top of page

జీవిత చిత్రాలు - 4

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #జీవితచిత్రాలు, #JeevithaChitralu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Jeevitha Chitralu - Part - 4 - Telugu Web Series - Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 25/02/2025

జీవిత చిత్రాలు - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్లి, బాల్య స్నేహితుడు భాస్కర్ ను కలుస్తాడు. మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య.


యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లి పోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం వూరు వదిలి వెళ్లిపోయినట్లు తెలుసుకుంటాడు.

భాస్కర్ తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య. ఇల్లు వదలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు.


ఇక జీవిత చిత్రాలు ధారావాహిక నాలుగవ భాగం చదవండి.


ఒకనాడు రాత్రి.. నాకు చిత్రమైన కల వచ్చింది.

మా అమ్మా, నాన్న, అక్కయ్య, తమ్ముడూ.. పెద్ద ప్రవాహంలో పడవలో విచార వదనాలతో ప్రయాణం చేస్తూ కనిపించారు.


అలల తాకిడికి వారున్న పడవ చిత్రంగా వూగుతూ వుంది. గాలీ, వాన, వారు చలికి గడగడ వణుకుతున్నారు. గాలి.. వారి పడవను తలక్రిందులు చేసింది. నలుగురూ నీట పడిపోయారు. మునిగిపోయారు.


ఈ దృశ్యాన్ని కలలో చూచిన నేను ఉలిక్కిపడి లేచాను. భయంతో నా శరీరం అంతా చెమట, బాధతో కళ్ళల్లో కన్నీరు.


లేచి వెళ్ళి ముఖం కడుక్కొని.. మంచినీళ్ళు త్రాగి పడుకొన్నాను. నిద్ర పట్టలేదు.


అమ్మా నాన్నలను చూడాలనే తపన మనస్సున నిండిపోయింది. అది దసరా శలవుల సమయం. గోవిందరాజు గారితో చెప్పి.. వూరికి వెళ్ళి అమ్మా నాన్న అక్క తమ్ముణ్ణి చూచి రావాలని నిర్ణయించుకొన్నాను. మనసంతా అల్లకల్లోలం. పదే పదే నావారు జ్ఞప్తికి రాసాగారు. ఆ రాత్రి.. ఆ కల తరువాత నేను నిద్రకు నోచుకోలేదు. మనస్సులో ఏదో భయం. బాధ.


మరుదినం.. ప్రక్క వూర్లో బంధువులు వున్నారని.. వెళ్ళి వారిని చూచి వస్తానని గోవిందరాజు గారికి.. శాంతమ్మా, కిరణ్‍లకు చెప్పి.. వారి అనుమతితో ఈవూరికి.. మన వూరికి వచ్చాను.


మా అమ్మా నాన్న అక్క తమ్ముడు వూరు వదిలి ఎటో వెళ్ళిపోయారని తెలిసింది. ఆ మాటలను విన్న నాకు దుఃఖం పొంగి వచ్చింది. ఒంటరిగా వూరి చివరన వున్న చింతచెట్టు క్రింద కూర్చొని ఏడ్చాను. వచ్చిన కల.. నిజం అయిందని ఎంతగానో బాధపడ్డాను. మది నిండా ఆవేదన. విశాఖకు తిరిగి వెళ్ళిపోయాను.


ఆ సమయంలో నిన్ను కలవాలనీ.. నీతో మాట్లాడాలని నాకు అనిపించలేదు.


"మీవారిని కలిశావా చిన్నా!" అడిగాడు గోవిందరాజు.


"వారు ఆ వూరిని విడిచి ఎటో వెళ్ళిపోయారట బాబాయ్!" విచారంగా చెప్పాను.


"బాధపడకు. దేవుడు నీకేం తక్కువ చేయలేదు. నేను.. మీ అమ్మ.. తమ్ముడు కిరణ్.. తోడుగా వున్నాంగా!" అనునయంగా చెప్పారు.


వారూ.. ఆ పిన్నిగారూ.. కిరణ్, నా యందు చూపే ఆదరాభిమానాలకు.. వాత్సల్యానికి.. నేను కొద్దిరోజుల్లోనే.. ఎంతో ఆనందంగా తిరిగేవాణ్ణి.


ఆ దంపతులు.. ఏనాడు నన్ను.. కిరణ్‍ను వ్యత్యాసంగా చూడలేదు. వారి దృష్టిలో నేను వారి పెద్ద బిడ్డను.


గోవిందరాజుల గారిని బాబాయ్‍ అని.. శాంతమ్మ గారిని పిన్నీ అని నేను పిలిచేవాణ్ణి.

పిన్నికి.. దైవభక్తి ఎక్కువ. తీరిక సమయాల్లో నన్ను కిరణ్‍ ను.. తన దగ్గర ఇరువైపులా కూర్చో పెట్టుకొని మాకు రామాయణ మహాభారతాలను అందలి పాత్రల ఔన్నత్యాన్ని.. సత్యం.. ధర్మం.. నీతి.. న్యాయం విలువలను గురించి.. వాటిని నమ్మి వర్తించే జీవన విధానాలను గురించి.. ఎంతో వివరంగా చెప్పేది. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద స్వామీజీ, శ్రీ షిర్డిసాయి సర్వేశ్వర.. శ్రీ రాఘవేంద్రస్వాముల వారి చరిత్రలను చెప్పి వారు.. వారి జీవిత కాలంలో మన హైందవ జాతికి ఈ దేశ వాసులకు చేసిన మహోన్నత సందేశాలను గురించి ఎంతో వివరంగా తెలియజేసేది.

ఆ తల్లి మూలంగా.. నేను కిరణ్ ఎన్నో అపూర్వ విషయాలను తెలుసుకొన్నాము. మా భావి జీవితంలో సాటి వారి పట్ల ఎలా సఖ్యత.. సౌభ్రాతృత్వంతో వర్తించాలనేది నేర్చుకున్నాము.

ఆమె అలా చెప్పేటప్పుడు.. మాకు ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి గుర్తుకు వచ్చేది.

"అమ్మా!.. నీవు మా పాలిటి జిజియాబాయివి" నవ్వుతూ నేను అనేవాణ్ణి.


"అవును చిన్నా!.. అమ్మ జిజియాబాయే!" ఆనందంగా చెప్పేవాడు కిరణ్.


చదువు.. ఆటలు.. అన్నీ అమ్మ నిర్దేశించిన సమయం ప్రకారం సాగించేవాళ్ళం.

క్లాసులో మా ఇరువురికీ మంచిపేరు. అధ్యాపకులు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూచేవారు. ఒకటి రెండు మార్కుల వ్యత్యాసంలో మేమిరువురం క్లాస్ ఫస్ట్ గా ప్రతి పరీక్షలో నిలిచేవాళ్ళం.

కాలగమనంలో మరో ఆరు సంవత్సరాలు ఎంతో ఆనందంగా ప్రశాంతంగా సాగిపోయాయి.


అప్పటికి.. నేను కిరణ్ ప్లస్ టు స్టేట్ ఫస్ట్.. సెకండ్ ర్యాంకుల్లో పాసైనాము.

ఎన్.ఎం.డి.సి బచేలీలో.. కొండపై నుంచి క్రింద వున్న క్రషర్ యూనిట్ వద్దకు ఐరన్ గడ్డలను ట్రాన్స్ పోర్ట్ చేసేటందుకు గాను.. టెండర్ పేపర్లలో పబ్లిష్ అయింది.


బచేలీ.. భద్రాచలం నుండి ఉత్తరం వైపు దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో వుంది. ఆ ప్రాంతం ఛత్తీస్‍ఘర్ రాష్ట్రంలో దక్షిణపు వైపున వుంది. కొండ ప్రాంతం. ఆ కొండలన్నీ ఐరన్‍తో కూడినవి.


ఆ ప్రాంతానికి విశాఖపట్నం నుంచి అరకులోయ మీదుగా ఒడిస్సా రాష్ట్రం గుండా కిరండోల్ వరకూ రైలు మార్గం ఉంది. కిరండోల్.. బచేలీల నుండి ఐరన్ ఓర్ ఆ రైలు మార్గం ద్వారానే విశాఖపట్నం ఓడరేవుకు, విశాఖ స్టీల్ ప్లాంటుకు రవాణా జరుగుతుంది.


అక్కడ ఉత్పత్తి అయ్యే ఓర్‍లో అరవై శాతం జపాన్‍కు ఎగుమతి. నలభై శాతం వైజాగ్ స్టీల్ ప్లాంట్‍లో వివిధ సైజుల ఇనుప కమ్ముల తయారీకి ఉపయోగపడుతూ ఉంది.


వైజాగ్ నుండి.. ఉదయం ఏడున్నర గంటలకు ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరి రాత్రి పదిన్నర ప్రాంతంలో కిరండోల్‍కు చేరుతుంది.


ఈ రైలు మార్గం.. సముద్ర నీటి మట్టం నుండి దాదాపు పద్దెనిమిది వందల అరవై అడుగుల ఎత్తున కొండ ప్రాంతాన సాగుతుంది. మన దేశంలో అతి ఎత్తైన రైలు మార్గం అదొక్కటే.

ఆ టెండర్.. గోవిందరాజుగారు.. లోయస్ట్ బిడ్డర్ అయిన కారణంగా లభించింది. ఆ టెండర్‍ను నేనే ఫిలప్ చేశాను.


పది కొత్త లారీలను కొని వాటిలో కండిషన్‍లో వున్న పదిని వాటితో కలిపి.. ఇరవై లారీలను బచేలీకి.. రెండు షిఫ్టుల్లో పనిచేసేదానికి ఒక్కొక్క లారీకి ఇద్దరు డ్రైవర్లను, క్లీనర్‍లను, మెకానిక్స్ నూ పంపడం జరిగింది.


అక్కడ ఒక ఆఫీస్.. నమ్మకస్తుడైన సూరి అనే ఇంజనీరింగ్‍ను మేనేజరుగా నియమించారు గోవిందరాజు గారు మా బాబాయ్.

ప్రథమంలో ప్రతివారం వెళ్ళి.. రెండురోజులు వుండి అక్కడి వారికి అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేసి, పని సవ్యంగా జరిగేలా చూచి వచ్చేవారు.

నేను.. కిరణ్‍ బాబాయి గారితో కలిసి వెళ్ళి.. ఆ ప్రాంతాన్నంతా చూచి మావారు చేసే పనిని, రెండు మూడుసార్లు వీక్షించి వచ్చాము.


సమర్ధుడైన సూరి పర్యవేక్షణలో.. జరిగే పనిని ఎన్.ఎం.డి.సీ ఆఫీసర్లు అభినందించేవారు. వారి మాటలను విని బాబాయ్ గారు ఎంతో సంతోషించేవారు.

ఏ పనిలోనైనా దిగిన తర్వాత సూరిలాగా ఏకాగ్రతతో విధి నిర్వహణలో వర్తించాలని.. మంచిపేరును సంపాదించాలని మా ఇరువురికీ బాబాయిగారు చెప్పేవారు.

నన్ను కిరణ్‍న్ను మా ఇష్టానుసారంగా బి.టెక్‍లో చేర్పించారు.


"కష్టపడి బాగా చదవండి. ఎప్పుడూ సాటివారిని ఆదరాభిమానాలతో చూస్తూ.. వారి అభిమానాన్ని సంపాదించాలి. పదిమంది చేత మంచివారని అనిపించుకొనే రీతిలో సర్వదా వర్తించండి. నా తదనంతరం.. ఈ బరువు బాధ్యతలన్నింటినీ మీరిరువురూ రామలక్ష్మణుల్లా కలిసి నిర్వర్తించాలి" ఎంతో అభిమానంగా చెప్పాడు బాబాయిగారు.


బి.టెక్ ఫస్టియర్ ముగిసింది. సెలవలు. వారికి వేరే పనులు వున్న కారణంగా.. మా ఇద్దరినీ బచేలికి వెళ్ళి రెండు రోజులు వుండి.. వారి అవసరాలను తీర్చి రమ్మనమని బాబాయిగారు చెప్పి మమ్మల్ని బచేలికి పంపారు.


మేమిరువురం.. బచేలికి చేరాము. సూరిగారితో అన్ని విషయాలు చర్చించాము. 


వారు.. "అంతా సవ్యంగా సాగుతూ ఉంది. ఎలాంటి సమస్యా లేదు. ఇక్కడ వున్న ఆఫీసర్స్ అందరూ.. చాలా మంచివాళ్ళు. ఎలాంటి సమస్యా లేదు. కష్టించి పనిచేసే వారిని వారు ఎంతగానో అభిమానిస్తారు. గౌరవిస్తారు. మన కంపెనీకి ఇక్కడ మంచిపేరు వుంది బాబూ!" అని చెప్పారు.


రెండు రోజుల తర్వాత నేను, కిరణ్, మా డ్రైవర్ భాషా.. విశాఖకు బయలుదేరాము.

ఆ ప్రాంతంలో నక్సల్స్ వుంటున్నారన్న మాటను.. మేము విని వున్నాము. మూడుసార్లు బాబాయితో కలిసి వచ్చి.. తిరిగి వెళ్ళిపోయాము.


ఆ రోజు పౌర్ణమి.. పండు వెన్నెల రేయి, సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాము.

భాషా డ్రైవ్ చేస్తున్నాడు. నేను కిరణ్ వెనుక సీట్లో కూర్చొని వారం రోజుల్లో తెరవబోయే కాలేజీ విషయాలను గురించి మాట్లాడుకొంటున్నాము.


సమయం రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం.. మా కారు దట్టమైన అరణ్య ప్రాంతంలో ముందుకు సాగుతూ వుంది.


కారుకు ఎదురుగా రెండు మోటార్ బైక్స్ నడిరోడ్లో ముందుకు వస్తూ ఉన్నాయి.

భాషా హారన్ కొట్టాడు. మోటార్ బైక్స్ నడిపేవారు.. ప్రక్కకు తప్పుకోలేదు. వారికి మాకు మధ్య దూరం దాదాపు నూట యాభై అడుగులు. భాషా స్పీడును తగ్గించి హారన్ కొట్టాడు. వారి చర్యలో మార్పులేదు.

భాషా కారును ఆపాడు. వారు మా కారును సమీపించి బైక్స్ కు స్టాండ్ వేసి మా కారును సమీపించారు.

వారు మూతికి నల్లగుడ్డలు కట్టుకొని వున్నారు. వారిలో ఒకడు మమ్మల్ని చూచి..

"కారు దిగండి" హిందీలో చెప్పాడు.


నాకు.. వారు ఎవరో అర్థం అయింది. కిరణ్ ముఖంలోకి చూచి ’దిగు’ అన్నట్లు సైగ చేశాను. ఇరువురం కారు దిగాము.

మరొకడు భాషాను సమీపించి హిందీలో..

"నీవూ కారు దిగరా!" అన్నాడు.


భయంతో మారు మాట్లాడకుండా భాషా కారు దిగాడు. వారు నలుగురు, దృఢకాయులు, నలభై సంవత్సరాల లోపు వయస్సులు.

"ఎక్కడ్నుంచి వస్తున్నారు?" మూడవ వ్యక్తి హిందీలోనే అడిగాడు.


"బచేలీ!" జవాబు చెప్పాను.


"అక్కడ మీకేం పని?" నాల్గవ వ్యక్తి హిందీలో ప్రశ్న.


నేను వారికి హిందీలోనే జవాబు చెప్పాను. హిందీ.. మన దేశ భాష కదా!..

"మాకు అక్కడ కాంట్రాక్టు పని" సౌమ్యంగా జవాబు చెప్పాను.


వారి ప్రశ్నలకు కిరణ్ ముఖంలో ఆవేశం. చేయి పట్టుకొని.. వాడి కళ్ళల్లోకి చూస్తూ..

"నే మాట్లాడుతాను" మెల్లగా చెప్పాను.


"కాంట్రాక్టు వ్యాల్యూ ఎంత?" మొదటివాడి ప్రశ్న.


"ఆ వివరం మాకు తెలియదు. మా బాబాయి గారికే తెలుసు" నా జవాబు.


"మీ బాబాయి గారు ఎక్కడ వున్నారు?" రెండవ వాడి ప్రశ్న.


"వైజాగ్‍లో!"


"వాడి పేరేంది?" మూడవ వాడి ప్రశ్న.


"ఏ.జి రాజు"


"మీ దగ్గర ఇప్పుడు డబ్బు ఎంత ఉంది?" నాల్గవ వ్యక్తి ప్రశ్న.


"కారుకు డీజిల్ కోసం.. ఐదు వేలు ఉంది."


"డబ్బును బయటికి తీయి!" మొదటి వాడి ఆర్డర్.


ప్యాంటు జేబు నుంచి ఐదువేలు బయటికి తీసి వారికి చూపించాను.

"వాడి దగ్గర ఏమీ లేదా!" రెండవ వాడి ప్రశ్న.


"నా దగ్గర ఏమీ లేదు" మా కిరణ్ జవాబు.


రెండవవాడు మా కిరణ్ జేబులను తనిఖీ చేశాడు.

"ఏం లేదురా!." తన తోటివాళ్ళకు చెప్పాడు.


మొదటివాడు నా చేతిలో వున్న ఐదువేలల్లో మూడు వేలు తీసుకొన్నాడు.

"ఆ రెండు వేలు చాలు మీకు డీజిల్‍కు" అన్నాడు.


"అది చాలదు" ఆవేశంగా అన్నాడు కిరణ్.


"రేయ్, నోర్ముయ్ మరో మాట మాట్లాడావో పొడిచి చంపి రోడ్డు ప్రక్కన పారేస్తాను" కోపంతో చెప్పాడు మొదటి వ్యక్తి.


"సార్!.. వాడు చిన్నవాడు. నా తమ్ముడు. వాడి మాటలను పట్టించుకోకండి" దీనంగా చెప్పాను.


"సరే!.. నేను చెప్పేది జాగ్రత్తగా విను."


"చెప్పండి సార్!"


"నీకు డ్రైవింగ్ తెలుసా!"


"తెలుసు"


"నీవు డ్రైవర్ సీట్లో కూర్చో"


"డ్రైవర్ వున్నాడుగా సార్!"


"వాడు.. వీడు నీతో రారు. నీవు మీ వూరికి వెళ్ళి ఇరవై లక్షలు తీసుకొని ఎల్లుండి ఇదే సమయానికి ఇక్కడికి ఒంటరిగా రావాలి. అంతవరకూ నీ తమ్ముడు.. డ్రైవర్ మా దగ్గరే వుంటారు. ఒకవేళ నీవు డబ్బుతో రాకపోతే.. ఇందాక చెప్పానే.. అదే, మా ఇద్దరినీ చంపి ఆ లోయలో పారేస్తాను" కర్కశంగా చెప్పాడు మొదటి వ్యక్తి.


కిరణ్.. భాషా.. భయంతో.. కన్నీటితో నా ముఖంలోకి దీనంగా చూచారు.


అంటే.. ఈ నక్సలైట్లు కిరణ్‍న్ని భాషాను కిడ్నాప్ చేసి మా దగ్గర నుంచి డబ్బులు గుంజాలనుకొన్నారన్నమాట అనుకొన్నాడు మనసున. ఇరువురి ముఖాల్లోకి చూచి ఏమీ మాట్లాడవద్దని కళ్ళతో సైగ చేశాను.


పెద్ద సమస్య.. సవాల్ చేస్తూ ముందుకు నిలబడి ఉంది. సహనంతో శాంతంగా ఎదుర్కోవాలే కాని..ఆవేశంతో నోరు జారితే.. చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బు విషయంలో మరో మాట చెప్పండి. అంత డబ్బును ఒక్కరోజులో సమకూర్చలేమని.. బ్రతిమాలి, వారిని ఒప్పించాలని నిర్ణయించుకొన్నాను. ధైర్యాన్ని కూడగట్టుకొని..

"సార్!.. నేనో మాట చెప్పనా!" దీనంగా అడిగాను.


"చెప్పు.." అన్నాడు మొదటి వ్యక్తి.


"అంత డబ్బు మా ఇంట్లో.. బ్యాంక్‍లో లేదు సార్!.. రెండు లక్షలైతే తేగలను. తప్పుగా అనుకోకండి. రెండు లక్షలకు ఒప్పుకోండి సార్!" కన్నీటితో దీనంగా అడిగాను.


"కుదరదు నీవు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఐదు లక్షలు తీసుకొనిరా. డబ్బును మాకివ్వు. నీ వాళ్లను తీసుకొని వెళ్ళిపో. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశావో.. ఇక్కడ వీరిద్దరినీ చంపేసి.. వైజాగ్ వచ్చి.. నిన్ను వెతికి పట్టుకొని చంపేస్తాం జాగ్రత్త" కటువుగా బెదిరించాడు.


"రెండు లక్షల్కు పైన ఎంత చిక్కినా తీసుకొని వస్తాను. ఐదు అనే ఆ అంకెను మీరు.. కొంచెం మార్చుకోవాలి సార్!" ప్రాధేయపూర్వకంగా చెప్పాను.


రెండవవాడు సిగరెట్ పాకెట్ తీసి మిగతా ముగ్గురికీ సిగరెట్లను అందించాడు. లైటర్‍తో నలుగురూ సిగరెట్లను వెలిగించుకొన్నారు.


గట్టిగా దమ్ములాగి.. పొగను వదిలి.. "సరే!.. నీవు మంచివాడిలా వున్నావ్!.. మూడు లక్షలు.. మూడు తీసుకొనిరా. కార్లో కూర్చో" అన్నాడు మొదటి వ్యక్తి.


"సార్!.. నా వాళ్ళను.."


"ఏమీ చేయము. మా అతిధుల్లా చూచుకొంటాం" నవ్వుతూ చెప్పాడు మొదటివ్యక్తి.


క్షణం తర్వాత..

"రేయ్!.. మీ ఇద్దరూ మోటార్ సైకిళ్ళు ఎక్కండి" తన వారిని చూచి.. "నీవు.. నీవు వీళ్ళను తీసుకొని వెళ్ళిపొండి. నేను.. తన ఎదుటి వాణ్ణి చూపించి..

"వీడి కార్లో వచ్చి.. అక్కడ దిగుతాం" అన్నాడు.


ఆ ఇరువురూ కిరణ్.. భాషా చేతులను పట్టుకొని మోటార్ బైక్స్‍ను సమీపించారు.

వారిరువురూ దీనంగా కన్నీటితో నా ముఖంలోకి చూస్తూ.. వారి వెంట నడిచారు.

మోటార్ బైక్స్ ను స్టార్ట్ చేశారు. భయంతో తప్పించుకొనే దానికి మార్గం లేక కిరణ్.. భాషా మోటార్ బైక్స్ పై కూర్చున్నారు. అవి ముందుకు.. అంటే వచ్చిన వైపుకు వెళ్ళిపోయాయి.


భయంతో.. వికలమైన మనస్సుతో, నేను కార్లో డ్రైవర్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాను.

మొదటి వ్యక్తి.. మరో వ్యక్తి వెనుక సీట్లో కూర్చున్నారు. తలుపు మూసి..

"పోనీ.." అన్నాడు మొదటి వ్యక్తి.


నేను కారును కదిలించాను. పదిహేను నిమిషాల తరువాత.. వారు కారును ఆపమన్నారు. నేను ఆపాను. కారు దిగి మొదటి వ్యక్తి.. "మాట మీద నిలబడు.. అది నీకు అన్నింటికీ మంచిది" చెప్పి వారు.. రోడ్డు ప్రక్కకు వెళ్ళిపోయారు. ముక్కలైన హృదయంతో కన్నీటితో నేను ముందుకు సాగాను.


=======================================================================

ఇంకా వుంది..

జీవిత చిత్రాలు - పార్ట్ 5 త్వరలో..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


 
 
 

Comments


bottom of page