారి జీవిత కాలంలో, వూర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి వారు మా ఇంటికి వచ్చేవారు. ధర్మాధర్మాలను విచారించి మా పెదనాన్న.. న్యాయాన్ని చెప్పేవాడు. సమస్య పరిష్కారంతో వచ్చినవారు ఆనందంగా వెళ్ళిపోయేవారు.


తెల్లవాడు.. వాస్కోడిగామా ఈ దేశపు కాలకట్‍కు 1498న తొలిసారి, 1501న రెండవసారి.. కన్న నూరు వ్యాపార దృష్ట్యా మన దేశానికి వచ్చాడు. అతని తర్వాత వచ్చిన రాబర్ట్ క్లమ్.. రాజ్య కాంక్షతో మన వారిలో విభేదాలను కల్పించి.. ఒకవైపున చేరి.. యుద్ధాలు చేసి, పగ ప్రతీకారాలను పెంచి.. పరస్పర మైత్రీ భావాన్ని ధ్వంసం చేసి.. చివరకు మన పాలకులుగా మారి.. మనలను బానిసలుగా మార్చి.. సఖ్యతను సభ్యతను సమాధి చేసి, దేశాన్ని దోచుకొని.. తమ నిరంకుశ పరిపాలనను 1947 వరకూ వారి ఇష్టానుసారంగా సాగించారు.


ఆ సిద్ధాంతాలను బాగా జీర్ణించుకొన్న ఒక కుటుంబం పడమటి ఏదో పల్లె నుంచి ఈ వూరికి వచ్చి.. భూమి ఇల్లు వాకిలీ ఏర్పరచుకొన్నారు.


కాలక్రమేణా.. వారూ ఈ గ్రామ ప్రజల్లో కొంత పరపతిని సంపాదించుకొన్నారు. వారు ఇరువురు అన్నదమ్ములు, వారి కుటుంబం. 


వూరంతా ఎంతగానో అభిమానించి.. గౌరవించే మా కుటుంబం పట్ల వారికి ద్వేషం. చిన్నచూపు. మాయ మాటలతో పల్లె ప్రజల మనస్సులను మార్చి వూరి జనాన్ని రెండు వర్గాలుగా చేశారు. ఆ ఎత్తి వచ్చిన అన్నదమ్ములు.


తల్లిదండ్రుల ప్రభావం.. వారి సంతతి మీద తప్పకుండా వుంటుంది బాబు. వారు మంచివారైతే.. వారి వారసులూ మంచి వారవుతారు. అందుకే.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా!.. అనే మంచి మన తెలుగు భాష సామెత. వినే వుంటావ్.


పంచాయితీ ఎలక్షన్‍లో ఆ ఇంటికి ఈ ఇంటికీ పోటీ. ఒకసారి వారిది గెలుపు. ఒకసారి మాది గెలుపు. ఇలాగే గడిచిన ముఫ్ఫై అయిదు సంవత్సరాలుగా సాగుతూ ఉంది.


ఇరవై సంవత్సరాల క్రింద జరిగిన రెండు దుర్ఘటనల కారణంగా మా పెదనన్న కొడుకు మా అన్నయ్య రామచంద్రయ్య.. భార్యా పిల్లలతో ఈ వూరి వదిలి ఎటో వెళ్ళిపోయాడు. 


అందులో మొదటిది.. మా తమ్ముడు నారాయణయ్యను ఆపోజిట్ పార్టీ వారు.. ఆ సంవత్సరం మా తమ్ముడు.. గెలిచాడనే ఆగ్రహావేశాలతో వాణ్ణి దారుణంగా హత్య చేయించారు.


తమ్ముడు నారాయణయ్య ఆకాల మరణం మా కుటుంబాన్ని ఎంతో వేదనకు గురిచేసింది. ఆ బాధ నుండి మా అన్నయ్య తేరుకోక మునుపే.. మా అన్నయ్య ముద్దుల కొడుకు పదేళ్ళవాడు.. ఆదిత్య మీద దొంగతనాన్ని అంటగట్టారు.


ఆ వర్గానికి చెందిన పిల్ల యువరాణి, ఆమె, మావాడు దాదాపు ఒక వయస్సు వాళ్ళే. ఒకే స్కూల్లో చదివేవారు.


మా రెండు కుటుంబాల మధ్య వున్న విరోధ భావం ఆ చిన్నపిల్లకూ వుండేది. ఆ కారణంగా ఆ యువరాణి.. ఆదిత్య తన మూడు సవర్ల గొలుసును దొంగిలించాడని టీచర్‍కు చెప్పింది.

టీచర్ ఆదిత్యను నిలదీశాడు. బెదిరించాడు.. నిజం చెప్పమని.


ఏ పాపమూ చేయని ఆదిత్య.. నేను దొంగ కాదు, నేను ఆ గొలుసును దొంగిలించలేదని నిర్భయంగా చెప్పాడు.


ఆ విషయం మా అన్నయ్య రామచంద్రయ్యకు.. యువరాణీ తండ్రి మన్మధరావుకు తెలిసింది. ఇరువురూ ఏకమై ఆదిత్యను వేధించారు.


ఆవేశంతో.. మా అన్నయ్య ’నిజం చెప్పరా’ అని చావబాదారు. యువరాణి.. ’ఆదిత్య దొంగ దొంగా’ అని రెచ్చిపోయింది.


గొలుసు ఖరీదు మా అన్నయ్య మన్మధరావుకు వారు కోరిన విధంగా చెల్లించారు.

చావుదెబ్బలు తిన్న ఆదిత్య ఏడ్చి ఏడ్చి.. మూర్ఛపోయాడు. ఆ చిన్నవాడి మనస్సు.. తన మాటను ఎవరూ నమ్మనందుకు ఎంతగానో ఘోషించింది.


అర్థరాత్రి వేళ అందరూ నిదురించే సమయాన ఇల్లు విడిచి పారిపోయాడు.

ఒకవైపు.. తమ్ముని మరణం.. మరోవైపు తనయుడు దొంగ అన్న అపకీర్తి.. వాడు ఇంటిని విడిచిపోవడం.. కారణంగా మా అన్నా వదినలు ఎంతగానో బాధపడ్డారు. 


నేను అప్పట్లో ప్రకాశం జిల్లాలో హెడ్ మాస్టరుగా పనిచేస్తూ వుండేవాణ్ణి. విషయాన్ని విని ఇక్కడికి వచ్చి అన్నా వదినలను ఓదార్చాను.


స్కూలు బావిలో పూడిక తీస్తుండగా ఆ గొలుసు దొరికింది. హెడ్ మాస్టర్ గారు దాన్ని మా అన్నయ్యగారికి యిచ్చారు.


ఆ గొలుసు తీసుకొని మా అన్నయ్య మన్మధరావు ఇంటికి వెళ్ళి అతని ముఖాన విసిరి వచ్చారు.

ఆ తర్వాత తెలిసింది గొలుసును కావాలనే యువరాణి వాళ్ళ అన్నయ్య జోగారావు చెప్పినట్లుగా.. స్కూలు బావిలో పడేసి.. దొంగతనాన్ని ఆదిత్యకు, ఆ అన్నా చెల్లెళ్ళు అంట గట్టారని.


సారాయి దుకాణం దగ్గర మందు కొడుతూ వాళ్ళ పాలేరు మైకంతో వాగిన ఈ విషయాన్ని విన్న మా పాలేరు.. మాకు ఆ విషయాన్ని చెప్పాడు.


యధార్థాన్ని తెలుసుకొన్న అన్నయ్య ఆదిత్యను తలుచుకొని కుమిలిపోయారు. ఊరు విడిచి పోవడానికి నిర్ణయించు కొన్నారు.

పొలాన్ని ఇంటిని అమ్మేశారు. మన్మధరావు.. తన బావమరిది మాణిక్యాల రావు పేరున వాటిని కొన్నాడు. 


మా అన్నయ్య రామచంద్రయ్య.. వదిన సీతమ్మ కూతురు పార్వతి.. చిన్న కొడుకు ఆనంద్‍లతో కలిసి ఈ వూరును వదలి ఎటో వెళ్ళిపోయారు. కనీసం నాతో కూడా ఒక్కమాట చెప్పకుండా. ఇది జరిగి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలైంది.


నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఉద్యోగంలో వుండగానే వారికి వివాహం.. ’గంతకు తగిన బొంత’.. అనే రీతిలో నాకు నచ్చిన కుటుంబాలకు నా కూతుళ్ళను కోడళ్ళుగా చేశాను.


పదేళ్ళ క్రిందట రిటైర్ అయ్యి ఈ వూరికి వచ్చి ఈ ఇల్లు కట్టుకొని.. నేను నా భార్య సావిత్రి వుంటున్నాము. మనకు మజ్జిగ ఇచ్చిందే పోరి.. పున్నమ్మ నా పెద్ద కూతురు వనజ బిడ్డ. మాకు తోడుగా మా వద్దనే వుంటూ తొమ్మిదవ తరగతి చదువుతూ ఉంది. ఆమెకు ఒక తమ్ముడు. దీపక్ పన్నెండేళ్ళు. ఏడవ తరగతి చదువుతున్నాడు. నా చిన్న కూతురి పేరు పద్మజ. ఆమెకు ఒక్కడే కొడుకు దీపక్ వయస్సువాడు. వాడూ ఏడవ తరగతి చదువుతున్నాడు.


అమ్మాయిలిద్దరూ హైస్కూలు టీచర్లు. పెద్దల్లుడు.. రెవెన్యూ డిపార్టుమెంటులో ఆఫీస్ సూపరిండెంట్. చిన్న అల్లుడు ఆర్.అండ్.బిలో ఎ.ఇ గా పనిచేస్తున్నాడు. బాబూ!.. చాలాసేపు మాట్లాడి నీకు అనవసరమైన విషయాలను చెప్పి.. నిన్ను విసిగించాననుకొంటున్నాను" చెప్పడం ఆపి చిరునవ్వుతో ఆదిత్య ముఖంలోకి చూచాడు ముకుందయ్య.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


42 views0 comments

留言


bottom of page