top of page

జీవిత చిత్రాలు - 3

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

jeevitha-chitralu-part-3-telugu-web-series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 19/02/2025

జీవిత చిత్రాలు - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య.

యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం వూరు వదిలి వెళ్లిపోయినట్లు తెలుసుకుంటాడు.


ఇక జీవిత చిత్రాలు ధారావాహిక మూడవ భాగం చదవండి.


ఆదిత్య.. ముకుందయ్య తన చిన్నాన్నగారు.. చెప్పిన తనకు తెలిసీ.. తెలియని తన కుటుంబ కథను వినేకొద్దీ.. మనస్సులో కలిగిన ఎంతో బాధను.. ఆవేదనను అణచుకొని శిలా ప్రతిమలా కుర్చీలో.. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని కూర్చున్నాడు. ముకుందయ్య చెప్పడం ఆపి తన ముఖంలోకి చూచేసరికి.. అతనికి కంట్రోల్ తప్పింది. నయనాలు ఆశ్రుపూరితాలైనాయి. నోట్లో నుండి మాట పెగల్లేదు. రెండు చేతులతో ముఖాన్ని దాచుకొన్నాడు. భోరున ఏడ్చాడు.

అతనిలో కలిగిన భావావేశానికి ముకుందయ్య ఆశ్చర్యపోయాడు.


"ఎందుకు బాబు ఏడుస్తున్నావ్!" ఆశ్చర్యంతో అడిగాడు ముకుందయ్య.


తనకు ముకుందయ్య గారికి వున్న బాంధవ్యం తెలియగానే తానెవరో వారికి చెప్పాలనిపించింది ఆదిత్యకు. కానీ.. సాహసించలేకపోయాడు. కారణం.. రిటైర్ అయ్యి గతాన్నంతా మరిచి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న తన చిన్నాన్నగారికి.. తనే ఆదిత్యనని చెప్పి.. వేదనని కలిగించదలుచుకోలేదు.


ఆ గ్రామానికి తాను వచ్చిన కారణాలు రెండు. మొదటిది.. తన తల్లిదండ్రుల వివరాలను తెలుసుకోవడం.. రెండవది యువరాణిని చూచి ఆమె నేడు వున్న స్థాయిని తెలుసుకోవడం.. తన రెండవ కోర్కె తీరింది. మొదటి కోర్కె.. ఇప్పట్లో తీరేలా అనిపించలేదు. తాను ప్రయత్నించి తన వారు ఎక్కడ వున్నదీ తెలుసుకోవాలి. ఆ కోర్కె.. తీరేవరకూ.. తాను ఎవరన్న విషయాన్ని భాస్కర్‍కు తప్ప వేరెవరికీ చెప్పకూడదనుకున్నాడు ఆదిత్య.


"నేను మిమ్మల్ని బాబాయ్ అని పిలవచ్చా!" కన్నీటిని తుడుచుకొని మెల్లగా అడిగాడు ఆది.


"హుఁ.. మగపిల్లలు లేని నన్ను నీవు అలా పిలుస్తానంటే.. నేను ఎలా కాదనగలను బాబూ!.. సంతోషంగా పిలువు. ఆ పిలుపు నాకూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మా అన్నయ్య పిల్లలూ ఇక్కడ వుంటే వారు నన్ను అలాగే పిలిచేవారు కదా!" చిరునవ్వుతో చెప్పాడు ముకుందయ్య.


"బాబాయ్ గారూ!.. మీరు చెప్పిన కథను విని నాకు చాలా బాధ కలిగింది. అందుకే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను" గద్గద స్వరంతో చెప్పాడు ఆది.


"అవును బాబూ!.. నీవు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పనేలేదు!"


"నాది విశాఖపట్నం. ఐదేళ్ళు అమెరికాలో ఇంజనీర్‍గా పనిచేశాను. నెలరోజుల క్రిందట ఇండియా వచ్చాను. మంచినేని భాస్కర్.. ఈ ఊరి డాక్టర్ నా మిత్రుడు. వాడిని చూడాలని వచ్చాను. నా పేరు ఆది" సవినయంగా చెప్పాడు.


"పేరు.. ఆది కదూ!.."


"అవును"


"మంచిపేరు"


"హుఁ.." విరక్తిగా నవ్వాడు ఆది. 


క్షణం తర్వాత..

"బాబాయ్ గారూ!.. ఆ స్థలం నాకు కావాలి"


"ఏ స్థలం?" ఆశ్చర్యంతో అడిగాడూ ముకుందయ్య.


"మీ అన్నయ్యగారి స్థలం. ఎంతైనా సరే దాన్ని నేను కొంటాను."


"ఆ స్థలానికి మంచిపేరు లేదు బాబూ!" సాలోచనగా చెప్పాడు ముకుందయ్య.


"అంటే!.."


"చనిపోయిన మా తమ్ముడు నారాయణయ్య ఆత్మ అక్కడే సంచరిస్తూ వున్నదనే పేరు పడ్డది."


"ప్రస్తుతం ఆ స్థలం ఎవరి స్వాధీనంలో వుంది బాబాయ్ గారూ!.."


"యువరాణి మేనమామ మాణిక్యాలరావు పేరున ఉంది. యధార్థంగా ఆ స్థలాన్ని వారు కొన్న తర్వాత మా పాత ఇంటిని పగల కొట్టారు. ఆ పని జరిగే రోజుల్లో ఒకనాడు మాణిక్యాల రావు స్థలంలో ప్రవేశించాడట. వాడికి.. వీపుపైన ఎవరో బలంగా కొట్టినట్లు అనిపించిందట. వాడు తెప్పరిల్లుకొని అటూ ఇటూ చూస్తే.. దూరాన గోడలను కూలదోస్తున్న పనివాళ్ళు తప్ప.. అతనికి దగ్గరలో ఎవరూ లేరట. పనివాళ్ళకు ఏదో చెప్పి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు.


ఆ రాత్రి.. వాడు పడకపై శయనించిన తర్వాత.. నా తమ్ముడు నారాయణయ్య వాడి గుండెలపై కూర్చొని.. తన చేతులతో వాడి గొంతు పట్టుకొని చంపబోయాడట. వాడు గావుకేకలు వేయగా ఇంట్లో వున్నవారు వాడిని సమీపించారట. వాడు భయాందోళనలతో.. నారాయణ.. నారాయణ.. నా గుండెలపై కూర్చొని నన్ను గొంతు పిసికి చంపబోయాడు. నారాయణ దయ్యం అయ్యాడు. నారాయణ దయ్యం అయ్యాడని పిచ్చిగా అరిచాడట.


వాడి తల్లిదండ్రులు, అయినవాళ్ళు అతని చేష్టలను చూచి ఎంతగానో భయపడ్డారట.

భూతవైద్యుడు దయ్యాల దానయ్యను పిలిపించి మాణిక్యాల రావును చూపించారట.

దానయ్య.. నారాయణ దయ్యం అయినాడని.. మాణిక్యాలరావును పట్టి వేధిస్తున్నాడని.. భూతవైద్యం చేసి.. నారాణయ్య ఆత్మను సీసాలో బంధించి.. భూస్థాపితం చేయాలని.. కార్యక్రమంలో దిగిన తర్వాత పని పూర్తయ్యే దానికి ఒకటి.. రెండు రోజులు పడుతుందని.. దాదాపు పాతికవేలు ఖర్చు అవుతుందని వారికి తెలియజేశాడట.


అతని మాటలను నమ్మి.. మాణిక్యాలరావు క్షేమం కోసం, అతని తల్లిదండ్రులు దయ్యాల దానయ్యతో.. వెంటనే పూజను ప్రారంభించమని కోరారట.


పదిహేను వేలు అడ్వాన్సు తీసుకొని దానయ్య వెళ్ళిపోయాడట. మరుదినం సాయంత్రం నాలుగు గంటలకు తన శిష్యుని తోడుగా తీసుకొని దానయ్య వారి ఇంటికి వచ్చాడట.


నట్టింట.. అష్టముఖాల ముగ్గును చిత్రించి, ఎనిమిది మూలలా నిమ్మకాయలు.. కోడిగుడ్లు.. టెంకాయలు క్రమంగా అమర్చి.. మధ్యన మూతలేని సీసాను వుంచి.. రాత్రి పన్నెండు గంటల సమయంలో మాణిక్యాలరావును తీసుకొని వచ్చి.. ఆ ముగ్గుకు ముందు కూర్చోబెట్టి.. క్షుద్ర మంత్రాలను చదివి నిమ్మకాయలను, టెంకాయలను, కోడిగ్రుడ్లను పగులకొట్టి.. గుగ్గిలం పొగను ఆ గదినిండా నింపి.. తన చేతిలోని కుంకుమ విభూతులను ముత్యాలరావు మీదకు చల్లాడట, వాడు స్పృహ లేకుండా పడిపోయాడట. దయ్యాన్ని సీసాలో బంధించానని, ఇక ఎలాంటి భయం లేదని.. మిగతా పదివేలు తీసుకొని సీసాతో.. శిష్యునితో వెళ్ళిపోయాడట.


అది జరిగిన వారంరోజులకు వాడి శవం.. ఆ స్థలంలో ఈశాన్య మూలాన వున్న బావిలో కనబడింది. దయ్యాల దానయ్య పూజ ఫలించలేదని నారాయణ దయ్యమై వాణ్ణి బావిలో త్రోసి చంపేశాడని వూరి జనం అనుకొన్నారు. యధార్థంగా నా తమ్ముడు నారాయణయ్య చావుకు మూల కారణం ఆ మాణిక్యాల రావు అన్న విషయం వాడి చావు తర్వాత.. అందరికీ తెలిసిన నిజం" విచారంగా చెప్పాడు ముకుందయ్య.


"బాబాయ్!.. నారాయణ బాబాయి గారి హత్య విషయంలో మీరు కేసు పెట్టలేదా!"


"ఎవరి పాపాన వాళ్ళు పోతారు. కేసు.. కోర్టు.. వ్యవహారం.. ఇవి మనకు అశాంతిని.. ధన వ్యయాన్ని కలిగిస్తాయే కాని.. పోయిన మన తమ్ముణ్ణి మనకు తెచ్చి ఇవ్వబోవురా. వద్దు. అని మా అన్నయ్య రామచంద్రయ్య చెప్పాడు. అలాంటి ప్రయత్నాలేవీ జరుగలేదు బాబు" నిట్టూర్చి చెప్పాడు ముకుందయ్య.


"బాబాయ్!.. దయ్యాలు పిశాచాలు.. వీటి మీద మీకు నమ్మకం వుందా!"


"కోర్కెలు తీరని కొన్ని ఆత్మలు.. అలా పరిభ్రమిస్తూ తమ చావుకు కారణమైన వారిని వేధిస్తాయని పెద్దలు చెప్పేమాట. అనుభవానికి వచ్చిన వారికే నిజానిజాలు తెలుస్తాయి" చిరునవ్వుతో చెప్పాడు ముకుందయ్య.


"ఏది ఏమైనా.. నాకు ఆ స్థలం కావాలి బాబాయ్. మీరు నాకోసం ప్రయత్నించి, మనం త్వరలో కొనేలా చూడండి. ప్లీజ్" అభ్యర్థనా పూర్వకంగా చెప్పాడు ఆది.


"ఎంతో కాలం అయినా.. ఆ వ్యక్తుల్లో మార్పు లేదు బాబు. వయస్సు మీరినా యువరాణి తండ్రి గోవిందయ్య.. ముత్యాలరావు తండ్రి భుజంగయ్య తత్వాల్లో మార్పు లేదు బాబు.


ఆ స్థలం విషయం ఎవరైనా.. మూడవ మనిషి భుజంగయ్యతో మాట్లాడాలి. యువరాణి మాట్లాడగలదు. కానీ.. ఆమెతో నీ తరుపున మాట్లాడగల వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నాను" సాలోచనగా చెప్పాడు ముకుందయ్య.


"బాబాయ్!.. నేనే నేరుగా యువరాణితో మాట్లాడితే!" ప్రశ్నార్థకంగా చూచాడు ఆది ముకుందయ్యవైపు.

ముకుందయ్య క్షణం సేపు ఆదిత్య ముఖంలోకి చూచి సాలోచనగా తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

"అవును బాబు!.. నీ విషయాన్ని.. నీవే ఆమెతో మాట్లాడటం మంచిది."


"బాబాయ్!.. యువరాణికి జనంలో ఎలాంటి పేరు వుంది?"


"ఏ మాటకామాట చెప్పుకోవాలి. జనంలో ఆమెకు చాలా మంచిపేరు వుంది బాబూ!.. అవునూ!.. ఆమెను నీవు ఇంతవరకూ చూడలేదుగా!" తన సందేహాన్ని వ్యక్తం చేశాడు ముకుందయ్య.


"చూచాను బాబాయ్!.."


"ఎప్పుడు?"


"నేను ఇక్కడికి వస్తూ, వారి ఇంటి ముందు ఆగి.. ఆమె కార్లో వెళుతుంటే చూచాను. సరే బాబాయ్!.. ఇంక నేను బయలుదేరుతాను. భాస్కర్‍తో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాను. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. నమస్తే" కుర్చీ నుంచి లేచాడు. 


ఇరువురూ ఆది కారును సమీపించారు.

ఆది.. కార్లో కూర్చున్నాడు. భాస్కర్ ఇంటి వైపుకు త్రిప్పాడు.

*

భాస్కర్.. వరండాలో కూర్చొని ఆదిత్య రాకకోసం ఎదురు చూస్తున్నాడు.

ఆదిత్యా కారును పార్క్ చేసి వేగంగా భాస్కర్‍ను సమీపించాడు. 

"సారీ భాస్కర్!.. నాకోసం వెయిట్ చేస్తున్నావు కదూ!.."


అవునన్నట్లు భాస్కర్ తలాడించాడు చిరునవ్వుతో.

"భోం చేశావా!" అడిగాడు ఆది.


"లేదు, పద భోం చేద్దాం" చెప్పాడు భాస్కర్.


వాకిట్లో నిలబడి వారి సంభాషణను విన్న సుధ డైనింగ్ హాలు వైపుకు వెళ్ళింది.

ఇరువురూ.. డైనింగ్ హాల్లో ప్రవేశించారు. సుధ భోజనం వడ్డించింది.

తింటూ అడిగాడు భాస్కర్.

"ఇంతసేపు ఎక్కడ తిరిగావు?"


"ముకుందయ్య గారిని కలిశాను" చెప్పాడు ఆది.


"ఏ ఆలోచనా పెట్టుకోకుండా స్థిమితంగా భోంచెయ్యి" నవ్వుతూ చెప్పాడు భాస్కర్.


"అలాగే" అన్నట్లు తలాడించాడు ఆదిత్య నవ్వుతూ.


అతని వాలకాన్ని చూచిన సుధ ముఖంలో చిరునవ్వు క్రీకంట అతని ముఖంలోకి చూచింది. ఆది చూపులు.. ఆమె చూపులతో కలిశాయి.

"కాస్త వంకాయ కూర వేయనా!" మెల్లగా అడిగింది.


"అడుగుతావేంది సుధా!.. వెయ్యి. వాడు మొహమాట పడుతున్నాడు."


వెంటనే.. సుధ, యిరువురికీ కూర వడ్డించింది.

ఏ విషయాన్ని గురించి ముకుందయ్య గారితో మాట్లాడావు?"


"భోంచేసి అన్నీ వివరంగా చెబుతాను" అన్నాడు ఆది.


"సరే.. అమ్మా!.. పెరుగు" అడిగాడు భాస్కర్.


సుధ.. ఇరువురికీ పెరుగు వడ్డించింది. మిత్రులు ఇరువురూ.. తృప్తిగా భోంచేశారు. భాస్కర్ గదికి వెళ్ళిపోయారు.

"భాస్కర్!.. హాస్పిటల్‍కు వెళ్ళాలా!" అడిగాడు ఆది.


"నీ కథ వినాలిగా.. వెళ్ళను"


ఇరువురూ సోఫాలో కూర్చున్నారు.

"చెప్పరా!.. ఈ పద్దెనిమిదేళ్ళు.. ఎక్కడ వున్నావు?.. ఏం చేశావు?.. ఇప్పటి నీ పరిస్థితి ఏమిటి?" అడిగాడు భాస్కర్.


ఆది.. నిట్టూర్చి చెప్పడం ప్రారంభించాడు.


"పదేళ్ళ ప్రాయంలో.. నేను అమ్మ నాన్న.. అక్కయ్య తమ్ముళ్ళను.. యువరాణి, ఆమె అన్న జోగారావు, తండ్రి మన్మధరావులు.. నాపై మోపిన ’దొంగ’ అనే కళంకాన్ని.. నాన్నగారు ఆవేశంతో నన్ను శిక్షించిన విధానాన్ని భరించలేక.. అవమానంతో రోషంతో.. ఏడుస్తూ అర్థరాత్రి వేళ ఇంటినుంచి బయటికి వచ్చాను.


బస్టాండు దగ్గర లారీని ఆపి డ్రైవర్ క్లీనర్ టీ త్రాగుతున్నారు. వారిని సమీపించాను.

"ఈ లారీ ఎక్కడికి వెళుతుంది సార్!" అడిగాను.


"విశాఖపట్నం" చెప్పాడు క్లీనర్.


"నన్ను మీతో తీసుకెళతారా!"


"ఎక్కడికి?"


"విశాఖపట్నం"


"మీదేవూరు?" అడిగాడు డ్రైవర్.


"మాది ఈవూరు కాదు. పనికోసం వచ్చాను. దొరకలేదు. మీరు ఏ పని చెప్పినా చేస్తాను సార్."


"అయితే మారో విశాఖ వస్తావా!"


"వస్తాను సార్."


డ్రైవర్ నన్ను పరీక్షగా చూచాడు.


"ఏరా!.. తీసుకెళదామా!" క్లీనర్‍ని అడిగాడు.


"పాపం.. కష్టాల్లో వున్నట్టున్నాడు. సాయం చేద్దాం అన్నా!" చెప్పాడు క్లీనర్.


"సరే పద.."


వారితో.. ఆ లారీలో విశాఖపట్నం వెళ్ళాను. వారు.. నన్ను వారి యజమాని గోవిందరాజులుకు పరిచయం చేశారు.


వారికి ఇరవై లారీలు వున్నాయి. నన్ను వారు.. వారి షెడ్‍లో వదిలారు. పనిని నేర్చుకోమని చెప్పారు. మెకానిక్స్ కు సాయంగా పనిచేసేవాణ్ణి.


షెడ్‍లో పనిచేసే వారందరికీ.. గోవిందరాజుల గారి ఇంటినుంచే భోజనం వచ్చేది. రెండు జతల ఖాకీ బట్టలు తీసి ఇచ్చారు. ఖర్చులకు రోజుకు రెండు రూపాయలు ఇచ్చేవారు. తిండి ఫ్రీ అయినందున ఆ డబ్బును జాగ్రత్తగా పెట్టుకొనేవాణ్ణి.


ఇలా.. రెండు నెలలు గడిచాయి. నా దగ్గర అరవై రూపాయలు చేరాయి.


ఆ రోజు వాళ్ళ అబ్బాయి కిరణ్ పుట్టినరోజు. సాయంత్రం షెడ్‍లో పనిచేసే వారందరినీ ఇంటి భోజనానికి రమ్మని.. గోవిందరాజులు చెప్పారు. ఆ పెద్దలందరితో కలిసి గోవింద రాజుల గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళే దారిలో పది రూపాయలకు ఒక పెన్ కొన్నాను.


వారి బంధు మిత్రులు చాలామంది వచ్చారు. కిరణ్‍ని ఆశీర్వదించారు. విలువైన కానుకలను యిచ్చారు.


షెడ్‍లోని పెద్దలందరూ కలిసి చందా వేసుకొని కిరణ్‍కు ఒక సైకిల్ కానుకగా ఇచ్చారు. అందరూ ఇచ్చాక చివరగా నేను కిరణ్‍ను సమీపించి నేను కొన్న పెన్‍ను అతని చేతికి అందించాను.

అంతకు ముందు.. వాళ్ళ నాన్నగారితో రెండుసార్లు కిరణ్ మా షెడ్‍కు వచ్చాడు. అప్పుడు నన్ను చూచాడు. కిరణ్‍ నేను ఇచ్చిన పెన్‍ను ఆనందంగా స్వీకరించాడు.


"దీన్ని నేను చేతపట్టుకొన్నప్పుడల్లా నీవు నాకు గుర్తుకు వస్తావు. తీరిక సమయాల్లో ఇంటికి రా.. కలిసి ఆడుకొందాం" అన్నాడు.


ప్రక్కనే వున్న గోవిందరాజులు గారు..

"అవున్రా.. చిన్నా!.. కిరణ్ చెప్పినట్లు చెయ్యి" నవ్వుతూ చెప్పారు.


అది మొదలు.. తీరిక సమయాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి. కిరణ్ నేను కలిసి ఆడుకొనేవాళ్ళం. వాడు వయస్సులో ఎనిమిదేళ్ళవాడు.


కొంతసేపు ఆడుకొని తర్వాత చదవడం ప్రారంభించేవాడు. వాడితో పాటు నేను ప్రక్కన కూర్చునే వాణ్ణి. వాడికి హోంవర్క్ చేయడంలో సాయం చేసేవాణ్ణి. నా సలహాలు కిరణ్‍కు బాగా నచ్చేవి.

నా మాటలను శ్రద్ధగా వినేవాడు. నన్ను ఎంతగానో అభిమానించేవాడు. ఒకరోజు చదువుకొనే సమయంలో..

"చిన్నా!.. నీవు ఎందుకు చదువు మానేశావ్?" అడిగాడు కిరణ్.


"నేను చాల పేదవాణ్ణి. అమ్మా నాన్నలు నా దగ్గర లేరుగా నన్ను ఎవరు చదివిస్తారు!"


"నీకు చదువుకోవాలని వుందా!"


"వుంది.. కానీ.. అది ఎలా కుదురుతుంది. షెడ్‍లో పనిచేయకపోయే నా కడుపు నిండదుగా!"


"నేను మా నాన్నగారితో మాట్లాడుతాను."


"ఏమని!"


"నిన్ను చదివించమని.."


"వద్దు కిరణ్. అది జరగని పని" విచారంగా చెప్పాడు.


"నా మాటను.. మా నాన్న అమ్మ గారు కాదనరు"


కిరణ్ తల్లి శాంతి.. మా సంభాషణనంతా విన్నది. మమ్మల్ని సమీపించింది.

కిరణ్ నేను చెప్పిన ప్రకారం వ్రాసి హోం వర్క్ ముగించాడు.

మా ఇరువురి వైపు శాంతమ్మ ఎంతో ప్రీతిగా చూచింది.

"చిన్నా!.."


లేచి నిలబడి.. "చెప్పండి అమ్మగారూ!" అన్నాను.


ఆమె నా చేతిని తన చేతిలోనికి తీసుకొని నా ముఖంలోకి చూస్తూ..

"నీకు చదువుకోవాలని వుందా!" లాలనగా అడిగింది.


అవునన్నట్లు తలాడించాను.


"నాన్నకు చెప్పి.. చిన్నాని స్కూల్లో చేర్పించమ్మా ఇద్దరం కలిసి బాగా చదువుకొంటాం" అది కిరణ్ అభ్యర్థన.


ఆ తల్లి.. "అలాగే.." చెప్పి లోనికి వెళ్ళిపోయింది.


షెడ్‍లో.. రాత్రి సమయంలో నేను నాకు తోడుగా వాచ్‍మెన్ తిరుపాలు ఒకేచోట పడుకునేవాళ్ళం.

ఒక్కోరోజు, అమ్మా.. నాన్న.. అక్కా.. తమ్ముడు గుర్తుకు వచ్చేవారు. మనస్సు నిండా బాధ. కళ్ళల్లో కన్నీరు. ఏడ్చి ఏడ్చి కలత నిద్రపోయేవాడిని.


బాగ కష్టపడాలి. ప్రయోజకుడిని కావాలి. డబ్బును సంపాదించాలి. నేను దొంగను కాదు దొరను అని పేరు సంపాదించాలి. అందరూ నన్ను చూచి మెచ్చుకోవాలి.


ఆ స్థితికి ఎదిగి ఆ లక్ష్యాన్ని సాధించాలంటే.. చదువుకోవాలి. పెద్ద చదువులు చదవాలి. మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి. అందరినీ అభిమానించాలి. ప్రేమించాలి. గొప్పవాణ్ణి కావాలి. అంతవరకూ వూరికి వెళ్ళకూడదు. నేను వూరికి వెళ్ళేనాటికి.. నన్ను చూచిన నావారు.. ఇతరులందరూ ఆశ్చర్యపోవాలి. ఎంతకాలమైనా సరే.. పోరాడి విజయాన్ని సాధించాలని నిర్ణయించుకొన్నాను.


ఆ మరుదినం.. గోవిందరాజులు గారు మా షెడ్‍కు వచ్చారు. అంతా తిరిగి చూచారు. లారీలకు జరిగే రిపేర్లను గురించి అడిగి త్వరగా పూర్తి చేయండని చెప్పారు.


కారును సమీపించి నన్ను పిలిచారు. నేను పరుగున వారిని సమీపించాను.


"చిన్నా!.. సాయంత్రం ఇంటికి వచ్చేసెయ్యి. కిరణ్‍తో పాటు.. నీవూ రేపటి నుంచి స్కూలుకు వెళ్ళి చదువుకొందువు గాని. నీకు చదువుకోవాలని వుంది కదూ!.." నవ్వుతూ నా ముఖంలోకి చూచారు.


అవునన్నట్లు సంతోషంతో తల ఎగరేశాను.

వారు నవ్వుతూ కార్లో కూర్చొని వెళ్ళిపోయారు.


ఆ క్షణంలో.. నాలోని ఆనందానికి అవధులు లేవు. దేవుడు నా కోర్కెను మన్నించాడని అనుకొన్నాను. మరుసటి రోజు నుంచి జీవితం.. నేను కోరుకునే రీతిలో సాగబోతున్నందుకు ఎంతగానో సంతోషించాను.


వారికి వున్న పరపతితో.. నాకు కావలసిన బర్త్ సర్టిఫికేట్ చిన్నారావు అనే పేర తయారు చేయించి నను కిరణ్ చదివే స్కూల్లో ఆరవ తరగతిలో జాయిన్ చేశారు. కారణం నేనూ.. కిరణ్ ఒకే క్లాసు.

నన్ను.. తమ సొంత బిడ్డలా గోవిందరాజు గారు వారి ఇల్లాలు శాంతమ్మ గారూ చూచుకొనేవారు. కిరణ్‍కు.. నాకు మధ్యన మంచి స్నేహభావం.. ఆదరాభిమానాలు ఏర్పడ్డాయి.


రెండు సంవత్సరాలు.. ఎంతో ఆనందంగా సాగిపోయాయి. ఆ సంవత్సరం.. ఇరువురం ఎనిమిదవ తరగతిలో ప్రవేశించాము.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


 
 
 

Comments


bottom of page